మహాత్మా గాంధి దేశ ప్రజలందరినీ ఒక తాటి పైకి తెచ్చేవరకు, భారతీయులు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడటం కన్నా ఎక్కువగా తమలో తామే పోట్లాడుకున్నారు. స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 33 కోట్లు. కానీ మన దేశంలోని ఆంగ్లేయుల జనాభా ఒక లక్ష యాభై వేలు మాత్రమే, అంటే ఒక ఆంగ్లేయుడు 2200 మంది భారతీయులని నియంత్రించగలిగేవాడు. ఒక విదేశీయుడు ఇంత మందిని అదుపులో ఉంచుకోవాలంటే సహజంగానే విడగొట్టటం, భయపెట్టటం అనేవి వారి ప్రధాన వ్యూహాలుగా ఉండాలి. అంటే అప్పటికి మనదేశంలోని చిన్న చిన్న సంస్థానాల రాజులు, అధికారులలో ఎంతగా అనైక్యత, లంచగొండితనం, పిరికితనం పాతుకుపోయాయో అర్ధం చేసుకోవచ్చు. వాస్కోడిగామా కేరళలో అడుగు పెట్టేనాటికి అక్కడి సంస్థానాలు తమలో తాము ఎంత క్రూరంగా వ్యవహరించుకొనేవో 'ఉరుమి' సినిమాలో సరిగ్గా చూపించారు.
ఎంత గొప్ప నాయకుడికి అయినా ఎంతో కొంత సొంత ప్రయోజనాలు ఉండటం అనేది సహజం. సినిమాలలో పాత్రలు చూపించినంత ఉదాత్తం గా నిజ జీవితం లో ఎవ్వరూ ఉండలేరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిజంగా తనకి రావాల్సిన పెన్షన్ కోసం పోరాడాడా లేక ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రం కోసం పోరాడాడా అనేది పక్కన పెట్టవలసిన అనవసర విషయం. పైన చెప్పుకున్న కష్టమయిన పరిస్థితుల్లో కూడ అతను అత్యంత బలమయిన ఆంగ్లేయులకి ధైర్యంగా ఎదురు నిలవటం, వారి చేతులలో వీరుడిలా చనిపోవటం మాత్రం ఒక చారిత్రక నిజం. కాల్పనికతను జోడించి, అక్కడక్కడా మలుపులతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన దగ్గరినుంచి చనిపోయేవరకు సినిమాలో ఆసక్తిగా చూపించారు. మంచి సౌండ్ సిస్టం ఉన్న పెద్ద తెర పై చూస్తే ఎక్కువగా నచ్చే సినిమా.
భారీతనం/పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాటలు సినిమాలకి మంచి చేస్తాయా లేదా? అన్న విషయం మరికొన్ని ప్రయోగాలు చూస్తే గానీ ఇప్పుడే చెప్పలేము. చార్లీ చాప్లిన్ ఒక సందర్భంలో ఒక పార్కు, పార్కులో బెంచీ, ఒక పోలీస్ క్యారెక్టర్, మరో రెండు క్యారెక్టర్లు ఉంటే చాలు సినిమా తీసెయ్యగలను అని చెప్పాడు. అప్పట్లో తెలుగు లో వంశీ, కన్నడలో కాశీనాథ్ లాంటి దర్శకులు అతి తక్కువ డబ్బులతోనే మంచి సినిమాలను తీయగలిగారు. సినిమాని పైకి తీసుకెళ్ళటంకన్నా లోతుకి తీసుకెళ్ళటం ముఖ్యం. ఏ సినిమాకయినా పెద్ద బడ్జెట్ తో పాటు కథ, కథనం కూడా చాలా అవసరం. 'బాహుబలి' బలం కూడా అదే. కానీ కథ ని పక్కన పెట్టి భారీతనం/పాన్ ఇండియా పేరుతో సహజత్వానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం మంచిది కాదన్న విషయం 'సాహో' సినిమా తో రుజువయ్యింది. ఆ విషయం లో 'సైరా' ఎంతో కొంత జాగ్రత్త పడటం సినిమాకి మేలు చేసింది.
సినిమాలో నాకు నచ్చిన అంశాలు
• చిరంజీవి.
• పొదుపుగా, పదునుగా వాడిన మాటలు.
• చాలా వరకు సీన్లు, మాటలు మొదటి నుంచి చివరివరకు ఏదో ఒక సందర్భంలో ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండేలా కథ రాసుకోవటం.
ఈ సినిమా చూసి బయటకి వచ్చాక కూడా అన్నీ సలక్షణంగా ఉన్న మంచి తెలుగు సినిమా చూసి చాలా రోజులయ్యింది అనే నా అభిప్రాయంలో మార్పు రాలేదు గానీ, ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచం లో డబ్బు సంపాదన యావలో పడి నెల జీతంకోసం చాలా మామూలుగా మనం వదులుకునే స్వేచ్చ, ఎంత కష్టపడితే మనకి లభించిందో తెలుసుకోవటానికీ, డబ్బులు తీసుకుని ఓటు వేసి నిర్వీర్యం చేస్తున్న ప్రజాస్వామ్యం ఎంత విలువయినదో అర్ధం చేసుకోవటానికీ అయినా ప్రతి ఒక్కరూ ఒక్కసారయినా ఈ సినిమాని చూడాలి.