Thursday, October 10, 2013

హైద (రా...) బాదు

పొట్ట కోస్తే అక్షరమ్ముక్క రాని చాకలోళ్ళ శీను గాడు
హైదరాబాదెళ్ళిపోయి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ
ఇస్త్రీ చొక్కా నలక్కుండా బతికేస్తున్నాడు.
భర్తకి జబ్బు చేసి అప్పులపాలయిపోయి ఉన్న అరెకరం అమ్మేసుకున్న కాంతమ్మత్త
హైదరాబాదెళ్ళిపోయి బిస్కట్ల ఫ్యాక్టరీలొ పని చేసుకుంటూ
పిల్లల్ని చదివించుకుంటూ మెల్లిగా ఏదోలాగ బతికేస్తుంది.
కిడ్నీలు పాడైపోయిన కొట్టు సత్యం హైదరాబాదెళ్ళి పోయి
ఆరోగ్యశ్రీ కింద నిమ్స్ లో నయం చేయించుకుని మనిషి మళ్ళీ మామూలయిపోయాడు.
రెండెకరాల చిన్న రైతు నారాయణ గాలి వానొచ్చి ఒక పంట
పోయినా పెద్దగా బాధపడకుండా హైదరాబాదు హైటెక్ సిటీ లో
కొడుకు సాఫ్టువేరు ఇంజినీరు కదా అన్న ధైర్యంతో అప్పుచేసయినా
మళ్ళీ పంటకి చేనుకి నీళ్ళెట్టుకుంటున్నాడు.
చదవలేక పదో తరగతిలోనే ఇంట్లోంచి పారి పోయి
హైదరాబాదు వాళ్ళ బావ దగ్గరికి వచ్చేసిన
సుబ్రమణ్యం తర్వాత ప్రింటింగు ప్రెస్ పెట్టుకుని
రాత్రీ పగలు కష్టపడి పైకొచ్చి ఇప్పుడు పదిమందికి పని చూపిస్తున్నాడు.
ఊళ్ళో పని లేక ఖాళీగా తిరుగుతున్న కుమ్మరోళ్ళ తాతారావుకి
హైదరాబాదు లో సినిమాల్లో కరంటు పని చేసుకునే వాళ్ళ దూరపు బంధువు ఫోను చేసి
నేను చూసుకుంటాలే వచ్చెయ్యమంటే రాత్రికి రాత్రి గౌతమి కి వెళ్ళిపోయాడు.
కంప్యూటర్లు బాగు చెయ్యటం నేర్చుకుని హైదరాబు వచ్చేసిన
వెంకట్ సొంతంగా హార్డువేరు బిజినెస్ పెట్టుకుని ఇప్పుడు
లక్షాధికారి అనిపించుకుంటున్నాడు.
ఒళ్ళు గుల్లవుతుందన్నా వినిపించుకోకుండా డిగ్రీ ఫెయిలయిపోయిన కోటి గాడు
హైదరాబాదెళ్ళిపోయి ఫార్మా కంపనీలో యాసిడ్ బక్కెట్లు మోసి
ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు.
తాపీ పని చేసుకునే తాడి కొండయ్య హైదరాబాదులో ఉద్యోగం
రావాలంటే ఇంగ్లీషు చదువులుండాలని ఫీజులు ఎక్కువయినా
పట్టించుకోకుండా కొడుకుని ఇంగ్లీషు మీడియం బళ్ళో చేర్పించేశాడు.
మొన్నటికి మొన్న కూకట్ పల్లి వెళ్ళే బస్సు నంబరు 226 లో
కాలు పెట్టటానికి కూడా చోటు లేకపోయినా జేబులోనుంచి ఫోను తీసి
"ఒరేయ్ హైదరాబాదు వచ్చెయ్ రా అంతా నేను చూసుకుంటా లేవెహే" అని
తమ్ముడికో, బావమరిదికో, స్నేహితుడికో భరోసా ఇచ్చేస్తున్నారెవరో.
మా వాడికి హైదరాబాదులో ఉద్యోగమొచ్చిందని గర్వం గా చెప్పుకుందామని చూసే తండ్రులూ.
మా అమ్మాయికి హైదరాబాదు సంబంధం దొరికితే నిశ్చింతగా ఉందామనుకునే తల్లులు.
వీళ్ళెవరూ పడ్డ కష్టాలెపుడూ పైకి చెప్పుకోలేదు.
కష్ట పడేవాడెపుడూ కష్టాలు చెప్పుకోడు .
ఇదంతా గతం నుంచి వర్తమానం వరకూ సాగిన ప్రయాణం.
కానీ ఇప్పుడు, భవిష్యత్తు గురించే భయమంతా.
అందుకే, ఈ గొడవంతా.

7 comments:

  1. కానీ ఇప్పుడు, భవిష్యత్తు గురించే భయమంతా.....
    <<<<<
    తెలంగాణ ఏర్పదితె
    ఇండియా పాకిస్తాన్ల్ మధ్య పడ్డట్టు
    ఇనుపకంచ ఏమీ పడదు బ్రదర్.
    రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ము కోవచ్చు
    టిఫిన్ సెంటర్లు, కర్రి పాయింట్లు పెట్టుకొవచ్చు.
    అన్ని సజావుగానె జరుగుతాయి.
    ఎవరికయ్యా భయం అంటే సెక్రటేరియటో పెత్తనం చేసే వాల్లకి..
    అసెంబ్లీ లో గద్దె మీద తిష్టవెసిన వాళ్ళకి మాత్రమే
    ఈ భయాలన్నీ వాళ్ళే రేపుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. thank you for your comment. నేను ప్రజలకి హైదరాబాదు తో ఉన్న అనుబంధం గురించీ, విభజన విషయంలో వాళ్ళకున్న భయాందోళనల గురించీ నాకు తెలిసింది, నేను చూసిందీ చెప్పాను. ఈ భయాలు కేవలం భయాలుగానే మిగిలిపోవాలనీ, వాస్తవాలు ఇందుకు విరుధ్ధంగా వుండాలనే నేనూ కోరుకుంటున్నాను. ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

      Delete
  2. Chaduvukunna vallu kooda Politicians repe bhayalu nammutunte koddiga ascharyam vesthundi. LOL

    ReplyDelete
  3. Idi konchem too much...entho problem ayina Madras lone telugu vallu velli settle ayayru..Hyd Gurinchi kavalani chesthunna pracharme idantha

    ReplyDelete
    Replies
    1. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడూ, భయపెట్టేవాడున్నపుడూ సామాన్య ప్రజానీకం భయపడటం మానవ సహజం. నేను చదువుకున్న వాడిని కాబట్టే నా చుట్టూ ఉన్న వారి భయాందోళనల గురించి అందరికీ తెలియచేసే ప్రయత్నం చేశాను. తెలంగాణా విభజన విషయంలో ఇప్పటివరకూ జరిగిన వాటి గురించి మాట్లాడాలంటే ఎన్ని పేజీలయినా సరిపోవు. నేనేమీ తెలంగాణా వ్యతిరేకిని కాదు. కావాలని ప్రచారం చెయ్యటానికి రాజకీయ నాయకుడినీ కాదు. చారిత్రక అవసరమొ, చారిత్రక తప్పిదమో తెలీదు గానీ మీలాంటి వాళ్ళందరూ కోరుకున్న హైదరాబాదు రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రావటం కూడా తధ్యం.

      Delete