Monday, August 12, 2013

ఆగస్టు పదిహేను, న్యూటన్ చక్రం,...

జంధ్యాల గారి సినిమా లో కామెడీ లాగా
బాల్యం ఎప్పుడు గుర్తు చేసుకున్నా కొత్తగానే ఉంటుంది.
నా చిన్నప్పుడు మా బళ్ళో రెండు చెక్క బీరువాలు ఉండేవి.
అందులో ఒకదాని మీద  "ప్రయోగ శాల" అనీ,
ఇంకో దాని మీద "గ్రంధాలయం" అనీ రాసి ఉండేది.
ఆ పేర్ల లోని గాంభీర్యం చూసి అందులో ఏముందో
తెలుసుకోవాలని మా పిల్లకాయలందరికీ తెగ ఉత్కంఠ.
నిజం చెప్పాలంటే అది మా సైన్సు మాస్టారు మాత్రమే
విప్పి చెప్పగలిగిన ఒక పెద్ద పొడుపు కథ.
ఆయనే ఒక అమావాస్య రోజున ఆ రెండు బీరువాలూ తెరిచి
వాటిల్లోంచి ఒక న్యూటన్ చక్రం, నాలుగు చందమామ పుస్తకాలు
బయటికి తీసి అందరికీ కనిపించేలాగ టేబులు మీద పెట్టి
న్యూటన్ చక్రం గిర్రుమని తిప్పి ఒక్క తెల్ల రంగులోనే
ఏడు రంగులూ ఎలా కలిసుంటాయో చూపించారు.
ఆ విచిత్రం చూసి మా వాళ్ళందరికీ చిటారు కొమ్మన
మిఠాయి పొట్లం చేతికొచ్చినంత ఆనందమయిపోయింది.
నాకు మాత్రం మనం కూడా ఇలాంటి చక్రమే ఏదో ఒకటి
కనిపెట్టెయ్యాలన్నంత ఆవేశమొచ్చేసింది.
ఆ రోజు మొదలయిన నా ప్రయత్నం ఆ తర్వాత
ముంజెకాయల బండి చక్రాలు మించి ముందుకెళ్ళలేదు.
అందుకే అప్పటి నుంచీ "అమావాస్య పూట ఏ పనీ
మొదలెట్టకూడద"ని చెప్పిన మా నాయనమ్మ మాట మీద
నమ్మకం ఎక్కువయ్యింది. కానీ ఇప్పటికీ నాకు మాత్రం
ఆ రెండు చెక్క బీరువాల ముందు మనకి తెలిసిన ఇస్రోలు,
సెంట్రల్ లైబ్రరీలూ కూడా దిగదుడుపే అనిపిస్తుంది.
ఇంకా,  ఆగస్టు పదిహేను రోజు చాక్లెట్లు తినేసి అటునుంచి అటే
"గ్యాంగ్ లీడర్" సినిమా చూసొచ్చి మనమే పెద్ద హీరో అయిపొయినట్టు.
దానికి తోడు ఆదివారం టీవీలో మాయ మంత్రాలు, కత్తి యుధ్ధాల
సినిమలొస్తే మన ఊహలకి రెక్కలొచ్చినట్టే.
పరీక్షల్లొ "ఇందీవరాక్షుని వృత్తాంతం" పాఠంలోని "అనినన్ గన్నులు జేవురింప..." పద్యం
మన దగ్గర కాపీ కొట్టిన నెల తక్కువ నారాయణ గాడు
ఆ తర్వాత ఐ ఐ టీ లో చదివి ఇప్పుడు పెద్ద పుడింగు.
చెప్పుకోవటానికి ఎంత గర్వంగా ఉంది.
దీపావళి కి రీలు తుపాకీ కోసం
మూడు రోజులు ముందునుంచీ, మూడు పూటలా ఏడుపే.
ఒక్కోసారి పెటేపుకాయ చెతిలోనే పేలిపోయేది.
మొట్ట మొదటిసారి చెట్టెక్కి గుత్తులు గుత్తులుగా
కోసుకుని తిన్న నేరేడుపళ్ళ రుచి ముందు
ఇప్పటి వాషింగ్టన్ యాపిల్స్ రుచి ఎంత.
మామిడి కాయలు దొంగతనం చేశామని ఊరంతా తెలిసిపోయి
పంచాయతీలో పెట్టి ఉరిశిక్ష వేసేస్తారేమో అని భయపడిపోయి
ఇల్లొదిలి పారిపోదామనుకుని, సాయంత్రం మళ్ళీ ఆకలేసి
ఇంటికెళ్ళిపోయినప్పుడు పడ్డ టెన్షను ముందు ఇప్పుడు మన బాసులు
ఇచ్చే డెడ్ లైన్ల టెన్షన్ ఒక లెక్కా.
ఎంత కఠిన హృదయుడయినా ఒక్కసారి
బాల్యం గుర్తు చేసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు.
"గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అన్నారు.
అదేం చిత్రమో, ఆ గత కాలం ఎప్పుడూ బాల్యం దగ్గరే ఆగిపోతుంది.
ఆ బాల్యం మన మనసు మీదికి ఎప్పుడు పాకినా, జిరాక్సు తీసిన జీవితానికి అలవాటుపడ్డ
మన ఖాళీ బుర్రల నిండా కొన్ని రంగుల నీడలు అలుముకుంటాయి.
అంతకన్నా ఏం కావాలి.
ఈ మాత్రం దానికి టైం మెషీన్ కనిపెట్టే వరకూ కూడా ఆగక్కర్లేదు.
ఒక్క సారి కళ్ళు మూసుకోండి చాలు.

Wednesday, August 7, 2013

తెలుగు పల్లకి

అమ్మపాలకి తోడ బుట్టువు, ఒక్క మాటలో తేనె బిందువు.
నోటి మాటకి అందమిచ్చిన రాజ భాష మన ఠీవి తెలుగు.
ఆరి పోనిది, అంతు లేనిది అమర భాష ఇది అమృతం.
ఊపిరుండిన, దేహముండిన తెలుగు మరచిన ఏమి సుఖం.

ఆది నన్నయ ఘంటము కదపగ, కృష్ణ రాయలు మురిసిన,
వేమన్న, పోతన్న శివమెత్తంగా, అన్నమయ్య పద కదము తొక్కగా,
కందుకూరి, గురజాడ, శ్రీరంగం శీనయ్య, తెలుగు పల్లకి మోయ బ్రౌనయ్య.
ఎంత మంది లేరు మునిగి తరియించగా ఇది తెలుగు గంగ.

ఆవకాయ ఘాటు, గోంగూరలో పులుపు,
పూర్ణాలలో తీపి, ఉలవ చారు ఊట తేట తెలుగు మాట.
అవధాన క్రతువులు, త్యాగరాయ క్రుతులు
మన భాష తనలోన కలిపేసుకోలేదా.
ఘన చరిత కలిగింది, రస భరితమయ్యింది.

జన భాష, మన భాష చక్కంగ పలకంగ
పలుకు పలుకుకు రాగ మాలికలు కాగ.
చిన్నోళ్ళు, పెద్దోళ్ళు  గర్వంగ గొంతెత్తి, చాటి చెప్పగ రండి.
యాస ఏదయిన, హొయలు పోవు భాష తెలుగు మాది.
తెలుగు వెలుగులున్న మాకు లేనిదేది, తెలుగు జాతి మాది, మాకు లేదు సాటి.