4. - శ్రమ దోపిడి
శ్రమ దోపిడి గురించి మొదటిసారి కార్ల్ మార్క్స్ తన 'పెట్టుబడి ' గ్రంధంలో వివరించి చెప్పేవరకు అది రహస్యం గానే ఉండిపోయింది. దోపిడి అనేది వ్యవస్థ లో ఒక భాగం. దోపిడి లేకుండా వ్యవస్థ లేదు. వ్యవస్థ లేకుండా దోపిడి కూడా లేదు. శ్రమ దోపిడీ అనేది భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల లోని మోసపు విధానం. ఏవో కొన్ని దేశాలు మాత్రమే ధనిక దేశాలు కావటం, కొంత మంది మాత్రమే ధనవంతులు కావటం అనేది శ్రమ దోపిడీ వల్లనే జరుగుతుంది. దీనినే స్థూలంగా 'గొయ్యి లేకుండా గొప్పు లేదు.' అని చెప్పవచ్చు. ఎవరో ఒకరు నష్ట పోకుండా మరొకరికి లాభం ఎన్నటికీ రాదు. ఒక దేశం విలాసవంతంగా సుసంపన్నంగా ఉంది అంటే ఎక్కడో మరో దేశం ఆకలితో అల్లాడుతుందని అర్ధం. ఇది ఒక్కోసారి ప్రత్యక్షంగాను మరో సారి పరోక్షం గాను జరుగుతుంది.
అమెరికా అత్యంత ధనిక దేశంగా మనగలగటం కోసం ప్రపంచంలో మరెన్నో దేశాలని తన కుతంత్రాలతో దయనీయ స్థితికి దిగజార్చింది. తమ దేశంలోని బట్టల మిల్లులు, కోకోకోలా కంపెనీల కోసం ఆఫ్రికా దేశాలను బలవంతంగా పత్తి, చెరకు పంటలను పండించటానికే పరిమితం చేసి అక్కడి ఆహార పంటలను దెబ్బతీసి పేదరికంలోకి నెట్టివేసింది. అమెరికా ధనిక దేశం కావటానికి అక్కడ అమలు చేయబడుతున్న పెట్టుబడి దారీ విధానమే కారణం. పెట్టుబడిదారీ దేశాలు వినియోగ దారులు కలిగిన దేశాలను, శ్రమ చేయగలిగిన మానవ వనరులు కలిగిన దేశాలను తమలో తాము పంచుకుంటాయి. ప్రస్తుతం భారతదేశం కూడా అలా పంచుకోబడ్డ దేశాలలో ఒకటి.
అయితే పెట్టుబడి దారునికి అంత శక్తి ఎక్కడి నుండి వస్తుంది ? పెట్టుబడి దారుడు తన దగ్గర ఉన్న డబ్బుని పెట్టుబడి గా పెట్టి ఒక వస్తువుని ఉత్పత్తి చేసి దానిని మార్కెట్లో అమ్మి లాభాలు పొందుతాడు. మార్కెట్లో కంపెనీల మధ్య నెలకొన్న తీవ్రమయిన పోటీని దృష్టి లో పెట్టుకుంటే వినియోగదారుడు వస్తువుని దానికి సమానమయిన విలువగల డబ్బుని ఇచ్చి చౌకగా కొనటానికి మాత్రమే ఇష్ట పడతాడు. అంటే వినియోగదారుడి నుండి పెట్టుబడి దారునికి లాభం రాదు. మరి ఈ లాభం అతనికి ఎక్కడి నుండి వస్తుంది ? అతను తన దగ్గర పని చేసిన పనివాళ్ళకి ఇచ్చే జీతం లో కోత పెట్టటం ద్వారా మాత్రమే లాభం పొందుతాడు. అంటే విజయవంతమయిన ఏ వ్యాపారస్థుడూ తన పని వాళ్ళకి లేదా ఉద్యోగస్థులకీ ఎప్పటికీ వారి శ్రమకి తగిన పూర్తి ఫలితాన్ని చెల్లించడు. దీనినే మరోలా చెప్పుకోవాలంటే పెట్టుబడి దారుడు ఎక్కువ పని గంటలు పనిచేసే కార్మికులని ఎంత తక్కువ జీతానికి పనిలో పెట్టుకోగలిగితే అతని లాభాలు అంత పెరుగుతాయి.
పెట్టుబడిదారుడు తనకి వచ్చిన లాభాలని తిరిగి పెట్టుబడిగా పెట్టి మరిన్ని లాభాలని పొందుతాడు. ఇది ఒక చక్రం లాగా కొనసాగుతూనే ఉంటుంది. అందుకే పెట్టుబడిదారుడు కొన్ని సంవత్సరాలలోనే మరింత డబ్బున్నవాడిగా తయారవుతాడు. అతనికి ఇదొక వ్యసనం అవుతుంది. శ్రామికుడు మాత్రం తన పరిమిత ఆదాయంలో ఖర్చులకి పోగా మిగిలిన కొంత మొత్తాన్ని భవిష్యత్ అత్యవసరాలకి పొదుపు చేసుకోవటంతో సంతృప్తిపడతాడు. అంటే వ్యాపారస్థుడి జీవితం డబ్బుతో మొదలయ్యి తిరిగి ఎక్కువ డబ్బు పొందటంతో ముగుస్తుంది. కానీ శ్రామికుడి జీవితం శ్రమతో మొదలయ్యి డబ్బు ఖర్చుపెట్టటంతో ముగుస్తుంది. అంటే ఎక్కువ కష్టపడే వారికి తక్కువ డబ్బులు. తక్కువ కష్ట పడే వారికి ఎక్కువ డబ్బులు. దీనినే మరోలా చెప్పుకోవాలంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే వాడు ఎప్పుడూ తక్కువ కష్ట పడటానికే ఇష్టపడతాడు.
ముందునుంచీ వ్యాపారాన్ని నమ్ముకున్న మార్వాడీ, వైశ్య కులాలు ధనిక వర్గాలుగానే ఉంటూ వచ్చాయి. వ్యవసాయం, వృత్తి పనులు, ఉద్యోగాలు మీద ఆధారపడే కులాలు మాత్రం ఎప్పుడూ ఒకే స్థితిలో ఉంటాయి. ఒక వర్గం ధనిక వర్గం కావాలంటే అది పెట్టుబడి దారీ వ్యవస్థలోకి ప్రవేశించాలి. అయితే అందరూ పల్లకీ ఎక్కేవాళ్ళే అయితే మరి మోసే వాళ్ళు ఎవరు ? అందుకే వ్యాపార వర్గాలు మరియు కార్పొరేట్ కంపెనీల మధ్య పోటీ చాలా తీవ్రంగానే ఉంటుంది. ఈ పోటీని తట్టుకుని నిలబడగలిగిన వాళ్ళే ఇందులో విజయవంతం కాగలుగుతారు. ఈ పోటీ ధరలను అదుపులో ఉంచటం లో కూడా సహాయపడుతుంది.
పెట్టుబడి దారీ వ్యవస్థలో మొదటి తరం పెట్టుబడిదారులకి పెట్టుబడి డబ్బు ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చింది ? మొదటి తరం పెట్టుబడి దారులు రాజ వంశాలు, భూస్వాముల కుటుంబాలకి చెందినవాళ్ళు లేదా అలాంటివాళ్ళ సంపదలని దోపిడీ చేసినవాళ్ళు అయి ఉండాలి. ఇదంతా ఒకప్పుడు ప్రజలని పన్నుల పేరుతోను, యుధ్ధాలలోను దోచుకున్నదే. పిరమిడ్లు, తాజ్ మహల్, చార్మినార్ లాంటి గొప్ప కట్టడాలు అన్నీ శ్రామికులను, ప్రజలను పీడించగా వచ్చిన డబ్బు తో కట్టినవే. యూరోపియన్ల పెట్టుబడి మూల ధనం కూడా వివిధ దేశాల సంపదను కుతంత్రంతో దోచుకోవటం ద్వారా సంపాదించినదే.
5. - దుష్ప్రచారం
సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన, చేస్తున్న, చేయబోతున్న కుతంత్రాలలో దుష్ప్రచారం ముఖ్యమయినది. చరిత్రలో దీనిని పూర్తి స్థాయిలో సమర్ధవంతంగా ఉపయోగించినది హిట్లర్ మంత్రి మండలి లో ప్రచార వ్యవహారాల మంత్రిగా పనిచేసిన జోసెఫ్ గోబెల్స్. తన తప్పుడు ప్రచారపు వ్యూహాల ద్వారా హిట్లర్ చేసిన అన్ని ఆకృత్యాలను గొప్ప పనులుగా ప్రజల దృష్టిలో చిత్రీకరించగలిగాడు. 'ఒకే అబధ్ధాన్ని వెయ్యి సార్లు చెపితే అది నిజమవుతుంది.' అన్న ప్రసిధ్ధ సూక్తి ఇతనిదే. ఒక అబధ్ధాన్ని ఒకడు చెపితే అది అబధ్ధం అవుతుంది. అదే అబధ్ధాన్ని పది వేల మంది పది సంవత్సరాల పాటు చెపితే అది నమ్మకమవుతుంది. కొన్ని తరాలపాటు చెపితే మూఢ నమ్మకమవుతుంది. అందులో నిజం లేదని తెలిసినా, ఏమాత్రం వ్యతిరేకించలేని బలహీనతకి మనిషి లోనవుతాడు. పిల్లి ఎదురయితే అపశకునం అనే మూఢ నమ్మకం ఇందుకు ఉదాహరణ. మనిషి జీవితం, నాగరికత కూడా ఇలాంటి అబధ్ధపు నమ్మకాల మీదే నిర్మించబడింది. కుల, మత పరంగా కరుడు గట్టిన ఆలోచనలు, సంఘంలో హోదా, మానవ సంబంధాలను మించి డబ్బుకి ఇచ్చే అతి విలువ లాంటివి కూడా మూఢనమ్మకాలకు ప్రతి రూపాలు. వీటి నుండి బయట పడటం మనిషికి దాదాపు అసాధ్యం. వంద మంది ఉన్న గుంపులో 98 మంది ఒక అబధ్ధాన్ని నిజమని బలంగా నమ్మితే, మిగిలిన ఇద్దరికీ అది అబధ్ధమని తెలిసినా కూడా ఆ 98 మందితో ఏకీభవించక తప్పదు. ఎందుకంటే అబధ్ధమయినా కూడా సామాజికంగా ఎక్కువమంది చేత అంగాకరించబడే విషయానికే ఎప్పుడూ పరిస్థితులు అనుకూలంగా మలచబడతాయి. ఎంతయినా మూఢ నమ్మకం కూడా ఒక బలమయిన నమ్మకమే.
ఈ విధమయిన తప్పుడు నమ్మకాలని,వార్తలని వ్యాప్తి చేసి ప్రజలు తమకి అనుకూలంగా ఆలోచించేలా చేయటం దుష్ప్రచారం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఒక అధ్యయనం ప్రకారం మనం ప్రతిరోజూ చూసే వార్తా పత్రికలు, టీవీ చానళ్ళు, సోషల్ మీడియా లోని వార్తలు 90 % అబధ్ధమే. దుష్ప్రచారం నిజాన్ని మాత్రమే కాదు. మనిషి ఆలోచనని కూడా చంపేస్తుంది. దుష్ప్రచారంలో ఆరి తేరిన వారు సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అయితే ఇది ప్రజల అమాయకత్వపు స్థాయి మీద ఆధారపడుతుంది. ప్రజలు ఎంత అజ్ఞానులు అయితే దుష్ప్రచారం అంతగా విజయవంత మవుతుంది. ఈ విధమయిన ప్రచారాన్ని అడ్డుకుని నిజాన్ని తెలియ చెప్పే వారు లేకపోతే ఇంకా విజృంభిస్తుంది. అందుకే ఒకసారి దుష్ప్రచారం ద్వారా పరిస్థితులని అనుకూలంగా మలుచుకున్న వాళ్ళు దాన్ని వ్యతిరేకించే వాళ్ళని నిర్మూలించటానికి ఎప్పుడూ వెనుకాడరు. దేశాలు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి శతృదేశాల మీద దుష్ప్రచారం చెయ్యటం అనేది రాజనీతిలో ఒక భాగం. పరస్పర అవసరాల కోసము, మత కుల వర్గ పరంగాను విడిపోయిన ప్రస్తుత సమాజంలో సత్యం తెలుసుకోవటానికి ప్రయత్నించటం అంటే గడ్డి వాములో సూది కోసం వెతకటం లాంటిదే.
నిజానికి ఎక్కువ మందికి సొంతంగా ఆలోచించే ఓపిక, తీరిక ఉండదు. ఎవరయినా చెపితే గుడ్డిగా విని అనుసరించాలనే చూస్తారు. తప్పుడు ప్రచారాలు విజయవంతం కావటానికి ఇది కూడా ఒక కారణం. ఇవి ఒకరి నుంచి నలుగురికి, నలుగురి నుంచి పది మందికి, పది మంది నుంచి పాతిక మందికి పాతిక నుంచి వంద మందికి ఇలా చాలా వేగంగా పాకి పోతాయి. ఎంత పెద్ద అబధ్ధమయితే అంత త్వరగా వ్యాపిస్తుంది. ప్రజలని ఉద్వేగ పరిచేవి, వారికి ఏదో అపాయం కలుగుతుంది అనిపించేవి, హింసాత్మక మయినవి, అద్భుతం అనిపించేవీ త్వరగా వ్యాపిస్తాయి.
ఉగ్రవాదం మతపరమయిన మూఢ దుష్ప్రచారపు ఫలితమే. దుష్ప్రచారం ద్వారా వ్యూహ కర్తలు త్రిశంకు లోకాన్ని సృష్టించగలరు. గుడ్డిగా వీటిని నమ్మే అజ్ఞానులు ఎక్కువగా ఉన్న సమాజం చివరికి మూర్ఖుల స్వర్గంగానే తయారవుతుంది. దుష్ప్రచారాలను నిజమని నమ్మటం వల్ల వాస్తవాలను అర్ధం చేసుకోలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని, చివరికి దుష్ఫలితాలు పొందే ప్రమాదం ఉంది.
ఒకరి దుష్ప్రచారాలని మరొకరు తిప్పికొట్టటం కోసం ప్రస్తుత రాజకీయాలలో ప్రతి పార్టీకి సొంత ప్రచార మాధ్యమాలు ఉండటం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఒకరకంగా ఇది ప్రజలకి మంచిదే, దీని వల్ల తప్పుడు ప్రచారం అనేది ఏక పక్షం గా కాకుండా అన్ని పక్షాల మంచి చెడులు బయటికి వస్తాయి. అతిగా ప్రచారం చేయటం కూడా దుష్ప్రచారమే అవుతుంది. దీనిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవటంలో వ్యాపార సంస్థలు ముందుంటాయి. అవి పదే పదే చూపించే వాణిజ్య ప్రకటనలు మనుషులలో వస్తువ్యామోహాన్ని పెంచుతాయి. అనవసరమయిన సరుకులను కూడా కొని నిలువ చేసే తత్వాన్ని, వస్తువు యొక్క ఉపయోగంతో సంబంధం లేకుండా హోదా కోసం సరుకులను కొనే తత్వాన్ని నూరి పోస్తాయి. చాలా సార్లు వాణిజ్య ప్రకటనలలో చూపించే నాణ్యతకి, సరుకు యొక్క వాస్తవ నాణ్యతకీ సంబంధం ఉండదు. అవసరమయితే కంపెనీలు తమ బడ్జెట్ లో 40% వరకూ కేవలం మార్కెటింగ్ కోసమే ఖర్చుపెడతాయి. ప్రస్తుత సోషల్ మీడియా యుగం లో దుష్ప్రచారానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే సమయం లో దానిని తిప్పికొట్టటానికి కూడా సోషల్ మీడియానే మంచి ఉపకరణంగా పనికొస్తుంది.
మొత్తంగా చూస్తే తప్పుడు ప్రచారం చెయ్యటానికి అనుసరించే కొన్ని పధ్ధతులు ఈ విధంగా ఉంటాయి.
• వాస్తవానికి పూర్తి విరుధ్ధంగా చెప్పటం.
• అనుకూలమయిన విషయాన్ని గురించి అధికంగా చెప్పి అననుకూలమయిన దానిని
గురించి తక్కువగా చెప్పటం.
• ఒకరి విషయం లో జరిగిన దానిని మరొకరికి జరిగినట్టు చెప్పటం.
• ఒక చోట జరిగినది మరొక చోట జరిగినట్టు చెప్పటం.
• ఒక సమయం లో జరిగినది మరొక సమయంలో జరిగినట్టు చెప్పటం.
• నమ్మే వరకూ పదే పదే ఒకే విషయాన్ని చెప్పటం.
• పూర్తిగా కట్టుకథలు సృష్టించటం.
• తప్పుడు ఉత్తరాలు, ఫోటోలు, వీడియోలు సృష్టించటం.
• తప్పుడు లెక్కలు చెప్పటం.
• లేని ప్రాముఖ్యతను ఆపాదించటం.
• పరిస్థితులకి భయపడి నిజాలను బయటపెట్టకుండా తప్పుడు భావాలు ప్రకటించటం
ద్వారా తప్పుడు ప్రచారానికి కారణం కావటం.
• నిజం చుట్టూ అబధ్ధాలు కల్పించటం.
• భయపడే విధంగా ప్రచారం చేసి నమ్మించటం.
• కుల, మత, జాతి పరమయిన భావోద్వేగాలను రెచ్చగొట్టటం.
• చరిత్రను వక్రీకరించటం.
• ఒకేసారి కాకుండా పథకం ప్రకారం కొంచెం కొంచెంగా దుష్ప్రచారాన్ని కొనసాగించటం.
ఉద్దేశ్యపూర్వకంగా కానీ, సరదాకి కానీ బంధు మిత్రుల మధ్య, పనిచేసే చోట చెప్పుకునే చాడీలు, పుకార్లు కూడా దుష్ప్రచారాలు గానే భావించాలి.
(ఇంకా ఉంది...)