ఎండా కాలం తర్వాత చినుకులు పడటం మొదలయ్యింది. పిల్లలకి వేసవి శెలవులు
కూడా అయిపోయాయి. దాచి పెట్టుకున్న తాయిలాలేవో బయటికి తీసినట్టు మొన్నటిదాకా
ఎండిపోయిన చేల గట్లు, కాలవ గట్లు, చెట్లూ పచ్చగా అవుతున్నాయి. చేల నిండా
నీళ్ళు నిండి పురుగు, పుట్ర, కప్పలు గోల చెయ్యటం మొదలెట్టాయి. బాతులు
మేపుకుని బతికే బాతులోళ్ళు ఈ పురుగులు, నత్తలు తినే బాతుల్ని గుంపులు
గుంపులుగా తోలుకొచ్చి కొత్తపల్లి పొలాల్లోనూ, మా ఊరి పొలిమేర దాకా ఉన్న
కొమ్మర పొలాల్లోనూ మేపుకుని వెళ్ళిపోతున్నారు. మామూలుగా అయితే శెలవులకి,
ఆటలకి అలవాటు పడ్డ పిల్లలందరూ బడి అయిపోగానే సాయంత్రం తొందరగా అన్నం తినేసి
రాత్రి చీకటి పడేదాకా వీధి దీపాల వెలుగులో పెంకులాట, తొక్కుడు బిళ్ళ,
రాముడు సీత, పంది మరుగు, దొంగా పోలీసు ఆడుకునేవాళ్ళు కానీ, ఈ మధ్యన మా ఊరి
చుట్టుపక్కల ఊళ్ళళ్ళో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు తిరుగుతున్నారని
తెలిసి చీకటి పడ్డాక చిన్న పిల్లల్ని బయటికి పంపటం మానేశారు ఊరి జనం.
పిల్లలు అన్నం తినటానికి మారాం చేసినా, అల్లరి చేసినా, ఒంటి మీద గోచీ తప్ప
ఏమీ లేకుండా చుట్టుపక్కల ఊళ్ళళ్ళో అడుక్కుంటూ తిరిగే మొండోడి కి
ఇచ్చేస్తాననో, బ్రాహ్మల అబ్బాయి గారి చెరువు గట్టు మీద చింత చెట్టు మీద
ఉండే ఒంటి కన్ను రాక్షసుడికి ఇచ్చేస్తాననో, పిల్లల్ని ఎత్తుకెళ్ళి
పోయేవాళ్ళకి ఇచ్చేస్తాననో భయపెట్టే పెద్ద వాళ్ళు, నిజం గానే పిల్లల
దొంగలు తిరుగుతున్నారని తెలిసి భయపడిపోయి ఉప్పు, ముగ్గు అమ్ముకునే వాళ్ళు,
ఆడవాళ్ళు తల దువ్వుకున్నప్పుడు వచ్చే జుట్టు పోగు చేసి ఇస్తే బుడగలు
ఇచ్చేవాళ్ళు, పాత ఇనుప ముక్కలకి వేరు శనగ పప్పు అచ్చులు ఇచ్చే వాళ్ళూ, ఇలా
అమ్ముకోవాడానికి కూడా ఎవరొచ్చినా అనుమానంగా చూడటం మొదలెట్టారు. దానికి తోడు
మొన్న పని మీద తాడేపల్లిగూడెం వెళ్ళి వచ్చేటప్పుడు బస్సులో "ఆకుతీగలపాడు
లో అప్పారావు గారి రెండో పిల్లోడిని ఎవరో ఎత్తుకు పోయారని" చెప్పుకుంటుంటే
విన్నానని చాకలి తిప్పడు చెప్పిన దగ్గర నుంచీ జనానికి అనుమానంతో పాటు భయం
కూడా ఎక్కువయ్యింది.
ఆ రోజు పొద్దున్నే వాయుగుండం పట్టిందని రేడియోలోవార్తల్లో వచ్చింది. డిగ్రీ మధ్యలో ఆపేసి పోలీసు డిపార్టుమెంటులో కానిస్టేబులు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న రామయ్య గారి రాంబాబు పొలం వెళ్ళి వర్షంలో తడుస్తూనే పొలానికి గట్టులంకలు వేసి, భుజం మీద పార, గడ్డపార తో సాయంత్రం చీకటి పడుతుండగా ఇంటికొచ్చేటప్పుడు పుంత రోడ్డు దగ్గర ఒక మగ మనిషి, చంకలో చిన్న పిల్లాడితో ఒక ఆడ మనిషీ అనుమానంగా తిరుగుతుంటే దగ్గరికెళ్ళి మీరెవరని అడిగితే, బాతులు మేపుకునే వాళ్ళమనీ, దారి తప్పి వాళ్ళ మనుషుల్ని వెతుక్కుంటూ ఇలా వచ్చామనీ భయం భయం గా చెప్పారు. వాళ్ళ వాలకం చూస్తుంటే రెండు రోజులనుంచీ స్నానం కూడా చేసినట్టు లేదు, చిన్న పిల్ల వాడు మాత్రం కడిగిన ముత్యంలా శుభ్రంగా కొత్త బట్టలతో ఉన్నాడు. వీళ్ళే ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళేమోనని రాంబాబుకి అనుమానమొచ్చి గట్టిగా అడిగితే, పిల్లవాడు కొడుకనీ, పక్కన ఉన్న మగ మనిషి తమ్ముడనీ ఈ రోజు పిల్లవాడి పుట్టిన రోజని తల స్నానం చేయించి కొత్త బట్టలేశామనీ చెప్పి సారా తాగకపోయినా, మామూలుగానే చింత నిప్పుల్లా ఉండే రాంబాబు కళ్ళు చూసి భయమేసి అక్కడి నునంచి గబగబా వెళ్ళి పోతుంటే "బాతులోళ్ళు కూడా పుట్టిన రోజులు చేసుకుంటారా? అబధ్ధాలు చెప్పి తప్పించుకుని పారి పోదామనుకుంటున్నారా?" అని ఇద్దరినీ రెక్కలు పట్టుకుని ఈడ్చుకొచ్చి ఊరి మధ్యన చెరువు గట్టు మీద వీధి దీపం వెలుగులో నిలువు కాళ్ళ మీద నుంచో బెట్టాడు.
రాంబాబు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే దొంగల్ని పట్టుకుని లాక్కొచ్చాడని అర గంటలో ఊరంతా తెలిసిపోయింది. ప్రెసిడెంటు రంగబాబు గారితో సహా ఊరి జనం అందరూ చెరువు గట్టు మీద వాళ్ళిద్దరి చుట్టూ మూగి "మీ ముఠా లో ఎంత మంది ఉన్నారు? ఇప్పటి దాకా ఏ ఏ ఊళ్ళల్లో ఎంత మందిని ఎత్తుకెళ్ళిపోయారు? మొన్న ఆకుతీగలపాడు లో పిల్లోడిని మాయం చేసింది కూడా మీరేనా? ఎత్తుకెళ్ళి ఏం చేస్తున్నారు? ఎవరికయినా అమ్మేస్తున్నారా? లేకపోతే కాళ్ళూ చేతులూ విరగ్గొట్టి ముష్టెత్తుకు రమ్మంటున్నారా?" అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, కీచురాళ్ళ అరుపులతో పాటు మనుషుల అరుపులు కూడా కలిసిపోయాయి. ఊరి మొత్తానికి ఒకే ఒక ఫోను ఉన్న ధాన్యం వ్యాపారం చేసే నారాయణ మూర్తి గారి ఇంట్లోంచి గణపవరం పోలీస్ స్టేషన్ కి ఫోను చేస్తే, గాలి వానకి వైర్లు తెగిపోయి ఫోను పని చెయ్యలేదు. వాళ్ళు మాత్రం మేము అలాంటి వాళ్ళం కాదని నెత్తీ, నోరూ కొట్టుకుని మొత్తుకుంటుంటే, ఇలా అడిగితే చెప్పరని రాంబాబు మగ మనిషిని లాక్కెళ్ళి చెట్టు మొదట్లో ఎర్ర చీమల పుట్ట ఉన్న కుంకుడు కాయ చెట్టుకి కట్టేసి, ఆడ మనిషి దగ్గర చంకలో పిల్ల వాడిని లాక్కుని ఆవిడ రెండు చేతులూ నులక తాడు తో కట్టి పచ్చి తాటి కమ్మ తీసుకుని ఇద్దరినీ చితక బాదేశాడు. నరశింహం గారయితే ఇలాంటి వాళ్ళని బతకనివ్వ కూడదని కిరసనాయిలు డబ్బా తీసుకొచ్చేస్తే వాళ్ళమ్మ గారు "తెల్లారాక పోలీసులొచ్చి చూసుకుంటార"ని చెప్పి బలవంతంగా ఆపారు కాబట్టి సరిపోయింది కానీ లేక పోతే అప్పుడే వాళ్ళిద్దరికీ భూమ్మీద నూకలు తీరిపోయేవి. ప్రెసిడెంటు రంగ బాబు గారు, ఇలాంటి కరుడు గట్టిన దొంగల ముఠా వాళ్ళని పట్టుకున్నందుకు రాంబాబుని మెచ్చుకుని తణుకు లో యస్.ఐ. గా పని చేస్తున్న వాళ్ళ బావమరిదికి చెప్పి రికమండేషన్ చేసి రాంబాబుకు కానిస్టేబులు ఉద్యోగం వచ్చేలా చేస్తానన్నారు.
ఆ రాత్రి దొంగలిద్దరికీ పచ్చి మంచి నీళ్ళు కూడా ఎవరూ ఇవ్వలేదు. కానీ, వాన చినుకులు మాత్రం పడుతూనే ఉన్నాయి. రాత్రంతా చీకట్లో పచ్చగడ్డిలో దాక్కుని అరిచిన కప్పలు తెల్లారి వర్షం తగ్గాక బయటకొచ్చి కళ్ళు పైకెత్తి అటూ, ఇటూ చూస్తున్నాయి. పంచాయితీ లో మెంబరు గా ఉన్న యేసుపాదం సైకిలేసుకెళ్ళి గణపవరం పోలీస్ స్టేషన్ లో విషయం చెప్పి అర్జెంటుగా రమ్మంటే ఇద్దరు పోలీసులు టీవీయస్ మీద వచ్చి ఆ దొంగలిద్దరికీ కట్లు తీసి ఆరా తీశాక చెప్పింది ఏమిటంటే, వాళ్ళు నిజంగానే బాతులు మేపుకునే వాళ్ళేననీ, ఆ బాబు ఆవిడ సొంత కొడుకనీ, రాత్రి బాగా పొద్దు పోయాక ఈ ఆడమనిషి భర్త, బంధువులు వీళ్ళకోసం వెతుక్కుంటూ వచ్చి స్టేషన్ లో కూడా వాకబు చేసుకుని వెళ్ళారనీ, అసలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు లేరనీ, అదంతా పుకారు తప్ప ఇప్పటి వరకూ ఈ తాలూకాలో ఎక్కడా పిల్లలు తప్పిపోయినట్టు ఒక్క కంప్లయింటు కూడా రాలేదనీని. అసలు విషయం తెలిశాక, ఆ పిల్ల వాడిని వాళ్ళకి ఇచ్చేసి, వెలుగులో సరిగ్గా చూస్తే వాడు అచ్చం వాళ్ళ అమ్మ పోలికలతోనే ఉన్నాడని చెఫ్పుకుని, అకారణంగా కొట్టి హింసించామని పశ్చాత్తాపంతో ఊరి జనమూ, ఊరికి మొనగాడనిపించుకుందామనుకుంటే అలా జరగనందుకు రాంబాబూ చాలా భాధ పడ్డారు.
అదీ కాక తాను చితక బాదేసిన ఆ ఇద్దరికీ ఏమయినా అయితే పోలీసులొచ్చి పట్టుకెళ్ళిపోతారని భయంతోనో, లేకపోతే బాతులోళ్ళ బంధువొలొచ్చి కక్ష్య తీర్చుకుంటారన్న భయంతోనో తెలీదు గానీ, పోలీసు అవుతాడనుకున్న రాంబాబు దొంగలాగా బంధువుల ఊరు జంగారెడ్డిగూడెం పారిపోయి మళ్ళీ మూడు నెలల వరకూ ఊళ్ళో ఎక్కడా కనిపించలేదు.