Saturday, October 5, 2019

సైరా - Review (2-3 mins)


                 ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉంది ? అన్న దాని మీద చాలా రివ్యూలు వచ్చాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఇంగ్లీషు వాళ్ళు భారత దేశాన్ని వదిలి వెళ్ళి 70 ఏళ్ళు దాటిపోయినా కూడా మనం వాళ్ళ గురించి, వాళ్ళని వెళ్ళగొట్టటానికి మూల కారకులలో ఒకరయిన గాంధీ గారి గురించి ఇప్పటికీ రోజూ తలుచుకుంటున్నామంటే మన దేశం పై బ్రిటీష్ పాలన ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత స్వాతంత్ర పోరాటం నుండి పుట్టిన మహత్మ గాంధి ఇప్పుడు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు. అప్పట్లో ఆంగ్లేయులు ఇండియాని ఎంతగా పీల్చి పిప్పి చేశారంటే ఒక ప్రాంతం, వారి పాలనలో ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటే అంతగా పేదరికంలోకి కూరుకుపోయేది. విభజించు జయించు. విభజించు పాలించు అన్న రెండు కుతంత్రాల ద్వారానే బ్రిటీష్ వాళ్ళు ఒకప్పటికి దాదాపు 80 శాతం భూమండలాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకోగలిగారు. మిగిలిన దేశాలతో పోలిస్తే మనం మాత్రమే వారిని ఇప్పటికీ ఎక్కువగా తలుచుకుంటున్నాం. దీనికి గల కొన్ని కారణాలలో వారు మనదేశాన్ని విపరీతంగా దోచుకుని పీల్చి పిప్పి చేసి పోవటం ఒకటయితే, ఆ గాయాలను మరిపించేటంత గొప్ప పరిపాలన భారతదేశానికి ఇంకా లభించకపోవటం మరో కారణం. మన స్వాతంత్ర పోరాట యోధుల గురించి తరచుగా విడుదలయ్యే సినిమాలని కనీసం చివరి కారణంగా అయినా తీసి పారేయటానికి వీలు లేదు. అలాంటి సినిమాలలో సైరా నరసింహారెడ్డి కూడా ఒకటి.

                 మహాత్మా గాంధి దేశ ప్రజలందరినీ ఒక తాటి పైకి తెచ్చేవరకు, భారతీయులు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడటం కన్నా ఎక్కువగా తమలో తామే పోట్లాడుకున్నారు. స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 33 కోట్లు. కానీ మన దేశంలోని ఆంగ్లేయుల జనాభా ఒక లక్ష యాభై వేలు మాత్రమే, అంటే ఒక ఆంగ్లేయుడు 2200 మంది భారతీయులని నియంత్రించగలిగేవాడు. ఒక విదేశీయుడు ఇంత మందిని అదుపులో ఉంచుకోవాలంటే సహజంగానే విడగొట్టటం, భయపెట్టటం అనేవి వారి ప్రధాన వ్యూహాలుగా ఉండాలి. అంటే అప్పటికి మనదేశంలోని చిన్న చిన్న సంస్థానాల రాజులు, అధికారులలో ఎంతగా అనైక్యత, లంచగొండితనం, పిరికితనం పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. వాస్కోడిగామా కేరళలో అడుగు పెట్టేనాటికి అక్కడి సంస్థానాలు తమలో తాము ఎంత క్రూరంగా వ్యవహరించుకొనేవో 'ఉరుమి' సినిమాలో సరిగ్గా చూపించారు.

                 ఎంత గొప్ప నాయకుడికి అయినా ఎంతో కొంత సొంత ప్రయోజనాలు ఉండటం అనేది సహజం. సినిమాలలో పాత్రలు చూపించినంత ఉదాత్తం గా నిజ జీవితం లో ఎవ్వరూ ఉండలేరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజంగా తనకి రావాల్సిన పెన్షన్ కోసం పోరాడాడా లేక ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడాడా అనేది పక్కన పెట్టవలసిన అనవసర విషయం. పైన చెప్పుకున్న కష్టమయిన పరిస్థితుల్లో కూడ అతను అత్యంత బలమయిన ఆంగ్లేయులకి ధైర్యంగా ఎదురు నిలవటం, వారి చేతులలో వీరుడిలా చనిపోవటం మాత్రం ఒక చారిత్రక నిజం. కాల్పనికతను జోడించి, అక్కడక్కడా మలుపులతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన దగ్గరినుంచి చనిపోయేవరకు సినిమాలో ఆసక్తిగా చూపించారు. మంచి సౌండ్ సిస్టం ఉన్న పెద్ద తెర పై చూస్తే ఎక్కువగా నచ్చే సినిమా.

                 భారీతనం/పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాటలు సినిమాలకి మంచి చేస్తాయా లేదా? అన్న విషయం మరికొన్ని ప్రయోగాలు చూస్తే గానీ ఇప్పుడే చెప్పలేము. చార్లీ చాప్లిన్ ఒక సందర్భంలో ఒక పార్కు, పార్కులో బెంచీ, ఒక పోలీస్ క్యారెక్టర్, మరో రెండు క్యారెక్టర్లు ఉంటే చాలు సినిమా తీసెయ్యగలను అని చెప్పాడు. అప్పట్లో తెలుగు లో వంశీ, కన్నడలో కాశీనాథ్ లాంటి దర్శకులు అతి తక్కువ డబ్బులతోనే మంచి సినిమాలను తీయగలిగారు. సినిమాని పైకి తీసుకెళ్ళటంకన్నా లోతుకి తీసుకెళ్ళటం ముఖ్యం. ఏ సినిమాకయినా పెద్ద బడ్జెట్ తో పాటు కథ, కథనం కూడా చాలా అవసరం. 'బాహుబలి' బలం కూడా అదే. కానీ కథ ని పక్కన పెట్టి భారీతనం/పాన్ ఇండియా పేరుతో సహజత్వానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం మంచిది కాదన్న విషయం 'సాహో' సినిమా తో రుజువయ్యింది. ఆ విషయం లో 'సైరా' ఎంతో కొంత జాగ్రత్త పడటం సినిమాకి మేలు చేసింది.

సినిమాలో నాకు నచ్చిన అంశాలు

• చిరంజీవి.
• పొదుపుగా, పదునుగా వాడిన మాటలు.
• చాలా వరకు సీన్లు, మాటలు మొదటి నుంచి చివరివరకు ఏదో ఒక సందర్భంలో   ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండేలా కథ రాసుకోవటం.

                 ఈ సినిమా చూసి బయటకి వచ్చాక కూడా అన్నీ సలక్షణంగా ఉన్న మంచి తెలుగు సినిమా చూసి చాలా రోజులయ్యింది అనే నా అభిప్రాయంలో మార్పు రాలేదు గానీ, ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచం లో డబ్బు సంపాదన యావలో పడి నెల జీతంకోసం చాలా మామూలుగా మనం వదులుకునే స్వేచ్చ, ఎంత కష్టపడితే మనకి లభించిందో తెలుసుకోవటానికీ, డబ్బులు తీసుకుని ఓటు వేసి నిర్వీర్యం చేస్తున్న ప్రజాస్వామ్యం ఎంత విలువయినదో అర్ధం చేసుకోవటానికీ అయినా ప్రతి ఒక్కరూ ఒక్కసారయినా ఈ సినిమాని చూడాలి.

Thursday, August 15, 2019

ఊర కుక్క మరణం











(మా ఊళ్ళో ఒక పంక్తి భోజనాల రోజు ఎంగిలి విస్తరాకుల దగ్గర ఆకలితో అతిగా తిని చనిపోయిన మా ఊరి నల్ల ఊర కుక్కకి ఈ కథ అంకితం)

                 "  నేను చనిపోయి చాలా సేపయ్యింది. నా చావు గురించి నాకేమీ భాథ లేదు. ప్రతి జీవికీ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతకన్నా ముఖ్యం. మన పుట్టుకకి ఏ గౌరవం లేకపోవచ్చు కానీ చావుకి మాత్రం తప్పకుండా ఒక గౌరవం ఉండేలా బతకటం మన చేతల లోనే ఉంది. మీ లాంటి మనుషులకయితే అందరికీ మంచి చేసి చనిపోతే గౌరవం. ఎక్కువ ఆస్థులు సంపాదించి, గొప్ప హోదా అనుభవించి చనిపోతే గౌరవం. యుధ్ధంలో చనిపోయినపుడు గౌరవం. మీ మీ మత విశ్వాసాలపట్ల భక్తి ప్రపత్తులు చూపించి థర్మ మార్గాన్ని అనుసరిస్తూ బతికి చనిపోతే గౌరవం. అలా చనిపోయిన వాళ్ళ శవ యాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆడంబరంగా ఉంటుంది. మనుషులు తమ మరణానికి సన్నధ్ధమవటం కోసం పోరాడతారు. మేము మాత్రం కేవలం బతికి ఉండటానికి పోరాడతాం. తల రాతలు మీ లాంటి మనుషులకే ఉంటాయో, మా లాంటి కుక్కలకి కూడా ఉంటాయో నాకు తెలీదు. బహుశా ఉండవేమోనని నేనూ అనుకునేవాడిని. మేము ఈ భూమ్మీద పడి ఊహ తెలిసిన దగ్గర నుంచీ ఆహారం కోసం వెతుక్కోవటం, పిల్లల్ని కనటం, బతుకు కోసం శత్రువులతో పోరాడటం. ఇంతకన్నా ఏమీ ఉండదు. ఇక చావంటారా ఏ రోగంతోనో, ఆకలితోనో, శత్రువుల దాడితోనో మా జీవితాలు ముగిసిపోవాలి. మీ జీవితాల్లో ఉన్నంత సంక్లిష్టత, వ్యత్యాసం మా జీవితాల్లో ఉండదు కాబట్టి మాకు తల రాతలు ఉండవనీ ఆ అవసరమే మాకు ఉండదనీ ఒక అభిప్రాయం నాకు ఉండేది. కాని నా చావు మాత్రం అన్నిటికీ భిన్నం గా సంభవించింది. నా చావు అనుభవమయ్యాకే నాకు మాలాంటి జీవులకు కూడా తల రాతలు ఉంటాయేమోనని అనుమానం వచ్చింది. నా చావు అత్యంత అవమానకరం, మా లాంటి జంతువులన్నిటికీ ఒక గుణపాఠం. ఇలాంటి చావు ఇప్పటివరకూ నాకు తప్ప ఇంకెవరికీ వచ్చి ఉండదు. ఇక ముందు రాకూడదని కూడా కోరుకుంటున్నాను.

                 అత్యాశకి పోవటం కేవలం మనుషుల లక్షణమనీ, అది మన లాంటి జంతువులకి మంచిది కాదనీ మా అమ్మ చెప్పింది. మనుషులు మన కుక్క జాతి పట్ల చాలా దయతో ఉంటారని కూడా చెప్పింది. మనం విశ్వాసంగా ఉంటే దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ముద్దు చేస్తారనీ, కడుపు నిండా అన్నం పెడతారనీ, మన మీద చూపించినంత ప్రేమ ఒక్కోసారి సాటి మనుషుల మీద కూడా చూపించరనీ చెప్పింది. కానీ ఏ రెండు కుక్కల స్వభావాల మధ్య ఉన్న తేడా కన్నా ఇద్దరు మనుష్యుల స్వభావాల మధ్య ఉండే తేడా చాలా ఎక్కువ. అందుకే మనుషులందరినీ నమ్మకూడదని కూడా చెప్పింది. అది నాకు ఆ తర్వాత అనుభవమయ్యింది కూడా. ఒక్కో సారి అన్నం పెట్టిన చెయ్యే ఛీ, పో అని కర్రతో కొట్టి తరిమేస్తుంది. ఇంకోసారయితే ఉత్తపుణ్యానికే ఇంత పెద్ద ఇటుక ముక్క తీసుకుని గిర గిరా తిప్పి మొఖం మీద కొడుతుంది. ఇంకా కసి తీరక పోతే నాలుగు చక్రాల కుక్కల బండి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అలాంటి నాలుగు చక్రాల బండి వచ్చి నప్పుడు దూరంగా పారిపొమ్మని కూడా మా అమ్మ చెప్పింది. లేకపోతే చావు మూడినట్లే. అలా చనిపోయినా కూడా నాకు ఆనందం గానే ఉండేది. కానీ నన్ను చూసి మా జాతి ఒక్కటే కాదు, నోరు లేని మా లాంటి ప్రాణులన్నీ అసహ్యించుకునేలా చనిపోయాను. మాకూ మీలాగే స్వర్గ నరకాలు ఉంటే నేను అక్కడున్న మా అమ్మ దగ్గరికే వెళ్ళి చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతాను. నా పింకి కూడా అక్కడే ఉండొచ్చు. పింకి కళ్ళు కాటుక పెట్టుకున్నట్టు ఆకర్షణీయం గా ఉండి ఎప్పుడూ కాంతివంతంగా, అమాయకంగా మెరుస్తూ ఉండేవి. నేను చనిపోయిన ఇంటి వీధి చివర ఉన్న పెద్ద డాబాలో ఉండే వాళ్ళ దగ్గరే పింకీకి ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఉండేది. ఆ అందమయిన పేరు కూడా వాళ్ళే పెట్టారు. కాని ఏమయ్యిందో తెలీదు. ఉన్నట్టుండి పింకీ ని బయటకి గెంటేశారు. మొదట్లో ఆహారం ఎలా వెతుక్కోవాలో, శతృవుల నుంచి ఎలా తప్పించుకోవాలో, సాటి కుక్కలతో దెబ్బలాడి అన్నం ఎలా సంపాదించుకోవాలో తెలీక చాలా కష్టపడేది. కానీ నాతో స్నేహం కుదిరాక మాత్రం తెలివయినది కావటం మూలాన అన్నీ చాలా తొందరగానే నేర్చుకుంది.

                 పింకీ కి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, మాంసం కూర అన్నా కూడా. నాలాగ ఏది పడితే అది తినేది కాదు. ఒక సారి నా అదృష్టం బాగుండి కోడిపిల్ల దొరికింది. దాని మెడ కొరికి చంపి తింటున్నాను. అది చూసి పింకీ కి నా మీద కోపమొచ్చింది. అంత చిన్న కోడి పిల్లని ఎందుకు చంపావని నన్ను తిట్టింది. తనకి కోపం రావటం అదే మొదటిసారి చూడటం. పింకి కి మనుషులతో సహవాసం వల్ల కొంచెం సున్నితత్వం, నాజూకుతనం కూడా అలవాటయ్యింది. నాకు ఆకలి తప్ప ఇంకేమీ తెలీదు. కానీ తర్వాత పింకీ కూడా నెమ్మది నెమ్మదిగా నా సహవాసం వల్లనో పరిస్థితుల వల్లనో తెలీదు గానీ ఆకలి తీరటానికి ఏదో ఒకటి కడుపులో వేసుకోవటం నేర్చుకుంది. ఒక్కోసారి ఇద్దరం వెన్నెల రాత్రుళ్ళు కాలువ గట్టు మీద ఈ పక్క నిద్ర గన్నేరు చెట్టు దగ్గరనుంచి ఆ పక్క బాదం చెట్టు వరకూ పరుగు పందాలు పెట్టుకుని ఊరికే తెగ పరుగులుపెట్టేవాళ్ళం. మధ్యలో కాలువ దాటటానికి మనుషులు అడ్డంగా వేసుకున్న తాటి పట్టెల మీద గబ గబా పరుగెట్టటం తెలీక అన్ని సార్లూ పింకీనే ఓడిపోయేది, అంత చిన్న పట్టె మీద వేగం గా ఎలా పరుగెడుతున్నానా అని నన్ను ఆశ్చర్యంతోనూ, ఆరాధనతోనూ చూసేది. పింకీ నన్ను అలా చూడటం నాకు ఎంతో నచ్చింది. అప్పటినుంచీ తన కోసమే కొన్ని కొన్ని కొత్త సాహసాలు కూడా చేసేవాడిని. తర్వాత కొన్ని రోజులకే పింకీ ని ఆ నాలుగు చక్రాల బండి వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. నేను మాత్రం ఎలాగో తప్పించుకుని పారిపోయాను. నాలాంటి వీరుడు, ధైర్య వంతుడు తోడు ఉన్నాడన్న నమ్మకంతో పూర్తిగా నా మీద ఆధారపడ్డ పింకీని నా కళ్ళ ముందే రెండు చేతుల మనుషులు తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. పింకి నా కన్నా ముందు పోవటం కూడా మంచిదే అయ్యింది. లేకపోతే ఈ రోజు నా చావు చూసి నన్ను ఖచ్చితంగా అసహ్యించుకొనేదే. అది భరించటం మాత్రం నాకు చావు కన్నా కష్టమయ్యేది.

                 పింకి పోయాక కొన్ని రోజుల వరకూ తనని మర్చిపోవటం కష్టంగా ఉండేది కానీ ఆ తర్వాత ఎండా కాలం వచ్చాక తినడానికి తిండి కాదు కదా తాగడానికి నీళ్ళు కూడా సరిగ్గా దొరికేవి కాదు. ఎందుకో తెలీదు గానీ అంత నిప్పుల గుండం లాంటి ఎండా కాలం నేను బుద్ధి ఎరిగాక ఎప్పుడూ చూడలేదు. ఆ ఆకలి బాథ తో తిండి కోసం వెతుకులాటలో పడి పింకి ని తొందరగానే మర్చిపోయాను. తినడానికి ఏమయినా దొరుకుతుందేమోనని మీ మనుషులు తినగా మిగిలినది బయట పారేసేచోటా, ఇంటింటికీ తిరిగి ఇంటి పెరట్లోనూ వాసన చూసుకుంటూ తిరిగేవాడిని. ఒక్కోసారి ఏమీ దొరక్కపోతే ఊరి చివర పంట బోదిలో మిగిలిన బురద నీళ్ళు తాగేవాడిని. ఒక రోజు, రెండు రోజులూ కాదు చాన్నాళ్ళు ఇలాగే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతికాను. నేను చచ్చి పడిపోయిన వీథిలో ఉండే ఒక తెల్ల జుట్టు మనిషి ప్రతి రోజూ భోజనానికి ముందు ఒక ముద్ద తీసి మా లాంటి నోరు లేని జీవుల కోసం పక్కన పెట్టేది. పగటి పూట ఆ ముద్దని నాకన్నా ముందు నా కాకి మిత్రులు చిందర బందర చేసి తినేసి వెళ్ళిపోయేవి. రాత్రి పూట మాత్రం అది నాకు దక్కేది. కొన్ని రోజులకి ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటం మొదలయ్యింది. ఇంకొన్నాళ్ళు ఓపిక పడితే తిండి, నీళ్ళు దొరికి మళ్ళీ మామూలు రోజులు వస్తాయన్న ఆశ మొదలయింది. సరిగ్గా అప్పుడే ఓ రోజు ఆ తెల్ల జుట్టు మనిషి పాడెక్కింది. అప్పటినుంచీ ఆ ముద్ద కూడా కరువయ్యింది. ఇక నాకు చావు దగ్గర పడిందని ఖాయం చేసుకుని బతుకు వెళ్ళదీస్తుండగా ఒక రోజు ఒక అథ్భుతం జరిగింది. ఆ తెల్ల జుట్టు మనిషి చనిపోయిన పదకొండో రోజు పెద్ద కర్మ జరుగుతుంది ఆ ఇంట్లో. ఆ రోజు చాలా రకాల పిండి వంటలు, మాంసం వండి వడ్డిస్తూ పెద్ద కర్మ చాలా గొప్పగా చేస్తున్నారు. ఆ వంటల వాసనలు నా ముక్కుకి తగిలి ఎక్కడో అగాథం లో దాక్కున్న నా ఆకలిని మొత్తం బయటికి లాక్కొచ్చాయి. ఒక్కొక్కరూ తినగా మిగిలిన వంటకాలతో సహా విస్తరాకులు ఆ ఇంటి ముందు ఆరు బయట పడుతున్నాయి. ఆ క్షణం నా కంటికి తిండీ, కడుపుకి ఆకలీ తప్ప మిగిలినవి ఏవీ అనుభవం లోకి రావటం మానేసింది. పింకీ కూడా నాతో ఉంటే బాగుండుననిపించింది కానీ, మామూలుగా ఈ సమయం లో నాతో దెబ్బలాటకొచ్చే బలమయిన నా తోటి మిత్రులు అందరినీ ఆ నాలుగు చక్రాల బండి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవటంతో ఇంక నాకు పోటీనే లేకుండా పోయింది. కంటికి కనిపించిందీ, నోటికి అందినదీ మహా ఆబగా తినటం మొదలెట్టాను. అంత ఏకాగ్రతతో ఇప్పటివరకూ నా జీవిఏతం లో ఏ పనీ చేసి ఉండను. కేవలం తినటం, తినటం. అలా తినటం మొదలుపెట్టి ఎంత సమయం గడిచిందో కూడా గమనించలేదు కానీ కొంతసేపటికి ఇంచు మించు గొంతుదాకా తిన్నట్టు మాత్రం తెలిసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి, నా గొంతుకి ఏదో అడ్డం పడినట్టు అయ్యింది. నాకు కళ్ళు బైర్లు కమ్మి, శ్వాస ఆడక, ఊపిరి ఆగి నేల మీద థబ్బుమని పడినంత పనయ్యింది. నాకేమయ్యిందో ఏమీ అర్ధం కాలేదు కానీ కొంత సేపటికి ఇద్దరు మనుషులు నా కాలికి తాడు కట్టి ఒక తాటాకు మీదకి లాక్కొచ్చి ఈడ్చుకు వెళ్ళి ఊరవతల కాలువగట్టు మీద నేను, పింకి ఇదివరకు ఆడుకున్న నిద్రగన్నేరు చెట్టుకింద పడేసి వెళ్ళిపోతూ "ఆశపోతు కుక్కలా ఉందిరా, కడుపు పట్టనంత తినీ, తినీ ఎక్కువయ్యి చచ్చింది." అని చెప్పుకుని నవ్వుకోవటం మాత్రం నాకు తెలిసింది. అప్పుడే నేను చనిపోయానన్న విషయం నాకు అర్ధమయింది.

                 నేను ఆశపోతుని అన్న మాట నా తోటి జంతువులు అని ఉంటే నేను బాథ పడే వాడిని కాదు. ఆకలితో చనిపోతాననుకున్న నేను అత్యాశకి పోయి, తిండి ఎక్కువయ్యి చనిపోవటం నిజంగా మా జాతికి నేను తెచ్చిన కళంకం. కానీ మనుషుల చేత ఆ మాట అనిపించుకోవటం నాకు బాథాకరం. ఈ భూమ్మీద మిమ్మల్ని మించిన దురాశాపరులు ఎవరుంటారు? మీరు కేవలం మీ ఒక్కరి కోసమే కాదు. మీ ముందు తరాలు కూడా అనుభవించగలిగిన ఆస్థులు కూడబెట్టుకుని భద్రమయిన జీవితం గడపగలగటానికి సరిపడా దురాశ, అనైతికత, స్వార్ధం, పక్షపాతం మీకు పుట్టుకతోనే వస్తాయి. ఇంకా ఆ అపరాథ భావన నుంచి మీరు వేసుకున్న థర్మ మార్గం మిమ్మల్ని కాపాడుతుంది. మేము థర్మం తప్పే ప్రసక్తే లేదు. అసలు ఆ అవకాశమే లేదు కాబట్టి మాకు ప్రత్యేకమయిన థర్మ మార్గాలతోను, మతం తోను పనిలేదు. మిమ్మలని మించిన పరాన్న భుక్కులు సృష్టిలో లేరు. ప్రకృతిని ధ్వంసం చెయ్యటం మీ జీవితంలో ఒక భాగం. అసలు, ప్రకృతికి వికృతి మనుషులే. "మనుషులకి సత్యం తో పని లేదు. ఎప్పుడూ అలవిమాలిన రాగ ద్వేషాలతో కూడిన మత్తులోనే బతుకుతార"ని మా అమ్మ చెప్పింది. మీరు చేస్తున్న అంతులేని అన్వేషణ అంతా మీ మూసుకున్న కళ్ళు తెరుచుకోవటానికి మీరు చేస్తున్న ప్రయత్నమే. అలాంటి వాటితో మాకు పనిలేదు. మేమెప్పుడూ మెలకువతోనే ఉంటాం. మీకు ఉన్న జ్ఞానం లోనే మీ అజ్ఞానం కూడా దాక్కుని ఉంది. మాకు జ్ఞానం తో పని లేదు కాబట్టి మేము అజ్ఞానులమయ్యే అవకాశమే లేదు. అందుకే మీరు ఎన్ని ఆరాథనలు చేసినా ఆ దేవుడికి మీకన్నా మాలాంటి మూగ జీవులంటేనే ఎక్కువ ఇష్టమని కూడా మా అమ్మ చెప్పింది. ఇది మాత్రం దేవ రహస్యం, ఎవరికీ తెలీదని చెప్పింది. ముఖ్యంగా బుథ్థిబలంతో గర్వం తలకెక్కిన మనుషులకి.  "

Saturday, May 4, 2019

అబద్ధం, మోసం, కుతంత్రం - 2


- మొదటి భాగం



4. - శ్రమ దోపిడి

                  శ్రమ దోపిడి గురించి మొదటిసారి కార్ల్ మార్క్స్ తన 'పెట్టుబడి ' గ్రంధంలో వివరించి చెప్పేవరకు అది రహస్యం గానే ఉండిపోయింది. దోపిడి అనేది వ్యవస్థ లో ఒక భాగం. దోపిడి లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ లేకుండా దోపిడి కూడా లేదు. శ్రమ దోపిడీ అనేది భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల లోని మోసపు విధానం. ఏవో కొన్ని దేశాలు మాత్రమే ధనిక దేశాలు కావటం, కొంత మంది మాత్రమే ధనవంతులు కావటం అనేది శ్రమ దోపిడీ వల్లనే జరుగుతుంది. దీనినే స్థూలంగా 'గొయ్యి లేకుండా గొప్పు లేదు.' అని చెప్పవచ్చు. ఎవరో ఒకరు నష్ట పోకుండా మరొకరికి లాభం ఎన్నటికీ రాదు. ఒక దేశం విలాసవంతంగా సుసంపన్నంగా ఉంది అంటే ఎక్కడో మరో దేశం ఆకలితో అల్లాడుతుందని అర్ధం. ఇది ఒక్కోసారి ప్రత్యక్షంగాను మరో సారి పరోక్షం గాను జరుగుతుంది.

                  అమెరికా అత్యంత ధనిక దేశంగా మనగలగటం కోసం ప్రపంచంలో మరెన్నో దేశాలని తన కుతంత్రాలతో దయనీయ స్థితికి దిగజార్చింది. తమ దేశంలోని బట్టల మిల్లులు, కోకోకోలా కంపెనీల కోసం ఆఫ్రికా దేశాలను బలవంతంగా పత్తి, చెరకు పంటలను పండించటానికే పరిమితం చేసి అక్కడి ఆహార పంటలను దెబ్బతీసి పేదరికంలోకి నెట్టివేసింది. అమెరికా ధనిక దేశం కావటానికి అక్కడ అమలు చేయబడుతున్న పెట్టుబడి దారీ విధానమే కారణం. పెట్టుబడిదారీ దేశాలు వినియోగ దారులు కలిగిన దేశాలను, శ్రమ చేయగలిగిన మానవ వనరులు కలిగిన దేశాలను తమలో తాము పంచుకుంటాయి. ప్రస్తుతం భారతదేశం కూడా అలా పంచుకోబడ్డ దేశాలలో ఒకటి.



                  అయితే పెట్టుబడి దారునికి అంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది ? పెట్టుబడి దారుడు తన దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడి గా పెట్టి ఒక వస్తువుని ఉత్పత్తి చేసి దానిని మార్కెట్లో అమ్మి లాభాలు పొందుతాడు. మార్కెట్లో కంపెనీల మధ్య నెలకొన్న తీవ్రమయిన పోటీని దృష్టి లో పెట్టుకుంటే వినియోగదారుడు వస్తువుని దానికి సమానమయిన విలువగల డబ్బుని ఇచ్చి చౌకగా కొనటానికి మాత్రమే ఇష్ట పడతాడు. అంటే వినియోగదారుడి నుండి పెట్టుబడి దారునికి లాభం రాదు. మరి ఈ లాభం అతనికి ఎక్కడి నుండి వస్తుంది ? అతను తన దగ్గర పని చేసిన పనివాళ్ళకి ఇచ్చే జీతం లో కోత పెట్టటం ద్వారా మాత్రమే లాభం పొందుతాడు. అంటే విజయవంతమయిన ఏ వ్యాపారస్థుడూ తన పని వాళ్ళకి లేదా ఉద్యోగస్థులకీ ఎప్పటికీ వారి శ్రమకి తగిన పూర్తి ఫలితాన్ని చెల్లించడు. దీనినే మరోలా చెప్పుకోవాలంటే పెట్టుబడి దారుడు ఎక్కువ పని గంటలు పనిచేసే కార్మికులని ఎంత తక్కువ జీతానికి పనిలో పెట్టుకోగలిగితే అతని లాభాలు అంత పెరుగుతాయి.

                  పెట్టుబడిదారుడు తనకి వచ్చిన లాభాలని తిరిగి పెట్టుబడిగా పెట్టి మరిన్ని లాభాలని పొందుతాడు. ఇది ఒక చక్రం లాగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పెట్టుబడిదారుడు కొన్ని సంవత్సరాలలోనే మరింత డబ్బున్నవాడిగా తయారవుతాడు. అతనికి ఇదొక వ్యసనం అవుతుంది. శ్రామికుడు మాత్రం తన పరిమిత ఆదాయంలో ఖర్చులకి పోగా మిగిలిన కొంత మొత్తాన్ని భవిష్యత్ అత్యవసరాలకి పొదుపు చేసుకోవటంతో సంతృప్తిపడతాడు. అంటే వ్యాపారస్థుడి జీవితం డబ్బుతో మొదలయ్యి తిరిగి ఎక్కువ డబ్బు పొందటంతో ముగుస్తుంది. కానీ శ్రామికుడి జీవితం శ్రమతో మొదలయ్యి డబ్బు ఖర్చుపెట్టటంతో ముగుస్తుంది. అంటే ఎక్కువ కష్టపడే వారికి తక్కువ డబ్బులు. తక్కువ కష్ట పడే వారికి ఎక్కువ డబ్బులు. దీనినే మరోలా చెప్పుకోవాలంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వాడు ఎప్పుడూ తక్కువ కష్ట పడటానికే ఇష్టపడతాడు.



                  ముందునుంచీ వ్యాపారాన్ని నమ్ముకున్న మార్వాడీ, వైశ్య కులాలు ధనిక వర్గాలుగానే ఉంటూ వచ్చాయి. వ్యవసాయం, వృత్తి పనులు, ఉద్యోగాలు మీద ఆధారపడే కులాలు మాత్రం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాయి. ఒక వర్గం ధనిక వర్గం కావాలంటే అది పెట్టుబడి దారీ వ్యవస్థలోకి ప్రవేశించాలి. అయితే అందరూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే మరి మోసే వాళ్ళు ఎవరు ? అందుకే వ్యాపార వర్గాలు మరియు కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది. ఈ పోటీని తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే ఇందులో విజయవంతం కాగలుగుతారు. ఈ పోటీ ధరలను అదుపులో ఉంచటం లో కూడా సహాయపడుతుంది.

                  పెట్టుబడి దారీ వ్యవస్థలో మొదటి తరం పెట్టుబడిదారులకి పెట్టుబడి డబ్బు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటి తరం పెట్టుబడి దారులు రాజ వంశాలు, భూస్వాముల కుటుంబాలకి చెందినవాళ్ళు లేదా అలాంటివాళ్ళ సంపదలని దోపిడీ చేసినవాళ్ళు అయి ఉండాలి. ఇదంతా ఒకప్పుడు ప్రజలని పన్నుల పేరుతోను, యుధ్ధాలలోను దోచుకున్నదే. పిరమిడ్లు, తాజ్ మహల్, చార్మినార్ లాంటి గొప్ప కట్టడాలు అన్నీ శ్రామికులను, ప్రజలను పీడించగా వచ్చిన డబ్బు తో కట్టినవే. యూరోపియన్ల పెట్టుబడి మూల ధనం కూడా వివిధ దేశాల సంపదను కుతంత్రంతో దోచుకోవటం ద్వారా సంపాదించినదే.

5. - దుష్ప్రచారం

                  సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన, చేస్తున్న, చేయబోతున్న కుతంత్రాలలో దుష్ప్రచారం ముఖ్యమయినది. చరిత్రలో దీనిని పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా ఉపయోగించినది హిట్లర్ మంత్రి మండలి లో ప్రచార వ్యవహారాల మంత్రిగా పనిచేసిన జోసెఫ్ గోబెల్స్. తన తప్పుడు ప్రచారపు వ్యూహాల ద్వారా హిట్లర్ చేసిన అన్ని ఆకృత్యాలను గొప్ప పనులుగా ప్రజల దృష్టిలో చిత్రీకరించగలిగాడు. 'ఒకే అబధ్ధాన్ని వెయ్యి సార్లు చెపితే అది నిజమవుతుంది.' అన్న ప్రసిధ్ధ సూక్తి ఇతనిదే. ఒక అబధ్ధాన్ని ఒకడు చెపితే అది అబధ్ధం అవుతుంది. అదే అబధ్ధాన్ని పది వేల మంది పది సంవత్సరాల పాటు చెపితే అది నమ్మకమవుతుంది. కొన్ని తరాలపాటు చెపితే మూఢ నమ్మకమవుతుంది. అందులో నిజం లేదని తెలిసినా, ఏమాత్రం వ్యతిరేకించలేని బలహీనతకి మనిషి లోనవుతాడు. పిల్లి ఎదురయితే అపశకునం అనే మూఢ నమ్మకం ఇందుకు ఉదాహరణ. మనిషి జీవితం, నాగరికత కూడా ఇలాంటి అబధ్ధపు నమ్మకాల మీదే నిర్మించబడింది. కుల, మత పరంగా కరుడు గట్టిన ఆలోచనలు, సంఘంలో హోదా, మానవ సంబంధాలను మించి డబ్బుకి ఇచ్చే అతి విలువ లాంటివి కూడా మూఢనమ్మకాలకు ప్రతి రూపాలు. వీటి నుండి బయట పడటం మనిషికి దాదాపు అసాధ్యం. వంద మంది ఉన్న గుంపులో 98 మంది ఒక అబధ్ధాన్ని నిజమని బలంగా నమ్మితే, మిగిలిన ఇద్దరికీ అది అబధ్ధమని తెలిసినా కూడా ఆ 98 మందితో ఏకీభవించక తప్పదు. ఎందుకంటే అబధ్ధమయినా కూడా సామాజికంగా ఎక్కువమంది చేత అంగాకరించబడే విషయానికే ఎప్పుడూ పరిస్థితులు అనుకూలంగా మలచబడతాయి. ఎంతయినా మూఢ నమ్మకం కూడా ఒక బలమయిన నమ్మకమే.

                  ఈ విధమయిన తప్పుడు నమ్మకాలని,వార్తలని వ్యాప్తి చేసి ప్రజలు తమకి అనుకూలంగా ఆలోచించేలా చేయటం దుష్ప్రచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఒక అధ్యయనం ప్రకారం మనం ప్రతిరోజూ చూసే వార్తా పత్రికలు, టీవీ చానళ్ళు, సోషల్ మీడియా లోని వార్తలు 90 % అబధ్ధమే. దుష్ప్రచారం నిజాన్ని మాత్రమే కాదు. మనిషి ఆలోచనని కూడా చంపేస్తుంది. దుష్ప్రచారంలో ఆరి తేరిన వారు సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అయితే ఇది ప్రజల అమాయకత్వపు స్థాయి మీద ఆధారపడుతుంది. ప్రజలు ఎంత అజ్ఞానులు అయితే దుష్ప్రచారం అంతగా విజయవంత మవుతుంది. ఈ విధమయిన ప్రచారాన్ని అడ్డుకుని నిజాన్ని తెలియ చెప్పే వారు లేకపోతే ఇంకా విజృంభిస్తుంది. అందుకే ఒకసారి దుష్ప్రచారం ద్వారా పరిస్థితులని అనుకూలంగా మలుచుకున్న వాళ్ళు దాన్ని వ్యతిరేకించే వాళ్ళని నిర్మూలించటానికి ఎప్పుడూ వెనుకాడరు. దేశాలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి శతృదేశాల మీద దుష్ప్రచారం చెయ్యటం అనేది రాజనీతిలో ఒక భాగం. పరస్పర అవసరాల కోసము, మత కుల వర్గ పరంగాను విడిపోయిన ప్రస్తుత సమాజంలో సత్యం తెలుసుకోవటానికి ప్రయత్నించటం అంటే గడ్డి వాములో సూది కోసం వెతకటం లాంటిదే.

                  నిజానికి ఎక్కువ మందికి సొంతంగా ఆలోచించే ఓపిక, తీరిక ఉండదు. ఎవరయినా చెపితే గుడ్డిగా విని అనుసరించాలనే చూస్తారు. తప్పుడు ప్రచారాలు విజయవంతం కావటానికి ఇది కూడా ఒక కారణం. ఇవి ఒకరి నుంచి నలుగురికి, నలుగురి నుంచి పది మందికి, పది మంది నుంచి పాతిక మందికి పాతిక నుంచి వంద మందికి ఇలా చాలా వేగంగా పాకి పోతాయి. ఎంత పెద్ద అబధ్ధమయితే అంత త్వరగా వ్యాపిస్తుంది. ప్రజలని ఉద్వేగ పరిచేవి, వారికి ఏదో అపాయం కలుగుతుంది అనిపించేవి, హింసాత్మక మయినవి, అద్భుతం అనిపించేవీ త్వరగా వ్యాపిస్తాయి.



ఉగ్రవాదం మతపరమయిన మూఢ దుష్ప్రచారపు ఫలితమే. దుష్ప్రచారం ద్వారా వ్యూహ కర్తలు త్రిశంకు లోకాన్ని సృష్టించగలరు. గుడ్డిగా వీటిని నమ్మే అజ్ఞానులు ఎక్కువగా ఉన్న సమాజం చివరికి మూర్ఖుల స్వర్గంగానే తయారవుతుంది. దుష్ప్రచారాలను నిజమని నమ్మటం వల్ల వాస్తవాలను అర్ధం చేసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని, చివరికి దుష్ఫలితాలు పొందే ప్రమాదం ఉంది.

                  ఒకరి దుష్ప్రచారాలని మరొకరు తిప్పికొట్టటం కోసం ప్రస్తుత రాజకీయాలలో ప్రతి పార్టీకి సొంత ప్రచార మాధ్యమాలు ఉండటం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒకరకంగా ఇది ప్రజలకి మంచిదే, దీని వల్ల తప్పుడు ప్రచారం అనేది ఏక పక్షం గా కాకుండా అన్ని పక్షాల మంచి చెడులు బయటికి వస్తాయి. అతిగా ప్రచారం చేయటం కూడా దుష్ప్రచారమే అవుతుంది. దీనిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో వ్యాపార సంస్థలు ముందుంటాయి. అవి పదే పదే చూపించే వాణిజ్య ప్రకటనలు మనుషులలో వస్తువ్యామోహాన్ని పెంచుతాయి. అనవసరమయిన సరుకులను కూడా కొని నిలువ చేసే తత్వాన్ని, వస్తువు యొక్క ఉపయోగంతో సంబంధం లేకుండా హోదా కోసం సరుకులను కొనే తత్వాన్ని నూరి పోస్తాయి. చాలా సార్లు వాణిజ్య ప్రకటనలలో చూపించే నాణ్యతకి, సరుకు యొక్క వాస్తవ నాణ్యతకీ సంబంధం ఉండదు. అవసరమయితే కంపెనీలు తమ బడ్జెట్ లో 40% వరకూ కేవలం మార్కెటింగ్ కోసమే ఖర్చుపెడతాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగం లో దుష్ప్రచారానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే సమయం లో దానిని తిప్పికొట్టటానికి కూడా సోషల్ మీడియానే మంచి ఉపకరణంగా పనికొస్తుంది.



మొత్తంగా చూస్తే తప్పుడు ప్రచారం చెయ్యటానికి అనుసరించే కొన్ని పధ్ధతులు ఈ విధంగా ఉంటాయి.

• వాస్తవానికి పూర్తి విరుధ్ధంగా చెప్పటం.
• అనుకూలమయిన విషయాన్ని గురించి అధికంగా చెప్పి అననుకూలమయిన దానిని
  గురించి తక్కువగా చెప్పటం.
• ఒకరి విషయం లో జరిగిన దానిని మరొకరికి జరిగినట్టు చెప్పటం.
• ఒక చోట జరిగినది మరొక చోట జరిగినట్టు చెప్పటం.
• ఒక సమయం లో జరిగినది మరొక సమయంలో జరిగినట్టు చెప్పటం.
నమ్మే వరకూ పదే పదే ఒకే విషయాన్ని చెప్పటం.
• పూర్తిగా కట్టుకథలు సృష్టించటం.
• తప్పుడు ఉత్తరాలు, ఫోటోలు, వీడియోలు సృష్టించటం.
• తప్పుడు లెక్కలు చెప్పటం.
లేని ప్రాముఖ్యతను ఆపాదించటం.
• పరిస్థితులకి భయపడి నిజాలను బయటపెట్టకుండా తప్పుడు భావాలు ప్రకటించటం
  ద్వారా తప్పుడు ప్రచారానికి కారణం కావటం.
• నిజం చుట్టూ అబధ్ధాలు కల్పించటం.
• భయపడే విధంగా ప్రచారం చేసి నమ్మించటం.
• కుల, మత, జాతి పరమయిన భావోద్వేగాలను రెచ్చగొట్టటం.
చరిత్రను వక్రీకరించటం.
• ఒకేసారి కాకుండా పథకం ప్రకారం కొంచెం కొంచెంగా దుష్ప్రచారాన్ని కొనసాగించటం.

ఉద్దేశ్యపూర్వకంగా కానీ, సరదాకి కానీ బంధు మిత్రుల మధ్య, పనిచేసే చోట చెప్పుకునే చాడీలు, పుకార్లు కూడా దుష్ప్రచారాలు గానే భావించాలి.

(ఇంకా ఉంది...)