Wednesday, July 1, 2015

మొదటి పాఠం

              శనివారం పూట పొద్దున్నే రేడియోలో వచ్చే వెంకటేశ్వరస్వామి సుప్రభాతం ఇంకా మొదలవలేదు. మామూలుగా అయితే "పొద్దున్న మూడింటికయినా లేవనివాడు మనిషే కాదు" అని మా ఊళ్ళో ఆరు అయితే గానీ నిద్ర లేవని బధ్ధకస్తులందరికీ చెప్పే మా నారాయుడి తాత లెక్క ప్రకారం అయితే అప్పటికే బాగా తెల్లారిపోయినట్టు. కానీ ఆరో తరగతి చదివే చంటిగాడు మాత్రం ఇంకా మంచం మీద పడుకునే ఉన్నాడు. చంటిగాడి వాళ్ళ అమ్మ అప్పటికి మూడుగంటల ముందే లేచి వాడి చెల్లెలికి పాలు పట్టి మళ్ళీ పడుకోబెట్టి ఇల్లూ వాకిలీ తుడిచేసి, కోళ్ళ గూట్లో ఉన్న కోళ్ళని బయటికి వదిలేసి వాటికి గుప్పెడు వడ్ల గింజలేసి, గేదెల పాక దగ్గర కూడా శుభ్రంగా పేడ తీసి తుడిచేసి, నిన్న మధ్యలో వదిలేసిన పిడకలు కొట్టే పని కూడా పూర్తి చేసేసి పొయ్యి మీద నీళ్ళు పెట్టి చంటిపాపకి స్నానం చేయించి పక్కన కూర్చోబెట్టుకుని వంట పని కూడా మొదలెట్టి, పొయ్యి దగ్గరనుంచే "ఒరేయ్ చంటీ పడుకున్నది చాలు గానీ ఇంక లేవరా, మళ్ళీ మీ నాన్న గానీ వచ్చి కర్ర పట్టుకున్నాడంటే పడక మంచం మీద నుంచే పరగు పందెం మొదలెడతావు." అని చంటిగాడిని నిద్ర లేపటానికి తన వంతు ప్రయత్నం మొదలెట్టింది. చంటిగాడికి నాన్నంటే భయమే గానీ వాళ్ళ అమ్మ మాట మాత్రం అంతగా లెక్క చేసే అలవాటు లేదు. దానికి తోడు ఎక్కువగా నులక మంచం మీదే ఉండే వాళ్ళ ముసలి నాయనమ్మ సపోర్టు కూడా ఎప్పుడూ వాడికే, అందుకే మెలకువ వచ్చినా గానీ బధ్ధకం తీరక వాళ్ళ నాన్న వస్తే ఏమన్నా అంటాడేమో అని భయపడుతూ భయపడుతూనే ఇంకా అలాగే పడుకునే ఉన్నాడు.

               ఇంతలో అప్పుడే వచ్చిన చంటిగాడి వాళ్ళ నాన్న హడావుడిగా సైకిలు స్టాండు వేసి, "పొద్దున్నే ఎవడి మొహం చూశానో గానీ గేదెలకి గడ్డి కోసుకుని మోపు సైకిలు మీద పెట్టుకుని వస్తుంటే సరిగ్గా పుంత గట్టు మీదకి వచ్చేసరికి వెనకాల టైరు ప్యాచ్చీ పడింది. గడ్డి మోపు నెత్తిమీద పెట్టుకుని సైకిలు నడిపించుకుంటూ వచ్చేసరికి ఆలస్యమయిపోయింది. చంటిగాడు లేవగానే వాడి చేతికి ఒక అయిదు రూపాయలిచ్చి సైకిలు కొట్టు సూరయ్య దగ్గరికెళ్ళి ప్యాచ్చీ వేయించుకు రమ్మను, అన్నట్టు నిన్న రాత్రి నీ చేతికిచ్చిన సంచిలో అడుగున కోటయ్యగారి కొట్లో కొన్న తాటి బెల్లం ఉంది చూశావా.? చంటిగాడు ఎప్పట్నుంచో అడుగుతునాడన్నావు కదా" అని గబ గబా టీ తాగేసి "నేను మన పై పొలం పాతిక సెంట్లుకీ కలుపు తీసి, కింద ఎకరంనర కౌలు పొలానికి యూరియా జల్లి, వచ్చి అన్నం తిని గేదుల్ని కాలవకి తోలుకెళ్ళి నీళ్ళు తాగించి కట్టేసి, సీతారామరాజు గారి చేపల చెరువు పట్టుబడి పనికి వెళ్ళి పోతాను. నేను వచ్చేసరికి ఆలస్యమయితే పాలు నువ్వే తీసెయ్, వంట అయ్యాక, దిబ్బ మీద కూరగాయల మొక్కలకి నీళ్ళు పొయ్యి. నాలుగు రోజుల నుంచీ వాటి మొహం చూడక ఎండి చచ్చిపోయేలా ఉన్నాయ్" అని చెప్పేసి మళ్ళీ హడావుడిగానే వెళ్ళి పోయాడు.

               అప్పుడు నిద్ర లేచిన చంటిగాడు మొహం కడుక్కున్నాక, వాడికి చద్దన్నం పెట్టి నంజుకోవటానికి తాటి బెల్లం ముక్క ఇచ్చిన వాళ్ళమ్మ "మీ నాన్న సైకిలు ప్యాచ్చీ పడిందంట, తిన్నాక నీ పుస్తకాల సంచి దగ్గర పెట్టిన అయిదు రూపాయలూ తీసుకుని సూరయ్య సైకిలు కొట్లో ప్యాచ్చీ వేయించుకొచ్చి స్నానం చేసి బళ్ళోకెళ్ళిపో, చెల్లిని నాయనమ్మ దగ్గర వదిలేసి గేదెలకి కుడితి పెట్టి నేను దిబ్బ మీద మొక్కల పని చూసి రావాలి" అని చెప్పి మళ్ళీ పొయ్యి దగ్గరికెళ్ళిపోయింది.

               సైకిలు ప్యాచ్చీ పని అయ్యాక అప్పుడప్పుడే సైకిలు నేర్చుకుంటున్న చంటిగాడు వచ్చేటప్పుడు మాత్రం చాలా సరదాగా కడ్డీ తొక్కుకుంటూ ఇంటికొచ్చేసి స్నానం చేసి సరిగ్గా ప్రార్ధన మొదలయ్యే సమయానికల్లా బళ్ళోకెళ్ళిపోయాడు. మామూలుగా అయితే రోజూ పొద్దున్నే లెక్కల క్లాసు ఉంటుంది గానీ ఆ రోజు మాత్రం లెక్కల మాస్టారు భీమేశ్వర్రావు గారు శెలవు పెట్టారని తెలుగు మాస్టారు ఉమా మహేశ్వర్రావుగారొచ్చారు. ముందు కొంచెం సేపు నిన్న మొదలెట్టిన వేమన శతకం పాఠం లో మిగిలిపోయిన పద్యాలు కూడా అవగొట్టేసి ఇంకా టైముందని క్లాసులో ఒక్కొక్కరి చేతా, వాళ్ళకి తెలిసిన నీతి వాక్యాలు చెప్పమని బోర్డు మీద రాసి మళ్ళీ ఆ నీతి వాక్యం గురించి వివరించటం మొదలెట్టారు. బండ కిట్టిగాడు "ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెపితే కుమ్మరోళ్ళ తాతారావు గాడు "సత్యమునే పలకవలెను" అన్నాడు. రమేషు గాడు "పెద్దలను గౌరవించవలెను" అంటే, చంటిగాడి వంతు వచ్చేసరికి ఇదివరకు కాపీ పుస్తకంలో రాసిన "మానవ సేవే మాధవ సేవ" అన్న మాట గుర్తొచ్చి అదే చెప్పాడు. ఉమా మహేశ్వర్రావు గారు ఒక్కో మంచి మాట గురించీ వివరంగా చెపుతూ ఇవన్నీ ఆచరించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళవుతారనీ మంచి పేరు తెచ్చుకుని జీవితంలో అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారనీ చెప్పేసరికి చంటి గాడు కూడా నిజంగానే ఇవన్నీ ఆచరించి గొప్పవాడిగా ఎదగాలని ఆ క్షణమే నిర్ణయించేసుకున్నాడు. అప్పుడప్పుడూ వాళ్ళ నాయనమ్మ చెప్పే నీతి కధలు చాలా ఇష్టంగా వినే చంటిగాడు కిందటి నెల ఒక ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్ లో అవార్డు సినిమాల కింద శ్రీరాములు తాత వాళ్ళ టీవీ లో వచ్చిన రుద్రవీణ సినిమాలో చిరంజీవిని చూసినప్పుడు కూడా ఇలాగే అనుకున్నాడు. దానికి తోడు మొన్న చిన్న శీనుగాడికి దెబ్బ తగిలినప్పుడు, ఇంట్లో దెబ్బలకి వాడే ఆయింటుమెంటు కొంచెం తాటాకు ముక్క మీద పెట్టి పట్టుకెళ్ళి వాడికిస్తే అది రాసుకున్న చిన్న శీనుగాడు మూడో రోజు "నువ్వు ఇచ్చిన ఆయింటుమెంటుకి నా దెబ్బ నొప్పి తెలీకుండా దెబ్బకి తగ్గిపోయింద"న్నప్పుడు కూడా చంటిగాడికి చాలా బాగా అనిపించింది. అందుకే జీవితం లో ఎప్పుడూ మాస్టారు చెప్పినట్టే నడుచుకోవాలని గట్టిగానే నిర్ణయించేసుకున్నాడు.

               సాయంత్రం చంటిగాడు బళ్ళోంచి వచ్చీ రాగానే అంతకు ముందే చేపల పట్టుబడి పనిలోకెళ్ళొచ్చిన వాళ్ళ నాన్న "సైకిలెక్కరా గణపవరం సంతకెళదాం" అన్నాడు. సంతకెళుతున్నామన్న ఆనందం తో పుస్తకాల సంచి ఇంట్లో పెట్టేసి వచ్చి సైకిలెక్కేశాక చంటిగాడి వాళ్ళమ్మ ఏమేం సరుకులు కావాలో చీటీ రాసి వాళ్ళ నాన్న చేతికిచ్చి, పెద్దావిడ మందులు కూడా అయిపోయాయని గుర్తు చేసి, "వచ్చేటప్పుడు మసీదు దగ్గర తాయత్తు తీసుకురా చంటిదానికి కట్టాలి. ఈ మధ్యన అర్ధ రాత్రి ఉలిక్కి పడి లేచి నిద్ర పోకుండా ఊరికే ఏడుస్తుంద"ని మర్చిపోవద్దని మరీ మరీ చెప్పి పంపించింది.

               సంతలో అన్నీ కొనేశాక చంటిగాడి వాళ్ళ నాన్న "ఇంకా టీ పొడి ఒకటి తీసుకోవాలి, నువ్వు నడుచుకుంటూ వెళ్ళి వంతెన కింద మన ఖాతా ఉన్న కొమ్మర రాజు కొట్లో అర కేజీ టీపొడి తీసుకుని మళ్ళీ ఇక్కడికే వచ్చెయ్. ఈ లోపు నేను మసీదుకెళ్ళి సాయీబెవరయినా ఉంటే తాయెత్తు తీసుకొస్తా" నని చెప్పి వెళ్ళిపోయాడు. చంటిగాడు టీ పొడి తీసుకుని వచ్చేటప్పుడు, ముందు పెద్ద పెద్ద సంచుల్లో సరుకులూ, వెనకాల బియ్యం బస్తా వేసుకుని వస్తున్న ఒక ముసలాయన సైకిలు, బరువుకి ఆగలేక తిరగబడిపోయి సంచుల్లో ఉన్న పొట్లాలన్నీ రోడ్డు మీద చెల్లా చెదురుగా పడిపోతే, ఆయన చంటిగాడిని పిలిచి "ఒరేయ్ మనవడా ఈ సరుకులన్నీ సంచుల్లోకెత్తి వంతెన ఎక్కే వరకూ సైకిలు తోసి పెట్టరా" అని అడిగాడు. చంటిగాడు అన్నీ జాగ్రత్తగా సంచుల్లోకెత్తి వెనకాల క్యారేజీ మీద బియ్యం మూటని మళ్ళీ గట్టిగా కట్టి ఆ ముసలాయన నెమ్మదిగా సైకిలు నడిపిస్తుంటే వంతెన ఎక్కేవరకూ సైకిలుని వెనక నుంచి తోసుకుంటూ వెళ్ళి వంతెన ఎక్కాక మళ్ళీ పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న "టీ పొడి తేవటానికి ఇంత సేపు ఎందుకురా?" అని అడిగితే, తను చేసిన మంచి పనిని వాళ్ళ నాన్న మెచ్చుకుంటాడని ముందే ఊహించుకున్న చంటిగాడు "వంతెన అవతల సరుకులు పాడేసుకున్న ఒకాయనకి సాయం చేశాన"ని ఆనందంగా చెప్పాడు. ఆ మాట విన్న వాళ్ళ నాన్న సెంటర్లో అంత మంది జనం చూస్తుండగా విసురుగా చెయ్యి పైకెత్తి లాగి చంటి గాడి చెంప మీద చెళ్ళుమని ఒకటిచ్చి "పొద్దున్న లేచిన దగ్గరనుంచీ మీ అమ్మకీ నాకూ ఒకటికీ, రెండుకీ వెళ్ళటానికి కూడా తీరిక లేనన్ని పనులు ఉంటే నువ్వు తాయితీగా వాడికీ వీడికీ ఉపకారం చేస్తూ కూర్చుని ఆలస్యం చేస్తావా? మా నాన్న తిడతాడని చెప్పి తప్పించుకుని రావటం తెలీదా? ఇంకా నేను అర్ధవరం పాత ప్రెసిడెంటు గారి ఇంటికి పాలు పొయ్యటానికెళ్ళాలి. అసలే వాళ్ళది చంటిపిల్లలు ఉన్న ఇల్లు. ఆలస్యమయ్యిందంటే రేపట్నుంచీ మన వతను వద్దంటే అంత మంచి ఖాతా మళ్ళీ మనకి దొరుకుతుందా? నువ్వేమయినా తిల్లపూడి పిల్ల జమిందారుననుకుంటున్నావా? ఉన్నంతలోనే మనకున్న పావు ఎకరం ముక్కా చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకుని ఎంత కష్టపడితే మన కుటుంబం నడుస్తుందో తెలుసా?" అని కోపంతో ఊగిపోతూ "చేసిన నిర్వాకం చాలు గానీ ఇంక నడు" అని వస్తున్న ఏడుపుని బలవంతంగా ఆపుకుని బిక్కమొహం వేసుకున్న చంటి గాడిని ఎత్తి కుదేసి సైకిలు మీద కూర్చోబెట్టి గబగబా సైకిలు తొక్కుకుంటూ ఇంటివైపు దారి తీశాడు.

               ఇంటికెళ్ళాక, ఇంత లావు వేళ్ళ గుర్తులు పడి ఎర్రగా కందిపోయిన చంటిగాడి బుగ్గ మీద వాళ్ళమ్మ కొబ్బరి నూనె రాసి అన్నం పెట్టి ఇంక పడుకోమంది. కానీ రోజూ రాత్రి పడుకోబోయే ముందు, ఆ రోజు బళ్ళో చెప్పిన పాఠాలు మళ్ళీ ఇంకోసారి చదువుకునే అలవాటున్న చంటిగాడికి పుస్తకాలు తీసి ముందేసుకుని కూర్చున్నాక, అంతకు ముందు కాపీ పుస్తకం లో పది సార్లు అందంగా గుండ్రంగా తాను రాసిన "మానవ సేవే మాధవ సేవ" అన్న వాక్యం చూసి తన్నుకొచ్చిన దుఃఖంతో కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగి, బడి పాఠాలకీ, జీవితానికీ మధ్యన అడ్డం గా ఉన్న సన్నని గీత అస్పష్టంగా కనిపించింది. అదీ గాక మొట్టమొదటి సారిగా బడి పాఠాలకి మించిన జీవితపు పాఠమేదో బోధపడుతున్నట్టు కూడా అనిపించింది.

4 comments:

  1. ఎప్పటిలానే ఈ కథ కుడా బాగుంది. మీ సమయం వెచించి ఇలాంటి మంచి కథలు మాకు అందిస్తున్నందుకు మీకు ధన్యవదాలు.

    ReplyDelete
  2. super sir meeru .. I really like your posts..

    ReplyDelete