Monday, December 22, 2014

విశ్వదర్శనం పాశ్చాత్య చింతన


















              త్వశాస్త్రానికి సంబంధించి నండూరి రామ్మోహన రావు గారు రాసిన రెండు పుస్తకాలు, ఒకటి ‘విశ్వదర్శనం పాశ్చాత్య చింతన’ ఇంకోటి ‘విశ్వదర్శనం భారతీయ చింతన’ వీటిలో మొదటిదయిన పాశ్చాత్య చింతన చదువుతున్నప్పుడు నేను చాలా చిత్రమయిన ఉద్వేగపూరిత అనుభూతికి లోనయ్యాను. దానికి ఒక కారణం నాకు తత్వశాస్త్రం మీద ఉన్న ఆసక్తి కాగా, రెండోది అంతకు ముందు నేను కొన్న Will Durant రాసిన The Story of Philosophy అన్న ఇంగ్లీషు పుస్తకం లోని కఠిన మయిన ఇంగ్లీషు పదాలు అర్థం చేసుకోవటంలో నేను ఎదుర్కొన్న కష్టం. తెలుగులో తత్వశాస్త్రానికి సంబంధించి ఇంత సులభ శైలిలో పుస్తకం దొరుకుతుందని నేను అసలు ఊహించ లేదు. ఇందులో క్రీస్తు పూర్వం కొన్ని వేల ఏళ్ళ క్రితం గ్రీకు లో ఊపిరి పోసుకున్న తత్వశాస్త్ర భావాల దగ్గర నుంచి నేటి కాలంలో ప్రసిధ్ధి చెందిన జీన్ పాల్ సార్త్ర వరకు ముఖ్యమయిన అందరి పాశ్చాత్య తత్వశాస్త్రజ్ఞుల సిద్ధాంతాల గురించి అరటిపండు వొలిచినట్టు వివరించబడింది. తత్వశాస్త్రమంటే అదేదో అనవసరమయిన వేదాంతమనో, కష్టమయిన విషయమనో అనుకునే వైఖరిని పటాపంచలు చెయ్యగల పుస్తకమిది. నిజానికి తత్వశాస్త్రం అనవసరమైంది కాదు, చాలా అవసరమయింది. మనం చిన్నప్పుడు లెక్కల్లోను, సైన్స్ లోనూ చదువుకున్న పైధాగరస్, లైబ్నిజ్, దె కార్త్ లాంటి వాళ్ళందరూ ముందు తత్వవేత్తలే. అసలు తాత్వికుల సత్యాన్వేషణలో భాగంగా పుట్టిందే నేటి విజ్ఞానం. .
.
.
.
.
.
'నాకు ఈ ఏడాది నచ్చిన పుస్తకం ' శీర్షికలో కినిగె పత్రిక లో వచ్చిన వ్యాసంలో, పూర్తిగా ఇక్కడ : http://patrika.kinige.com/?p=4518

Monday, December 8, 2014

అనంతం













('కినిగె పత్రిక' లో ప్రచురణ :http://patrika.kinige.com/?p=4342)

“ఇప్పటివరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది.
ఇప్పటివరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది.
ఈ భూమ్మీద కొత్తదంటూ ఏమీ లేదు.”

    పొద్దున్నే నిద్ర లేవగానే రాత్రి తల కింద పెట్టుకుని పడుకున్న ఒక తత్త్వశాస్త్ర పుస్తకం అట్ట వెనక ఉన్న ఈ వాక్యాలు నన్ను వెక్కిరిస్తున్నాయి. దానికి కారణం ఈ వాక్యాలు నాకు ఇప్పటివరకూ పూర్తిగా అర్థం కాకపోవటం. చరిత్రలోనూ, మానవ నాగరికతలోనూ ఎన్ని కొత్త సంఘటనలు, ఎన్ని కొత్త ఆవిష్కరణలు. రోజురోజుకీ మారిపోతున్న ఈ ఆధునికయుగంలో అయితే మారకుండా ఉన్నది ఏదీ లేదు. నా ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఈ రోజు వరకూ నేను ఎంత వైవిధ్యం చూళ్ళేదు. మార్పు లేకపోతే కాలమే ఆగిపోవాలి. అందుకే ఆ వాక్యాలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అలాగని వాటిని విస్మరించనూ లేను. దాని వెనక ఉన్న భావం అర్థమయ్యేవరకూ నాకూ శాంతి లేదు. అసలు ఆ వాక్యాలే కాదు ఆ పుస్తకమే నాకు ఒక పట్టాన అర్థం కాదు. నా తెలివికి పరీక్ష పెడుతోంది. నన్ను నిద్రపోనివ్వదు. అనుభవం లోకి రానిదేదీ అర్థం కాదని తెలుసు. ఈ పుస్తకం అర్థం కావాలంటే ఎలాంటి అనుభవం నాకెదురవ్వాలి? ఏమో తెలీదు. దానికోసమే నేనూ ప్రతి రోజూ ఎదురు చూస్తున్నాను.

    నాకు అర్థం కాని దాని గురించి ఇంతగా ఆరాటపడటం అనవసరం. అయినా కూడా ఆ పుస్తకం గురించి నేను మర్చిపోలేకపోతున్నాను. దాని వెక్కిరింతల నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. దాని వెనక ఉన్న మరో అసలు కారణం అది నాకు అర్థం కాకపోవటం ఒక్కటే కాదు. అది నేను ఒక పుస్తకాల షాపులోంచి దొంగతనంగా తెచ్చిన పుస్తకం. నాకు తెలుసు, కొంత మంది శపించబడ్డ మనుషులుంటారు. నేనూ అలాంటివాడినే, ఎప్పుడూ చదువుతూ బతకమని శపించబడ్డవాడిని. అప్పుడప్పుడూ నా గురించి నాకే, ఆడుకునే పిల్లల చేతుల్లోంచి దూరంగా విసిరివేయబడి కనిపించకుండా మరిచిపోయిన బంతిలాగ అనిపిస్తుంది. అలా అనిపించటానికి నాకు తెలిసి ప్రత్యేకమయిన కారణం కూడా ఏమీ లేదు. అలా నా చుట్టూ నేనే సృష్టించుకున్న నా మానసికమయిన ఒంటరితనపు ఆకలికి ఈ పుస్తకాలే ఆహారం. నాకు చదవటం ఒక వ్యసనం. ఒక మందు లేని రోగం. దీనివల్ల నేను చాలా కోల్పోయాను అని చాలా మంది నా గురించి తెలిసినవాళ్ళు అంటారు. వాళ్ళ దృష్టిలో నేను పుస్తకాల వల్ల చెడగొట్టబడ్డవాడిని. ఎప్పుడూ ఆ పనికిమాలిన పుస్తకాలు చేతిలో పెట్టుకుని కూర్చుంటే అవేమన్నా తిండి పెడతాయా అని నిందించబడ్డవాడిని. అలా చదవటం ఎంత వరకూ దారి తీసిందంటే టీ-షర్టుల మీద ఉండే గమ్మత్తయిన వాక్యాలు కూడా వదలకుండా చదివేసేవాడిని. అలా చదివినప్పుడు ఒక్కోసారి కొంతమంది అమ్మాయిలు నన్ను అపార్థం చేసుకుని తిట్టుకున్న సందర్భాలు ఉంటే ఉండచ్చు.

    నేను చూసిన కొందరు రెండు కాళ్ళ మీదా నించోవటానికి కూడా తీరిక లేకుండా ఎప్పుడూ డబ్బు సంపాదించటమనే పనిలోనే మునిగి తేలుతూ ఉంటారు. నా దురదృష్టం నాకు అంత మంచి శాపం ఇవ్వలేదెందుకో. ఈ నా దుర్మార్గపు శాపం నన్ను ఎంతవరకూ దిగ జార్చిందంటే చివరికి దొంగతనానికి కూడా. ఆ రోజు నాకు బాగా గుర్తు. మొండి పిల్లాడి చేతిలో దెబ్బలు తినీ తినీ ఒళ్ళంతా గాయాలు చేసుకుని నీరసంగా విశ్రాంతి తీసుకుంటున్న బొమ్మలాంటి, రెండు మూడు చేతులు మారిన నా పాత రేంజరు సైకిలు మీద ఊరంతా బలాదూరు తిరుగుతున్నాను. అలా బొంగరంలా తిరుగుతూ తిరుగుతూ చివరికి మరీ పెద్దదీ, మరీ చిన్నదీ కాని ఒక పుస్తకాల షాపులోపలికి వెళ్ళాను. లోపల అరలనిండా అడ్డదిడ్డంగా పడి ఉన్న రకరకాల పుస్తకాలు చూస్తూ సరిగ్గా ఈ పుస్తకం దగ్గర ఈ వాక్యాలు చదివిన నా కళ్ళు ఆగిపోయాయి. ఆ వాక్యాలు నన్ను విశేషం గా ఆకట్టుకున్నాయి. అందులో నేను చదవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏదో ఉన్నట్టు అనిపించింది. పుస్తకం చేతుల్లోకి తీసుకుని నాలుగు పేజీలు అటూ ఇటూ తిప్పి చూసి చివరికి కొనాలని నిర్ణయించుకుని దాని మీద ముద్రించిన ధర చూస్తే నా దగ్గర అంత డబ్బు లేదని అర్ధమయ్యింది. ఇప్పుడంటే చిన్నదో, పెద్దదో ఒక ఉద్యోగమంటూ దొరికింది కానీ అప్పుడు నేనో పెద్ద నిరుద్యోగిని. కాని పుస్తకం మీద నా వ్యామోహం మాత్రం చావ లేదు. నేను లోపలికి అడుగు పెట్టినప్పుడు ఆ మూల కౌంటర్ దగ్గర ఏదో పేపరు చదువుకుంటూ కనిపించిన నడివయసు షాపు యజమాని ఇప్పుడు అలాగే టేబులు మీద పడి నిద్రపోతున్నాడు. నా వైపు తిరిగి ఉన్నా, అతని మూసిన కళ్ళు నేను చేసే పనిని ఆపలేవని నిర్ధారించుకున్నాక షాపులోంచి బయటపడి సైకిల్ మీద పుస్తకంతో సహా మాయమైపోయాను.

    వానలో తడిసిన పక్షి నీటిని విదుల్చుకున్నట్టు పుస్తకాన్ని గురించిన జ్ఞాపకాలని పక్క మీదే వదిలి, మనిషిగా పుట్టినందుకు తీర్చుకోవలసిన కాల కృత్యాలు తీర్చుకుని అదే నా పాత సైకిలు మీద బయటి ప్రపంచంలో పడ్డాను. ఈ ఆదివారం నా స్నేహితుడు ‘అప్సర’ థియేటర్ లో ఏదో ఇంగ్లీష్ సినిమాకెళ్ళాలన్నాడు. నా దృష్టి లో వీడు సినిమాలు చూస్తూ బతకమని శపించబడ్డవాడు. వీడికి సినిమాల పిచ్చి లేకపోయి ఉంటే గొప్ప తత్త్వవేత్త అయ్యి ఉండేవాడని నా నమ్మకం. చూపులతో పరిసరాలను వెనక్కి తోసుకుంటూ ముందుకెళ్తున్నాను. కొంచెం దూరంగా రోడ్డు దాటటానికి ప్రయత్నిస్తున్న ఒక పంది – పక్క నుంచి సర్రుమని వెళ్తున్న కారు వేగాన్నీ దూరాన్నీ లెక్కలేసుకుంటూ దాటగలనా లేదా అని ఆలోచించుకుని ఇంక దాటలేనని నిర్ధారించుకుని కారుని పోనిచ్చి పరిగెట్టుకుంటూ, అచ్చం మనిషిలాగే రోడ్డు దాటేసింది. ఆ బడ్డీ కొట్టు దగ్గర ఒక కందగడ్డ మొహం వాడు పెదాల మధ్యన వెలిగించిన సిగరెట్టుని గట్టిగా పీల్చి ఎవరిమీదో కోపాన్ని బయటకి రాకుండా మింగేస్తున్నాడు. అప్పటివరకూ నిదానంగా వెళ్తున్న లైసెన్స్ లేని బైకువాడొకడు టీ కొట్టు ముందు టీ తాగుతున్న ట్రాఫిక్ పోలీసుని చూసి భయపడుతూ భయపడుతూ వేగం పెంచి తుర్రుమని జారుకున్నాడు. జబ్బుతో మంచం పట్టిన మనిషిలా ఉన్న ఒక ఇంటి కాంపౌండు గోడ మీద ‘అప్సర’ అని రాసి ఉన్న వాల్ పోస్టర్ మీద ‘ది మ్యాట్రిక్స్’ అన్న అక్షరాలు కనిపించాయి. ఆ పోస్టర్ చూడగానే థియేటర్ ముందు టిక్కెట్లతో సహా ఇప్పటికే నా కోసం ఎదురు చూస్తున్న నా స్నేహితుడు గుర్తొచ్చాడు. నేను వేగం పెంచి గబగబా థియేటర్ కి చేరుకునేసరికి అనుకున్నట్టే టిక్కెట్లతో సిద్ధంగా ఉన్న స్నేహితుడు నన్ను చూడగానే, వీడి వల్ల సినిమా ప్రారంభం చూడలేమో అన్న బాధ పోయిన మొహంతో గబగబా నన్ను థియేటర్ లోపలికి లాక్కెళ్ళిపోయాడు.

    సాధారణంగా వాడు సినిమా చూస్తున్నంతసేపూ మాట్లాడడు. ఏదో పుస్తకం చదువుతున్నట్టో పూజలో ఉన్నట్టో సినిమాని ఏకాగ్రంగా చూస్తాడు. సినిమా అయిపోయాక మాత్రం రెండు మూడు గంటలు దాని గురించే ఆపకుండా మాట్లాడతాడు. అది వాడి అలవాటు. వాడికున్న ఇంకో అలవాటు, నచ్చకపోతే టిక్కెట్టు రెండుగా చింపి పాడేస్తాడు. నచ్చితే మాత్రం చింపకుండా పాడేస్తాడు. ఈ అలవాటు వాళ్ళ ఇంట్లో వీడు సినిమా చూసిన విషయం జేబులో టిక్కెట్టు చూసి తెలుసుకుని తిట్టే తిట్లనుంచి కాపాడుకోవటానికే అని మాత్రం మాలో కొద్ది మందికే తెలుసు. “సినిమా చూశాక నాకు ‘అహం బ్రహ్మస్మి’ అన్న మాటకి అర్థం తెలిసింది” అన్నాడు. స్టాండులోంచి సైకిలు తీసి బయటికి వస్తుండగా. అలాగే నడుచుకుంటూ సినిమా గురించి వాడు మాట్లాడుతుంటే నేను వింటూ ఇద్దరం చాలా దూరం ముందుకెళ్ళి ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి చెరో ప్లేటు మైసూరుబోండాలు తిని బయటికి వస్తూండగా ఎదురుగా ఉన్న పుస్తకాల షాపులోంచి వాడికి బాగా పరిచయమున్న ఒక పెద్దాయన పిలిచాడు. “ఒరేయ్ బాబూ, మీ వాడిని ఒక గంట షాపు చూసుకోమను. నేను అర్జెంటుగా ముఖ్యనయిన పని మీద బయటికెళ్ళాలి. నువ్వు కూడా నాతో పాటు రావాలి” అన్నాడు. నేను “సరే” అనగానే, నన్ను షాపులో కూర్చోబెట్టి ఇద్దరూ బయటికెళ్ళిపోయారు. కొనే వాళ్ళు ఎవరూ లేని మరీ పెద్దదీ, మరీ చిన్నదీ కాని ఆ షాపులో ఉన్న పుస్తకాల్లోంచి ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ అనే పుస్తకాన్ని తీసి ఒక మూలగా ఉన్న కౌంటర్ లో కూర్చుని పేజీలు తిరగేస్తున్నాను. అలసట వల్ల పైన ఫ్యాను గాలికి నా కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే టేబులు మీద పడి నిద్రకి ఉపక్రమించాను.

    సరిగ్గా అదే సమయానికి పాత రేంజరు సైకిలు మీద వచ్చిన మాసిన బట్టల్లో ఉన్న యువకుడు సైకిలుస్టాండు వేసి లోపలికి వచ్చి అరల నిండా అడ్డదిడ్డంగా పడి ఉన్న రకరకాల పుస్తకాలు చూస్తూ సరిగ్గా ఒక పుస్తకం దగ్గరికి వచ్చి అట్ట వెనక ఉన్న వాక్యాలు చదివి నాలుగు పేజీలు అటూ ఇటూ తిరగేసి ఒక సారి నా వైపు చూసి నేను నిద్ర పోతున్నాననుకుని షాపులోంచి బయటిపడి అతని అరిగిపోయిన చెప్పులు నా కంటబడుతుండగా, సైకిలు మీద పుస్తకంతో సహా మాయమైపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన నా మెదడు మొద్దు బారిపోయింది. ఆ వెంటనే వచ్చిన ఒక వింత ఆలోచన నా మనసుని ఉక్కిరిబిక్కిరి చేసింది. “అంటే ఆ రోజు నేను పుస్తకాన్ని దొంగిలిస్తుండగా ఆ యజమాని నన్ను చూసి కూడా వదిలేశాడన్నమాట.” అప్రయత్నంగానే నా నోటి నుంచి ఈ మాటలు బయటికొచ్చాయి. ఖచ్చితంగా అదే జరిగి ఉంటుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఈ విషయాన్ని రూఢి చేసుకోగలిగితే బాగుండుననుకున్నాను. అప్పుడే లోపలికొచ్చిన నా స్నేహితుడికి షాపు అప్పగించి, సైకిలు మీద అదే పుస్తకాల షాపు ఉన్న వీధిలోకి చేరుకోగలిగాను. ఇప్పుడు అక్కడ ఒక చెప్పుల షాపు ఉంది. లోపల మాత్రం అదే పాత యజమాని ఉన్నాడు. “ఇక్కడ పుస్తకాల షాపు ఉండాలి కదా?” అన్నాను దగ్గరికెళ్ళి. “అవును ఇప్పుడు మా అబ్బాయి దీన్ని చెప్పుల షాపు చేసేశాడు.” అన్నాడు. ఇంకేం మాట్లాడలేక తిరిగి వెళ్ళిపోతుంటే “నువ్వు నాకు బాగా తెలుసు. ఒక సారి నువ్వు ఇదే షాపులోంచి ఒక పుస్తకాన్ని దొంగిలించావు.” అన్నాడు. నిశ్చేష్టుడినై అతన్నే చూస్తున్నాను. “మాసిన బట్టల్లో, అరిగిపోయిన చెప్పులతో ఉన్న నీ పరిస్థితి చూసి ఆ రోజు నేను నిన్ను ఏమీ అనలేకపోయాను. అయినా పుస్తకాల కోసం ఆరాటపడేవాడు ఎప్పుడూ రంగు కాగితాల్లాంటి డబ్బుల కోసం ఆరాటపడడు. అందుకే నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించలేదు. ఈ షాపు ఇంకా పుస్తకాల షాపు గానే మిగిలి ఉండి ఉంటే నీకు తప్పకుండా మరో పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి ఉండే వాడిని” అన్నాడు విచారంగా. పొద్దున్న చదివిన వాక్యాలే నా మనసులో మళ్ళీ సుడులు తిరుగుతున్నాయి.

“ఇప్పటివరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది.
ఇప్పటివరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది.
ఈ భూమ్మీద కొత్తదంటూ ఏమీ లేదు.”

    అవును ఈ భూమ్మీద కొత్తదంటూ ఏదీ లేదు. అదే ప్రేమ, అదే క్షమ, అదే దయ, అదే కోరిక, అదే ఆశ, అదే ద్వేషం, అదే పోరాటం. తరాల నుంచి తరాలకి ఇవే అఖండంగా, అనంతంగా కొనసాగుతున్నాయి. కొనసాగుతూనే ఉంటాయి. బయటికొచ్చాక, ఇప్పుడు నేను కొత్తగా అర్థం చేసుకున్న అదే పాత ప్రపంచం నాకు కనిపిస్తోంది. మళ్ళీ ఒకసారి ఆ పుస్తకాన్ని చదవటానికి ఉరకలేస్తున్న నా మనసుని అర్థం చేసుకున్న నా పాత సైకిలు నన్ను వాయువేగంతో తీసుకెళుతోంది.