(మా ఊళ్ళో ఒక పంక్తి భోజనాల రోజు ఎంగిలి విస్తరాకుల దగ్గర ఆకలితో అతిగా తిని చనిపోయిన మా ఊరి నల్ల ఊర కుక్కకి ఈ కథ అంకితం)
" నేను చనిపోయి చాలా సేపయ్యింది. నా చావు గురించి నాకేమీ భాథ లేదు. ప్రతి జీవికీ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతకన్నా ముఖ్యం. మన పుట్టుకకి ఏ గౌరవం లేకపోవచ్చు కానీ చావుకి మాత్రం తప్పకుండా ఒక గౌరవం ఉండేలా బతకటం మన చేతల లోనే ఉంది. మీ లాంటి మనుషులకయితే అందరికీ మంచి చేసి చనిపోతే గౌరవం. ఎక్కువ ఆస్థులు సంపాదించి, గొప్ప హోదా అనుభవించి చనిపోతే గౌరవం. యుధ్ధంలో చనిపోయినపుడు గౌరవం. మీ మీ మత విశ్వాసాలపట్ల భక్తి ప్రపత్తులు చూపించి థర్మ మార్గాన్ని అనుసరిస్తూ బతికి చనిపోతే గౌరవం. అలా చనిపోయిన వాళ్ళ శవ యాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఆడంబరంగా ఉంటుంది. మనుషులు తమ మరణానికి సన్నధ్ధమవటం కోసం పోరాడతారు. మేము మాత్రం కేవలం బతికి ఉండటానికి పోరాడతాం. తల రాతలు మీ లాంటి మనుషులకే ఉంటాయో, మా లాంటి కుక్కలకి కూడా ఉంటాయో నాకు తెలీదు. బహుశా ఉండవేమోనని నేనూ అనుకునేవాడిని. మేము ఈ భూమ్మీద పడి ఊహ తెలిసిన దగ్గర నుంచీ ఆహారం కోసం వెతుక్కోవటం, పిల్లల్ని కనటం, బతుకు కోసం శత్రువులతో పోరాడటం. ఇంతకన్నా ఏమీ ఉండదు. ఇక చావంటారా ఏ రోగంతోనో, ఆకలితోనో, శత్రువుల దాడితోనో మా జీవితాలు ముగిసిపోవాలి. మీ జీవితాల్లో ఉన్నంత సంక్లిష్టత, వ్యత్యాసం మా జీవితాల్లో ఉండదు కాబట్టి మాకు తల రాతలు ఉండవనీ ఆ అవసరమే మాకు ఉండదనీ ఒక అభిప్రాయం నాకు ఉండేది. కాని నా చావు మాత్రం అన్నిటికీ భిన్నం గా సంభవించింది. నా చావు అనుభవమయ్యాకే నాకు మాలాంటి జీవులకు కూడా తల రాతలు ఉంటాయేమోనని అనుమానం వచ్చింది. నా చావు అత్యంత అవమానకరం, మా లాంటి జంతువులన్నిటికీ ఒక గుణపాఠం. ఇలాంటి చావు ఇప్పటివరకూ నాకు తప్ప ఇంకెవరికీ వచ్చి ఉండదు. ఇక ముందు రాకూడదని కూడా కోరుకుంటున్నాను.
అత్యాశకి పోవటం కేవలం మనుషుల లక్షణమనీ, అది మన లాంటి జంతువులకి మంచిది కాదనీ మా అమ్మ చెప్పింది. మనుషులు మన కుక్క జాతి పట్ల చాలా దయతో ఉంటారని కూడా చెప్పింది. మనం విశ్వాసంగా ఉంటే దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ముద్దు చేస్తారనీ, కడుపు నిండా అన్నం పెడతారనీ, మన మీద చూపించినంత ప్రేమ ఒక్కోసారి సాటి మనుషుల మీద కూడా చూపించరనీ చెప్పింది. కానీ ఏ రెండు కుక్కల స్వభావాల మధ్య ఉన్న తేడా కన్నా ఇద్దరు మనుష్యుల స్వభావాల మధ్య ఉండే తేడా చాలా ఎక్కువ. అందుకే మనుషులందరినీ నమ్మకూడదని కూడా చెప్పింది. అది నాకు ఆ తర్వాత అనుభవమయ్యింది కూడా. ఒక్కో సారి అన్నం పెట్టిన చెయ్యే ఛీ, పో అని కర్రతో కొట్టి తరిమేస్తుంది. ఇంకోసారయితే ఉత్తపుణ్యానికే ఇంత పెద్ద ఇటుక ముక్క తీసుకుని గిర గిరా తిప్పి మొఖం మీద కొడుతుంది. ఇంకా కసి తీరక పోతే నాలుగు చక్రాల కుక్కల బండి వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అలాంటి నాలుగు చక్రాల బండి వచ్చి నప్పుడు దూరంగా పారిపొమ్మని కూడా మా అమ్మ చెప్పింది. లేకపోతే చావు మూడినట్లే. అలా చనిపోయినా కూడా నాకు ఆనందం గానే ఉండేది. కానీ నన్ను చూసి మా జాతి ఒక్కటే కాదు, నోరు లేని మా లాంటి ప్రాణులన్నీ అసహ్యించుకునేలా చనిపోయాను. మాకూ మీలాగే స్వర్గ నరకాలు ఉంటే నేను అక్కడున్న మా అమ్మ దగ్గరికే వెళ్ళి చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతాను. నా పింకి కూడా అక్కడే ఉండొచ్చు. పింకి కళ్ళు కాటుక పెట్టుకున్నట్టు ఆకర్షణీయం గా ఉండి ఎప్పుడూ కాంతివంతంగా, అమాయకంగా మెరుస్తూ ఉండేవి. నేను చనిపోయిన ఇంటి వీధి చివర ఉన్న పెద్ద డాబాలో ఉండే వాళ్ళ దగ్గరే పింకీకి ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఉండేది. ఆ అందమయిన పేరు కూడా వాళ్ళే పెట్టారు. కాని ఏమయ్యిందో తెలీదు. ఉన్నట్టుండి పింకీ ని బయటకి గెంటేశారు. మొదట్లో ఆహారం ఎలా వెతుక్కోవాలో, శతృవుల నుంచి ఎలా తప్పించుకోవాలో, సాటి కుక్కలతో దెబ్బలాడి అన్నం ఎలా సంపాదించుకోవాలో తెలీక చాలా కష్టపడేది. కానీ నాతో స్నేహం కుదిరాక మాత్రం తెలివయినది కావటం మూలాన అన్నీ చాలా తొందరగానే నేర్చుకుంది.
పింకీ కి పెరుగన్నం అంటే చాలా ఇష్టం, మాంసం కూర అన్నా కూడా. నాలాగ ఏది పడితే అది తినేది కాదు. ఒక సారి నా అదృష్టం బాగుండి కోడిపిల్ల దొరికింది. దాని మెడ కొరికి చంపి తింటున్నాను. అది చూసి పింకీ కి నా మీద కోపమొచ్చింది. అంత చిన్న కోడి పిల్లని ఎందుకు చంపావని నన్ను తిట్టింది. తనకి కోపం రావటం అదే మొదటిసారి చూడటం. పింకి కి మనుషులతో సహవాసం వల్ల కొంచెం సున్నితత్వం, నాజూకుతనం కూడా అలవాటయ్యింది. నాకు ఆకలి తప్ప ఇంకేమీ తెలీదు. కానీ తర్వాత పింకీ కూడా నెమ్మది నెమ్మదిగా నా సహవాసం వల్లనో పరిస్థితుల వల్లనో తెలీదు గానీ ఆకలి తీరటానికి ఏదో ఒకటి కడుపులో వేసుకోవటం నేర్చుకుంది. ఒక్కోసారి ఇద్దరం వెన్నెల రాత్రుళ్ళు కాలువ గట్టు మీద ఈ పక్క నిద్ర గన్నేరు చెట్టు దగ్గరనుంచి ఆ పక్క బాదం చెట్టు వరకూ పరుగు పందాలు పెట్టుకుని ఊరికే తెగ పరుగులుపెట్టేవాళ్ళం. మధ్యలో కాలువ దాటటానికి మనుషులు అడ్డంగా వేసుకున్న తాటి పట్టెల మీద గబ గబా పరుగెట్టటం తెలీక అన్ని సార్లూ పింకీనే ఓడిపోయేది, అంత చిన్న పట్టె మీద వేగం గా ఎలా పరుగెడుతున్నానా అని నన్ను ఆశ్చర్యంతోనూ, ఆరాధనతోనూ చూసేది. పింకీ నన్ను అలా చూడటం నాకు ఎంతో నచ్చింది. అప్పటినుంచీ తన కోసమే కొన్ని కొన్ని కొత్త సాహసాలు కూడా చేసేవాడిని. తర్వాత కొన్ని రోజులకే పింకీ ని ఆ నాలుగు చక్రాల బండి వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. నేను మాత్రం ఎలాగో తప్పించుకుని పారిపోయాను. నాలాంటి వీరుడు, ధైర్య వంతుడు తోడు ఉన్నాడన్న నమ్మకంతో పూర్తిగా నా మీద ఆధారపడ్డ పింకీని నా కళ్ళ ముందే రెండు చేతుల మనుషులు తీసుకెళ్ళిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను. పింకి నా కన్నా ముందు పోవటం కూడా మంచిదే అయ్యింది. లేకపోతే ఈ రోజు నా చావు చూసి నన్ను ఖచ్చితంగా అసహ్యించుకొనేదే. అది భరించటం మాత్రం నాకు చావు కన్నా కష్టమయ్యేది.
పింకి పోయాక కొన్ని రోజుల వరకూ తనని మర్చిపోవటం కష్టంగా ఉండేది కానీ ఆ తర్వాత ఎండా కాలం వచ్చాక తినడానికి తిండి కాదు కదా తాగడానికి నీళ్ళు కూడా సరిగ్గా దొరికేవి కాదు. ఎందుకో తెలీదు గానీ అంత నిప్పుల గుండం లాంటి ఎండా కాలం నేను బుద్ధి ఎరిగాక ఎప్పుడూ చూడలేదు. ఆ ఆకలి బాథ తో తిండి కోసం వెతుకులాటలో పడి పింకి ని తొందరగానే మర్చిపోయాను. తినడానికి ఏమయినా దొరుకుతుందేమోనని మీ మనుషులు తినగా మిగిలినది బయట పారేసేచోటా, ఇంటింటికీ తిరిగి ఇంటి పెరట్లోనూ వాసన చూసుకుంటూ తిరిగేవాడిని. ఒక్కోసారి ఏమీ దొరక్కపోతే ఊరి చివర పంట బోదిలో మిగిలిన బురద నీళ్ళు తాగేవాడిని. ఒక రోజు, రెండు రోజులూ కాదు చాన్నాళ్ళు ఇలాగే కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతికాను. నేను చచ్చి పడిపోయిన వీథిలో ఉండే ఒక తెల్ల జుట్టు మనిషి ప్రతి రోజూ భోజనానికి ముందు ఒక ముద్ద తీసి మా లాంటి నోరు లేని జీవుల కోసం పక్కన పెట్టేది. పగటి పూట ఆ ముద్దని నాకన్నా ముందు నా కాకి మిత్రులు చిందర బందర చేసి తినేసి వెళ్ళిపోయేవి. రాత్రి పూట మాత్రం అది నాకు దక్కేది. కొన్ని రోజులకి ఎండ తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడటం మొదలయ్యింది. ఇంకొన్నాళ్ళు ఓపిక పడితే తిండి, నీళ్ళు దొరికి మళ్ళీ మామూలు రోజులు వస్తాయన్న ఆశ మొదలయింది. సరిగ్గా అప్పుడే ఓ రోజు ఆ తెల్ల జుట్టు మనిషి పాడెక్కింది. అప్పటినుంచీ ఆ ముద్ద కూడా కరువయ్యింది. ఇక నాకు చావు దగ్గర పడిందని ఖాయం చేసుకుని బతుకు వెళ్ళదీస్తుండగా ఒక రోజు ఒక అథ్భుతం జరిగింది. ఆ తెల్ల జుట్టు మనిషి చనిపోయిన పదకొండో రోజు పెద్ద కర్మ జరుగుతుంది ఆ ఇంట్లో. ఆ రోజు చాలా రకాల పిండి వంటలు, మాంసం వండి వడ్డిస్తూ పెద్ద కర్మ చాలా గొప్పగా చేస్తున్నారు. ఆ వంటల వాసనలు నా ముక్కుకి తగిలి ఎక్కడో అగాథం లో దాక్కున్న నా ఆకలిని మొత్తం బయటికి లాక్కొచ్చాయి. ఒక్కొక్కరూ తినగా మిగిలిన వంటకాలతో సహా విస్తరాకులు ఆ ఇంటి ముందు ఆరు బయట పడుతున్నాయి. ఆ క్షణం నా కంటికి తిండీ, కడుపుకి ఆకలీ తప్ప మిగిలినవి ఏవీ అనుభవం లోకి రావటం మానేసింది. పింకీ కూడా నాతో ఉంటే బాగుండుననిపించింది కానీ, మామూలుగా ఈ సమయం లో నాతో దెబ్బలాటకొచ్చే బలమయిన నా తోటి మిత్రులు అందరినీ ఆ నాలుగు చక్రాల బండి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవటంతో ఇంక నాకు పోటీనే లేకుండా పోయింది. కంటికి కనిపించిందీ, నోటికి అందినదీ మహా ఆబగా తినటం మొదలెట్టాను. అంత ఏకాగ్రతతో ఇప్పటివరకూ నా జీవిఏతం లో ఏ పనీ చేసి ఉండను. కేవలం తినటం, తినటం. అలా తినటం మొదలుపెట్టి ఎంత సమయం గడిచిందో కూడా గమనించలేదు కానీ కొంతసేపటికి ఇంచు మించు గొంతుదాకా తిన్నట్టు మాత్రం తెలిసింది. ఆ తర్వాత ఉన్నట్టుండి, నా గొంతుకి ఏదో అడ్డం పడినట్టు అయ్యింది. నాకు కళ్ళు బైర్లు కమ్మి, శ్వాస ఆడక, ఊపిరి ఆగి నేల మీద థబ్బుమని పడినంత పనయ్యింది. నాకేమయ్యిందో ఏమీ అర్ధం కాలేదు కానీ కొంత సేపటికి ఇద్దరు మనుషులు నా కాలికి తాడు కట్టి ఒక తాటాకు మీదకి లాక్కొచ్చి ఈడ్చుకు వెళ్ళి ఊరవతల కాలువగట్టు మీద నేను, పింకి ఇదివరకు ఆడుకున్న నిద్రగన్నేరు చెట్టుకింద పడేసి వెళ్ళిపోతూ "ఆశపోతు కుక్కలా ఉందిరా, కడుపు పట్టనంత తినీ, తినీ ఎక్కువయ్యి చచ్చింది." అని చెప్పుకుని నవ్వుకోవటం మాత్రం నాకు తెలిసింది. అప్పుడే నేను చనిపోయానన్న విషయం నాకు అర్ధమయింది.
నేను ఆశపోతుని అన్న మాట నా తోటి జంతువులు అని ఉంటే నేను బాథ పడే వాడిని కాదు. ఆకలితో చనిపోతాననుకున్న నేను అత్యాశకి పోయి, తిండి ఎక్కువయ్యి చనిపోవటం నిజంగా మా జాతికి నేను తెచ్చిన కళంకం. కానీ మనుషుల చేత ఆ మాట అనిపించుకోవటం నాకు బాథాకరం. ఈ భూమ్మీద మిమ్మల్ని మించిన దురాశాపరులు ఎవరుంటారు? మీరు కేవలం మీ ఒక్కరి కోసమే కాదు. మీ ముందు తరాలు కూడా అనుభవించగలిగిన ఆస్థులు కూడబెట్టుకుని భద్రమయిన జీవితం గడపగలగటానికి సరిపడా దురాశ, అనైతికత, స్వార్ధం, పక్షపాతం మీకు పుట్టుకతోనే వస్తాయి. ఇంకా ఆ అపరాథ భావన నుంచి మీరు వేసుకున్న థర్మ మార్గం మిమ్మల్ని కాపాడుతుంది. మేము థర్మం తప్పే ప్రసక్తే లేదు. అసలు ఆ అవకాశమే లేదు కాబట్టి మాకు ప్రత్యేకమయిన థర్మ మార్గాలతోను, మతం తోను పనిలేదు. మిమ్మలని మించిన పరాన్న భుక్కులు సృష్టిలో లేరు. ప్రకృతిని ధ్వంసం చెయ్యటం మీ జీవితంలో ఒక భాగం. అసలు, ప్రకృతికి వికృతి మనుషులే. "మనుషులకి సత్యం తో పని లేదు. ఎప్పుడూ అలవిమాలిన రాగ ద్వేషాలతో కూడిన మత్తులోనే బతుకుతార"ని మా అమ్మ చెప్పింది. మీరు చేస్తున్న అంతులేని అన్వేషణ అంతా మీ మూసుకున్న కళ్ళు తెరుచుకోవటానికి మీరు చేస్తున్న ప్రయత్నమే. అలాంటి వాటితో మాకు పనిలేదు. మేమెప్పుడూ మెలకువతోనే ఉంటాం. మీకు ఉన్న జ్ఞానం లోనే మీ అజ్ఞానం కూడా దాక్కుని ఉంది. మాకు జ్ఞానం తో పని లేదు కాబట్టి మేము అజ్ఞానులమయ్యే అవకాశమే లేదు. అందుకే మీరు ఎన్ని ఆరాథనలు చేసినా ఆ దేవుడికి మీకన్నా మాలాంటి మూగ జీవులంటేనే ఎక్కువ ఇష్టమని కూడా మా అమ్మ చెప్పింది. ఇది మాత్రం దేవ రహస్యం, ఎవరికీ తెలీదని చెప్పింది. ముఖ్యంగా బుథ్థిబలంతో గర్వం తలకెక్కిన మనుషులకి. "