Saturday, May 4, 2019

అబద్ధం, మోసం, కుతంత్రం - 2


- మొదటి భాగం4. - శ్రమ దోపిడి

                  శ్రమ దోపిడి గురించి మొదటిసారి కార్ల్ మార్క్స్ తన 'పెట్టుబడి ' గ్రంధంలో వివరించి చెప్పేవరకు అది రహస్యం గానే ఉండిపోయింది. దోపిడి అనేది వ్యవస్థ లో ఒక భాగం. దోపిడి లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ లేకుండా దోపిడి కూడా లేదు. శ్రమ దోపిడీ అనేది భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల లోని మోసపు విధానం. ఏవో కొన్ని దేశాలు మాత్రమే ధనిక దేశాలు కావటం, కొంత మంది మాత్రమే ధనవంతులు కావటం అనేది శ్రమ దోపిడీ వల్లనే జరుగుతుంది. దీనినే స్థూలంగా 'గొయ్యి లేకుండా గొప్పు లేదు.' అని చెప్పవచ్చు. ఎవరో ఒకరు నష్ట పోకుండా మరొకరికి లాభం ఎన్నటికీ రాదు. ఒక దేశం విలాసవంతంగా సుసంపన్నంగా ఉంది అంటే ఎక్కడో మరో దేశం ఆకలితో అల్లాడుతుందని అర్ధం. ఇది ఒక్కోసారి ప్రత్యక్షంగాను మరో సారి పరోక్షం గాను జరుగుతుంది.

                  అమెరికా అత్యంత ధనిక దేశంగా మనగలగటం కోసం ప్రపంచంలో మరెన్నో దేశాలని తన కుతంత్రాలతో దయనీయ స్థితికి దిగజార్చింది. తమ దేశంలోని బట్టల మిల్లులు, కోకోకోలా కంపెనీల కోసం ఆఫ్రికా దేశాలను బలవంతంగా పత్తి, చెరకు పంటలను పండించటానికే పరిమితం చేసి అక్కడి ఆహార పంటలను దెబ్బతీసి పేదరికంలోకి నెట్టివేసింది. అమెరికా ధనిక దేశం కావటానికి అక్కడ అమలు చేయబడుతున్న పెట్టుబడి దారీ విధానమే కారణం. పెట్టుబడిదారీ దేశాలు వినియోగ దారులు కలిగిన దేశాలను, శ్రమ చేయగలిగిన మానవ వనరులు కలిగిన దేశాలను తమలో తాము పంచుకుంటాయి. ప్రస్తుతం భారతదేశం కూడా అలా పంచుకోబడ్డ దేశాలలో ఒకటి.                  అయితే పెట్టుబడి దారునికి అంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది ? పెట్టుబడి దారుడు తన దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడి గా పెట్టి ఒక వస్తువుని ఉత్పత్తి చేసి దానిని మార్కెట్లో అమ్మి లాభాలు పొందుతాడు. మార్కెట్లో కంపెనీల మధ్య నెలకొన్న తీవ్రమయిన పోటీని దృష్టి లో పెట్టుకుంటే వినియోగదారుడు వస్తువుని దానికి సమానమయిన విలువగల డబ్బుని ఇచ్చి చౌకగా కొనటానికి మాత్రమే ఇష్ట పడతాడు. అంటే వినియోగదారుడి నుండి పెట్టుబడి దారునికి లాభం రాదు. మరి ఈ లాభం అతనికి ఎక్కడి నుండి వస్తుంది ? అతను తన దగ్గర పని చేసిన పనివాళ్ళకి ఇచ్చే జీతం లో కోత పెట్టటం ద్వారా మాత్రమే లాభం పొందుతాడు. అంటే విజయవంతమయిన ఏ వ్యాపారస్థుడూ తన పని వాళ్ళకి లేదా ఉద్యోగస్థులకీ ఎప్పటికీ వారి శ్రమకి తగిన పూర్తి ఫలితాన్ని చెల్లించడు. దీనినే మరోలా చెప్పుకోవాలంటే పెట్టుబడి దారుడు ఎక్కువ పని గంటలు పనిచేసే కార్మికులని ఎంత తక్కువ జీతానికి పనిలో పెట్టుకోగలిగితే అతని లాభాలు అంత పెరుగుతాయి.

                  పెట్టుబడిదారుడు తనకి వచ్చిన లాభాలని తిరిగి పెట్టుబడిగా పెట్టి మరిన్ని లాభాలని పొందుతాడు. ఇది ఒక చక్రం లాగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పెట్టుబడిదారుడు కొన్ని సంవత్సరాలలోనే మరింత డబ్బున్నవాడిగా తయారవుతాడు. అతనికి ఇదొక వ్యసనం అవుతుంది. శ్రామికుడు మాత్రం తన పరిమిత ఆదాయంలో ఖర్చులకి పోగా మిగిలిన కొంత మొత్తాన్ని భవిష్యత్ అత్యవసరాలకి పొదుపు చేసుకోవటంతో సంతృప్తిపడతాడు. అంటే వ్యాపారస్థుడి జీవితం డబ్బుతో మొదలయ్యి తిరిగి ఎక్కువ డబ్బు పొందటంతో ముగుస్తుంది. కానీ శ్రామికుడి జీవితం శ్రమతో మొదలయ్యి డబ్బు ఖర్చుపెట్టటంతో ముగుస్తుంది. అంటే ఎక్కువ కష్టపడే వారికి తక్కువ డబ్బులు. తక్కువ కష్ట పడే వారికి ఎక్కువ డబ్బులు. దీనినే మరోలా చెప్పుకోవాలంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వాడు ఎప్పుడూ తక్కువ కష్ట పడటానికే ఇష్టపడతాడు.                  ముందునుంచీ వ్యాపారాన్ని నమ్ముకున్న మార్వాడీ, వైశ్య కులాలు ధనిక వర్గాలుగానే ఉంటూ వచ్చాయి. వ్యవసాయం, వృత్తి పనులు, ఉద్యోగాలు మీద ఆధారపడే కులాలు మాత్రం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాయి. ఒక వర్గం ధనిక వర్గం కావాలంటే అది పెట్టుబడి దారీ వ్యవస్థలోకి ప్రవేశించాలి. అయితే అందరూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే మరి మోసే వాళ్ళు ఎవరు ? అందుకే వ్యాపార వర్గాలు మరియు కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది. ఈ పోటీని తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే ఇందులో విజయవంతం కాగలుగుతారు. ఈ పోటీ ధరలను అదుపులో ఉంచటం లో కూడా సహాయపడుతుంది.

                  పెట్టుబడి దారీ వ్యవస్థలో మొదటి తరం పెట్టుబడిదారులకి పెట్టుబడి డబ్బు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటి తరం పెట్టుబడి దారులు రాజ వంశాలు, భూస్వాముల కుటుంబాలకి చెందినవాళ్ళు లేదా అలాంటివాళ్ళ సంపదలని దోపిడీ చేసినవాళ్ళు అయి ఉండాలి. ఇదంతా ఒకప్పుడు ప్రజలని పన్నుల పేరుతోను, యుధ్ధాలలోను దోచుకున్నదే. పిరమిడ్లు, తాజ్ మహల్, చార్మినార్ లాంటి గొప్ప కట్టడాలు అన్నీ శ్రామికులను, ప్రజలను పీడించగా వచ్చిన డబ్బు తో కట్టినవే. యూరోపియన్ల పెట్టుబడి మూల ధనం కూడా వివిధ దేశాల సంపదను కుతంత్రంతో దోచుకోవటం ద్వారా సంపాదించినదే.

5. - దుష్ప్రచారం

                  సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన, చేస్తున్న, చేయబోతున్న కుతంత్రాలలో దుష్ప్రచారం ముఖ్యమయినది. చరిత్రలో దీనిని పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా ఉపయోగించినది హిట్లర్ మంత్రి మండలి లో ప్రచార వ్యవహారాల మంత్రిగా పనిచేసిన జోసెఫ్ గోబెల్స్. తన తప్పుడు ప్రచారపు వ్యూహాల ద్వారా హిట్లర్ చేసిన అన్ని ఆకృత్యాలను గొప్ప పనులుగా ప్రజల దృష్టిలో చిత్రీకరించగలిగాడు. 'ఒకే అబధ్ధాన్ని వెయ్యి సార్లు చెపితే అది నిజమవుతుంది.' అన్న ప్రసిధ్ధ సూక్తి ఇతనిదే. ఒక అబధ్ధాన్ని ఒకడు చెపితే అది అబధ్ధం అవుతుంది. అదే అబధ్ధాన్ని పది వేల మంది పది సంవత్సరాల పాటు చెపితే అది నమ్మకమవుతుంది. కొన్ని తరాలపాటు చెపితే మూఢ నమ్మకమవుతుంది. అందులో నిజం లేదని మనస్సాక్షికి తెలిసినా, ఏమాత్రం వ్యతిరేకించలేని బలహీనతకి మనిషి లోనవుతాడు. పిల్లి ఎదురయితే అపశకునం అనే మూఢ నమ్మకం ఇందుకు ఉదాహరణ. మనిషి జీవితం, నాగరికత కూడా ఇలాంటి అబధ్ధపు నమ్మకాల మీదే నిర్మించబడింది. కుల, మత పరంగా కరుడు గట్టిన ఆలోచనలు, సంఘంలో హోదా, మానవ సంబంధాలను మించి డబ్బుకి ఇచ్చే అతి విలువ లాంటివి కూడా మూఢనమ్మకాలకు ప్రతి రూపాలు. వీటి నుండి బయట పడటం మనిషికి దాదాపు అసాధ్యం. వంద మంది ఉన్న గుంపులో 98 మంది ఒక అబధ్ధాన్ని నిజమని బలంగా నమ్మితే, మిగిలిన ఇద్దరికీ అది అబధ్ధమని తెలిసినా కూడా ఆ 98 మందితో ఏకీభవించక తప్పదు. ఎందుకంటే అబధ్ధమయినా కూడా సామాజికంగా ఎక్కువమంది చేత అంగాకరించబడే విషయానికే ఎప్పుడూ పరిస్థితులు అనుకూలంగా మలచబడతాయి. ఎంతయినా మూఢ నమ్మకం కూడా ఒక బలమయిన నమ్మకమే.

                  ఈ విధమయిన తప్పుడు నమ్మకాలని,వార్తలని వ్యాప్తి చేసి ప్రజలు తమకి అనుకూలంగా ఆలోచించేలా చేయటం దుష్ప్రచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఒక అధ్యయనం ప్రకారం మనం ప్రతిరోజూ చూసే వార్తా పత్రికలు, టీవీ చానళ్ళు, సోషల్ మీడియా లోని వార్తలు 90 % అబధ్ధమే. దుష్ప్రచారం నిజాన్ని మాత్రమే కాదు. మనిషి ఆలోచనని కూడా చంపేస్తుంది. దుష్ప్రచారంలో ఆరి తేరిన వారు సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అయితే ఇది ప్రజల అమాయకత్వపు స్థాయి మీద ఆధారపడుతుంది. ప్రజలు ఎంత అజ్ఞానులు అయితే దుష్ప్రచారం అంతగా విజయవంత మవుతుంది. ఈ విధమయిన ప్రచారాన్ని అడ్డుకుని నిజాన్ని తెలియ చెప్పే వారు లేకపోతే ఇంకా విజృంభిస్తుంది. అందుకే ఒకసారి దుష్ప్రచారం ద్వారా పరిస్థితులని అనుకూలంగా మలుచుకున్న వాళ్ళు దాన్ని వ్యతిరేకించే వాళ్ళని నిర్మూలించటానికి ఎప్పుడూ వెనుకాడరు. దేశాలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి శతృదేశాల మీద దుష్ప్రచారం చెయ్యటం అనేది రాజనీతిలో ఒక భాగం. పరస్పర అవసరాల కోసము, మత కుల వర్గ పరంగాను విడిపోయిన ప్రస్తుత సమాజంలో సత్యం తెలుసుకోవటానికి ప్రయత్నించటం అంటే గడ్డి వాములో సూది కోసం వెతకటం లాంటిదే.

                  నిజానికి ఎక్కువ మందికి సొంతంగా ఆలోచించే ఓపిక, తీరిక ఉండదు. ఎవరయినా చెపితే గుడ్డిగా విని అనుసరించాలనే చూస్తారు. తప్పుడు ప్రచారాలు విజయవంతం కావటానికి ఇది కూడా ఒక కారణం. ఇవి ఒకరి నుంచి నలుగురికి, నలుగురి నుంచి పది మందికి, పది మంది నుంచి పాతిక మందికి పాతిక నుంచి వంద మందికి ఇలా చాలా వేగంగా పాకి పోతాయి. ఎంత పెద్ద అబధ్ధమయితే అంత త్వరగా వ్యాపిస్తుంది. ప్రజలని ఉద్వేగ పరిచేవి, వారికి ఏదో అపాయం కలుగుతుంది అనిపించేవి, హింసాత్మక మయినవి, అద్భుతం అనిపించేవీ త్వరగా వ్యాపిస్తాయి.ఉగ్రవాదం మతపరమయిన మూఢ దుష్ప్రచారపు ఫలితమే. దుష్ప్రచారం ద్వారా వ్యూహ కర్తలు త్రిశంకు లోకాన్ని సృష్టించగలరు. గుడ్డిగా వీటిని నమ్మే అజ్ఞానులు ఎక్కువగా ఉన్న సమాజం చివరికి మూర్ఖుల స్వర్గంగానే తయారవుతుంది. దుష్ప్రచారాలను నిజమని నమ్మటం వల్ల వాస్తవాలను అర్ధం చేసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని, చివరికి దుష్ఫలితాలు పొందే ప్రమాదం ఉంది.

                  ఒకరి దుష్ప్రచారాలని మరొకరు తిప్పికొట్టటం కోసం ప్రస్తుత రాజకీయాలలో ప్రతి పార్టీకి సొంత ప్రచార మాధ్యమాలు ఉండటం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒకరకంగా ఇది ప్రజలకి మంచిదే, దీని వల్ల తప్పుడు ప్రచారం అనేది ఏక పక్షం గా కాకుండా అన్ని పక్షాల మంచి చెడులు బయటికి వస్తాయి. అతిగా ప్రచారం చేయటం కూడా దుష్ప్రచారమే అవుతుంది. దీనిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో వ్యాపార సంస్థలు ముందుంటాయి. అవి పదే పదే చూపించే వాణిజ్య ప్రకటనలు మనుషులలో వస్తువ్యామోహాన్ని పెంచుతాయి. అనవసరమయిన సరుకులను కూడా కొని నిలువ చేసే తత్వాన్ని, వస్తువు యొక్క ఉపయోగంతో సంబంధం లేకుండా హోదా కోసం సరుకులను కొనే తత్వాన్ని నూరి పోస్తాయి. చాలా సార్లు వాణిజ్య ప్రకటనలలో చూపించే నాణ్యతకి, సరుకు యొక్క వాస్తవ నాణ్యతకీ సంబంధం ఉండదు. అవసరమయితే కంపెనీలు తమ బడ్జెట్ లో 40% వరకూ కేవలం మార్కెటింగ్ కోసమే ఖర్చుపెడతాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగం లో దుష్ప్రచారానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే సమయం లో దానిని తిప్పికొట్టటానికి కూడా సోషల్ మీడియానే మంచి ఉపకరణంగా పనికొస్తుంది.మొత్తంగా చూస్తే తప్పుడు ప్రచారం చెయ్యటానికి అనుసరించే కొన్ని పధ్ధతులు ఈ విధంగా ఉంటాయి.

• వాస్తవానికి పూర్తి విరుధ్ధంగా చెప్పటం.
• అనుకూలమయిన విషయాన్ని గురించి అధికంగా చెప్పి అననుకూలమయిన దానిని
  గురించి తక్కువగా చెప్పటం.
• ఒకరి విషయం లో జరిగిన దానిని మరొకరికి జరిగినట్టు చెప్పటం.
• ఒక చోట జరిగినది మరొక చోట జరిగినట్టు చెప్పటం.
• ఒక సమయం లో జరిగినది మరొక సమయంలో జరిగినట్టు చెప్పటం.
నమ్మే వరకూ పదే పదే ఒకే విషయాన్ని చెప్పటం.
• పూర్తిగా కట్టుకథలు సృష్టించటం.
• తప్పుడు ఉత్తరాలు, ఫోటోలు, వీడియోలు సృష్టించటం.
• తప్పుడు లెక్కలు చెప్పటం.
లేని ప్రాముఖ్యతను ఆపాదించటం.
• పరిస్థితులకి భయపడి నిజాలను బయటపెట్టకుండా తప్పుడు భావాలు ప్రకటించటం
  ద్వారా తప్పుడు ప్రచారానికి కారణం కావటం.
• నిజం చుట్టూ అబధ్ధాలు కల్పించటం.
• భయపడే విధంగా ప్రచారం చేసి నమ్మించటం.
• కుల, మత, జాతి పరమయిన భావోద్వేగాలను రెచ్చగొట్టటం.
చరిత్రను వక్రీకరించటం.
• ఒకేసారి కాకుండా పథకం ప్రకారం కొంచెం కొంచెంగా దుష్ప్రచారాన్ని కొనసాగించటం.

ఉద్దేశ్యపూర్వకంగా కానీ, సరదాకి కానీ బంధు మిత్రుల మధ్య, పనిచేసే చోట చెప్పుకునే చాడీలు, పుకార్లు కూడా దుష్ప్రచారాలు గానే భావించాలి.

(ఇంకా ఉంది...)

Saturday, December 22, 2018

అబద్ధం, మోసం, కుతంత్రం - 1


                 అబద్ధం, మోసం, కుతంత్రం మనిషి ఆలోచనలలో ఒక ముఖ్యమయిన భాగం. మోసం చేయటం అనేది మనుషులతో పాటు కొన్ని రకాల జంతువులు, మొక్కలలో కూడా ఉంది. పరిసరాలకి అనుగుణంగా రంగులు మార్చే ఊసరవెల్లి. చేపలని వేటాడటానికి కొంగ దొంగ జపం. కీటకాలని ఆకర్షించి, తర్వాత వాటిని తినే కొన్ని రకాల మొక్కలు మొదలయినవి ఇందుకు ఉదాహరణలు. అబధ్ధం చెప్పటం మాత్రం మాటలు నేర్చిన మనిషి మాత్రమే చేసేది. అయితే ఉద్దేశపూర్వకంగా మౌనం వహించటం, అవసరమయినప్పుడు నిజాన్ని దాచిపెట్టటం కూడా అబధ్ధాలుగానే పరిగణించాలి. అబధ్ధానికి మొదటి కారణం భయం. చిన్నపిల్లలు ఊహ తెలిశాక మొదటి అబధ్ధం భయంతోనే చెపుతారు. కానీ తర్వాత వయసు పెరిగే కొద్దీ పరిస్థితులను తమకి అనుకూలం గా మార్చుకోవటానికి వాటిని ఉపయోగిస్తారు. అంటే మానవ నాగరికతలో ఒక మనిషికి మరో మనిషి భయపడటం మొదలయినప్పుడు మొదటి అబధ్ధం పుట్టి ఉండాలి. మోసం చేయటం మిగిలిన జీవులకు జీవన్మరణ సమస్య అయితే మనుషులకి మాత్రం అది నిత్యావసరం. మనిషి పలురకాల కుతంత్రాలు ఉపయోగిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ వీటినే ప్రయోగిస్తూ ఉంటాడు కూడా. అయితే ఇందులో కొన్ని మాత్రం అతి ముఖ్యమయినవి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రపంచ చారిత్రక గతిని మార్చిన శక్తివంతమయిన ఉపకరణాలు.

                  మానవ నాగరికతని ఆటవిక యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని 3 భాగాలు గా విభజిస్తే దాదాపుగా అన్ని రకాల కుతంత్రాలు ఆధునిక యుగం లోనే రూపం ఏర్పరుచుకున్నాయి. ఒక్క ఆహార సంపాదన గురించిన తాపత్రయం తప్ప ఏ విధమయిన ఆస్థిపాస్థులు, కట్టుబాట్లు లేని ఆటవిక యుగం లో కుతంత్రాలు ఉండే అవకాశం లేదు. మాటలు నేర్చుకోవటానికే మనిషికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం కావలసి వచ్చింది. అప్పటివరకూ భావప్రకటనకి సైగలపనే ఆధారపడ్డాడు. సంపద, సొంత ఆస్థులు మొదలయిన తరువాత మధ్య యుగాలలో మాత్రం దోపిడీ, దౌర్జన్యం, బానిసత్వం ఎక్కువగా ఉండేవి. అయితే ఇవి బల ప్రయోగం ద్వారా చేసే ప్రత్యక్ష దాడులు మాత్రమే గానీ జిత్తులమారి వ్యూహాలు కాదు. అంటే ఈ భూమ్మీద మనిషి ఆవిర్భవించి 100 రోజులు అయ్యిందనుకుంటే 99 రోజుల వరకూ అమాయకంగా, నిజాయితీగానే జీవించాడు. నిజానికి నాగరికత అభివృధ్ధి చెందటానికీ, మోసపూరిత విధానాల సంఖ్య మరియు అవి అమలుపరచపడిన పరిధి విస్తరించటానికీ అనులోమ సంబంధం ఉంది. అంటే నాగరికత పెరిగే కొద్దీ మోసం, కుతంత్రం కూడా పెరుగుతూ వచ్చింది. ఇవి మనిషి ఆలోచనలతో పాటు పరిణతి చెందుతూ వచ్చాయి.

                  ప్రపంచంలో ని అన్ని చోట్లా మనిషి అభివృధ్ధి ఒకేసారి ఒకే దశలో ఎప్పుడూ లేదు. ఒక చోట నాగరిక సమాజం ఉంటే, మరొక చోట మధ్యస్థమయిన సమాజం, ఇంకో చోట ఆటవిక సమాజం ఉంటూ వచ్చాయి. తక్కువ సంఖ్య లో ఉన్న నాగరికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అనాగరికులను లోబరుచు కోవటానికి మోసపూరిత వ్యూహాలు ఉపయోగపడ్డాయి. ఇక్కడ నాగరికులు అంటే నగరాలలో నివసించేవారు అని మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ముందు దశలో ఉన్నవాళ్ళు అని కూడా అర్ధం చేసుకోవాలి. అయితే దీనివల్ల వీరు విలాస జీవితాన్ని అనుభవించగలిగారు కానీ స్వాభావిక మయిన ఆనందం మాత్రం కోల్పోవలసి వచ్చింది. ఎందుకంటే మరొకరి స్వేచ్చని హరించాలనుకొనే వాడు దాని కోసం ముందు తన స్వేచ్చని బలిపెట్టాలి. అందుకే మనిషి ఆనందానికి, నాగరికత అభివృధ్ధికి విలోమ సంబంధం ఉంది. అంటే నాగరికత పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతూ వచ్చింది.

                  మనిషి సామాజికంగా సాపేక్ష జీవి. ఇక్కడ ఎవరికీ నిజంగా సొంత బలం గానీ, వ్యక్తిత్వం గానీ ఉండదు. ఒకరి బలహీనతే మరొకరికి బలం అవుతుంది. అయితే మానవతావాద పరంగా చూస్తే బలవంతుడు బలహీనుడి వైపు నిలబడాలి. తెలివయిన వాడు అమాయకుడి వైపు నిలబడాలి. కానీ వాస్తవ చరిత్ర ఎక్కువగా ఇందుకు వ్యతిరేకంగానే ఉంటూ వచ్చింది. ఇప్పటివరకూ అవతరించిన అన్ని ప్రధానమయిన మతాలు చెప్పిన ముఖ్యమయిన విషయాలు మూడే మూడు. అవి, అబధ్ధం చెప్పకూడదు. మోసం చెయ్యకూడదు. మరొకరి సొమ్ముని ఆశించకూడదు అని. కాని విచిత్రంగా, మానవుడి చేత ఎక్కువగా ఉల్లంఘించబడుతున్న నియమాలు కూడా ఈ మూడే. ఒక అధ్యయనం ప్రకారం మనిషి సగటున రోజుకి 3 అబధ్ధాలు అవలీలగా చెపుతున్నాడు. ప్రస్తుతం మోసం చెయ్యటం లేదా మోసపోవటం అనేది ఒక వ్యవస్థీకృత దశకి చేరుకుంది. ఇది ఎంత సాధారణం గా తయారయిందంటే చాలా సందర్భాలలో మోసం జరుగుతున్న విషయం మోసం చేసే వాడికి కూడా తెలీదు. నిజానికి మోసం అనేది గడియారంలో నిమిషాల ముల్లు లాంటిది. నిమిషాల ముల్లు తిరుగుతున్నట్టు కనిపించదు కానీ తిరుగుతుంది. అలాగే మోసం కూడా జరుగుతున్నట్టు కనిపించదు గానీ జరుగుతుంది.

                  లౌకికంగా చూస్తే మనిషి అనివార్యంగా చేసే ఏ పని అయినా ఉత్తమ ఫలితం, మధ్యమ ఫలితం, అధమ ఫలితం అనే మూడు రకాలయిన ఫలితాలలో ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఒక పని వల్ల అందరికీ మంచి జరిగితే అది ఉత్తమమయినది గాను, అందరికీ చెడు జరిగితే అది అధమమయినది గాను, కొంత మందికి మంచి కొంత మందికి చెడు జరిగితే అది మధ్యమ మయినదిగాను అనుకుంటే కుటిల వ్యూహాల వల్ల వచ్చే ఫలితాలు కూడా ఈ మూడు రకాలలో ఏదో ఒక రకానికి చెందినవే అయి ఉంటాయి. అయితే 95 శాతం మధ్యమ ఫలితాన్ని ఇచ్చేవి మాత్రమే అయి ఉంటాయి. పూర్తిగా మంచి జరగటం లేదా పూర్తిగా చెడు జరగటం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుంది.

                  మోసపూరిత విధానాల గురించిన అవగాహన అనేది తెలిసిన వారికి బలమయితే తెలియని వారికి అదే బలహీనత అవుతుంది. ఒక వ్యూహం ప్రత్యర్ధికి తెలుసునని తెలిస్తే ఆ వ్యూహం అమలుపరచాలనుకునేవాడికి ఇంక అది పనికి రాకుండా పోతుంది. అలాగే ఈ విధానాల గురించి ఎంత ఎక్కువ మందికి అవగాహన కలిగితే వాటిని ప్రయోగించే అవకాశాలు అంతగా తగ్గిపోతాయి. వివిథ రకాల ముఖ్యమయిన కుతంత్రాల గురించి చారిత్రక ఆధారాలు, ఉదాహరణలతో సహా ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఆయుధాన్ని ఉపయోగించకుండా అనుకున్నది సాధించటానికి ఇవి ఇద్దరు మనుషుల మధ్య మొదలుకొని వర్గాలు, వ్యవస్థలు, దేశాల మధ్య అమలు చేయబడిన వ్యూహాలు. అవసరాన్ని బట్టి విడి విడి గా గానీ, ఒకటి విఫలమయినప్పుడు దాని స్థానంలో మరొకటి గానీ, ప్రణాళికాబధ్ధంగా వరుసలో ఒకదాని తర్వాత మరొకటి గానీ ఇవి ఉపయోగించబడతాయి.

1. - విభజన

                  'ఐకమత్యమే మహా బలం ' అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దీన్నే మరోలా చెప్పుకోవాలంటే ఒక వర్గం యొక్క అనైక్యతే ఆ వర్గం యొక్క బలహీనత. ఈ బలహీనతని తనకి అనుకూలం గా మలుచుకుని ఆ వర్గం మీద ఆధిపత్యం సంపాదించటం అనేది ప్రత్యర్ధి వ్యూహం లో ఒక భాగం. సరిగ్గా ఈ వ్యూహాన్ని ఉపయోగించుకునే యూరోపియన్లు ప్రపంచం లో 80 శాతం భూభాగాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకోగలిగారు. వర్గాల మధ్య ఐక్యతని చెడగొట్టటం లేదా విభజించటం అనేది దీనికి పునాది. దీనికి వారు అవలంబించిన విథానం చాలా తేలికయినది. అప్పటివరకూ ఉన్న ప్రశాంతతని భగ్నం చేయటం కోసం ఒక తెగకి ఆయుధాలు పంచి వారిని స్థానికంగా ఉన్న మరొక తెగ మీదికి ఉసిగొలిపేవారు. వారు విచ్చలవిడిగా తయారు చేసిన తుపాకులు ఇందుకు బాగా ఉపయోగపడ్డాయి. ఈ 'విభజించు పాలించు ' సిధ్ధాంతం ద్వారానే బ్రిటీషు వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగారు. మొఘలుల పతనం తర్వాత భారత దేశం లో ఏర్పడ్డ అనైక్యత బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వారికి కలిసొచ్చింది. అయితే ఈ సిధ్ధాంతం భారతీయులకి తెలియనిది, యూరోపియన్లు కొత్తగా కనిపెట్టినదీ ఏమీ కాదు. వారికన్నా 2000 సంవత్సరాల పూర్వమే చాణక్యుడు మౌర్య సామ్రజ్యాన్ని ఈ సిధ్ధాంత పునాదుల మీదే నిర్మించాడు. బ్రిటీషు వాళ్ళు తమ వ్యాపార అవసరాల కోసం ఈ సిథ్థాంతాన్ని ఉపయోగించుకుంటే, చాణక్యుడు మాత్రం అప్పటికి అసంఖ్యాకంగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలని ఒకే సామ్రాజ్యంగా తన ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఉపయోగించాడు. తెగల మధ్య ఏ విధంగా శతృత్వాన్ని, అసూయ ద్వేషాలను పెంచాలో, ఘర్షణలను సృష్టించాలో లాంటి భేధోపాయాలను చెప్పటానికి చాణక్యుడు అర్థ శాస్త్రంలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాడు. ఈ విభజన సిధ్ధాంతం మన దైనందిన జీవితం లో బంధు మిత్రుల మధ్య, కుటుంబం లోను, పనిచేసే ప్రదేశాలలోను కూడా విరివిగా నిత్యం ఉపయోగించబడుతుంది. అపార్ధాలు సృష్టించటం ద్వారా ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా చేసి ఒక గుంపు పై ఆధిపత్యం చెలాయించటం అనేది దీనికి సాధారణ రూపం. ప్రస్తుత ప్రజాస్వామ్య రాజకీయాలలో కూడా దీని విలువ అపారం. ఎక్కువ సంఖ్యలో ఉన్న దిగువ స్థాయి వర్గాల మధ్య ఐక్యత నెలకొనటం అంత సులువు కాదు. ఈ బలహీనతని ఆధారం చేసుకునే తక్కువ సంఖ్యలో ఉన్న ఉన్నత వర్గం, వారిని పాలించ గలుగుతుంది. దీనిని మరోలా చెప్పుకోవాలంటే 85% ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల వారు తమలో తాము ఐక్యతని సాధించేవరకూ పాలకులు కాలేరు. కాని వారి సంఖ్య దృష్ట్యా అందరూ ఒకేవిధమయిన ఆలోచనా విధానాన్ని కలిగి ఉండి ఒకే తాటి పై నిలవటం అనేది కష్టసాధ్యం. కాని తక్కువ సంఖ్యలో ఉన్న ఉన్నత వర్గం విషయంలో ఇది సాధ్యమే. అందుకే 15% వున్న ఉన్నత వర్గాలు మాత్రమే ఎప్పుడూ పాలకులుగా ఉంటారు.

2. - కలుపుకోవటం

                  ఏదయినా కారణం చేత లొంగదీసుకోవటం సాధ్యం కానప్పుడు, లేదా లొంగదీసుకోవటం కన్నా కలుపుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందనుకున్నపుడూ ఆ వర్గాన్ని ఒక స్థాయి వరకూ తమలో కలుపుకోవటం అనేది ఒక ముఖ్యమయిన వ్యూహం.పరిణామ దశలో ఒక మనిషి అవసరం మరో మనిషికి ఎంత ముఖ్యమో గుర్తించిన తరువాత ఈ విధానం అమలులోకి వచ్చింది. ముఖ్యం గా పారిశ్రామిక విప్లవం తర్వాత ఉత్పత్తి సాధనాలు, శ్రమ విలువ పెరిగి ఒకరిపై ఒకరు ఆధారపడటం పెరిగింది. అప్పటివరకూ ఉన్న బానిసత్వ విధానం స్థానం లో కలుపుకుని పోవటం అనేది ఎక్కువ లాభసాటిగా గుర్తించబడింది. అయితే ఈ కలుపుకోవటం అనేది సమాన స్థాయిలో కాకుండా తమ కింది వర్గం గా మాత్రమే ఆమోదించబడింది. అంటే అప్పటి వరకూ ఉన్న కట్టు బానిసలు తర్వాత ఎంతో కొంత స్వేచ్చ కలిగిన అర్ధ బానిసలుగాను, తర్వాత జీతం చెల్లించే కూలీలు, కార్మికులుగాను సమాజం లో ఒక స్థాయిని పొందగలిగారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న బానిసలను అదుపులో పెట్టటం, వారి తిరుగుబాట్లను ఎదుర్కోవటం కన్నా వారిని తమతో కలిసి బతకనివ్వటం అనేది ఎక్కువ లాభసాటి వ్యవహారం అనిపించిన తర్వాత ఇది సాధ్యపడింది.భారత దేశ చరిత్ర లో ఈ కలుపుకోవటం అనేది ఒక ముఖ్య పాత్ర వహించింది. నిజానికి మిగిలిన దేశాలతో పొల్చి చూస్తే భారత దేశం లో అణచివేత ధోరణితో కూడిన బానిసత్వం అనేది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉండేది. ముందు నుంచీ అణచివేత కన్నా కలుపుకోవటం మన దేశ చరిత్రలో ప్రధాన విషయం. ఇదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ గాను, తర్వాత కుల వ్యవస్థ గాను రూపాంతరం చెందింది. ఒక ప్రత్యేక ప్రయోజనంకోసం పెళ్ళిళ్ళ ద్వారా బంధుత్వాలు కలుపుకోవటం అనేది కూడా ఈ వ్యూహం లో భాగం. రాజరిక వ్యవస్థలో రాజులు ఈ విధమయిన ప్రయోజనాల కోసమే ఒకటికంటే ఎక్కువ వివాహాలు చేసుకునే వారు. ఒక వర్గం మొత్తాన్ని తమలో కలుపుకోవటానికి ఆ వర్గం యొక్క స్త్రీ దేవతలని తమ దేవుళ్ళకి ఇచ్చి వివాహం చేయటం అనే ప్రక్రియ కూడా మన దేశం లో సమర్ధవంతంగా ప్రయోగించబడింది. ఆర్య, ద్రావిడ దేవీ దేవతల పెళ్ళిళ్ళు ఇందుకు ఉదాహరణలు. ఈ కలుపుకోవటం ద్వారా ఏర్పడ్డ కులవ్యవస్థ ఇప్పటికీ భారత దేశాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేయగలిగిన బలీయమయిన అంశంగా తయారయ్యింది.

3. - సహకారం

                  ఒకరికొకరు సహకరించుకోవటం అనేది పైకి చూడటానికి జిత్తులమారి వ్యూహంగా కనిపించదు. కాని చరిత్రలో ఇది ఒక ప్రభావవంతమయిన పైకి కనిపించని కుతంత్రం. ఒకరికి ఒకరు సహకరించుకోవటం అనేది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆధునిక మానవుడు సామాజిక జీవి. ఒంటరిగా కన్నా గుంపులో మాత్రమే ఎక్కువ సమర్ధవంతంగా జీవించగలడు. మనిషి బలం గుంపులోనే ఉంటుంది. అంటే పరస్పర సహకారంలోనే ఉంది. ఏ విధమయిన ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కేవలం మతం, కులం, వర్గం అనే భావోద్వేగాల ఆధారంగా కూడా మనుషులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఇది జంతువులలో సాధ్యం కాదు. సాధ్యం అయినా దాని పరిధి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ గుణమే మిగిలిన జీవులతో పోలిస్తే మనిషిని మరింత బలవంతుడిగా చేసింది. అయితే ఈ గుణమే అంతర్గతం గా మనుషుల మధ్య ఒకరి పోటీ నుండి మరొకరు తట్టుకోవటానికి కూడా అవసరమవుతుంది. అంటే రెండు వ్యవస్థలు ఒకదానినొకటి సహాయం చేసుకుని బలపరుచుకోవటం అనేది మానవ సమాజం లో అంతర్గతంగా ఉండే విషయం. కొన్ని బయటి వ్యవస్థలతో వీటికి ఏర్పడే పోటీ దీనికి ముఖ్య కారణం. ఒకదానినొకటి సహాయం చేసుకోవటం ద్వారా ఆ రెండు వ్యవస్థలు మరింత గా వృధ్ధి చెందుతాయి. దీనిని మరోలా చెప్పాలంటే పోటీని తట్టుకుని రెండు వ్యవస్థలు మరింత వృధ్ధి చెందటం కోసం ఒకదానినొకటి బలపరుచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఉదాహరణ చెప్పాలంటే 'రాజకీయాలు' - 'ప్రచార మాధ్యమాలు', 'రాజకీయాలు' - 'మతం'. ఒక్కోసారి రెండు దేశాల మధ్య ఉండే సంబంధం కూడా ఇలాంటిదే అయి ఉంటుంది.అంటే ఈ రెండూ తమ అభివృధ్ధి కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. ఇది సహజమయిన మానవత్వ ప్రేరిత సాయం కాదు. రెండు వర్గాలు ఒకరికి ఒకరు సహకరించుకోవటం అనేది ఖచ్చితం గా మరొక వర్గాన్ని అణగదొక్కటానికే అయి ఉంటుంది. లేదా ఇరు పక్షాలు లాభపడే ఒక ఒప్పందం లో భాగం గా అయినా అయి ఉంటుంది. ఇది మానవ సంబంధాలు మొదలుకుని వ్యాపారం, రాజకీయాలు లాంటి అన్ని చోట్లా అమలుపరచబడే వ్యూహం. దీనినే క్విడ్ ప్రో కో అని కూడా అంటారు. కుటుంబ వ్యవస్థలోని పెళ్ళి ద్వారా ఏర్పడే భార్యా భర్తల సంబంధం కూడా ఇలాంటిదే. అందుకే ఆస్థి, ఉద్యోగం, కులం, మతం అనేవి పెళ్ళిలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సమాజం లోని అసమానతలకి, అసూయా ద్వేషాలకీ ఈ పక్షపాత పూరితమయిన పరస్పర సహకారమే కారణం. ఉదాహరణకి ఒకే కులం లోని ప్రజలు తమలో తాము మాత్రమే సహాయం చేసుకుని, అభివృధ్ధి చెంది, మిగిలిన కులాల వారిని అణగద్రొక్కుతారు. ఈ విధమయిన పరస్పర సహకారం పోను పోను పరస్పర ఆధారితం అవుతుంది. ఏదయినా కారణం చేత ఒక వ్యసస్థ కుప్పకూలితే దాని ఆధారిత వ్యవస్థకి కూడా అపాయం ఏర్పడుతుంది. ఇదే సూత్రం కుటుంబ వ్యవస్థకి కూడా వర్తిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిర్ణయాలతో పాటు అన్ని నిర్ణయాలను ఈ క్విడ్ ప్రొ కో ప్రభావితం చేస్తుంది.

- రెండవ భాగం

Friday, June 22, 2018

డబ్బు ఎందుకు ? - పరిచయం


                  డబ్బు అంటే ఏమిటి? అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చింది? ఎలా వచ్చింది? మనిషికి డబ్బుని సృష్టించవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవటం అంత అవసరమా ? అందరూ ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తారు. అందులో కొంత సొంత ఖర్చులకి ఉపయోగించుకుని మిగిలింది భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు, లేదా మరింత డబ్బు సంపాదించటనికి పెట్టుబడి గా ఉపయోగిస్తారు. ఇది డబ్బుకి సంబంచించి అందరికీ తెలిసిన ప్రాధమిక విషయం. కానీ ఇంతకు మించిన మార్మికమయిన విషయాలు డబ్బులో ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి డబ్బు గురించి తెలుసుకోవటం అంటే మానవ సమాజం గురించి తెలుసుకోవటమే. డబ్బుని సరిగ్గా అర్ధం చేసుకోవటం ద్వారా మానవ సమాజం లోని చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే డబ్బు అనేది సమాజం లో ఒక ముఖ్యమయిన అంతర్భాగం. డబ్బు అనేది సృష్టించబడిన తర్వాత అది మనుషులు మీద చూపించిన ప్రభావం తప్పకుండా పరిగణనలోకి తీసుకోదగినది. గణిత శాస్త్రం లోని రేఖా గణితం లో అన్నిటికీ మూలాధారం ఒక చిన్న చుక్క లేదా 'బిందువు'. కొన్ని బిందువులు కలిస్తేనే ఒక రేఖ, కొన్ని రేఖలు కలిస్తేనే చతురస్రం, దీర్ఘ చతురస్రం మరియు త్రిభుజం లాంటి అనేకం ఏర్పడతాయి. సమాజం లో డబ్బు కూడ ఈ బిందువు లాంటిదే. మానవ నాగరికత పురోగతిని పరిశీలిస్తే కుటుంబం, మతం, రాజ్యం లాంటి అన్నిటి పుట్టుకకి మూల కారణం డబ్బే. అయితే ఇక్కడ డబ్బు అంటే ప్రస్తుతం మనం చూస్తున్న నోట్లు, నాణేలు మాత్రమే కాదు. డబ్బు అంటే ఆస్థి, సంపద, సంపదని సృష్టించే వనరులు అని కూడా గుర్తుంచుకోవాలి.

                  ఆది మానవుడిగా ఉన్నప్పుడు మనిషి ఎక్కువగా కాయలు, పండ్లు, గింజలని ఆహారంగా ఉపయోగించేవాడు. సమయం అనుకూలిస్తే జంతువులను వేటాడేవాడు. తర్వాత వేటలో మెళకువలు సాధించి తన అవసరం కోసం ఆయుధాలని తయారుచేసుకుని ఉపయోగించుకున్నాడు. అలాగే చక్రాన్ని, లిపిని, తర్వాత ఆవిరి యంత్రాలు, కరెంటు లాంటి తన అవసరం తీర్చగల అనేక సాధనాలని కనిపెట్టి ఉపయోగించుకున్నాడు. మనిషి సృష్టించుకున్న వాటిలో డబ్బు కూడా సరిగ్గా ఇలాంటిదే. చక్రాన్ని బండి నడపటానికి, కరెంటుని బల్బుని వెలిగించటానికి ఉపయోగించుకున్నట్టే, డబ్బుని కూడా వస్తు మారకం కోసం ఉపయోగించుకోవటానికి మనిషి సృష్టించుకున్నాడు. కానీ వాటిలో దేనికీ లేని విలువ డబ్బు కి ఉంది. డబ్బుతో మనం అలాంటి సాధనాలను ఎన్నయినా కొనగలం. మన భారత దేశంలో అయితే డబ్బు ఇంచు మించు భగవంతుడితో సమానం. కింద పడ్డ డబ్బులని కళ్ళకద్దుకుని గానీ తీసుకోము.

                  అయితే డబ్బుకి నిజంగా అంత విలువ ఉందా ? ఇదంతా మనం డబ్బుకి, దానికి ఉన్న ఉపయోగపు విలువకన్నా ఎక్కువ విలువని ఊహించుకోవటం వల్ల జరిగిందా ? నిజంగా డబ్బు అంత శక్తివంతమయినది అయితే దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ? నిజానికి డబ్బుకి దానికి ఉన్న ఉపయోగపు విలువ తప్ప మరి ఏవిధమయిన విలువ లేదు. ఇది తెలుసుకోవటానికి ఒక చిన్న తర్కాన్ని ఉపయోగిస్తే చాలు. ఉదాహరణకి పైన "డబ్బు తో ఏ సాధనాలనయినా కొనగలం" అని చెప్పుకున్నాం. కానీ నిజానికి "ఏ సాధనాన్నయినా కొనటానికి మనం డబ్బు ని ఉపయోగిస్తున్నాం" అని చెప్పుకోవాలి. అంటే వస్తువులని కొనటానికి మనం డబ్బుని ఉపయోగిస్తున్నాం. అంటే వస్తువు కోసం డబ్బు కానీ డబ్బు కోసం వస్తువు కాదు. అంటే కొనటానికి లేదా అమ్మటానికి వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే డబ్బుకి విలువ. అలాంటి వస్తువులు అసలు లేకపోతే డబ్బుకి ఉండే విలువ సున్న. కానీ మనం మన ఆలోచనని దీనికి వ్యతిరేక దిశలో మాత్రమే పరిమితం చేసుకోవటం వల్ల, పూర్తి విరుధ్ధమయిన భావాన్ని కలిగి ఉంటాం.

                  ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఒక మనిషి ఎన్ని ఎక్కువ వస్తువులు లేదా సేవలు ఉపయోగించుకోవాలనుకుంటే అతనికి అంత ఎక్కువ డబ్బుతో అవసరం ఉంటుంది. ఎన్ని తక్కువ వస్తువులు లేదా సేవలు ఉపయోగించుకుంటే అంత తక్కువ డబ్బుతో అవసరం ఉంటుంది. ఏ విధమయిన వస్తువులు లేదా సేవలు అసలు ఉపయోగించుకోకపోతే అలాంటి మనిషికి జీవించటానికి ఒక్క ఆహారం విషయంలో తప్ప ఇంక డబ్బుతో అవసరం ఉండదు. నిజానికి ప్రపంచం లో కొన్ని వేల సంవత్సరాల పాటు డబ్బు అనేది ఉనికి లో లేదు. ఇప్పటికీ డబ్బుతోను, బయటి ప్రపంచం తోను సంబంధం లేకుండా ఉన్న అనేక ఆటవిక తెగలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ నాగరిక ప్రపంచం లో శాస్త్ర విజ్ఞానం తో పాటు మనుషులు ఉపయోగించుకునే వస్తువులు మరియు సేవల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. సరిగ్గా ఇక్కడే డబ్బుకి ఉన్న విలువ, శక్తి కూడా అధికం అయ్యాయి. అయితే ఇలా పుట్టుకొస్తున్న వస్తువులలో కొన్ని మాత్రమే మనిషికి అత్యవసరమయినవిగా తయారవుతాయి. అయితే మిగిలిన తక్కువ ప్రాధాన్యత ఉండే వస్తువులను కూడా ప్రజలచేత కొనిపించటం ఎలా ? సరిగ్గా ఇక్కడే వ్యాపార వర్గాలు తమ సర్వ శక్తులను ఉపయోగిస్తాయి. వాణిజ్య ప్రకటనలు అందులో ఒక ముఖ్యమయిన భాగం. ఒక వస్తువు యొక్క ప్రాముఖ్యతని అదే పనిగా ప్రజల మెదళ్ళలో చొప్పించటం వల్ల అది ఎక్కువ మంది ప్రజలకి ఒక అత్యవసరమయిన వస్తువుగా మారిపోతుంది. అంటే మనుషులు ఉపయోగించ వలసిన వస్తువుల సంఖ్య పెరుగుతుంది. అంటే పరోక్షంగా సమాజంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత, విలువ పెరుగుతుంది. కానీ ఇది పూర్తిగా ఒక ఊహా జనితమయిన, కృత్రిమమయిన విలువ. అన్ని దేశాల ప్రజలు అన్ని వస్తువులను కొనగల ఆర్ధిక స్తోమతని కలిగి ఉండక పోవచ్చు. అందుకే వ్యాపార వర్గాల దృష్టి ఎప్పుడూ ఎక్కువ జనాభా కలిగిన వర్ధమాన, ధనిక దేశాలపైన మాత్రమే ఉంటుంది. ఆఫ్రికా దేశాలలాంటి పేద దేశాలను వ్యాపార వర్గాలు అంతగా పట్టించుకోవు, కానీ వాటిని మరో రకం గా వాడుకుంటాయి. దేశాల మధ్య, ప్రజల మధ్య ఆర్ధిక అసమానతల మూలాల గురించి మనం మరో అధ్యాయంలో వివరంగా మాట్లాడుకుందాం.

                  డబ్బుకి ఉన్న ఈ రకమయిన కృత్రిమమయిన విలువని పెంచేది ఒక్క వస్తు వినిమయం మాత్రమే కాదు. కొన్ని సమాజ నియమాలు కూడా ఇందుకు కారణమవుతాయి. అందులో ఒకటి ఎక్కువ డబ్బు ఉన్నవారికి సమాజం ఎక్కువ గౌరవం ఇవ్వటం. పరువు ప్రతిష్ఠలను డబ్బుతో ముడి పెట్టటం. డబ్బు ఉన్న వారికే అధికారం ఇవ్వటం లేదా అధికారం కోసం డబ్బు కలిగి ఉండవలసిన అవసరం కలిగించే పరిస్థితులు సమాజం లో నెలకొని ఉండటం. జాగ్రత్తగా గమనిస్తే ఏవయినా రెండు వ్యవస్థలు ఒకదానినొకటి సహాయం చేసుకుని బలపరుచుకోవటం అనేది మానవ సమాజం లో అంతర్గతంగా ఉండే విషయం. కొన్ని బయటి వ్యవస్థలతో వీటికి ఏర్పడే పోటీ దీనికి ముఖ్య కారణం. ఒకదానినొకటి సహాయం చేసుకోవటం ద్వారా ఆ రెండు వ్యవస్థలు మరింత గా వృధ్ధి చెందుతాయి. దీనిని మరోలా చెప్పాలంటే పోటీని తట్టుకుని రెండు వ్యవస్థలు మరింత వృధ్ధి చెందటం కోసం ఒకదానినొకటి బలపరుచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఉదాహరణ చెప్పాలంటే 'రాజకీయాలు' మరియు 'ప్రచార మాధ్యమాలు'. ఒక్కోసారి రెండు దేశాల మధ్య ఉండే సంబంధం కూడా ఇలాంటిదే అయి ఉంటుంది. అంటే ఈ రెండూ తమ అభివృధ్ధి కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. సమాజంలో ఈ వ్యవస్థల మూలాలు ఎంతగా బలపడితే అంతగా నాటుకుపోతాయి. డబ్బు, అధికారం మధ్య ఉండే సంబంధం కూడా సరిగ్గా ఇలాంటిదే. అంటే డబ్బు ఉన్న వారికి అధికారం సంపాదించటం సులువు. అలాగే అధికారం ఉన్న వారికి డబ్బు సంపాదించటం సులువు. అందుకే ఎక్కువసార్లు ఈ రెండూ ఒకరి వద్దే ఉంటాయి. లేదా ఈ రెంటిలో ఏదో ఒకటి ఉన్నవాళ్ళు ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరింతగా వృధ్ధి చెందుతారు.(ఇంకా ఉంది)

Saturday, March 3, 2018

డబ్బు ఎందుకు ?


                 డబ్బు ఎందుకు? అని ఎవరినయినా ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం వారి వారి స్థాయిలను బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు తనకి ఇష్టమయిన బొమ్మలు, మిఠాయిలు కొనుక్కోవటానికి డబ్బులు కావాలి అంటాడు. ఒక పేద వాడు సుఖం గా బతకటానికి డబ్బు అవసరం అంటాడు. ఒక ధనికుడు అతనికి అప్పటికే అలవాటయిన విలాసవంతమయిన జీవితాన్ని కొనసాగించటానికి డబ్బులు ఆవశ్యకం అంటాడు. వస్తు వ్యామోహం ఉన్నవారికి అన్ని రకాల కొత్త కొత్త వస్తువులని కొని ఉపయోగించటం అలవాటు కాబట్టి దాని కోసం డబ్బు అవసరం. అన్నిటికీ మించి సమాజంలో గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు కూడా డబ్బు తోనే ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ నేపధ్యం లో అందరి జీవితాలు ఇది వరకు ఎన్నడూ లేనంతగా డబ్బుతో పెనవేసుకుపోయాయి. గ్రామాలు సహజం గానే డబ్బు తో తక్కువ అవసరం గల స్వయం పోషకాలుగా ఉంటాయి. నిత్య జీవనానికి అత్యవసరమయిన ఆహర ధాన్యాలు, కూరగాయలు అన్నీ తమ స్వంత భూముల్లోనే పండించుకోవటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇంటి దగ్గర పెంచుకునే పశువుల వల్ల పాలు, పెరుగు, మాంసాహారం లాంటి అవసరాలు కూడా సొంతంగానే తీరిపోతాయి. కానీ నగరాల్లో జేబులో డబ్బు లేకపోతే చిన్న పని కూడా ముందుకి కదిలే అవకాశం లేదు.

                  ఇంతగా మనిషి జీవితం లో భాగమయిపోయిన డబ్బు గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు అంటే అది సాహసంగానే కనిపిస్తుంది గానీ అదే నిజం. ఉదాహరణకి పైన డబ్బు ఎందుకు? అని వేసుకున్న ప్రశ్నకి వచ్చిన సమాధానాలలో ఒక్క చిన్న పిల్లవాడి సమాధానం తప్ప మిగిలినవన్నీ తప్పు సమాధానాలే. అది ఎలాగో తెలుసుకోవాలంటే ముందు మనం మానవ నాగరికతలో డబ్బుకి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకోవాలి. నిజానికి డబ్బు అనేది సంఘం లో మనుషుల గౌరవ మర్యాదలు పెంచటం కోసం సృష్టించబడలేదు. ఉన్న వాడు, లేనివాడు అన్న భేధాలని కల్పించటానికి గానీ, విచ్చలవిడిగా ఖర్చుపెట్టి నలుగురిలో గొప్ప తనాన్ని ప్రదర్శించటం కోసం గానీ డబ్బు కనిపెట్ట బడలేదు. కేవలం ధనవంతులయిన కారణం చేత ఎక్కువ విలువని, గౌరవ మర్యాదలని ఇవ్వటం అనేది కూడా ఒక మూఢ నమ్మకం లాంటిదే. నిజానికి ఈ విధమయిన ఆలోచనల వల్ల ఉన్న వాడు ఎలాగయినా మరింత ఉన్నవాడిగా అవ్వటానికి లేని వాడిని మరింత లేనివాడిగా తయారుచెయ్యటానికి ప్రయత్నిస్తాడు. కేవలం నాలుగు డబ్బులు ఎక్కవగా ఉండటం వల్ల తన పరపతి ఇంకా పెరుగుతుందంటే ఎవరయినా ఇలా చెయ్యటానికే ఇష్టపడతారు. 'రూపాయిని మనం పెంచితే రూపాయి మనలని పెంచుతుంది' అన్న సామెత ఇలాంటి భావాల నుంచి పుట్టిందే.

                  మానవ నాగరికత ప్రాధమిక దశలో ఉన్నప్పుడు అప్పటి అవసరాల కోసం లేదా ఒక మంచి కారణం కోసం సృష్టించబడ్డ ప్రతీదీ తర్వాత తర్వాత భ్రష్టు పట్టించ బడింది. మతం, విద్య, రాజకీయాలు లాంటివి ఇందుకు ఉదాహరణలు. డబ్బు కూడా ఇలాగే మనిషికి ఉపయోగపడే కారణం కోసం కనిపెట్టబడి చివరికి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వస్తువుగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే కేవలం నాలుగు డబ్బులకోసం అన్ని రకాలుగా దిగజారిపోయే స్థాయికి మనిషి డబ్బు విలువని పెంచాడు. నిజానికి డబ్బుకి కేవలం దాని మారకపు విలువ తప్ప మరే విలువా లేదు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో తమ అవసరానికి మించి ఎక్కువ డబ్బు కలిగి ఉండటం అనేది అవమానకరమయిన విషయంగా కూడా పరిగణిస్తారు. మన తో సహా చాలా చోట్ల పరిస్థితులు ఇందుకు విరుధ్ధం. మన దగ్గర నలుగురు మనుషులు కలిస్తే ఎక్కువగా మాట్లాడుకునేది 'ఎక్కువ డబ్బు సంపాదించటం ఎలా?' అని మాత్రమే గానీ 'డబ్బు ఎందుకు ?' అన్న ప్రశ్న ఊహ లోకి కూడా రాదు.

                  ఒక మనిషి తినడానికి ఆహారం దొరక్క చనిపోవటం వేరు, ఆహారం కొనటానికి డబ్బులు లేక ఆకలితో చనిపోవటం వేరు. వైద్యం దొరక్క చనిపోవటం వేరు, వైద్యం చేయించుకోవటానికి డబ్బులు లేక చనిపోవటం వేరు. ఇలాగే ఇంకా బోలెడన్ని చెప్పుకోవచ్చు. ఇదంతా మనిషి చరిత్రలో కేవలం డబ్బు మాత్రమే సృష్టించగలిగిన మారణహోమం. కేవలం చిల్లి గవ్వలతో మొదలయిన డబ్బు ప్రస్థానం చివరికి "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అని కార్ల్ మార్క్స్ అనేటంతగా తన విశ్వ రూపాన్ని పెంచుకుంది. అందుకే 18 వ శతాబ్దానికి చెందిన వేమన కూడా

కులము గల్గువారు, గోత్రంబు కలవారు
విద్య చేత విర్రవీగువారు
పసిడి గల్గువాని బానిస కొడుకులు

అన్నాడు. ఇక్కడ పసిడి లేదా బంగారం అనేది డబ్బు కి మరో రూపమే అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చారిత్రకం గా చూస్తే ఐశ్వర్యానికి మూల కారణమయిన లక్ష్మీ దేవి ప్రస్తావన క్రీస్తు పూర్వానికి చెందిన వేదాలలో మొట్ట మొదటిదయిన రుగ్వేదంలోనే ఉంది.

                  పుట్టి బుధ్ధెరిగిన దగ్గరనుంచీ నేను విన్న మాటలు గానీ గమనించిన సంఘటనలు గానీ ప్రత్యక్షం గానో పరోక్షంగానో ఎక్కువగా డబ్బు కి సంబంధించినవే అయి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. డబ్బు కి సంబంధించిన అన్ని విషయాల గురించీ వివరంగా రాయాలని మొదలు పెట్టాను గానీ చివరికి ఇది పరిశోధించి మరింత భాధ్యతతో రాయవలసిన ఒక పెద్ద పుస్తకంలా కనిపించింది. ముందు ముందు ఈ కింది అధ్యాయాల ద్వారా డబ్బుకి సంబంధించిన మరిన్ని వివరాల గురించి చర్చించుకుందాం.

1. పరిచయం
2. డబ్బు చరిత్ర
3. అర్ధ శాస్త్ర ప్రాధమిక సూత్రాలు
4. మానవుల పై డబ్బు ప్రభావం
5. డబ్బు యొక్క మిధ్యా విలువ
6. ఆర్ధిక అసమానతలకి మూలం
7. డబ్బు ఎలా సంపాదించాలి? ఎంత సంపాదించాలి?
8. డబ్బు యొక్క భవిష్యత్తు స్వరూపం
9. ముగింపు

Sunday, February 18, 2018

అనుభవం


నన్ను మోసం చేసిన వాడు
నా వెనకే ఉన్నాడు.
నేను మోసం చేయబోయేవాడు
నా పక్కనే ఉన్నాడు.

నేను సాయం చేసిన వాడి మొహం
ఇప్పుడు నాకు గుర్తు లేదు.
ఒకప్పుడు నాకు మంచి చేసిన వాడు
ఎక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలీదు.

నేను ప్రేమించిన సముద్రం
నన్ను తనలో కలుపుకోవటానికి
ముందుకొచ్చినప్పుడు
నేను భయపడి పారిపోయాను.

నన్ను ద్వేషించే మనిషితో
దెబ్బలాడి, దెబ్బలాడి
చివరికి నన్ను నేను కోల్పోయాను.

చీకట్లో దేన్నో గుద్దుకుని
పడిపోయినప్పుడు నా నెత్తి మీద
నక్షత్రాలు నవ్వుకోవటం తెలిసినా,
ఏమీ ఎరగనట్టు ముందుకెళ్ళిపోయాను.

అన్నీ అనుకోనివి జరుగుతున్నప్పుడు
కష్టపడి నన్ను నేను
తలకిందులుగా నిలబెట్టుకుంటాను.

నేను ఇదివరకటి మనిషిని
కాదన్న విషయం అప్పుడప్పుడూ
గుర్తుకొచ్చినా, పట్టించుకోవటం
ఎప్పుడో మానేశాను.

.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=16160)

Thursday, November 9, 2017

కుంటి కులాసం ఫిలాసఫీ


                 కుంటి కులాసానిది అసలు మా ఊరే కాదు. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ మనిషి మాత్రం చాలా విచిత్రంగా మాట్లాడేవాడు. అతని మాటలు ఎప్పుడూ కొత్తగానే ఉండేవి. అయినా కుంటి కులాసం ఊరికే అలా మాట్లాడటం లేదని, అతని ఆలోచనా విధానమే అలాంటిదని తర్వాత అర్ధమయ్యింది. వాళ్ళ ఊళ్ళో వానలు లేక దాళ్వా పంటకి కాలవలు వదలక పోతే, కొన్నాళ్ళు పని కోసం మా ఊరొచ్చాడు. 'కుంటి కులాసం' అన్న పేరు కూడా అందరూ పిలిచే పేరే గానీ అసలు పేరు మాత్రం అది కాదని చెప్పాడు. మనుషులందరూ ఒకేలాగ ఆలోచించరన్న విషయం నాకు కుంటి కులాసం తో స్నేహం చేశాకే తెలిసింది. మా ఊళ్ళో జనం కూడా "కుంటి కులాసం గాడు తలకి రోకలి చుట్టగలడు." అని చెప్పుకునే వాళ్ళు. పేరుకి తగ్గట్టు అంత కులాసాగా ఏమీ కనిపించేవాడు కాదు గానీ, కళ్ళు మాత్రం ఎప్పుడూ దేన్నో వెతుకుతున్నట్టుగా ఉండేవి. మనిషిని చూడగానే ఏ సంకోచం లేకుండా వీడితో అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉండేవాడు. అతని చుట్టూ ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. ఎంత గొప్ప పుణ్యాత్ముడికయినా చేసిన తప్పులు గుర్తుకొస్తాయేమో అన్నంత నిజాయితీ అతని కళ్ళల్లో కనిపించేది. 'కుంటి' అనేది కూడా పేరులోనే తప్ప మామూలుగానే నడిచేవాడు. మా ఊళ్ళో పెద్దిరాజు ని చిన్నప్పుడు పదో తరగతి దాకా క్లాసులో అందరికన్నా బాగా పొట్టిగా కనిపిస్తున్నాడని "పొట్టోడ"ని పిలవటం మొదలెట్టాక, ఆ తర్వాత ఇంటర్లో వాడు తాడి చెట్టంత పొడుగైపోయాడు. కొత్తగా మా ఊరొచ్చిన వాళ్ళకి విచిత్రంగా అనిపించవచ్చుగానీ, ఇప్పటికీ మా ఊళ్ళో వాడిని 'పొట్టోడు' అనే పిలుస్తారు. అచ్చం అలాగే 'కుంటి కులాసా'నికి కూడా ఇప్పుడు తనకి సంబంధం లేని పేరు స్థిరపడి పోయిందేమో అని నా అనుమానం. ఒకసారి మాత్రం జీతానికి సుబ్బరాజు గారి గేదెలని కొమ్మర పొలం తోలుకెళ్ళి మేపుతుండగా అప్పటివరకూ చేలో పిల్లిమిసర మేస్తున్న ఎర్ర గేది ఉన్నట్టుండి పోలీసోళ్ళ ఆకుమడి వైపు పరుగెత్తటం మొదలెట్టింది. అప్పుడు దాన్ని ఆపటానికి పరుగెట్టినప్పుడు మాత్రం, అడ్డదిడ్డంగా కుంటుకుంటూ పాము పాకినట్టు మెలికలు తిరుగుతూ పరుగెట్టాడు.

                  ఏదో పొట్ట కూటికోసం మా ఊరొచ్చాడు గానీ, కుంటి కులాసానికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం. ఎప్పుడయినా సంతకెళ్ళినప్పుడు గణపవరం బస్టాండు దగ్గర నించున్నప్పుడు వాళ్ళ ఊరి వైపు వెళ్ళే బస్సు కనిపిస్తే "ఈ బస్సు మా ఊరి వైపే వెళ్తుంది." అనేవాడు. ఒకసారి పుంత గట్టు మీద రేగు చెట్టు పైన వాలిన పిట్టల్ని చూపించి, "అచ్చం ఇలాంటి పిట్టలే మా ఇంటి దగ్గర సీమ చింత చెట్టు మీద కో కొల్లలు గా ఉండేవి. ఈ పిట్టలని చూస్తూ ఆడుకోవటం మా మార్క్స్ గాడికి చాలా ఇష్టం." అన్నాడు. కుంటి కులాసానికి ఒక కొడుకు ఉన్నాడని. వాడి పేరు మార్క్స్ అనీ, ఒక రోజు వాడి పుట్టిన రోజుకి వాళ్ళ అమ్మ "నీకు వీడి వయసు ఉన్నప్పుడు ఒక పసుపు చారల చొక్క ఉండేది. అది వేసుకుంటే నువ్వు చాలా ముద్దుగా ఉండేవాడివి. వీడికీ అలాంటి చొక్కానే తియ్యి" అంటే, వాళ్ళావిడ కొనమన్న ఎర్ర గళ్ళ చొక్కా కాకుండా వాళ్ళమ్మ చెప్పిన పసుపు చారల చొక్కా కొన్నాడని, వాళ్ళావిడకి కోపమొచ్చి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింద"ని చెప్పాడు. "చిన్న చిన్న విషయాలకి కూడా మనుషులు ఎందుకు ద్వేషం పెంచుకుంటారో తెలుసా ? చాలా సార్లు పైకి కనిపించే ఆ చిన్న చిన్న కారణాలు, అసలయిన కారణాలతో వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ రహస్యంగానే ఉండి పోతాయి." అని కూడా చెప్పాడు.

                  పెద్దగా ఏమీ చదువుకోలేదని చెపుతాడు గానీ, కుంటి కులాసం దగ్గర ప్రతిదానికీ కారణం వెతకటానికి ప్రయత్నిచటం అనే ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. మాట్లాడే ప్రతి మాటా ఏదో సిధ్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్టు ఉండేది. ఒక సారి మేమందరం పొలం లో ఆకు తీత పనిలో ఉండగా ఉన్నట్టుండి హొరున వర్షం, వణికించే చలి మొదలయ్యాయి. అందరం పోలీసోళ్ళ చెరువుగట్టు పైకి చేరుకుని చింత చెట్టు కింద వట్టి గడ్డి మంట వేసుకుని చలి కాసుకుంటుంటే చచ్చి పోయిన కొబ్బరి చెట్టు కమ్మలు కొట్టుకెళ్ళటానికొచ్చిన చాకలి తిప్పడు కూడా మంట దగ్గరికొచ్చి కూర్చుంటూ "శని గాడి వాన దరిద్రం లా పట్టుకుందిరా" అని వర్షాన్ని తిట్టుకుంటున్నాడు. అది విన్న నారాయుడు తాత "ఈ వానలు ఉంటేనే మనకి పంటలు పండేది,తిండి దొరికేది." అని మందలించాడు. తిప్పడు మాత్రం "ఏమో తాతా, పొద్దున్నే ఇంత చద్దన్నం తిని మట మట మని మండి పోయే ఎంత ఎండ లోనయిన పని చెయ్యొచ్చు గానీ, చిట పట మని నాలుగు చినుకులు పడితే మాత్రం మహా చిరాకు నాకు." అన్నాడు. "మీ తాత కూడా ఇలాగే వానకి పడి ఏడిసే వాడు. నీకు అన్నీ మీ తాత బుధ్ధులే వచ్చాయి." అన్నాడు నారాయుడు తాత. కుంటి కులాసం దృష్టిలో చాకలి తిప్పడు వర్షాన్ని తిట్టుకోవటం వెనక కారణం లేకపోలేదు. వాళ్ళ వృత్తి లో ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతికి ఆరేశాక ఎండ లేక బట్టలు ఆరక పోతే, అది వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళ జీవితాలు వర్షం తో కన్నా ఎండతో ఎక్కువ పెన వేసుకుని ఉన్నాయి. అందుకే ఎండని ఇష్టపడటం, వర్షాన్ని వ్యతిరేకించటం అనేది తెలియకుండానే చాకలి తిప్పడి నరాల్లో జీర్ణించుకుపోయింది. ఇదేమీ ఇప్పటికిప్పుడు కనిపెట్టిన కొత్త విషయం కాకపోవచ్చు గానీ, ఇంత చిన్న విషయాన్ని కూడా కుంటి కులాసం ప్రపంచం మొత్తానికి అన్వయించి చూసేవాడు. "ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది. ఒకరికి మేలు చేసేది మరొకరికి కీడు చేస్తుంది. మనుషుల మధ్య, దేశాల మధ్య ఘర్షణ కి ఈ వైరుధ్యమే మొదటి కారణం." అన్నాడు. అంతే కాకుండా "గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవటానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కరలేదు. నీ చుట్టూ ఉన్న మనుషులని, పరిస్థితులని లోతుగా అర్ధం చేసుకుంటే మొత్తం ప్రపంచమే అర్ధమవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో జరిగేదే మన ఊళ్ళోనూ జరుగుతుంది. మన ఊళ్ళో జరిగేదే మన రాష్ట్రం లో జరుగుతుంది. రాష్ట్రంలో జరిగేదే దేశం లో జరుగుతుంది. దేశం లో జరిగేదే ప్రపంచం మొత్తం జరుగుతుంది" అని చెప్పేవాడు.

                  కుంటి కులాసంతో పాటు ఎప్పుడూ ఒక కుక్క కూడా ఉండేది. నిజానికి ఆ కుక్క అతను మా ఊరు రావటానికి ముందు కొన్ని రోజులు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు అతనికి అలవాటయ్యింది. ఆ కుక్కకి ఒక కన్ను గుడ్డితో పాటు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేది. దాని ముందు కోమటి కొట్లో కొన్న రొట్టె ముక్కో, జంతిక ముక్కో వేస్తే విచిత్రం గా అది ఆ రొట్టె ముక్క కి వ్యతిరేక దిశలో వాసన చూసుకుంటూ వెళ్ళి చాలా సేపటికి గానీ ఆ రొట్టె ముక్క ని కనిపెట్టలేకపోయేది. "ఈ గుడ్డి కుక్కని ఇంకా నీతో ఉంచుకునే బదులు తరిమెయ్యొచ్చు కదా?" అన్నాను ఒకసారి. "ఈ కుక్క చాలా విషయాల్లో నాకన్నా గొప్పది." అన్నాడు. కుంటి కులాసం దృష్టిలో మనిషి కన్నా జంతువు గొప్పది. జంతువు కన్నా చెట్టు గొప్పది. "ఈ భూమ్మీద ఇంకా బాగు పడవలసిన అవసరం ఉన్న జీవి ఏదయినా ఉందంటే అది మనిషి మాత్రమే" అనేవాడు. ఒకసారి ఆ కుక్క కొన్ని రోజులపాటు ఎక్కడికో మాయమైపోయి మళ్ళీ తిరిగొచ్చింది. మళ్ళీ కుంటి కులాసాన్ని చూసిన ఆనందం తో తోక ఊపుకుంటూ ఆకలితొ ఉన్నానని చెప్పటానికి గుర్తుగా తల పైకెత్తి చూసింది. కుంటి కులాసం దాని ముందు కొంచెం అన్నం వేశాక, ఆబగా తినటం మొదలెట్టింది. సరిగ్గా అప్పుడే నేను గమనించిన విషయం దాని వెనక కాలు తొడ దగ్గర కండ మొత్తం ఊడిపోయి పాలిపోయిన లోపలి మాంసం విచిత్రమయిన ఆకృతులలో కనిపించటం. అది చూసి నా గుండె దడ దడ లాడింది. అయినా అదేమీ తనకి పట్టనట్టు అసలు ఆ కాలు తనది కానట్టు, ఆ కుక్క ఎప్పటిలాగానే ఉల్లాసంగా ఆనందంగా కనిపించటం నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. ఇదే మాట కుంటి కులాసం తో చెప్పాను. "ఈ కుక్క తనని తాను మర్చిపోయి ఈ ప్రకృతి లో మమేకమయినంతగా నువ్వూ నేనూ ఎప్పటికీ కాలేము. అదెప్పుడూ తనని తాను ఈ ప్రకృతిలో భాగమనే అనుకుంటుంది తప్ప వేరుగా ఊహించుకోదు. దాని ముఖం ఎలా ఉందో కూడా దానికి ఎప్పటికీ తెలీదు. మానవ నాగరికతలో మనిషి అద్దం లో ముఖం చూసుకోవటం మొదలుపెట్టిన రోజే ప్రకృతికి దూరం కావటం మొదలయింది." అన్నాడు.

                  ఒకసారి అబ్బులు గాడి పెళ్ళికి అన్నవరం వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న హోటల్ లో భోంచేస్తున్నాం. "ఇక్కడ భోజనం చాల బాగుంది" అన్నాను నేను. "ఈ వంట చేసిన వంట మనిషి చేతులు చాలా అసహ్యం గా ఉండి ఉండాలి, అందుకే వంట ఇంత బాగుంది." అన్నాడు. నిజంగానే ఆ తర్వాత, వంట చేసిన పెద్దావిడ బయటికొచ్చి, ఎన్నో ఏళ్ళుగా పొయ్యి దగ్గర ఇదే పని చెయ్యటం వల్ల నల్లటి మచ్చలు పడి బొటన వేళ్ళు వంకర పోయి ముడతలు పడ్డ చేతులు ఊపుకుంటూ "రామమ్మ గారి దొడ్లో కరివేపాకు చెట్టు రొబ్బలు నాలుగు విరుచుకు రా రా." అని ఎవరినో పురమాయించటం కనిపించింది. భోజనం అయ్యాక వెళ్ళబోతూ, పక్కనే ఉన్న పేపర్లో "వేసవి తాపానికి ఎండలో బొమ్మలు అమ్ముకునే వ్యక్తి మరణం" అన్న వార్త చదివి, "అయినా తెలిసి తెలిసీ అంత ఎండలో వాడిని బయటికి ఎవడు వెళ్ళమన్నాడు?" అన్నాను కోపంగా. "ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు." అన్నాడు.

                  ఆ రోజు కుంటికులాసం చాల సేపు చాలా విషయాలు మాట్లాడాడు. "ప్రపంచ జనాభాలో, పక్కవాడిని మోసం చేసే మనుషుల సంఖ్య కన్నా తమని తాము మోసం చేసుకునే మనుషుల సంఖ్య చాలా ఎక్కువ" అన్నాడు. అంతే గాక "ఈ వేలం వెర్రి మనుషులు డబ్బు కట్టల మధ్య చిక్కుకున్న చెద పురుగులు." అని కూడా అన్నాడు. ఎక్కువగా "మనుషులు" అన్న మాట కాకుండా దాని ముందు "వేలం వెర్రి" అనే విశేషణాన్ని చేర్చి "వేలం వెర్రి మనుషులు" అనే అనేవాడు. డబ్బు అంటే కుంటి కులాసానికి విపరీతమయిన అయిష్టత ఉండేది. "ఈ డబ్బు యావ లో పడి మనం కొత్తగా ఆలోచించటం మర్చిపోయామ" న్నది అతడి ధృఢమయిన అభిప్రాయం. "డబ్బుకి దానికి ఉన్న అసలు విలువతో పాటు, మరో 'మిధ్యా విలువ ' అనేది కూడా ఉందని కుంటి కులాసం సిధ్ధాంతం. "కావాలంటే చూడు. ముక్కూ మొహం తెలియక పోయినా నీకన్న ఎక్కువ డబ్బున్న వాడిని కలుసుకున్నప్పుడు నీ మొహం తప్పకుండా వెలిగిపోతుంది. డబ్బుకి ఉన్న 'మిధ్యా విలువ ' అంటే ఇదే. ఈ వేలం వెర్రి మనుషుల మీద డబ్బుకి ఉన్న ఆ అసలు విలువకన్నా ఈ మిధ్యా విలువ ప్రభావమే ఎక్కువ. ఇలాంటి మిధ్యా విలువలు ఈ ప్రపంచం లో ఇంకా చాలానే ఉన్నాయి." అన్నాడు. "ఎప్పుడూ ఒకేలా ఆలోచించటం మానేసి, నీకు తెలిసిన విషయాలను శీర్షాసనం కూడా వేయించు తమ్ముడు. ఎందుకంటే నీకు తెలిసిన నిజాన్ని తిరగేస్తే వచ్చేది కూడా మళ్ళీ నిజమే." అని చెప్పేవాడు.

                  ఇంకో నెల రోజులలో కుంటి కులాసం, వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడనగా, ఉన్నట్టుండి అతనితో ఉండే కుక్క, చొంగ కార్చుకుంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ పిచ్చి కుక్క ఊళ్ళో ఉంటే చాలా ప్రమాదమని అందరూ భయపడుతుంటే, కుంటి కులాసం ఊళ్ళో ఉండటం మానేసి కుక్కతో సహా, జనం సారాకి అలవాటు పడి కల్లు తాగటం మానేశాక వ్యాపారం లేక ఊరికే వదిలేసిన ఊరి చివరి కాలవ గట్టు మీద కల్లు కోటమ్మ గారి కల్లు పాకలో ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఒక రోజు అదే పాకలో చచ్చిపోయి కనిపించాడు. ఆ కుక్క కూడా మళ్ళీ ఎక్కడికో మాయమైపోయింది. నిజమో కాదో తెలీదు గానీ కుంటి కులాసం చచ్చిపోయిన రెండో రోజు మాత్రం పేపర్లో జిల్లా ఎడిషన్ లో 'పెంచుకుంటున్న పిచ్చి కుక్క కరిచి వ్యక్తి మరణం' అన్న వార్త వచ్చింది. అప్పుడే ఏలూరు నుంచి మా ఊరు చుట్టాల ఇంటికి వచ్చిన కోటేశ్వర్రావు, ప్రెసిడెంటు గారి ఇంటి దగ్గర అరుగు మీద పేపర్లో ఆ వార్త చదివి "అయినా తెలిసి తెలిసీ పిచ్చి కుక్కని ఎవడు పెంచుకోమన్నాడు?" అన్నాడు కోపంగా.

"ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు" అన్నాను వెంటనే.

Thursday, August 3, 2017

నేనునేను పుడుతూనే ఆకలికి ఏడుస్తున్నాననుకుంటారు గానీ
ఒక గుప్పెడు నిప్పు కణికలని
గొంతులో నింపుకునే వచ్చాను.

నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాననుకుంటారు గానీ
ఊపిరి గాలికి రెపరెపలాడే
థిక్కారపు దేహ పతాకాన్ని నేను.

నా అడుగులతో ఆకాశాన్ని కొలుస్తాను.
నా జ్ఞాన తృష్ణ కి
అనంత విశ్వాన్ని బలిస్తాను.

పశుత్వానికి దగ్గరగా పుట్టి
దైవత్వానికి దూరంగా విసిరివేయబడ్డ
మాంస ఖండాన్ని.

సిథ్థాంతాన్ని.
సిథ్థాంతాల రాథ్థాంతాన్ని.
రాథ్థాంతాల యుథ్థాన్ని.
యుథ్థానికి, యుథ్థానికి మధ్య
నెలకొన్న తాత్కాలిక శాంతి సౌహార్ద్రాన్ని.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14699)