ఆదిలక్ష్మి మళ్ళీ ఊరొచ్చేసిందని చెప్పుకోవటం మొదలెట్టారు ఓ రోజు పొద్దున్నే మా ఊరి జనం.
రెండు రోజుల క్రితం రాత్రి ఫిబ్రవరి నెల చలికి ఆగలేక, ఎత్తుపళ్ళ వీరన్న చుట్టు గుడిసె దగ్గర నారాయుడు తాతతో కలిసి చలి మంట వేసుకుంటుంటే, గని రాజు గారి దొడ్లో పాతరలోనుంచి లాక్కొచ్చిన తేగలు కాల్చుకోవటానికి మా పక్కకొచ్చి కూర్చున్న అంజి గాడు, అంతకు ముందు రోజు పని మీద రాజమండ్రి వెళ్ళి వచ్చేటప్పుడు నిడదవోలు బస్టాండు దగ్గర ఆదిలక్ష్మి ని చూసి మాట్లాడననీ, ఈ మధ్యనే చనిపోయిన వాళ్ళ అమ్మమ్మా, తాతయ్యల గురించీ, ఆదిలక్ష్మి ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు కోపం తో రగిలిపోయిన ఊరి జనం గురించీ, ముఖ్యంగా ఆదిలక్ష్మి అదృష్టానికి అసూయతో కడుపు మండి ఆ రోజు ఊళ్ళో చాలా మంది ఆడవాళ్ళు అన్నం కూడా తినలేదని చెప్పాననీ రహస్యంగా మాతో చెప్పాడు.
మా ఊరి బడి కి దగ్గర లో, ఒకప్పుడు ఆదిలక్ష్మి వాళ్ళు ఉండే ఇల్లు ఇప్పుడు కూలిపోవటానికి సిద్ధంగా ఉంటే, అప్పల నర్సమ్మ వాళ్ళు గేదుల్ని కట్టేసుకుంటున్నారు అందులో. ఆ ఇంటి చూరు కింద చిన్న అరుగు మీద కూర్చున్న ఆది లక్ష్మి ని చూడటానికి ఒక్కొక్కళ్ళు వచ్చి వెళ్తున్నారు ఊళ్ళో జనం. మనిషికి తగ్గ పేరు పెట్టు కుందని ఒకప్పుడు అందరూ చెప్పుకున్న ఆదిలక్ష్మి, వేసవి కాలం మా ఊరి కాలవ గట్టు మీద గడ్డి మొక్కల మధ్య రోహిణీ కార్తె ఎండలకి నీళ్ళు లేక మట్టిగొట్టుకు పోయి వాడిపోయిన తులసి మొక్కలా కనిపిస్తుందిప్పుడు. కళ్ళు పీక్కుపోయి బాగా లోతుకెళ్ళిపోయి ఉన్నాయి. అసలు ఈ అమ్మాయి అంత చిన్న చిన్న కళ్ళతో ఎలా చూడగలదా? అనిపిస్తుంది ఇప్పుడు ఆదిలక్ష్మి ని కొత్తగా చూసినవాళ్ళెవరికయినా, కానీ ఇదివరకయితే మాత్రం ఆదిలక్ష్మి కళ్ళు చూసి అంత విశాలమయిన కళ్ళు చూడాలంటే మన రెండు కళ్ళూ సరిపోవేమో అనిపించేది. మనిషి అంత రంగు లేకపోయినా, ఆదిలక్ష్మి ని చూసిన ఎవరయినా, ఇంత అందమయిన అమ్మాయిని ఈ చుట్టు పక్కల ఊళ్ళళ్ళో ఎక్కడా చూడ లేదని చెప్పేవారు కానీ, ఎందుకంత అందం గా ఉంటుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోయే వాళ్ళు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరిని చూసినా పసిపాప లా నవ్వే స్వచ్చమయిన నవ్వే ఆ అమ్మాయి అందమని కొంతమందంటే, కాదు నవ్వు కన్నా నవ్వినప్పుడు ఆ అమ్మాయి కళ్ళు ఇంకా అందంగా ఉంటాయని ఇంకొంతమంది అనేవారు. ఓ సారి ఆదిలక్ష్మి వాళ్ళ తాతకి కూలి డబ్బులు ఇవ్వలేదని మేస్త్రి పంజా వెంకటేశులు మీదకి ఆదిలక్ష్మి దెబ్బలాటకెళ్ళి కళ్ళెర్రచేస్తే భయపడిపోయి, డబ్బులిచ్చేసిన వెంకటేశులు మాత్రం అప్పట్నుంచీ ఆ అమ్మాయి కళ్ళు చూస్తే భయమని చెప్పేవాడు. ఊళ్ళో అందరికీ జాతకాలు, ముహూర్తాలు చూసే బ్రాహ్మల అబ్బాయి గారి ఆచారి గారు మాత్రం ఆదిలక్ష్మి అదేదో నక్షత్రం లో పుట్టిందనీ, ఆ నక్షత్రం లో పుట్టిన వాళ్ళు తప్ప ఇంకెవరూ అంత అందం గా ఉండలేరనీ అన్నారొకసారి .
ఇదివరకయితే ఊరి జనానికి విన సొంపయిన మువ్వల శబ్దం వినపడాలంటే రెండే రెండు సందర్భాలు. అంత పెద్ద మైసూరు ఎద్దులకి దిష్టి తగలకుండా, మెడలో వెంట్రుకలతో చేసిన తాడుకి మువ్వలు కట్టి బండి మీద దాళ్వా, సార్వా ల్లో పంట చేతికి రాగానే పొలాల్లోంచి, మిల్లులోకి ధాన్యం తోలడానికి పెద్ది రాజు బండి కట్టినప్పుడు ఒకసారి, సన్నని నడుము కింద వరకూ వున్న ,ఇంత లావు పొడుగు జడకి జడ గంటలు తోను, కాళ్ళకి మువ్వల పట్టీలతోను, ఉగాది పండగ రోజు ఇంటింటికీ ఉగాది పచ్చడి పంచిపెడుతూనో, ప్రతీ సంవత్సరం సంక్రాంతి వెళ్ళగానే మా ఊరి గ్రామ దేవత కప్పాలమ్మ కి జరిగే జాతర లో మొక్కు తీర్చుకున్న అరటి గెలల్లోని అరటిపళ్ళు అందరికీ పంచిపెడుతూనో ఆదిలక్ష్మి చలాకీగా ఊరంతా తిరిగినప్పుడు ఇంకోసారి.
అరుగు మీద కూర్చుని, చూడటానికొచ్చిన జనం అడిగే ప్రశ్నలన్నిటికీ పొడి పొడి గా సమాధానాలు చెబుతున్న ఆదిలక్ష్మి కి మధ్యాహ్నం భోజనం సమయానికి అప్పల నరసమ్మ కోడి గుడ్డు పులుసు కూరతో అన్నం తీసుకొచ్చి పెడితే, సరిగ్గా కడుపు నిండా భోజనం చేసి చానాళ్ళు అవటం వల్లనో, ఊరి భోజనం ఇంతకాలానికి తింటున్నామన్న ఆనందం వల్లనో తెలీదు గానీ గబ గబా, ఆబగా తినేసింది. అసలు ఆదిలక్ష్మి వాళ్ళ అమ్మా, నాన్న ఉండేది కొల్లేరు దగ్గరలో అడవి కొలను అనే ఊళ్ళో. ఆదిలక్ష్మి కి అయిదేళ్ళు వయసు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నా ట్రాక్టర్ మీద పొలం పనులు కి వెళ్ళేటప్పుడు ట్రాక్టరు తిరగబడిపోయి చనిపోయాక, మా ఊళ్ళో ఉండే అమ్మమ్మా, తాతయ్యా ఆదిలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చేస్తే అప్పట్నుంచీ మా ఊళ్ళో చాలా మంది ఆదిలక్ష్మి ని వాళ్ళ సొంత ఇంట్లో పిల్లాలాగా చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఆదిలక్ష్మికి పెళ్ళి వయసొచ్చాక మంచి సంబంధం చూసి చేసేద్దామని అందరూ అనుకునే సమయానికి, విదేశాలకి రొయ్యలు, చేపలు ఎగుమతి చెయ్యటానికి వ్యాపారం కోసం మా ఊరి చుట్టుపక్కల పెద్ద రైతుల దగ్గర చెరువుల్లో పెంచే చేపలు, రొయ్యలు కొనడానికి పెద్ద కారేసుకుని అప్పుడప్పుడూ మా ఊరొచ్చే రాంపండు, ఆదిలక్ష్మిని చూసి తనతో వస్తే పెళ్ళి చేసుకుంటానంటే, తెలిస్తే వద్దంటారని ఊళ్ళోను, ఇంట్లోను ఎవరితోనూ చెప్పకుండా రాంపండు తో వెళ్ళిపోయింది.
అలా వెళ్ళిపోయాక ఆదిలక్ష్మిని రాంపండు పెళ్ళి చేసుకోలేదు గానీ, బెంగుళూరు, హైదరాబాదు లాంటి చాలా ఊళ్ళన్నీ తిప్పి కొన్నాళ్ళకి ఆ అమ్మాయిని చావగొట్టి బయటికి గెంటేసి, వాళ్ళకి తగిన సంబంధం చూసుకుని పెళ్ళిచేసుకున్నాడని, ఆ రోజు అరుగు మీద కూర్చుని ఆదిలక్ష్మి చెపితేనే మా ఊరి జనమందరికీ తెలిసింది. ఆ తర్వాత మొహం చెల్లక ఊరికి మళ్ళీ మొహం చూపించని ఆదిలక్ష్మి, మళ్ళీ ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్ధం కాలేదు కానీ, తిరిగొచ్చిన ఆదిలక్ష్మి ఇప్పుడయినా ఊళ్ళో ఉండిపోతుందేమో అనుకున్నారు ఊరి జనం.
కానీ ఆదిలక్ష్మి మాత్రం అదే రోజు సాయంత్రం చీకటి పడుతుండగా ఎంతమంది చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ వెలగపల్లి రోడ్డు దగ్గర కనిపించిన అంజిగాడితో "తినడానికి కూడా లేకపోవటం ఒక్కటే దౌర్భాగ్యం కాదు, అన్నీ ఉన్నా, మనతో పాటు కలిసి కూర్చుని తినటానికి ఎవరూ లేకపోవటం కూడా దౌర్భాగ్యమే, ఇప్పుడు నా దగ్గర రెండూ లేవు. ఒకప్పుడు వాళ్ళు పెట్టింది తిని పెరిగిన నేను అంత గొప్పింటికి వెళ్ళిపోయాననుకుని అసూయతో కడుపు మండిన చాలా మంది ఊరి జనానికి, ఇప్పటి నా పరిస్థితి చూశాకయినా మనశ్శాంతి కలుగుతుందేమోనని" మళ్ళీ ఊరొచ్చానని చెప్పి, వెళ్తూ వెళ్తూ చీకట్లో కలిసిపోయింది ఆదిలక్ష్మి. అన్నట్టు ఆ రోజు కూడా ఆదిలక్ష్మి పరిస్థితి చూసి కడుపు తరుక్కుపోయి ఊళ్ళో ఎవరూ అన్నం తినలేదు.

No comments:
Post a Comment