Thursday, March 19, 2020

ఈ పోస్టుకి, కరోనా వైరస్ కి సంబంధం ఉంది.


                 అప్పటి వరకు ఎవరూ ఆలోచించనంత కొత్తగా ఆలోచించి, లేదా వారికే సొంతమయిన ప్రత్యేక ప్రతిభతో ఒక పని మొదలుపెట్టి, చిత్త శుద్దితో పూర్తి చేసేవాళ్ళు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు. అయితే వారిలో ప్రచారానికి దూరంగా, అజ్ఞాతంగా తమ పని తాము పూర్తిచేసేవాళ్ళే ఎక్కువ. భవిష్యత్తులో జరగబోయే ఒక ఉజ్వలమయిన మార్పుకు వీరిది మొదటి అడుగు అవుతుంది. వీరిని మూల పురుషులు అనవచ్చు. సామాన్యంగా ఈ మూల కారకులు తమ శక్తి సామర్ధ్యాలు, జీవిత కాలం, తమ ఆలోచనలు, పని లోని మెళకువలు మరింత మెరుగు పరుచుకోవటానికి వినియోగిస్తారు. ప్రచార ఆర్భాటాల గురించిన స్పృహ, సమయం ఉండదు. కానీ ఇలాంటి ప్రత్యేక ప్రతిభ ఉన్నవాళ్ళని గమనిస్తూ వారికి దగ్గరగా ఉండే వాళ్ళు మరి కొంత మంది ఉంటారు. వీరికి సొంత ప్రతిభ ఉండదు. కానీ మేనేజ్ మెంట్ ప్రతిభ, వాక్చాతుర్యం, ప్రచారం చేసుకునే నేర్పు ఉంటాయి. వీరిని అనుచరులు అనవచ్చు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో మూల కారకులు మరియు వారి విజయాల గురించి, వారి చుట్టూ ఉన్న వారికి లేదా వారి కుటుంబ సభ్యులు కి మాత్రమే తెలుస్తాయి. ఈ విజయాన్ని క్యాష్ చేసుకోవటం ఈ అనుచరుల వంతు అవుతుంది. వీరు అతి త్వరలోనే ప్రపంచం మాట్లాడుకునేటంత ప్రసిధ్ధిలవుతారు. ఈ రోజు మనం చెప్పుకునే అత్యంత విజయవంతమయిన వారు ఈ కోవలోకే వస్తారు. దీనికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. తమిళనాడులో పెరియార్ రామస్వామి, అన్నా దురైలు ద్రవిడ ఉద్యమ పితామహులు. ఈ సిధ్ధాంత పునాదుల మీదే కరుణా నిధి, ఎంజీయార్లు తమ తమ పార్టీల ద్వారా ముఖ్య మంత్రులు కాగలిగారు. ఇప్పటికీ ఈ పార్టీలదే అక్కడ ఆధిక్యత. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్టీయార్ స్థాపించిన టీడీపి ద్వారానే ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు అతి ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇదే పరిశీలన తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ చరిత్రకి, ఈ ఉద్యమం ద్వారా అధికారంలోకి రాగలిగిన కేసీయార్ కి, ఆప్ పార్టీ ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కెజ్రీవాల్ మరియు అతని మార్గదర్శకుడు, సామాజిక వేత్త అన్నా హజారే కి వర్తిస్తుంది. ఆ తర్వాత ఈ అనుచరుల ద్వారా ప్రభావితమయ్యేవారు లక్షలు, కోట్లలో ఉంటారు. అయితే ఇది రాజకీయాలకి మాత్రమే కాదు. వ్యాపార విజయాలకి కూడా వర్తిస్తుంది. వ్యాపార సామ్రాజ్యంలో ధీరుభాయ్ అంబాని నాటిన విత్తనం ఆయన కొడుకులు ముఖేష్ అంబాని, అనిల్ అంబాని ద్వారా ఎలా విస్తరించిందో మనందరికీ తెలుసు. ఇలా చూస్తే చిరంజీవి ద్వారా పరిచయమయిన పవన్ కల్యాణ్ కి ముందు ముందు రాజకీయ పరంగా మంచి అవకాశాలు ఉండొచ్చు. అయితే దీనికి కలిసొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన సామర్ధ్యం కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పరిశీలన మానవ నాగరికత అభివృధ్ధి క్రమానికి కూడా వర్తిస్తుంది. ఆది మానవుడు మొదట ఆఫ్రికా ఖండంలో అవతరించాడు. తర్వాత ఆసియా, యూరప్, అమెరికా ఖండాలకి మానవ జాతి విస్తరించింది. కానీ, ఆఫ్రికా మిగిలిన వారితో పోలిస్తే ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నట్టు.













ఆఫ్రికా ఖండం నుంచి మానవ జాతి విస్తరణ
Image Courtesy : Sapiens - A Brief History of Humankind.

                 ఇంకా క్లుప్తం గా చెప్పాలంటే ఒక దృగ్విషయం యొక్క మూల కారణం/మూల కారకం/మూల కారకులు ఎప్పుడూ నిశ్శబ్దంగా అజ్ఞాతంగానే ఉంటాయి/ఉంటారు. వాటి విస్తరణ మాత్రం ప్రభంజనమవుతుంది. కానీ ఇది కూడా ప్రకృతి మరియు జీవుల సహజ క్రమాన్ని సూచించే Bell Curve లాంటిదే. వీటి పని అయిపోయాక ఎక్కడో ఒక చోట వీటి ప్రభావం అంతమవక తప్పదు.












ప్రస్తుతం కరోన వైరస్ దాని జన్మ స్థానమయిన చైనా లో తగ్గుముఖం పట్టింది. కానీ ప్రపంచం మొత్తం చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదానికి, దీనికి ఏమయినా సంబంధం ఉందేమో చూడాలి.

No comments:

Post a Comment