Friday, March 13, 2020

రాజకీయ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల వెనుక అసలు కారణం (2:59 నిమిషాలు)




ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Friday, March 6, 2020

అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | కలుపుకోవటం | Assimilation




ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Friday, February 28, 2020

అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | విభజన



ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Monday, February 24, 2020

అందరు తెలుసుకోవలసిన 25 కుతంత్రాలు | పరిచయం



ఈ వీడియో కనుక మీకు నచ్చితే Like, Comment, Share. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ కి Subscribe అవ్వండి.

Saturday, January 11, 2020

మృతజీవుల మాతృభాష


                 అసలు ఆంధ్రులకి తెలుగు మీడియం కావాలా ? ఇంగ్లీషు మీడియం కావాలా ? అన్న విషయం గురించి మాట్లాడుకునే ముందు ఆంధ్రుల మనస్తత్వం గురించి కొంత మాట్లాడుకోవాలి. స్వాభావికం గా తమిళ, మరాఠీ, బెంగాలీ వారిలాగా ఆంథ్ర ప్రజలు స్వాభిమానం, సొంత ఆలోచన విధానం కలిగిన వారు కాదు. అనుకరణ వాదులు మాత్రమే. ఒక మనిషికి ఆత్మ ఉన్నట్టే, ఒక జాతికి కూడా తనకంటూ సొంత ఆత్మ ఉండాలి. కాని ఇప్పటి వరకూ ఆంధ్రా వాళ్ళు తమకంటూ ఒక సామూహిక సొంత భావజాలాన్ని, ముద్ర ని ఏర్పరుచుకోలేకపోయారు. కేంద్రం లో గానీ పక్క రాష్ట్రాలలో గానీ తెలుగు వారి మాటకి విలువ లేకపోవటానికి ఇదే అసలు కారణం. ఆంధ్రులు కష్ట పడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు మాత్రమే గానీ చురుకుగా పని చేసే వాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే డబ్బు వ్యామోహం, కుల తత్వం కలిగిన స్వార్ధ పూరిత బానిస మనస్తత్వమే ఆంధ్రుల ఆత్మ. ఇక్కడ ఎవరికీ ఎవరి మీదా నమ్మకం ఉండదు. కమ్మ వారికి రెడ్డి వారి మీద నమ్మకం ఉండదు. కాపు వారికి కమ్మ వారి మీద నమ్మకం ఉండదు. రాయల సీమ వారికి కోస్తా వారి మీద నమ్మకం ఉండదు. దళిత బహుజనులకి అగ్ర వర్ణాల మీద నమ్మకం ఉండదు. అగ్ర వర్ణాలకి దళిత బహుజనుల మీద నమ్మకం ఉండదు. గెలిపించిన నాయకుల మీద ప్రజలకి నమ్మకం ఉండదు. రాజకీయ నాయకులకి ప్రజల మీద నమ్మకం ఉండదు. విచిత్రంగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా కులతత్వం అనేది సోషల్ మీడియా ప్రభావం తో మరింత బలపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రాజకీయాలు గా లేవు. అవి ప్రతి సామాన్యుడి సొంత ఇంటి వ్యవహారాలుగా మారిపోయాయి. రాజకీయాలని రాజకీయాలుగా చూడగలిగిన ప్రజలు కలిగిన ప్రజాస్వామ్యం మాత్రమే నిజమయిన ప్రజాస్వామ్యం గా నిలబడగలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కులతత్వం, మతతత్వం తో పాటు విచ్చలవిడి ఉచిత సంక్షేమ పధకాలు కూడా రాజకీయాలని ప్రతి ఇంటి సొంత వ్యవహారంగా మార్చివేశాయి. ఈ విధమయిన ఆలోచనని కలిగించటమే మన ప్రజాస్వామ్యానికి ఉచిత సంక్షేమ పధకాలు చేస్తున్న అసలయిన నష్టం.

                 ఒక వస్తువుని కంటికి మరీ దగ్గరగా పెట్టుకుని చూస్తే మనకి ఆ వస్తువు గురించి ఏమీ అర్ధం కాదు. సరయిన దూరంలో చూస్తేనే అర్ధమవుతుంది. అలాగే మన గురించి మన పక్క రాష్ట్రాల వారి అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయంత్నం చేస్తే సరయిన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు ఏమనుకుంటారు ? అని గూగుల్ లో వెతికితే ఈ క్రింది సమాధానాలు వచ్చాయి.

1. కష్ట పడి పని చేస్తారు.
2. ఆడంబరాలకి పోయేవారు.
3. విలాసంగా బ్రతకటానికి ఇష్టపడేవారు.
4. స్నేహ శీలురు.
5. గొప్పలు చెప్పుకుంటారు.
6. సినిమాలని ఎక్కువగా ఇష్టపడేవారు.
7. డబ్బు మనుషులు.
8. జిత్తుల మారి ఆలోచనలు కలిగిన వారు.
9. అనవసరపు పోటీతత్వం కలిగిన వాళ్ళు.
10. భావోద్వేగాలు లేని వారు.
11. దక్షిణ భారత బిహారీలు.
12. అమెరికా మీద మోజు ఎక్కువ.
13. ఎక్కువ వరకట్నం తీసుకునేవాళ్ళు.


                 ఆంధ్రులు ఎప్పుడూ తమలో తాము పోట్లాడుకుంటారు. కానీ బయటివారి ఆధిపత్యం కింద పనిచేయటానికి మాత్రం ఇష్టపడతారు. యజమానులు కూడా సొంత ఆలోచనా విధానం లేకుండా కేవలం తమకి అనుగుణంగా ఉండి తమని అనుకరించే బానిసలే కావాలనుకుంటారు. ఈ విధమయిన స్వార్ధ పూరిత బానిస మనస్తత్వం వల్లనే మనం సాఫ్టువేరు ఉద్యోగాలలో ముందు వరసలో ఉండగలిగాము. మనం ఎవరితోనూ ధైర్యం గా పోరాడలేము, కేవలం కీలు బొమ్మలుగాను సొంత లాభం కోసం రాజీ పడే వాళ్ళు గాను ఉంటాము. ఆంధ్రులు అనైక్యతకి పెట్టింది పేరు. మిగిలిన రాష్ట్రాల వారు తమలో తాము ఎంత పోట్లాడుకున్నా తమ రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో మాత్రం కలిసి కట్టుగా ఉంటారు. మనం మాత్రం ఇందుకు విరుధ్ధం. కులతత్వం ఉన్నంత కాలం ఆంధ్ర దేశంలో అప నమ్మకం ఉంటుంది. అప నమ్మకం ఉన్నంత కాలం అభివృధ్ధి తో పాటు సొంత వ్యక్తిత్వం కూడా ఉండదు. ఆ రకంగా చూస్తే మన పక్క రాష్ట్రాల తో పోల్చుకుంటే మనం ఇంకా పూర్తి పరిణతి చెందిన ఆలోచన కలిగిన నాగరికులుగా తయారు కాలేదనే చెప్పాలి.



                 సొంత వ్యక్తిత్వం లేని వారికి సొంత భాష కూడా అవసరం లేదు. అందుకే ఒకప్పుడు 40 ఏళ్ళ క్రితం దేశం లో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4 వ స్థానానికి పడిపోయింది. ఒక సమాజాన్ని నాశనం చేయాలంటే ఆ సమాజం యొక్క ఉజ్వలమయిన చరిత్రని వారికి దూరం చెయ్యాలి అనేది సామ్రాజ్యవాదుల మొదటి సూత్రం. భాషని దూరం చెయ్యటం అందులో మొదటి అడుగు అయితే సొంత భాషలో ప్రాధమిక విద్యని దూరం చెయ్యటం, భాషని దూరం చెయ్యటంలో మొదటి అడుగు. దురద్రుష్టవశాత్తు సామ్రాజ్య వాద బ్రిటీషు ప్రభుత్వానికి చెందిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషకి ఎనలేని కృషి చేస్తే మనం మాత్రం తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నాం. మాకు మా తల్లి భాష అవసరం లేదు అని చెప్పగలిగిన జాతి బహుశా ప్రపంచం మొత్తం మీద ఆంధ్ర జాతి మాత్రమే అయి ఉండాలి. కంచె ఐలయ్య లాంటి దళిత బహుజన మేధావులు కూడా ఇంగ్లీషు మీడియం ని సమర్ధించటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక రకంగా ఆయనే వ్యతిరేకించిన అగ్రవర్ణ సంస్కృత ఆధిపత్యం స్థానంలో ఇంగ్లీషు ఆధిపత్యాన్ని అంగీకరించటమే అవుతుంది గానీ దళిత బహుజనుల సొంత వ్యక్తిత్వాన్ని కాపాడినట్టు కాదు. నిజానికి అచ్చమయిన, స్వఛ్ఛమయిన తెలుగు పదాలు దళిత కవుల సాహిత్యంలోనే కనపడతాయి. సంస్కృతి, భాష ఒకదాని మీద ఒకటి ఆధారపడేవి. సంస్కృతిని కోల్పోవటం భాష ని కోల్పోవటానికి కారణమవుతుంది. భాషని కోల్ఫొవటం సంస్కృతిని కోల్పోవటానికి కారణమవుతుంది.

                 విద్య యొక్క మొదటి లక్ష్యం అక్షర జ్ఞానంతో పాటు విద్యార్ధి తన చుట్టూ ఉన్న పరిస్థితులని, సమాజాన్ని అర్ధం చేసుకొనేలా చెయ్యటం. ముఖ్యంగా ప్రాధమిక విద్య లక్ష్యం ఇదే. ప్రాధమిక విద్య బతుకుతెరువుకోసమో, డబ్బు సంపాదించటం కోసమో కాదు. ఆ రకంగా చూస్తే ప్రాధమిక విద్య తల్లి భాషలో జరగటమే న్యాయం. ఎందుకంటే ఒక స్థానిక సమజం లో బ్రతికే వ్యక్తికి తన సొంత భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించిన అవగాహన చాల అవసరం. ఇంగ్లీషు మాధ్యమంలో విద్య ఇలాంటి అవకాశాన్ని దూరం చేస్తుంది. ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించవలసిన ఉన్నత విద్య మాత్రమే ఉద్యోగం కోసం. ఆంధ్రుల అసలు సమస్య ఇంగ్లీషు రాకపోవటం కాదు. ఇంగ్లీషు ఉన్నత నాగరికుల భాష, దానిని మనం తప్పని సరిగా నేర్చుకోవాలి. లేకపోతే ఎవరూ మనలని గౌరవించరు అన్న బానిస మనస్తత్వపు ఒత్తిడే ఇక్కడ సమస్య. ఈ విధమయిన ఒత్తిడి తమిళ, కన్నడ, మళయాళీ ప్రజలకి ఉండదు. అది వారికి చాల మామూలు విషయం. అందుకే దక్షిణ భారత దేశంలో మిగిలిన వారితో పోలిస్తే ఆంధ్రులు మాట్లాడే ఇంగ్లీషు అత్యంత పేలవంగా ఉంటుంది. ఇంగ్లీషు అంటే ఈ విధమయిన ఆత్మ న్యూనత ఆంధ్రులలో కొన్ని తరాలుగా ఉంది. అది ఇప్పటికీ ఉంది. మన దగ్గర వేలి ముద్ర వేసే వాడు కూడా నీళ్ళని నీళ్ళు అనటానికి బదులుగా వాటర్ అని అనటానికే ఇష్టపడతాడు. కానీ మన ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి. పరాయి భాషలో వాటిని కేవలం అనువదించుకుని పైకి మాట్లాడతాము. మనకి ఒక విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉంటే దానిని వ్యక్త పరచటానికి ఏ భాష అయినా ఒక్కటే. అసలు సమస్య మనకి విషయ పరిజ్ఞానం లేకపోవటం, విషయాన్ని సరిగ్గా బోధించగల అధ్యాపకుల కొరత మాత్రమే కానీ భాష కాదు. మనకి ఆత్మ విశ్వాసం విషయ పరిజ్ఞానం వల్ల వస్తుంది కానీ అది లేకుండా ఊరికే ఇంగ్లీషు నేర్చుకోవటం వల్ల కాదు. ఊరికే ఇంగ్లీషు నేర్చుకోవటం కాల్ సెంటర్ ఉద్యోగాలకి పనికి వస్తుంది కానీ సాంకేతిక ఉద్యోగాలలో కాదు. ఇంటర్లో బైపిసి తీసుకుంటే చాలు డాక్టరు అయిపోతాడనుకోవటం ఎంత అమాయకత్వమో, ఇంగ్లీషు మీడియంలో చదివితే జీవితం లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతాడనుకోవటం కూడా అంతే అమాయకత్వం.



                 తెలుగు మాధ్యమం లో ఒకప్పుడు భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలు చదుకోవటానికి కూడా విలువయిన తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. వాటిలో ఊరికే ఫార్ములా లు ఇవ్వటం కన్నా ముందు, ఆయా సూత్రాలు దైనందిన జీవితం లో ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎందుకు కనుగొనవలసి వచ్చిందో వివరించే విధానం ఎక్కువగా ఉండేది. దీని వల్ల ఆ విషయం మీద ఆసక్తి పెరిగేది. ఉదాహరణకి ఒక ఎత్తయిన భవనం పొడవు ఆ భవనం ఎక్కవలసిన అవసరం లేకుండానే కనుక్కోవటానికి త్రికోణమితి సూత్రాలు ఎలా ఉపయోగపడతాయి? ఒకప్పుడు భారత దేశంలో యజ్ఞ గుండాల నిర్మాణంలో త్రికోణమితిని విరివిగా ఉపయోగించేవారు లాంటి విషయాలతోపాటు, ఒక రావి ఆకు వైశాల్యం ఖచ్చితంగా కనుక్కోవటానికి ఏకీకరణ(ఇంటిగ్రేషన్) ఎలా ఉపయోగపడుతుందో లాంటి విషయాలు సరళంగా అర్ధం అయ్యేలా వివరింపబడి ఉండేవి. కాంతి వేగం కనుక్కోవటానికి మొదట గెలీలియో రెండు కొండ శిఖరాల మీద దీపపు లాంతర్లు, గడియారం ఉపయోగించి ఎలా ప్రయత్నించాడో ఒక కధలా వివరించారు. ఈ విధమయిన విధానం వల్ల విద్యార్ధికి శాస్త్ర సంబంధమయిన విషయాల మీద ఆసక్తి పెరిగి సొంతంగా ప్రయోగాలు చెయ్యటానికి ఉత్సాహం వస్తుంది. అలా కాకుండా ఏమీ అర్ధం కాకుండానే ఊరికే ఇంగ్లీషులో ఫార్ములాలు బట్టీ పట్టించి 100 కి 99 మార్కులు వెయ్యటం అనేది సృజనాత్మకత లేని, అనుకరించ గలిగిన బానిసలను మాత్రమే తయారు చేస్తుంది.

                 ప్రస్తుత సాంకేతిక యుగంలో భాషాపరమయిన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఎవరు ఏ భాషలో మాట్లాడినా తమకి కావాలసిన భాషలోకి అప్పటికప్పుడు అనువాదం అయ్యే సాంకేతికత ఇప్పటికే ప్రవేశించింది. ముందు ముందు ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవసరం అస్సలు ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పటికే తెలుగు వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత సాంకేతిక పరిస్థితులు నిజానికి ప్రాంతీయ భాషలకి ఎక్కువ మేలు చేస్తున్నాయి. ప్రయివేటు బడులలో కూడా నిర్బంధ తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టగలిగిన అనుకూలతలు ఇప్పుడు ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకి మాతృ భాషని తల్లిదండ్రులకన్నా ఖుషి టివి లాంటి కార్టూన్ చానళ్ళే ఎక్కువగా నేర్పుతున్నాయి. ఇటువంటి అనుకూల పరిస్థితులలో మనం మన తల్లి భాష ని పక్కన పెట్టటం అనేది అనాలోచిత తొందరపాటు నిర్ణయమే అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మన తెలుగుని మరిచిపోతే మన పుస్తకాలు, అందులోని విజ్ఞానం, సాహిత్యం మరుగునపడి మనకంటూ సొంత అస్థిత్వం లేని ఒక సంచార జాతిగా మిగిలిపోతాము. ఇప్పటికే ఈ విషయంలో సంస్కృతం ని ఉదాహరణగా చూశాము. ఇప్పుడు తెలుగు భాషని అశ్రధ్ధ చేసి, తర్వాత మేలుకుని తప్పు దిద్దుకోవటానికి తాపత్రయపడటంకన్నా ఇప్పుడే తగిన చర్యలు తీసుకోవటం మంచిది. విషయ పరిజ్ఞానం అనేది సొంత భాషలోను, ఇంగ్లీషులోను ప్రావీణ్యం సంపాదించి ఆ రెండు భాషలలోని పుస్తకాలని విరివిగా చదవటం వల్ల, లేదా సొంత భాషలో ప్రావీణ్యం సంపాదించి ఆ భాషలోని, ఆ భాషలోకి అనువదింపబడ్డ పుస్తకాలని విరివిగా చదవటం వల్ల మాత్రమే వస్తుంది కానీ, సగం సగం సొంత భాష, సగం సగం ఇంగ్లీషు నేర్చుకోవటం వల్ల రాదు.



తెలుగు అభివృధ్దికి సూచనలు.

1. మనం కోల్పోయిన సరళమయిన తెలుగు పదాల పదకోశ నిర్మాణానికి తగిన చర్యలు     తీసుకోవాలి.
2. అనవసరపు ఇంగ్లీషు పదాల బదులు ఈ పదాలను పత్రికలు, సినిమాలు, టీవీ     కార్యక్రమాలు, వార్తా చానళ్ళలో ఉపయోగించే విధంగా ప్రోత్సహించాలి.
3. అన్ని శాస్త్ర సంబంధ విషయాలను తెలుగులో సులువుగా అర్ధం చేసుకునే     విధమయిన పాఠ్య పుస్తకాలు రాయాలి. నిజానికి ఈ ప్రయత్నం తెలుగు అకాడమీ     ఎప్పుడో చేసింది. విజ్ఞాన్, నారాయణ, చైతన్య రాక ముందు అన్ని శాస్త్రాల పుస్తకాలు     తెలుగులోనే ఉన్నాయి. మనం చెయ్యవలసినదల్లా     వాటిని బయటకి     తీసుకురావటమే.
4. ప్రతిరోజూ ఉపయోగించే తెలుగులో, ఇంగ్లీషు పదాల ప్రయోగాన్ని అవసరమయిన     వరకు తగ్గించాలి. ఉదాహరణకి : అంకెలు, వారాలు, కూరగాయలు,     బంధుత్వపు     వరుసలు.
5. గత పది సంవత్సరాలలో అవసరం లేకపోయినా ఇంగ్లీషు వ్యామోహం వల్ల మనం     కోల్పోయిన తెలుగు పదాలని తిరిగి పునరుధ్ధరించాలి.
6. తెలుగు వికీపీడియాని అభివృధ్ధి చేసి దానికి విస్తృత వ్యాప్తి కలిగించాలి.
7. ఆంథ్రుల ఐక్యత ని తెలియ చేసే విధంగా కర్నాటక లో మాదిరి ఒక జండాని     రూపొందించాలి.
8. తమ పిల్లలు రోజు వారీ జీవితం లో సాధ్యమయినన్ని ఎక్కువ తెలుగు పదాలు     ఉపయోగించేలా తల్లి దండ్రులు ప్రోత్సహించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు     నామోషీగా భావించకూడదు.

తెలుగు భాష సరస్వతి దేవి లాంటిది, ఇంగ్లీషు భాష లక్ష్మి దేవి లాంటిది. తెలుగువారందరికీ ఇంగ్లీషు చదవటం, రాయటం, మాట్లాడటం వస్తే మంచిదే. కాని తెలుగు అవసరం అంతకు మించినది.

Saturday, October 5, 2019

సైరా - Review (2-3 mins)


                 ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉంది ? అన్న దాని మీద చాలా రివ్యూలు వచ్చాయి కాబట్టి దాని గురించి మాట్లాడుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. ఇంగ్లీషు వాళ్ళు భారత దేశాన్ని వదిలి వెళ్ళి 70 ఏళ్ళు దాటిపోయినా కూడా మనం వాళ్ళ గురించి, వాళ్ళని వెళ్ళగొట్టటానికి మూల కారకులలో ఒకరయిన గాంధీ గారి గురించి ఇప్పటికీ రోజూ తలుచుకుంటున్నామంటే మన దేశం పై బ్రిటీష్ పాలన ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భారత స్వాతంత్ర పోరాటం నుండి పుట్టిన మహత్మ గాంధి ఇప్పుడు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు. అప్పట్లో ఆంగ్లేయులు ఇండియాని ఎంతగా పీల్చి పిప్పి చేశారంటే ఒక ప్రాంతం, వారి పాలనలో ఎన్ని ఎక్కువ సంవత్సరాలు ఉంటే అంతగా పేదరికంలోకి కూరుకుపోయేది. విభజించు జయించు. విభజించు పాలించు అన్న రెండు కుతంత్రాల ద్వారానే బ్రిటీష్ వాళ్ళు ఒకప్పటికి దాదాపు 80 శాతం భూమండలాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకోగలిగారు. మిగిలిన దేశాలతో పోలిస్తే మనం మాత్రమే వారిని ఇప్పటికీ ఎక్కువగా తలుచుకుంటున్నాం. దీనికి గల కొన్ని కారణాలలో వారు మనదేశాన్ని విపరీతంగా దోచుకుని పీల్చి పిప్పి చేసి పోవటం ఒకటయితే, ఆ గాయాలను మరిపించేటంత గొప్ప పరిపాలన భారతదేశానికి ఇంకా లభించకపోవటం మరో కారణం. మన స్వాతంత్ర పోరాట యోధుల గురించి తరచుగా విడుదలయ్యే సినిమాలని కనీసం చివరి కారణంగా అయినా తీసి పారేయటానికి వీలు లేదు. అలాంటి సినిమాలలో సైరా నరసింహారెడ్డి కూడా ఒకటి.

                 మహాత్మా గాంధి దేశ ప్రజలందరినీ ఒక తాటి పైకి తెచ్చేవరకు, భారతీయులు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడటం కన్నా ఎక్కువగా తమలో తామే పోట్లాడుకున్నారు. స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 33 కోట్లు. కానీ మన దేశంలోని ఆంగ్లేయుల జనాభా ఒక లక్ష యాభై వేలు మాత్రమే, అంటే ఒక ఆంగ్లేయుడు 2200 మంది భారతీయులని నియంత్రించగలిగేవాడు. ఒక విదేశీయుడు ఇంత మందిని అదుపులో ఉంచుకోవాలంటే సహజంగానే విడగొట్టటం, భయపెట్టటం అనేవి వారి ప్రధాన వ్యూహాలుగా ఉండాలి. అంటే అప్పటికి మనదేశంలోని చిన్న చిన్న సంస్థానాల రాజులు, అధికారులలో ఎంతగా అనైక్యత, లంచగొండితనం, పిరికితనం పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. వాస్కోడిగామా కేరళలో అడుగు పెట్టేనాటికి అక్కడి సంస్థానాలు తమలో తాము ఎంత క్రూరంగా వ్యవహరించుకొనేవో 'ఉరుమి' సినిమాలో సరిగ్గా చూపించారు.

                 ఎంత గొప్ప నాయకుడికి అయినా ఎంతో కొంత సొంత ప్రయోజనాలు ఉండటం అనేది సహజం. సినిమాలలో పాత్రలు చూపించినంత ఉదాత్తం గా నిజ జీవితం లో ఎవ్వరూ ఉండలేరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజంగా తనకి రావాల్సిన పెన్షన్ కోసం పోరాడాడా లేక ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడాడా అనేది పక్కన పెట్టవలసిన అనవసర విషయం. పైన చెప్పుకున్న కష్టమయిన పరిస్థితుల్లో కూడ అతను అత్యంత బలమయిన ఆంగ్లేయులకి ధైర్యంగా ఎదురు నిలవటం, వారి చేతులలో వీరుడిలా చనిపోవటం మాత్రం ఒక చారిత్రక నిజం. కాల్పనికతను జోడించి, అక్కడక్కడా మలుపులతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన దగ్గరినుంచి చనిపోయేవరకు సినిమాలో ఆసక్తిగా చూపించారు. మంచి సౌండ్ సిస్టం ఉన్న పెద్ద తెర పై చూస్తే ఎక్కువగా నచ్చే సినిమా.

                 భారీతనం/పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాటలు సినిమాలకి మంచి చేస్తాయా లేదా? అన్న విషయం మరికొన్ని ప్రయోగాలు చూస్తే గానీ ఇప్పుడే చెప్పలేము. చార్లీ చాప్లిన్ ఒక సందర్భంలో ఒక పార్కు, పార్కులో బెంచీ, ఒక పోలీస్ క్యారెక్టర్, మరో రెండు క్యారెక్టర్లు ఉంటే చాలు సినిమా తీసెయ్యగలను అని చెప్పాడు. అప్పట్లో తెలుగు లో వంశీ, కన్నడలో కాశీనాథ్ లాంటి దర్శకులు అతి తక్కువ డబ్బులతోనే మంచి సినిమాలను తీయగలిగారు. సినిమాని పైకి తీసుకెళ్ళటంకన్నా లోతుకి తీసుకెళ్ళటం ముఖ్యం. ఏ సినిమాకయినా పెద్ద బడ్జెట్ తో పాటు కథ, కథనం కూడా చాలా అవసరం. 'బాహుబలి' బలం కూడా అదే. కానీ కథ ని పక్కన పెట్టి భారీతనం/పాన్ ఇండియా పేరుతో సహజత్వానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం మంచిది కాదన్న విషయం 'సాహో' సినిమా తో రుజువయ్యింది. ఆ విషయం లో 'సైరా' ఎంతో కొంత జాగ్రత్త పడటం సినిమాకి మేలు చేసింది.

సినిమాలో నాకు నచ్చిన అంశాలు

• చిరంజీవి.
• పొదుపుగా, పదునుగా వాడిన మాటలు.
• చాలా వరకు సీన్లు, మాటలు మొదటి నుంచి చివరివరకు ఏదో ఒక సందర్భంలో   ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండేలా కథ రాసుకోవటం.

                 ఈ సినిమా చూసి బయటకి వచ్చాక కూడా అన్నీ సలక్షణంగా ఉన్న మంచి తెలుగు సినిమా చూసి చాలా రోజులయ్యింది అనే నా అభిప్రాయంలో మార్పు రాలేదు గానీ, ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచం లో డబ్బు సంపాదన యావలో పడి నెల జీతంకోసం చాలా మామూలుగా మనం వదులుకునే స్వేచ్చ, ఎంత కష్టపడితే మనకి లభించిందో తెలుసుకోవటానికీ, డబ్బులు తీసుకుని ఓటు వేసి నిర్వీర్యం చేస్తున్న ప్రజాస్వామ్యం ఎంత విలువయినదో అర్ధం చేసుకోవటానికీ అయినా ప్రతి ఒక్కరూ ఒక్కసారయినా ఈ సినిమాని చూడాలి.

Thursday, August 15, 2019

ఊర కుక్క మరణం











(మా ఊళ్ళో ఒక పంక్తి భోజనాల రోజు ఎంగిలి విస్తరాకుల దగ్గర ఆకలితో అతిగా తిని చనిపోయిన మా ఊరి నల్ల ఊర కుక్కకి ఈ కథ అంకితం)

                 "  నేను చనిపోయి చాలా సేపయ్యింది. నా చావు గురించి నాకేమీ భాథ లేదు. ప్రతి జీవికీ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతకన్నా ముఖ్యం. మన పుట్టుకకి ఏ గౌరవం లేకపోవచ్చు కానీ చావుకి మాత్రం తప్పకుండా ఒక గౌరవం ఉండేలా బతకటం మన చేతల లోనే ఉంది. మీ లాంటి మనుషులకయితే అందరికీ మంచి చేసి చనిపోతే గౌరవం. ఎక్కువ ఆస్థులు సంపాదించి, గొప్ప హోదా అనుభవించి చనిపోతే గౌరవం. యుధ్ధంలో చనిపోయినపుడు గౌరవం. మీ మీ మత విశ్వాసాలపట్ల భక్తి ప్రపత్తులు చూపించి థర్మ మార్గాన్ని అనుసరిస్తూ బతికి చనిపోతే గౌరవం. అలా చనిపోయిన వాళ్ళ శవ యాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆడంబరంగా ఉంటుంది. మనుషులు తమ మరణానికి సన్నధ్ధమవటం కోసం పోరాడతారు. మేము మాత్రం కేవలం బతికి ఉండటానికి పోరాడతాం. తల రాతలు మీ లాంటి మనుషులకే ఉంటాయో, మా లాంటి కుక్కలకి కూడా ఉంటాయో నాకు తెలీదు. బహుశా ఉండవేమోనని నేనూ అనుకునేవాడిని. మేము ఈ భూమ్మీద పడి ఊహ తెలిసిన దగ్గర నుంచీ ఆహారం కోసం వెతుక్కోవటం, పిల్లల్ని కనటం, బతుకు కోసం శత్రువులతో పోరాడటం. ఇంతకన్నా ఏమీ ఉండదు. ఇక చావంటారా ఏ రోగంతోనో, ఆకలితోనో, శత్రువుల దాడితోనో మా జీవితాలు ముగిసిపోవాలి. మీ జీవితాల్లో ఉన్నంత సంక్లిష్టత, వ్యత్యాసం మా జీవితాల్లో ఉండదు కాబట్టి మాకు తల రాతలు ఉండవనీ ఆ అవసరమే మాకు ఉండదనీ ఒక అభిప్రాయం నాకు ఉండేది. కాని నా చావు మాత్రం అన్నిటికీ భిన్నం గా సంభవించింది. నా చావు అనుభవమయ్యాకే నాకు మాలాంటి జీవులకు కూడా తల రాతలు ఉంటాయేమోనని అనుమానం వచ్చింది. నా చావు అత్యంత అవమానకరం, మా లాంటి జంతువులన్నిటికీ ఒక గుణపాఠం. ఇలాంటి చావు ఇప్పటివరకూ నాకు తప్ప ఇంకెవరికీ వచ్చి ఉండదు. ఇక ముందు రాకూడదని కూడా కోరుకుంటున్నాను.

                 అత్యాశకి పోవటం కేవలం మనుషుల లక్షణమనీ, అది మన లాంటి జంతువులకి మంచిది కాదనీ మా అమ్మ చెప్పింది. మనుషులు మన కుక్క జాతి పట్ల చాలా దయతో ఉంటారని కూడా చెప్పింది. మనం విశ్వాసంగా ఉంటే దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ముద్దు చేస్తారనీ, కడుపు నిండా అన్నం పెడతారనీ, మన మీద చూపించినంత ప్రేమ ఒక్కోసారి సాటి మనుషుల మీద కూడా చూపించరనీ చెప్పింది. కానీ ఏ రెండు కుక్కల స్వభావాల మధ్య ఉన్న తేడా కన్నా ఇద్దరు మనుష్యుల స్వభావాల మధ్య ఉండే తేడా చాలా ఎక్కువ. అందుకే మనుషులందరినీ నమ్మకూడదని కూడా చెప్పింది. అది నాకు ఆ తర్వాత అనుభవమయ్యింది కూడా. ఒక్కో సారి అన్నం పెట్టిన చెయ్యే ఛీ, పో అని కర్రతో కొట్టి తరిమేస్తుంది. ఇంకోసారయితే ఉత్తపుణ్యానికే ఇంత పెద్ద ఇటుక ముక్క తీసుకుని గిర గిరా తిప్పి మొఖం మీద కొడుతుంది. ఇంకా కసి తీరక పోతే నాలుగు చక్రాల కుక్కల బండి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అలాంటి నాలుగు చక్రాల బండి వచ్చి నప్పుడు దూరంగా పారిపొమ్మని కూడా మా అమ్మ చెప్పింది. లేకపోతే చావు మూడినట్లే. అలా చనిపోయినా కూడా నాకు ఆనందం గానే ఉండేది. కానీ నన్ను చూసి మా జాతి ఒక్కటే కాదు, నోరు లేని మా లాంటి ప్రాణులన్నీ అసహ్యించుకునేలా చనిపోయాను. మాకూ మీలాగే స్వర్గ నరకాలు ఉంటే నేను అక్కడున్న మా అమ్మ దగ్గరికే వెళ్ళి చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతాను. నా పింకి కూడా అక్కడే ఉండొచ్చు. పింకి కళ్ళు కాటుక పెట్టుకున్నట్టు ఆకర్షణీయం గా ఉండి ఎప్పుడూ కాంతివంతంగా, అమాయకంగా మెరుస్తూ ఉండేవి. నేను చనిపోయిన ఇంటి వీధి చివర ఉన్న పెద్ద డాబాలో ఉండే వాళ్ళ దగ్గరే పింకీకి ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఉండేది. ఆ అందమయిన పేరు కూడా వాళ్ళే పెట్టారు. కాని ఏమయ్యిందో తెలీదు. ఉన్నట్టుండి పింకీ ని బయటకి గెంటేశారు. మొదట్లో ఆహారం ఎలా వెతుక్కోవాలో, శతృవుల నుంచి ఎలా తప్పించుకోవాలో, సాటి కుక్కలతో దెబ్బలాడి అన్నం ఎలా సంపాదించుకోవాలో తెలీక చాలా కష్టపడేది. కానీ నాతో స్నేహం కుదిరాక మాత్రం తెలివయినది కావటం మూలాన అన్నీ చాలా తొందరగానే నేర్చుకుంది.

                 పింకీ కి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, మాంసం కూర అన్నా కూడా. నాలాగ ఏది పడితే అది తినేది కాదు. ఒక సారి నా అదృష్టం బాగుండి కోడిపిల్ల దొరికింది. దాని మెడ కొరికి చంపి తింటున్నాను. అది చూసి పింకీ కి నా మీద కోపమొచ్చింది. అంత చిన్న కోడి పిల్లని ఎందుకు చంపావని నన్ను తిట్టింది. తనకి కోపం రావటం అదే మొదటిసారి చూడటం. పింకి కి మనుషులతో సహవాసం వల్ల కొంచెం సున్నితత్వం, నాజూకుతనం కూడా అలవాటయ్యింది. నాకు ఆకలి తప్ప ఇంకేమీ తెలీదు. కానీ తర్వాత పింకీ కూడా నెమ్మది నెమ్మదిగా నా సహవాసం వల్లనో పరిస్థితుల వల్లనో తెలీదు గానీ ఆకలి తీరటానికి ఏదో ఒకటి కడుపులో వేసుకోవటం నేర్చుకుంది. ఒక్కోసారి ఇద్దరం వెన్నెల రాత్రుళ్ళు కాలువ గట్టు మీద ఈ పక్క నిద్ర గన్నేరు చెట్టు దగ్గరనుంచి ఆ పక్క బాదం చెట్టు వరకూ పరుగు పందాలు పెట్టుకుని ఊరికే తెగ పరుగులుపెట్టేవాళ్ళం. మధ్యలో కాలువ దాటటానికి మనుషులు అడ్డంగా వేసుకున్న తాటి పట్టెల మీద గబ గబా పరుగెట్టటం తెలీక అన్ని సార్లూ పింకీనే ఓడిపోయేది, అంత చిన్న పట్టె మీద వేగం గా ఎలా పరుగెడుతున్నానా అని నన్ను ఆశ్చర్యంతోనూ, ఆరాధనతోనూ చూసేది. పింకీ నన్ను అలా చూడటం నాకు ఎంతో నచ్చింది. అప్పటినుంచీ తన కోసమే కొన్ని కొన్ని కొత్త సాహసాలు కూడా చేసేవాడిని. తర్వాత కొన్ని రోజులకే పింకీ ని ఆ నాలుగు చక్రాల బండి వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. నేను మాత్రం ఎలాగో తప్పించుకుని పారిపోయాను. నాలాంటి వీరుడు, ధైర్య వంతుడు తోడు ఉన్నాడన్న నమ్మకంతో పూర్తిగా నా మీద ఆధారపడ్డ పింకీని నా కళ్ళ ముందే రెండు చేతుల మనుషులు తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. పింకి నా కన్నా ముందు పోవటం కూడా మంచిదే అయ్యింది. లేకపోతే ఈ రోజు నా చావు చూసి నన్ను ఖచ్చితంగా అసహ్యించుకొనేదే. అది భరించటం మాత్రం నాకు చావు కన్నా కష్టమయ్యేది.

                 పింకి పోయాక కొన్ని రోజుల వరకూ తనని మర్చిపోవటం కష్టంగా ఉండేది కానీ ఆ తర్వాత ఎండా కాలం వచ్చాక తినడానికి తిండి కాదు కదా తాగడానికి నీళ్ళు కూడా సరిగ్గా దొరికేవి కాదు. ఎందుకో తెలీదు గానీ అంత నిప్పుల గుండం లాంటి ఎండా కాలం నేను బుద్ధి ఎరిగాక ఎప్పుడూ చూడలేదు. ఆ ఆకలి బాథ తో తిండి కోసం వెతుకులాటలో పడి పింకి ని తొందరగానే మర్చిపోయాను. తినడానికి ఏమయినా దొరుకుతుందేమోనని మీ మనుషులు తినగా మిగిలినది బయట పారేసేచోటా, ఇంటింటికీ తిరిగి ఇంటి పెరట్లోనూ వాసన చూసుకుంటూ తిరిగేవాడిని. ఒక్కోసారి ఏమీ దొరక్కపోతే ఊరి చివర పంట బోదిలో మిగిలిన బురద నీళ్ళు తాగేవాడిని. ఒక రోజు, రెండు రోజులూ కాదు చాన్నాళ్ళు ఇలాగే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతికాను. నేను చచ్చి పడిపోయిన వీథిలో ఉండే ఒక తెల్ల జుట్టు మనిషి ప్రతి రోజూ భోజనానికి ముందు ఒక ముద్ద తీసి మా లాంటి నోరు లేని జీవుల కోసం పక్కన పెట్టేది. పగటి పూట ఆ ముద్దని నాకన్నా ముందు నా కాకి మిత్రులు చిందర బందర చేసి తినేసి వెళ్ళిపోయేవి. రాత్రి పూట మాత్రం అది నాకు దక్కేది. కొన్ని రోజులకి ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటం మొదలయ్యింది. ఇంకొన్నాళ్ళు ఓపిక పడితే తిండి, నీళ్ళు దొరికి మళ్ళీ మామూలు రోజులు వస్తాయన్న ఆశ మొదలయింది. సరిగ్గా అప్పుడే ఓ రోజు ఆ తెల్ల జుట్టు మనిషి పాడెక్కింది. అప్పటినుంచీ ఆ ముద్ద కూడా కరువయ్యింది. ఇక నాకు చావు దగ్గర పడిందని ఖాయం చేసుకుని బతుకు వెళ్ళదీస్తుండగా ఒక రోజు ఒక అథ్భుతం జరిగింది. ఆ తెల్ల జుట్టు మనిషి చనిపోయిన పదకొండో రోజు పెద్ద కర్మ జరుగుతుంది ఆ ఇంట్లో. ఆ రోజు చాలా రకాల పిండి వంటలు, మాంసం వండి వడ్డిస్తూ పెద్ద కర్మ చాలా గొప్పగా చేస్తున్నారు. ఆ వంటల వాసనలు నా ముక్కుకి తగిలి ఎక్కడో అగాథం లో దాక్కున్న నా ఆకలిని మొత్తం బయటికి లాక్కొచ్చాయి. ఒక్కొక్కరూ తినగా మిగిలిన వంటకాలతో సహా విస్తరాకులు ఆ ఇంటి ముందు ఆరు బయట పడుతున్నాయి. ఆ క్షణం నా కంటికి తిండీ, కడుపుకి ఆకలీ తప్ప మిగిలినవి ఏవీ అనుభవం లోకి రావటం మానేసింది. పింకీ కూడా నాతో ఉంటే బాగుండుననిపించింది కానీ, మామూలుగా ఈ సమయం లో నాతో దెబ్బలాటకొచ్చే బలమయిన నా తోటి మిత్రులు అందరినీ ఆ నాలుగు చక్రాల బండి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవటంతో ఇంక నాకు పోటీనే లేకుండా పోయింది. కంటికి కనిపించిందీ, నోటికి అందినదీ మహా ఆబగా తినటం మొదలెట్టాను. అంత ఏకాగ్రతతో ఇప్పటివరకూ నా జీవిఏతం లో ఏ పనీ చేసి ఉండను. కేవలం తినటం, తినటం. అలా తినటం మొదలుపెట్టి ఎంత సమయం గడిచిందో కూడా గమనించలేదు కానీ కొంతసేపటికి ఇంచు మించు గొంతుదాకా తిన్నట్టు మాత్రం తెలిసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి, నా గొంతుకి ఏదో అడ్డం పడినట్టు అయ్యింది. నాకు కళ్ళు బైర్లు కమ్మి, శ్వాస ఆడక, ఊపిరి ఆగి నేల మీద థబ్బుమని పడినంత పనయ్యింది. నాకేమయ్యిందో ఏమీ అర్ధం కాలేదు కానీ కొంత సేపటికి ఇద్దరు మనుషులు నా కాలికి తాడు కట్టి ఒక తాటాకు మీదకి లాక్కొచ్చి ఈడ్చుకు వెళ్ళి ఊరవతల కాలువగట్టు మీద నేను, పింకి ఇదివరకు ఆడుకున్న నిద్రగన్నేరు చెట్టుకింద పడేసి వెళ్ళిపోతూ "ఆశపోతు కుక్కలా ఉందిరా, కడుపు పట్టనంత తినీ, తినీ ఎక్కువయ్యి చచ్చింది." అని చెప్పుకుని నవ్వుకోవటం మాత్రం నాకు తెలిసింది. అప్పుడే నేను చనిపోయానన్న విషయం నాకు అర్ధమయింది.

                 నేను ఆశపోతుని అన్న మాట నా తోటి జంతువులు అని ఉంటే నేను బాథ పడే వాడిని కాదు. ఆకలితో చనిపోతాననుకున్న నేను అత్యాశకి పోయి, తిండి ఎక్కువయ్యి చనిపోవటం నిజంగా మా జాతికి నేను తెచ్చిన కళంకం. కానీ మనుషుల చేత ఆ మాట అనిపించుకోవటం నాకు బాథాకరం. ఈ భూమ్మీద మిమ్మల్ని మించిన దురాశాపరులు ఎవరుంటారు? మీరు కేవలం మీ ఒక్కరి కోసమే కాదు. మీ ముందు తరాలు కూడా అనుభవించగలిగిన ఆస్థులు కూడబెట్టుకుని భద్రమయిన జీవితం గడపగలగటానికి సరిపడా దురాశ, అనైతికత, స్వార్ధం, పక్షపాతం మీకు పుట్టుకతోనే వస్తాయి. ఇంకా ఆ అపరాథ భావన నుంచి మీరు వేసుకున్న థర్మ మార్గం మిమ్మల్ని కాపాడుతుంది. మేము థర్మం తప్పే ప్రసక్తే లేదు. అసలు ఆ అవకాశమే లేదు కాబట్టి మాకు ప్రత్యేకమయిన థర్మ మార్గాలతోను, మతం తోను పనిలేదు. మిమ్మలని మించిన పరాన్న భుక్కులు సృష్టిలో లేరు. ప్రకృతిని ధ్వంసం చెయ్యటం మీ జీవితంలో ఒక భాగం. అసలు, ప్రకృతికి వికృతి మనుషులే. "మనుషులకి సత్యం తో పని లేదు. ఎప్పుడూ అలవిమాలిన రాగ ద్వేషాలతో కూడిన మత్తులోనే బతుకుతార"ని మా అమ్మ చెప్పింది. మీరు చేస్తున్న అంతులేని అన్వేషణ అంతా మీ మూసుకున్న కళ్ళు తెరుచుకోవటానికి మీరు చేస్తున్న ప్రయత్నమే. అలాంటి వాటితో మాకు పనిలేదు. మేమెప్పుడూ మెలకువతోనే ఉంటాం. మీకు ఉన్న జ్ఞానం లోనే మీ అజ్ఞానం కూడా దాక్కుని ఉంది. మాకు జ్ఞానం తో పని లేదు కాబట్టి మేము అజ్ఞానులమయ్యే అవకాశమే లేదు. అందుకే మీరు ఎన్ని ఆరాథనలు చేసినా ఆ దేవుడికి మీకన్నా మాలాంటి మూగ జీవులంటేనే ఎక్కువ ఇష్టమని కూడా మా అమ్మ చెప్పింది. ఇది మాత్రం దేవ రహస్యం, ఎవరికీ తెలీదని చెప్పింది. ముఖ్యంగా బుథ్థిబలంతో గర్వం తలకెక్కిన మనుషులకి.  "