Sunday, October 5, 2014

ప్రజల స్వార్ధానికి బలయిపోతున్న రాజకీయ నాయకులు

              నా చిన్నప్పుడు ఒక సారి మా ఊరి మట్టి రోడ్ల మీదికి తెల్ల ఏనుగు లాంటి చిన్న కారు ఒకటి దూసుకొచ్చి ఊరు మధ్యన చెరువు గట్టు మీద ఆగింది. అందులోంచి ఎత్తుగా, లావుగా, ఎర్రగా ఉన్న నలుగురయిదుగురు బయటికొచ్చారు. ఆడా మగా తేడా లేకుండా అందరికీ ఒంటి నిండా బంగారం. ఖరీదయిన దుస్తుల్లో అందరూ దర్జాగా ధగ ధగ లాడి పోతున్నారు. వాళ్ళని చూసిన ఊళ్ళో జనానికి ఒళ్ళు మరిచిపోయేంత ఆనందమయిపోయింది. ఎవరికోసం వచ్చారో, ఏం సాయం కావాలో అని పోటీలు పడి మరీ అతి వినయం ప్రదర్శించి మెలికలు తిరిగిపోతూ వాళ్ళకి సకల ఉపచారాలూ చేసి వెంకట సుబ్బమ్మ కొట్లోంచి నాలుగు గోల్డ్ స్పాట్ సీసాలు తెచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టారు. వచ్చిన పని అయిపోయి కారు బయలుదేరిపోతుందనగా కారు డిక్కీలో రెండు ఆనపకాయలు, ఒక అరటి గెల , పది కొబ్బరి కాయలు, ఆవకాయ జాడీ, కాళ్ళు కట్టేసిన నాటు కోడి చేరి పోయాయి. అంత గొప్ప వాళ్ళు వచ్చింది మా అప్పారావు మావయ్య కోసమని తెలిసి ఆ రోజు నుంచీ అప్పారావు మావయ్య ఇమేజి చిన్న జ్వరమొచ్చినా రాజమండ్రి తీసుకెళ్ళి పెద్దాసుపత్రిలో చేర్పించేసే స్థాయికి పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా ఊరి స్కూలు హెడ్మాస్టరు గా పని చేసి ఉత్తమ ఉపాధ్యాయుడుగా పేరు తెచ్చుకుని రిటయిరయిపోయిన మా అబ్రహాం మాస్టారు డొక్కు సైకిలు మీద ఎటో వెళ్తూ దారిలో ఓ సారి ఊళ్ళో అందరినీ పలకరిద్దామని వస్తే పట్టించుకున్న నాధుడే లేడు. ఆ రోజు నాకు, ప్రజలు వ్యక్తిత్వం తో పని లేకుండా డబ్బున్న వాళ్ళకీ, ఆడంబరంగా ఉండేవాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తారని అర్ధమయింది. ఈ రోజుల్లో అయితే చేతిలో ఆండ్రాయిడు ఫోను ఉన్నవాడికి పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫాలోయింగు.

               మా ఊళ్ళో ఉండే కోట మంగమ్మ ఇంట్లో వంట చేసి పెట్టదు గానీ, అదీ ఇదీ అని తేడా లేకుండా అన్ని మతాల దేవుళ్ళకి మాత్రం పూజలు విపరీతంగా చేసేది. ఆ రకంగా వారంలో ఎక్కువ రోజులు బయటి తిండి తినక తప్పక వాళ్ళాయనకి ఒక సారి ఫుడ్ పోయిజన్ అయ్యి ఆస్పత్రి పాలయితే ఆ రోజు కూడా ఆవిడ మొగుడికన్నా పూజలకే ఎక్కు ప్రాముఖ్యత ఇస్తే ఊరి జనం ఆవిడ భక్తి ప్రపత్తులకి తెగ మురిసిపోయారు. దేవుడి గురించి పెద్ద పట్టించుకోకుండా మొగుడు తాగొచ్చినా భరిస్తూ కష్టపడి దొడ్లో కూరగాయలు పండించుకుని, ఇడ్లీలేసి అమ్ముకుంటూ కుమ్మరి పురుగు లాగా ఎప్పుడూ ఏదో ఒక పని చెసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్న కాంతమ్మత్తని మాత్రం నిజంగానే పురుగుని చూసి నట్టు చూసేవాళ్ళు. జనం, కష్టానికి కాకుండా పై పై మెరుగులకే ఎక్కువ విలువ ఇస్తారనటానికి ఇది ఇంకో ఉదాహరణ. కానీ ఈ పై పై మెరుగులన్నీ ఎక్కువకాలం పనికి రావని తెలుసుకోవటానికి నాకూ ఎక్కువ రోజులు పట్టలేదు. తెల్ల కారులో మా ఊరొచ్చినాయన కూతురి పెళ్ళి సినిమా సెట్టింగులని తలపించే కళ్యాణమంటపం అలంకరణలు, పెళ్ళి భోజనంలో డెభ్భై రెండు రకాల వంటకాలు, మామూలు జనం కేవలం పేపర్లో పేర్లు ఫోటోలు మాత్రమే చూడగలిగిన వాళ్ళని అతిధులుగాను పిలిచి అంగరంగ వైభోగంగా చేశారు. నాటు కోడి, అరటి గెల తీసుకున్నందుకు కృతజ్ఞతగానూ పనిలో పని గా తన ఆర్ధిక హోదా ని మా ఊరి జనానికి ఇంకోసారి చాటి చెప్పటానికీ ఊరి జనం అందరినీ కూడా పెళ్ళికి పిలిస్తే, వెళ్ళిన వాళ్ళందరూ ఆ హంగు చూసి ఆ పెళ్ళి గురించే వారం రోజులు మాట్లాడుకున్నారు. కానీ తర్వాత కొన్నాళ్ళకి ఆయన చేసే చీటీల వ్యాపారం దివాలా తీసి చివరికి జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన రోజు మాత్రం, ఆ రోజు పెళ్ళి భోజనంలో కడుపు నిండా తిని బ్రేవ్ మని తేంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఒక్కడూ వెళ్ళి పట్టించుకున్న పాపాన పోలేదు.

               ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తేగానీ ఓటు వెయ్యం అంటే పాపం మా ఊరి ప్రెసిడెంటుగారు అప్పులు చేసి ఓటుకి డబ్బులిచ్చి గెలిశాక ఊరి పంచాయితీ స్థలంలో గోడౌన్లు కట్టుకుని స్వంత అవసరాలకి వాడుకుంటుంటే, జనానికి ఆయన తప్పుని ఎత్తి చూపే ధైర్యం లేక, అలాగని చూసీ చూడనట్టు వదిలెయ్యనూ లేక "మళ్ళీ ఎలక్షన్లకి ఓటుకి రెండు వేలు ఇస్తేగాని ఓటు వెయ్యం" అని తెగేసి చెప్పేద్దామని ఇప్పటినుంచీ పధకం వేస్తున్నారు. ఊరికి వర్తించేదే రాష్ట్రానికీ వర్తిస్తుంది. రాష్ట్రానికి వర్తించేది దేశానికీ వర్తిస్తుంది. ప్రజలు నిజాయితీకి, కష్టానికీ, మంచితనానికీ కాకుండా డబ్బుకీ, ఆడంబరాలకే ప్రాధాన్యత ఇస్తే, బెల్లం చుట్టూ ఈగల్లాగ అలాంటివాళ్ళ చుట్టూనే మూగితే సహజంగానే ఎవరికయినా ఎదో గడ్డి కరిచి నాలుగు డబ్బులు సంపాదిచి అందరిలోనూ గొప్ప అని అనిపించుకోవాలని ఉండటం లో తప్పు లేదు. అలాగే రాజకీయ నాయకులు కూడా. ఏ మనిషి అయినా తన ప్రాధమిక అవసరాలకి మించి అక్రమంగా, ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా తన దర్పాన్ని ప్రదర్శించి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవటానికే. ఆ రకంగా తన అహాన్ని సంతృప్తి పరిచేవాళ్ళు తన చుట్టూ పుష్కలంగా ఉంటే దాంట్లో అతనికి విపరీతమయిన ఆనందం ఉంటుంది. చివరికి అదొక వ్యసనంలా మారి. ఆ క్రమంలో వాళ్ళు తమ నిజాయితీని కూడా కోల్పోతారు.

               ఎంతో కష్టపడి ముఖ్య మంత్రులు, మంత్రులు, అయిన కొంత మంది, ఈ డబ్బు, అధికారం కోసం అక్రమాలకి పాల్పడి మళ్ళీ ఆ డబ్బునే ఎలెక్షన్ల సమయానికి ప్రజలకి ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం సంపాదించి ప్రజలని గుడ్డిగా నమ్మి/నమ్మించి దీన్ని ఒక చక్రంలా తయారు చేసి చివరికి ఏదో ఒక రోజు జైలుకి కూడా వెళ్ళే పరిస్థితులు కల్పించుకుంటున్నారు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర కన్నా ప్రజల పాత్రే ఎక్కువ. ప్రజలు ముందు అక్రమంగా డబ్బు సంపాదించిన నాయకులను ఆరాధించటం మాని వ్యతిరేకించాలి. రాజకీయ నాయకులు తాము చేసిన పని అది తప్పని తెలిసినా దానిని సమర్ధించేవాళ్ళు ఉన్నంత కాలం అది కొనసాగిస్తూనే ఉంటారు, కాని చట్టానికి దొరికితే మాత్రం జైలుకెళ్ళేది ప్రజలు కాదు. నాయకులే.

               స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచీ ఈ రోజు వరకూ మన దేశం లో ఎన్నో కుంభకోణాలు చూశాం ఇప్పటికే ఈ అక్రమంగా సంపాదించటం, తర్వాత జైలుకెళ్ళటం అనేది చాలా పాత ట్రెండ్ అయిపోయింది. ఇక నుంచీ నిజంగా తెలివయిన నాయకులు చేయాల్సిన పని అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండి తమని తాము నిరూపించుకోవటమే, అదే మన ముందు రోజుల్లో రాబోతున్న కొత్త ట్రెండ్. అందుకే, న్యాయ వ్యవస్థ అంటూ ఒకటుందని చూడకుండా ప్రజలని గుడ్డిగా నమ్మి, ఇప్పటివరకూ జైలు పాలయిన అమాయక రాజకీయ నాయకులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ వారి ఈ పరిస్థితికి బహుధా శతధా చింతిస్తున్నాను.