Sunday, October 4, 2015

చీకటి ప్రపంచ చరిత్రకారుడు – Günter Grass

               నిజ జీవితంలో నిలువుగా ఆరడుగులు పైన, అడ్డంగా నాలుగడుగులు ఉండే గుంటర్ గ్రాస్(Günter Grass) లాంటి రచయిత తను రాసిన ‘ద టిన్ డ్రం’ నవలలోని ప్రధాన పాత్ర అయిన ఆస్కార్ ని మాత్రం మూడు అడుగులు మించి ఎదగకూడని నిర్ణయించుకుని అలాగే ఉండి పోయే వాడిగా చిత్రించటం లోని ఆంతర్యం ఏమై ఉంటుంది. ఎక్కడయినా ఎవరయినా తనని తాను కావాలని కుంచించుకోవటం ఏ సందర్భంలో జరుగుతుంది.? కళ్ళ ముందు కొనసాగుతున్న దారుణమయిన పరిస్థితులను నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఎదిరించి పోరాడలేని సగటు మనిషి మానసిక దౌర్భల్యానికి బహుశా ఇది ఒక భౌతిక సంకేతం కావచ్చు. ఒక చెంప దెబ్బ కావచ్చు. ఒక మేలు కొలుపు కావచ్చు. లేదా భయానక గతానికి దాని పరిణామమయిన వర్తమానానికి కనీసం ఒక మూగ సాక్ష్యం గా అయినా మిగిలిపోవాలని తెగించి తీసుకున్న నిర్ణయానికి పరాకాష్ట కూడా కావచ్చు. 1959 లో అచ్చయిన ఈ నవల 20వ శతాబ్దపు మొదటి సగంలో, జర్మనీ చరిత్రతో పాటు రెండవ ప్రపంచ యుధ్ధ పరిణామాలను, దేశాల మధ్య జరిగిన మారణ కాండను, అమానుషత్వాలను కళ్ళకి కట్టి చూపించి, నాజీల దురాగతాలకు జర్మన్ల నైతిక భాత్యతని గుర్తు చేసింది. 1999 లో నోబెల్ బహుమతి పొందిన ఈ నవల అంతకు ముందు 1979 లో అదే పేరుతో జర్మన్ సినిమా గా విడుదలై ఆ సంవత్సరం ఉత్తమ విదేశీ భాషా చిత్రం గా ఆస్కార్ బహుమతి కూడా గెలుచుకుంది.

               నవల, సినిమా కూడా కొన్ని వాస్తవ సంఘటనల యదార్ధ చిత్రీకరణల వల్ల తీవ్రమయిన విమర్శలను ఎదుర్కొన్నాయి. అందుకేనేమో చాలా ఏళ్ళ క్రితం ఒకసారి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చిన గ్రాస్ ‘టిన్ డ్రం’ చిత్ర ప్రదర్శన సందర్భగా ముందుగానే ప్రేక్షకులకి “ఈ సినిమాలో కొన్ని సీన్లు మీకు అతిగా, జుగుప్సాకరంగా అనిపించవచ్చు కానీ అది ఆనాటి జర్మన్ సమాజంలోని వాస్తవం. వాటిని అలాగే చూడండి. అపార్ధం చేసుకోవద్దు.” అని విన్నవించుకోవలసి వచ్చింది...

'వాకిలి' పత్రిక లో ప్రచురితమయిన వ్యాసం, పూర్తిగా : http://vaakili.com/patrika/?p=9057

Wednesday, July 1, 2015

మొదటి పాఠం

              శనివారం పూట పొద్దున్నే రేడియోలో వచ్చే వెంకటేశ్వరస్వామి సుప్రభాతం ఇంకా మొదలవలేదు. మామూలుగా అయితే "పొద్దున్న మూడింటికయినా లేవనివాడు మనిషే కాదు" అని మా ఊళ్ళో ఆరు అయితే గానీ నిద్ర లేవని బధ్ధకస్తులందరికీ చెప్పే మా నారాయుడి తాత లెక్క ప్రకారం అయితే అప్పటికే బాగా తెల్లారిపోయినట్టు. కానీ ఆరో తరగతి చదివే చంటిగాడు మాత్రం ఇంకా మంచం మీద పడుకునే ఉన్నాడు. చంటిగాడి వాళ్ళ అమ్మ అప్పటికి మూడుగంటల ముందే లేచి వాడి చెల్లెలికి పాలు పట్టి మళ్ళీ పడుకోబెట్టి ఇల్లూ వాకిలీ తుడిచేసి, కోళ్ళ గూట్లో ఉన్న కోళ్ళని బయటికి వదిలేసి వాటికి గుప్పెడు వడ్ల గింజలేసి, గేదెల పాక దగ్గర కూడా శుభ్రంగా పేడ తీసి తుడిచేసి, నిన్న మధ్యలో వదిలేసిన పిడకలు కొట్టే పని కూడా పూర్తి చేసేసి పొయ్యి మీద నీళ్ళు పెట్టి చంటిపాపకి స్నానం చేయించి పక్కన కూర్చోబెట్టుకుని వంట పని కూడా మొదలెట్టి, పొయ్యి దగ్గరనుంచే "ఒరేయ్ చంటీ పడుకున్నది చాలు గానీ ఇంక లేవరా, మళ్ళీ మీ నాన్న గానీ వచ్చి కర్ర పట్టుకున్నాడంటే పడక మంచం మీద నుంచే పరగు పందెం మొదలెడతావు." అని చంటిగాడిని నిద్ర లేపటానికి తన వంతు ప్రయత్నం మొదలెట్టింది. చంటిగాడికి నాన్నంటే భయమే గానీ వాళ్ళ అమ్మ మాట మాత్రం అంతగా లెక్క చేసే అలవాటు లేదు. దానికి తోడు ఎక్కువగా నులక మంచం మీదే ఉండే వాళ్ళ ముసలి నాయనమ్మ సపోర్టు కూడా ఎప్పుడూ వాడికే, అందుకే మెలకువ వచ్చినా గానీ బధ్ధకం తీరక వాళ్ళ నాన్న వస్తే ఏమన్నా అంటాడేమో అని భయపడుతూ భయపడుతూనే ఇంకా అలాగే పడుకునే ఉన్నాడు.

               ఇంతలో అప్పుడే వచ్చిన చంటిగాడి వాళ్ళ నాన్న హడావుడిగా సైకిలు స్టాండు వేసి, "పొద్దున్నే ఎవడి మొహం చూశానో గానీ గేదెలకి గడ్డి కోసుకుని మోపు సైకిలు మీద పెట్టుకుని వస్తుంటే సరిగ్గా పుంత గట్టు మీదకి వచ్చేసరికి వెనకాల టైరు ప్యాచ్చీ పడింది. గడ్డి మోపు నెత్తిమీద పెట్టుకుని సైకిలు నడిపించుకుంటూ వచ్చేసరికి ఆలస్యమయిపోయింది. చంటిగాడు లేవగానే వాడి చేతికి ఒక అయిదు రూపాయలిచ్చి సైకిలు కొట్టు సూరయ్య దగ్గరికెళ్ళి ప్యాచ్చీ వేయించుకు రమ్మను, అన్నట్టు నిన్న రాత్రి నీ చేతికిచ్చిన సంచిలో అడుగున కోటయ్యగారి కొట్లో కొన్న తాటి బెల్లం ఉంది చూశావా.? చంటిగాడు ఎప్పట్నుంచో అడుగుతునాడన్నావు కదా" అని గబ గబా టీ తాగేసి "నేను మన పై పొలం పాతిక సెంట్లుకీ కలుపు తీసి, కింద ఎకరంనర కౌలు పొలానికి యూరియా జల్లి, వచ్చి అన్నం తిని గేదుల్ని కాలవకి తోలుకెళ్ళి నీళ్ళు తాగించి కట్టేసి, సీతారామరాజు గారి చేపల చెరువు పట్టుబడి పనికి వెళ్ళి పోతాను. నేను వచ్చేసరికి ఆలస్యమయితే పాలు నువ్వే తీసెయ్, వంట అయ్యాక, దిబ్బ మీద కూరగాయల మొక్కలకి నీళ్ళు పొయ్యి. నాలుగు రోజుల నుంచీ వాటి మొహం చూడక ఎండి చచ్చిపోయేలా ఉన్నాయ్" అని చెప్పేసి మళ్ళీ హడావుడిగానే వెళ్ళి పోయాడు.

               అప్పుడు నిద్ర లేచిన చంటిగాడు మొహం కడుక్కున్నాక, వాడికి చద్దన్నం పెట్టి నంజుకోవటానికి తాటి బెల్లం ముక్క ఇచ్చిన వాళ్ళమ్మ "మీ నాన్న సైకిలు ప్యాచ్చీ పడిందంట, తిన్నాక నీ పుస్తకాల సంచి దగ్గర పెట్టిన అయిదు రూపాయలూ తీసుకుని సూరయ్య సైకిలు కొట్లో ప్యాచ్చీ వేయించుకొచ్చి స్నానం చేసి బళ్ళోకెళ్ళిపో, చెల్లిని నాయనమ్మ దగ్గర వదిలేసి గేదెలకి కుడితి పెట్టి నేను దిబ్బ మీద మొక్కల పని చూసి రావాలి" అని చెప్పి మళ్ళీ పొయ్యి దగ్గరికెళ్ళిపోయింది.

               సైకిలు ప్యాచ్చీ పని అయ్యాక అప్పుడప్పుడే సైకిలు నేర్చుకుంటున్న చంటిగాడు వచ్చేటప్పుడు మాత్రం చాలా సరదాగా కడ్డీ తొక్కుకుంటూ ఇంటికొచ్చేసి స్నానం చేసి సరిగ్గా ప్రార్ధన మొదలయ్యే సమయానికల్లా బళ్ళోకెళ్ళిపోయాడు. మామూలుగా అయితే రోజూ పొద్దున్నే లెక్కల క్లాసు ఉంటుంది గానీ ఆ రోజు మాత్రం లెక్కల మాస్టారు భీమేశ్వర్రావు గారు శెలవు పెట్టారని తెలుగు మాస్టారు ఉమా మహేశ్వర్రావుగారొచ్చారు. ముందు కొంచెం సేపు నిన్న మొదలెట్టిన వేమన శతకం పాఠం లో మిగిలిపోయిన పద్యాలు కూడా అవగొట్టేసి ఇంకా టైముందని క్లాసులో ఒక్కొక్కరి చేతా, వాళ్ళకి తెలిసిన నీతి వాక్యాలు చెప్పమని బోర్డు మీద రాసి మళ్ళీ ఆ నీతి వాక్యం గురించి వివరించటం మొదలెట్టారు. బండ కిట్టిగాడు "ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెపితే కుమ్మరోళ్ళ తాతారావు గాడు "సత్యమునే పలకవలెను" అన్నాడు. రమేషు గాడు "పెద్దలను గౌరవించవలెను" అంటే, చంటిగాడి వంతు వచ్చేసరికి ఇదివరకు కాపీ పుస్తకంలో రాసిన "మానవ సేవే మాధవ సేవ" అన్న మాట గుర్తొచ్చి అదే చెప్పాడు. ఉమా మహేశ్వర్రావు గారు ఒక్కో మంచి మాట గురించీ వివరంగా చెపుతూ ఇవన్నీ ఆచరించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళవుతారనీ మంచి పేరు తెచ్చుకుని జీవితంలో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారనీ చెప్పేసరికి చంటి గాడు కూడా నిజంగానే ఇవన్నీ ఆచరించి గొప్పవాడిగా ఎదగాలని ఆ క్షణమే నిర్ణయించేసుకున్నాడు. అప్పుడప్పుడూ వాళ్ళ నాయనమ్మ చెప్పే నీతి కధలు చాలా ఇష్టంగా వినే చంటిగాడు కిందటి నెల ఒక ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్ లో అవార్డు సినిమాల కింద శ్రీరాములు తాత వాళ్ళ టీవీ లో వచ్చిన రుద్రవీణ సినిమాలో చిరంజీవిని చూసినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాడు. దానికి తోడు మొన్న చిన్న శీనుగాడికి దెబ్బ తగిలినప్పుడు, ఇంట్లో దెబ్బలకి వాడే ఆయింటుమెంటు కొంచెం తాటాకు ముక్క మీద పెట్టి పట్టుకెళ్ళి వాడికిస్తే అది రాసుకున్న చిన్న శీనుగాడు మూడో రోజు "నువ్వు ఇచ్చిన ఆయింటుమెంటుకి నా దెబ్బ నొప్పి తెలీకుండా దెబ్బకి తగ్గిపోయింద"న్నప్పుడు కూడా చంటిగాడికి చాలా బాగా అనిపించింది. అందుకే జీవితం లో ఎప్పుడూ మాస్టారు చెప్పినట్టే నడుచుకోవాలని గట్టిగానే నిర్ణయించేసుకున్నాడు.

               సాయంత్రం చంటిగాడు బళ్ళోంచి వచ్చీ రాగానే అంతకు ముందే చేపల పట్టుబడి పనిలోకెళ్ళొచ్చిన వాళ్ళ నాన్న "సైకిలెక్కరా గణపవరం సంతకెళదాం" అన్నాడు. సంతకెళుతున్నామన్న ఆనందం తో పుస్తకాల సంచి ఇంట్లో పెట్టేసి వచ్చి సైకిలెక్కేశాక చంటిగాడి వాళ్ళమ్మ ఏమేం సరుకులు కావాలో చీటీ రాసి వాళ్ళ నాన్న చేతికిచ్చి, పెద్దావిడ మందులు కూడా అయిపోయాయని గుర్తు చేసి, "వచ్చేటప్పుడు మసీదు దగ్గర తాయత్తు తీసుకురా చంటిదానికి కట్టాలి. ఈ మధ్యన అర్ధ రాత్రి ఉలిక్కి పడి లేచి నిద్ర పోకుండా ఊరికే ఏడుస్తుంద"ని మర్చిపోవద్దని మరీ మరీ చెప్పి పంపించింది.

               సంతలో అన్నీ కొనేశాక చంటిగాడి వాళ్ళ నాన్న "ఇంకా టీ పొడి ఒకటి తీసుకోవాలి, నువ్వు నడుచుకుంటూ వెళ్ళి వంతెన కింద మన ఖాతా ఉన్న కొమ్మర రాజు కొట్లో అర కేజీ టీపొడి తీసుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చెయ్. ఈ లోపు నేను మసీదుకెళ్ళి సాయీబెవరయినా ఉంటే తాయెత్తు తీసుకొస్తా" నని చెప్పి వెళ్ళిపోయాడు. చంటిగాడు టీ పొడి తీసుకుని వచ్చేటప్పుడు, ముందు పెద్ద పెద్ద సంచుల్లో సరుకులూ, వెనకాల బియ్యం బస్తా వేసుకుని వస్తున్న ఒక ముసలాయన సైకిలు, బరువుకి ఆగలేక తిరగబడిపోయి సంచుల్లో ఉన్న పొట్లాలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోతే, ఆయన చంటిగాడిని పిలిచి "ఒరేయ్ మనవడా ఈ సరుకులన్నీ సంచుల్లోకెత్తి వంతెన ఎక్కే వరకూ సైకిలు తోసి పెట్టరా" అని అడిగాడు. చంటిగాడు అన్నీ జాగ్రత్తగా సంచుల్లోకెత్తి వెనకాల క్యారేజీ మీద బియ్యం మూటని మళ్ళీ గట్టిగా కట్టి ఆ ముసలాయన నెమ్మదిగా సైకిలు నడిపిస్తుంటే వంతెన ఎక్కేవరకూ సైకిలుని వెనక నుంచి తోసుకుంటూ వెళ్ళి వంతెన ఎక్కాక మళ్ళీ పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న "టీ పొడి తేవటానికి ఇంత సేపు ఎందుకురా?" అని అడిగితే, తను చేసిన మంచి పనిని వాళ్ళ నాన్న మెచ్చుకుంటాడని ముందే ఊహించుకున్న చంటిగాడు "వంతెన అవతల సరుకులు పాడేసుకున్న ఒకాయనకి సాయం చేశాన"ని ఆనందంగా చెప్పాడు. ఆ మాట విన్న వాళ్ళ నాన్న సెంటర్లో అంత మంది జనం చూస్తుండగా విసురుగా చెయ్యి పైకెత్తి లాగి చంటి గాడి చెంప మీద చెళ్ళుమని ఒకటిచ్చి "పొద్దున్న లేచిన దగ్గరనుంచీ మీ అమ్మకీ నాకూ ఒకటికీ, రెండుకీ వెళ్ళటానికి కూడా తీరిక లేనన్ని పనులు ఉంటే నువ్వు తాయితీగా వాడికీ వీడికీ ఉపకారం చేస్తూ కూర్చుని ఆలస్యం చేస్తావా? మా నాన్న తిడతాడని చెప్పి తప్పించుకుని రావటం తెలీదా? ఇంకా నేను అర్ధవరం పాత ప్రెసిడెంటు గారి ఇంటికి పాలు పొయ్యటానికెళ్ళాలి. అసలే వాళ్ళది చంటిపిల్లలు ఉన్న ఇల్లు. ఆలస్యమయ్యిందంటే రేపట్నుంచీ మన వతను వద్దంటే అంత మంచి ఖాతా మళ్ళీ మనకి దొరుకుతుందా? నువ్వేమయినా తిల్లపూడి పిల్ల జమిందారుననుకుంటున్నావా? ఉన్నంతలోనే మనకున్న పావు ఎకరం ముక్కా చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకుని ఎంత కష్టపడితే మన కుటుంబం నడుస్తుందో తెలుసా?" అని కోపంతో ఊగిపోతూ "చేసిన నిర్వాకం చాలు గానీ ఇంక నడు" అని వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుని బిక్కమొహం వేసుకున్న చంటి గాడిని ఎత్తి కుదేసి సైకిలు మీద కూర్చోబెట్టి గబగబా సైకిలు తొక్కుకుంటూ ఇంటివైపు దారి తీశాడు.

               ఇంటికెళ్ళాక, ఇంత లావు వేళ్ళ గుర్తులు పడి ఎర్రగా కందిపోయిన చంటిగాడి బుగ్గ మీద వాళ్ళమ్మ కొబ్బరి నూనె రాసి అన్నం పెట్టి ఇంక పడుకోమంది. కానీ రోజూ రాత్రి పడుకోబోయే ముందు, ఆ రోజు బళ్ళో చెప్పిన పాఠాలు మళ్ళీ ఇంకోసారి చదువుకునే అలవాటున్న చంటిగాడికి పుస్తకాలు తీసి ముందేసుకుని కూర్చున్నాక, అంతకు ముందు కాపీ పుస్తకం లో పది సార్లు అందంగా గుండ్రంగా తాను రాసిన "మానవ సేవే మాధవ సేవ" అన్న వాక్యం చూసి తన్నుకొచ్చిన దుఃఖంతో కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగి, బడి పాఠాలకీ, జీవితానికీ మధ్యన అడ్డం గా ఉన్న సన్నని గీత అస్పష్టంగా కనిపించింది. అదీ గాక మొట్టమొదటి సారిగా బడి పాఠాలకి మించిన జీవితపు పాఠమేదో బోధపడుతున్నట్టు కూడా అనిపించింది.

Wednesday, February 18, 2015

సత్తిగాడి బట్టల వ్యాపారం

              నోట్లో వేలు పెడితే కొరకలేడని మా ఊళ్ళో అందరూ చెప్పుకునే సత్తిగాడు కొత్తగా బట్టల మూట వ్యాపారం మొదలెట్టాడు. మనిషి మంచోడు. ఎవరేం చెప్పినా వింటాడు. పంచె పైకి కట్టమంటే పైకి కడతాడు. కిందకి కట్టమంటే కిందకి కడతాడు. బలంగా ఉంటాడు. ఒంటి చేత్తో ఎకరం మెరక పొలం ఒక్క పూటలో గట్టులంకలు వెయ్యగలడు. కొమ్మర పొలాన్నుంచి పిల్లిమిసర కోసి మనిషెత్తు మోపు కట్టుకుని మోసుకొచ్చి పడేసి మూడు గేదెలని మూడు పూటలా మేపగలడు. కలుపు తీసినా, కుప్ప నూర్చినా సొంత పనితో పాటు పక్క వాడి పని కూడా సునాయాసంగా చేసేస్తాడని వాడితో పాటు పనిలోకెళ్ళేవాళ్ళు వాడి పక్క చోటు కోసం కొట్టుకుంటారు. ఇద్దరి మనుషుల పని ఒక్కడే చేసేస్తాడని ఊళ్ళో రైతులు వాడిని పనికి పిలవటానికి పోటీ పడేవాళ్ళు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అలాంటి సత్తిగాడు పొలం పనులు చెయ్యటం మానేసి బట్టల మూట వ్యాపారం మొదలెట్టాడు. సత్తిగాడికి కొత్తగా పెళ్ళయింది. బాధ్యతలు కూడా పెరిగాయి. "వ్యవసాయమూ, కూలిపనీ అంటే ఎంత చేసినా గొర్రె తోకలాంటి బతుగే గానీ ఎదుగూ బొదుగూ ఉండదు. నాలుగు డబ్బులు సంపాదించి హాయిగా కాలు మీద కాలేసుకుని బతకాలంటే వ్యాపారమే చెయ్యాల"ని వాళ్ళావిడ పోరు మొదలెట్టింది. సత్తిగాడికి కూడా ఇదేదో కొత్తగా అనిపించింది. తనను తాను తెలివైన వాడిగా నిరూపించుకోవాలంటే ఈ వ్యాపారమేదో చేసి చూపించాలనుకున్నాడు. పైగా బట్టల వ్యాపారం కాబట్టి సరుకు పాడయిపోయేది కాదు కాబట్టి ఎప్పటికయినా లాభానికే తప్ప నష్టానికి అమ్ముకోనక్కరలేదని వాళ్ళావిడ నచ్చజెప్పడంతో వ్యాపారం చెయ్యటానికే నిర్ణయించుకున్నాడు.

               ఆలోచన వచ్చిందే ఆలస్యం బట్టల మూట బరువుకి ఆగాలని సత్తిగాడు తన హీరో సైకిలుకి డబలు కేరేజీ పెట్టించాడు. మామూలు టైర్లు పీకించేసి రిక్షా టైర్లు వేయించాడు. కొత్త కత్తెర, కొలబద్ద సిధ్ధం చేసుకునాడు. ఈ వ్యాపారంలో ఎప్పటినుంచో ఉన్న పక్క ఊళ్ళో ఉండే వాళ్ళ బావ మరిది దగ్గర ముందు ఒక నెల రోజులు ట్రైనింగు తీసుకున్నాడు. చదువుకున్నది నాలుగో తరగతే కాబట్టి ఎవరూ లెక్కల్లో తనని మోసం చెయ్యకూడదని కూడికలు, తీసివేతలు, నోటి లెక్కలూ అలవాటు చేసుకున్నాడు. రాజమండ్రి తాడితోటలో టోకున బట్టలు కొనటానికి వెళ్ళినప్పుడు ఆ షాపులోకి వచ్చే మామూలు కస్టమర్లకి అర్ధం కాకుండా బేరాలాడటానికి మామూలు అంకెలు కాకుండా తనలాంటి బట్టల మూట వ్యాపారులందరూ వాడే యెస్ మార్కు , టీ మార్కు లాంటి ఇంగ్లీషు అక్షరాలలో ఉండే కోడంకెలు కూడా నేర్చుకుని, దాచుకున్న డబ్బులు పదిహేనువేలు పెట్టుబడి తో మా ఊళ్ళో అందరూ ఏ ముఖ్యమయిన పని మీద వెళ్ళినా ఎదురు రమ్మని పిలిచే వెంకట లక్ష్మిని ఎదురు రమ్మని, "నోట్లో నాలిక ఉండాలి గానీ ఎన్ని దేశాలయినా తిరగొచ్చు ఏదయినా సాధించుకు రావచ్చు." అని చిన్నప్పుడు వాళ్ళ నాయనమ్మ చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి సత్తిగాడు ఓం ప్రదం గా వ్యాపారం మొదలెట్టాడు.

               మొదటి రోజు పరిమెళ్ళ రామాలయం దగ్గర కాసేపూ, పిప్పర పంచాయితీ ఆఫీసు అరుగు మీద కాసేపు మూట విప్పి కూర్చున్నాడు. జనాల దగ్గర బాగా డబ్బులుండే కోతల రోజులూ ఇంకా మొదలవ లేదు. అంతగా బేరాలేమీ లేవు. పంచాయితీ ఆఫీసు అరుగు మీదే తెచ్చుకున్న కేరేజీ తినేసి, చుట్టుపక్కల ఊళ్ళల్లో అర్ధవరంలోనే ఒక మాదిరి డబ్బులున్న వాళ్ళు ఎక్కువ ఉంటారనిపించి అక్కడికీ వెళ్ళాడు. ఆ ఊళ్ళో పాత ప్రెసిడెంటు గారి భార్యకి రెండు జాకెట్టు ముక్కలు, కోమటి సోమయ్య గారికి ఒక పంచె మాత్రం అమ్మ గలిగాడు. సాయంత్రం అయ్యేసరికి వచ్చిన ముప్పై రూపాయల లాభంలోనూ మధ్యలో రెండుసార్లు టీకి ఐదు రూపాయలు పోనూ పాతిక రూపాయల లాభం కనిపించింది. అదే కూలి పనికి వెళ్ళుంటే ఈ పాటికి యాభై రూపాయలు సంపాదించేసేవాడు. మొదటి రోజు కాబట్టి ఫరవాలేదు గానీ రెక్కాడితే గాని డొక్కాడని తనలాంటి వాళ్ళకి వ్యాపారం ఎక్కువ రోజులు ఇలాగే ఉంటే కష్టమే అని ఆలోచించుకుంటూ చీకటిపడే వేళకి ఇల్లు చేరుకున్నాడు.

               తర్వాత రోజు వాకపల్లి, ముగ్గుళ్ళ తిరిగాడు, మరో రోజు సరిపల్లి, అడవికొల్లు, నిడమర్రు చుట్టేశాడు. ఇలా ఒక ఇరవై రోజులు పెద్దగా బేరాలెమీ లేక పోయినా చుట్టు పక్కల ఊళ్ళన్నీ తిరిగాడు. ఈలోగా కోతలు మొదలయ్యాయి కూలీ నాలీ చేసుకునే జనం చేతుల్లో నాలుగు డబ్బులు ఆడుతున్నాయి. సంక్రాంతి పండగ కూడా దగ్గరలోనే ఉంది. ఒక సారి నారాయణపురం శివాలయం నంది బొమ్మ పక్కన మూట దించి కూర్చున్నాడు. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వచ్చి "మా పాపకి వంగ పండు రంగు పరికిణీ ఒకటి చూపించండి సావుకారు గారూ", "ఈ గచ్చ కాయ రంగు జాకెట్టు ముక్క ఎంతండీ", "ఈ గళ్ళ చొక్కా మీటరు ఎంత పడద్దండీ" అని బేరాలు మొదలెట్టారు. సత్తిగాడు మోకాళ్ళ మీద కూర్చుని ఒక్కోటీ చూపిస్తూ "జాకెట్టు ముక్క ఇరవై రూపాయలు, పరికిణీ యాభై, చొక్కా ముక్క మీటరు పాతిక పడద్ది" అని అన్నింటికీ టకా టకా అని రేట్లు చెప్పాక, వచ్చిన వాళ్ళు చెప్పినదానికి సగానికి అడగటం మొదలెట్టారు. సత్తిగాడు మాత్రం ఒక పైసా కూడా తగ్గే ప్రసక్తి లేదని ఖరాఖండీగా చెప్పేసి ఇష్టమయితే తీసుకో లేకపోతే లేదు అన్నట్టు ఒక నవ్వు మొహం పెట్టాడు. ఇంతలోనె సత్తిగాడికి పరిచయం ఉన్న ఇంకో బట్టల మూట వ్యాపారం చేసే సూర్రావు అదే శివాయలయం ఎదురుగా రావి చెట్టు అరుగు మీద మూట విప్పి సత్తి గాడితో బేరాలు తెగక వాదించుకుంటున్న వాళ్ళందరినీ "మీరు అడిగిన రేటుకే అవన్నీ నేను ఇస్తాను ఇలా రండి" అని పిలిచాడు. సూర్రావు గారు తక్కువకే ఇస్తున్నారని తెలిసి, ఉన్న వాళ్ళతో పాటు ఇంకో పది మంది పోగయ్యి "ఆ దుప్పటి ఎంత", "ఈ చీర ఎంత పడింది", "ఈ తుండు గుడ్డలు నాలుగు తీసుకుంటాం ఏమయినా తగ్గిస్తారా" అని అడిగే సరికి సూర్రావు "ఈ చీర అప్పట్లో శ్రీదేవి దగ్గర నుంచీ ఇప్పుడు సౌందర్య దాకా అందరు హీరోయిన్లూ కట్టిన రకం. పండగెళ్ళాక మళ్ళీ మీరు కావాలన్నా దొరకదు. అసలు ఐదొందలు మూడొందలకిస్తా పట్టుకెళ్ళు", "ఈ గళ్ళ చొక్కా చాలా మన్నికయింది. ఎండకి ఎండి వానకి తడిసినా చెక్కు చెదరదు. నేను గ్యారంటీ, మీటరు యాభై పడద్ది నలభై కే ఇస్తాను తీసుకో, ఈ తుండు గుడ్డలు చూడు ఎంత మెత్తగా ఉన్నాయో తలపాగా చుట్టుకుని ఆపకుండా పాతిక గంపలు మట్టి మోసినా నొప్పి తెలీదు. ఒక్కోటీ పాతిక రూపాయలు. రేటు గురించి చూసుకోకుండా కళ్ళు మూసుకుని పట్టుకెళ్ళచ్చు" అని బాగా మాటలు చెప్పి జోరుగా అమ్మకం చేసి సత్తిగాడి కళ్ళ ముందే నాలుగొందల రూపాయల లాభం సంపాదించాడు. అందరూ వెళ్ళి పొయాక సత్తిగాడి దగ్గరకొచ్చి "ఒరేయ్ సత్తీ నీకు నోట్లో నాలుక ఉంది గానీ ఈ వ్యాపారంలో దాన్ని ఎలా ఉపయోగించాలో బొత్తిగా తెలీదు. నీలాగా ఏదో ఒక రేటు చెప్పి దానిమీదే కూర్చుంటే మనోళ్ళు ఎవరూ కొనరు. నేను చూడు ముందు రెండు మూడు శాల్తీలు తగ్గించినట్టు తగ్గించి అమ్మి, తర్వాత డబలు రేట్లు చెప్పి కొంచెం తగ్గించి చెపితే ముందు వాటి లాగానే ఇవి కూడా తక్కువకే వస్తున్నాయనుకుని ఈ రోజు పోతే మళ్ళీ ఇంత తక్కువకి దొరకవని జనాలు ఎర్రెత్తినట్టు కొనేసి డబ్బులన్నీ దులిపేసి వెళ్ళిపోయారు. ఇదే మరి కిటుకు. మంచోడివి కాబట్టి చెపుతున్నాను. ఎన్ని డబ్బులు చేసుకున్నా ఈ పండగల సీజనులోనే రేపు ఎల్లుండ కొత్తపల్లి, వల్లూరు సైడు నువ్వు చూసుకో అటేపు కవరు చేసే అంత తీరిక నాకు లేదు" అన్నాడు. ఆ క్షణం సత్తిగాడికి సూర్రావు దేవుళ్ళాగా కనిపించాడు. వ్యాపారంలో కొత్త రహస్యాలేవో తనకి తెలిసిపోయినట్టు అనిపించింది.

               సూర్రావు చెప్పినట్టే ఆ మరునాడు సత్తిగాడు మధ్యాన్నం దాకా కొత్తపల్లి తిరిగి ఎవరూ పిలవక పోయేసరికి వల్లూరొచ్చి ఊరి మధ్యన చెరువు గట్టు దగ్గర చింత చెట్టు కింద మూట దించాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన ఒకావిడ తన ఆరేడేళ్ళ వయసున్న చిన్న పిల్లాడిని చూపించి "సావుకారు గారూ, మా బుడ్డోడికి ఒక చొక్కా ముక్క చింపండి. ఉన్న చొక్కాలన్నీ సిరిగిపోయి మరీ నీసుకుంగా ఉందండీ" అని బేరం మొదలెట్టింది. సత్తిగాడు మూటలో కింద నుంచి నాలుగు రకాల ముక్కల్లాగి "ఈ చొక్కా ముక్క చూశావా ముట్టుకుంటే పట్టులాగా ఉంది పైగా ఎలా పాడేసినా పదేళ్ళయినా చెరుపుండదు. మీ వాడిది ఎదిగే వయసు కాబట్టి ఒక పావు మీటరు ఎక్కువే తీసుకో ముందు ముందు కురచవకుండా ఉంటాది". అన్నాడు ఉత్సాహంగా సూర్రావు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ. సత్తిగాడి మొహం మామూలుగానే అమాయకంగా ఉంటుంది అంతకు మించి అతడి నోటినుంచి ఏమొచ్చినా అది నిజమే అన్నంత నిర్మలం గా ఉంటాయి సత్తిగాడి కళ్ళు. అందుకే వాడి మాటలకి ఆ ఆడ మనిషి ఆనందంగా డబ్బులిచ్చి చొక్కా ముక్క తీసుకుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మూట దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ సరదాగా వేళాకోళాలాడుకుంటూ కొనుక్కెళుతున్నారు.

               సాయంత్రానికి, "కూర్చున్న చోటు నుంఛి కదలకుండానే ఎంత కాదనుకున్నా మూడొందల లాభం" అని మనసులోనే అనుకుంటూ మూట సర్దుకుంటున్నాడు. అప్పటివరకూ ఎవరినీ పెద్దగా పరీక్షగా చూడని సత్తిగాడు ఇంక వెళ్ళిపోయే ముందు ఒక్కొక్కళ్ళ వంకా తీరిగ్గా చూడటం మొదలెట్టాడు. ముందు తన దగ్గర చొక్కా ముక్క కొన్న ఆడ మనిషి అచ్చం తన చిన్నప్పుడు వాళ్ళమ్మ లాగా కనిపించింది. వాళ్ళమ్మ కూడా ఇలాగే ఒక్కో రూపాయీ పోగు చేసి పెద్ద పండక్కి తప్పకుండా కొత్త బట్టలు కొనేది. నిజానికి ఆవిడకి అమ్మిన చొక్కా చాలా నాసిరకంది ఆ పిల్లాడి ఒంటి మీద గట్టిగా రెండు మూడేళ్ళుంటే గొప్ప విషయమే. సైకిలెక్కి ఆలోచించుకుంటూ ఇంటికెళ్తున్నాడు. ఒక పెద్దాయనకి అమ్మిన పంచె, ఎదిగిన కొడుక్కి మొదటి సారి ప్యాంటు కొన్న తండ్రి, మరొకళ్ళకి చీర, ఇంకొకళ్ళకి మరోటి ఇలా అన్నీ అందరినీ మాటలతో నమ్మించి అంటగట్టినవే. మామూలుగా అయితే తను జీవితం మొత్తం ఆడే అబధ్ధాలు ఈ నాలుగ్గంటల్లోనే మాట్లాడేసినట్టు అనిపించింది. పొద్దున్నే చలిలో పనిలోకెళ్ళి మధ్యాన్నం ఎండకి ,సాయంత్రం వానకి ఓర్చుకుని వంచిన నడుము ఎత్తకుండా కష్టపడితే వచ్చే యాభై రూపాయల కూలికి ఆరు రెట్లు ఈ ఒక్క రోజు నీడ పట్టున కూర్చుని సంపాదించెయ్యటం ఎందుకో సత్తిగాడికి నచ్చలేదు. అసలు ఈ రోజు వచ్చిన డబ్బులు తన కష్టార్జితం లాగానే అనిపించలేదు. ఎవరయినా కత్తి చూపించి డబ్బులు దోచుకెళ్ళిపోతే అది దొంగతనం. పైగా నేరం. కానీ తను వ్యాపారం ముసుగులో అన్యాయంగా జనాల దగ్గర డబ్బు దోచుకున్నాడు. ఇది కూడా నేరం లాగానే కనిపించింది సత్తిగాడికి. వీధి దీపం వెలుగులో ముందు కనిపిస్తున్న బట్టల మూట నీడ తను చేసిన నేరం భూతమై తరుముతున్నట్టుగా అనిపించింది. చేసిన పనికి తన మీద కోపగించుకున్న సైకిలు ఎంత తొక్కినా అతి కష్టం మీద ముందుకి కదులుతుంది. అన్నిటికీ మించి ఇదివరకు సరదాగా పందెం కాసి డబ్బై ఐదు కేజీల వడ్ల బస్తాని ఊళ్ళో రాములవారి గుడి దగ్గరినుంచి వెలగపల్లి రైసు మిల్లు దాకా ఒక్క ఊపు లో మోసుకెళ్ళి పోయిన సత్తిగాడికి తన జేబులో ఉన్న మూడొందలూ, ఒక్కో రూపాయీ కేజీ బరువున్నట్టు నెమ్మది నెమ్మదిగా భారంగా మారిపోతున్నట్టు అనిపించింది. సమయం గడిచేకొద్దీ, ఇంక ఆ బరువు మొయ్యలేకపోతున్నట్టు విలవిల్లాడిపోయిన సత్తిగాడు, సరిగ్గా ఊరి పొలిమేరల దగ్గర సైకిలు ఆపి జేబులోంచి డబ్బులు తీసి ఉండ చుట్టి పక్కనే ఉన్న కాలవలోకి విసిరేశాడు. కొంచెంసేపు అలాగే నించున్నాక వెన్నెల్లో, వంపు తిరిగి నిండుగా ప్రవహిస్తున్న పెద్ద కాలవ ప్రశాంతంగా కనిపించింది. కాలవని ఆనుకుని కను చూపు మేరలో కనిపిస్తున్న పంట పొలాలు తనని మళ్ళీ పనిలోకి పిలుస్తున్నట్టుగా, ఉన్నట్టుండి చల్ల గాలి పలకరించింది.

               తర్వాత రోజు పొద్దున్నే మూటలో మిగిలిన సరుక్కి ఖరీదు కట్టి తీసుకెళ్ళిపొమ్మని వాళ్ళ బావ మరిదికి కబురు పెట్టాడు. ఊళ్ళో మేస్త్రి దగ్గరికెళ్ళి తనని మళ్ళీ మామూలుగానే పొలం పనులకి పిలవాలని చెప్పేసి వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడయినా ఎవరయినా "వ్యాపారం ఎందుకు మానేశావ"ని అడిగితే మాత్రం నిజం చెపితే అందరూ నవ్వుతారని భయమేసి "ఆ మీటర్లు, సెంటీ మీటర్లు, లెక్కలూ అర్ధం కాక మానేశాన"ని చెప్పేవాడు.అసలు కారణం మాత్రం సత్తిగాడికి తప్ప ఈ రోజుకీ, ఎవరికీ తెలీదు.

Sunday, January 18, 2015

రోజు గడిచింది











వద్దన్నా వచ్చి గుద్దేస్తుంది.

బళ్ళో లెక్కల మాష్టారిలా
నిన్న రాని లెక్కనే
మళ్ళీ చేసుకురమ్మని
అదే పాత క్లాసు రూము బయటికి, గెంటేస్తుంది.

కుక్క మెడలో కట్టిన ఎముక లాగా
ఎంత గింజుకున్నా
జానెడు పొట్టని మించి ఇంచి కూడా కదలదు.

నిన్నటికీ నేటికీ మధ్య పెద్ద తేడా
వయసు ఒక రోజు పెరిగింది.

ఇంకా ఉన్నందుకు, ప్రతి రోజూ పావు కేజీ
అవమాన భారాన్ని నెత్తి మీద పెడుతూ
నెమ్మది నెమ్మదిగా కుంగదీస్తున్నట్టు
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.

ఇదంతా అనవసరమని తెలిసినా
అలవాటయిన రూటు మ్యాపునే
జిరాక్సు తీసి చేతిలో పెట్టి
'ఇంకొంచెం ముందుకెళ్ళు' అంటుంది.
రోజు గడిచిపోయింది.


'కినిగె పత్రిక' లో ప్రచురణ :http://patrika.kinige.com/?p=4802