అసలు ఆంధ్రులకి తెలుగు మీడియం కావాలా ? ఇంగ్లీషు మీడియం కావాలా ? అన్న విషయం గురించి మాట్లాడుకునే ముందు ఆంధ్రుల మనస్తత్వం గురించి కొంత మాట్లాడుకోవాలి. స్వాభావికం గా తమిళ, మరాఠీ, బెంగాలీ వారిలాగా ఆంథ్ర ప్రజలు స్వాభిమానం, సొంత ఆలోచన విధానం కలిగిన వారు కాదు. అనుకరణ వాదులు మాత్రమే. ఒక మనిషికి ఆత్మ ఉన్నట్టే, ఒక జాతికి కూడా తనకంటూ సొంత ఆత్మ ఉండాలి. కాని ఇప్పటి వరకూ ఆంధ్రా వాళ్ళు తమకంటూ ఒక సామూహిక సొంత భావజాలాన్ని, ముద్ర ని ఏర్పరుచుకోలేకపోయారు. కేంద్రం లో గానీ పక్క రాష్ట్రాలలో గానీ తెలుగు వారి మాటకి విలువ లేకపోవటానికి ఇదే అసలు కారణం. ఆంధ్రులు కష్ట పడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు మాత్రమే గానీ చురుకుగా పని చేసే వాళ్ళు కాదు. ఇంకా చెప్పాలంటే డబ్బు వ్యామోహం, కుల తత్వం కలిగిన స్వార్ధ పూరిత బానిస మనస్తత్వమే ఆంధ్రుల ఆత్మ. ఇక్కడ ఎవరికీ ఎవరి మీదా నమ్మకం ఉండదు. కమ్మ వారికి రెడ్డి వారి మీద నమ్మకం ఉండదు. కాపు వారికి కమ్మ వారి మీద నమ్మకం ఉండదు. రాయల సీమ వారికి కోస్తా వారి మీద నమ్మకం ఉండదు. దళిత బహుజనులకి అగ్ర వర్ణాల మీద నమ్మకం ఉండదు. అగ్ర వర్ణాలకి దళిత బహుజనుల మీద నమ్మకం ఉండదు. గెలిపించిన నాయకుల మీద ప్రజలకి నమ్మకం ఉండదు. రాజకీయ నాయకులకి ప్రజల మీద నమ్మకం ఉండదు. విచిత్రంగా ఈ కంప్యూటర్ యుగంలో కూడా కులతత్వం అనేది సోషల్ మీడియా ప్రభావం తో మరింత బలపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రాజకీయాలు గా లేవు. అవి ప్రతి సామాన్యుడి సొంత ఇంటి వ్యవహారాలుగా మారిపోయాయి. రాజకీయాలని రాజకీయాలుగా చూడగలిగిన ప్రజలు కలిగిన ప్రజాస్వామ్యం మాత్రమే నిజమయిన ప్రజాస్వామ్యం గా నిలబడగలుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు కులతత్వం, మతతత్వం తో పాటు విచ్చలవిడి ఉచిత సంక్షేమ పధకాలు కూడా రాజకీయాలని ప్రతి ఇంటి సొంత వ్యవహారంగా మార్చివేశాయి. ఈ విధమయిన ఆలోచనని కలిగించటమే మన ప్రజాస్వామ్యానికి ఉచిత సంక్షేమ పధకాలు చేస్తున్న అసలయిన నష్టం.
ఒక వస్తువుని కంటికి మరీ దగ్గరగా పెట్టుకుని చూస్తే మనకి ఆ వస్తువు గురించి ఏమీ అర్ధం కాదు. సరయిన దూరంలో చూస్తేనే అర్ధమవుతుంది. అలాగే మన గురించి మన పక్క రాష్ట్రాల వారి అభిప్రాయం తెలుసుకోవటానికి ప్రయంత్నం చేస్తే సరయిన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గురించి ఇతర రాష్ట్రాల ప్రజలు ఏమనుకుంటారు ? అని గూగుల్ లో వెతికితే ఈ క్రింది సమాధానాలు వచ్చాయి.
1. కష్ట పడి పని చేస్తారు.
2. ఆడంబరాలకి పోయేవారు.
3. విలాసంగా బ్రతకటానికి ఇష్టపడేవారు.
4. స్నేహ శీలురు.
5. గొప్పలు చెప్పుకుంటారు.
6. సినిమాలని ఎక్కువగా ఇష్టపడేవారు.
7. డబ్బు మనుషులు.
8. జిత్తుల మారి ఆలోచనలు కలిగిన వారు.
9. అనవసరపు పోటీతత్వం కలిగిన వాళ్ళు.
10. భావోద్వేగాలు లేని వారు.
11. దక్షిణ భారత బిహారీలు.
12. అమెరికా మీద మోజు ఎక్కువ.
13. ఎక్కువ వరకట్నం తీసుకునేవాళ్ళు.
ఆంధ్రులు ఎప్పుడూ తమలో తాము పోట్లాడుకుంటారు. కానీ బయటివారి ఆధిపత్యం కింద పనిచేయటానికి మాత్రం ఇష్టపడతారు. యజమానులు కూడా సొంత ఆలోచనా విధానం లేకుండా కేవలం తమకి అనుగుణంగా ఉండి తమని అనుకరించే బానిసలే కావాలనుకుంటారు. ఈ విధమయిన స్వార్ధ పూరిత బానిస మనస్తత్వం వల్లనే మనం సాఫ్టువేరు ఉద్యోగాలలో ముందు వరసలో ఉండగలిగాము. మనం ఎవరితోనూ ధైర్యం గా పోరాడలేము, కేవలం కీలు బొమ్మలుగాను సొంత లాభం కోసం రాజీ పడే వాళ్ళు గాను ఉంటాము. ఆంధ్రులు అనైక్యతకి పెట్టింది పేరు. మిగిలిన రాష్ట్రాల వారు తమలో తాము ఎంత పోట్లాడుకున్నా తమ రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో మాత్రం కలిసి కట్టుగా ఉంటారు. మనం మాత్రం ఇందుకు విరుధ్ధం. కులతత్వం ఉన్నంత కాలం ఆంధ్ర దేశంలో అప నమ్మకం ఉంటుంది. అప నమ్మకం ఉన్నంత కాలం అభివృధ్ధి తో పాటు సొంత వ్యక్తిత్వం కూడా ఉండదు. ఆ రకంగా చూస్తే మన పక్క రాష్ట్రాల తో పోల్చుకుంటే మనం ఇంకా పూర్తి పరిణతి చెందిన ఆలోచన కలిగిన నాగరికులుగా తయారు కాలేదనే చెప్పాలి.
సొంత వ్యక్తిత్వం లేని వారికి సొంత భాష కూడా అవసరం లేదు. అందుకే ఒకప్పుడు 40 ఏళ్ళ క్రితం దేశం లో హిందీ తర్వాత రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4 వ స్థానానికి పడిపోయింది.
ఒక సమాజాన్ని నాశనం చేయాలంటే ఆ సమాజం యొక్క ఉజ్వలమయిన చరిత్రని వారికి దూరం చెయ్యాలి అనేది సామ్రాజ్యవాదుల మొదటి సూత్రం. భాషని దూరం చెయ్యటం అందులో మొదటి అడుగు అయితే సొంత భాషలో ప్రాధమిక విద్యని దూరం చెయ్యటం, భాషని దూరం చెయ్యటంలో మొదటి అడుగు. దురద్రుష్టవశాత్తు సామ్రాజ్య వాద బ్రిటీషు ప్రభుత్వానికి చెందిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషకి ఎనలేని కృషి చేస్తే మనం మాత్రం తెలుగు భాషని నిర్లక్ష్యం చేస్తున్నాం. మాకు మా తల్లి భాష అవసరం లేదు అని చెప్పగలిగిన జాతి బహుశా ప్రపంచం మొత్తం మీద ఆంధ్ర జాతి మాత్రమే అయి ఉండాలి. కంచె ఐలయ్య లాంటి దళిత బహుజన మేధావులు కూడా ఇంగ్లీషు మీడియం ని సమర్ధించటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక రకంగా ఆయనే వ్యతిరేకించిన అగ్రవర్ణ సంస్కృత ఆధిపత్యం స్థానంలో ఇంగ్లీషు ఆధిపత్యాన్ని అంగీకరించటమే అవుతుంది గానీ దళిత బహుజనుల సొంత వ్యక్తిత్వాన్ని కాపాడినట్టు కాదు. నిజానికి అచ్చమయిన, స్వఛ్ఛమయిన తెలుగు పదాలు దళిత కవుల సాహిత్యంలోనే కనపడతాయి. సంస్కృతి, భాష ఒకదాని మీద ఒకటి ఆధారపడేవి. సంస్కృతిని కోల్పోవటం భాష ని కోల్పోవటానికి కారణమవుతుంది. భాషని కోల్ఫొవటం సంస్కృతిని కోల్పోవటానికి కారణమవుతుంది.
విద్య యొక్క మొదటి లక్ష్యం అక్షర జ్ఞానంతో పాటు విద్యార్ధి తన చుట్టూ ఉన్న పరిస్థితులని, సమాజాన్ని అర్ధం చేసుకొనేలా చెయ్యటం. ముఖ్యంగా ప్రాధమిక విద్య లక్ష్యం ఇదే. ప్రాధమిక విద్య బతుకుతెరువుకోసమో, డబ్బు సంపాదించటం కోసమో కాదు. ఆ రకంగా చూస్తే ప్రాధమిక విద్య తల్లి భాషలో జరగటమే న్యాయం. ఎందుకంటే ఒక స్థానిక సమజం లో బ్రతికే వ్యక్తికి తన సొంత భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించిన అవగాహన చాల అవసరం. ఇంగ్లీషు మాధ్యమంలో విద్య ఇలాంటి అవకాశాన్ని దూరం చేస్తుంది. ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించవలసిన ఉన్నత విద్య మాత్రమే ఉద్యోగం కోసం. ఆంధ్రుల అసలు సమస్య ఇంగ్లీషు రాకపోవటం కాదు. ఇంగ్లీషు ఉన్నత నాగరికుల భాష, దానిని మనం తప్పని సరిగా నేర్చుకోవాలి. లేకపోతే ఎవరూ మనలని గౌరవించరు అన్న బానిస మనస్తత్వపు ఒత్తిడే ఇక్కడ సమస్య. ఈ విధమయిన ఒత్తిడి తమిళ, కన్నడ, మళయాళీ ప్రజలకి ఉండదు. అది వారికి చాల మామూలు విషయం. అందుకే దక్షిణ భారత దేశంలో మిగిలిన వారితో పోలిస్తే ఆంధ్రులు మాట్లాడే ఇంగ్లీషు అత్యంత పేలవంగా ఉంటుంది. ఇంగ్లీషు అంటే ఈ విధమయిన ఆత్మ న్యూనత ఆంధ్రులలో కొన్ని తరాలుగా ఉంది. అది ఇప్పటికీ ఉంది. మన దగ్గర వేలి ముద్ర వేసే వాడు కూడా నీళ్ళని నీళ్ళు అనటానికి బదులుగా వాటర్ అని అనటానికే ఇష్టపడతాడు. కానీ మన ఆలోచనలు మాతృభాషలోనే సాగుతాయి. పరాయి భాషలో వాటిని కేవలం అనువదించుకుని పైకి మాట్లాడతాము. మనకి ఒక విషయం మీద పూర్తి పరిజ్ఞానం ఉంటే దానిని వ్యక్త పరచటానికి ఏ భాష అయినా ఒక్కటే. అసలు సమస్య మనకి విషయ పరిజ్ఞానం లేకపోవటం, విషయాన్ని సరిగ్గా బోధించగల అధ్యాపకుల కొరత మాత్రమే కానీ భాష కాదు. మనకి ఆత్మ విశ్వాసం విషయ పరిజ్ఞానం వల్ల వస్తుంది కానీ అది లేకుండా ఊరికే ఇంగ్లీషు నేర్చుకోవటం వల్ల కాదు. ఊరికే ఇంగ్లీషు నేర్చుకోవటం కాల్ సెంటర్ ఉద్యోగాలకి పనికి వస్తుంది కానీ సాంకేతిక ఉద్యోగాలలో కాదు. ఇంటర్లో బైపిసి తీసుకుంటే చాలు డాక్టరు అయిపోతాడనుకోవటం ఎంత అమాయకత్వమో, ఇంగ్లీషు మీడియంలో చదివితే జీవితం లో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోతాడనుకోవటం కూడా అంతే అమాయకత్వం.
తెలుగు మాధ్యమం లో ఒకప్పుడు భౌతిక, రసాయన, గణిత శాస్త్రాలు చదుకోవటానికి కూడా విలువయిన తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. వాటిలో ఊరికే ఫార్ములా లు ఇవ్వటం కన్నా ముందు, ఆయా సూత్రాలు దైనందిన జీవితం లో ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎందుకు కనుగొనవలసి వచ్చిందో వివరించే విధానం ఎక్కువగా ఉండేది. దీని వల్ల ఆ విషయం మీద ఆసక్తి పెరిగేది. ఉదాహరణకి ఒక ఎత్తయిన భవనం పొడవు ఆ భవనం ఎక్కవలసిన అవసరం లేకుండానే కనుక్కోవటానికి త్రికోణమితి సూత్రాలు ఎలా ఉపయోగపడతాయి? ఒకప్పుడు భారత దేశంలో యజ్ఞ గుండాల నిర్మాణంలో త్రికోణమితిని విరివిగా ఉపయోగించేవారు లాంటి విషయాలతోపాటు, ఒక రావి ఆకు వైశాల్యం ఖచ్చితంగా కనుక్కోవటానికి ఏకీకరణ(ఇంటిగ్రేషన్) ఎలా ఉపయోగపడుతుందో లాంటి విషయాలు సరళంగా అర్ధం అయ్యేలా వివరింపబడి ఉండేవి. కాంతి వేగం కనుక్కోవటానికి మొదట గెలీలియో రెండు కొండ శిఖరాల మీద దీపపు లాంతర్లు, గడియారం ఉపయోగించి ఎలా ప్రయత్నించాడో ఒక కధలా వివరించారు. ఈ విధమయిన విధానం వల్ల విద్యార్ధికి శాస్త్ర సంబంధమయిన విషయాల మీద ఆసక్తి పెరిగి సొంతంగా ప్రయోగాలు చెయ్యటానికి ఉత్సాహం వస్తుంది. అలా కాకుండా ఏమీ అర్ధం కాకుండానే ఊరికే ఇంగ్లీషులో ఫార్ములాలు బట్టీ పట్టించి 100 కి 99 మార్కులు వెయ్యటం అనేది సృజనాత్మకత లేని, అనుకరించ గలిగిన బానిసలను మాత్రమే తయారు చేస్తుంది.
ప్రస్తుత సాంకేతిక యుగంలో భాషాపరమయిన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఎవరు ఏ భాషలో మాట్లాడినా తమకి కావాలసిన భాషలోకి అప్పటికప్పుడు అనువాదం అయ్యే సాంకేతికత ఇప్పటికే ప్రవేశించింది. ముందు ముందు ఇంగ్లీషు నేర్చుకోవలసిన అవసరం అస్సలు ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో ఇప్పటికే తెలుగు వినియోగం బాగా పెరిగింది. ప్రస్తుత సాంకేతిక పరిస్థితులు నిజానికి ప్రాంతీయ భాషలకి ఎక్కువ మేలు చేస్తున్నాయి. ప్రయివేటు బడులలో కూడా నిర్బంధ తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టగలిగిన అనుకూలతలు ఇప్పుడు ఉన్నాయి. ఈ రోజుల్లో పిల్లలకి మాతృ భాషని తల్లిదండ్రులకన్నా ఖుషి టివి లాంటి కార్టూన్ చానళ్ళే ఎక్కువగా నేర్పుతున్నాయి. ఇటువంటి అనుకూల పరిస్థితులలో మనం మన తల్లి భాష ని పక్కన పెట్టటం అనేది అనాలోచిత తొందరపాటు నిర్ణయమే అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మన తెలుగుని మరిచిపోతే మన పుస్తకాలు, అందులోని విజ్ఞానం, సాహిత్యం మరుగునపడి మనకంటూ సొంత అస్థిత్వం లేని ఒక సంచార జాతిగా మిగిలిపోతాము. ఇప్పటికే ఈ విషయంలో సంస్కృతం ని ఉదాహరణగా చూశాము. ఇప్పుడు తెలుగు భాషని అశ్రధ్ధ చేసి, తర్వాత మేలుకుని తప్పు దిద్దుకోవటానికి తాపత్రయపడటంకన్నా ఇప్పుడే తగిన చర్యలు తీసుకోవటం మంచిది. విషయ పరిజ్ఞానం అనేది సొంత భాషలోను, ఇంగ్లీషులోను ప్రావీణ్యం సంపాదించి ఆ రెండు భాషలలోని పుస్తకాలని విరివిగా చదవటం వల్ల, లేదా సొంత భాషలో ప్రావీణ్యం సంపాదించి ఆ భాషలోని, ఆ భాషలోకి అనువదింపబడ్డ పుస్తకాలని విరివిగా చదవటం వల్ల మాత్రమే వస్తుంది కానీ, సగం సగం సొంత భాష, సగం సగం ఇంగ్లీషు నేర్చుకోవటం వల్ల రాదు.
తెలుగు అభివృధ్దికి సూచనలు.
1. మనం కోల్పోయిన సరళమయిన తెలుగు పదాల పదకోశ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలి.
2. అనవసరపు ఇంగ్లీషు పదాల బదులు ఈ పదాలను పత్రికలు, సినిమాలు, టీవీ కార్యక్రమాలు, వార్తా చానళ్ళలో ఉపయోగించే విధంగా ప్రోత్సహించాలి.
3. అన్ని శాస్త్ర సంబంధ విషయాలను తెలుగులో సులువుగా అర్ధం చేసుకునే విధమయిన పాఠ్య పుస్తకాలు రాయాలి. నిజానికి ఈ ప్రయత్నం తెలుగు అకాడమీ ఎప్పుడో చేసింది. విజ్ఞాన్, నారాయణ, చైతన్య రాక ముందు అన్ని శాస్త్రాల పుస్తకాలు తెలుగులోనే ఉన్నాయి. మనం చెయ్యవలసినదల్లా వాటిని బయటకి తీసుకురావటమే.
4. ప్రతిరోజూ ఉపయోగించే తెలుగులో, ఇంగ్లీషు పదాల ప్రయోగాన్ని అవసరమయిన వరకు తగ్గించాలి. ఉదాహరణకి : అంకెలు, వారాలు, కూరగాయలు, బంధుత్వపు వరుసలు.
5. గత పది సంవత్సరాలలో అవసరం లేకపోయినా ఇంగ్లీషు వ్యామోహం వల్ల మనం కోల్పోయిన తెలుగు పదాలని తిరిగి పునరుధ్ధరించాలి.
6. తెలుగు వికీపీడియాని అభివృధ్ధి చేసి దానికి విస్తృత వ్యాప్తి కలిగించాలి.
7. ఆంథ్రుల ఐక్యత ని తెలియ చేసే విధంగా కర్నాటక లో మాదిరి ఒక జండాని రూపొందించాలి.
8. తమ పిల్లలు రోజు వారీ జీవితం లో సాధ్యమయినన్ని ఎక్కువ తెలుగు పదాలు ఉపయోగించేలా తల్లి దండ్రులు ప్రోత్సహించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు నామోషీగా భావించకూడదు.
తెలుగు భాష సరస్వతి దేవి లాంటిది, ఇంగ్లీషు భాష లక్ష్మి దేవి లాంటిది. తెలుగువారందరికీ ఇంగ్లీషు చదవటం, రాయటం, మాట్లాడటం వస్తే మంచిదే. కాని తెలుగు అవసరం అంతకు మించినది.
మంచి వ్యాసం. అభినందనలు.
ReplyDeleteథన్యవాదాలు శ్యామలీయం గారు.
Deleteఆంధ్ర ప్రజల మనస్తత్వాన్ని తెలుగు భాష ప్రస్తుత పరిస్తితి గురించి చక్కటి విశ్లేషణ చేశారు గోపి గారు.
ReplyDeleteమీరు చేసిన సూచనలు కూడా బాగున్నాయి. ఈ వ్యాసం ఎక్కువమందికి చేరాలి.
థన్యవాదాలండీ
ReplyDelete"తెలుగు భాష సరస్వతి దేవి లాంటిది, ఇంగ్లీషు భాష లక్ష్మి దేవి లాంటిది. ఇందులో ఎవరిని కోరుకుంటే వివేకమో మనమే నిర్ణయించుకోవాలి"
ReplyDeleteఈ పరస్పర విరుద్ధ ప్రత్యామ్నాయ ప్రకటీకరణ వాస్తవమే అయితే ఇందులో ఎంచుకోవడానికంటూ ఏమీ లేదు. ఈ ఫార్ములా ప్రకారం అర్ధాకలితో అలమటిస్తూ పూటకు రెండు మెతుకులు దొరకడమే మహద్భాగ్యంగా భావించే బీదాబిక్కీ అందరూ ఇంగిలీషు వైపే మొగ్గు చూపాల్సిందే.
అయితే సదరు సరస్వతి వెర్సిస్ లక్ష్మి డయలెక్టిక్ ఎంతవరకు సబబు? తిండి పెట్టే చదువులు ఉంటే సరస్వతీ కటాక్షంతో పాటు లక్ష్మీ ప్రసన్నం కుదరదా అన్న ప్రశ్నపై దృష్టి సారిస్తే మంచిదని నా అభిప్రాయం.
కాళోజీ నారాయణ రావు అన్నట్టు "బడిపలుకుల చదువు కాదు, పలుకుబడుల చదువు రావాలి".
మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు జై గారు.
Deleteనేను ఆంధ్రుడిని కాను. ఇప్పుడు రాస్తున్న వ్యాఖ్య కొందరు ఆంధ్రులకు రుచించకపోవొచ్చునని అనిపించినా ధైర్యం చేసి రాస్తున్నాను. నేను రాసింది తప్పయితే క్షమించమని మనవి.
ReplyDeleteఆంధ్రుల గురించి ఇతరుల అభిప్రాయం అంటూ కొన్ని నెగిటివ్ పాయింట్లు రాసారు. అట్లాగే కులాల కుంపట్లు, భట్టీ చదువులు, రాజకీయ తగవులు లాంటి కొన్ని విషయాలు కూడా ప్రస్తావించారు.
నాకు తెలిసి ఈ విషయాలు బహుళాంధ్ర ప్రజానీకానికి వర్తించవు. కొంతమంది అందలం ఎక్కికూచున్న ఆంధ్రులకు, అదీ కొంతమేరకు మాత్రమే, ఇటువంటివి ఉన్నాయేమో కానీ వారినే ప్రతినిధులుగా భావించడం సబబు కాదు. ముఖ్యంగా రాష్ట్రం ఆవల నివసించే ఆంధ్రులు యావత్ రాష్ట్రానికి అద్దం పడతారని నేను అనుకోను.
మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు జై గారు.
Deleteమిత్రులు జై గారు,
Deleteమీమాటలు "ముఖ్యంగా రాష్ట్రం ఆవల నివసించే ఆంధ్రులు యావత్ రాష్ట్రానికి అద్దం పడతారని నేను అనుకోను." కొంచెం గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు ఆంధ్రరాష్ట్రానికి ఎంతగా వర్తిస్తాయో మీ ప్రియతమ తెలంగాణాతో సహా మిగిలిన రాష్ట్రాలకూ అంతే వర్తిస్తాయి. ఒకవేళ అవసరం ఐతే మీకు గుర్తు చేయవలసి ఉంటుంది. అవసరం ఐతేనే లెండి.
పెద్దలు శ్యామలీయం మాస్టారూ, మీరు చెప్పింది కరెక్టే. జనం నాడి తెలుసుకోకుండా తమ సొంత ఉద్దేశ్యాలను (లేదా ప్రయోజనాలను) యావత్ రాష్ట్రానికి ఆపాదించే వ్యక్తులు ప్రతిచోటా ఉన్నారు, మున్ముందు కూడా ఉంటారు.
Deleteనేను ఒక్కడినే ఎల్లప్పుడూ లోకవాణిని సరిగ్గా పసిగట్టగలనుకునే ధీమా (అహంకారం) నాకు లేదు. నాకంటే మెరుగ్గా ప్రజలను ప్రతిబింబించే వారెందరో ఉన్నారని ఒప్పుకోవడంలో నేనే ముందుంటాను. నా అంచనా ఎప్పుడు తప్పయితే అప్పుడు విమర్శలకు & సవరణలకు పూర్తిగా స్వాగతం.
మనమే గుర్తు పెట్టుకుందాం శ్యామలరావు గారూ, for future use ☝️.
ReplyDelete