Sunday, December 22, 2013

మాయ

".... చివరిగా, నేను విన్నవించుకునేది ఒక్కటే.
నేనెవరో నీకు తెలీదు.
కానీ నీ గురించి నాకు సర్వం తెలుసు.
నువ్వెవరో కూడా నాకు బాగా తెలుసు.
ఈ చరాచర జగత్తులో మాలాంటి అధములు అంతకన్నా అధమమయిన కృత్రిమమయిన బుధ్ధితో సృష్టించుకున్న భాషలో  దేనినయితే 'సౌందర్యం' అనే అతి సామాన్యమయిన శబ్ద ధ్వనితో వ్యక్తీకరిస్తారో అదే నువ్వు.
నేను కళ్ళు తెరవటంతోటే మొదలు పెట్టిన నా అనంతాన్వేషణకు ముగింపు పలికిన అద్భుతానివి నువ్వు.
ఇంత కాలం నా సర్వేంద్రియాలూ ఎదురు చూసింది నీ కోసమే.
ఇన్ని రోజులూ నన్ను పెంచి పోషించిన ఈ జగత్తు ఈ క్షణం నుంచీ నాకు తృణప్రాయం, కాదు కాదు మిధ్య.
నాకు జన్మతః సంక్రమించిన పురుషార్ధ సాధక సాధనని సులభతరం చేసి ముక్తి ప్రసాదించగలిగిన ఏకైక దేవతవి నువ్వు.
జఢ గాడాంధకారబంధురబంధితుడనై, అమావాస్య రాత్రులు మాత్రమే బ్రతికిన నన్ను
బయటికి లాగి నిత్య పౌర్ణములు చూపించిన జాజ్వలిత చలితవి నువ్వు.
నువ్వు లేక ఈ చీకట్లో ఒక మూల కూర్చుని బీడువారిన భూమినీ, దుమ్ము కొట్టుకుపోయిన ఆకాశాన్నీ చూస్తూ నిద్రాహారపానస్నానాదులు మరిచి మకిలమయిన నా ఈ దేహంలో భాగమయిన నా బాహువులని ఆహిరితో అందుకోవటానికి ఇంకెందుకు నీకు సందేహం?
ఓహ్...నీ కోసం ఏం చేయను చెప్పు.
నిన్ను కనుగొన్న మరు క్షణమే నా హృదయాన్ని నీకు ధారాదత్తం చేశాను.
ఇంకా ఏముంది నా దగ్గర?
ధనధాన్యవస్తుకనకవాహనాలు లేవు ఇప్పుడు నా దగ్గర.
నేను నిన్ను బంగారు పంజరంలో పెట్టి బంధించలేను. అది నాకు ఇన్ష్టం లేదు.
నేను నా ప్రేమాధికార ఉన్మత్తతతో నిన్ను గుడ్డిగా నిర్బంధించను.
నీ సహజ సౌకుమారస్వేచ్చాస్వాతంత్ర్యాలని హరించబోవటం లేదు.
ఇక మీదట ఇక్కడ విరిసే పున్నాగ జాజి మందార మల్లి బ్రహ్మకమలాది పుష్పాలకీ, శరద్రాత్రులు విరబూసే ఆకాశ నక్షత్రాలకీ, వీచే చల్లని మలయ మారుతాలకీ, నా వెచ్చని హృదయానికీ నువ్వే అధినాయకివి.
నువ్వు నా కోసం ఒక్క అడుగు ముందుకి వేయటం కోసం ప్రతిఫలంగా నన్ను పాతాళంలోకి పడిపొమ్మన్నా నేను సిధ్ధమే.
ఇంకెందుకు ఆలస్యం? నీ మౌనం తో స్తంభించిపోయిన గాలిని నీ జిహ్వాధర జనిత తరంగాలతో జీవింప జేసి నీ సమ్మతిని తెలియచేయి.
పోనీ నీ జీవన ఉదర పోషణ కోసం సంకోచిస్తున్నావా ?
నిత్యం ఎడతెగక పారే ఏటి ఒడ్డున నిత్య జీవితమయిన వెదురు మొక్కలను ఇల్లుగా మలిచి సిధ్ధం చేసే ఉంచాను.
ఆకలేస్తే రాజహంసలు, రామచిలుకలు మాత్రమే రుచి చూసి వదిలి వెళ్ళిన మధుర ఫలాలు ఏరుకొస్తాను.
నిండుగా ఉన్న తేనెపట్టును ఆశ్రయించిన తేనెటీగలు పౌర్ణమి రోజు తేనె తాగి మత్తులో జోగుతుండగా మిగిలిన మంచి తేనెను సేకరించి నీ కోసం దోసిళ్ళతో తీసుకొస్తాను.
దాహమయితే ఒడ్డున ఉన్న మొగలి, పారిజాత, సంపెంగ వృక్షాలు రాల్చిన పూలు మోసుకొచ్చి సుగంధభరిత పరిమళాలు సంతరించుకున్న తియ్యటి ఏటి నీళ్ళు ఎలాగూ ఉన్నాయి.
మన దాహాపేక్షను పెంచగలిగిన మహత్తు కలిగిన నీళ్ళవి.
నేను అల్పుడినే, దుర్భలుడినే, రధగజతురగపధాతిదళవిలసితరాజ్యాధినేతని కాదు, కానీ సూర్యచంద్రులకు గ్రహణం పట్టిన పూట ఏ అపాయమూ నీ దరి చేరనీయకుండా, నీ నిరీక్షణలో లోతుకి పోయిన నా కంటి గుహల్లో దాచి నిన్ను రక్షించుకుంటాను.
ఇంకా చాలదంటావా ?
నీ వర్ణార్ణవతరంగశోభిత ఖండ కావ్యాలు రాసి మండు వేసవి సోమరి మిట్ట మధ్యాహ్నం గానుగ చెట్టు చల్లటి నీడలో అలసట తెలియకుండా నీకు పాడి వినిపిస్తాను. అంకితమిస్తాను.
నీ సమ్మతి చాలు నాకు. దయచేసి నీ మౌనాన్ని ముగించు."
నా అర్ధింపు ముగిసింది.
నా దేవత తన ముఖ కవళికల్లో ఏ విధమయిన భావమూ పైకి ప్రకటించనీయకుండా నిలుచుంది.
"మౌనం అర్ధాంగీకారం, నాకు తెలుసు నువ్వు నా అభ్యర్ధనను మన్నించావు." అడుగు ముందుకెయ్యబోయాను.
నా దేవత పెదవులు మందార మొగ్గల్లా విచ్చుకున్నాయి.
నా మనసు రంజిల్లింది.
క్షణంలో వెయ్యో వంతులో తన అంగీకార సూచకంగా చిరు నవ్వుతో విచ్చుకున్నాయనే అనుకున్నాను.
కానీ కాదు. "ఛీ, నీచుడా నీకంటూ సాధికారిత లేని బికారివి. భయంతో గానీ, ఆశతో గానీ నన్ను నీ చుట్టూ తిప్పుకోగలిగిన బలం, ఐశ్వర్యం లేని దరిద్రుడివి, నిన్ను ఎలా వరిస్తాననుకున్నావ్ ?" అని పిడుగు పడ్డట్టు గర్జించటానికి.
నేను ఆ మాటలు భరించలేక మోకాళ్ళపై కూల బడిపోయాను.
దానికి వంద రెట్లు క్రోధంతో అగ్ని గుండాల్లా రగులుతున్న ఆమె కళ్ళతో నన్ను కాల్చేస్తూ ధగధ్ధగాయమాన వజ్రవైఢూర్యాది నవరత్నఖచితసువర్ణాభరణావృతమయిన తెల్లకలువలాంటి ఎడమ పాదాన్ని పైకెత్తి, సీతాకోకచిలుకల రెక్కలు తెంపుకొచ్చి రంగుల అద్దకం అద్దిన పొడవయిన ఆమె కాలి గోళ్ళు నా గుండెల్లో దిగబడేలా తన్ని వెళ్ళిపోయింది.
కాల గతిలో రోజులు దొర్లిపోయాయి.
ఒక సూర్య గ్రహణపు చీకటి రోజు ఉన్నట్టుండి నా దేవత మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. నాకు చేరువగా. కానీ దీనంగా.
"ఇప్పుడు నేను కోరుకున్న నాలుగు బంగారు గోడల మధ్య, ఒక ఆజానుబాహుడి సమక్షంలో వెండి పళ్ళెంలో ప్రతి రోజూ పంచభక్ష్య పరమాన్నాలూ భుజిస్తున్నాను. కానీ నాకు అతడి ఐశ్వర్యం మొహం మొత్తింది. అతడి బలం నన్ను భయపెడుతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చాను." అంది.
నిజం తెలుసుకున్నందుకు నా మనసు ఆనంద కందళితమయ్యింది.
కానీ కొన్నాళ్ళకి
"నీ సోమరి జీవితంలో నాకు ఏ విధమయిన ఉత్సుకతా కనిపించటం లేదు. నేను నా బంగారు పంజరానికే వెళ్తాను."
వెళ్ళిపోయింది.
మళ్ళీ కొన్నాళ్ళకి...
"నాకు అక్కడ ఊపిరాడటం లేదు అందుకే వచ్చాను. ఇక్కడ గాలి బాగుంది."
కొన్నాళ్ళకి...
"ఇక్కడ ఏదో దుర్గంధం. నేను ఉండలేను. వెళ్ళాలి."
మళ్ళీ...
"అక్కడి బంగారు గోడలు చూసి చూసి నాకు కళ్ళు మండుతున్నాయి. ఇక్కడి వెన్నెల కోసం..."
మళ్ళీ...
మళ్ళీ..
ఇలా నా అమాయకపు 'సౌందర్యం' అటూ ఇటూ పరిభ్రమిస్తూనే ఉంది. కానీ ఆమెకి తెలియని రహస్యం. "నిజానికి అక్కడా ఇక్కడా ఉన్నది నేనే. ఇదంతా ఆమె కోసం నా సర్వ శక్తులూ కూడ దీసుకుని నేను కల్పించిన మాయా నాటకం."
నా ముగ్ధ సౌందర్యానికి ఇదేమీ తెలీదు పాపం.
మళ్ళీ వస్తూనే ఉంది.
మళ్ళీ వెళ్తూనే ఉంది.
మళ్ళీ..
మళ్ళీ..
మళ్ళీ..మళ్ళీ..
కానీ ఒక నిశి రాత్రి నా దేవత నా దగ్గరగా వచ్చి "నీ గురించి నాకు సర్వం తెలుసు. నువ్వెవరో కూడా నాకు బాగా తెలుసు. ఇదంతా నీ మాయ అని కూడా తెలుసు. కానీ నాకిష్టమయిన ఈ ఆటని కావాలని నీతో మొదలుపెట్టించింది నేనే" అంది. నా హృదయం మీది గాయపు మచ్చని కొంచెం గర్వంగా, ఇంకా జాలిగా చూస్తూ.
అంటే... ఇంత కాలం నేను... ఆమె మాయలో...!?
ఓహ్...!?
ఇంక ఆ క్షణమే నన్ను తనలో ఐక్యం చేసుకుని నాకు శాశ్వతానందాన్ని ప్రసాదించింది.

No comments:

Post a Comment