Saturday, March 3, 2018

డబ్బు ఎందుకు ?


                 డబ్బు ఎందుకు? అని ఎవరినయినా ప్రశ్నిస్తే వెంటనే వచ్చే సమాధానం వారి వారి స్థాయిలను బట్టి వివిధ రకాలుగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు తనకి ఇష్టమయిన బొమ్మలు, మిఠాయిలు కొనుక్కోవటానికి డబ్బులు కావాలి అంటాడు. ఒక పేద వాడు సుఖం గా బతకటానికి డబ్బు అవసరం అంటాడు. ఒక ధనికుడు అతనికి అప్పటికే అలవాటయిన విలాసవంతమయిన జీవితాన్ని కొనసాగించటానికి డబ్బులు ఆవశ్యకం అంటాడు. వస్తు వ్యామోహం ఉన్నవారికి అన్ని రకాల కొత్త కొత్త వస్తువులని కొని ఉపయోగించటం అలవాటు కాబట్టి దాని కోసం డబ్బు అవసరం. అన్నిటికీ మించి సమాజంలో గౌరవ మర్యాదలు, పరువు ప్రతిష్టలు కూడా డబ్బు తోనే ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న నగరీకరణ నేపధ్యం లో అందరి జీవితాలు ఇది వరకు ఎన్నడూ లేనంతగా డబ్బుతో పెనవేసుకుపోయాయి. గ్రామాలు సహజం గానే డబ్బు తో తక్కువ అవసరం గల స్వయం పోషకాలుగా ఉంటాయి. నిత్య జీవనానికి అత్యవసరమయిన ఆహర ధాన్యాలు, కూరగాయలు అన్నీ తమ స్వంత భూముల్లోనే పండించుకోవటం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఇంటి దగ్గర పెంచుకునే పశువుల వల్ల పాలు, పెరుగు, మాంసాహారం లాంటి అవసరాలు కూడా సొంతంగానే తీరిపోతాయి. కానీ నగరాల్లో జేబులో డబ్బు లేకపోతే చిన్న పని కూడా ముందుకి కదిలే అవకాశం లేదు.

                  ఇంతగా మనిషి జీవితం లో భాగమయిపోయిన డబ్బు గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియదు అంటే అది సాహసంగానే కనిపిస్తుంది గానీ అదే నిజం. ఉదాహరణకి పైన డబ్బు ఎందుకు? అని వేసుకున్న ప్రశ్నకి వచ్చిన సమాధానాలలో ఒక్క చిన్న పిల్లవాడి సమాధానం తప్ప మిగిలినవన్నీ తప్పు సమాధానాలే. అది ఎలాగో తెలుసుకోవాలంటే ముందు మనం మానవ నాగరికతలో డబ్బుకి సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకోవాలి. నిజానికి డబ్బు అనేది సంఘం లో మనుషుల గౌరవ మర్యాదలు పెంచటం కోసం సృష్టించబడలేదు. ఉన్న వాడు, లేనివాడు అన్న భేధాలని కల్పించటానికి గానీ, విచ్చలవిడిగా ఖర్చుపెట్టి నలుగురిలో గొప్ప తనాన్ని ప్రదర్శించటం కోసం గానీ డబ్బు కనిపెట్ట బడలేదు. కేవలం ధనవంతులయిన కారణం చేత ఎక్కువ విలువని, గౌరవ మర్యాదలని ఇవ్వటం అనేది కూడా ఒక మూఢ నమ్మకం లాంటిదే. నిజానికి ఈ విధమయిన ఆలోచనల వల్ల ఉన్న వాడు ఎలాగయినా మరింత ఉన్నవాడిగా అవ్వటానికి లేని వాడిని మరింత లేనివాడిగా తయారుచెయ్యటానికి ప్రయత్నిస్తాడు. కేవలం నాలుగు డబ్బులు ఎక్కవగా ఉండటం వల్ల తన పరపతి ఇంకా పెరుగుతుందంటే ఎవరయినా ఇలా చెయ్యటానికే ఇష్టపడతారు. 'రూపాయిని మనం పెంచితే రూపాయి మనలని పెంచుతుంది' అన్న సామెత ఇలాంటి భావాల నుంచి పుట్టిందే.

                  మానవ నాగరికత ప్రాధమిక దశలో ఉన్నప్పుడు అప్పటి అవసరాల కోసం లేదా ఒక మంచి కారణం కోసం సృష్టించబడ్డ ప్రతీదీ తర్వాత తర్వాత భ్రష్టు పట్టించ బడింది. మతం, విద్య, రాజకీయాలు లాంటివి ఇందుకు ఉదాహరణలు. డబ్బు కూడా ఇలాగే మనిషికి ఉపయోగపడే కారణం కోసం కనిపెట్టబడి చివరికి స్వార్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే వస్తువుగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే కేవలం నాలుగు డబ్బులకోసం అన్ని రకాలుగా దిగజారిపోయే స్థాయికి మనిషి డబ్బు విలువని పెంచాడు. నిజానికి డబ్బుకి కేవలం దాని మారకపు విలువ తప్ప మరే విలువా లేదు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో తమ అవసరానికి మించి ఎక్కువ డబ్బు కలిగి ఉండటం అనేది అవమానకరమయిన విషయంగా కూడా పరిగణిస్తారు. మన తో సహా చాలా చోట్ల పరిస్థితులు ఇందుకు విరుధ్ధం. మన దగ్గర నలుగురు మనుషులు కలిస్తే ఎక్కువగా మాట్లాడుకునేది 'ఎక్కువ డబ్బు సంపాదించటం ఎలా?' అని మాత్రమే గానీ 'డబ్బు ఎందుకు ?' అన్న ప్రశ్న ఊహ లోకి కూడా రాదు.

                  ఒక మనిషి తినడానికి ఆహారం దొరక్క చనిపోవటం వేరు, ఆహారం కొనటానికి డబ్బులు లేక ఆకలితో చనిపోవటం వేరు. వైద్యం దొరక్క చనిపోవటం వేరు, వైద్యం చేయించుకోవటానికి డబ్బులు లేక చనిపోవటం వేరు. ఇలాగే ఇంకా బోలెడన్ని చెప్పుకోవచ్చు. ఇదంతా మనిషి చరిత్రలో కేవలం డబ్బు మాత్రమే సృష్టించగలిగిన మారణహోమం. కేవలం చిల్లి గవ్వలతో మొదలయిన డబ్బు ప్రస్థానం చివరికి "మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే" అని కార్ల్ మార్క్స్ అనేటంతగా తన విశ్వ రూపాన్ని పెంచుకుంది. అందుకే 18 వ శతాబ్దానికి చెందిన వేమన కూడా

కులము గల్గువారు, గోత్రంబు కలవారు
విద్య చేత విర్రవీగువారు
పసిడి గల్గువాని బానిస కొడుకులు

అన్నాడు. ఇక్కడ పసిడి లేదా బంగారం అనేది డబ్బు కి మరో రూపమే అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చారిత్రకం గా చూస్తే ఐశ్వర్యానికి మూల కారణమయిన లక్ష్మీ దేవి ప్రస్తావన క్రీస్తు పూర్వానికి చెందిన వేదాలలో మొట్ట మొదటిదయిన రుగ్వేదంలోనే ఉంది.

                  పుట్టి బుధ్ధెరిగిన దగ్గరనుంచీ నేను విన్న మాటలు గానీ గమనించిన సంఘటనలు గానీ ప్రత్యక్షం గానో పరోక్షంగానో ఎక్కువగా డబ్బు కి సంబంధించినవే అయి ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. డబ్బు కి సంబంధించిన అన్ని విషయాల గురించీ వివరంగా రాయాలని మొదలు పెట్టాను గానీ చివరికి ఇది పరిశోధించి మరింత భాధ్యతతో రాయవలసిన ఒక పెద్ద పుస్తకంలా కనిపించింది. ముందు ముందు ఈ కింది అధ్యాయాల ద్వారా డబ్బుకి సంబంధించిన మరిన్ని వివరాల గురించి చర్చించుకుందాం.

1. పరిచయం
2. డబ్బు చరిత్ర
3. అర్ధ శాస్త్ర ప్రాధమిక సూత్రాలు
4. మానవుల పై డబ్బు ప్రభావం
5. డబ్బు యొక్క మిధ్యా విలువ
6. ఆర్ధిక అసమానతలకి మూలం
7. డబ్బు ఎలా సంపాదించాలి? ఎంత సంపాదించాలి?
8. డబ్బు యొక్క భవిష్యత్తు స్వరూపం
9. ముగింపు

2 comments:

  1. మంచి ప్రారంభం. మిగిలిన భాగాలు త్వరలో వస్తాయని ఎదురుచూస్తూ..

    ReplyDelete