Thursday, August 3, 2017

నేను



















నేను పుడుతూనే ఆకలికి ఏడుస్తున్నాననుకుంటారు గానీ
ఒక గుప్పెడు నిప్పు కణికలని
గొంతులో నింపుకునే వచ్చాను.

నిశ్శబ్దంగా నిద్ర పోతున్నాననుకుంటారు గానీ
ఊపిరి గాలికి రెపరెపలాడే
థిక్కారపు దేహ పతాకాన్ని నేను.

నా అడుగులతో ఆకాశాన్ని కొలుస్తాను.
నా జ్ఞాన తృష్ణ కి
అనంత విశ్వాన్ని బలిస్తాను.

పశుత్వానికి దగ్గరగా పుట్టి
దైవత్వానికి దూరంగా విసిరివేయబడ్డ
మాంస ఖండాన్ని.

సిథ్థాంతాన్ని.
సిథ్థాంతాల రాథ్థాంతాన్ని.
రాథ్థాంతాల యుథ్థాన్ని.
యుథ్థానికి, యుథ్థానికి మధ్య
నెలకొన్న తాత్కాలిక శాంతి సౌహార్ద్రాన్ని.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14699)

Sunday, April 30, 2017

ఇక్కడ














ఇక్కడ, బుర్రలకి చిల్లులు పడి
నీరుగారిపోయిన మనుషులు
కిటికీ దగ్గర పావురాల్లా మూలుగుతున్నారు.

ఇక్కడ, ‘ఆత్మ విశ్వాసం’ కోసం
ఆత్మలను అమ్ముకున్న బుధ్ధిమంతులు
నడి వీధిలో ఒళ్ళు విరుచుకుని నించున్నారు.

ఇక్కడ, పగలు చేసిన పాపాలను
రాత్రి కప్పుకుని పడుకుని
ఒక కన్ను తెరిచి నిద్ర పోతున్న రహస్య మానవులు
వెన్నెల రాత్రులను వ్యర్ధం చేస్తున్నారు.

నిజం నడ్డి విరిచి, ప్రపంచానికి
కుంటి నడక నేర్పిన అవకాశవాదుల స్తోత్ర పాఠాలు
ఇక్కడ, నిత్య పారాయణాలు.

లోకమే ఒక బలిపీఠం.
జీవితం, చేయక తప్పని నేరం.
ఇది యుగయుగాల నరమేధం.
అయినా ఇక్కడంతా, నిత్యనూతనం.

బాగున్నదానిని చెడగొట్టటం.
చెడిపోయిన దానిని బాగు చెయ్యటం.
ఇక్కడ, మన కాలక్షేపం.
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన కవిత, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=14090)

Sunday, March 5, 2017

వెంకటేశులుకి దిష్టి తగిలింది


                 అయితే గియితే అప్పట్లో దూరదర్శన్ లో వార్తలు చదివే 'శాంతి స్వరూప్' లాగా నున్నగా తల దువ్వుకుని, ఇస్త్రీ బట్టలేసుకుని, నూనె సుద్దల్లాగా మెరిసిపోతూ బళ్ళోకొచ్చే మారుబోయిన వాళ్ళ ముత్యం గాడికో, మీసాల నారాయణరావు గారి బాలాజీ గాడికో లేకపోతే వాళ్ళ ఊళ్ళో అయిదో తరగతి దాకానే ఉందని ఆరో తరగతిలో మాతో పాటు చదువుకోవటానికి మా ఊరి బళ్ళోకొచ్చే మా పక్క ఊరు వెలగ పల్లి లో ఉండే వెలమ దొరగారోళ్ళ పండు గాడికో దిష్టి తగలాలి గానీ, విచిత్రంగా, ఎప్పుడూ పిర్రల దగ్గర చిరిగిపోయిన నిక్కరేసుకుని మళ్ళీ దాని మీదకి ఆ చిరుగులు కనిపించకుండా మోకాళ్ళ దాకా వచ్చే ఎవరో ఊరుకునే ఇచ్చిన లొడంగం చొక్కా వేసుకుని బళ్ళోకొచ్చే ఈనుప్పుల్లలాగా ఉండే కమతాలోళ్ళ వెంకటేశులుగాడికి దిష్టి తగిలేసింది ఒకసారి. వెంకటేశులుగాడి ఏడుపుగొట్టు దిష్టి కధ గురించి చెప్పుకునే ముందు సరదాకి వాడి చిరుగుల నిక్కరు గురించిన పిట్ట కధ కూడా చెప్పుకుందాం. అప్పట్లో మాలాంటి పిల్లలందరం చిరిగిందో, చిరగలేనిదో, పొడుగయ్యిందో, పొట్టి అయ్యిందో ఏదో ఒక చొక్కా, నిక్కరు వేసుకుని పలకా, కనికీ పట్టుకుని బడికి వెళ్ళేవాళ్ళం గానీ, మా పెద్దోళ్ళయితే వాళ్ళ చిన్నప్పుడు ఒంటి మీద చొక్కా ఏమీ లేకుండానే బడికెళ్ళి పలక కొనుక్కోవటానికి కూడా సౌకర్యం లేక బూడిద మీద పుల్ల ముక్కతో 'అ' 'ఆ' లు దిద్దుకుని చదువు నేర్చుకున్నారని ఆ తర్వాతెప్పుడో వాళ్ళే చెపితే తెలిసింది. ఈ విషయం మా తెలుగు మాస్టారు ఉమామహేశ్వర్రావు గారికి తెలుసో లేదో తెలీదు గానీ, ఆయన మాత్రం పొద్దున్నే మూడో బెల్లు కొట్టాక ప్రార్ధన అయిపోయాక తరగతి గది లోకి వెళుతున్న వెంకటేశులు గాడిని పిలిచి "అలా బుడబుక్కలోడి లాగా వదులు చొక్కా వేలాడేసుకుని తిరగక పోతే నిక్కరు లోపలికి తోసెయ్యొచ్చు కదా? ఇన్ షర్టు చేసుకున్నట్టు ఉంటుంది." అని ఒక ఉచిత సలహా ఇచ్చేవారు. వెంకటేశులు గాడికి మామూలుగానే ఎవరి మాటా కాదనే అలవాటు అస్సలు లేదు కాబట్టి, అలాగే చేసేవాడు. కానీ మళ్ళీ మధ్యాహ్నం బెల్లు తర్వాత అన్నం తిన్నాక చుట్ట కాల్చుకోవటానికి బయటకొచ్చే మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు అక్కడే ఆడుకుంటున్న వెంకటేశులుగాడిని పిలిచి "పిర్రల దగ్గర నీ నిక్కరు చిరుగుల అందం అందరికీ చూపించకపోతే కనబడకుండా ఆ ఇన్ షర్టు తీసెయ్యొచ్చు కదా ?" అని పాపం ఆయనకి తోచిన మంచి సలహా ఆయనా ఇచ్చేవారు. వెంకటేశులు గాడు కూడా తు.చ తప్పకుండా మళ్ళీ అలాగే చేసేవాడు. ఇంచు మించు రోజూ ఇదే నిర్వాకం జరిగేది వెంకటేశులుగాడికి. ఆ రకంగా బళ్ళో ఏ రోజు చూసినా విచిత్రంగా పొద్దున్న అంతా ఇన్ షర్టు తోనూ మధ్యాహ్నం నుంచీ లొడంగం లాంటి పొడుగు చొక్కాతోనూ కనిపించేవాడు వెంకటేశులు. బాలాజి గాడి లాంటి వాళ్ళకయితే ఇదంతా చూసి వాళ్ళేదో సరాసరి ఆకాశం లోనుంచో, విష్ణుమూర్తి బొడ్డులోనుంచో ఊడిపడ్డట్టు పెద్ద నవ్వులాటగా ఉండేది. ఒక్కోసారయితే ఇలాగ పొద్దున్న ఒక వేషం మధ్యాహ్నం ఒక వేషం వెయ్యలేక నామోషీ గా అనిపించి, 'మనిషికి చావు పుట్టుకలు ఉండటం, ఆ మధ్యలో బతకటానికి డబ్బులు కావలసిరావటం, ఆ ఆర్ధిక స్థాయిని బట్టే మనిషి తన అవసరాలు నెరవేర్చుకోగలగడం' లాంటి పెద్ద పెద్ద విషయాలు అప్పటికి తెలీదు కాబట్టి తనకి సరిపోయే ఒక రెండు జతల మంచి బట్టలు ఎందుకు తీసి ఇవ్వటం లేదా? అని వెంకటేశులు గాడు వాళ్ళ అమ్మా నాన్నలని తెగ తిట్టుకునేవాడు.

                  ఇంక అసలు కధలోకి వెళితే, ఆ రోజు ఆదివారం కాబట్టి బడికి వెళ్ళవలసిన పని ఎలాగూ లేదు. అంతకన్నా సంతోషం కలిగించే విషయం ఆ రోజు మా ఊళ్ళో అందరికన్నా ఎక్కువగా రెండొందల ఎకరాలు ఉన్న సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనాలు. అంతకు ముందు రోజు రాత్రే సుబ్బ రాజు గారి మనుషులు ఇద్దరు ముగ్గురు మా ఊళ్ళో గడప గడపకీ వచ్చి ఇంట్లో అందరూ పెళ్ళి భోజనానికి రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయారు. సుబ్బరాజు గారి ఇంట్లో పెళ్ళి భోజనం అంటే రోజూ తినే అన్నంతో పాటు అన్నానికి ముందు అయిదు రకాలు, తర్వాత అయిదు రకాలు పిండి వంటలు పెడతారు కాబట్టి ఈ మాట తెలిసిన దగ్గర నుంచీ మా పిల్లలందరికీ ఆ సంవత్సరం సంక్రాంతి, దీపావళి లాగానే ఇంకో కొత్త పండగ ఎగస్ట్రాగా వచ్చినట్టు తెగ ఆనందమయిపోయింది. పిల్లలందరం కలిసే పెళ్ళి భోజనానికి వెళ్ళాలని అంతకు ముందే నిర్ణయించేసుకున్నాం కాబట్టి మేము అయిదారుగురుం కలిశాక వెంకటేశులుగాడిని కూడా పిలుచుకుని వెళ్ళటానికి వాళ్ళ ఇంటికెళితే ఇంకా వాళ్ళమ్మ వాడికి వీపు తోమి స్నానం చేయించటం లోనే ఉంది. సరే అని వాళ్ళ ఇంటి ముందే కాసేపు కూర్చున్నాక వాళ్ళమ్మ వాడికి రోజూ బళ్ళోకి వచ్చినప్పుడు వేసే బట్టలు కాకుండా ఇలాగ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు వేసుకునే కొంచెం మంచి బట్టలు వేసి మాతో పాటు పంపి, ఒక పదడుగులు ముందుకెళ్ళాక ఏదో గుర్తుకొచ్చినట్టు వెంకటేశులు గాడిని కేకపెట్టి పిలిచి "ఒరేయ్ బాబూ పంక్తి లో అందరి ముందూ ఎక్కువగా తినొద్దురా. దిష్టి తగులుతుంది." అని అందరికీ వినిపించేలాగా అరిచి చెపితే, ఏ విషయాన్ని చాటుగా చెప్పాలో ఏ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పాలో కూడా తెలియని ఆ మహాతల్లి అమాయకత్వానికి చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటే, తన తొందరపాటుకి, కొడుక్కి రెండు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని తన నిస్సహాయతకి, సిగ్గుపడి తల వంచుకుని గుడిసె లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అందరూ వాడిని, వాళ్ళ అమ్మని చూసి నవ్వటం గమనించిన వెంకటేశులు కి ఇదంతా పెద్ద అవమానం గా అనిపించి వాళ్ళమ్మని తిట్టుకుంటూనే మొహం వేలాడేసుకుని మాతో పాటు భోజనాలకి బయలుదేరాడు.

                  మేము వెళ్ళేసరికే కుర్చీలు, బల్లలు వేసేసి అన్నీ సిధ్ధంగా ఉన్నాయి. ఇంకా మొదటి పంక్తి కాబట్టి అప్పుడే కుర్చోవాలా? వద్దా? అని ఆలోచిస్తుంటే ఎవరో వచ్చి "ముందు పిల్లలకి పెట్టెయ్యండ్రా." అంటే ఇంక ఆలోచించకుండా బిల బిలా అంటూ వెళ్ళి మొదటి వరసలో కూర్చుండిపోయాం. మేము బళ్ళో మా లెక్కల మాష్టారు భీమేశ్వర్రావు గారు లెక్కలు చేసుకోవటానికి కొనమన్నారని కొన్న తెల్ల కాగితాల పుస్తకం లో ఉండే తెల్ల కాగితం లాంటి ఒక పెద్ద చుట్ట తెచ్చి మేము కూర్చున్న బల్ల మీద పరచటం కోసం దొర్లించుకుంటూ వెళ్తుంటే మొదటి సారిగా అది చూసిన మా అందరికీ చాలా విచిత్రమయిపోయింది. తరవాత మా ముందు అరిటాకులు వేసుకుంటూ మళ్ళీ అది కదలకుండా వెంటనే ఒక స్టీలు గ్లాసు పెట్టెయ్యటం కూడా చక చకా జరిగిపోయింది. ఆ తర్వాత మా అందరికీ బాగా తెలిసిన సుబ్బరాజు గారి దగ్గర పాలేరు గా చేసే కుంటి కులాసం గాడు గేదెలకి పాలు తీసే పాల తపేలాతో మా గ్లాసుల్లో మంచి నీళ్ళు పోసేసి వెళ్ళిపోయాడు. మొట్టమొదట గా వేడి వేడి గా రెండేసి బూరెలు, ఆ బూరెల్లోకి నెయ్యి, తర్వాత పూతరేకు, చిక్కని సేమియా పాయసం, పులిహోర వడ్డించారు. వెంకటేశులు గాడయితే వాళ్ళమ్మ చెప్పిన మాట కూడా మర్చిపోయి ఏ మొహమాటం లేకుండా ఇంకో రెండు బూరెలు ఇంకొచెం పులిహోర అడిగి మరీ వేయించుకుని తిన్నాడు. తర్వాత అన్నంలోకి వంకాయ పచ్చడి, పప్పు ఆవకాయ, కొబ్బరి వేసిన దొండకాయ వేపుడు, ములక్కాడ కూర, ఆనపకాయ ముక్కలు వేసిన సాంబారు, అప్పడం, చివరిగా పెరుగు, అందులోకి నంజుకోవటానికి చక్కెరకేళీ అరటి పండు, ఆఖరున కిళ్ళి. కిళ్ళీ గురించి అయితే అప్పటివరకూ వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటుంటే వినటమే గానీ తినటం మాత్రం అదే మొదటిసారి మా అందరికీ. వెంకటేశులుగాడయితే అందరూ చూస్తుండగానే అన్నం రెండు మూడు సార్లయినా వేయించుకున్నాడు.

                  భోజనం అయ్యాక ఇంటికెళ్ళేటప్పుడు కొంచెం దూరం వెళ్ళగానే వెంకటేశులు గాడికయితే అడుగు తీసి అడుగు వెయ్యటం కూడా కష్టం అయిపోయింది. ఎండకి ఒళ్ళంతా చెమటలు పట్టి, ఆయాసం ఎక్కువయ్యి మధ్యలో కుక్కల ప్రెసిడెంటు గారి ఇంటి ముందు ఉన్న నిద్ర గన్నేరు చెట్టు కింద కొంచెం సేపు కూర్చుంటే గానీ ఇంటికెళ్ళలేక పోయాడు. ఇంటికెళ్ళాక తల తిరుగుతున్నట్టు అయిపోయి అలాగే పడుకుండి పోయాడు. ఆ రోజు రాత్రి కూడా కడుపులో ఏదో దేవుతున్నట్టు, తిన్నదంతా గొంతులోనే ఉన్నట్టు, వికారంగా ఉన్నట్టు అనిపించి అసలు నిద్ర పొలేక ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తూ పడుకున్నాడు. ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే లేచి మొహం కడుక్కుందామని వేప పుల్ల తెంపుకుని నోట్లో పెట్టుకోగానే పెళ్ళి భోజనం లో తిన్నది తిన్నట్టే వాంతి చేసేసుకున్నాడు. దానికి తోడు వెంటనే జ్వరం, విరేచనాలు కూడా మొదలయ్యాయి. ఆ రోజు మంచం పట్టిన వెంకటేశులు గాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యి బళ్ళోకి రావటానికి పది,పదిహేను రోజులయినా పట్టింది. వెంకటేశులుకి దిష్టి తగిలిందని వాళ్ళమ్మ అయితే ముందు రెండు మూడు రోజులూ ఒక రోజు ఉప్పుగన్ను, ఇంకో రోజు నూనె గుడ్డ, మరో రోజు కోడి గుడ్డు దిష్టి తీసి పారేసింది. అయినా బాగవ్వకపోతే ఊళ్ళొ ఆరెంపీ డాక్టరుని పిలిపించి వైద్యం చేయించి మందులు కూడా ఇప్పించింది. తగ్గాక మరో పది రోజుల దాకా తన శక్తికి మించి పథ్యం కూడా పెట్టింది. ఇవన్నీ చెయ్యటానికి డబ్బులు సరిపోక వాళ్ళ అమ్మ, నాన్న కూలి పనులకి వెళ్ళేటప్పుడు చద్దన్నం పట్టుకెళ్ళటానికని కొన్న రెండు స్టీలు టిపినీలు, కోతల రోజుల్లో పనుల్లోకి వెళ్ళటానికి ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న ముప్పర్తిపాడు కొడవలి, వాళ్ళమ్మకి ఉన్న మూడే మూడు చీరల్లో ఒక చీర తీసుకెళ్ళి ఊళ్ళో తాకట్టు వ్యాపారం చేసే కాంతమ్మ గారి దగ్గర తాకట్టు పెట్ట వలసివచ్చింది. తన అనారోగ్యం తగ్గించటానికి వాళ్ళమ్మ ఎంత కష్టపడవలసి వచ్చిందో మొదటి సారిగా కళ్ళారా చూశాడు వెంకటేశులు. తనకి ఏమవుతుందో అని వాళ్ళమ్మ ఎంత భయపడిందో కూడా అర్ధం చేసుకున్నాడు.

                  అంతా అయ్యాక, ఈ దిష్టి గిష్టి ఉన్నయో లేదో ఆ దేవుడికే తెలియాలి కానీ, చచ్చి బతికిన వెంకటేశులుగాడి అనారోగ్యం గురించి అరెంపీ డాక్టరు గారిని మా ఊళ్ళో ఎవరో అడిగితే "ఊరికే వచ్చింది కదా అని అన్నీ ఒకేసారి కలిపి తినేస్తే అర్ధాకలితో ఆరుగు పోయిన పేగులు అరాయించుకోవద్దా?" అని తనకి తెలిసిన విషయం చెప్పాడు. వెంకటేశులు గాడు కూడా ఆ తర్వాత ఎప్పుడు పంక్తి భోజనాలకి వచ్చినా అంతకు ముందులా కాకుండా అప్పుడే పీకలదాక తిని వచ్చిన వాడి లాగా కొంచెమే తిని చెయ్యి కడుక్కుని వచ్చేసేవాడు. అదీగాక 'మనుషులకు రోగాలు, చావుపుట్టుకలు ఉంటాయని. సమాజం లో వివిధ ఆర్ధిక స్థాయిలు కూడా ఉంటాయని. మనిషి ఆర్ధిక స్థాయి ప్రకారమే అతని స్థానం నిర్దేశింపబడుతుందని. ఆ ఆర్ధిక స్థాయి పరిధిలో మాత్రమే తన అవసరాలను పరిమితం చేసుకోవాలని. సమాజ నియమాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణం గానే ఏ మనిషయినా నడుచుకోవాలని' లాంటి పెద్ద పెద్ద విషయాలన్నీ అప్పటికి మా అబ్రహాం మాస్టారు సోషల్ పాఠం లో ఇంకా చెప్పకుండానే అర్ధం చేసేసుకున్నాడు.

Thursday, January 26, 2017

టాగోర్ గీతాంజలి - చలం


















               నేను ఏడో తరగతి లో వున్నప్పుడు , మా నాయనమ్మ,  కార్తీక మాసం లో , రోజూ శివుడికి పూజ చేసి, చెరువులో అరటి దొప్ప లో దీపాలొదిలి , సాయంత్రం నేను బడి నుంచి రాగానే 'కార్తీక పురాణం' పుస్తకంలోంచి నాతో రోజుకో కథ చదివించుకుని వినేది. ఆ పుస్తకం చదివాక నాకు దేవుడి మీద బోలెడన్ని సందేహాలొచ్చేసి, ఓ సారి మా తరగతిలో నాతోపాటు అందరికీ బాగా చనువు ఉన్న మా తెలుగు మాస్టారు ఉమా మహేశ్వర్రావు గారిని "దేవుడున్నాడాండీ?" అని అడిగేశాను. మామూలుగా అయితే మా లాంటి పిల్లలం అప్పుడప్పుడూ కుతూహలం కొద్దీ అడిగే "లారీలకి వెనకాల NP అని ఎందుకు రాసి ఉంటుందండీ?" "ఈ నేలని తవ్వుకుంటా కిందకంటా వెళ్ళిపోతే ఏమొస్తాదండీ?" "దూరదర్శన్ లో వార్తలు చదివే వాళ్ళు మనకి కనిపిస్తారు కదండీ, అలాగే మనం కూడా వాళ్ళకి కనిపిస్తామాండీ?" అని అడిగే వెర్రి మొర్రి కలగూరగంప ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా, నిక్కర్చిగా సమాధానాలు వివరించి చెప్పే ఆయన, ఈ ప్రశ్నకి కూడా, మా ఊరు కోమటి కొట్లో మాకు పప్పులు, బెల్లం ముక్కలు పెట్టే కోమటి తాత గారు కొట్లో వున్నారా? అని అడిగితే ఉంటే ఉన్నాడనీ, లేకపోతే లేడనీ,  ఖచ్చితం గా చెప్పేసినట్టు దేవుడు కూడా ఫలానా గుళ్ళో వున్నాడనో లేడనో తెగేసి చెప్పేస్తారుకున్నాను. కానీ నా ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం "దేవుడు ఉన్నాడనుకుంటే వున్నాడు. లేడనుకుంటే లేడు" అని. అసలు దేవుడు ఉన్నాడా ? అని మనకి అనుమానమొచ్చిందంటే దానికి కారణం దేవుడు నిజంగా ఉండయినా ఉండాలి లేదా లేని దేవుడిని ఉన్నాడని మనం నమ్ముతూ అయినా ఉండాలి. దేవుడు ఉన్నాడనటానికి ఏ విధమయిన శాస్త్రీయమయిన ఆధారం లేదు కాబట్టి దేవుడు లేడని వాదిస్తారు హేతువాదులు. దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడి అవసరం మాత్రం మనిషికి చాలా ఉంది. లేకపోతే మనిషికి నైతిక విలువలు ఇంత సులువుగా, ఇంత బాగా ఎలా అబ్బాలి ?  ముఖ్యంగా మనిషికి మనశ్శాంతి, కావాలని తప్పు చేసి దండం పెట్టి తప్పించుకోవటానికి కావలసిన ఆధారం ఎక్కడ దొరకాలి ? ప్రపంచం లో ఉన్న చట్టాలు, ప్రభుత్వాలు పనికి రాకుండా పోయిన రోజు మనిషిని,మనిషిని కలిపి ఉంచగలిగిన శక్తి ఎంతో కొంత దైవ భావానికే ఉంది. నిజానికి మతం అనేది కేవలం ఒక అభిప్రాయం. దేవుడికి, మతానికి ఏ విధమయిన సంబంధమూ లేదు. ఇప్పడు మనిషికి కావలసింది కూడా మతాన్ని, దేవుడిని విడి విడి గా చూడగలిగినంత పరిణతి సాధించటమే. మనం అనుకునే ఈ పాప పుణ్యాలకీ, స్వర్గ నరకాలకీ, పూజా పునస్కారలకీ, భయ భక్తులకీ అతీతమయిన అలాంటి దేవుడు ఉన్నాడని తెలియజెప్పి అందరికీ కావలసిన ఆ అసలయిన దేవుడిని ఒక కొత్త దేవాలయంలో ప్రతిష్టించింది గీతాంజలి.

                 తల్లి మారాం చేసే బిడ్డని లాలించి, ఆడించి, పాడించి కుదురుగా ఒక చోట కూర్చోబెట్టినట్టు టాగోర్ కూడా గీతాంజలి లో దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు లేడని వాదించే నాస్తికులనీ, ఉన్నా ఎలా చేరుకోవాలా అని ఆరాటపడే ఆస్థికులనీ సమానంగా పరవశింపజేశారు. గీతాంజలి కి నోబెల్ బహుమతి వచ్చిందని పుస్తకాల్లో చదివి, ఆ తర్వాత తొమ్మిదో తరగతి ఇంగ్లీషు వాచకం లో "Where the Mind is ..." అన్న పద్యం బట్టీ పట్టి గీతాంజలి లో దేశ భక్తి గురించి చెప్పారేమో అనుకున్నాను. ఆ తర్వాతెప్పుడో డిగ్రీ లో ఉండగా రాజమండ్రి గౌతమి లైబ్రరీ లో చలం గారి 'మైదానం' చదివి ఇంటికొచ్చేటప్పుడు ప్రకాష్ నగర్ పార్కు దగ్గర పుస్తక ప్రదర్శన లో చలం గారిదే టాగోర్ గీతాంజలి తెలుగు అనువాదం  కనిపిస్తే కోట గుమ్మం సెంటర్లో బజ్జీల బండి దగ్గర మిరపకాయ బజ్జీలు తిందామని దాచుకున్న పదిహేను రూపాయలతో ఆ పుస్తకం కొనేశాను. పుస్తకం చదివి పూర్తి చేశాక అప్పటివరకూ దేవుడి గురించి నాకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయిపోయి భగవంతుడి అసలయిన విశ్వరూపం నాకు సాక్షాత్కరించింది.

దేవుడిని కనిపెట్టటం కోసం కొట్టుమిట్టాడుతున్న వేదాంతులకీ, సైంటిస్టులకీ, బాబాలకీ, స్వాములకీ, వజ్ర కిరీటాలు చేయించే మహా భక్తులకీ, ఒంటికి బూడిద పూసుకుని ముక్కు మూసుకుని తలక్రిందులుగా తపస్సు చేసుకునే సన్యాసులకీ కూడా అర్థం కాని దేవుడి తత్వాన్ని...

 "ఊరి బాట వెంబడి ఇంటింటికీ బిచ్చమెత్తుతూ బయలు దేరాను. మిరుమిట్లు గొలిపే స్వప్నం వలే దూరంగా నీ బంగారు రధం కనిపించింది. ఈ రాజాధిరాజెవరో అని ఆశ్చర్యపడ్డాను. నా ఆశలతిశయించాయి. నా దరిద్రం తీరిపోయిందనుకున్నాను. అడక్కుండానే భిక్షం పెడతారనీ దుమ్ములో అన్నివేపులా ధనం వెదజల్లుతారనీ ఎదురుచూస్తూ నించున్నాను.నేనున్న చోటనే నీ రధం ఆగింది. నీ చూపు నా పైన నిలిచింది. చిరునవ్వుతో రధం దిగి వచ్చి నన్ను సమీపించావు. ఇంకేం ఈ నాటికి నా భాగ్యం పండిందనుకున్నాను. నువ్వు తటాలున నీ కుడి చెయ్యి చాచి "నా కేమిస్తావు?" అని అడిగావు."

"ఆభరణాలు మన ఐక్యతను చెరుపుతాయి, నీకూ నాకూ మధ్య అవి అడ్డం. నీ రహస్య వాక్కుని వినపడకుండా చేస్తుంది వాటి గలగల."

"నా జ్ఞానేంద్రియాలని ఎన్నడూ మూయను నా దృష్టి, శ్రవణం, స్పర్శ, నీ అనుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తాయి."

"ఈశ్వరుడు ఎండలో, వానలో, దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలెనే నువ్వు కూడా దుమ్ము నేల మీదికి రా!"

"ఈ అన్వేషణ అంతా అర్ధం లేనిది. అవిచ్చిన్నమయిన సంపూర్ణత అంతటా విలసిల్లుతుంది."

అని ఈశ్వరుడిని ఉద్దేశించి చేసిన కవితా గానం తో పున్నమి రోజు రాత్రి వెన్నెల పరుచుకున్నట్టు మన కళ్ళకి చూపించి, మనసుకు అనుభవింపచేసింది గీతాంజలి.

       మనిషి దేవుడి కోసం అన్వేషించటం కాదు. దేవుడే మనిషి కోసం అన్వేషిస్తున్నాడు. మనిషి దేవుడికోసం ఆరాటపడటం కాదు. దేవుడే మనిషి కోసం ఆరాటపడుతున్నాడు. ఎప్పుడూ దేవుడిని వరాలు కోరుకోవటమే కాదు. అప్పుడప్పుడూ దేవుడిని కూడా "నువ్వు బాగున్నావా?" అని అడగాలని దేవుడే మనందరినీ అర్ధిస్తున్నాడు. మనిషికి దేవుడి అవసరం ఎంత ఉందో, దేవుడికి మనిషి అవసరం కూడా అంతే ఉంది. బహుశా అందుకే దేవుడు మనిషిని సృష్టించాడేమో? "భగవంతుడు మన కోసం పరితపిస్తున్నాడ"న్న టాగోర్ మనసు ఘోష గీతాంజలి మొత్తం అంతః ప్రవాహంగా సాగుతుంది.  గీతాంజలి మీద ఉన్న ఇష్టం వల్లనో, గీతాంజలిలోనే చెప్పినట్టు రాత్రీ పగలూ కష్టపడి మన చుట్టూ మనమే అంతు లేని ఎత్తయిన గోడలు కట్టుకోవటం లో మునిగిపోయి, చీకట్లో మొద్దు బారిపోయిన మన బుర్రలకి సూటిగా చెపితే అర్థం కాదనో తెలీదు గానీ, ఆదిశంకరాచార్యుల 'భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే' బాటలో 'మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది' అన్న శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' లోకి తన ముందుమాట తో మనలని లాక్కెళ్ళి పడేసిన అదే చలం, ముందు 30 పేజీల వ్యాఖ్యానంతో టాగోర్ గీతాంజలి లోకి కూడా అడుగులో అడుగు వేయించుకుని మనలని నడిపిస్తాడు.

   అయినా గీతాంజలి గురించి చెప్పటానికి నేనెంతటి వాడిని ? చలమే చెప్పినట్టు గీతాంజలి అంతరార్ధం చలానికేం తెలుసు ? టాగోర్ కి ఎంత మాత్రం తెలుసు ? చదివి, అనుభవించి, పలవరించి ఎవరికి వాళ్ళు తెలుసుకోవలిసిందే.

Sunday, January 15, 2017

ఖైదీ నంబర్ 150 - Review

         ఏదయినా ఒక సినిమా చూడటానికి మూడు నాలుగు కిలోమీటర్లు బస్సులోనో, ఆటోలోనో వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు బస్సు ఎక్కటం కూడా మర్చిపోయి సినిమా గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూనే ఇంటికి వచ్చెయ్యటం అనేది నాకు ఇప్పటివరకూ రెండు సినిమాల విషయంలో జరిగింది. ఒకటి రాంగోపాల్ వర్మ 'సత్య ' ఇంకొకటి కృష్ణవంశీ 'సింధూరం'. మళ్ళీ చాన్నాళ్ళ తర్వాత అలాంటి అనుభూతినే కలిగించిన సినిమా 'ఖైదీ నంబర్ 150'. ఇంకా చెప్పాలంటే ఒకప్పటి చిరంజీవితో పాటు, అప్పటి చిరంజీవి సినిమాలతో ముడి వేసుకున్న చిన్నప్పటి, పాత జ్ఞాపకాలని కూడా ఒకసారి గుర్తు చేసిన సినిమా ఇది. ఈ సినిమా కధ, కధనాలు తమిళం నుండి అరువు తెచ్చుకున్నా కూడా, తెర మీద చిరంజీవి తప్ప అవి ఏవీ మనకి గుర్తుకు రావు. ఒకప్పటి ఖైదీ, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాంధవుడు లాంటి సినిమాల లో చిరంజీవి నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ తన నట విశ్వరూపం ప్రదర్శించటం కన్నా కూలి చేసుకునే సామాన్య ప్రేక్షకుడిని కూడా తన సినిమా అలరింప చేయాలనే చిరంజీవి తపనే అతనిని ఇంత పెద్ద స్టార్ ని చేసింది. దానిని గుర్తించి ఇప్పటికీ దానికే కట్టుబడి, అలాంటి అన్ని అంశాలు చూపించటానికి అవకాశం ఉండటం వల్లనే మళ్ళీ తెరపై కనిపించటానికి ఈ సినిమాని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది.

         ఒక సామజిక సమస్య గురించి సామాన్యుడు ఎంత గొంతు చించుకున్నా ఎవరికీ పట్టదు. ఎక్కువ మందికి అది చేరుకోదు. కానీ అదే సామాజిక సమస్యని ఒక సినిమా గా చూపిస్తే, అందులోనూ ఒక పెద్ద హీరో నటించిన సినిమాలొ చూపిస్తే ఆ సమస్య గురించిన అవగాహన అందరికీ కలుగుతుంది. గత డభ్భై సంవత్సరాల నుంచీ ప్రతి తెలుగువాడిపై సినిమాల ప్రభావం చాలా ఉంది. ఒకప్పుడు అంటరానితనం, భూస్వాముల దోపిడి గురించి, వరకట్న వేధింపుల సమస్యల గురించి విరివిగా సినిమాలు వచ్చేవి. నిజానికి చాలా మంది తాము తప్పు చేస్తున్నామని తెలియకపోవటం వల్లనే తప్పు చేస్తారు. అలాంటి వాళ్ళకి సినిమాలు ఒక హెచ్చరికలా ఉంటాయి. ఎంత కాదనుకున్నా ప్రస్తుత సమాజం పైన సినిమాల ప్రభావం చాలా ఉంది. సినిమా కావాలనుకుంటే ఐన్ స్టీన్ చెప్పిన 'సాపేక్ష సిధ్ధాంతాన్ని', ఉపనిషత్తుల్లో చెప్పిన 'కార్య కారణ సంబంధాన్ని' అక్షరం ముక్క రాని వాడికి కూడా అర్ధమయ్యేలా చెప్పగలదు. ఒకప్పుడు ఎన్టీఅర్ దేవుడి సినిమాల తర్వాతే, సామాన్య ప్రజల్లో భక్తి గురించి అవగాహన ఎక్కువయ్యిందని తన అనుభవంతో మా ఊళ్ళో ముసలయ్య తాత చెప్పటం నాకు బాగా గుర్తు. అలాంటి శక్తివంతమయిన సినిమా ద్వారా కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా సామాజిక సమస్యని కూడా ఎత్తి చూపిస్తూ చిరంజీవి మళ్ళీ మన ముందుకు రావటం ఒక మంచి నిర్ణయం. ఒకేలా ఉన్న ఇద్దరు హీరోలు. ఒక హీరో సమస్యని అనుకోని పరిస్థితుల్లో మరో హీరో పరిష్కరించటం. ఆ సమస్య రైతులకి సంబంధించినది కావటం ఈ సినిమా కధ. ఇలాంటి కధలని ఇప్పటివరకూ మనం చాలా సినిమాల్లో చూసేశాం. కానీ ఇంత సాదా సీదా కధకి చిరంజీవి తో పాటు సంభాషణలు కూడా నిజమయిన బలాన్ని ఇచ్చాయి. పాటల పరంగా 'చూడాలని ఉంది ' సినిమాలో లాంటి ఒకటి రెండు శ్రావ్యమయిన పాటలు కూడా కుదిరి ఉంటే ఇంకా బాగుండేది. పేరున్న నటీ,నటులు కేవలం నలుగురయిదుగురు మాత్రమే ఉన్న ఈ సినిమాలో నాకు ఎక్కువగా నచ్చిన అంశాలు మాత్రం చాలానే ఉన్నాయి.         

మీడియా ముందు చిరంజీవి మాట్లాడినప్పటి సంభాషణలు.

ఇంటర్వెల్ ముందు "నేను శీనుని కాదు శంకర్ ని" అని నిజంగానే శంకర్ పాత్రని ఆవాహన చేసుకున్నట్టు ఒక పూనకం తో చెప్పే సన్నివేశంలో, అద్భుతమయిన చిరంజీవి నటన.

నీరు.. నీరు.. పాట.

వన్నె తగ్గని చిరంజీవి డ్యాన్స్.

అక్కడక్కడా నవ్వించిన హాస్య సన్నివేశాలు, ముఖ్యంగా చిరంజీవి నటించినవి.

నాణేల ఫైట్.

         నిజానికి సినిమా అనేది దృశ్య ప్రధానమయిన మాధ్యమం. తక్కువ మాటలతోనే సన్నివేశాలని మనసుకు హత్తుకునే లాగా చూపించవచ్చు. కానీ కొంత కాలం నుంచీ పంచ్ డైలాగుల హవా ఎక్కువగా నడుస్తుంది. అదృష్టవశాత్తూ ప్రస్తుతం కొంత మంది రచయితలు పంచ్ డైలాగుల బదులు అర్ధవంతమయిన సంభాషణలు రాయటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో ఉన్న "పట్నాలన్నీ పల్లెటూళ్ళకి పుట్టిన పిల్లలు." అన్న ఒక్క మాటే నన్ను ఈ సినిమా గురించి రాయాలనిపించేలా చేసింది. తమిళ మాతృకలో ఉన్న సంభాషణల గురించి నాకు ఏమీ తెలీదు గానీ, ఇలాంటి మంచి సంభాషణలు ఈ సినిమాలో ఇంకా చాలానే ఉన్నాయి. వేరే భాషలో ఉన్న మంచి కధని మన భాషలోకి అనువదించుకుని చదివి ఆనందించటంలో తప్పు లేదు. అలాగే తెలుగు సినిమాలని మిగిలిన వాళ్ళు రీమేక్ చేసుకుంటునట్టే, వేరే భాషలో ఉన్న సినిమాని మన భాషలోకి పునర్నిర్మించి అందరూ ఆస్వాదించేలా చెయ్యగలిగితే అందులోనూ తప్పులేదు. ఆ విషయం లో 'ఖైదీ నంబర్ 150' సఫలీకృతమయ్యిందని చెప్పటంలో కూడా ఏ విధమయిన సందేహం లేదు.

         చివరిగా, చిన్న చిన్న లోపాలు కనిపించినా గానీ, బహుశా ఈ సినిమా నాకు నచ్చటానికి ఒక కారణం నేను ఒకప్పటి చిరంజీవి అభిమానిని కావటం కావచ్చు, అంతకు మించి ఇప్పటికీ నేను చిరంజీవి అభిమానినే అని మరోసారి బల్ల గుద్ది చెప్పుకోవటానికి ఈ సినిమా ద్వారా నాలాంటి అభిమానులకి అవకాశం ఇవ్వటం కూడా కావచ్చు.

Friday, December 2, 2016

ప్రయోగం

         పొద్దున్నే నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు చదివిన పుస్తకం లోని వాక్యాలు దృశ్యాల రూపంలో కలలోకి వచ్చి నా నిద్రని కలత నిద్రగా మిగిల్చిన విషయం గుర్తుకొచ్చింది. రాత్రి నేను చదివిన పుస్తకంలో కొన్ని ప్రయోగాల గురించి ఉంది. అయితే అవి సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు కాదు, మనుషుల జీవితాలకి సంబంధించిన ప్రయోగాలు. కొంత మంది తమ జీవితాలతో తాము చేసుకున్న ప్రయోగాలు. నిజానికి మహాత్మా గాంధీ తన జీవితమే సత్యంతో తాను చేసిన ఒక ప్రయోగం అని చెప్పుకున్నారు. సైన్సుకి సంబంధించిన ప్రయోగాలు భౌతికమయిన విషయాల గురించిన నిజాలను వెలికి తీస్తాయి. జీవితానికి సంబంధించిన ప్రయోగాలు మాత్రం మన దృక్పథాన్ని మార్చగలిగిన జీవిత సత్యాలని మనకి తెలియ చేస్తాయి. నిజానికి మన జీవితాలని మన ప్రమేయం లేకుండానే కాలం తన నిరంతర ప్రయోగాలకి గురిచేస్తూ ఉంటుంది...
.
.
.
('వాకిలి' పత్రిక లో వచ్చిన నా కథ పూర్తిగా : http://vaakili.com/patrika/?p=12776)

Thursday, May 19, 2016

కొత్తల్లుళ్ళు


          మామూలుగానే మా ఊళ్ళో ఎవరిదైనా పెళ్ళి జరుతుందంటే ఊరి మొత్తానికీ పండగలాంటిదే. ఎందుకంటే ఎలా లెక్కేసుకున్నా ఊళ్ళో అందరూ అందరికీ బీరకాయ పీచుకన్నా ఇంకొంచెం దగ్గరి బంధువులే అవుతారు. అందుకే ఊళ్ళో ఎవరి ఇంట్లో అన్నా పెళ్ళికి 'గాడి పొయ్యి' వెలిగిందంటే, ఆ మూడు రోజులూ ఊళ్ళో మిగిలిన వాళ్ళు పొయ్యి వెలిగించవలసిన అవసరంలేదు. అలాంటిది రంగయ్యగారి పండు గాడికీ, కిట్టయ్య గారి వెంకటేశులుకీ ఒకే రోజు పెళ్ళి ముహూర్తం కుదిరిందీ అంటే ఆ రోజు పెద్ద పండగా, కప్పాలమ్మ జాతరా కలబడి మా ఊరి మీద పడిపోయినంత బ్రహ్మాండమయిపోయింది. ఇంతకంటే బ్రహ్మాండమయిన ఇంకో సంగతేంటంటే ఇద్దరూ పెళ్ళి చేసుకోబోయే అత్తగారి ఊరు కూడా ఒకటే అవటం. ఆ ఊరి పేరు కొమ్మర. మా ఊరికి ఆ ఊరు పెద్ద దూరం కూడా కాదు. ఇద్దరు మనుషులు ఎదురూ, బొదురూ కూర్చుని పులి మేకా ఆడుకుంటున్నట్టు రెండు ఊళ్ళూ ఎదురెదురుగానే ఉంటాయి. కాకపోతే నిజంగానే ఆ ఊరి జనానికీ, మా ఊరి జనానికీ పులి కీ మేకకీ ఉన్నంత తేడా ఉంది. మా ఊరి జనంలా కాకుండా కొమ్మర వాళ్ళకి పెట్టేదగ్గర పెద్ద చెయ్యి, తిట్టే దగ్గర చెడ్డ నోరు అని చుట్టుపక్కల పేరు.

               అందుకే, ఇంక పెళ్ళికి పందిరి గుంజ పాతిన రోజు నుంచీ యానాళ్ళ భోజనాలు అయిపోయేవరకూ పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు తాలూకు మనుషులు ఎక్కడ ఎదురుపడినా ఒకరినొకరు వేళాకోళమాడుకోవటం, కొంచెంలో కొంచెం దెప్పిపొడుచుకోవటం మామూలయిపోయింది. పెళ్ళి రోజు పంక్తి భోజనానికొచ్చిన కొమ్మర పాత కరణం గారి పెద్ద కొడుకు అంజి బాబు గారయితే ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ పక్కనే కూర్చున్న మా ఊరి పెద్ద మనుషుల్లో ఒకరయిన పెద్దబ్బులు మాష్టారిని దొరకబుచ్చుకుని "అగ్గిపుల్ల ఖర్చుకి వెనకాడి, ఎవరు ముందు పొయ్యి వెలిగిస్తే వాళ్ళ దగ్గర నిప్పు తెచ్చుకుందామని అంగలార్చుకుని చూసే మీ పీనాసి జనానికి మా ఊరి సంబంధమంటే బూరెల బుట్టలో పడ్డట్టే కదా, కాదంటావా?" అని అందరి ముందూ అడిగేశారు. పెద్దబ్బులు గారు, ముందు రెండు గుటకలు మింగినా కానీ తర్వాత తేరుకుని "పులస చేపకోసం పొలాలమ్ముకునే మీకు మేము తప్ప వేరే గతి ఉంటే కదా, అయినా మా ఊరి రామాలయంలో రాముడు ఎంతో, మా పండు గాడు, వెంకటేశులు గాడూ అంత, అలాంటోళ్ళు సంక్రాంతి అల్లుళ్ళ హోదాలో అడుగు పెట్టాలంటే మా వాళ్ళకి పిల్లనిచ్చినోళ్ళు ఏ జన్మలోనో లక్ష వత్తుల నోము నోచుకుని ఉండాలి. కాదంటావా?" అని గట్టిగానే సమాధానమిచ్చి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నెగ్గుకు రాలేమని చెయ్యి కడుక్కుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. నిజంగానే మా పండు గాడూ, వెంకటేశులు గాడి గురించి పోల్చి చెప్పాలటే ఒక్క శ్రీరాముడు తప్ప ఇంకో దేవుడు కనిపించడు. ఆ మాట అలా ఉంచితే ఇదంతా విన్న అక్కడే ఉన్న మా ఊరి కుర్రాళ్ళు కొంత మంది "ఏమయినా కొమ్మర ఊరి అత్తమామలు పెట్టే మణుగుడుపు భోజనం తినాలంటే నిజంగానే పెట్టి పుట్టాలెహె" అని పండు గాడికీ, వెంకటేశులు గాడికీ పట్టిన అదృష్టం గురించి మనసులోనే కుళ్ళుకున్నారు.

               పెళ్ళయిన మూడో రోజు కి ఈ వేళాకోళాలు మరీ ఎక్కువయిపోయి యానాళ్ళ భోజనాలకి వెంకటేశులు గాడి అత్తగారి ఇంటికి వెళ్ళిన మా ఊరి జనం ఓ ముప్పై మందిని ఏడిపించటానికి వెంకటేశులుగాడి పెద్ద బావ మరిది నాలుగు బ్రాందీ సీసాలు వాళ్ళ ముందు పెట్టి వెళ్ళి పోయాడు. ఎప్పుడయినా కల్లు కోటయ్య దగ్గర అప్పుడే చెట్టు మీద నుంచి దించిన కల్లు తాప్ప ఇంకొకటి తాగి ఎరగని మా ఊరి వాళ్ళు నీళ్ళు కలుపుకుని తాగాలని తెలియక కనిపించిన సీసా కనిపించినట్టు గడ గడా అని తాగేసి వాంతులు చేసుకుని వెళ్ళిన ట్రాక్టరు ట్రక్కు మీదే మళ్ళీ వెనక్కొచేశారు. ఇలా సందట్లో సడేమియా లాగా పెళ్ళి అయిపోయాక చెప్పుకోవలసిన మరో ముఖ్యమయిన బ్రహ్మాండమయిన విషయం ఏంటంటే పండు గాడు, వెంకటేశులు గాడి అత్తవారి ఇళ్ళు కూడా ఎదురెదురు గానే ఉండటం. అసలే పెట్టే దగ్గర పట్టింపులు ఎక్కువని పేరున్న అమ్మాజీ గారి అల్లుడు పండు గాడికి మొదటి రోజు అత్తగారి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు మధ్యలో బంగారు పువ్వు తాపడం ఉన్న వెండి కంచం లో ఫిరంగి గుండంత మినప సున్నుండ, మళ్ళీ దాని మీద కుమ్మరించిన అర గ్లాసు నెయ్యితో మొదలయ్యి తర్వాత ప్రత్యేకంగా ఆత్రేయపురం నుంచి తెప్పించి చుట్టిన పూతరేకులు, అరిసెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, ఆ రోజు శని వారం కాబట్టి నీసు మాంసాలేవీ లేవు గానీ, అన్నం లోకి ఉగ్గిన్నుడు కాచిన నెయ్యితో ముద్ద పప్పు ఆవకాయ, జీడిపప్పు ములక్కాడ కూర, పనస పొట్టు కూర, వంకాయ శనగ పప్పు, చలవ చెయ్యటానికని పాలు పోసి కలబెట్టిన ఆనపకాయ కూర, చివరలో గడ్డ పెరుగు అందులో నంజు కోవటానికి తాటి బెల్లం ముక్క తో ముగిసింది. ఇంక ఇదివరకోసారి జన్మభూమి కార్యక్రమం కింద ఆ ఊరొచ్చిన కాలేజీ పిల్లలకే ఆ పది రోజులూ పంచభక్ష్య పరమాన్నాలూ పెట్టి పంపించి ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టు పక్కల కూడా అన్నం పెట్టే దగ్గర అంత గొప్ప మహా తల్లి లేదు అని అనింపించుకున్న రాజమ్మ గారి అల్లుడు వెంకటేశులు గాడి దంత సిరి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నీసు మాంసాలు తినే రోజులైతే ఇద్దరికీ చేపల్లో పిత్త పరిగ దగ్గర నుంచి కొరమేను దాకా, మాంసాల్లో నాటు కోడి దగ్గర నుంచి కణుజు పిట్ట దాక, మధ్య మధ్య లో టైగర్ రొయ్యల వేపుడు, రెండు సొనల బాతు గుడ్లు, వంకాయ పీతల పులుసు, అంతా అయ్యాక పెరుగు అయితే వేడి చేస్తుందని అన్నంలోకి కంచం నిండా చిలికిన మజ్జిగ, అందులోకి నంజుకోవటానికి అరచెయ్యి పట్టినంత వెన్న ముద్దా, మళ్ళీ మధ్యాహ్నం ఒక్కోసారి రెండు గంగా బోండం కొబ్బరి కాయల నీళ్ళు, పెరుగు ఆవడలు, లేకపోతే దిబ్బరొట్టె ఉండేవి.

               ఇలా ఒక వారం రోజుల వీర వైభోగం తర్వాత ఒక రోజు పండు గాడు, వెంకటేశులు గాడూ కలిసి చెరువు గట్టు మీద వాలీ బాలు ఆడుతున్నారని తెలిసి సరదాగా చూడటానికి బయలుదేరారు. ఇద్దరూ ఒకళ్ళ పక్కన ఒకళ్ళు అలా చెరువుగట్టు దాకా నడుచుకుని వెళుతుంటే చూసిన వాళ్ళలో ఎవరు అన్నారో గానీ "అత్త గారింట్లో మణుగుడుపు భోజనానికి రాజమ్మ గారి అల్లుడి కన్నా అమ్మాజీ గారి అల్లుడు మంచి రంగు తేలి పుష్టిగా తయారయ్యాడని" నిజమో అబధ్ధమో గానీ, అందరి ముందూ ఒక మాట అనేశారు. ఈ మాటే ఆ నోటా, ఈ నోటా రాజమ్మ గారి చెవిన పడి ఆ రోజంతా తెగ ఇదయిపోయి అప్పటినుంచీ అల్లుడికి భోజనం కోటా రెట్టింపు చేయించి, ఒక సున్నుండకి రెండు సున్నుండలు, ఐదు గారెలకి పది గారెలు కంచం లో కుమ్మరించటం మొదలెట్టింది. ఆ తర్వాత నుంచీ వెంకటేశులు గాడినీ, పండు గాడినీ పక్క పక్క న చూసినోళ్ళు రాజమ్మ గారి అల్లుడు వెంకటేశులు ముందు అమ్మాజీ గారి అల్లుడు పండు గాడు అసలు ఆనటమే లేదని అనటం మొదలెట్టారు. ఈ మాటలకి తల కొట్టేసినట్టు అయిపోయిన అమ్మాజీ గారు ఊళ్ళో ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని పండు గాడి తిండి కోటా కూడా బాగా పెంఛేశారు. ఊళ్ళో అత్తగార్ల పరువు సంగతి ఏమో గానే ఈ పోటా పోటీ వ్యవహారం చివరికి పండు గాడికీ, వెంకటేశులు గాడికీ తినలేక నిజంగానే పెద్ద ప్రాణ సంకటమే అయిపోయింది. చివరకి ఆ ఊళ్ళో జనం వరల్డ్ కప్పు క్రికెట్టుకి పందాలేసినట్టు అమ్మాజి గారి అల్లుడు ఎక్కువ లావా ? రాజమ్మ గారి అల్లుడు ఎక్కువ లావా? అని పందాలు కాసు కోవటం మొదలెట్టారు. ఈ పోటీ ఎంత వరకూ వెళ్ళిందంటే, ఎవరో వచ్చి, గదిలో పెట్టి ఎండు మిరపకాయల పొగ వేస్తే ఉన్నపళంగా ఎర్రగా, లావుగా అయిపోతారని చెపితే ఇద్దరి అత్తమామలు దానికి కూడా సిధ్ధమయిపోయారు గానీ ప్రాణాల మీదకి వస్తుందేమో అని భయపడి వెనక్కి తగ్గారు. ఇంతకన్నా మంచి ఉపాయం బ్రాందీ, విస్కీ లు తాగించటమే అని నిర్ణయించేసుకుని, వాళ్ళ పెళ్ళాలతో చెప్పించి ఎప్పుడయినా కొంచెం పుచ్చుకుంటే ఏమీ కాదులే అని, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు, అల్లుళ్ళు ఇద్దరితోనూ నెమ్మదిగా మద్యపానం కూడా మొదలు పెట్టించారు.

               ఈ అత్తగారి ఇంట్లో మణుగుడుపు ముచ్చట్లు అయిపోయేనాటికి కోతలు మొదలైపోయి జనాలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయి కొమ్మరలో కొత్తల్లుళ్ళు గురించి మట్లాడుకోవటం మానేశారు గానీ వాళ్ళిద్దరూ తిరిగి మా ఊళ్ళో అడుగు పెట్టేసరికి మాత్రం వాన పాము లాగా, గడ కర్రలాగా ఉండే పండు గాడు, వెంకటేశులు గాడూ, ఒకడు ఒంగోలు గిత్తలాగా, ఇంకొకడు మైసూరు ఎద్దు లాగా అయిపోయి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటేగానే ఊళ్ళో ఎవరూ వాళ్ళని గుర్తు పట్టలేనంతగా అయిపోయారు. ఇంకొన్ని రోజులకయితే చుట్టుపక్కల అటు ఏడు, ఇటు ఏడూ పధ్నాలుగు ఊళ్ళకీ, వీళ్ళ లాగా, పంట చేతికొచ్చిన చేను గురించి కూడా పట్టించుకోనంత పెద్ద తాగు బోతులు లేరన్న చెడ్డ పేరు కూడా తెచ్చేసుకున్నారు. ఇక అప్పటినుంచీ వాళ్ళ చేత తాగుడు మానింపించటానికి వాళ్ళ అమ్మా నాన్నలు, ఏదో సరదాకి చేసినదానికి ఇలా అయ్యిందేమిటా అని తెగ బాధ పడి పోయిన భార్యలు, నానా తంటాలు పడి అయ్యప్ప స్వామి మాలలు వేయించి, డాక్టర్లకి చూపించి, గోదారవతల అదేదో ఊళ్ళో ఆకు పసరు తో తాగుడు మానిపిస్తారని తెలిసి అక్కడికి తీసుకెళ్ళి చివరికి ఇద్దరూ చెరో ఇద్దరు పిల్లలకీ తండ్రులు అయ్యేనాటికి వాళ్ళచేత తాగుడు మానిపించగలిగారు. పండు గాడు, వెంకటేశులు గాడూ ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అయితే బ్రాందీ కొట్టు మొహం చూడలేదు గానీ, ఇక ముందు సంగతి ఏమో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎప్పుడూ అదురు గుండెలూ, బెదురు గుండెలతోనే ఉంటున్నారు.