Saturday, December 22, 2018

అబద్ధం, మోసం, కుతంత్రం - 1


                 అబద్ధం, మోసం, కుతంత్రం మనిషి ఆలోచనలలో ఒక ముఖ్యమయిన భాగం. మోసం చేయటం అనేది మనుషులతో పాటు కొన్ని రకాల జంతువులు, మొక్కలలో కూడా ఉంది. పరిసరాలకి అనుగుణంగా రంగులు మార్చే ఊసరవెల్లి. చేపలని వేటాడటానికి కొంగ దొంగ జపం. కీటకాలని ఆకర్షించి, తర్వాత వాటిని తినే కొన్ని రకాల మొక్కలు మొదలయినవి ఇందుకు ఉదాహరణలు. అబధ్ధం చెప్పటం మాత్రం మాటలు నేర్చిన మనిషి మాత్రమే చేసేది. అయితే ఉద్దేశపూర్వకంగా మౌనం వహించటం, అవసరమయినప్పుడు నిజాన్ని దాచిపెట్టటం కూడా అబధ్ధాలుగానే పరిగణించాలి. అబధ్ధానికి మొదటి కారణం భయం. చిన్నపిల్లలు ఊహ తెలిశాక మొదటి అబధ్ధం భయంతోనే చెపుతారు. కానీ తర్వాత వయసు పెరిగే కొద్దీ పరిస్థితులను తమకి అనుకూలం గా మార్చుకోవటానికి వాటిని ఉపయోగిస్తారు. అంటే మానవ నాగరికతలో ఒక మనిషికి మరో మనిషి భయపడటం మొదలయినప్పుడు మొదటి అబధ్ధం పుట్టి ఉండాలి. మోసం చేయటం మిగిలిన జీవులకు జీవన్మరణ సమస్య అయితే మనుషులకి మాత్రం అది నిత్యావసరం. మనిషి పలురకాల కుతంత్రాలు ఉపయోగిస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ వీటినే ప్రయోగిస్తూ ఉంటాడు కూడా. అయితే ఇందులో కొన్ని మాత్రం అతి ముఖ్యమయినవి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రపంచ చారిత్రక గతిని మార్చిన శక్తివంతమయిన ఉపకరణాలు.

                  మానవ నాగరికతని ఆటవిక యుగం, మధ్య యుగం, ఆధునిక యుగం అని 3 భాగాలు గా విభజిస్తే దాదాపుగా అన్ని రకాల కుతంత్రాలు ఆధునిక యుగం లోనే రూపం ఏర్పరుచుకున్నాయి. ఒక్క ఆహార సంపాదన గురించిన తాపత్రయం తప్ప ఏ విధమయిన ఆస్థిపాస్థులు, కట్టుబాట్లు లేని ఆటవిక యుగం లో కుతంత్రాలు ఉండే అవకాశం లేదు. మాటలు నేర్చుకోవటానికే మనిషికి కొన్ని లక్షల సంవత్సరాల సమయం కావలసి వచ్చింది. అప్పటివరకూ భావప్రకటనకి సైగలపనే ఆధారపడ్డాడు. సంపద, సొంత ఆస్థులు మొదలయిన తరువాత మధ్య యుగాలలో మాత్రం దోపిడీ, దౌర్జన్యం, బానిసత్వం ఎక్కువగా ఉండేవి. అయితే ఇవి బల ప్రయోగం ద్వారా చేసే ప్రత్యక్ష దాడులు మాత్రమే గానీ జిత్తులమారి వ్యూహాలు కాదు. అంటే ఈ భూమ్మీద మనిషి ఆవిర్భవించి 100 రోజులు అయ్యిందనుకుంటే 99 రోజుల వరకూ అమాయకంగా, నిజాయితీగానే జీవించాడు. నిజానికి నాగరికత అభివృధ్ధి చెందటానికీ, మోసపూరిత విధానాల సంఖ్య మరియు అవి అమలుపరచపడిన పరిధి విస్తరించటానికీ అనులోమ సంబంధం ఉంది. అంటే నాగరికత పెరిగే కొద్దీ మోసం, కుతంత్రం కూడా పెరుగుతూ వచ్చింది. ఇవి మనిషి ఆలోచనలతో పాటు పరిణతి చెందుతూ వచ్చాయి.

                  ప్రపంచంలో ని అన్ని చోట్లా మనిషి అభివృధ్ధి ఒకేసారి ఒకే దశలో ఎప్పుడూ లేదు. ఒక చోట నాగరిక సమాజం ఉంటే, మరొక చోట మధ్యస్థమయిన సమాజం, ఇంకో చోట ఆటవిక సమాజం ఉంటూ వచ్చాయి. తక్కువ సంఖ్య లో ఉన్న నాగరికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అనాగరికులను లోబరుచు కోవటానికి మోసపూరిత వ్యూహాలు ఉపయోగపడ్డాయి. ఇక్కడ నాగరికులు అంటే నగరాలలో నివసించేవారు అని మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ముందు దశలో ఉన్నవాళ్ళు అని కూడా అర్ధం చేసుకోవాలి. అయితే దీనివల్ల వీరు విలాస జీవితాన్ని అనుభవించగలిగారు కానీ స్వాభావిక మయిన ఆనందం మాత్రం కోల్పోవలసి వచ్చింది. ఎందుకంటే మరొకరి స్వేచ్చని హరించాలనుకొనే వాడు దాని కోసం ముందు తన స్వేచ్చని బలిపెట్టాలి. అందుకే మనిషి ఆనందానికి, నాగరికత అభివృధ్ధికి విలోమ సంబంధం ఉంది. అంటే నాగరికత పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతూ వచ్చింది.

                  మనిషి సామాజికంగా సాపేక్ష జీవి. ఇక్కడ ఎవరికీ నిజంగా సొంత బలం గానీ, వ్యక్తిత్వం గానీ ఉండదు. ఒకరి బలహీనతే మరొకరికి బలం అవుతుంది. అయితే మానవతావాద పరంగా చూస్తే బలవంతుడు బలహీనుడి వైపు నిలబడాలి. తెలివయిన వాడు అమాయకుడి వైపు నిలబడాలి. కానీ వాస్తవ చరిత్ర ఎక్కువగా ఇందుకు వ్యతిరేకంగానే ఉంటూ వచ్చింది. ఇప్పటివరకూ అవతరించిన అన్ని ప్రధానమయిన మతాలు చెప్పిన ముఖ్యమయిన విషయాలు మూడే మూడు. అవి, అబధ్ధం చెప్పకూడదు. మోసం చెయ్యకూడదు. మరొకరి సొమ్ముని ఆశించకూడదు అని. కాని విచిత్రంగా, మానవుడి చేత ఎక్కువగా ఉల్లంఘించబడుతున్న నియమాలు కూడా ఈ మూడే. ఒక అధ్యయనం ప్రకారం మనిషి సగటున రోజుకి 3 అబధ్ధాలు అవలీలగా చెపుతున్నాడు. ప్రస్తుతం మోసం చెయ్యటం లేదా మోసపోవటం అనేది ఒక వ్యవస్థీకృత దశకి చేరుకుంది. ఇది ఎంత సాధారణం గా తయారయిందంటే చాలా సందర్భాలలో మోసం జరుగుతున్న విషయం మోసం చేసే వాడికి కూడా తెలీదు. నిజానికి మోసం అనేది గడియారంలో నిమిషాల ముల్లు లాంటిది. నిమిషాల ముల్లు తిరుగుతున్నట్టు కనిపించదు కానీ తిరుగుతుంది. అలాగే మోసం కూడా జరుగుతున్నట్టు కనిపించదు గానీ జరుగుతుంది.

                  లౌకికంగా చూస్తే మనిషి అనివార్యంగా చేసే ఏ పని అయినా ఉత్తమ ఫలితం, మధ్యమ ఫలితం, అధమ ఫలితం అనే మూడు రకాలయిన ఫలితాలలో ఏదో ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఒక పని వల్ల అందరికీ మంచి జరిగితే అది ఉత్తమమయినది గాను, అందరికీ చెడు జరిగితే అది అధమమయినది గాను, కొంత మందికి మంచి కొంత మందికి చెడు జరిగితే అది మధ్యమ మయినదిగాను అనుకుంటే కుటిల వ్యూహాల వల్ల వచ్చే ఫలితాలు కూడా ఈ మూడు రకాలలో ఏదో ఒక రకానికి చెందినవే అయి ఉంటాయి. అయితే 95 శాతం మధ్యమ ఫలితాన్ని ఇచ్చేవి మాత్రమే అయి ఉంటాయి. పూర్తిగా మంచి జరగటం లేదా పూర్తిగా చెడు జరగటం అనేది అరుదుగా మాత్రమే జరుగుతుంది.

                  మోసపూరిత విధానాల గురించిన అవగాహన అనేది తెలిసిన వారికి బలమయితే తెలియని వారికి అదే బలహీనత అవుతుంది. ఒక వ్యూహం ప్రత్యర్ధికి తెలుసునని తెలిస్తే ఆ వ్యూహం అమలుపరచాలనుకునేవాడికి ఇంక అది పనికి రాకుండా పోతుంది. అలాగే ఈ విధానాల గురించి ఎంత ఎక్కువ మందికి అవగాహన కలిగితే వాటిని ప్రయోగించే అవకాశాలు అంతగా తగ్గిపోతాయి. వివిథ రకాల ముఖ్యమయిన కుతంత్రాల గురించి చారిత్రక ఆధారాలు, ఉదాహరణలతో సహా ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఆయుధాన్ని ఉపయోగించకుండా అనుకున్నది సాధించటానికి ఇవి ఇద్దరు మనుషుల మధ్య మొదలుకొని వర్గాలు, వ్యవస్థలు, దేశాల మధ్య అమలు చేయబడిన వ్యూహాలు. అవసరాన్ని బట్టి విడి విడి గా గానీ, ఒకటి విఫలమయినప్పుడు దాని స్థానంలో మరొకటి గానీ, ప్రణాళికాబధ్ధంగా వరుసలో ఒకదాని తర్వాత మరొకటి గానీ ఇవి ఉపయోగించబడతాయి.

1. - విభజన

                  'ఐకమత్యమే మహా బలం ' అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దీన్నే మరోలా చెప్పుకోవాలంటే ఒక వర్గం యొక్క అనైక్యతే ఆ వర్గం యొక్క బలహీనత. ఈ బలహీనతని తనకి అనుకూలం గా మలుచుకుని ఆ వర్గం మీద ఆధిపత్యం సంపాదించటం అనేది ప్రత్యర్ధి వ్యూహం లో ఒక భాగం. సరిగ్గా ఈ వ్యూహాన్ని ఉపయోగించుకునే యూరోపియన్లు ప్రపంచం లో 80 శాతం భూభాగాన్ని తమ ఆధీనం లోకి తెచ్చుకోగలిగారు. వర్గాల మధ్య ఐక్యతని చెడగొట్టటం లేదా విభజించటం అనేది దీనికి పునాది. దీనికి వారు అవలంబించిన విథానం చాలా తేలికయినది. అప్పటివరకూ ఉన్న ప్రశాంతతని భగ్నం చేయటం కోసం ఒక తెగకి ఆయుధాలు పంచి వారిని స్థానికంగా ఉన్న మరొక తెగ మీదికి ఉసిగొలిపేవారు. వారు విచ్చలవిడిగా తయారు చేసిన తుపాకులు ఇందుకు బాగా ఉపయోగపడ్డాయి. ఈ 'విభజించు పాలించు ' సిధ్ధాంతం ద్వారానే బ్రిటీషు వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకోగలిగారు. మొఘలుల పతనం తర్వాత భారత దేశం లో ఏర్పడ్డ అనైక్యత బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ వారికి కలిసొచ్చింది. అయితే ఈ సిధ్ధాంతం భారతీయులకి తెలియనిది, యూరోపియన్లు కొత్తగా కనిపెట్టినదీ ఏమీ కాదు. వారికన్నా 2000 సంవత్సరాల పూర్వమే చాణక్యుడు మౌర్య సామ్రజ్యాన్ని ఈ సిధ్ధాంత పునాదుల మీదే నిర్మించాడు. బ్రిటీషు వాళ్ళు తమ వ్యాపార అవసరాల కోసం ఈ సిథ్థాంతాన్ని ఉపయోగించుకుంటే, చాణక్యుడు మాత్రం అప్పటికి అసంఖ్యాకంగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలని ఒకే సామ్రాజ్యంగా తన ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఉపయోగించాడు. తెగల మధ్య ఏ విధంగా శతృత్వాన్ని, అసూయ ద్వేషాలను పెంచాలో, ఘర్షణలను సృష్టించాలో లాంటి భేధోపాయాలను చెప్పటానికి చాణక్యుడు అర్థ శాస్త్రంలో ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించాడు. ఈ విభజన సిధ్ధాంతం మన దైనందిన జీవితం లో బంధు మిత్రుల మధ్య, కుటుంబం లోను, పనిచేసే ప్రదేశాలలోను కూడా విరివిగా నిత్యం ఉపయోగించబడుతుంది. అపార్ధాలు సృష్టించటం ద్వారా ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా చేసి ఒక గుంపు పై ఆధిపత్యం చెలాయించటం అనేది దీనికి సాధారణ రూపం. ప్రస్తుత ప్రజాస్వామ్య రాజకీయాలలో కూడా దీని విలువ అపారం. ఎక్కువ సంఖ్యలో ఉన్న దిగువ స్థాయి వర్గాల మధ్య ఐక్యత నెలకొనటం అంత సులువు కాదు. ఈ బలహీనతని ఆధారం చేసుకునే తక్కువ సంఖ్యలో ఉన్న ఉన్నత వర్గం, వారిని పాలించ గలుగుతుంది. దీనిని మరోలా చెప్పుకోవాలంటే 85% ఉన్న అల్ప సంఖ్యాక వర్గాల వారు తమలో తాము ఐక్యతని సాధించేవరకూ పాలకులు కాలేరు. కాని వారి సంఖ్య దృష్ట్యా అందరూ ఒకేవిధమయిన ఆలోచనా విధానాన్ని కలిగి ఉండి ఒకే తాటి పై నిలవటం అనేది కష్టసాధ్యం. కాని తక్కువ సంఖ్యలో ఉన్న ఉన్నత వర్గం విషయంలో ఇది సాధ్యమే. అందుకే 15% వున్న ఉన్నత వర్గాలు మాత్రమే ఎప్పుడూ పాలకులుగా ఉంటారు.

2. - కలుపుకోవటం

                  ఏదయినా కారణం చేత లొంగదీసుకోవటం సాధ్యం కానప్పుడు, లేదా లొంగదీసుకోవటం కన్నా కలుపుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉందనుకున్నపుడూ ఆ వర్గాన్ని ఒక స్థాయి వరకూ తమలో కలుపుకోవటం అనేది ఒక ముఖ్యమయిన వ్యూహం.పరిణామ దశలో ఒక మనిషి అవసరం మరో మనిషికి ఎంత ముఖ్యమో గుర్తించిన తరువాత ఈ విధానం అమలులోకి వచ్చింది. ముఖ్యం గా పారిశ్రామిక విప్లవం తర్వాత ఉత్పత్తి సాధనాలు, శ్రమ విలువ పెరిగి ఒకరిపై ఒకరు ఆధారపడటం పెరిగింది. అప్పటివరకూ ఉన్న బానిసత్వ విధానం స్థానం లో కలుపుకుని పోవటం అనేది ఎక్కువ లాభసాటిగా గుర్తించబడింది. అయితే ఈ కలుపుకోవటం అనేది సమాన స్థాయిలో కాకుండా తమ కింది వర్గం గా మాత్రమే ఆమోదించబడింది. అంటే అప్పటి వరకూ ఉన్న కట్టు బానిసలు తర్వాత ఎంతో కొంత స్వేచ్చ కలిగిన అర్ధ బానిసలుగాను, తర్వాత జీతం చెల్లించే కూలీలు, కార్మికులుగాను సమాజం లో ఒక స్థాయిని పొందగలిగారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న బానిసలను అదుపులో పెట్టటం, వారి తిరుగుబాట్లను ఎదుర్కోవటం కన్నా వారిని తమతో కలిసి బతకనివ్వటం అనేది ఎక్కువ లాభసాటి వ్యవహారం అనిపించిన తర్వాత ఇది సాధ్యపడింది.



భారత దేశ చరిత్ర లో ఈ కలుపుకోవటం అనేది ఒక ముఖ్య పాత్ర వహించింది. నిజానికి మిగిలిన దేశాలతో పొల్చి చూస్తే భారత దేశం లో అణచివేత ధోరణితో కూడిన బానిసత్వం అనేది చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉండేది. ముందు నుంచీ అణచివేత కన్నా కలుపుకోవటం మన దేశ చరిత్రలో ప్రధాన విషయం. ఇదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ వ్యవస్థ గాను, తర్వాత కుల వ్యవస్థ గాను రూపాంతరం చెందింది. ఒక ప్రత్యేక ప్రయోజనంకోసం పెళ్ళిళ్ళ ద్వారా బంధుత్వాలు కలుపుకోవటం అనేది కూడా ఈ వ్యూహం లో భాగం. రాజరిక వ్యవస్థలో రాజులు ఈ విధమయిన ప్రయోజనాల కోసమే ఒకటికంటే ఎక్కువ వివాహాలు చేసుకునే వారు. ఒక వర్గం మొత్తాన్ని తమలో కలుపుకోవటానికి ఆ వర్గం యొక్క స్త్రీ దేవతలని తమ దేవుళ్ళకి ఇచ్చి వివాహం చేయటం అనే ప్రక్రియ కూడా మన దేశం లో సమర్ధవంతంగా ప్రయోగించబడింది. ఆర్య, ద్రావిడ దేవీ దేవతల పెళ్ళిళ్ళు ఇందుకు ఉదాహరణలు. ఈ కలుపుకోవటం ద్వారా ఏర్పడ్డ కులవ్యవస్థ ఇప్పటికీ భారత దేశాన్ని అన్ని రకాలుగా ప్రభావితం చేయగలిగిన బలీయమయిన అంశంగా తయారయ్యింది.

3. - సహకారం

                  ఒకరికొకరు సహకరించుకోవటం అనేది పైకి చూడటానికి జిత్తులమారి వ్యూహంగా కనిపించదు. కాని చరిత్రలో ఇది ఒక ప్రభావవంతమయిన పైకి కనిపించని కుతంత్రం. ఒకరికి ఒకరు సహకరించుకోవటం అనేది కేవలం మనిషికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఆధునిక మానవుడు సామాజిక జీవి. ఒంటరిగా కన్నా గుంపులో మాత్రమే ఎక్కువ సమర్ధవంతంగా జీవించగలడు. మనిషి బలం గుంపులోనే ఉంటుంది. అంటే పరస్పర సహకారంలోనే ఉంది. ఏ విధమయిన ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కేవలం మతం, కులం, వర్గం అనే భావోద్వేగాల ఆధారంగా కూడా మనుషులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఇది జంతువులలో సాధ్యం కాదు. సాధ్యం అయినా దాని పరిధి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ గుణమే మిగిలిన జీవులతో పోలిస్తే మనిషిని మరింత బలవంతుడిగా చేసింది. అయితే ఈ గుణమే అంతర్గతం గా మనుషుల మధ్య ఒకరి పోటీ నుండి మరొకరు తట్టుకోవటానికి కూడా అవసరమవుతుంది. అంటే రెండు వ్యవస్థలు ఒకదానినొకటి సహాయం చేసుకుని బలపరుచుకోవటం అనేది మానవ సమాజం లో అంతర్గతంగా ఉండే విషయం. కొన్ని బయటి వ్యవస్థలతో వీటికి ఏర్పడే పోటీ దీనికి ముఖ్య కారణం. ఒకదానినొకటి సహాయం చేసుకోవటం ద్వారా ఆ రెండు వ్యవస్థలు మరింత గా వృధ్ధి చెందుతాయి. దీనిని మరోలా చెప్పాలంటే పోటీని తట్టుకుని రెండు వ్యవస్థలు మరింత వృధ్ధి చెందటం కోసం ఒకదానినొకటి బలపరుచుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఉదాహరణ చెప్పాలంటే 'రాజకీయాలు' - 'ప్రచార మాధ్యమాలు', 'రాజకీయాలు' - 'మతం'. ఒక్కోసారి రెండు దేశాల మధ్య ఉండే సంబంధం కూడా ఇలాంటిదే అయి ఉంటుంది.



అంటే ఈ రెండూ తమ అభివృధ్ధి కోసం ఎప్పుడూ కలిసే పనిచేస్తాయి. ఇది సహజమయిన మానవత్వ ప్రేరిత సాయం కాదు. రెండు వర్గాలు ఒకరికి ఒకరు సహకరించుకోవటం అనేది ఖచ్చితం గా మరొక వర్గాన్ని అణగదొక్కటానికే అయి ఉంటుంది. లేదా ఇరు పక్షాలు లాభపడే ఒక ఒప్పందం లో భాగం గా అయినా అయి ఉంటుంది. ఇది మానవ సంబంధాలు మొదలుకుని వ్యాపారం, రాజకీయాలు లాంటి అన్ని చోట్లా అమలుపరచబడే వ్యూహం. దీనినే క్విడ్ ప్రో కో అని కూడా అంటారు. కుటుంబ వ్యవస్థలోని పెళ్ళి ద్వారా ఏర్పడే భార్యా భర్తల సంబంధం కూడా ఇలాంటిదే. అందుకే ఆస్థి, ఉద్యోగం, కులం, మతం అనేవి పెళ్ళిలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సమాజం లోని అసమానతలకి, అసూయా ద్వేషాలకీ ఈ పక్షపాత పూరితమయిన పరస్పర సహకారమే కారణం. ఉదాహరణకి ఒకే కులం లోని ప్రజలు తమలో తాము మాత్రమే సహాయం చేసుకుని, అభివృధ్ధి చెంది, మిగిలిన కులాల వారిని అణగద్రొక్కుతారు. ఈ విధమయిన పరస్పర సహకారం పోను పోను పరస్పర ఆధారితం అవుతుంది. ఏదయినా కారణం చేత ఒక వ్యసస్థ కుప్పకూలితే దాని ఆధారిత వ్యవస్థకి కూడా అపాయం ఏర్పడుతుంది. ఇదే సూత్రం కుటుంబ వ్యవస్థకి కూడా వర్తిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిర్ణయాలతో పాటు అన్ని నిర్ణయాలను ఈ క్విడ్ ప్రొ కో ప్రభావితం చేస్తుంది.

- రెండవ భాగం

No comments:

Post a Comment