ఆది మానవుడిగా ఉన్నప్పుడు మనిషి ఎక్కువగా కాయలు, పండ్లు, గింజలని ఆహారంగా ఉపయోగించేవాడు. సమయం అనుకూలిస్తే జంతువులను వేటాడేవాడు. తర్వాత వేటలో మెళకువలు సాధించి తన అవసరం కోసం ఆయుధాలని తయారుచేసుకుని ఉపయోగించుకున్నాడు. అలాగే చక్రాన్ని, లిపిని, తర్వాత ఆవిరి యంత్రాలు, కరెంటు లాంటి తన అవసరం తీర్చగల అనేక సాధనాలని కనిపెట్టి ఉపయోగించుకున్నాడు. మనిషి సృష్టించుకున్న వాటిలో డబ్బు కూడా సరిగ్గా ఇలాంటిదే. చక్రాన్ని బండి నడపటానికి, కరెంటుని బల్బుని వెలిగించటానికి ఉపయోగించుకున్నట్టే, డబ్బుని కూడా వస్తు మారకం కోసం ఉపయోగించుకోవటానికి మనిషి సృష్టించుకున్నాడు. కానీ వాటిలో దేనికీ లేని విలువ డబ్బు కి ఉంది. డబ్బుతో మనం అలాంటి సాధనాలను ఎన్నయినా కొనగలం. మన భారత దేశంలో అయితే డబ్బు ఇంచు మించు భగవంతుడితో సమానం. కింద పడ్డ డబ్బులని కళ్ళకద్దుకుని గానీ తీసుకోము.
  అయితే డబ్బుకి నిజంగా అంత విలువ ఉందా ? ఇదంతా మనం డబ్బుకి, దానికి ఉన్న ఉపయోగపు విలువకన్నా ఎక్కువ విలువని ఊహించుకోవటం వల్ల జరిగిందా ? నిజంగా డబ్బు అంత శక్తివంతమయినది అయితే దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ? నిజానికి డబ్బుకి దానికి ఉన్న ఉపయోగపు విలువ తప్ప మరి ఏవిధమయిన విలువ లేదు. ఇది తెలుసుకోవటానికి ఒక చిన్న తర్కాన్ని ఉపయోగిస్తే చాలు. ఉదాహరణకి పైన "డబ్బు తో ఏ సాధనాలనయినా కొనగలం" అని చెప్పుకున్నాం. కానీ నిజానికి "ఏ సాధనాన్నయినా కొనటానికి మనం డబ్బు ని ఉపయోగిస్తున్నాం" అని చెప్పుకోవాలి. అంటే వస్తువులని కొనటానికి మనం డబ్బుని ఉపయోగిస్తున్నాం. అంటే వస్తువు కోసం డబ్బు కానీ డబ్బు కోసం వస్తువు కాదు. అంటే కొనటానికి లేదా అమ్మటానికి వస్తువులు ఉన్నప్పుడు మాత్రమే డబ్బుకి విలువ. అలాంటి వస్తువులు అసలు లేకపోతే డబ్బుకి ఉండే విలువ సున్న. కానీ మనం మన ఆలోచనని దీనికి వ్యతిరేక దిశలో మాత్రమే పరిమితం చేసుకోవటం వల్ల, పూర్తి విరుధ్ధమయిన భావాన్ని కలిగి ఉంటాం.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే ఒక మనిషి ఎన్ని ఎక్కువ వస్తువులు లేదా సేవలు ఉపయోగించుకోవాలనుకుంటే అతనికి అంత ఎక్కువ డబ్బుతో అవసరం ఉంటుంది. ఎన్ని తక్కువ వస్తువులు లేదా సేవలు ఉపయోగించుకుంటే అంత తక్కువ డబ్బుతో అవసరం ఉంటుంది. ఏ విధమయిన వస్తువులు లేదా సేవలు అసలు ఉపయోగించుకోకపోతే అలాంటి మనిషికి జీవించటానికి ఒక్క ఆహారం విషయంలో తప్ప ఇంక డబ్బుతో అవసరం ఉండదు. నిజానికి ప్రపంచం లో కొన్ని వేల సంవత్సరాల పాటు డబ్బు అనేది ఉనికి లో లేదు. ఇప్పటికీ డబ్బుతోను, బయటి ప్రపంచం తోను సంబంధం లేకుండా ఉన్న అనేక ఆటవిక తెగలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కానీ నాగరిక ప్రపంచం లో శాస్త్ర విజ్ఞానం తో పాటు మనుషులు ఉపయోగించుకునే వస్తువులు మరియు సేవల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. సరిగ్గా ఇక్కడే డబ్బుకి ఉన్న విలువ, శక్తి కూడా అధికం అయ్యాయి. అయితే ఇలా పుట్టుకొస్తున్న వస్తువులలో కొన్ని మాత్రమే మనిషికి అత్యవసరమయినవిగా తయారవుతాయి. అయితే మిగిలిన తక్కువ ప్రాధాన్యత ఉండే వస్తువులను కూడా ప్రజలచేత కొనిపించటం ఎలా ? సరిగ్గా ఇక్కడే వ్యాపార వర్గాలు తమ సర్వ శక్తులను ఉపయోగిస్తాయి. వాణిజ్య ప్రకటనలు అందులో ఒక ముఖ్యమయిన భాగం. ఒక వస్తువు యొక్క ప్రాముఖ్యతని అదే పనిగా ప్రజల మెదళ్ళలో చొప్పించటం వల్ల అది ఎక్కువ మంది ప్రజలకి ఒక అత్యవసరమయిన వస్తువుగా మారిపోతుంది. అంటే మనుషులు ఉపయోగించ వలసిన వస్తువుల సంఖ్య పెరుగుతుంది. అంటే పరోక్షంగా సమాజంలో డబ్బు యొక్క ప్రాముఖ్యత, విలువ పెరుగుతుంది. కానీ ఇది పూర్తిగా ఒక ఊహా జనితమయిన, కృత్రిమమయిన విలువ. అన్ని దేశాల ప్రజలు అన్ని వస్తువులను కొనగల ఆర్ధిక స్తోమతని కలిగి ఉండక పోవచ్చు. అందుకే వ్యాపార వర్గాల దృష్టి ఎప్పుడూ ఎక్కువ జనాభా కలిగిన వర్ధమాన, ధనిక దేశాలపైన మాత్రమే ఉంటుంది. ఆఫ్రికా దేశాలలాంటి పేద దేశాలను వ్యాపార వర్గాలు అంతగా పట్టించుకోవు, కానీ వాటిని మరో రకం గా వాడుకుంటాయి. దేశాల మధ్య, ప్రజల మధ్య ఆర్ధిక అసమానతల మూలాల గురించి మనం మరో అధ్యాయంలో వివరంగా మాట్లాడుకుందాం.
డబ్బుకి ఉన్న ఈ రకమయిన కృత్రిమమయిన విలువని పెంచేది ఒక్క వస్తు వినిమయం మాత్రమే కాదు. కొన్ని సమాజ నియమాలు కూడా ఇందుకు కారణమవుతాయి. అందులో ఒకటి ఎక్కువ డబ్బు ఉన్నవారికి సమాజం ఎక్కువ గౌరవం ఇవ్వటం. పరువు ప్రతిష్ఠలను డబ్బుతో ముడి పెట్టటం. డబ్బు ఉన్న వారికే అధికారం ఇవ్వటం లేదా అధికారం కోసం డబ్బు కలిగి ఉండవలసిన అవసరం కలిగించే పరిస్థితులు సమాజం లో నెలకొని ఉండటం. జాగ్రత్తగా గమనిస్తే ఏవయినా రెండు వ్యవస్థలు ఒకదానినొకటి సహాయం చేసుకుని బలపరుచుకోవటం అనేది మానవ సమాజం లో అంతర్గతంగా ఉండే విషయం. కొన్ని బయటి వ్యవస్థలతో వీటికి ఏర్పడే పోటీ దీనికి ముఖ్య కారణం. ఒకదానినొకటి సహాయం చేసుకోవటం ద్వారా ఆ రెండు వ్యవస్థలు మరింత గా వృధ్ధి చెందుతాయి. దీనిని మరోలా చెప్పాలంటే పోటీని తట్టుకుని రెండు వ్యవస్థలు మరింత వృధ్ధి చెందటం కోసం ఒకదానినొకటి బలపరుచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఉదాహరణ చెప్పాలంటే 'రాజకీయాలు' మరియు 'ప్రచార మాధ్యమాలు'. ఒక్కోసారి రెండు దేశాల మధ్య ఉండే సంబంధం కూడా ఇలాంటిదే అయి ఉంటుంది. అంటే ఈ రెండూ తమ అభివృధ్ధి కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. సమాజంలో ఈ వ్యవస్థల మూలాలు ఎంతగా బలపడితే అంతగా నాటుకుపోతాయి. డబ్బు, అధికారం మధ్య ఉండే సంబంధం కూడా సరిగ్గా ఇలాంటిదే. అంటే డబ్బు ఉన్న వారికి అధికారం సంపాదించటం సులువు. అలాగే అధికారం ఉన్న వారికి డబ్బు సంపాదించటం సులువు. అందుకే ఎక్కువసార్లు ఈ రెండూ ఒకరి వద్దే ఉంటాయి. లేదా ఈ రెంటిలో ఏదో ఒకటి ఉన్నవాళ్ళు ఒకరికి ఒకరు సహాయం చేసుకుని మరింతగా వృధ్ధి చెందుతారు.(ఇంకా ఉంది)