Monday, August 12, 2013

ఆగస్టు పదిహేను, న్యూటన్ చక్రం,...

జంధ్యాల గారి సినిమా లో కామెడీ లాగా
బాల్యం ఎప్పుడు గుర్తు చేసుకున్నా కొత్తగానే ఉంటుంది.
నా చిన్నప్పుడు మా బళ్ళో రెండు చెక్క బీరువాలు ఉండేవి.
అందులో ఒకదాని మీద  "ప్రయోగ శాల" అనీ,
ఇంకో దాని మీద "గ్రంధాలయం" అనీ రాసి ఉండేది.
ఆ పేర్ల లోని గాంభీర్యం చూసి అందులో ఏముందో
తెలుసుకోవాలని మా పిల్లకాయలందరికీ తెగ ఉత్కంఠ.
నిజం చెప్పాలంటే అది మా సైన్సు మాస్టారు మాత్రమే
విప్పి చెప్పగలిగిన ఒక పెద్ద పొడుపు కథ.
ఆయనే ఒక అమావాస్య రోజున ఆ రెండు బీరువాలూ తెరిచి
వాటిల్లోంచి ఒక న్యూటన్ చక్రం, నాలుగు చందమామ పుస్తకాలు
బయటికి తీసి అందరికీ కనిపించేలాగ టేబులు మీద పెట్టి
న్యూటన్ చక్రం గిర్రుమని తిప్పి ఒక్క తెల్ల రంగులోనే
ఏడు రంగులూ ఎలా కలిసుంటాయో చూపించారు.
ఆ విచిత్రం చూసి మా వాళ్ళందరికీ చిటారు కొమ్మన
మిఠాయి పొట్లం చేతికొచ్చినంత ఆనందమయిపోయింది.
నాకు మాత్రం మనం కూడా ఇలాంటి చక్రమే ఏదో ఒకటి
కనిపెట్టెయ్యాలన్నంత ఆవేశమొచ్చేసింది.
ఆ రోజు మొదలయిన నా ప్రయత్నం ఆ తర్వాత
ముంజెకాయల బండి చక్రాలు మించి ముందుకెళ్ళలేదు.
అందుకే అప్పటి నుంచీ "అమావాస్య పూట ఏ పనీ
మొదలెట్టకూడద"ని చెప్పిన మా నాయనమ్మ మాట మీద
నమ్మకం ఎక్కువయ్యింది. కానీ ఇప్పటికీ నాకు మాత్రం
ఆ రెండు చెక్క బీరువాల ముందు మనకి తెలిసిన ఇస్రోలు,
సెంట్రల్ లైబ్రరీలూ కూడా దిగదుడుపే అనిపిస్తుంది.
ఇంకా,  ఆగస్టు పదిహేను రోజు చాక్లెట్లు తినేసి అటునుంచి అటే
"గ్యాంగ్ లీడర్" సినిమా చూసొచ్చి మనమే పెద్ద హీరో అయిపొయినట్టు.
దానికి తోడు ఆదివారం టీవీలో మాయ మంత్రాలు, కత్తి యుధ్ధాల
సినిమలొస్తే మన ఊహలకి రెక్కలొచ్చినట్టే.
పరీక్షల్లొ "ఇందీవరాక్షుని వృత్తాంతం" పాఠంలోని "అనినన్ గన్నులు జేవురింప..." పద్యం
మన దగ్గర కాపీ కొట్టిన నెల తక్కువ నారాయణ గాడు
ఆ తర్వాత ఐ ఐ టీ లో చదివి ఇప్పుడు పెద్ద పుడింగు.
చెప్పుకోవటానికి ఎంత గర్వంగా ఉంది.
దీపావళి కి రీలు తుపాకీ కోసం
మూడు రోజులు ముందునుంచీ, మూడు పూటలా ఏడుపే.
ఒక్కోసారి పెటేపుకాయ చెతిలోనే పేలిపోయేది.
మొట్ట మొదటిసారి చెట్టెక్కి గుత్తులు గుత్తులుగా
కోసుకుని తిన్న నేరేడుపళ్ళ రుచి ముందు
ఇప్పటి వాషింగ్టన్ యాపిల్స్ రుచి ఎంత.
మామిడి కాయలు దొంగతనం చేశామని ఊరంతా తెలిసిపోయి
పంచాయతీలో పెట్టి ఉరిశిక్ష వేసేస్తారేమో అని భయపడిపోయి
ఇల్లొదిలి పారిపోదామనుకుని, సాయంత్రం మళ్ళీ ఆకలేసి
ఇంటికెళ్ళిపోయినప్పుడు పడ్డ టెన్షను ముందు ఇప్పుడు మన బాసులు
ఇచ్చే డెడ్ లైన్ల టెన్షన్ ఒక లెక్కా.
ఎంత కఠిన హృదయుడయినా ఒక్కసారి
బాల్యం గుర్తు చేసుకుంటే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు.
"గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్" అన్నారు.
అదేం చిత్రమో, ఆ గత కాలం ఎప్పుడూ బాల్యం దగ్గరే ఆగిపోతుంది.
ఆ బాల్యం మన మనసు మీదికి ఎప్పుడు పాకినా, జిరాక్సు తీసిన జీవితానికి అలవాటుపడ్డ
మన ఖాళీ బుర్రల నిండా కొన్ని రంగుల నీడలు అలుముకుంటాయి.
అంతకన్నా ఏం కావాలి.
ఈ మాత్రం దానికి టైం మెషీన్ కనిపెట్టే వరకూ కూడా ఆగక్కర్లేదు.
ఒక్క సారి కళ్ళు మూసుకోండి చాలు.

Wednesday, August 7, 2013

తెలుగు పల్లకి

అమ్మపాలకి తోడ బుట్టువు, ఒక్క మాటలో తేనె బిందువు.
నోటి మాటకి అందమిచ్చిన రాజ భాష మన ఠీవి తెలుగు.
ఆరి పోనిది, అంతు లేనిది అమర భాష ఇది అమృతం.
ఊపిరుండిన, దేహముండిన తెలుగు మరచిన ఏమి సుఖం.

ఆది నన్నయ ఘంటము కదపగ, కృష్ణ రాయలు మురిసిన,
వేమన్న, పోతన్న శివమెత్తంగా, అన్నమయ్య పద కదము తొక్కగా,
కందుకూరి, గురజాడ, శ్రీరంగం శీనయ్య, తెలుగు పల్లకి మోయ బ్రౌనయ్య.
ఎంత మంది లేరు మునిగి తరియించగా ఇది తెలుగు గంగ.

ఆవకాయ ఘాటు, గోంగూరలో పులుపు,
పూర్ణాలలో తీపి, ఉలవ చారు ఊట తేట తెలుగు మాట.
అవధాన క్రతువులు, త్యాగరాయ క్రుతులు
మన భాష తనలోన కలిపేసుకోలేదా.
ఘన చరిత కలిగింది, రస భరితమయ్యింది.

జన భాష, మన భాష చక్కంగ పలకంగ
పలుకు పలుకుకు రాగ మాలికలు కాగ.
చిన్నోళ్ళు, పెద్దోళ్ళు  గర్వంగ గొంతెత్తి, చాటి చెప్పగ రండి.
యాస ఏదయిన, హొయలు పోవు భాష తెలుగు మాది.
తెలుగు వెలుగులున్న మాకు లేనిదేది, తెలుగు జాతి మాది, మాకు లేదు సాటి.

Friday, June 7, 2013

పిల్లల దొంగలు

ఎండా కాలం తర్వాత చినుకులు పడటం మొదలయ్యింది. పిల్లలకి వేసవి శెలవులు కూడా అయిపోయాయి. దాచి పెట్టుకున్న తాయిలాలేవో బయటికి తీసినట్టు మొన్నటిదాకా ఎండిపోయిన  చేల గట్లు, కాలవ గట్లు, చెట్లూ పచ్చగా అవుతున్నాయి. చేల నిండా నీళ్ళు నిండి పురుగు, పుట్ర, కప్పలు గోల చెయ్యటం మొదలెట్టాయి. బాతులు మేపుకుని బతికే బాతులోళ్ళు ఈ పురుగులు, నత్తలు తినే బాతుల్ని గుంపులు గుంపులుగా తోలుకొచ్చి కొత్తపల్లి పొలాల్లోనూ,  మా ఊరి పొలిమేర దాకా ఉన్న కొమ్మర పొలాల్లోనూ మేపుకుని వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే శెలవులకి, ఆటలకి అలవాటు పడ్డ పిల్లలందరూ బడి అయిపోగానే సాయంత్రం తొందరగా అన్నం తినేసి రాత్రి చీకటి పడేదాకా వీధి దీపాల వెలుగులో పెంకులాట, తొక్కుడు బిళ్ళ, రాముడు సీత, పంది మరుగు, దొంగా పోలీసు ఆడుకునేవాళ్ళు కానీ, ఈ మధ్యన మా ఊరి చుట్టుపక్కల ఊళ్ళళ్ళో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు తిరుగుతున్నారని తెలిసి చీకటి పడ్డాక చిన్న పిల్లల్ని బయటికి పంపటం మానేశారు ఊరి జనం. పిల్లలు అన్నం తినటానికి మారాం చేసినా, అల్లరి చేసినా, ఒంటి మీద గోచీ తప్ప ఏమీ లేకుండా చుట్టుపక్కల ఊళ్ళళ్ళో అడుక్కుంటూ తిరిగే మొండోడి కి ఇచ్చేస్తాననో, బ్రాహ్మల అబ్బాయి గారి చెరువు గట్టు మీద చింత చెట్టు మీద ఉండే ఒంటి కన్ను రాక్షసుడికి ఇచ్చేస్తాననో, పిల్లల్ని ఎత్తుకెళ్ళి పోయేవాళ్ళకి ఇచ్చేస్తాననో భయపెట్టే పెద్ద  వాళ్ళు,  నిజం గానే పిల్లల దొంగలు తిరుగుతున్నారని తెలిసి భయపడిపోయి ఉప్పు, ముగ్గు అమ్ముకునే వాళ్ళు, ఆడవాళ్ళు తల దువ్వుకున్నప్పుడు వచ్చే జుట్టు పోగు చేసి ఇస్తే బుడగలు ఇచ్చేవాళ్ళు, పాత ఇనుప ముక్కలకి వేరు శనగ పప్పు అచ్చులు ఇచ్చే వాళ్ళూ, ఇలా అమ్ముకోవాడానికి కూడా ఎవరొచ్చినా అనుమానంగా చూడటం మొదలెట్టారు. దానికి తోడు మొన్న పని మీద తాడేపల్లిగూడెం వెళ్ళి వచ్చేటప్పుడు బస్సులో "ఆకుతీగలపాడు లో అప్పారావు గారి రెండో పిల్లోడిని ఎవరో ఎత్తుకు పోయారని" చెప్పుకుంటుంటే విన్నానని చాకలి తిప్పడు చెప్పిన దగ్గర నుంచీ జనానికి అనుమానంతో పాటు భయం కూడా ఎక్కువయ్యింది.

              ఆ రోజు పొద్దున్నే వాయుగుండం పట్టిందని రేడియోలోవార్తల్లో వచ్చింది. డిగ్రీ మధ్యలో ఆపేసి పోలీసు డిపార్టుమెంటులో కానిస్టేబులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న రామయ్య గారి రాంబాబు పొలం వెళ్ళి  వర్షంలో తడుస్తూనే పొలానికి గట్టులంకలు వేసి,  భుజం మీద పార, గడ్డపార తో సాయంత్రం చీకటి పడుతుండగా ఇంటికొచ్చేటప్పుడు పుంత రోడ్డు దగ్గర ఒక మగ మనిషి, చంకలో చిన్న పిల్లాడితో ఒక ఆడ మనిషీ అనుమానంగా తిరుగుతుంటే దగ్గరికెళ్ళి మీరెవరని అడిగితే,  బాతులు మేపుకునే వాళ్ళమనీ,  దారి తప్పి వాళ్ళ మనుషుల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చామనీ భయం భయం గా చెప్పారు. వాళ్ళ వాలకం చూస్తుంటే రెండు రోజులనుంచీ స్నానం కూడా చేసినట్టు లేదు, చిన్న పిల్ల వాడు మాత్రం కడిగిన ముత్యంలా శుభ్రంగా కొత్త బట్టలతో ఉన్నాడు. వీళ్ళే ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళేమోనని రాంబాబుకి అనుమానమొచ్చి గట్టిగా అడిగితే, 
పిల్లవాడు కొడుకనీ, పక్కన ఉన్న మగ మనిషి తమ్ముడనీ ఈ రోజు పిల్లవాడి పుట్టిన రోజని తల స్నానం చేయించి కొత్త బట్టలేశామనీ చెప్పి సారా తాగకపోయినా, మామూలుగానే చింత నిప్పుల్లా ఉండే రాంబాబు కళ్ళు చూసి భయమేసి అక్కడి నునంచి గబగబా వెళ్ళి పోతుంటే  "బాతులోళ్ళు కూడా పుట్టిన రోజులు చేసుకుంటారా? అబధ్ధాలు చెప్పి తప్పించుకుని పారి పోదామనుకుంటున్నారా?" అని ఇద్దరినీ రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఊరి మధ్యన చెరువు గట్టు మీద వీధి దీపం వెలుగులో నిలువు కాళ్ళ మీద నుంచో బెట్టాడు.

                   రాంబాబు,  పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే దొంగల్ని పట్టుకుని లాక్కొచ్చాడని అర గంటలో ఊరంతా తెలిసిపోయింది.  ప్రెసిడెంటు రంగబాబు గారితో సహా ఊరి జనం అందరూ చెరువు గట్టు మీద వాళ్ళిద్దరి చుట్టూ మూగి "మీ ముఠా లో ఎంత మంది ఉన్నారు? ఇప్పటి దాకా ఏ ఏ ఊళ్ళల్లో ఎంత మందిని ఎత్తుకెళ్ళిపోయారు? మొన్న ఆకుతీగలపాడు లో పిల్లోడిని మాయం చేసింది కూడా మీరేనా? ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఎవరికయినా అమ్మేస్తున్నారా? లేకపోతే కాళ్ళూ చేతులూ విరగ్గొట్టి ముష్టెత్తుకు రమ్మంటున్నారా?" అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే,  కీచురాళ్ళ అరుపులతో పాటు మనుషుల అరుపులు కూడా కలిసిపోయాయి. ఊరి మొత్తానికి ఒకే ఒక ఫోను ఉన్న ధాన్యం వ్యాపారం చేసే నారాయణ మూర్తి గారి ఇంట్లోంచి గణపవరం పోలీస్ స్టేషన్ కి ఫోను చేస్తే,  గాలి వానకి వైర్లు తెగిపోయి ఫోను పని చెయ్యలేదు. వాళ్ళు మాత్రం మేము అలాంటి  వాళ్ళం కాదని నెత్తీ, నోరూ కొట్టుకుని మొత్తుకుంటుంటే,  ఇలా అడిగితే చెప్పరని రాంబాబు మగ మనిషిని లాక్కెళ్ళి చెట్టు మొదట్లో ఎర్ర చీమల పుట్ట ఉన్న కుంకుడు కాయ చెట్టుకి కట్టేసి, ఆడ మనిషి దగ్గర చంకలో పిల్ల వాడిని లాక్కుని  ఆవిడ రెండు చేతులూ నులక తాడు తో కట్టి పచ్చి తాటి కమ్మ తీసుకుని ఇద్దరినీ చితక బాదేశాడు. నరశింహం గారయితే ఇలాంటి వాళ్ళని బతకనివ్వ కూడదని కిరసనాయిలు డబ్బా తీసుకొచ్చేస్తే వాళ్ళమ్మ గారు "తెల్లారాక పోలీసులొచ్చి చూసుకుంటార"ని చెప్పి బలవంతంగా ఆపారు కాబట్టి సరిపోయింది కానీ లేక పోతే అప్పుడే వాళ్ళిద్దరికీ భూమ్మీద నూకలు తీరిపోయేవి.  ప్రెసిడెంటు రంగ బాబు గారు,  ఇలాంటి కరుడు గట్టిన దొంగల ముఠా వాళ్ళని పట్టుకున్నందుకు రాంబాబుని మెచ్చుకుని తణుకు లో యస్.ఐ. గా పని చేస్తున్న వాళ్ళ బావమరిదికి చెప్పి రికమండేషన్ చేసి రాంబాబుకు కానిస్టేబులు ఉద్యోగం వచ్చేలా చేస్తానన్నారు. 

            ఆ రాత్రి దొంగలిద్దరికీ పచ్చి మంచి నీళ్ళు కూడా ఎవరూ ఇవ్వలేదు. కానీ, వాన చినుకులు మాత్రం పడుతూనే ఉన్నాయి. రాత్రంతా చీకట్లో పచ్చగడ్డిలో దాక్కుని అరిచిన కప్పలు  తెల్లారి వర్షం తగ్గాక బయటకొచ్చి కళ్ళు  పైకెత్తి అటూ, ఇటూ చూస్తున్నాయి. పంచాయితీ లో మెంబరు గా ఉన్న యేసుపాదం సైకిలేసుకెళ్ళి గణపవరం పోలీస్ స్టేషన్ లో విషయం చెప్పి అర్జెంటుగా రమ్మంటే ఇద్దరు పోలీసులు టీవీయస్ మీద వచ్చి ఆ దొంగలిద్దరికీ కట్లు తీసి ఆరా తీశాక చెప్పింది ఏమిటంటే, వాళ్ళు నిజంగానే బాతులు మేపుకునే వాళ్ళేననీ, ఆ బాబు ఆవిడ సొంత కొడుకనీ, రాత్రి బాగా పొద్దు పోయాక ఈ ఆడమనిషి భర్త, బంధువులు వీళ్ళకోసం వెతుక్కుంటూ వచ్చి స్టేషన్ లో కూడా వాకబు చేసుకుని వెళ్ళారనీ, అసలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు లేరనీ, అదంతా పుకారు తప్ప ఇప్పటి వరకూ ఈ తాలూకాలో ఎక్కడా పిల్లలు తప్పిపోయినట్టు ఒక్క కంప్లయింటు కూడా రాలేదనీని. అసలు విషయం తెలిశాక, ఆ పిల్ల వాడిని వాళ్ళకి ఇచ్చేసి, వెలుగులో సరిగ్గా చూస్తే వాడు అచ్చం వాళ్ళ అమ్మ పోలికలతోనే ఉన్నాడని చెఫ్పుకుని, అకారణంగా కొట్టి హింసించామని పశ్చాత్తాపంతో ఊరి జనమూ, ఊరికి మొనగాడనిపించుకుందామనుకుంటే అలా జరగనందుకు రాంబాబూ చాలా భాధ పడ్డారు.

             అదీ కాక తాను చితక బాదేసిన ఆ ఇద్దరికీ ఏమయినా అయితే పోలీసులొచ్చి పట్టుకెళ్ళిపోతారని భయంతోనో, లేకపోతే బాతులోళ్ళ బంధువొలొచ్చి కక్ష్య తీర్చుకుంటారన్న భయంతోనో తెలీదు గానీ, పోలీసు అవుతాడనుకున్న రాంబాబు దొంగలాగా బంధువుల ఊరు జంగారెడ్డిగూడెం పారిపోయి మళ్ళీ మూడు నెలల వరకూ ఊళ్ళో ఎక్కడా కనిపించలేదు.

Tuesday, May 21, 2013

'ధర్మ' సందేహం

2012 మే నెల.
మాయన్ లు చెప్పిన యుగాంతానికి ఇంక ఏడు నెలలు ఉందనగా..
ఎండ మండిపోతుంది.
అదీ సాయంత్రం పూట కూడా.
బహుశా నలభై అయిదు డిగ్రీలు ఉంటుందేమో?
ఈ వేడి సాయంత్రం ఒక స్నేహితుడిని కలవటానికి బయలుదేరాను.
ఇక్కడ ఎర్రగడ్డలో బస్సెక్కి కూకట్ పల్లి వెళ్ళాలి.
బస్సు/ఆటో కోసం ఎదురు చూస్తున్నాను.
గొంతు తడారిపోతుంది.
ఇంత వేడి ఈ మధ్య కాలం లో ఎప్పుడూ చూడలేదు.
నిజంగానే దీనంతటికీ కారణం "గ్లోబల్ వార్మింగేనా?"
పొదుపుని, పంచుకోవటాన్ని పక్కన పెట్టేసి Use and Throw ని ప్రోత్సహించి ప్రపంచాన్నే పెద్ద Super Market చేసి కాలుష్యాన్ని పెంచిన అమెరికా నా? చైనానా? అసలు దీనంతటికీ మూల కారణమయిన పారిశ్రామిక విప్లవమా? దానికి కారణమయిన మనిషి కనిపెట్టిన ఆవిరి యంత్రమా? సైన్సా?  నరుక్కునే కొమ్మ మీద కూర్చోవాలని ఎవరూ అనుకోరు కాబట్టి మనిషికి ప్రకృతిని నాశనం చెయ్యటం తప్పనపుడు ఆ ప్రకృతికి దూరంగా జరగటం కూడా అనివార్యం. ముందు ముందు మనుషులు గాలి, నీరు, ఆహారం కూడా అవసరం లేని కృత్రిమ జీవులుగా తమని తాము మార్చేసుకుంటారేమో అన్న భయం కూడా నాలో మొదలయ్యింది. రిచర్డ్ ఫెన్మెన్ చెప్పినట్టు "సైన్స్ అనేది తాళం చెవి లాంటిది. దాంతో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారలూ తెరుచుకుంటాయి."
కానీ నరక ద్వారానికి అయస్కాంత శక్తి కూడా ఉన్నట్టుంది.
నా పక్కన ఒక ముష్టి వాడున్నాడు.
వాడికి కుష్ఠు వ్యాధి కూడా ఉన్నట్టుంది.
ముందు ఒక చిరిగిన గుడ్డ పరుచుకుని కూర్చున్నాడు.
రామాయణ కాలంలో శ్రీ రాముడు పరిపాలించినప్పుడు నెలకి మూడు వానలతో, అతివృష్టి అనావృష్టి రహితంగా, పాడి పంటలతో సుఖ సంతోషాలతో రామరాజ్యం వర్ధిల్లిందని విన్నాను. ఇప్పుడు కూడా అలాంటి శ్రీ రామ రాజ్యం సాకారమవ్వాలని కోరుకుని నేనెప్పుడూ అత్యాశకి పోలేదు కానీ, వాజపేయి ప్రభుత్వం లో జాతీయ రహదారులన్నీ నాలుగు లేన్లు గా అభివృధ్ధి చేస్తునారని తెలిసినప్పుడు, ముందు ముందు భారత దేశం ఆర్ధికంగా అన్ని అగ్ర దేశాలనీ అధిగమిస్తుందని పేపర్లలో చదివినప్పుడు, చంద్రబాబు నాయుడిని బిల్ క్లింటన్ మెచ్చుకున్నప్పుడు, మన ప్రధాని ప్రసంగ పాఠాన్ని ఒబామా చెవులు రిక్కించి వింటూ మన్మోహన్ సింగ్ ని ఆరాధనగా చూసినప్పుడూ పేదరికం లేని, ముష్టి వాళ్ళు లేని దేశాన్ని ముందు ముందు చూడబోతున్నానన్న నమ్మకం పెరుగుతూ వచ్చింది. హరిత విప్లవం గురించి విన్నప్పుడు ఆహార కొరత ఉండదనుకున్నాను కానీ,  మన తాత ముత్తాతలు అతి సాధారణం గా తిన్న సహజమయిన ఆహారాన్ని,  ఇప్పుడు ఖరీదయిన ఆర్గానిక్ ఆహారం గా డబ్బున్నవాళ్ళకే పరిమితం చేసి,  పురుగుమందులు నిండిన తిండిని మనకే ఎక్కువరేటు కి అమ్ముతారనుకోలేదు. శ్వేత విప్లవం గురించి విన్నప్పుడు కనీసం చిన్న పిల్లలకయినా సమృధ్ధిగా పాలు దొరుకుతాయనుకున్నాను కానీ, అందులో అరవై శాతం రసాయనాలు నిండిన కల్తీ పాలే ఉంటాయనుకోలేదు. ఒకప్పటి కన్నా ఇప్పటి హైదరాబాదు లోనే ముష్టి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు.
నాకు దాహం ఎక్కువయ్యింది.
నా పక్కనున్న ముష్టి వాడు ధర్మం కోసం నన్నేమయినా అడుగుతాడేమోనని ఎదురు చూశాను కానీ, ఏమీ అడక్కుండా వాడి లోకం లో వాడున్నాడు. నా లాంటి వాళ్ళు కాకపోతే ఈ ముష్ఠి వాళ్ళ గురించి ఇంకెవరు పట్టించుకోవాలి? మనం లేకపోతే వీళ్ళెలా బతకాలి?  ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ, అలా మనం కట్టిని ట్యాక్సులే రాజకీయనాయకులు కుంభకోణాల్లో కుమ్ముకుంటుంటే నోరు మూసుకుని చూస్తూ కూర్చోవటమే కాకుండా, అదే వార్తల్ని మళ్ళీ నాలుగు రూపాయలు పెట్టి పేపరు కొనుక్కుని మరీ చదువుతున్నాం. అలాంటిది ఈ ముష్టి వాడు అడిగినా, అడగక పోయినా ఒక రెండు రూపాయలు ధర్మం చేయటంలో తప్పులేదనిపించింది. అంతకన్నా ఎక్కువగానే ఏదో ఒకటి చెయ్యాలనిపించింది. ఇప్పుడే బయటికి వచ్చిన నాకే ఇంత దాహంగా ఉంటే పాపం ఉదయం నుంచీ ఇక్కడే ఉన్న ఇతనికి ఇంకెంత దాహంగా ఉండాలి. (అదేంటో మనం కష్టాల్లో ఉన్నప్పుడే మనకి అందరి కష్టాలూ గుర్తుకొస్తాయి, లేకపోతే మనలాగే అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లుతున్నారనుకుంటాం. బహుశా ఇది మానవ నైజం అనుకుంట.)
దూరంగా చెరుకు రసం అమ్మేవాడు కనిపిస్తున్నాడు.
ఇంత ఎండలో తాగడానికి ఏమయినా ఇస్తే కాదనే మానవమాత్రుడు ఎవడు ఉంటాడు.? అందుకే ఆ చెరుకురసం వాడి దగ్గరకెళ్ళి, నేనొకటి తాగి, ప్లాస్టిక్ పాత్రలో ఆ ముష్టి వాడి కోసం ఇంకొకటి తీసుకుని అతడికి ఇవ్వటానికి వెళ్తున్నాను. నేను చెయ్యబోయే ఈ చిన్న మంచి పనిని చూసి అక్కడ నా చుట్టూ ఉండే వాళ్ళు నన్ను జాలి దయ పుష్కలంగా ఉన్న ఒక మంచి మనిషిగా గుర్తిస్తారనుకున్నప్పుడు నాకు కలిగే ఆనందాన్ని తలుచుకుని నా మనసు ఇప్పుడే పులకరిస్తోంది. (నేను నిజం గా అంత దయార్ద్ర హృదయుడినే అయితే నేననుకున్న బిచ్చగాళ్ళు లేని భారత దేశం ఇంకా సాకారమవ్వ నందుకు ఈ సమయం లో నేను భాధ పడాలి.)
ఇంక నాలుగయిదు అడుగుల్లో ఆ ముష్టి వాడిని చేరుకోబోతున్నాననగా
వాడు దర్జాగా ఒక బీడీ బయటకి తీసి వెలిగించుకోవటం నా కంటబడింది.
కేవలం వేష భాషలలో తప్ప, ఇప్పటి వరకూ నేను చూసిన ఏ శ్రీమంతుడి లోనూ అంత పరిపూర్ణమయిన రాజసం నాకు కనపడలేదు. మాయన్ లు చెప్పిన యుగాంతం నిజంగా ఇప్పటికిప్పుడే వచ్చినా తనకి వచ్చేదీ, పోయీదీ ఏమీ లేదు అన్నంత నిర్లక్ష్యం అతని కళ్ళల్లో ఉంది.
నా అడుగులు ఒక్కసారిగా అక్కడితో ఆగిపోయాయి.
నేను ఈ పానీయం దానం చేసేటప్పుడు కూడా కృతజ్ఞతకి బదులు ఇదే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, నేను భరించలేను.
ఈ పరిస్థితుల్లో కనుక నేను వాడికి ఈ పానీయం దానం చేస్తే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను గొప్పగా కనిపించటం అటుంచి, రాజు గారికి పరిచర్యలు చేస్తున్న సేవకుడి లాగా కనిపిస్తాను. నన్ను ఒక వెర్రిబాగుల వాడి లాగా అనుకుని నవ్వుకోవచ్చు కూడా.
ఇప్పుడేం చేయాలి?
ఎవరేమనుకుంటే ఏంటి?
మనం చెయ్యాలనుకున్నది చేసెయ్యొచ్చు కదా?
కాని అంతకు మించిన వేరే ఏదో కారణం కోసం నా మనసు వెతుకుతుంది.
ఇప్పుడు ఇది వాడికి ఇవ్వటానికి నా అహం అడ్డొస్తుంది. మన సొంత డబ్బుతో మనం ఎన్ని భోగాలయినా అనుభవించవచ్చు. కానీ వీడు మాత్రం అందరూ దయ తలచి ధర్మం చేసిన డబ్బులతో దర్జాగా బీడీలు కాల్చుకుంటున్నాడు. (ఇప్పుడు నాకు ఒకప్పుడు మా పదో తరగతి సోషల్ మాస్టారు చెప్పిన ఒక మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే "ఈ ప్రపంచంలో మనిషి తినే ప్రతి ముద్ద, మరొకడి దగ్గర లాక్కుని తింటున్నదే" అని.)
ఎవరికి తెలుసు "పుష్పక విమానం" సినిమాలో పి.యల్.నారాయణ లాగ వీడి దగ్గర కూడా వాడి ముందు పరుచుకున్న గుడ్డ కింద బోలెడు డబ్బులున్నాయేమో? ఈ మధ్య నా స్నేహితుడు పంపిన ఒక ఈమెయిల్ లో మహా నగరాల్లో బిచ్చగాళ్ళు చాలా మంది లక్షాధికారులనీ, వాళ్ళ ఆదాయం సాఫ్టువేరు ఇంజినీరు ఆదాయం కన్నా కూడా ఎక్కువే ఉంటుందని లెక్కలతో సహా ఉంది. వీడు కూడా అలాంటివాడేనేమో?
ఇప్పుడేం చెయ్యాలి?
ఇలాంటి అయోమయ పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ నాకు ఎదురు పడలేదు.
చిన్నప్పుడు మూడో తరగతి కాపీ పుస్తకం లో "మానవ సేవే మాధవ సేవ" అని పది సార్లు రాశాను కదా అందుకోసమయినా దానం చెయ్యనా?
పోనీ మొన్న పంతులు గారు కనిపించి "ఇరవై ఒక్క వారాలు ప్రతీ శని వారం బిచ్చగాళ్ళకి ధర్మం చేస్తే నాకు ఉన్న కష్టాలు పోయి ముందు ముందు బాగా కలిసొస్తుందని" చెప్పారు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది, దాని కోసమయినా దానం చెయ్యనా ?
పోనీ పుణ్యం కోసం?
కాకపోతే స్వర్గం కోసం?
మోక్షం కోసం?
మరో మంచి జన్మ కోసం?
మనశ్శాంతి కోసం?
అయినా ఇలాంటి అయోగ్యుడయిన బిచ్చగాడి కి చేసే దానం వల్ల నేను అనుకున్న ఫలితం సిధ్ధిస్తుందా? లేదా?
ఎంతయినా వాడు రోగిష్టి  బిచ్చగాడు. మన కళ్ళ ముందు ఒక బీడీ కాల్చినంత మాత్రాన మహాపరాధం ఏమీ చెయ్యలేదు కదా?  బహుశా వాడికి జీవితం లో మిగిలిన ఒకేఒక ఆనందం ఈ బీడీనే కావచ్చు. అయితే మాత్రం, వాడొక ముష్టి వాడు.  ఎంత పొగరు కాకపోతే నా లాంటి దాన కర్ణుల ముందు కూడా బిచ్చం అడుక్కోకుండా వాడి పాటికి వాడు బీడీ కాల్చుకుంటూ కూర్చుంటాడు?
ఇది నిజం గానే వాడు చేస్తున్న అధర్మం కాదా ?
దేశం లో ఉన్న ముష్టి వాళ్ళందరూ వీడి లాగానే తయారయితే మన లాంటి వాళ్ళందరూ మనశ్శాంతి గా ఎలా బతకాలి?
అందుకే కార్ల్ మార్క్స్ "బలవంతులు బలహీనుల కోసం ఏం చేసినా ఊరికే చెయ్యర" ని ఊరికే చెప్పలేదనుకుంట.
నేను చేసే ధర్మం వాడిని ఉధ్ధరించటానికా ?
నన్ను నేను ఉధ్ధరించుకోవటానికా?
అసలు ఈ ప్రపంచం లో మనిషికీ, మనిషికీ మధ్య అన్ని అసమానతలూ, అసూయా ద్వేషాలనూ మించిన ఆత్మ సంబంధం ఏదయినా ఉందా? లేదా?
ఉండే ఉంటుంది. బహుశా ఆ నమ్మకం తోనే వాడు అడుక్కుంటూ కూడా బీడీ కాల్చుకోగలుగుతున్నాడేమో? లేదా? దాన ధర్మాల ద్వారా పేరు ప్రఖ్యాతులనీ, పాప ప్రక్షాళననీ, మనశ్శాంతినీ కావాలనుకునే నా లాంటి వాళ్ళు ఎలాగూ వాడిని వెతుక్కుంటూ వస్తారన్న నమ్మకమేమో?
అయినా ఒక ముష్టి వాడికి చేసే ఇంత చిన్న ధర్మం కోసం ఇంతగా ఆలోచించాలా?
ఏమీ ఆశించకుండా ఏమీ చెయ్యలేమా?(ఇది కూడా మానవ నైజమే అనుకుంట)
ఇంతకీ నేను ధర్మం చెయ్యాలా? వద్దా?
అహాన్ని అధిగమించి ఆ అత్మ సంబంధాన్ని నా మనసు ఒప్పుకుంటుందా?లేదా?
అలా ఒప్పుకోలేకపోవటానికి కారణాలేంటి?
అంతా అయోమయంగా ఉంది.
ఏం చెయ్యాలో  ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.

Wednesday, May 15, 2013

చివరి మనుషులు

ఈ మధ్య ఊరెళ్ళి వచ్చాను.
ఆకు పచ్చని పొలాలన్నీ చేపల చెరువులయిపోయాయి.
మంచి నీళ్ళ చెరువేమో మురుగు కాలవయిపోయింది.
రైతులందరూ కూలీలయ్యారు.
కూలీలందరూ మహా నగరానికి వలస వెళ్ళి పోయారు.
చదువుకున్న వాళ్ళందరూ ఇంజినీర్లయిపోయారు.
చదువు లేని వాళ్ళు అప్పు చేసి ఖతరో, కువైటో వెళ్ళి, నానా
కష్టాలూ పడి చేసిన అప్పు తీర్చి
ఇంక పడలేక ఉత్త చేతుల్తో మళ్ళీ ఊరొచ్చేశారు.
కప్పల బెక బెక లూ, గాలి వాటమూ కనిపెట్టి, వాన రాకడ అంచనా వెయ్య గలిగిన రామయ్య తాతకి పక్ష వాతమొచ్చి మూలన పడి,  ప్రాణం పోకడ కోసం ఎదురు చూస్తున్నాడు.
క్యాలండర్ చూడకపోయినా తిధులు, అమావాస్యలు, పౌర్ణమిలు, పండుగలు
చెప్పేసే సూరమ్మ చచ్చి పోయిందని తెలిసింది.
రోజూ ఇంత అన్నం పెడితే చాలు విఠలాచార్యకి కూడా తెలియని కధలన్నీ
ఏడు రాత్రులు ఏడు పగళ్ళూ గుక్క తిప్పు కోకుండా చెప్పగలిగిన
పళ్ళ వీరన్న కూడా పైకెళ్ళిపోయాడు.
రేపో మాపో అన్నట్టు ఉన్న చాకలి ముసలి మామ్మ
వీధిలో కనిపించి "నువ్వు పుట్టినప్పుడు ఆరునెలలు వచ్చేవరకూ
నేనే నీకు ఒళ్ళు తోమి స్నానం చేయించేదాన్న"ని గుర్తు చేసి మురిసిపోయి,
"ఓ యాభై రూపాయలుంటే ఇవ్వు బాబా నాలుగు లంక పొగాకు
చుట్టపీకలు కొనుక్కుంటా" అని అడిగింది, జేబులో వంద ఉంటే తీసి ఇచ్చేశాను.
ముందు దండం పెట్టి తర్వాత ముద్దు పెట్టుకుంది.
మనిషి దగ్గర చుట్ట కంపు వస్తుంది కానీ మనసు మాత్రం
పుట్టినప్పుడు ఎంత స్వచ్చంగా వుందో ఇప్పుడూ అలాగే ఉన్నట్టనిపించింది.
నారాయుడు తాత అయితే ఆధార్ కార్డు, తెల్ల కార్డు బయటికి తీసుకొచ్చి చూపించి,
"ఇదుంటే చాలు రా మనవడా నెలకి రెండొందల పింఛను, రూపాయికే కిలో బియ్యం
వస్తాయి" అని ప్రపంచం లో ఏ సమస్యకయినా బ్రహ్మాస్త్రం తన దగ్గరే ఉన్నంత ధీమా గా చెప్పాడు.
ఎంత అల్ప సంతోషులు? ఒక బిల్ గేట్స్ గురించి తెలీదు, ఒక ఒబామా గురించి తెలీదు,
యోగా, ధ్యానం, ఐ-ఫోన్, అబధ్ధం ఇవేమీ తెలీదు.
ఇప్పటి వరకూ మనం గ్రైండర్ లు వచ్చాక రుబ్బు రోళ్ళు, పురుగు మందులొచ్చాక పిచ్చుకలు,
జనారణ్యాలు వచ్చాక  పులులే అంతమయిపోతున్నాయనుకున్నాం
కానీ, ఇలాంటి మనుషులు కూడా ముందు ముందు మనం చూద్దామన్నా కనిపించక పోవచ్చు.
వీళ్ళతోపాటే కొన్ని కధలు, మాటలు, పాటలు, కొన్ని భావోద్వేగాలు అంతమైపోతాయి.
మాయన్ లు చెప్పింది యుగాంతం గురించి కాదనుకుంట.
ఇలాంటి "మనుషుల" యుగం అంతం గురించే అనుకుంట.
మనమే తప్పుగా అర్ధం చేసుకున్నాం.
కానీ ఇలాంటి "మనుషుల" ని భర్తీ చేసే మనుషులు మాత్రం మళ్ళీ రారు
పోతే పోనీ, ఏం చేస్తాం ఎంతయినా వేగము = దూరము/కాలం.

Monday, April 15, 2013

ఆ అమ్మాయి

ఆదిలక్ష్మి మళ్ళీ ఊరొచ్చేసిందని చెప్పుకోవటం మొదలెట్టారు ఓ రోజు పొద్దున్నే మా ఊరి జనం.

             రెండు రోజుల క్రితం రాత్రి ఫిబ్రవరి నెల చలికి ఆగలేక, ఎత్తుపళ్ళ వీరన్న చుట్టు గుడిసె దగ్గర నారాయుడు తాతతో కలిసి చలి మంట వేసుకుంటుంటే, గని రాజు గారి దొడ్లో పాతరలోనుంచి లాక్కొచ్చిన తేగలు కాల్చుకోవటానికి మా పక్కకొచ్చి కూర్చున్న అంజి గాడు, అంతకు ముందు రోజు పని మీద రాజమండ్రి వెళ్ళి వచ్చేటప్పుడు నిడదవోలు బస్టాండు దగ్గర ఆదిలక్ష్మి ని చూసి మాట్లాడననీ,  ఈ మధ్యనే చనిపోయిన వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యల గురించీ, ఆదిలక్ష్మి ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు కోపం తో రగిలిపోయిన ఊరి జనం గురించీ, ముఖ్యంగా ఆదిలక్ష్మి అదృష్టానికి అసూయతో కడుపు మండి ఆ రోజు ఊళ్ళో చాలా మంది ఆడవాళ్ళు అన్నం కూడా తినలేదని చెప్పాననీ రహస్యంగా మాతో చెప్పాడు.

           మా ఊరి బడి కి దగ్గర లో,  ఒకప్పుడు ఆదిలక్ష్మి వాళ్ళు ఉండే ఇల్లు ఇప్పుడు కూలిపోవటానికి సిద్ధంగా ఉంటే,  అప్పల నర్సమ్మ వాళ్ళు గేదుల్ని కట్టేసుకుంటున్నారు అందులో. ఆ ఇంటి చూరు కింద చిన్న అరుగు మీద కూర్చున్న ఆది లక్ష్మి ని చూడటానికి ఒక్కొక్కళ్ళు వచ్చి వెళ్తున్నారు ఊళ్ళో జనం. మనిషికి తగ్గ పేరు పెట్టు కుందని ఒకప్పుడు అందరూ చెప్పుకున్న ఆదిలక్ష్మి, వేసవి కాలం మా ఊరి కాలవ గట్టు మీద గడ్డి మొక్కల మధ్య రోహిణీ కార్తె ఎండలకి నీళ్ళు లేక మట్టిగొట్టుకు పోయి వాడిపోయిన తులసి మొక్కలా కనిపిస్తుందిప్పుడు. కళ్ళు పీక్కుపోయి బాగా లోతుకెళ్ళిపోయి ఉన్నాయి. అసలు ఈ అమ్మాయి అంత చిన్న చిన్న కళ్ళతో ఎలా చూడగలదా? అనిపిస్తుంది ఇప్పుడు ఆదిలక్ష్మి ని కొత్తగా చూసినవాళ్ళెవరికయినా,  కానీ ఇదివరకయితే మాత్రం ఆదిలక్ష్మి కళ్ళు చూసి అంత విశాలమయిన కళ్ళు చూడాలంటే మన రెండు కళ్ళూ సరిపోవేమో అనిపించేది.  మనిషి అంత రంగు లేకపోయినా,  ఆదిలక్ష్మి ని చూసిన ఎవరయినా,  ఇంత అందమయిన అమ్మాయిని ఈ చుట్టు పక్కల ఊళ్ళళ్ళో ఎక్కడా చూడ లేదని చెప్పేవారు కానీ,  ఎందుకంత అందం గా ఉంటుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోయే వాళ్ళు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరిని చూసినా పసిపాప లా నవ్వే స్వచ్చమయిన నవ్వే ఆ అమ్మాయి అందమని కొంతమందంటే, కాదు నవ్వు కన్నా నవ్వినప్పుడు ఆ అమ్మాయి కళ్ళు ఇంకా అందంగా ఉంటాయని ఇంకొంతమంది అనేవారు. ఓ సారి ఆదిలక్ష్మి  వాళ్ళ తాతకి కూలి డబ్బులు ఇవ్వలేదని మేస్త్రి పంజా వెంకటేశులు మీదకి ఆదిలక్ష్మి దెబ్బలాటకెళ్ళి కళ్ళెర్రచేస్తే భయపడిపోయి, డబ్బులిచ్చేసిన వెంకటేశులు మాత్రం అప్పట్నుంచీ ఆ అమ్మాయి కళ్ళు చూస్తే భయమని చెప్పేవాడు.  ఊళ్ళో అందరికీ జాతకాలు, ముహూర్తాలు చూసే బ్రాహ్మల అబ్బాయి గారి ఆచారి గారు మాత్రం ఆదిలక్ష్మి అదేదో నక్షత్రం లో పుట్టిందనీ, ఆ నక్షత్రం లో పుట్టిన వాళ్ళు తప్ప ఇంకెవరూ అంత అందం గా ఉండలేరనీ అన్నారొకసారి .

          ఇదివరకయితే ఊరి జనానికి విన సొంపయిన మువ్వల శబ్దం వినపడాలంటే రెండే రెండు సందర్భాలు. అంత పెద్ద మైసూరు ఎద్దులకి దిష్టి తగలకుండా,  మెడలో వెంట్రుకలతో చేసిన తాడుకి మువ్వలు కట్టి  బండి మీద దాళ్వా, సార్వా ల్లో పంట చేతికి రాగానే పొలాల్లోంచి, మిల్లులోకి ధాన్యం తోలడానికి పెద్ది రాజు బండి కట్టినప్పుడు ఒకసారి, సన్నని నడుము కింద వరకూ వున్న ,ఇంత లావు పొడుగు జడకి జడ గంటలు తోను, కాళ్ళకి మువ్వల పట్టీలతోను, ఉగాది పండగ రోజు ఇంటింటికీ ఉగాది పచ్చడి పంచిపెడుతూనో, ప్రతీ సంవత్సరం సంక్రాంతి వెళ్ళగానే మా ఊరి గ్రామ దేవత కప్పాలమ్మ కి జరిగే జాతర లో మొక్కు తీర్చుకున్న అరటి గెలల్లోని అరటిపళ్ళు అందరికీ పంచిపెడుతూనో ఆదిలక్ష్మి చలాకీగా ఊరంతా తిరిగినప్పుడు ఇంకోసారి.

          అరుగు మీద కూర్చుని,  చూడటానికొచ్చిన జనం అడిగే ప్రశ్నలన్నిటికీ పొడి పొడి గా సమాధానాలు చెబుతున్న ఆదిలక్ష్మి కి మధ్యాహ్నం భోజనం సమయానికి అప్పల నరసమ్మ కోడి గుడ్డు పులుసు కూరతో అన్నం తీసుకొచ్చి పెడితే, సరిగ్గా కడుపు నిండా భోజనం చేసి చానాళ్ళు అవటం వల్లనో, ఊరి భోజనం ఇంతకాలానికి తింటున్నామన్న ఆనందం వల్లనో తెలీదు గానీ గబ గబా, ఆబగా తినేసింది. అసలు ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మా, నాన్న ఉండేది కొల్లేరు దగ్గరలో అడవి కొలను అనే ఊళ్ళో. ఆదిలక్ష్మి కి అయిదేళ్ళు వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నా ట్రాక్టర్ మీద పొలం పనులు కి వెళ్ళేటప్పుడు ట్రాక్టరు తిరగబడిపోయి చనిపోయాక,  మా ఊళ్ళో ఉండే అమ్మమ్మా, తాతయ్యా  ఆదిలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే అప్పట్నుంచీ మా ఊళ్ళో చాలా మంది ఆదిలక్ష్మి ని వాళ్ళ సొంత ఇంట్లో పిల్లాలాగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆదిలక్ష్మికి పెళ్ళి వయసొచ్చాక మంచి సంబంధం చూసి చేసేద్దామని అందరూ అనుకునే సమయానికి, విదేశాలకి రొయ్యలు, చేపలు ఎగుమతి చెయ్యటానికి వ్యాపారం కోసం మా ఊరి చుట్టుపక్కల పెద్ద రైతుల దగ్గర చెరువుల్లో పెంచే చేపలు, రొయ్యలు కొనడానికి పెద్ద కారేసుకుని అప్పుడప్పుడూ మా ఊరొచ్చే రాంపండు, ఆదిలక్ష్మిని చూసి తనతో వస్తే పెళ్ళి చేసుకుంటానంటే,  తెలిస్తే వద్దంటారని ఊళ్ళోను, ఇంట్లోను ఎవరితోనూ చెప్పకుండా రాంపండు తో వెళ్ళిపోయింది.

             అలా వెళ్ళిపోయాక ఆదిలక్ష్మిని రాంపండు పెళ్ళి చేసుకోలేదు గానీ, బెంగుళూరు, హైదరాబాదు లాంటి చాలా ఊళ్ళన్నీ తిప్పి కొన్నాళ్ళకి ఆ అమ్మాయిని చావగొట్టి బయటికి గెంటేసి,  వాళ్ళకి తగిన సంబంధం చూసుకుని పెళ్ళిచేసుకున్నాడని, ఆ రోజు అరుగు మీద కూర్చుని ఆదిలక్ష్మి చెపితేనే మా ఊరి జనమందరికీ తెలిసింది. ఆ తర్వాత మొహం చెల్లక ఊరికి మళ్ళీ మొహం చూపించని ఆదిలక్ష్మి,  మళ్ళీ ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు కానీ,  తిరిగొచ్చిన ఆదిలక్ష్మి ఇప్పుడయినా ఊళ్ళో ఉండిపోతుందేమో అనుకున్నారు ఊరి జనం.

            కానీ ఆదిలక్ష్మి మాత్రం అదే రోజు సాయంత్రం చీకటి పడుతుండగా ఎంతమంది చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ వెలగపల్లి రోడ్డు దగ్గర కనిపించిన అంజిగాడితో "తినడానికి కూడా లేకపోవటం ఒక్కటే దౌర్భాగ్యం కాదు, అన్నీ ఉన్నా, మనతో పాటు కలిసి కూర్చుని తినటానికి ఎవరూ లేకపోవటం కూడా దౌర్భాగ్యమే, ఇప్పుడు నా దగ్గర రెండూ లేవు.  ఒకప్పుడు వాళ్ళు పెట్టింది తిని పెరిగిన నేను అంత గొప్పింటికి వెళ్ళిపోయాననుకుని అసూయతో కడుపు మండిన చాలా మంది ఊరి జనానికి, ఇప్పటి నా పరిస్థితి చూశాకయినా మనశ్శాంతి కలుగుతుందేమోనని" మళ్ళీ ఊరొచ్చానని చెప్పి,  వెళ్తూ వెళ్తూ చీకట్లో కలిసిపోయింది ఆదిలక్ష్మి. అన్నట్టు ఆ రోజు కూడా ఆదిలక్ష్మి పరిస్థితి  చూసి కడుపు తరుక్కుపోయి ఊళ్ళో ఎవరూ అన్నం తినలేదు.

Friday, March 1, 2013

జిలాబా కల

                   బంగార్రాజు గారి చెరువుకి దగ్గరలో రోడ్డుకానుకుని పొలాల మధ్య పెద్ద మండువా లోగిలి పెంకుటింట్లొ ఉండేవాడు మా ఫ్రెండు బాలాజి. వాళ్ళ నాన్న మీసాల సత్యనారాయణ మా ఊళ్ళో ఓ మాదిరి పెద్ద రైతు. వాడు, నేను, మా కుమ్మరోళ్ళ ప్రసాదు ఊరి బళ్ళో ఐదో తరగతి దాకా కలిసి చదువుకున్నాం. బాలాజీ గాడు ఎక్కడ విన్నాడో ఏమో తెలీదు గానీ నా పేరు గోపి కాబట్టి గో.పి అంటే గోడ మీద పిల్లి అనీ, ప్రసాదు అంటే ప్రభుత్వ సారాయి దుకాణం అనీ మా ఇద్దరినీ బాగా వేళా కోళమాడి తెగ ఏడిపించేవాడు. దాంతో వాడి మీద మా ఇద్దరికీ పీకల్దాకా వచ్చేసి వాడిక్కూడా అలాంటి పేరే ఏదో ఒకటి పెట్టాలని తీవ్రం గా ఆలోచించి, చివరికి బాలాజి తిరగేస్తే జిలాబా కాబట్టి దాన్నే కొంచెం మార్చి వాణ్ణి జిలేబీ గాడనో జిలాబా గాడనో అందరి దగ్గరా ప్రచారం చేసి ఆనంద పడిపోయే వాళ్ళం. వాడి ఐదో తరగతి అయిపోయాక మాత్రం వాళ్ళ నాన్నకి ఎవరో "ఈ రోజుల్లో ఇంగ్లీషు మీడియం లో చదవకపోతే భవిష్యత్తు ఉండద"ని చెబితే భయపడిపోయి, ఆరో తరగతి నుంచీ మాత్రం తాడేపల్లిగూడెం లో బుజ్జి సారు గారి ఇంగ్లీషు మీడియం బళ్ళో చేర్పించేశారు. అప్పటి వరకూ బాగానే చడివేవాడు గానీ ఇంగ్లీషు మీడియం లో చేరాక  అటు తెలుగు పూర్తిగా రాక , ఇటు ఇంగ్లీషు అర్ధం కాక అన్నీ అత్తెసరు మార్కులతో పాసయ్యేవాడు.

                      మా అందరికీ బీయస్సీ చివరి సంవత్సరం పరీక్షలయిపోయాక,  ఓ రోజు వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం చెరువు గట్టు మీద నేరేడు చెట్టు నీడలో, పాత ప్రెసిడెంటు రంగ బాబు గారు వేయించిన సిమ్మెంటు బెంచీ మీద కూర్చుని, డిగ్రీలయిపోయాక ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటుంటే,  ఏమడిగినా సినిమా పాటల్లో సమాధానం చెప్పే మా ప్రసాదు గాడు గణపవరం లో ఏ ప్రైవేటు బళ్ళోనో పిల్లలకి లెక్కలు చెప్పుకుంటూ "పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్" అని వాడి జీవిత లక్ష్యాన్ని పాట లా పాడి వినిపించేశాడు. బాలాజీ గాడు మాత్రం ఎప్పుడూ మట్టి కొట్టుకుపోయిన ఈ పల్లెటూళ్ళో పడి ఉండటం కంటే ఏ ఎంసీఏ నో చదివి అమెరికా వెళ్ళి స్థిరపడాలన్న తన కల నెరవేరే వరకూ నిద్ర పోనని బెంచీ గుద్ది మరీ చెప్పేసరికి మేమెవ్వరం కలలో కూడా ఊహించ లేని దానిని చేస్తానని వాడు అంత నమ్మకం గా చెబుతుంటే, వాడి పట్టుదల చూసి ముచ్చటేసి "అదే జరిగితే మన ఊరి మొత్తానికి మొట్టమొదట విమానమెక్కి ప్రయాణం చేసింది నువ్వే అవుతావనీ, ఆ రోజు ఊరంతా నీ పేరు మారు మోగి పోతుంద"నీ వాడి భుజం తట్టి ప్రోత్సహించాం.

                  అనుకున్నట్టే బాలాజీ గాడికి ఇక్కడెక్కడా ఎంసీయే సీటు రాకపోయినా గానీ, చెన్నయ్ దగ్గర అదేదో ఊళ్ళో డొనేషన్ కట్టి మరీ చేరిపోయాడు. ఆ తర్వాత చదువయిపోయి హైదరాబాదు లో ఏదయినా పెద్ద సాఫ్ట్ వేరు కంపెనీ లో ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్ళిపోదామనుకునేసరికి బిన్ లాడెన్ అమెరికా మీద బాంబులేసేసి వస్తాయనుకున్న ఉద్యోగాలన్నీ వెనక్కెళ్ళి పోతే, బాలాజీ గాడు బెంగ తో మంచమెక్కినంత పని చేశాడు. "ఈ అమెరికా గొడవంతా వదిలేసి ఇక్కడే అందరిలాగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని అత్త కూతురి ని పెళ్ళి చేసుకుని తమతో పాటే ఉంటే చాల"ని వాళ్ళ అమ్మా నాన్నా ఎంత చెప్పినా వినకుండా ఎలాగయినా అమెరికా వెళ్ళి తీరతానని భీష్మిచుకుని కూర్చున్నాడు.

             సరిగ్గా అప్పుడే వాడి కోసం ఆ దేవుడే  పంపించినట్టు, వాడి తో పాటు ఎంసీయే చదివిన అత్తిలి రామారావు గారి చిన్నా వచ్చి,  హైదరాబాదు హైటెక్ సిటీ లో ఉండే "శ్రీ వెంకటేశ్వరా టెక్నాలాజికల్ కన్సల్ టెన్సీ సర్వీసెస్" సాఫ్ట్ వేరు కంపనీ వాళ్ళు ముందు యాభై వేలు కడితే ఉద్యోగమిచ్చి నెలకి ఏడు వేలు జీతమిచ్చి ఆరు నెలల తర్వాత పదిహేను వేలు చేసి, సంవత్సరం తిరక్కుండా అమెరికా కూడా పంపిస్తారని చెప్పి, రంగు రంగుల బ్రోచర్ ఒకటి చేతిలో పెడితే,  దెబ్బకి బాలాజీ లేచి కూర్చున్నాడు. "ఉద్యోగం ఇచ్చేవాడు మనకి జీతం ఇవ్వాలి గానీ, మన దగ్గర డబ్బులు తీసుకుని మనకే ఇస్తాడంటే ఇదేదో తిరకాసు లా ఉంది" రా అంటే "దేవుడి పేరు తో కంపెనీ పెట్టి మోసం చేస్తాడా?" అని ప్రశ్న, సమాధానం ఒకే ముక్కలో చెప్పేశాడు. ఏదేమయినా గానీ వాడి అమెరికా కల నెరవేరితే అదే చాలని హైదరాబాదు బస్సెక్కించేస్తే,  అమెరికా వెళ్ళిపోతున్నామన్న ఆనందం లో వాళ్ళిద్దరూ చెరొక యాభై వేలూ కట్టేసి  ఉద్యోగం లో చేరి పోయారు.

              హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ కాదు గానీ , దానికి దగ్గర లోనే ఓ చిన్న రెండంతస్తుల భవనం లో "శ్రీ వెంకటేశ్వరా టెక్నలాజికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్" లో ఓ నాలుగు నెలలు బాలాజీ ఉద్యోగం బాగానే సాగింది గానీ ఆ తర్వాత ఆ కంపనీ వాళ్ళే ఇలా చాలా మంది దగ్గర డబ్బులు తీసుకుని ఓ నాలుగైదు కోట్లు పోగయ్యాక బోర్డు తిప్పేసి కంపెనీ మూసేసి ఎటో పారి పోయారని ఓ రోజు రాత్రి తొమ్మిదింటికొచ్చే ఈటీవీ వార్తల్లో చెప్పారు.ఇప్పటికయినా ఇంటికొచ్చెయ్యమని వాళ్ళ అమ్మా , నాన్న ఫోను చేసి ఎంత చెప్పినా వినకుండా "ఎండ వస్తే దుమ్ము, వాన వస్తే బురద, ఈగల మోత, కరెంటు కోత, దోమలకి రక్త దానం తప్ప ఏమీ లేని ఆ ఊళ్ళో ఉండలేన"నీ అయినా "మొన్న కోఠి వెళ్ళినప్పుడు ఫుట్ పాత్ మీద చిలక జోస్యం చెప్పినోడు తనకి విదేశీ యోగం ఉందని బల్ల గుద్ది మరీ చెప్పాడ"నీ చెప్పే వాడు.

                చిలక జోస్యం తర్వాత బాలాజీ గాడికి నమ్మకం ఇంకా పెరిగి పోయి,  అమెరికా వెళ్ళాక ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడక పోతే బాగోదని, ట్యాంకు బండ దగ్గర రామకృష్ణ మఠం లో ఇంగ్లీషు కోర్సు అప్లికేషన్ కష్ట పడి సంపాదించి కోర్సు లో చేరి పోయాడు. ఆ తర్వాత నెల నెలా ఇంటి నుంచి డబ్బులు పంపమనటం ఇష్టం లేక అమీర్ పేట లో ఏదో చిన్న కంపెనీ లో నెలకి రెండు వేలు జీతానికి చేరిపోయి, సంవత్సరం తర్వాత సాఫ్టు వేరు ఊపందకున్నాక ఐబీయం లో ఉద్యోగం సంపాదించి మూడు నెలలు తిరక్కుండా అమెరికా వెళ్ళి స్థిరపడిపోయాడు. అప్పట్నుంచీ మా ఊళ్ళో చదువుకునే కుర్రాళ్ళందరికీ బాలాజీ గాడిని ఆదర్శం గా చూపించేవారు.

                 అమెరికాలో బాలాజీ తో పాటే పనిచేస్తూ ఎప్పుడూ ఏదో ఒక ఫిలాసఫీ మాట్లాడే హైదరాబాదు నుంచెళ్ళిన సూర్యం మాత్రం బాలాజీ గాడితో ఓ సారి పిచ్చా పాటీ మాట్లాడుతూ "వచ్చే సంవత్సరం ప్రోజెక్ట్ అయిపోగానే హాయిగా హైదరాబాదు వెళ్ళి పోయి అమ్మా నాన్నలతో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ పల్లెటూళ్ళో పుట్టి పెరిగినా గానీ, అత్త కూతురిని పెళ్ళి చేసుకుని ఓ పదిహేనేళ్ళ తర్వాత,  వచ్చిన డబ్బుతో అమ్మమ్మ గారి ఊరేళ్ళి పోయి చెరువు పక్కన పచ్చని పొలాల మధ్య పెద్ద మండువా లోగిలి పెంకుటిల్లు, నాలుగెకరాల పొలం, రెండు గేదులు కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ, ఆరు బయట చల్ల గాలి లొ పడుకుని పొద్దున్నే మెలకువ రాగానే ఆకాశం లో బారులు బారులు గా ఎగిరే కొంగలు లెక్క పెట్టుకుంటూ, ఇష్టమయిన పుస్తకాలు చదువుకుంటూ, కథలు, కవితలు రాసుకుంటూ ప్రశాంతం గా ఆ పల్లెటూళ్ళో కాలం గడిపేయ"టమే తన జీవితాశయమని చెప్పాడు. సూర్యం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు కూడా మా ఊరి దగ్గరలోనే ఉన్న లక్ష్మీ పురం.