Thursday, February 28, 2013

స్వాములోరి పాము

               మా ఊరికి సరిగ్గా రెండు కిలో మీటర్ల దూరం లో ఉండే కొత్తపల్లి లో కూడా మా ఊరికి మల్లే రామాలయం ఉంది. మా ఊళ్ళో రామాలయం లో పూజారులు ఎవరూ ఉండే వారు కాదు, ధ్వజ స్థంభం కూడా లేదు. ధ్వజ స్థంభం లేకపోతే ఊరికి అరిష్టమని ఓ సారి పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను.కొత్తపల్లి లో ఉండే రామాలయం లో ధ్వజస్థంభం ఉండేది గానీ పూజారులు ఎవరూ ఉండే వారుకాదు.ఎప్పుడయినా పండక్కో, పబ్బానికో మాత్రం గుడికి దగ్గరలో పెంకుటింట్లో ఉండే నారాయణ స్వామి గారు గుళ్ళో దీపం వెలిగించి, తీర్థం ఇచ్చే వారు. ఓ సారి వైకుంఠ ఏకాదశి నాడు నారాయణ స్వామి గారు తెల్లవారు ఝామునే లేచి ఇంటెనకాల ఆవులు, గేదులు ఉండే పాక లో పాల తెపాల తో నీళ్ళు తీసుకెళ్ళి ఆవు పొదుగు శుభ్రం గా కడిగి  పాలు తియ్యబోతుంటే పక్కనే వీధి దీపం వెలుగులో ఏదో తెల్లగా మెరుస్తుంటే దగ్గరికెళ్ళి చేతిలోకి తీసుకోబోయి అదిరిపడి, భయపడి వెనక్కి పెరుగెట్టారు.ఇంత పెద్ద గోధుమ త్రాచు పాము లుంగ చుట్టుకుని పడుకుని ఉందక్కడ.
                    
                   గబగబా ఇంట్లోకెళ్ళి భార్యనీ, కోడుకునీ, అందరినీ పిలుచుకొచ్చి ఎటూ కదలకుండా అక్కడే పడుకున్న తాచు పాముని చూపించారు.దాని చూసి నారాయణ స్వామి గారి కొడుకు పెద్ద కర్ర తీసుకొచ్చి చంప బోతే వాళ్ళమ్మ గారు పండగ పూట సాక్షత్తూ ఆ విష్ణు మూర్తి పవళించే ఆది శేషుని అవతారమయిన సర్పాన్ని చంపకూడద నీ, కాస్సేపుంటే అదే పొలాల్లోకెళ్ళిపోతుందనీ చెపితే దాన్ని అలాగే వదిలేశారు.

                                 సూర్యోదయమయ్యాక మళ్ళీ అక్కడికెళ్ళి చూస్తే ఇంకా ఆ పాము అక్కడే ఉంది గానీ ఎటూ కదల్లేదు.ఈ లోగా ఇరుగు పొరుగు ఇళ్ళల్లో జనం కూడా వచ్చి చూస్తే పాము ఒక్క సారి తల పైకెత్తి పడగ విప్పి మళ్ళీ యధా స్థానం లో పడుకుండి పోయింది. పాము నెత్తి మీద శ్రీ కృష్ణ పాదాలు చూసిన జనం ఈ పాము సాక్షాత్తూ నాగ దేవత అవతారమని పసుపు, కుంకుమ, అగరొత్తులు తీసుకొచ్చి పూజ చేసి దణ్ణం పెట్టుకుని వెళ్ళి పోయారు. నారాయణ స్వామి గారి పాకలో పాము గురించి ఆ ఊళ్ళో అయిదో తరగతి దాకా ఉండే బళ్ళో పిల్లలందరికీ తెలిసి పోయి మధ్యాహ్నం భోజనం బెల్లు కొట్టి నప్పుడు బిల బిలా అని వచ్చి అంత పెద్ద పాముని చూసి విచిత్రం గా చెప్పుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ విషయం ఊరంతా తెలిసి పోయి జనాలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చూసి దణ్ణం పెట్టుకుని అరటి పళ్ళు, కొబ్బరి కాయలు, పాలు, గుడ్లు నైవేద్యం పెట్టి వెళ్ళిపోయే వారు.  ఆ తర్వాత కూడా ఆ పాము ఎటూ కదలకుండా అక్కడే ఉంటే నారయణ స్వామి గారికి పామంటే భయం పోయి భక్తి మొదలయ్యింది. ఆ నాగ దేవతే తమ ఇంటి దగ్గర వెలిసిందని భక్తి తో పూజ చేసి దాని దగ్గరే కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలిచ్చేవారు. ఈ విషయం అర్ధవరం లో ఉండే సిధ్ధాంతి గారికి తెలిసి వచ్చి చుట్టుపక్కలంతా పరిశీలించి ఇదంతా ఈ స్థలం మహిమే అని, అందుకే ఈ సర్పం ఇక్కడికొచ్చి స్థిర పడిందనీ, అక్కడికి దగ్గరలో ఎప్పటి నుంచో ఉన్న రెండు తలల  తాడి చెట్టుని చూపించి ఈ విచిత్రమయిన చెట్టు ఇక్కడ ఉండటానికి కారణం కూడ అదే అని చెప్పారు.
                            
                            ఆ తర్వాత నుంచీ పాము అక్కడక్కడే తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి లుంగ చుట్టుకుని పడుకుండిపోయేది.నారాయణ స్వామి గారు భక్తులందరికీ ప్రసాదాలిచ్చి , పాముకి నైవేద్యం పెట్టి అప్పుడప్పుడూ దాన్ని చేతితో ముట్టుకున్నా కూడా ఏమీ అనేది కాదు. తర్వాత నుంచీ ఆ ఒక్క కొత్త పల్లి జనమే కాకుండా మా ఊరు లాంటి చుట్టుపక్కల ఊళ్ళ జనం కూడా తండోప తండాలుగా వచ్చి దర్శించుకుని కోరికలు తీర్చమని మొక్కుకునేవారు. అలా వెళ్ళిన చాలా మందికి కోరికలు తీరాక మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకునేవాళ్ళు. జనం ఎక్కువయిపోవటం తో ఆ ఊరు తీర్థ క్షేత్రం లాగా అయిపోయింది. అక్కడికి దగ్గర్లోనే పొలాల మధ్యలో సోడా కొట్లు, బడ్డీ కొట్లు, పిల్లల బొమ్మలమ్ముకునే కొట్లూ వచ్చేసి రకరకాల బొమ్మలు అమ్మటం మొదలెట్టేరు. చిన్న పిల్లలు గాలి బొంగరాలు కొనుక్కుని అటూ ఇటూ పరుగెట్టే వాళ్ళు. పరిమిళ్ళ నుంచొచ్చే జీళ్ళ గంగయ్య ఒక స్థంభం పాతి దాని మేకుకి జీళ్ళ పాకమేసి లాగి , నువ్వులేసి చేసిన వేడి వేడి జీళ్ళు అమ్మేవాడు. చిట్టెమ్మ పుణుకులమ్మేది. మధ్యాహనం ఎండలో పడి వచ్చినోళ్ళు సోడా సుందరయ్య దగ్గర నిమ్మ సోడాలు, గోల్డుస్పాట్ రంగు నీళ్ళు తాగే వాళ్ళు. ఓ సారి మా ఊరి నుంచెళ్ళిన వెంకట రత్నం గారి చిన్నోడు తప్పిపోయి ఏడుస్తుంటే మైకు సెట్టు దగ్గరికి తీసుకెళ్ళి చెప్పిస్తే వాళ్ళమ్మా, నాన్నా గబగబా వచ్చి తీసుకెళ్ళారు.

                               పుట్టు గుడ్డి అయినా గానీ హార్మోనియం వాయించటం లో చాలా గొప్పాయన అని అందరూ చెప్పుకునే కేశవయ్య గారిని తీసుకొచ్చి ఓ రోజు భజన కార్యక్రమం పెట్టించి పాటలు పాడించారు. తర్వాత రోజు నుంచీ చుట్టు పక్కల ఊళ్ళళ్ళో ఉండే ధాన్యం వ్యాపారులు, పొగాకు వ్యాపారులు కలిసి చందాలేసుకుని రాత్రిళ్ళు "పున్నమి నాగు", "వేట గాడు" లాంటి వీధి సినిమాలేసారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాజ కీయాల్లో తిరిగే ముగ్గుళ్ళ పెద్దబ్బులు గారు వచ్చి దర్శనం చేసుకుని ఆ తర్వాత రోజునుంచీ వచ్చిన భక్తులందరికీ అన్న దానం చేయ్యమని రోజుకి మూడు బస్తాల బియ్యం పంపేవారు.అమెరికా వెళ్ళొచ్చిన అర్ధవరం పెద్ది రాజు గారు అవసరమయితే విరాళాలు పోగు చేసి గుడి కట్టిస్తానని మాటిచ్చి,  ఆయన దగ్గరి బంధువు,  మా నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన బాపి రాజు గారితో మాట్లాడి ఆ ఊరికి రోడ్డు, బస్సు సౌకర్యం వచ్చేలా చేస్తానని చెప్పారు.

                  కొత్తపల్లికి బస్సు రావాలంటే మా ఊరి మీద నుంచే రావాలి కాబట్టి మా ఊరి మధ్య లోంచి పెద్ద రోడ్డు పడి, బస్సు తిరగటం మొదలెట్టాక ఊరి దశ తిరిగిపోద్దని చెప్పునేవాళ్ళు మా ఊరి జనం.

                         ఇంకో రెండు మూడు రోజుల్లో బస్సు, రోడ్డు శాంక్షను చేసేసినట్టు గవర్నమెంటు ఆర్డరు వచ్చేస్తుందని అందరూ అనుకునే సమయానికి,  పాము నారాయణ స్వామి గారిని కాటేసి ఆయన చచ్చి పోతే, పాము కూడా ఎటో వెళ్ళి పోయింది. కొన్ని రోజులకి నారాయణ స్వామి గారినీ, పామునీ, రెండు తలల  తాడి చెట్టునీ అందరూ మర్చి పోయి మామూలుగా మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయారు.

No comments:

Post a Comment