Thursday, November 9, 2017

కుంటి కులాసం ఫిలాసఫీ


                 కుంటి కులాసానిది అసలు మా ఊరే కాదు. ఎక్కడి నుంచి వచ్చాడో గానీ మనిషి మాత్రం చాలా విచిత్రంగా మాట్లాడేవాడు. అతని మాటలు ఎప్పుడూ కొత్తగానే ఉండేవి. అయినా కుంటి కులాసం ఊరికే అలా మాట్లాడటం లేదని, అతని ఆలోచనా విధానమే అలాంటిదని తర్వాత అర్ధమయ్యింది. వాళ్ళ ఊళ్ళో వానలు లేక దాళ్వా పంటకి కాలవలు వదలక పోతే, కొన్నాళ్ళు పని కోసం మా ఊరొచ్చాడు. 'కుంటి కులాసం' అన్న పేరు కూడా అందరూ పిలిచే పేరే గానీ అసలు పేరు మాత్రం అది కాదని చెప్పాడు. మనుషులందరూ ఒకేలాగ ఆలోచించరన్న విషయం నాకు కుంటి కులాసం తో స్నేహం చేశాకే తెలిసింది. మా ఊళ్ళో జనం కూడా "కుంటి కులాసం గాడు తలకి రోకలి చుట్టగలడు." అని చెప్పుకునే వాళ్ళు. పేరుకి తగ్గట్టు అంత కులాసాగా ఏమీ కనిపించేవాడు కాదు గానీ, కళ్ళు మాత్రం ఎప్పుడూ దేన్నో వెతుకుతున్నట్టుగా ఉండేవి. మనిషిని చూడగానే ఏ సంకోచం లేకుండా వీడితో అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అన్నట్టుగా ఉండేవాడు. అతని చుట్టూ ఏదో తెలియని ఆకర్షణ ఉండేది. ఎంత గొప్ప పుణ్యాత్ముడికయినా చేసిన తప్పులు గుర్తుకొస్తాయేమో అన్నంత నిజాయితీ అతని కళ్ళల్లో కనిపించేది. 'కుంటి' అనేది కూడా పేరులోనే తప్ప మామూలుగానే నడిచేవాడు. మా ఊళ్ళో పెద్దిరాజు ని చిన్నప్పుడు పదో తరగతి దాకా క్లాసులో అందరికన్నా బాగా పొట్టిగా కనిపిస్తున్నాడని "పొట్టోడ"ని పిలవటం మొదలెట్టాక, ఆ తర్వాత ఇంటర్లో వాడు తాడి చెట్టంత పొడుగైపోయాడు. కొత్తగా మా ఊరొచ్చిన వాళ్ళకి విచిత్రంగా అనిపించవచ్చుగానీ, ఇప్పటికీ మా ఊళ్ళో వాడిని 'పొట్టోడు' అనే పిలుస్తారు. అచ్చం అలాగే 'కుంటి కులాసా'నికి కూడా ఇప్పుడు తనకి సంబంధం లేని పేరు స్థిరపడి పోయిందేమో అని నా అనుమానం. ఒకసారి మాత్రం జీతానికి సుబ్బరాజు గారి గేదెలని కొమ్మర పొలం తోలుకెళ్ళి మేపుతుండగా అప్పటివరకూ చేలో పిల్లిమిసర మేస్తున్న ఎర్ర గేది ఉన్నట్టుండి పోలీసోళ్ళ ఆకుమడి వైపు పరుగెత్తటం మొదలెట్టింది. అప్పుడు దాన్ని ఆపటానికి పరుగెట్టినప్పుడు మాత్రం, అడ్డదిడ్డంగా కుంటుకుంటూ పాము పాకినట్టు మెలికలు తిరుగుతూ పరుగెట్టాడు.

                  ఏదో పొట్ట కూటికోసం మా ఊరొచ్చాడు గానీ, కుంటి కులాసానికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం. ఎప్పుడయినా సంతకెళ్ళినప్పుడు గణపవరం బస్టాండు దగ్గర నించున్నప్పుడు వాళ్ళ ఊరి వైపు వెళ్ళే బస్సు కనిపిస్తే "ఈ బస్సు మా ఊరి వైపే వెళ్తుంది." అనేవాడు. ఒకసారి పుంత గట్టు మీద రేగు చెట్టు పైన వాలిన పిట్టల్ని చూపించి, "అచ్చం ఇలాంటి పిట్టలే మా ఇంటి దగ్గర సీమ చింత చెట్టు మీద కో కొల్లలు గా ఉండేవి. ఈ పిట్టలని చూస్తూ ఆడుకోవటం మా మార్క్స్ గాడికి చాలా ఇష్టం." అన్నాడు. కుంటి కులాసానికి ఒక కొడుకు ఉన్నాడని. వాడి పేరు మార్క్స్ అనీ, ఒక రోజు వాడి పుట్టిన రోజుకి వాళ్ళ అమ్మ "నీకు వీడి వయసు ఉన్నప్పుడు ఒక పసుపు చారల చొక్క ఉండేది. అది వేసుకుంటే నువ్వు చాలా ముద్దుగా ఉండేవాడివి. వీడికీ అలాంటి చొక్కానే తియ్యి" అంటే, వాళ్ళావిడ కొనమన్న ఎర్ర గళ్ళ చొక్కా కాకుండా వాళ్ళమ్మ చెప్పిన పసుపు చారల చొక్కా కొన్నాడని, వాళ్ళావిడకి కోపమొచ్చి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింద"ని చెప్పాడు. "చిన్న చిన్న విషయాలకి కూడా మనుషులు ఎందుకు ద్వేషం పెంచుకుంటారో తెలుసా ? చాలా సార్లు పైకి కనిపించే ఆ చిన్న చిన్న కారణాలు, అసలయిన కారణాలతో వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ రహస్యంగానే ఉండి పోతాయి." అని కూడా చెప్పాడు.

                  పెద్దగా ఏమీ చదువుకోలేదని చెపుతాడు గానీ, కుంటి కులాసం దగ్గర ప్రతిదానికీ కారణం వెతకటానికి ప్రయత్నిచటం అనే ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. మాట్లాడే ప్రతి మాటా ఏదో సిధ్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్టు ఉండేది. ఒక సారి మేమందరం పొలం లో ఆకు తీత పనిలో ఉండగా ఉన్నట్టుండి హొరున వర్షం, వణికించే చలి మొదలయ్యాయి. అందరం పోలీసోళ్ళ చెరువుగట్టు పైకి చేరుకుని చింత చెట్టు కింద వట్టి గడ్డి మంట వేసుకుని చలి కాసుకుంటుంటే చచ్చి పోయిన కొబ్బరి చెట్టు కమ్మలు కొట్టుకెళ్ళటానికొచ్చిన చాకలి తిప్పడు కూడా మంట దగ్గరికొచ్చి కూర్చుంటూ "శని గాడి వాన దరిద్రం లా పట్టుకుందిరా" అని వర్షాన్ని తిట్టుకుంటున్నాడు. అది విన్న నారాయుడు తాత "ఈ వానలు ఉంటేనే మనకి పంటలు పండేది,తిండి దొరికేది." అని మందలించాడు. తిప్పడు మాత్రం "ఏమో తాతా, పొద్దున్నే ఇంత చద్దన్నం తిని మట మట మని మండి పోయే ఎంత ఎండ లోనయిన పని చెయ్యొచ్చు గానీ, చిట పట మని నాలుగు చినుకులు పడితే మాత్రం మహా చిరాకు నాకు." అన్నాడు. "మీ తాత కూడా ఇలాగే వానకి పడి ఏడిసే వాడు. నీకు అన్నీ మీ తాత బుధ్ధులే వచ్చాయి." అన్నాడు నారాయుడు తాత. కుంటి కులాసం దృష్టిలో చాకలి తిప్పడు వర్షాన్ని తిట్టుకోవటం వెనక కారణం లేకపోలేదు. వాళ్ళ వృత్తి లో ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతికి ఆరేశాక ఎండ లేక బట్టలు ఆరక పోతే, అది వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళ జీవితాలు వర్షం తో కన్నా ఎండతో ఎక్కువ పెన వేసుకుని ఉన్నాయి. అందుకే ఎండని ఇష్టపడటం, వర్షాన్ని వ్యతిరేకించటం అనేది తెలియకుండానే చాకలి తిప్పడి నరాల్లో జీర్ణించుకుపోయింది. ఇదేమీ ఇప్పటికిప్పుడు కనిపెట్టిన కొత్త విషయం కాకపోవచ్చు గానీ, ఇంత చిన్న విషయాన్ని కూడా కుంటి కులాసం ప్రపంచం మొత్తానికి అన్వయించి చూసేవాడు. "ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది. ఒకరికి మేలు చేసేది మరొకరికి కీడు చేస్తుంది. మనుషుల మధ్య, దేశాల మధ్య ఘర్షణ కి ఈ వైరుధ్యమే మొదటి కారణం." అన్నాడు. అంతే కాకుండా "గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవటానికి పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కరలేదు. నీ చుట్టూ ఉన్న మనుషులని, పరిస్థితులని లోతుగా అర్ధం చేసుకుంటే మొత్తం ప్రపంచమే అర్ధమవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో జరిగేదే మన ఊళ్ళోనూ జరుగుతుంది. మన ఊళ్ళో జరిగేదే మన రాష్ట్రం లో జరుగుతుంది. రాష్ట్రంలో జరిగేదే దేశం లో జరుగుతుంది. దేశం లో జరిగేదే ప్రపంచం మొత్తం జరుగుతుంది" అని చెప్పేవాడు.

                  కుంటి కులాసంతో పాటు ఎప్పుడూ ఒక కుక్క కూడా ఉండేది. నిజానికి ఆ కుక్క అతను మా ఊరు రావటానికి ముందు కొన్ని రోజులు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు అతనికి అలవాటయ్యింది. ఆ కుక్కకి ఒక కన్ను గుడ్డితో పాటు ఎప్పుడూ అనారోగ్యంతోనే ఉండేది. దాని ముందు కోమటి కొట్లో కొన్న రొట్టె ముక్కో, జంతిక ముక్కో వేస్తే విచిత్రం గా అది ఆ రొట్టె ముక్క కి వ్యతిరేక దిశలో వాసన చూసుకుంటూ వెళ్ళి చాలా సేపటికి గానీ ఆ రొట్టె ముక్క ని కనిపెట్టలేకపోయేది. "ఈ గుడ్డి కుక్కని ఇంకా నీతో ఉంచుకునే బదులు తరిమెయ్యొచ్చు కదా?" అన్నాను ఒకసారి. "ఈ కుక్క చాలా విషయాల్లో నాకన్నా గొప్పది." అన్నాడు. కుంటి కులాసం దృష్టిలో మనిషి కన్నా జంతువు గొప్పది. జంతువు కన్నా చెట్టు గొప్పది. "ఈ భూమ్మీద ఇంకా బాగు పడవలసిన అవసరం ఉన్న జీవి ఏదయినా ఉందంటే అది మనిషి మాత్రమే" అనేవాడు. ఒకసారి ఆ కుక్క కొన్ని రోజులపాటు ఎక్కడికో మాయమైపోయి మళ్ళీ తిరిగొచ్చింది. మళ్ళీ కుంటి కులాసాన్ని చూసిన ఆనందం తో తోక ఊపుకుంటూ ఆకలితొ ఉన్నానని చెప్పటానికి గుర్తుగా తల పైకెత్తి చూసింది. కుంటి కులాసం దాని ముందు కొంచెం అన్నం వేశాక, ఆబగా తినటం మొదలెట్టింది. సరిగ్గా అప్పుడే నేను గమనించిన విషయం దాని వెనక కాలు తొడ దగ్గర కండ మొత్తం ఊడిపోయి పాలిపోయిన లోపలి మాంసం విచిత్రమయిన ఆకృతులలో కనిపించటం. అది చూసి నా గుండె దడ దడ లాడింది. అయినా అదేమీ తనకి పట్టనట్టు అసలు ఆ కాలు తనది కానట్టు, ఆ కుక్క ఎప్పటిలాగానే ఉల్లాసంగా ఆనందంగా కనిపించటం నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. ఇదే మాట కుంటి కులాసం తో చెప్పాను. "ఈ కుక్క తనని తాను మర్చిపోయి ఈ ప్రకృతి లో మమేకమయినంతగా నువ్వూ నేనూ ఎప్పటికీ కాలేము. అదెప్పుడూ తనని తాను ఈ ప్రకృతిలో భాగమనే అనుకుంటుంది తప్ప వేరుగా ఊహించుకోదు. దాని ముఖం ఎలా ఉందో కూడా దానికి ఎప్పటికీ తెలీదు. మానవ నాగరికతలో మనిషి అద్దం లో ముఖం చూసుకోవటం మొదలుపెట్టిన రోజే ప్రకృతికి దూరం కావటం మొదలయింది." అన్నాడు.

                  ఒకసారి అబ్బులు గాడి పెళ్ళికి అన్నవరం వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న హోటల్ లో భోంచేస్తున్నాం. "ఇక్కడ భోజనం చాల బాగుంది" అన్నాను నేను. "ఈ వంట చేసిన వంట మనిషి చేతులు చాలా అసహ్యం గా ఉండి ఉండాలి, అందుకే వంట ఇంత బాగుంది." అన్నాడు. నిజంగానే ఆ తర్వాత, వంట చేసిన పెద్దావిడ బయటికొచ్చి, ఎన్నో ఏళ్ళుగా పొయ్యి దగ్గర ఇదే పని చెయ్యటం వల్ల నల్లటి మచ్చలు పడి బొటన వేళ్ళు వంకర పోయి ముడతలు పడ్డ చేతులు ఊపుకుంటూ "రామమ్మ గారి దొడ్లో కరివేపాకు చెట్టు రొబ్బలు నాలుగు విరుచుకు రా రా." అని ఎవరినో పురమాయించటం కనిపించింది. భోజనం అయ్యాక వెళ్ళబోతూ, పక్కనే ఉన్న పేపర్లో "వేసవి తాపానికి ఎండలో బొమ్మలు అమ్ముకునే వ్యక్తి మరణం" అన్న వార్త చదివి, "అయినా తెలిసి తెలిసీ అంత ఎండలో వాడిని బయటికి ఎవడు వెళ్ళమన్నాడు?" అన్నాను కోపంగా. "ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు." అన్నాడు.

                  ఆ రోజు కుంటికులాసం చాల సేపు చాలా విషయాలు మాట్లాడాడు. "ప్రపంచ జనాభాలో, పక్కవాడిని మోసం చేసే మనుషుల సంఖ్య కన్నా తమని తాము మోసం చేసుకునే మనుషుల సంఖ్య చాలా ఎక్కువ" అన్నాడు. అంతే గాక "ఈ వేలం వెర్రి మనుషులు డబ్బు కట్టల మధ్య చిక్కుకున్న చెద పురుగులు." అని కూడా అన్నాడు. ఎక్కువగా "మనుషులు" అన్న మాట కాకుండా దాని ముందు "వేలం వెర్రి" అనే విశేషణాన్ని చేర్చి "వేలం వెర్రి మనుషులు" అనే అనేవాడు. డబ్బు అంటే కుంటి కులాసానికి విపరీతమయిన అయిష్టత ఉండేది. "ఈ డబ్బు యావ లో పడి మనం కొత్తగా ఆలోచించటం మర్చిపోయామ" న్నది అతడి ధృఢమయిన అభిప్రాయం. "డబ్బుకి దానికి ఉన్న అసలు విలువతో పాటు, మరో 'మిధ్యా విలువ ' అనేది కూడా ఉందని కుంటి కులాసం సిధ్ధాంతం. "కావాలంటే చూడు. ముక్కూ మొహం తెలియక పోయినా నీకన్న ఎక్కువ డబ్బున్న వాడిని కలుసుకున్నప్పుడు నీ మొహం తప్పకుండా వెలిగిపోతుంది. డబ్బుకి ఉన్న 'మిధ్యా విలువ ' అంటే ఇదే. ఈ వేలం వెర్రి మనుషుల మీద డబ్బుకి ఉన్న ఆ అసలు విలువకన్నా ఈ మిధ్యా విలువ ప్రభావమే ఎక్కువ. ఇలాంటి మిధ్యా విలువలు ఈ ప్రపంచం లో ఇంకా చాలానే ఉన్నాయి." అన్నాడు. "ఎప్పుడూ ఒకేలా ఆలోచించటం మానేసి, నీకు తెలిసిన విషయాలను శీర్షాసనం కూడా వేయించు తమ్ముడు. ఎందుకంటే నీకు తెలిసిన నిజాన్ని తిరగేస్తే వచ్చేది కూడా మళ్ళీ నిజమే." అని చెప్పేవాడు.

                  ఇంకో నెల రోజులలో కుంటి కులాసం, వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడనగా, ఉన్నట్టుండి అతనితో ఉండే కుక్క, చొంగ కార్చుకుంటూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించటం మొదలు పెట్టింది. ఈ పిచ్చి కుక్క ఊళ్ళో ఉంటే చాలా ప్రమాదమని అందరూ భయపడుతుంటే, కుంటి కులాసం ఊళ్ళో ఉండటం మానేసి కుక్కతో సహా, జనం సారాకి అలవాటు పడి కల్లు తాగటం మానేశాక వ్యాపారం లేక ఊరికే వదిలేసిన ఊరి చివరి కాలవ గట్టు మీద కల్లు కోటమ్మ గారి కల్లు పాకలో ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే ఒక రోజు అదే పాకలో చచ్చిపోయి కనిపించాడు. ఆ కుక్క కూడా మళ్ళీ ఎక్కడికో మాయమైపోయింది. నిజమో కాదో తెలీదు గానీ కుంటి కులాసం చచ్చిపోయిన రెండో రోజు మాత్రం పేపర్లో జిల్లా ఎడిషన్ లో 'పెంచుకుంటున్న పిచ్చి కుక్క కరిచి వ్యక్తి మరణం' అన్న వార్త వచ్చింది. అప్పుడే ఏలూరు నుంచి మా ఊరు చుట్టాల ఇంటికి వచ్చిన కోటేశ్వర్రావు, ప్రెసిడెంటు గారి ఇంటి దగ్గర అరుగు మీద పేపర్లో ఆ వార్త చదివి "అయినా తెలిసి తెలిసీ పిచ్చి కుక్కని ఎవడు పెంచుకోమన్నాడు?" అన్నాడు కోపంగా.

"ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు" అన్నాను వెంటనే.

8 comments:

  1. ఈ మధ్య మంచికథ అనిపించే ఇంత మంచి కథ చదవలేదు నేను. అలాగని కథలే చదవలేదని కాదు. తెలుగులో దాదాపు ప్రతీ కథ చదువుతాను. చదువుతున్నంతసేపూ సమాంతరంగా ఆలోచనలను పోల్చుకునేలా చేసింది మీ కథ. ఒక్క విషయం అర్థం కాలేదు - అందంగా లేని చేతులకి, వంట బాగా ఉండడానికి సంబంధం ఏమిటీ అన్నది

    ReplyDelete
  2. గోపిగారు, భలేవుంది మీ కధ.
    "నీకు తెలిసిన నిజాన్ని తిరగేస్తే వచ్చేది కూడా మళ్ళీ నిజమే"
    "మనిషి అద్దం లో ముఖం చూసుకోవటం మొదలుపెట్టిన రోజే ప్రకృతికి దూరం కావటం మొదలయింది"
    పై రెండు లైన్లూ మరీ మరీ నచ్చాయి. కధ గురించి లలితగారి మాటలే నావి కూడా.
    కుంటికులాసం+పిచ్చికుక్క = వ్యక్తి + చుట్టూ వున్న ప్రపంచం అనిపించింది. నాకేమైనా అర్ధమైన్దంటారా? "ఆ విషయం నీకు నాకు ఎప్పటికీ అర్ధం కాదు" అంటారా? 😊

    ReplyDelete
  3. మరో మంచి పోస్ట్ మీ నుంచి గోపి గారు.

    ReplyDelete
  4. Nice story, expecting more stories like this.

    ReplyDelete