Wednesday, August 13, 2014

సాఫ్టువేరు...ఇంజనీరు...












                         "బుర్ర ఉపయోగించటం తెలియని వాడే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు." అని కనిపెట్టిన ఇంగ్లీష్ వాళ్ళు ఆ బుర్ర తోనే "విభజించు, పాలించు" తో, మూడు వందల ఏళ్ళు మనల్ని పరిపాలించేశాక, "తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడన్నట్టు" అంత కన్నా పెద్ద బుర్ర తో మన గాంధీ గారు "అహింస, సత్యాగ్రహం" అనే గాంధీగిరీ ఆయుధం తో వాళ్ళని వెళ్ళగొట్టి మనకి మహోపకారం చేశారు. భాష నుంచి ఫ్యాషన్ ల వరకూ మనది కానిది ఏదయినా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే పొరపాటు అలవాటు ఉన్న మనం, సహజంగానే వాళ్ళు వదిలేసి వెళ్ళిన "ఇంగ్లీషు" ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టేసుకున్నాం. పొరపాట్లు కూడా ఒక్కో సారి "అంతా మన మంచికే" అన్నట్టు మనకి మంచే చేస్తాయి. ఆ నాలుగు ఇంగ్లీషు ముక్కలు మనకి తెలియబట్టే కదా ఈ రోజు "సాఫ్టు వేరు" అనగానే ఇంగ్లీషు ని మనం బొద్దింకని చూసినట్టు చూసే, మనకన్నా రెండు మూడు రెట్లు పని రాక్షసుల్లాంటి చైనా, జపాన్ వాళ్ళని పక్కన పెట్టేసి ప్రపంచం మన వైపు చూస్తుంది. ఈ "సాఫ్టువేరు" వల్ల అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పలేం గానీ, ఒకప్పుడు ఎనభైల్లో ఆకలేసి కేకలేసిన "ఆకలి రాజ్యం" కమల్ హాసన్ లు చాలామంది ఇప్పుడు చదువు అయిపోగానే చాలా ఈజీ గా అమీర్ పేట లో అడుగుపెట్టి హైటెక్ సిటీ లో సెటిలై పోతున్నారు. దానికి తోడు చిలుకూరి బాలాజీ దయ కూడా ఉంటే వీసా తెచ్చుకుని విదేశాలూ వెళ్ళి పోవచ్చు. హైదరాబాదు లో మనకి తెలిసిన ఏ సెంటర్ లో నిలబడి నాలుగు రాళ్ళు విసిరినా అందులో మూడు సాఫ్టువేరు ఇంజినీర్లుకే తగులుతాయని కూడా ఘంటా పధం గా చెప్పవచ్చు.

               అయినా ఏ కొద్ది మందికో తప్ప "సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి" లాగా చాలా మంది సాఫ్టువేరు ఇంజినీర్లుకి మళ్ళీ బోలెడు కష్టాలు. పేరుకి శని, ఆది వారాలు వారానికి రెండు రోజులు శెలవులన్న మాటే గానీ, పద్మ వ్యూహంలో అభిమన్యుడి లాగా పొద్దున్నే ఆఫీసు లోపలికి వెళ్ళటం వరకే మన చేతుల్లో ఉంది గానీ ఎప్పుడు బయటకి వస్తామో ఆ దేవుడికే తెలియాలి. ఒక్కోసారి మనశ్శాంతి గా నిద్ర పోదామన్నా కూడా లేకుండా Object లు, For Loop లు, Outer Join లు కలలోకొచ్చి కూడా వేధిస్తాయి. ఎప్పుడయినా శుక్రవారం పూట ఆఫీసుకి వచ్చాక వారాంతం (తెలుగు లో "వీకెండ్") కదా అని హాయి గా పని పక్కన పెట్టి "Idlebrain" లో కొత్తగా రిలీజయిన సినిమా రివ్యూ చదువుకుంటూనో, ఆన్ లైన్ లో ఆధార్ కార్డు స్టేటస్ చూసుకుంటూనో, కరెంటు బిల్లు కట్టుకుంటూనో కూర్చుంటే, ఆ రోజు మన బాసు కి పాలు పోసే పాల వాడి గేదె తన్నిందని, వాళ్ళావిడ టీ లేటుగా ఇచ్చిందని కోపంగా ఆఫీసుకొచ్చి,  మన నిర్వాకం చూసి ఇంకా చిర్రెత్తుకొచ్చి,  చెప్పిన పని సాధ్యమయినంత తొందరగా (ASAP) పూర్తి చెయ్యమని ఆర్డరేసి వెళ్ళిపోతే, ఆ తర్వాత రోజు శనివారం, ఆది వారం కూడా చచ్చినట్టు కాళ్ళు ఈడ్చుకుంటూ ఆఫీసుకి రావాలి. (దీన్నే "కార్య కారణ సిధ్ధాంతం" అంటారు.ఒక్కోసారి మనం వీకెండ్ లో కూడా ఆఫీసుకు రావలసి ఉండటానికి కారణం మన బాసు గారికి పాలు పోసే పాలవాడి గేదె కూడా అయి ఉండవచ్చు.) ఇంకోసారి అయితే ఎంత కష్టపడ్డా ఏ Bug ఎందుకొచ్చిందో తెలీక "ఈగ" సినిమా లో సుదీప్ లాగా కొట్టుకుని చావాలి. మధ్య మధ్యలో "Obligations" వస్తే మన టీం లో వాళ్ళ తోనో, మన వ్యతిరేక వర్గం Testing Team వాళ్ళతోనో ప్రచ్చన్న యుధ్ధాలు (Cold Wars), ప్రత్యక్ష యుధ్ధాలు మామూలే. ఇలా మన గాబరా లో మనం ఉండగా,  అదే సమయానికి మన బంధువో, స్నేహితుడో ఫోన్ చేసి ఆన్ లైన్ లో అర్జెంటు గా వాళ్ళ అబ్బాయి పరీక్షల ఫలితాలు చూడమనో, సినిమా టికెట్ లు బుక్ చెయ్యమనో, రైలు టికెట్ లు బుక్ చెయ్యమనో ఆర్డరు వేస్తే కాదనలేం.

              అసలు ఈ "సాఫ్టువేరు" అంటేనే ఒక బ్రహ్మ పదార్ధం లాంటిది. ఎప్పుడయినా ఏ పండగో, పబ్బమో శుక్రవారమో, సోమవారమో వస్తే,  వారాంతం (మళ్ళీ తెలుగు లో "వీకెండ్") కలిసొస్తుంది కదా అని సీజన్ కాబట్టి చచ్చినట్టు రెట్టింపు డబ్బులు పెట్టి కష్ట పడి టికెట్ సంపాదించి ఊరెళితే, అక్కడ వార్తా పత్రిక పరిజ్ఞానం అపరిమితం గా ఉన్న ఏ సోడా కొట్టు సుబ్బయ్యో కనిపించి, "ఏరా అబ్బాయ్ నువ్వు చేసే ఈ సాఫ్టువేరు ఇంజినీరు ఉద్యోగం అంటే ఏమిటి?"  అని అడుగుతాడు. ఇదే ముక్క ఏ సివిల్ ఇంజినీరునో, ఎలిక్ట్రికల్ ఇంజినీరునో అడిగితే ఇళ్ళు కడతాననో, టీ.వి. లు బాగు చేస్తాననో చేప్పేసి వెళ్ళిపోవచ్చు గానీ, ఈ సాఫ్టువేరు కంపెనీలు ఇచ్చే Appraisal లాగానే ఉండీ ఉండనట్టుండే ఈ "సాఫ్టువేరు" గురించి అలాంటి వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పాలంటే మాత్రం,  మన తల ప్రాణం తోకకొస్తుంది. ఇంతా కష్ట పడి అంతా చెప్పిన తర్వాత "టీ.వి లాంటి కంప్యూటరు ముందు కూర్చుని, టైపు రైటర్ లాంటి కీబోర్డు మీద టిక్, టిక్ మని కొట్టటం కూడా పెద్ద పనేనా?" అనేసి వెళ్ళిపోతాడు. ఈ అవమానం తో మనం మళ్ళీ ఆఫీసుకొచ్చాక, ఖర్మ కాలి మన ప్రోజెక్ట్ మేనేజరు "క,చ,ట,త,ప" లని "గ,జ,డ,ద,బ" లు చేసి మాట్లాడే పక్కా మళయాళీ నో, తమిళియనో అయితే, మనకి తెలిసిన అంతంతమాత్రం ఇంగ్లీషు కి తోడు,  వాళ్ళు మాట్లాడింది పూర్తిగా అర్ధం కాక, మళ్ళీ అడిగితే ఏమంటాడో ఏమో ఎందుకొచ్చిందిలే,  అని చెప్పింది వినేసి,  తర్వాత మనకి అర్ధమయిన దాంట్లోంచి అర్ధం కాని దాన్ని కూడా Extract చేసుకుఇని Code రాసుకోవాలి.  ఇది నా విషయం లో ఇంకా ముందుకెళ్ళి, ఇదివరకు మా మళయాళీ TL నన్ను గోపి బదులు "గోబి", "గోబి" అని పిలిచీ, పిలిచీ తర్వాత ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరయినా నించున్నప్పుడు, ఎవరయినా గోబి మంచూరియా గురించి మాట్లాడుకుంటున్నా కూడా నన్నే పిలిచినట్టు ఫీలయిపోయి అటు తిరిగి చూసేసేవాడిని.

           మానవ మాత్రులం మనం ఎంత గింజుకున్నా వయసు దాని పని అది చేసుకెళ్ళిపోక మానదు. కానీ, సాఫ్టు వేరు ఇంజినీర్లకి మాత్రం ఇది కొంచెం ముందే మొదలయినట్టు బట్టతలలు, కళ్ళజోళ్ళు, మెడనొప్పులు, అల్సర్లు, బీ.పీ లు ఉద్యోగం తో పాటే మొదలయ్యి  జీతం తో పాటు పెరుగుతూ ఉంటాయి. ఎంత క్లిష్టమయిన Logic అయినా ఒక్క దమ్ము లాగి  (చట్టబధ్ధమయిన హెచ్చరిక : ధూమ పానం అరోగ్యానికి హానికరం.) రాసి పారేసే  కొంత మంది మహా మహా Code వీరులయితే వాళ్ళ జీవితాన్ని ఫణం గా పెట్టి మరీ Code రాస్తారు. అసలు ఈ సాఫ్టువేరు మొదలయ్యాక సాఫ్టువేరు ఇంజినీర్ల కన్నా ఎక్కువ లాభ పడింది, ట్యాక్స్ ఎగ్గొట్టటానికి ఇంటి రుణం (తెలుగు లో "హౌసింగ్ లోన్") తీసుకుని మనం కొనే ఇళ్ళ కోసం పొలాలన్నీ ప్లాట్లు చేసి అమ్మేసే రియల్ ఎస్టేట్ వాళ్ళతో పాటు,ఆర్ధోపెడిక్ లు, ఫిజియోథెరపిస్ట్ లు, బట్టతల త్గ్గటానికి మందులిస్తామని చెప్పే హోమియో కేర్ వాళ్ళే ఎక్కువని ఏ వార్తా పత్రికల వాళ్ళో, టీ.వీ వాళ్ళో సర్వే చేస్తే తెలిసిపోతుంది.ఆర్ధిక మాంద్యం పుణ్యమా అని, పెళ్ళి కుదిరిందని ఆఫీసులొ అందరికీ స్వీట్లు పంచిపెట్ట్టిన మన కొలీగు, ఆ తర్వాత వాళ్ళ కాబోయే మామ గారు ఈనాడు బిజినెస్ పేజీ లో "సాఫ్టువేరు మందగమనం", "ఇన్ఫోసిస్ షేర్ల పతనం" అన్న వార్తలు చూసి పెళ్ళి క్యాన్సిల్ అంటే,  ఏం చెప్పాలో తెలీక ఏడుపు మొహం తో ఆఫీసుకొస్తే మనమే వెళ్ళి ఓదార్చాలి.  

         అష్ట కష్టాలు పడి ఏ Pay కోసం అయితే మనం పనిచేస్తామో చివరికి  ఆ Pay Slip లో ఏమేమి "కటింగులు" ఉన్నాయో చూసుకోవటానికి కూడా సమయం ఉండదు. అన్ని కటింగులూ పోనూ చేతికొచ్చిన జీతం మన చేతి ఖర్చులకి కూడా సరిపోతుందో లేదో అని మనం కుస్తీలు పడుతూ ఉంటే,  సాఫ్టువేరు ఇంజినీరు అనగానే ఇల్లు అద్దెకి ఇచ్చేవాడి దగ్గర నుంచీ, Image Hospitals వాడి వరకూ అందరూ రెట్టింపు రేట్లు చెప్పి సాధ్యమయినంత ఎక్కువ డబ్బులు దండుకోవాలని చూస్తారు. ఈ సాఫ్టువేరు ఇండస్ట్రీ లో కూడా ఒక్కోసారి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలి. ఇంకోసారి తెలియక పోయినా తెలిసినట్టు ఫోజు కొట్టాలి. చిన్నప్పుడు అయిదో తరగతి లో "సత్యమేవ జయతే" పాఠం లోని ఆవు, పులి కథ బట్టీ పట్టి పాసై ఇంతవరకూ వచ్చిన నేరానికి అదే నోటితో, ఒక్కోసారి శెలవులు అడుక్కోవటానికి తప్పనిసరి అబధ్ధాలూ ఆడాలి. ఇవన్నీ గుర్తొచ్చి ఉద్యోగం మానేసి ఊళ్ళో ఉప్పు అమ్ముకుని అయినా ఉందామనుకున్నంత బీ.పి వచ్చేస్తుంది కానీ, బరువు, భాధ్యతలూ, తొందరపడి తీసుకున్న ఇంటి రుణం వాయిదాలు (తెలుగులో "ఈ అమ్మాయి" లేదా "EMI") గుర్తొచ్చి, మళ్ళీ పిల్లి లాగా వెళ్ళి మన డెస్క్ దగ్గర కూర్చుండిపోతాం. బయటినుంచి చూసే వాళ్ళకి ఇది గొప్పగా ఉంటుంది కానీ, పులి స్వారీ అని ఎక్కే వరకూ మనకీ తెలీదు.

          ఏదేమయినా  ఈ కంప్యూటర్ టెక్నాలజీ,  పంచుకోవటానికి Facebook ని, తిట్టుకోవటానికి Twitter ని (ముఖ్యంగా Tech Savvy రాజకీయనాయకులు కోసం), ఏం కావాలన్నా Google లో దొరుకుతుందిలే అన్న నమ్మకాన్నీ ఇచ్చింది. మానవ జీవితాన్నీ, నాగరికతనీ పలు దశల్లో పలు అంశాలు బాగా ప్రభావితం చేశాయి, మొట్ట మొదట నదులు, తర్వాత బలం, ఆ తర్వాత మతం, కానీ ఇక ముందు మన ముందు తరాలని ప్రభావితం చేయబోయేది మాత్రం మహోధ్రుతం గా వృధ్ధి చెందబోతున్న టెక్నాలజీ అనీ ఇప్పటికే చాలా మంది చెప్పేశారు. అలాంటి టెక్నాలజీలో మనమూ భాగస్వాములం అవగలుగుతున్నందుకు గర్వపడుతూ ఇంతా చేసి, ఏమీ తెలియనట్టు మన ముందు బుధ్ధిగా కూర్చున్న ఈ కంప్యూటర్ దేవతకి ఓ దండం పెట్టి ముందుకెళ్ళిపోదాం. లేకపోతే వెనకబడిపోతాం.

image courtesy : Google