Tuesday, April 8, 2014

చిన్న శీను బళ్ళోకొచ్చిన రోజు


              పొద్దున్నే లేచి ముఖం కడుక్కుని , నీళ్ళు తాగించటానికి మా బార కొమ్ముల గేదిని, దాని పెయ్యి దూడని కాలవ కి తీసుకెళ్ళి అందులోనె స్నానం చేసి ఇంటికొచ్చి పెరుగన్నం తినేసి బళ్ళోకెళ్ళిపొయాను. అప్పటికే మా కన్నా ఒక సంవత్సరం పై క్లాసు, ఏడో తరగతి చదవు కోవటానికి వెలగపల్లి నుంచొచ్చే గంటల మంత్రి ఆది నారాయణ మూడో బెల్లు కొట్టేశాడు. వెంటనే లెక్కల మాస్టారు శేషగిరిరావు గారు "ఆల్జీబ్రా, గుండె గాభరా" అనుకుంటూ తల పట్టుక్కూర్చున్న మాకందరికీ క.సా.గు, గ.సా.భా లు మొదలెట్టి, సగం క్లాసు చెప్పాక, అప్పుడప్పుడూ తప్ప ఎప్పుడోగాని బళ్ళోకి రాని నరశిం హం గారి చిన్న శీను "మే ఐ కమిన్ సర్ " అనుకుంటూ వచ్చి కూర్చుండిపోయాడు. పోలాల అమావాస్య కీ , మాలాల అమావాస్య కీ తప్ప రాని చిన్న శీను గాణ్ణి , ఆ వచ్చేది కూడా ఆలస్యం గా వచ్చినందుకు నాలుగు తిట్టి, ఇలాగైతే రేపొద్దున్న మా తల మీద రూపాయి పెడితే పావలాకి కూడా మమ్మల్ని ఎవరూ కొనక ఎందుకూ పనికి రాకుండా పోతారని వాడితో పాటు మమల్నందర్నీ కూడా కలిపి తిట్టి , క్లాసు అవగొట్టేశారు మాస్టారు.

              అంతకు ముందు రోజు రాత్రి, కాలికి ఎప్పుడో పెద్ద దెబ్బ తగిలి కదలటానికి లేక కాలక్షేపం కోసం మా వీధి లో అందరికన్నా ముందు టీ.వీ. కొనుక్కున్న శ్రీ రాములు తాత వాళ్ళ ఇంటికెళ్ళి చూసిన , దూరదర్శన్ లో ఏడున్నరకొచ్చే "విచిత్ర కాశీ మజిలీ కథలు" సీరియల్ గురించి సీరియస్ గా మే మందరం మాట్లాడుకుంటుంటే, మధ్యలో వచ్చిన మా తెలుగు మస్టారు మధ్యాహ్నం బెల్లు కొట్టాక అన్నం తిని చుట్ట కాల్చుకునే భీమేశ్వర్రావు గారు "మూడు చేపల కథ " పాఠం మొదలెట్టేరు. ఎవరైనా వెళ్ళి "పిల్లలకి పాఠాలు చెఫ్ఫే మీరే చుట్ట కాలిస్తే ఎలాగండీ" అని అడిగితే తనకేదో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకునే రోగముందనీ , రోజూ చుట్ట కాలిస్తే తగ్గుతుందని గణపవరం విశ్వనాధరాజు డాక్టరు గారు చెప్పేరనీ చెప్పేవారు. "మూడు చేపల కథ " పాఠంలో మందమతి జాలర్లకు దొరికిపోయి పాఠం అయిపోయిందనుకునే సమయానికి బయట నుంచి ఏవో పెద్ద పెద్ద కేకలు వినిపించటంతో అందరం పాఠం వినడం ఆపేసి గుమ్మం వైపు చూడటం మొదలెట్టాం.

              అసలే ఆరడుగుల మనిషి , "కోపమొస్తే మాత్రం మనిషి కాద"ని అందరూ చెప్పుకునే, చిన్న శీను వాళ్ళ నాన్న నరశిం హం పంచె పైకి కట్టి అరుచుకుంటూ, పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ సరాసరి మా క్లాసులోకొచ్చి "ఏరా గేదెల దగ్గర పని చూసుకుని, పొలమెళ్ళి చేలో గుళికల మందు చల్లమంటె మానేసి బళ్ళోకొచ్చి కూర్చుంటావా" అని చిన్న శీను గాణ్ణి చెయ్యి పట్టుకుని బరబరా క్లాసు రూము లోంచి బయటికి లాక్కొచ్చేడు. అడ్డుకోబోయిన మా చుట్టల మాస్టార్ని "ఇంకోసారి మా వాడికి బళ్ళో పాఠం చెపితే మర్యాద దక్కద"ని బెదిరించి, మా ఊళ్ళో అందరూ గౌరవించే స్కూలు హెడ్ మాస్టారు అబ్రహాం మాస్టారు దగ్గరకొచ్చి మాట్లాడబోతే గెంటినంత పని చేసి , చిన్న శీను గాణ్ణి లాక్కెళ్ళి, రంపం పళ్ళు లాంటి గరిగమ్మలున్న తాటి కమ్మ తీసి కొట్టుకుంటా ఇంటికి తీసుకెళ్తుంటే, ఆపే ధైర్యం లేక అందరూ ఇళ్ళల్లోంచి బయటికొచ్చి చూస్తూండి పోయారు.

              ఇంటికెళ్ళాక చిన్న శీను గాణ్ని పొలాలకి కొట్టే పురుగుమందు గుళికలుండే పెద్ద డబ్బాలో పెట్టి మూతెట్టేసిన నరసిం హం గారు "నేనొచ్చేవరకూ ఎవరైనా మూత తీస్తె ఊరుకోన"ని చెప్పి వెళ్ళి భోజనానికి కూర్చిండిపోయారు. ఇంతలో పక్క వీధి లో ఇడ్లీ సత్యనారాయణ వాళ్ళింట్లో రొయ్యావకాయ పడుతుంటే సాయం చెయ్యటానికి వెళ్ళిన నరసిం హం గారి అమ్మ గారు గోగులమ్మ విషయం తెలిసి, గబగబా వచ్చి మూత తీసి చూసేసరికి చిన్న శీనుగాడు స్పృహ లో లేడు. ఊళ్ళో ఆర్.ఎం.పి డాక్టరుగా చేసే రవికుమార్ వచ్చి చూసి, వెంటనే రాజమండ్రి తీసుకెళ్తే గాని ఏ విషయం చెప్పలేమని చెప్పేశాడు. నరశిం హం గారి అన్నయ్యగారబ్బాయి పెద్ద శీను చిన్నకారు కట్టించి రాజమండ్రి విమలమ్మ హాస్పిటల్లో చేర్పించి, పాతిక వేలు దాకా ఖర్చు పెట్టి చిన్న శీను ని మామూలు మనిషిని చేస్తె, వారం తర్వాత ఇంటికి తీసుకొచ్చేరు.

               బతికి బయటపడ్డ చిన్న శీను ఆ తర్వాతెప్పుడూ బడి మొహం చూడలేదు గానీ, ఆ మధ్యలో ఓ సారి నరశిం హం గారి చేపల చెరువులు లెక్కలు చూడటానికి తణుకు నుంచొచ్చే బ్రహ్మాజీ తప్పుడు లెక్కలు చూపించి, మోసం చేసి , డబ్బు తినేసి పారిపోతే , ఇప్పుడు మాత్రం స్వయానా ఆయనే తన మనవల్ని పిప్పర లో కొత్తగా పెట్టిన "గురజాడ టెక్నో స్కూల్లో" చేర్పించి , రోజూ పొద్దున్నే స్కూల్లో దించి సాయంత్రం అయ్యేసరికి తీసుకొస్తున్నారు.

2 comments:

  1. పసలపూడి కధల్లా ఉన్నాయండీ నిజం గా

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ, ఆ మాటే పదివేలు.

      Delete