Sunday, March 5, 2017

వెంకటేశులుకి దిష్టి తగిలింది


                 అయితే గియితే అప్పట్లో దూరదర్శన్ లో వార్తలు చదివే 'శాంతి స్వరూప్' లాగా నున్నగా తల దువ్వుకుని, ఇస్త్రీ బట్టలేసుకుని, నూనె సుద్దల్లాగా మెరిసిపోతూ బళ్ళోకొచ్చే మారుబోయిన వాళ్ళ ముత్యం గాడికో, మీసాల నారాయణరావు గారి బాలాజీ గాడికో లేకపోతే వాళ్ళ ఊళ్ళో అయిదో తరగతి దాకానే ఉందని ఆరో తరగతిలో మాతో పాటు చదువుకోవటానికి మా ఊరి బళ్ళోకొచ్చే మా పక్క ఊరు వెలగ పల్లి లో ఉండే వెలమ దొరగారోళ్ళ పండు గాడికో దిష్టి తగలాలి గానీ, విచిత్రంగా, ఎప్పుడూ పిర్రల దగ్గర చిరిగిపోయిన నిక్కరేసుకుని మళ్ళీ దాని మీదకి ఆ చిరుగులు కనిపించకుండా మోకాళ్ళ దాకా వచ్చే ఎవరో ఊరుకునే ఇచ్చిన లొడంగం చొక్కా వేసుకుని బళ్ళోకొచ్చే ఈనుప్పుల్లలాగా ఉండే కమతాలోళ్ళ వెంకటేశులుగాడికి దిష్టి తగిలేసింది ఒకసారి. వెంకటేశులుగాడి ఏడుపుగొట్టు దిష్టి కధ గురించి చెప్పుకునే ముందు సరదాకి వాడి చిరుగుల నిక్కరు గురించిన పిట్ట కధ కూడా చెప్పుకుందాం. అప్పట్లో మాలాంటి పిల్లలందరం చిరిగిందో, చిరగలేనిదో, పొడుగయ్యిందో, పొట్టి అయ్యిందో ఏదో ఒక చొక్కా, నిక్కరు వేసుకుని పలకా, కనికీ పట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం గానీ, మా పెద్దోళ్ళయితే వాళ్ళ చిన్నప్పుడు ఒంటి మీద చొక్కా ఏమీ లేకుండానే బడికెళ్ళి పలక కొనుక్కోవటానికి కూడా సౌకర్యం లేక బూడిద మీద పుల్ల ముక్కతో 'అ' 'ఆ' లు దిద్దుకుని చదువు నేర్చుకున్నారని ఆ తర్వాతెప్పుడో వాళ్ళే చెపితే తెలిసింది. ఈ విషయం మా తెలుగు మాస్టారు ఉమామహేశ్వర్రావు గారికి తెలుసో లేదో తెలీదు గానీ, ఆయన మాత్రం పొద్దున్నే మూడో బెల్లు కొట్టాక ప్రార్ధన అయిపోయాక తరగతి గది లోకి వెళుతున్న వెంకటేశులు గాడిని పిలిచి "అలా బుడబుక్కలోడి లాగా వదులు చొక్కా వేలాడేసుకుని తిరగక పోతే నిక్కరు లోపలికి తోసెయ్యొచ్చు కదా? ఇన్ షర్టు చేసుకున్నట్టు ఉంటుంది." అని ఒక ఉచిత సలహా ఇచ్చేవారు. వెంకటేశులు గాడికి మామూలుగానే ఎవరి మాటా కాదనే అలవాటు అస్సలు లేదు కాబట్టి, అలాగే చేసేవాడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం బెల్లు తర్వాత అన్నం తిన్నాక చుట్ట కాల్చుకోవటానికి బయటకొచ్చే మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు అక్కడే ఆడుకుంటున్న వెంకటేశులుగాడిని పిలిచి "పిర్రల దగ్గర నీ నిక్కరు చిరుగుల అందం అందరికీ చూపించకపోతే కనబడకుండా ఆ ఇన్ షర్టు తీసెయ్యొచ్చు కదా ?" అని పాపం ఆయనకి తోచిన మంచి సలహా ఆయనా ఇచ్చేవారు. వెంకటేశులు గాడు కూడా తు.చ తప్పకుండా మళ్ళీ అలాగే చేసేవాడు. ఇంచు మించు రోజూ ఇదే నిర్వాకం జరిగేది వెంకటేశులుగాడికి. ఆ రకంగా బళ్ళో ఏ రోజు చూసినా విచిత్రంగా పొద్దున్న అంతా ఇన్ షర్టు తోనూ మధ్యాహ్నం నుంచీ లొడంగం లాంటి పొడుగు చొక్కాతోనూ కనిపించేవాడు వెంకటేశులు. బాలాజి గాడి లాంటి వాళ్ళకయితే ఇదంతా చూసి వాళ్ళేదో సరాసరి ఆకాశం లోనుంచో, విష్ణుమూర్తి బొడ్డులోనుంచో ఊడిపడ్డట్టు పెద్ద నవ్వులాటగా ఉండేది. ఒక్కోసారయితే ఇలాగ పొద్దున్న ఒక వేషం మధ్యాహ్నం ఒక వేషం వెయ్యలేక నామోషీ గా అనిపించి, 'మనిషికి చావు పుట్టుకలు ఉండటం, ఆ మధ్యలో బతకటానికి డబ్బులు కావలసిరావటం, ఆ ఆర్ధిక స్థాయిని బట్టే మనిషి తన అవసరాలు నెరవేర్చుకోగలగడం' లాంటి పెద్ద పెద్ద విషయాలు అప్పటికి తెలీదు కాబట్టి తనకి సరిపోయే ఒక రెండు జతల మంచి బట్టలు ఎందుకు తీసి ఇవ్వటం లేదా? అని వెంకటేశులు గాడు వాళ్ళ అమ్మా నాన్నలని తెగ తిట్టుకునేవాడు.

                  ఇంక అసలు కధలోకి వెళితే, ఆ రోజు ఆదివారం కాబట్టి బడికి వెళ్ళవలసిన పని ఎలాగూ లేదు. అంతకన్నా సంతోషం కలిగించే విషయం ఆ రోజు మా ఊళ్ళో అందరికన్నా ఎక్కువగా రెండొందల ఎకరాలు ఉన్న సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనాలు. అంతకు ముందు రోజు రాత్రే సుబ్బ రాజు గారి మనుషులు ఇద్దరు ముగ్గురు మా ఊళ్ళో గడప గడపకీ వచ్చి ఇంట్లో అందరూ పెళ్ళి భోజనానికి రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయారు. సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనం అంటే రోజూ తినే అన్నంతో పాటు అన్నానికి ముందు అయిదు రకాలు, తర్వాత అయిదు రకాలు పిండి వంటలు పెడతారు కాబట్టి ఈ మాట తెలిసిన దగ్గర నుంచీ మా పిల్లలందరికీ ఆ సంవత్సరం సంక్రాంతి, దీపావళి లాగానే ఇంకో కొత్త పండగ ఎగస్ట్రాగా వచ్చినట్టు తెగ ఆనందమయిపోయింది. పిల్లలందరం కలిసే పెళ్ళి భోజనానికి వెళ్ళాలని అంతకు ముందే నిర్ణయించేసుకున్నాం కాబట్టి మేము అయిదారుగురుం కలిశాక వెంకటేశులుగాడిని కూడా పిలుచుకుని వెళ్ళటానికి వాళ్ళ ఇంటికెళితే ఇంకా వాళ్ళమ్మ వాడికి వీపు తోమి స్నానం చేయించటం లోనే ఉంది. సరే అని వాళ్ళ ఇంటి ముందే కాసేపు కూర్చున్నాక వాళ్ళమ్మ వాడికి రోజూ బళ్ళోకి వచ్చినప్పుడు వేసే బట్టలు కాకుండా ఇలాగ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేసుకునే కొంచెం మంచి బట్టలు వేసి మాతో పాటు పంపి, ఒక పదడుగులు ముందుకెళ్ళాక ఏదో గుర్తుకొచ్చినట్టు వెంకటేశులు గాడిని కేకపెట్టి పిలిచి "ఒరేయ్ బాబూ పంక్తి లో అందరి ముందూ ఎక్కువగా తినొద్దురా. దిష్టి తగులుతుంది." అని అందరికీ వినిపించేలాగా అరిచి చెపితే, ఏ విషయాన్ని చాటుగా చెప్పాలో ఏ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలో కూడా తెలియని ఆ మహాతల్లి అమాయకత్వానికి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటే, తన తొందరపాటుకి, కొడుక్కి రెండు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని తన నిస్సహాయతకి, సిగ్గుపడి తల వంచుకుని గుడిసె లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అందరూ వాడిని, వాళ్ళ అమ్మని చూసి నవ్వటం గమనించిన వెంకటేశులు కి ఇదంతా పెద్ద అవమానం గా అనిపించి వాళ్ళమ్మని తిట్టుకుంటూనే మొహం వేలాడేసుకుని మాతో పాటు భోజనాలకి బయలుదేరాడు.

                  మేము వెళ్ళేసరికే కుర్చీలు, బల్లలు వేసేసి అన్నీ సిధ్ధంగా ఉన్నాయి. ఇంకా మొదటి పంక్తి కాబట్టి అప్పుడే కుర్చోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే ఎవరో వచ్చి "ముందు పిల్లలకి పెట్టెయ్యండ్రా." అంటే ఇంక ఆలోచించకుండా బిల బిలా అంటూ వెళ్ళి మొదటి వరసలో కూర్చుండిపోయాం. మేము బళ్ళో మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు లెక్కలు చేసుకోవటానికి కొనమన్నారని కొన్న తెల్ల కాగితాల పుస్తకం లో ఉండే తెల్ల కాగితం లాంటి ఒక పెద్ద చుట్ట తెచ్చి మేము కూర్చున్న బల్ల మీద పరచటం కోసం దొర్లించుకుంటూ వెళ్తుంటే మొదటి సారిగా అది చూసిన మా అందరికీ చాలా విచిత్రమయిపోయింది. తరవాత మా ముందు అరిటాకులు వేసుకుంటూ మళ్ళీ అది కదలకుండా వెంటనే ఒక స్టీలు గ్లాసు పెట్టెయ్యటం కూడా చక చకా జరిగిపోయింది. ఆ తర్వాత మా అందరికీ బాగా తెలిసిన సుబ్బరాజు గారి దగ్గర పాలేరు గా చేసే కుంటి కులాసం గాడు గేదెలకి పాలు తీసే పాల తపేలాతో మా గ్లాసుల్లో మంచి నీళ్ళు పోసేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదట గా వేడి వేడి గా రెండేసి బూరెలు, ఆ బూరెల్లోకి నెయ్యి, తర్వాత పూతరేకు, చిక్కని సేమియా పాయసం, పులిహోర వడ్డించారు. వెంకటేశులు గాడయితే వాళ్ళమ్మ చెప్పిన మాట కూడా మర్చిపోయి ఏ మొహమాటం లేకుండా ఇంకో రెండు బూరెలు ఇంకొచెం పులిహోర అడిగి మరీ వేయించుకుని తిన్నాడు. తర్వాత అన్నంలోకి వంకాయ పచ్చడి, పప్పు ఆవకాయ, కొబ్బరి వేసిన దొండకాయ వేపుడు, ములక్కాడ కూర, ఆనపకాయ ముక్కలు వేసిన సాంబారు, అప్పడం, చివరిగా పెరుగు, అందులోకి నంజుకోవటానికి చక్కెరకేళీ అరటి పండు, ఆఖరున కిళ్ళి. కిళ్ళీ గురించి అయితే అప్పటివరకూ వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటుంటే వినటమే గానీ తినటం మాత్రం అదే మొదటిసారి మా అందరికీ. వెంకటేశులుగాడయితే అందరూ చూస్తుండగానే అన్నం రెండు మూడు సార్లయినా వేయించుకున్నాడు.

                  భోజనం అయ్యాక ఇంటికెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే వెంకటేశులు గాడికయితే అడుగు తీసి అడుగు వెయ్యటం కూడా కష్టం అయిపోయింది. ఎండకి ఒళ్ళంతా చెమటలు పట్టి, ఆయాసం ఎక్కువయ్యి మధ్యలో కుక్కల ప్రెసిడెంటు గారి ఇంటి ముందు ఉన్న నిద్ర గన్నేరు చెట్టు కింద కొంచెం సేపు కూర్చుంటే గానీ ఇంటికెళ్ళలేక పోయాడు. ఇంటికెళ్ళాక తల తిరుగుతున్నట్టు అయిపోయి అలాగే పడుకుండి పోయాడు. ఆ రోజు రాత్రి కూడా కడుపులో ఏదో దేవుతున్నట్టు, తిన్నదంతా గొంతులోనే ఉన్నట్టు, వికారంగా ఉన్నట్టు అనిపించి అసలు నిద్ర పొలేక ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే లేచి మొహం కడుక్కుందామని వేప పుల్ల తెంపుకుని నోట్లో పెట్టుకోగానే పెళ్ళి భోజనం లో తిన్నది తిన్నట్టే వాంతి చేసేసుకున్నాడు. దానికి తోడు వెంటనే జ్వరం, విరేచనాలు కూడా మొదలయ్యాయి. ఆ రోజు మంచం పట్టిన వెంకటేశులు గాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యి బళ్ళోకి రావటానికి పది,పదిహేను రోజులయినా పట్టింది. వెంకటేశులుకి దిష్టి తగిలిందని వాళ్ళమ్మ అయితే ముందు రెండు మూడు రోజులూ ఒక రోజు ఉప్పుగన్ను, ఇంకో రోజు నూనె గుడ్డ, మరో రోజు కోడి గుడ్డు దిష్టి తీసి పారేసింది. అయినా బాగవ్వకపోతే ఊళ్ళొ ఆరెంపీ డాక్టరుని పిలిపించి వైద్యం చేయించి మందులు కూడా ఇప్పించింది. తగ్గాక మరో పది రోజుల దాకా తన శక్తికి మించి పథ్యం కూడా పెట్టింది. ఇవన్నీ చెయ్యటానికి డబ్బులు సరిపోక వాళ్ళ అమ్మ, నాన్న కూలి పనులకి వెళ్ళేటప్పుడు చద్దన్నం పట్టుకెళ్ళటానికని కొన్న రెండు స్టీలు టిపినీలు, కోతల రోజుల్లో పనుల్లోకి వెళ్ళటానికి ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న ముప్పర్తిపాడు కొడవలి, వాళ్ళమ్మకి ఉన్న మూడే మూడు చీరల్లో ఒక చీర తీసుకెళ్ళి ఊళ్ళో తాకట్టు వ్యాపారం చేసే కాంతమ్మ గారి దగ్గర తాకట్టు పెట్ట వలసివచ్చింది. తన అనారోగ్యం తగ్గించటానికి వాళ్ళమ్మ ఎంత కష్టపడవలసి వచ్చిందో మొదటి సారిగా కళ్ళారా చూశాడు వెంకటేశులు. తనకి ఏమవుతుందో అని వాళ్ళమ్మ ఎంత భయపడిందో కూడా అర్ధం చేసుకున్నాడు.

                  అంతా అయ్యాక, ఈ దిష్టి గిష్టి ఉన్నయో లేదో ఆ దేవుడికే తెలియాలి కానీ, చచ్చి బతికిన వెంకటేశులుగాడి అనారోగ్యం గురించి అరెంపీ డాక్టరు గారిని మా ఊళ్ళో ఎవరో అడిగితే "ఊరికే వచ్చింది కదా అని అన్నీ ఒకేసారి కలిపి తినేస్తే అర్ధాకలితో ఆరుగు పోయిన పేగులు అరాయించుకోవద్దా?" అని తనకి తెలిసిన విషయం చెప్పాడు. వెంకటేశులు గాడు కూడా ఆ తర్వాత ఎప్పుడు పంక్తి భోజనాలకి వచ్చినా అంతకు ముందులా కాకుండా అప్పుడే పీకలదాక తిని వచ్చిన వాడి లాగా కొంచెమే తిని చెయ్యి కడుక్కుని వచ్చేసేవాడు. అదీగాక 'మనుషులకు రోగాలు, చావుపుట్టుకలు ఉంటాయని. సమాజం లో వివిధ ఆర్ధిక స్థాయిలు కూడా ఉంటాయని. మనిషి ఆర్ధిక స్థాయి ప్రకారమే అతని స్థానం నిర్దేశింపబడుతుందని. ఆ ఆర్ధిక స్థాయి పరిధిలో మాత్రమే తన అవసరాలను పరిమితం చేసుకోవాలని. సమాజ నియమాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణం గానే ఏ మనిషయినా నడుచుకోవాలని' లాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ అప్పటికి మా అబ్రహాం మాస్టారు సోషల్ పాఠం లో ఇంకా చెప్పకుండానే అర్ధం చేసేసుకున్నాడు.