Monday, October 28, 2013

వడ్డీల బుజ్జిగాడు

             ఇప్పటికిప్పుడు మీలో ఎవరికయినా బస్సు దొరికితే పట్టుకుని వెళ్ళి మా ఊళ్ళో  దిగి,  "మంచినీళ్ళ చెరువు ఎక్కడ ?" అని అడిగితే ఎవరయినా చెపుతారు. చెరువుదగ్గరికెళ్ళాక మాలపల్లి రేవు కూడా దాటి ముందుకెళ్తే కుడి పక్కన బ్రాహ్మల అబ్బాయి గారి రేవు, ఎడం పక్కన వాళ్ళదే రేపో మాపో పడిపోవటానికి సిధ్ధంగా ఉన్న పాతకాలం నాటి పెద్ద మండువా లోగిలి పెంకుటిల్లూ కనిపిస్తాయి. అవి కూడా దాటుకుని వెళ్ళాక కొత్తగా కట్టిన పెద్ద డాబాలో ఉండే బుజ్జి గాడిని పొరపాటున పలకరిస్తే "హై హై నాయకా" సినిమాలో కోట శ్రీనివాసరావు లాగా బూతులు కలిపేసిన తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. ఇప్పుడంటే ఇలా ఉన్నాడు గానీ చిన్నప్పుడు వీడు చాలా బుధ్ధిమంతుడని ఊళ్ళో ఎవరినడిగినా అనుమానం లేకుండా చెపుతారు. చిన్నప్పుడు ఒకరోజు, పగిలిపోయిన పలక ముక్క పట్టుకుని నాతోపాటే ఒకటో తరగతిలో నా పక్కనే కూర్చుని "క్ష" గుణింతం దిద్దుతుండగా, ఖమ్మం దగ్గర అశ్వారావుపేట దగ్గర దొంగ సారా కాసేచోట కాపలా పనికి వెళ్ళి ఉండిపోయిన వాళ్ళ నాన్న, ఆ వచ్చిన డబ్బులు ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపకపోగా, అక్కడే ఎవరినో రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడని తెలిసి మనసులో బాధ పెట్టుకుని బుజ్జిగాడి వాళ్ళమ్మ కొమ్మర పొలం రాజుల చెరువులో దూకి చచ్చిపోయిందని వాడికి పెద్దమ్మ వరసయ్యే కాలవ కాడ సత్తెమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చి చెబితే, ఆ పలక ముక్క అక్కడే పడేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకెప్పుడూ బళ్ళోకి రాలేదు. ఇంకా వీడి చిన్నప్పటి విశేషాలు కూడా కావాలంటే, ఆ నీళ్ళ చెరువు రేవు దగ్గరే తొగర చెట్టుకి ఆనుకుని వున్న చుట్టు గుడిసెలో ఉండే సూరయ్య ని అడిగితే "బుజ్జి గాడి చిన్నతనం లో శ్రీరామనవమి, కప్పాలమ్మ జాతర లాంటి పండుగ రోజుల్లో గుడి దగ్గర బుల్లియ్య గారి మైకు సెట్టులోంచి వచ్చే పాటలన్నీ విన్నది విన్నట్టు గుర్తుంచుకుని, కృష్ణాష్టమి ఇంక నాలుగు రోజులుందనగా, పది మంది పిల్లల్ని కూడగట్టుకుని వేప కొమ్మల చిడతలతో తాళమేసుకుంటూ ఆ పాటలన్నీ పాడుకుంటూ ఇంటింటికీ తిరిగి డబ్బులు పోగు చేసి పెరుగు పిడతలో వేసి ఇస్తే తప్ప కృష్ణాష్టమి రోజు ఊరి జనమంతా ఉట్టి కొట్టేవారు కాద" ని చెపుతాడు.  

         మరి ఒకప్పుడు అంత నెమ్మదస్తుడూ, బుధ్ధిమంతుడు అయిన బుజ్జిగాడు ఇప్పుడు ఇంత కఠినం గా ఎలా మారిపోయాడా అని మీకు అనుమానమొచ్చిందా ? అయితే పైపులొదిలే రవణయ్యకి కాలు బెణికి నీళ్ళొదలటం ఆలస్యమయిపోయిందని, గబగబా బిందె పట్టుకుని ఆ రేవు దగ్గరకొచ్చిన బుజ్జి గాడి వాళ్ళ మేనత్తని ఇదే మాట అడిగి చూడండి. "చిన్నప్పుడంటే ఏదో మాట వరసకి అబధ్ధాలాడకూడదు, ఎప్పుడూ శాంతం గానే ఉండాలని చెపుతాం గానీ, పెద్దయ్యాక కూడా ఇవన్నీ పాటిస్తూ కూర్చుంటే ఈ రోజుల్లో బతగ్గలమా? అయినా మా వాడు చేసే వడ్డీ వ్యాపారానికి ఆ మాత్రం కరుగ్గా లేకపోతే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తారా ఎవరన్నా?" అని బుజ్జి గాడిని వెనకేసుకొచ్చి మాట్లాడి మరీ నీళ్ళ బిందె పట్టుకుని గబగబా వెళ్ళిపోతుంది. వాళ్ళమ్మ పోయిన కొన్నాళ్ళకి వానా కాలం రోజుల్లో ఒకసారి ఆకాశంలో బ్రహ్మ రాక్షసుడుకి ఆకలేసి అరుస్తున్నట్టు పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడుతుంటే, అందరికీ భయమేసి ఇళ్ళల్లోకెళ్ళిపోయి తలుపులేసేసుకున్నారు. బుజ్జిగాడు మాత్రం నాలుగు గేదెలూ, మూడు ఆవులు ఉన్న గనిరాజు గారి గేదుల పాక దగ్గర కానుగ చెట్టు కింద గాలి వానకి రాలిపోయిన కానుగు పూలు వాన నీటిలో కొట్టుకుపోతుంటే, వాటి మధ్యన నుంచుని ఎదురుగా ఉన్న పేడ గుట్ట వైపు అదే లోకం చూస్తూ ఎంతసేపటికీ అక్కడే ఉన్నాడు. ఈ చిత్రం చూసిన బుజ్జి గాడి మేనత్త ఖాళీ యూరియా సంచిని వాన కోటు లాగ నెత్తి మీద వేసుకుని వచ్చి వాడిని ఇంటి గుమ్మం అరుగు మీదకి లాక్కెళ్ళి పోతే "పేడ గుట్ట మీద పిడుగు పడితే ఆ పేడ గుట్ట అంతా బంగారం అయిపోతుందని మా అమ్మ చెప్పింద"ని చెప్పాడు. ఈ వయసులోనే వీడికి ఇంత డబ్బు యావ ఉంటే ఇంక పెద్ద వాడయితే ఏమవుతాడో అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. 

                 
                 బుజ్జిగాడి గురించి ఇంకా నన్ను కూడా అడిగితే ఎప్పుడో కొన్నేళ్ళ క్రితం మా ఇద్దరి మధ్యా జరిగిన చాలా సంఘటనలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. ఒక రోజు ఉన్నట్టుండి పెద్దబాలశిక్ష కొనుక్కుని నా దగ్గరకొచ్చి మళ్ళీ చదువుకుంటా చదువు చెప్పమన్నాడు. ఇప్పటికిప్పుడు ఈ బుధ్ధి ఎందుకు పుట్టిందా అన్ని అడిగితే "డబ్బు సంపాదించాలంటే చదువుండాలంట కదా" అన్నాడు అమాయకంగా. సరే అని ముందు లెక్కలు మొదలెడితే నాలుగు రోజులు బాగానే విన్నాడు కానీ తర్వాత ఒక రోజు తీసివేతలు చెప్పేటప్పుడు "చిన్న అంకెలోంచి పెద్ద అంకె తియ్యలేం కాబట్టి పక్కనున్న అంకె నుంచి అప్పు తెచ్చుకోవాలని" చెపితే "మనుషుల దగ్గరయితే అప్పు తెచ్చుకోవచ్చు గానీ అంకెల దగ్గర అప్పు ఎలా తెచ్చుకుంటామని" ఎదురు ప్రశ్నలు వేసి నోటి లెక్కలయితే వేసుకోవచ్చు గానీ ఈ తిరకాసు లెక్కల పాఠాలు చదవటం నా వల్ల కాదని ఆ పెద్దబాలశిక్ష కూడా అక్కడే పాడేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకెప్పుడూ రాలేదు కూడా. నేను అర్ధమయ్యేలా చెప్పే విధానం సరిగ్గా లేక వాడు అక్కడితో చదువు మానేసి వెళ్ళిపోయాడేమో అన్న భాధ నన్ను ఆ తర్వాత చాన్నాళ్ళు పీడించింది గానీ, అంతా మర్చిపోయిన కొన్నాళ్ళకి నా చదువు అయిపోయే నాటికి బుజ్జిగాడు కొబ్బరికాయల వ్యాపారం మొదలెట్టాడని తెలిసింది. అలా చిన్నగా మొదలయిన వ్యాపారం ఆ తర్వాత టోకున చుట్టు పక్కల రైతుల దగ్గర కొని పెద్ద పట్టణాలకీ, నగరాలకీ ఎగుమతి చేసే స్థాయికి చేరింది. మధ్యలో పనిలో పనిగా వడ్డీల వ్యాపారం కూడా మొదలెట్టి రోజు వారీ వడ్డీ, నెల వారీ వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ లాంటి అన్నిరకాల వడ్డీలకీ డబ్బులు తిప్పి, ఊళ్ళో అందరూ వడ్డీల బుజ్జిగాడని పిలిచే స్థాయికి ఎదిగిపోయాడు. చందమామ కధల్లో నర మాంసం రుచి మరిగిన ఒంటి కొమ్ము రాకాసి లాగా ఒక్కసారి డబ్బు సంపాదించటం అలవాటుపడ్డాక అక్కడితో ఆగాలనిపించదు కాబట్టి, బుజ్జిగాడు కూడా అక్కడితో ఆగకుండా తన వ్యాపారాన్ని చిన్న కార్లు కొని అద్దెకి తిప్పటం, జెనరేటర్లు కొని కరంటు పోయినప్పుడు గణపవరం లో ఉండే నటరాజు, మహాలక్ష్మి, కుమారి లాంటి సినిమా ధియేటర్లకి అద్దెకివ్వటం, చీటీలు కట్టించుకోవటంతో పాటు, గణపవరం కోటయ్యగారి కొట్టు సందులో ఎరువుల కొట్టు పెట్టటం దగ్గర నుంచి తణుకు, రాజమండ్రి ల్లో బట్టల కొట్టులు పెట్టటం వరకూ చెట్టు నుంచి రెండు కొబ్బరాకులు కొట్టుకొచ్చి కొబ్బారకుల చాప అల్లినంత సులువు గా వ్యాపారలన్నీ ఒకదానితో ఒకటి ముడి పెట్టి విస్తరించేశాడు. అంతే గాక ఇప్పటి వరకూ అన్నింటి లోనూ లాభమే తప్ప నష్టమంటే ఏమిటో కూడా తెలీకుండా మా ఊరి ధీరూభాయ్ అంబానీ అనిపించుకున్నాడు. 


           ఆ తర్వాత నేను హైదరాబాదు లో ఉద్యోగం లో చేరిపోయాక అప్పుడప్పుడూ ఎప్పుడయినా ఊరెళ్ళినప్పుడు, వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు, చదువు లేక పోయినా ఇన్ని వ్యాపారాలు ఎలా నెగ్గుకొస్తున్నాడా అని కుతూహలం కొద్దీ గుర్తు కోసం వాడు రాసుకున్న లెక్కల పుస్తకాలు తిరగేస్తే, అందులో ఒక్క ముక్క కూడా నాకు అర్ధం కాలేదు. వత్తులూ, దీర్ఘాలూ కూడా లేకుండా వాడికి తెలిసిన అక్షర జ్ఞానంతోనే అన్నీ రాసుకున్నాడు. అవన్నీ వాడికి తప్ప ఎన్ని డిగ్రీలు చదివిన ఎంత గొప్ప వాడికయినా ఒక్క ముక్క కూడా అర్ధం కావన్న మాట. ఆ తర్వాత ఇంకోసారయితే, మా ఊరి కుక్కల ప్రెసిడెంటు కొడుకు "చదువుకున్న వాడికన్నా చాకలోడు మేలని మన పెద్దలు ఊరికే అనలేదు ఇంత చదువు చదివి ఉన్న ఊరు కూడా వదిలేసి ఎక్కడో దూరంగా పోయి ముక్కీ మూలిగీ కష్టపడితే నీకు వచ్చే నెల జీతానికి నాలుగైదు రెట్లు మా బుజ్జి గాడు ఇక్కడే కాలు మీద కాలేసుకుని కూర్చుని సంపాదిస్తాడెహె" అన్నాడు. ఆ మాట నాకూ నిజమే అనిపించింది డబ్బు సంపాదన పరంగా నాకూ, నా చదువుకీ ఉన్న విలువ బుజ్జి గాడితో పోల్చుకుంటే చాల తక్కువ. బహుశా బుజ్జి గాడు కూడా నా గురించి ఇదే అనుకుంటూ ఉండొచ్చు. అందుకే అప్పటినుంచీ వాడికీ, నాకూ మధ్య ఏదొ తెలియని అగాధం ఏర్పడినట్టు అనిపించింది నాకు. అప్పటినుంచీ ఊరెళ్ళినప్పుడు వాడిని కలవటం కూడా బాగా తగ్గించేసి దాదాపు వాడిని మరిచిపోయే ప్రయత్నం చేసి మర్చిపోయాను కూడా. మధ్యలో ఒక సారి మాత్రం వాడికి కొడుకు పుట్టాడని తెలిసింది. 

          ఇంకా కొన్నేళ్ళకి గుండె ఆపరేషన్ చేయించుకుని చచ్చి బతికిన మా మేనత్తని చూడటానికి రెండు రోజులు శెలవు పెట్టుకుని ఊరొచ్చిన నాకు, పంచాయితీ ఆఫీసు దగ్గర బుజ్జి గాడు కనిపించి "సాయంత్రం ఓ సారి మా ఇంటికి రా రా" అన్నాడు. ఎందుకు పిలిచాడా అని అయిష్టం గానే వాడి ఇంటికెళ్ళాక కూర్చోభెట్టి "రేపు మా వాడిని బళ్ళో వేస్తున్నాం నాతో పాటు నువ్వు కూడా వచ్చి నీ చేతుల్తో మా వాడిని బళ్ళో చేర్పిస్తే నా లాగా కాకుండా నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుని బాగా చదువుకుంటాడని ఆశ" అన్నాడు వాడి మాట ధోరణి కి విరుధ్ధంగా ఎంతో సౌమ్యంగా. "అయినా మీ వాడికి పెద్ద చదువులెందుకు రా? నీకు ఉన్న వ్యాపారాలన్నీ చూసుకున్నా బోలెడు సంపాదించుకోవచ్చు" అన్నాను వెంటనే వెటకారంగా. "అప్పుడెప్పుడొ అమెరికా వాడు వదిలిన స్కైలాబ్ రాకెట్టు పేలి పోయి భూమ్మీద పడి భూమి అంతమైపోయి అందరూ చచ్చిపోతారని తెగ భయపడిపోయారని మా నాయనమ్మ చెప్పింది. నిజంగా అలాంటిదే ఇప్పుడు జరిగిందనుకుందాం, అప్పుడు నేనూ నా పిల్లలే మిగిలామనుకుందాం అప్పుడు నా వల్ల నా ముందు తరాలకి ఏ విధమయిన ఉపయోగం ఉండదు. చదువు లేక నాకు చదువుకి సంబంధించిన ఏ విధమయిన జ్ఞానం నాకు లేదు కాబట్టి నా పిల్లలకి చదువు నేర్పలేను. నా ముందు తరాలు మళ్ళీ చదువు అనేదాన్ని కనిపెట్టాలంటే ఎన్ని వేల సంవత్సరాలు కావాలంటావ్?  అదే, నా స్థానం లో నువ్వు బతికి ఉంటే చదువు అనే దాన్ని నీ ముందు తరాలకి అందించి మళ్ళీ కనిపెట్టాల్సిన అవసరమే ఉండదు. అయినా చదువుకీ డబ్బు సంపాదనకీ సంబంధమే లేదు నేను ఏం చదివి ఇంత సంపాదించాను. ఎప్పటికీ దాని విలువ దానిదే."  అన్నాడు. గుడ్డివాడు వెలుగు గురించి ఇంత అద్భుతం గా అర్ధం చేసుకుంటాడనుకోలేదు.

ఆ తర్వాత రోజు బుజ్జిగాడి కొడుకుని బళ్ళో చేర్పించి "చదువు డబ్బు సంపాదించటానికి మాత్రమే కాదు" అని నా మట్టి బుర్రకి నచ్చ చెప్పుకుంటూ మళ్ళీ హైదరాబాదు బస్సు ఎక్కేశాను.  బస్సు బయలుదేరింది గానీ నేను మాత్రం ఆ మాట దగ్గరే అగిపోయాను.  

Thursday, October 10, 2013

హైద (రా...) బాదు

పొట్ట కోస్తే అక్షరమ్ముక్క రాని చాకలోళ్ళ శీను గాడు
హైదరాబాదెళ్ళిపోయి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ
ఇస్త్రీ చొక్కా నలక్కుండా బతికేస్తున్నాడు.
భర్తకి జబ్బు చేసి అప్పులపాలయిపోయి ఉన్న అరెకరం అమ్మేసుకున్న కాంతమ్మత్త
హైదరాబాదెళ్ళిపోయి బిస్కట్ల ఫ్యాక్టరీలొ పని చేసుకుంటూ
పిల్లల్ని చదివించుకుంటూ మెల్లిగా ఏదోలాగ బతికేస్తుంది.
కిడ్నీలు పాడైపోయిన కొట్టు సత్యం హైదరాబాదెళ్ళి పోయి
ఆరోగ్యశ్రీ కింద నిమ్స్ లో నయం చేయించుకుని మనిషి మళ్ళీ మామూలయిపోయాడు.
రెండెకరాల చిన్న రైతు నారాయణ గాలి వానొచ్చి ఒక పంట
పోయినా పెద్దగా బాధపడకుండా హైదరాబాదు హైటెక్ సిటీ లో
కొడుకు సాఫ్టువేరు ఇంజినీరు కదా అన్న ధైర్యంతో అప్పుచేసయినా
మళ్ళీ పంటకి చేనుకి నీళ్ళెట్టుకుంటున్నాడు.
చదవలేక పదో తరగతిలోనే ఇంట్లోంచి పారి పోయి
హైదరాబాదు వాళ్ళ బావ దగ్గరికి వచ్చేసిన
సుబ్రమణ్యం తర్వాత ప్రింటింగు ప్రెస్ పెట్టుకుని
రాత్రీ పగలు కష్టపడి పైకొచ్చి ఇప్పుడు పదిమందికి పని చూపిస్తున్నాడు.
ఊళ్ళో పని లేక ఖాళీగా తిరుగుతున్న కుమ్మరోళ్ళ తాతారావుకి
హైదరాబాదు లో సినిమాల్లో కరంటు పని చేసుకునే వాళ్ళ దూరపు బంధువు ఫోను చేసి
నేను చూసుకుంటాలే వచ్చెయ్యమంటే రాత్రికి రాత్రి గౌతమి కి వెళ్ళిపోయాడు.
కంప్యూటర్లు బాగు చెయ్యటం నేర్చుకుని హైదరాబు వచ్చేసిన
వెంకట్ సొంతంగా హార్డువేరు బిజినెస్ పెట్టుకుని ఇప్పుడు
లక్షాధికారి అనిపించుకుంటున్నాడు.
ఒళ్ళు గుల్లవుతుందన్నా వినిపించుకోకుండా డిగ్రీ ఫెయిలయిపోయిన కోటి గాడు
హైదరాబాదెళ్ళిపోయి ఫార్మా కంపనీలో యాసిడ్ బక్కెట్లు మోసి
ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు.
తాపీ పని చేసుకునే తాడి కొండయ్య హైదరాబాదులో ఉద్యోగం
రావాలంటే ఇంగ్లీషు చదువులుండాలని ఫీజులు ఎక్కువయినా
పట్టించుకోకుండా కొడుకుని ఇంగ్లీషు మీడియం బళ్ళో చేర్పించేశాడు.
మొన్నటికి మొన్న కూకట్ పల్లి వెళ్ళే బస్సు నంబరు 226 లో
కాలు పెట్టటానికి కూడా చోటు లేకపోయినా జేబులోనుంచి ఫోను తీసి
"ఒరేయ్ హైదరాబాదు వచ్చెయ్ రా అంతా నేను చూసుకుంటా లేవెహే" అని
తమ్ముడికో, బావమరిదికో, స్నేహితుడికో భరోసా ఇచ్చేస్తున్నారెవరో.
మా వాడికి హైదరాబాదులో ఉద్యోగమొచ్చిందని గర్వం గా చెప్పుకుందామని చూసే తండ్రులూ.
మా అమ్మాయికి హైదరాబాదు సంబంధం దొరికితే నిశ్చింతగా ఉందామనుకునే తల్లులు.
వీళ్ళెవరూ పడ్డ కష్టాలెపుడూ పైకి చెప్పుకోలేదు.
కష్ట పడేవాడెపుడూ కష్టాలు చెప్పుకోడు .
ఇదంతా గతం నుంచి వర్తమానం వరకూ సాగిన ప్రయాణం.
కానీ ఇప్పుడు, భవిష్యత్తు గురించే భయమంతా.
అందుకే, ఈ గొడవంతా.