Sunday, November 17, 2013

బ్లూమూన్ బిర్యాని

                     పంట కాలవ దగ్గర ఒంటి కాలి మీద నించున్న కొల్లేటి కొంగ, చూసి చూసి చేప పిల్లని పట్టుకుని గుటుక్కున మింగినట్టు జనవరి నెల ఉదయపు చలిని ఉన్నట్టుండి,  పొద్దెక్కిన సూర్యుడు ఆక్రమించుకున్నాడు. మా ఊరికి దగ్గరలో ఉన్న ఏకైక కాలేజీ,  గణపవరం చింతలపాటి మూర్తి రాజు గారి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో,  మేమందరం 'బహు తిక్క శాస్త్రం' అని పిలుచుకొనే 'భౌతిక శాస్త్రం' తరగతిలో మా పాండురంగారావు సారు ఎందుకో గానీ ఆ రోజు పాఠం పక్కన పెట్టి బాతా ఖానీ మొదలెట్టారు. ఐఏయస్, ఐపీయస్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకుండా మెల్లిగా ఏదోలాగ బతికెయ్యటానికి సరిపడా ఒక డిగ్రీ ఉంటే చాలురా అనుకుని ఉసూరుమంటూ క్లాసుకొచ్చే మా లాంటి చాలా మందిని ఆ దిశగా ఉత్సాహ పరచటానికి అప్పుడప్పుడూ ఇలాంటి వ్యక్తిత్వ వికాస ఉపన్యాసాలు ఇవ్వటం ఆయనకు మామూలే. ఎవరితోనయినా మొహమాటం లేకుండా మాట్లాడే మా వెనక బెంచీ గుంపులో ఉండే గణేష్ గాడయితే "అలాంటివన్నీ నా లాంటి పీత బుర్రలవాళ్ళ వల్ల ఏమవుతుంది సార్" అన్నాడు. దానికి సమాధానంగా "కరెంటు,  ఇంకా బోలెడు కనిపెట్టిన ఎడిసన్ తన ఇంట్లో ఉండే ఒక పెద్ద పిల్లి, ఇంకో చిన్న పిల్లీ అటూ ఇటూ తిరుగుతుంటే అస్తమానూ వాటికోసం తలుపు తీసి , వెయ్య వలసి వస్తుందని తలుపు కింద ఒక పెద్ద కన్నం, ఒక చిన్న కన్నం చేయించాడంట. అంత గొప్ప ఎడిసనే తెలివి తక్కువగా ఆలోచించగా లేనిది మనం ఎంత. అందుకే మన ప్రయత్నం మాత్రం మనం ఎప్పుడూమానకూడదురా గన్నయ్యా" అన్నారు మాష్టారు. ఆయన ఉదాహరణల పారాయణం కొనసాగుతుండగానే క్లాసు అయిపోయింది. తర్వాత తెలుగు క్లాసు. తెలుగంటే చాలా సులువయిన సబ్జక్ట్,  పరీక్షకి ముందు రోజు కూర్చుని చదివినా పాసై పోవచ్చని అప్పటికే మా సీనియర్లు ఉచిత సలహా కూడా ఇవ్వటంతో తరచూ ఆ క్లాసు గైర్హాజరవ్వటం మాకు పొరపాటున అలవాటయిపోయింది. ఆ రోజు కూడా క్లాసు ఎగ్గొట్టి కాలేజీకి దూరంగా ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చుని మా స్నేహితుడు నర్సిపూడి వెంకటరెడ్డి గాడు చెప్పే జోకులు వింటూ నవ్వుకుంటున్నాం. ఇంతలో దగ్గరలో ఉన్న రెండంతస్తుల డాబాలోనుంచి మంచి కోడి బిర్యానీ వాసన ఎగురుకుంటూ వచ్చి మా అందరినీ దాటుకుని ఎటో వెళ్ళిపోయింది. ఆ వాసన తగిలాక మా గణేష్ గాడు "నటరాజు థియేటర్ సెంటర్లో భీమవరం రాజులు కొత్తగా పెట్టిన బ్లూమూన్ హోటల్లో కోడి బిర్యాని కుమ్మేసిందని అందరూ అంటున్నారు. రేపు ఒకసారెళ్ళి సుబ్బరంగా తినేసి రావాలి రా" అన్నాడు. వెంకటరెడ్డి గాడి జోకులతో పాటు వీడి బిర్యాని ఆత్రం కూడా మా అందరికీ తెగ నవ్వు తెప్పించింది.

               ఆ తర్వాత రోజు ఎంఏ ఫిలాసఫీ కూడా చదివేసిన మా గోపాలం సారు,  ఇంగ్లీషు క్లాసులో సీరియస్ గా షేక్స్పియర్ గురించో, వాల్టెయిర్ గురించో, స్పినోజా గురించో కాకుండా ముల్లా నసీరుద్దీన్ హాస్యం గురించి మాట్లాడుతుంటే సైకిల్ తొక్కీ, తొక్కీ చెమటతో పాటు వచ్చి క్లాసులో కూర్చున్న మా ఒళ్ళంతా నవ్వులతో తడిసిపోయింది. క్లాసు అయిపోయి బయటికి వచ్చాక గణేష్ గాడి మొహం మాత్రం తెగులు తగిలిన కొబ్బరి మట్ట లాగా వాడిపోయి ఉంది. వాడి మొహం చూశాక నిన్న బిర్యానీ వాసనలకి సంబంధించిన రసాయనాలు వాడి బుర్రలో ఇంకా ఇంకిపోలేదని అర్ధమయ్యింది. అయినా వాడి అత్యాశ కానీ,  అత్యవసరంగా మా డొక్కు సైకిళ్ళు పంక్చర్ అయితే ఉండాల్సిన మూడు నాలుగు రూపాయలు తప్ప,  ఇప్పటికిప్పుడు బ్లూమూన్ లో దర్జాగా కూర్చుని బిర్యానీ తినాలంటే కావలసిన డబ్బులు మమ్మలనందరినీ కలిపి ఈడ్చి తన్నినా దొరకవు. గణేష్ గాడికయితే అరిగిపోయిన బ్రేకు ముక్కలు పీకి కొత్తవి వెయ్యమంటే సైకిల్ కొట్టు సూరయ్య పది రూపాయలు అడుగుతాడని,  బ్రేకులు కూడా లేకుండా ఎంత స్పీడుగా వెళ్ళే సైకిలయినా కాలికి ఉన్న హవాయి చెప్పులతోనే నేల మీద గట్టిగా నొక్కి పెట్టి మరీ ఆపేయటం అలవాటు. డబ్బులు బాగా అవసరమయిన ఇలాంటి క్లిష్ట సమయాల్లోనూ,  'తొలిప్రేమ' లాంటి సినిమాలొచ్చినప్పుడు కనీసం నేల టిక్కెట్టు డబ్బుల కోసమూ,  గట్టిగా గోకితే మెలికలు తిరిగిపోయి కాస్తో, కూస్తో డబ్బులు ఖర్చు పెట్టే పాతిక ఎకరాలకి ఏకైక వారసుడు పిప్పర శీను గాడు ఆ మధ్యన ఆకతాయిగాళ్ళతో కలిసి పేకాటాకి అలవాటు పడ్డాక,  పేకాటలో డబ్బులు తగలెయ్యకురా అంటే "డబ్బులదేముంది రా కుక్కని కొడితే రాలతాయని" అనేవాడు. కానీ తర్వాత వాడి పేకాట ప్రావీణ్యం గురించీ, డబ్బులు అప్పులిచ్చి ఎగ్గొట్టించుకోవటంలో చెయ్యి తిరిగిన నైపుణ్యం గురించీ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి చదువూ, గిదువూ, కాలేజీ ,గీలేజీ ఏమీ వద్దు ఇంట్లో కూర్చో అంటే కోపగించుకుని దూళ్ళ పాకలో అటక మీద ఉన్న మోనోక్రోటోఫాస్,  చేలో పురుగులకి కూడా ఉంచకుండా సగం పైనే తాగేశాక తణుకు పెద్ద ఆసుపత్రి లో చేర్పిస్తే,  ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కాబట్టి గణేష్ గాడి బిర్యానీ కోరిక తీరే దారులన్నీ ప్రస్తుతానికి మూసుకుపోయాయి. ఈ లోగా పరీక్షల హడావుడి మొదలై వేసవికాలం శెలవులు కూడా వచ్చేశాయి.

                          శెలవుల తర్వాత కాలేజీకి వచ్చిన గణేష్ గాడు చాలా హుషారుగా ఉన్నాడు. వాడి బిర్యానీ కోరిక తీరే రోజు రానే వచ్చిందని మాకు అర్ధమయ్యింది. మా గుంపులో "వీడు చాలా ముదురు" అని అందరూ చెప్పుకునే రాజేష్ గాడయితే "డబ్బులు ఎక్కడ కొట్టుకొచ్చావురా?" అని తిన్నగా విషయం అడిగేస్తే, తన దగ్గర బిర్యానీకి సరిపడా డబ్బులు ఉన్నాయని చెప్పకుండానే మా అందరికీ ఎలా తెలిసిందా అని గణేష్ గాడు ముందు కంగారు పడ్డాడు గానీ,  తర్వాత, వాడి బిర్యానీ ఆత్రం వల్ల దానికి సంబంధించి ఏ విధమయిన భావమూ వాడి మొహం దాచలేకపోతుందని వాడికి వాడే అర్ధం చేసేసుకుని  "శెలవుల్లో మినప చేల కోతలకి పనిలోకెళ్ళి సంపాదించిన డబ్బుల్లో మా నాన్నకి ఇచ్చెయ్యగా మిగిలిన డబ్బులు నలభై రూపాయలు ఉన్నాయి. ఈ రోజు ఎలాగయినా బ్లూమూన్ ని దున్నెయ్యాలి" అన్నాడు. అనుకున్నట్టే ఆ రోజు మధ్యాహ్నం క్లాసు అయిపోగానే భోజన విరామం సమయానికి గణేష్ గాడు సైకిలెక్కి ఒక్క తొక్కు తొక్కితే దెబ్బకి అది వెళ్ళి నటరాజు థియేటర్ సెంటర్లో ఆగింది. కానీ  అక్కడ ఉండాల్సిన బ్లూమూన్ హోటల్ మాయమైపోయి హోటల్ మూసేసి తాళాలేసి ఉన్నాయి. కంగారు పడ్డ గణేష్ గాడు పక్కన ఉన్న వెంకటరత్నం గారి స్వీటు కొట్లో ఆరా తీయగా "మొన్న సంక్రాంతికి జరిగిన కోడి పందాల్లో ఆ హోటల్ యజమాని బాగా డబ్బులు పోగొట్టుకుని ఇంక హోటల్ నడపలేక నిన్న కాక మొన్న హోటల్ ఎత్తేసారని" చెప్పారు. ఉస్సూరుమంటూ మళ్ళీ కాలేజీకొచ్చిన గణేష్ గాడు చివరి పీరియడ్ లో ఐహెచ్ సీ క్లాసులో రామాచారి గారు అన్ని రకాల భారతీయ తత్వ శాస్త్ర సిధ్ధాంతాల గురించీ చెపుతూ చివరిగా "యావజ్జీవేత్ సుఖం జీవేత్. ఋణం కుత్వా ఘృతం పైవేత్. భస్మీ భూతస్య దేహస్య. పునరాగమనం క్రుతా" అని చార్వాకుల తత్వ సూత్రం గురించి కూడా చెపుతూ "అప్పు చేసి అయినా మనకి ఇష్టమయిన నెయ్యితోనే భోజనం చెయ్యాలి. ఎందుకంటే ఆ తర్వాత చనిపోయాక కాలిపోయే ఈ దేహం మళ్ళీ అనుభవిద్దామన్నా తిరిగిరాదు" అని విడమర్చి అర్ధం కూడా చెప్పారు. ఇది విన్న గణేష్ గాడికి అప్పు చెయ్యాల్సిన అవసరం లేక పోయినా తన బిర్యానీ కోరిక తీరనందుకు మనసులో బాధ ఎక్కువైపోయి క్లాసు అయిపోగానే విచారంగా ఇంటికెళ్ళిపోయాడు.

                                మరుపు మానవ సహజం కాబట్టి,  కొన్నాళ్ళకి ఇంక రెండు మూడు రోజుల్లో గణేష్ గాడి బుర్రలోంచి బిర్యానీ కి సంబంధించిన ఆలోచనలన్నీ తుడిచిపెట్టుకుపోయి దాని గురించి మర్చిపోతాడనగా ఒక రోజు సరిపల్లె నుంచి రోజూ  నటరాజు సెంటర్ లోంచే కాలేజీకి వచ్చే అన్నవరం, కాలేజీలో అడుగు పెట్టగానే గణేష్ గాడిని వెతుక్కుని మరీ వెళ్ళి "బ్లూమూన్ హోటల్ మళ్ళీ తెరిచినట్టున్నార్రా"  అని ఉప్పందించాడు.  హోటల్ మళ్ళీ తెరవటం నిజమే కానీ, అదృష్టం ఆలస్యంగా వచ్చినా  దురదృష్టమే అన్నట్టు,  అంతకు రెండు రోజుల ముందే గణేష్ గాడి సైకిల్ ఒకటి కాదు రెండు పంక్చర్లయితే,  పనిలో పనిగా పంక్చర్లతో పాటు డబ్బులు ఊరికే పడున్నాయి కదా అని కొత్త బ్రేకులు కూడా వేయించేసి ఉన్న డబ్బుల్లో ఇరవై రూపాయలు అవగొట్టేశాడు. అయినా మిగిలిన ఇరవై రూపాయలతో సగం బిర్యానీ అయినా వస్తుంది కదా అని బ్లూమూన్ కెళ్ళి కౌంటర్ టేబుల్ మీద ఇరవై రూపాయలూ పెట్టి హాఫ్ బిర్యానీ అనగానే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టు హోటల్ యజమాని కోడి పందాల్లో పోగొట్టుకున్న డబ్బులు కోడి బిర్యానీ తో రాబట్టుకోవాలనూకున్నాడో ఏమో "రేట్లు పెరిగాయి ఇప్పుడు హాఫ్ పాతిక,  ఫుల్ యాభై" అన్న మాటలతోపాటు "దేర్ ఈజ్ నో సిన్సియర్ లవ్ దేన్ ది లవ్ ఆఫ్ ఫుడ్" అన్న బెర్నార్డ్ షా కొటేషన్ రాసి ఉన్న మెను కార్డు గణేష్ గాడి మొహం మీద కొడితే,  ఇరవై రూపాయలూ జేబులో పెట్టేసుకుని కొటేషన్ మాత్రం చదివి నీరుగారిపోయి ఇంటికెళ్ళిపోయాడు. ఆతర్వాత రెండు రోజులకి వాడి నాయనమ్మ కడుపులో మంట అని గొణుగుతుందని ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టరు రవి కుమార్ కి చూపిస్తే రోజూ మాదీఫల రసం తాగితే తగ్గుతుందంటే ముసలి దాని బాధ పడలేక ఉన్న ఇరైవై రూపాయలతో ఆ మందు కొని ఇచ్చేశాడు. ఇంకా కొన్నాళ్ళకి ఒక సారి రోడ్డు మీద కొత్త వంద రూపాయల నోటు ఎవరో పాడేసుకుంటే గణేష్ గాడికి దొరగ్గానే చార్వాకుల తత్వ సిధ్ధాంతం గుర్తొచ్చి ఆ డబ్బులతో బిర్యానీ తినేద్దామనుకున్నాడు గానీ,  చిన్నప్పుడు మాష్టార్ల బలవంతం మీద అందరూ చందాలు వేసుకుని బళ్ళో వేయించుకుని 'బాలరాజు కథ' సినిమా చూసిన రొజే  ఆ సినిమాలో పిల్ల హీరో లాగానే ఎప్పుడూ నిజాయితీ గానే ఉండాలనీ , కష్ట పడకుండా వచ్చిన సొమ్ము ముట్టుకోకూడదని నిర్ణయించేసుకున్నాడు కాబట్టీ, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక గణేష్ గాడు కూడా వాడి మాట వాడే వినడు కాబట్టీ,  ఆ వంద రూపాయలూ వంతెన కింద కాలవ గట్టు మీద ఉన్న వినాయకుడి గుడి హుండీలో వేసేసి దండం పెట్టుకుని వచ్చేశాడు.

                                              మళ్ళీ డిసెంబరు నెల కూడా వచ్చేసింది. మేమయితే అందరం గణేష్ గాడి బిర్యానీ గురించి  ఎప్పుడో మర్చిపోయాం. కానీ ఉన్నట్టుండి ఒక రోజు వాడి మొహం రాబోయే సంవత్సరం జనవరి ఒకటికి మా ఊళ్ళో చిన్నారావు గారి ఇంటికి వార్తాపత్రిక తో పాటు వచ్చే కొత్త క్యాలెండర్ లాగా కళ కళ లాడిపోతుంది. మేమెవ్వరం అడక్కుండానే వాడే మా దగ్గరికొచ్చి "మొన్న శెలవు రోజు అబ్బాయి గారి దొడ్లో క్రికెట్ ఆడుకుంటుంటే బుల్లియ్య గారి చేలో ఎలకలు పట్టడానికి వెళ్తున్న రత్తయ్య పిలిచి, మనుషుల్లేరు పనికి సాయం చెయ్యమంటే వెళితే ముప్ప్పై ఎలుకలు దొరికాయి. అందులో ఎలుకకి ఐదు రూపాయల చొప్పున నాకూ ఒక పాతిక రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో బ్లూమూన్ లో బిర్యానీ తినేశాను" అన్నాడు. వాడి ఆనందం చూసి తిరిగి ఏదో ఒకటి అడగక పోతే బాగోదని "బ్లూమూన్ లో బిర్యానీ బాగుందా?" అని అడగ్గానే "తీరిగ్గా కూర్చుని బాగుందో బాలేదో రుచి చూసేంత ఎక్కడ ఉందక్కడ ? సగం బిర్యానీ అంటే వాడు ఇచ్చే రెండు ముక్కలు, గుప్పెడు బిర్యానీ అన్నం, వేడి వేడి గా ఇలా నోట్లో వేసుకోగానే అలా కడుపులోకెళ్ళిపోయింది." అని మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు మొహం పెట్టి "ఇంకోసారి మనసారా ఫుల్ బిర్యానీ తినాలిరా" అన్నాడు. కధ మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ఫుల్ బిర్యాని కోసం. అనవసరంగా అడిగి గుర్తు చేశామని మేమందరం తలలు పట్టుకున్నాం గానీ, ఈసారి వాడి దూకుడు చూశాక మాత్రం,  బిర్యానీ కోసం ఐఏయస్ అయినా అవలీలగా చదివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపించింది. ఎందుకంటే ఇన్నాళ్ళూ వాడి కళ్ళల్లో కోరిక మాత్రమే కనిపించింది గానీ, ఆ రోజు నుంచీ పట్టుదల కూడా కనిపించటం మొదలయింది.

6 comments:

  1. Srinu Ganisetti:Gopi....excellent...humorous...nee writing skills peaks ki vellipothunnayi ra..good keep it up

    ReplyDelete
  2. Is this story real ? Brilliant narration !!

    ReplyDelete
    Replies
    1. Thank you. yes, its true, but to write it as a story, i added some situations.

      Delete