Sunday, January 19, 2014

1-నేనొక్కడినే

                  "కధలో ఎక్కడయినా ఒకచోట తుపాకీ గురించిన ప్రస్తావన వస్తే కధ ముగిసేలోపు ఆ తుపాకీ కనీసం ఒక్కసారయినా పేలి తీరాలి." ఇది కధ గురించి చెకోవ్ చెప్పిన ప్రాధమిక సూత్రం. దీని ప్రకారం కధకు సంబంధం లేని ఏ చిన్న విషయం కధలో ఉండటానికి వీల్లేదు. ఇదే సూత్రం సినిమా కధలకి కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా Unity of Time and Place ని పాటించిన కధలు కలిగిన సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి సినిమాలవుతాయి. కధ చెప్పే విధానం సూటిగా ఉందా ? క్లిష్టంగా ఉందా ? అనేది మాత్రం దానిని అర్ధం చేసుకోగలిగిన ప్రేక్షకుల స్థాయిని బట్టి మారుతుంది. ఒక సినిమా బాగుంటే బాగుందని, లేకపోతే బాలేదని చెప్పటానికి ప్రేక్షకులకి ఏ విధమయిన మొహమాటం ఉందదు. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం సగం మంది చాలా బాగుందని, సగం మంది అసలు బాగో లేదని చెప్పటానికి ఏదో బలమయిన కారణమే ఉండాలి. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకతే నన్ను ధియేటర్ వరకూ వెళ్ళి ఈ సినిమా చూసేలా చేసింది. దర్శకుడు సుకుమార్ ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నింటిలోనూ తన భిన్నమయిన ఆలోచనా విధానాన్ని ఉపయోగించి తెలివిగా Handle చేసి అన్ని రకాల ప్రేక్షకులనీ మెప్పించగలిగాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మెట్టు పైకెళ్ళి మామూలు ప్రేక్షకులు అందుకోలేని స్థాయిలో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. క్లిష్టమయిన విషయాలను క్లిష్టంగానే చెప్పటం ఒక పధ్ధతి. Stephen Hawking పుస్తకం "A Brief History of Time" లాగా క్లిష్టమయిన విషయాలను సరళంగా చెప్పగలగటం కూడా ఒక పధ్ధతి. సరళమయిన విషయాలను సరళంగానే చెప్పటం మరో పధ్ధతి. కానీ సరళమయిన విషయాన్ని ఒక "పజిల్" లాగా మార్చి ఆ పజిల్ ని అర్ధం చేసుకోగలిగిన ప్రేక్షకులకి ఒక 'కిక్' వచ్చే పధ్ధతిలో మలచిన సినిమానే ఈ '1-నేనొక్కడినే'. అప్పుడెప్పుడో Reverse Screenplay పధ్ధతిలో అద్భుతం గా తీసిన ఉపేంద్ర A సినిమా, ఆ తర్వాత అకీరా కురసోవా 'రోషోమన్ ' శైలిలో కమల్ హాసన్ తీసిన 'పోతురాజు చెప్పినట్టు ' సినిమా మళ్ళీ నాకు తెలిసి ఈ మధ్యన  వచ్చిన 'పిజ్జా' సినిమాల తర్వాత మళ్ళీ ఆ విధమయిన పధ్ధతిలో సుకుమార్ తీసిన సినిమా ఇది.

ఇంక సినిమా విషయానికి వస్తే Integrated Disorder అనే మానసిక వ్యాధితో బాధపడే ఒక చిన్నపిల్లాడు తన తల్లిదండ్రులని చంపిన వాళ్ళ మీద పెద్దయ్యాక ఎలా పగ తీర్చుకున్నాడు అనేది. మానసిక వ్యాధి - పగ అనగానే మనందరికీ బాగా అలవాటయిఫోయిన గజిని సినిమా లాంటిది అనుకుంటాం గానీ ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు

హీరో గోవా వెళ్ళాలని నిర్ణయం తీసుకునే సన్నివేశం.

చిన్నపిల్లలకి అబధ్ధాలు చెప్పొద్దని మహేష్ బాబు చెప్పే సన్నివేశం.

ఇంటర్వెల్ ముందు.

విలన్ (నాజర్) హీరోకి గతం గురించి చెప్పేటప్పుడు ట్యాక్సీ డ్రైవర్ స్థానం లో తనని, తన స్థానంలో ట్యాక్సీ డ్రైవర్ ని ఊహించి తప్పుగా చెప్పి హీరోని మోసం చెయ్యటాన్ని ఒక ట్విస్ట్ గా ఉపయోగించటం.

చివరిలో హీరో తన దగ్గర ఉన్న, తండ్రి కనిపెట్టిన కొత్తరకం వరి వంగడం గురించి విలన్ కి చెపితే గానీ విలన్ హీరో కి అతని తల్లిదండ్రుల గురించిన విషయాలు చెప్పకపోవటం. హీరో ముందు తన తల్లిదండ్రుల విషయాలు తెలుసుకుంటే గానీ విలన్ కి తన దగ్గర ఉన్న వరి వంగడం గురించి విలన్ కి చెప్పకపోవటం. రెంటిలో ఏది ముందు జరిగినా ముందు చెప్పిన వాడిని రెండో వాడు చంపటం ఖాయం అనే విషయం ఇద్దరికీ ముందే తెలిసిపోవటం అనే Dead Lock అనే Unending Process ని చివరికి హీరో అతనికి తన తల్లిదండ్రుల గురించి తనకి తెలియటం కన్నా తన తండ్రి ఆశయం నెరవేర్చటమే ముఖ్యమని భావించి ఆ విషయంలో రాజీ పడి విలన్ ని చంపటానికే నిర్ణయించుకోవటం. ఈ విధమయిన Dead Lock అనే దృగ్విషయంలో ఉన్న ప్రత్యేకత ఏ సాఫ్టువేరు ఇంజినీర్లకో, ఎలక్ట్రానిక్ ఇంజినీర్లకో అయితే సులువుగా అర్ధమవుతుంది గానీ లేకపోతే మామూలు ప్రేక్షకుడికి అందులో ఏ విధమయిన ప్రత్యేకతా కనిపించదు.

చివరిగా హీరో కి చిన్నప్పుడు తల్లి నేర్పించిన రైం గుర్తుకొచ్చి తన ఇల్లు ఎక్కడుందో కనుక్కోగలగటం.

ఈ సినిమాలో కామెడీ ఎలాగూ అతకదు/లేదు కాబట్టి ఆ విషయం పక్కన పెడదాం. కాని కొన్ని అసంబధ్ధమయిన ఫైట్లు,  సాధారణంగా ఇలాంటి సినిమాలకి చాలా అవసరమయిన మంచి నేపధ్య సంగీతం/సంగీతం లేకపోవటం ఈ సినిమాకి పెద్ద లోటు.

కొన్ని చిన్న చిన్న లాజిక్ లు తప్పినా గానీ మొదట్లోనే మనం చెప్పుకున్న ప్రాధమిక సూత్రాలకి ఈ సినిమా దగ్గరగానే ఉంది కాబట్టి ఇది ఒక మంచి సినిమాగానే చెప్పుకోవచ్చు. కానీ తుపాకీలూ వాటి పేలుళ్ళు పరిమితి దాటటం వల్లా, దాంతో పాటు Repeated Scrennplay విధానం వల్లా మొదటి సగం అసక్తి గా అనిపించదు. డిస్కవరీ ఛానల్లో జింక ని వేటాడే పులిని చూడమంటే ఎవరయినా ఆసక్తిగా చూస్తారు గానీ  Time Travel గురించి చూడమంటే ఎంతమంది చూస్తారు? అలాగే వినోదం కోసం సినిమాకెళ్ళే మామూలు ప్రేక్షకుడికి పజిల్ ఇచ్చి అర్ధం చేసుకోమంటే అది ఎంతమందిని చేరుకోగలదు అన్నదే ముఖ్యమయిన ప్రశ్న. ప్రేక్షకుల తెలివితేటలని తక్కువ అంచనా వెయ్యటం ఎంత తెలివితక్కుతనమో, ఇలా తీసిన సినిమా అందరినీ మెప్పించాలనుకోవటం కూడా అంతే తెలివితక్కువతనం. అంతకన్నా ముఖ్యం,  అన్నిరకాల ప్రేక్షకులనీ రీళ్ళతో పాటు  పరిగెట్టించగల సినిమా నే నిజమయిన సినిమా. ఆ విధంగా చూస్తే ఆ విషయంలో ఈ సినిమా సఫలీకృతమవ్వలేదనే చెప్పటానికి నాకూ ఏ మొహమాటం లేదు.

Sunday, January 5, 2014

చిన్నిగాడి జ్వరం

                    జ్వరమంటే ఏంటో తెలీదు చిన్నిగాడికి. కానీ ఈ మధ్యన ఒక్కసారి జ్వరమొస్తే బాగుండుననుకుంటున్నాడు. ఎండకి తప్ప గాలి వానకి ఆగలేని పాతకాలం నాటి మా బళ్ళో లెక్కలు చెయ్యకపోతే ఈత బరికె తీసుకుని ఒళ్ళు చీరేసే భీమేశ్వర్రావు మాస్టారికి భయపడి బడి ఎగ్గొట్టటానికి కాదు. చిన్నిగాడికి ఒక్క లెక్క చెపితే చాలు ఎటునుంచి ఎటు ఇచ్చినా దాన్ని బట్టి పది లెక్కలు సొంతంగా చేసెయ్యగలడు. పోనీ అందరిలాగా ఇంగ్లీషు పాఠాలంటే అసలు భయమే లేదు. చెప్పిన మాట వినకుండా లెక్కలేనితనంగా తిరిగే వాడూ కాదు. బడి ఎగ్గొట్టి బలాదూరుగా తిరుగుదామనేవాడూ కాదు. అయినా ఒక్కసారి జ్వరమొస్తే బాగుండుననుకుంటున్నాడు. ఆ వచ్చిన జ్వరం పది రోజులయినా తగ్గకూడదు. నూట రెండు పైనే రావాలి. పోనీ చీకటితోనే నిద్ర లేపేసి వాడినీ, వాడి అన్నయ్యనీ పొలం తీసుకెళ్ళి బుల్లియ్యగారి ట్రాక్టరు దున్నేసి వెళ్ళిపోయిన వాళ్ళ అరెకరం పొలం గట్టులంకలు వేశాక,  గట్టు మీద మడ దొక్కిన తాటాకులు మోపు కట్టి నెత్తి మీదకెత్తి "ఈ వయసునుంచే కష్ట పడి పని చెయ్యటం నేర్చుకోపోతే రేపొద్దున్న ఎలా బతుకుతార్రా ? ఈ మోపులు తీసుకెళ్ళి మన ఎర్ర గేదిని కట్టేసిన గుంజ పక్కన పడేసి బళ్ళోకెళ్ళిపోండి. నేను తాటి కమ్మలు నార తీసుకుని వస్తాను." అని పనికి బధ్ధకిస్తే కళ్ళెర్ర చేసే వాళ్ళ నాన్నకి భయపడి పని ఎగ్గొట్టటానికి కాదు జ్వరం రావాలనుకోవటం. చిన్నిగాడు పనికి బధ్ధకించే రకం కాదు. అయినా ఒక్క సారి జ్వరమొస్తే చాలు వాడికి ఏనుగెక్కినంత సంతోషం.

            మొన్న చిన్నిగాడి స్నేహితుడు మీసాల నారాయణ రావు గారి బాలాజీ గాడికి జ్వరమొస్తే ఇంక వాడికి రాజభోగమే. జ్వరం తగ్గే వరకూ వాడు ఆడింది ఆట పాడింది పాట. ఆ పది రోజులూ వాడు ఏం చేసినా పల్లెత్తు మాట అనలేదు వాడి ఇంట్లో వాళ్ళెవరూ. మందు బిళ్ళ వేసుకునేటప్పుడు చేతిలోనుంచి మంచి నీళ్ళ గాజు గ్లాసు కింద పడి పగిలిపోయినా ఎవరూ తిట్టలేదు. పైగా గాజు ముక్కలు ఎగిరి పడి ఎక్కడయినా దెబ్బ తగిలిందా అని దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా తడిమి తడిమి చూసింది వాళ్ళమ్మ. అదే జ్వరం లేకపోయి నప్పుడు పొరపాటున గ్లాసు పగలగొడితే బడిత పూజ మొదలెట్టి వాడిని బొంగరం తిప్పినట్టు తిప్పేవాళ్ళు. ఆ జ్వరం ఉన్నన్ని రోజులూ రోజూ తినే మామూలు అన్నం ముట్టుకోలేదు వాడు. వాడి నోటికి ఏది హితంగా ఉంటే అదే తెచ్చి పెట్టేవాళ్ళు. ఎండు ద్రాక్షలు, నారింజలూ, పళ్ళ రసాలు ఇంకా బోలెడు ఫలహారాలు. తాగటానికి గ్లూకోజులు, కొబ్బరి బొండాం నీళ్ళు,  ఇంకా వేడివేడి పాలల్లో కోమటి తాతగారి కొట్లోంచి కొనుక్కొచ్చిన బన్ను రొట్టె ముక్కలు వేసి చెంచా తో నోట్లో పెడుతుంటే మహారాజు లాగ తినేవాడు. అదే జ్వరం గిరం లేకపోతే "నోరు మూసుకుని పెట్టింది తిను, లేకపోతే తీసుకెళ్ళి పోలీసోళ్ళ దగ్గర వదిలేస్తాను" అనేది బాలాజి గాడి వాళ్ళమ్మ. పోలీసుని ఎప్పుడూ చూడకపోయినా ఆ పేరు చెపితే మాత్రం చాలా భయం వాడికి. పోలీసోడు వస్తున్నాడని సరదాగా ఎవరయినా అన్నా వెళ్ళి మంచం కింద దాక్కుండిపోతాడు. జ్వరం తగ్గాక కూడా నెల దాకా రాజ భోగమే వాడికి. నీరసం తగ్గి మళ్ళీ బలం పుంజుకునే వరకూ గణపవరం బస్టాండు దగ్గర మాంసం కొట్టు నుంచి వేట మాంసం స్పెషలుగా ఖైమా కొట్టించి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇంకా రోజూ గుడ్డు. అప్పుడప్పుడూ శ్రీరాములు తాత వాళ్ళ ఇంట్లో టీవీ చూడటానికి వెళ్ళినప్పుడు అందులో  చూపించే హార్లిక్సు కొని పాలూను. అంత మంచి జ్వరం నాకూ ఒక్కసారి వస్తే బాగుండుననుకుంటున్నాడు చిన్నిగాడు.

                  మొన్నటికి మొన్న చిన్నిగాడి వాళ్ళన్నయ్యకీ వచ్చింది అలాంటి జ్వరమే. అప్పుడూ అంతే వాళ్ళన్నయ్యకూ మళ్ళీ రాజ భోగమే. తనకి రావాల్సిన జ్వరం వాళ్ళన్నయ్య బలవంతంగా లాగేసుకున్నట్టనిపించింది చిన్నిగాడికి. అంత అదృష్టం తనకి పట్టనందుకు చాలా బాధ పడ్డాడు. ఎప్పుడూ ఏదో పని చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉండే వాళ్ళమ్మ ఆ పది రోజులూ మాత్రం అన్నయ్యనే అంటిపెట్టుకునే ఉండేది. ఒళ్ళో పడుకోబెట్టుకుని తల మీద చెయ్యేసి వేడి తగిలినప్పుడల్లా చల్లని తడి గుడ్డ మళ్ళీ మళ్ళీ వేసి తీస్తూ ఉండేది. అన్నయ్యకి నోరు చేదుగా ఉందంటే అందరితోనూ ఊరుకునే దెబ్బలాటలు పెట్టుకుని ఊళ్ళో అందరూ భయపడే చీలి లక్ష్మి  వాళ్ళ దొడ్లో ఎవరూ చూడకుండా రెండు నారింజ కాయలు కోసుకొచ్చి అప్పుడప్పుడూ ఒక్కో తొనా తీసిచ్చి చప్పరించమనేది. ఇవన్నీ చూశాక చిన్ని గాడికి జ్వరం మీద ఇష్టం ఇంకా ఎక్కువయ్యిపోయింది. ఆరెంపీ డాక్టరు రవి కుమార్ గారొచ్చి ఇంజెక్షను చేసేటప్పుడు అన్నయ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడు ఏడుస్తుంటే "ఏం లేదు. భయం లేదు" అని ఊరుకోబెట్టేది. చిన్ని గాడి అన్నయ్యకి సూది మందంటే చాలా భయం. చిన్ని గాడికి మాత్రం ఆ భయం లేదు. ఒక్కసారి జ్వరమొస్తే చాలు. ఎన్ని సూది మందులిచ్చినా లెక్క చేసే పనే లేదు. చిన్ని గాడు అంత పిరికోడు కాదు. వాడికి చాలా ధైర్యం ఎక్కువ. ఇదివరకోసారి స్నేహితులతో మాటా మాటా వచ్చి పందెం వేసుకుని రాత్రిళ్ళు దెయ్యాలతో పాటు పాములూ, తేళ్ళు కూడా ఉంటాయని అందరూ చెప్పుకునే ముళ్ళపొదలున్న ఊర చెరువు గట్టు చుట్టూ చీకట్లో ధైర్యం గా ఒక చుట్టు తిరిగి  వచ్చాడు. వాడికి ఈ సూది మందు మంచి నీళ్ళు తాగినట్టు. పైగా ఆ సూదిని శుభ్రం చెయ్యటానికి డాక్టరు గారు మరిగే మరిగే నీళ్ళు తెప్పించుకుని అందులో ముంచి సిరంజి నిండా నీళ్ళు పైకి లాగి గాల్లోకి సుయ్యిమని వదుల్తుంటే భలే ఉండేది. ఆడుకోవటానికి అలాంటిదే పాత సిరంజి ఒకటి ఇచ్చారు డాక్టరు గారు. అది చూసినప్పుడల్లా "నాకు జ్వరం ఎప్పుడొస్తుందా" అని అనుకునేవాడు చిన్నిగాడు. పైగా అడిగితే "జ్వరం తగ్గడానికి మందులున్నాయి గానీ రావటానికి మందులు ఉండవ"న్నారు.

                   ఒక్కోసారి ఇంట్లో ఎవరికయినా జ్వరమొస్తే ఆ ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా వస్తుందని చిన్ని గాడికి కూడా జ్వరమొస్తుందేమో అని భయపడి పోయింది వాళ్ళమ్మ. వాళ్ళన్నయ్యకి తగ్గిపోయింది గానీ వాడికి మాత్రం జ్వరం రాలేదు. ఉల్లిపాయలు చంకలో పెట్టుకుంటే జ్వరమొస్తుందని తెలుసు గానీ అలాంటి ఆషామాషీ జ్వరం పనికిరాదు. డాక్టరు నిజంగా సూది మందు ఇవ్వాలి. సూది మందుకు భయపడుతున్నట్టు చిన్నిగాడు ఏడవాలి. అప్పుడు వాళ్ళమ్మా, నాన్నా ఊరుకోబెట్టి  గారం చెయ్యాలి. ఆ పది రోజులూ అందరూ వాడి గురించే పట్టించుకోవాలి. అందరూ చిన్నిగాడి జ్వరం గురించే మాట్లాడుకోవాలి. వాళ్ళ మేనత్తకి తెలిస్తే ఊరు నుంచి బస్సెక్కి ఆఘమేఘాల మీద వచ్చేస్తుంది వాళ్ళన్నయ్యని చూడటానికి వచ్చినట్టే. వస్తొ వస్తూ తనకి ఇష్టమయిన ఖర్జూరాలు కూడా తెస్తుంది. పెద్దమ్మకి తెలిస్తే  జీళ్ళూ, తాటి తాండ్రా, రేగు పళ్ళ వడియాలూ కూడా తెస్తుంది జ్వరం తగ్గాక తినమని. కానీ ఈ వెధవ జ్వరం ఇప్పట్లో వచ్చే సూచనలు మాత్రం కనిపించట్లేదు చిన్నిగాడికి.

               అక్కడికీ ఊర చెరువులో పొద్దున్నుంచీ సాయంత్రం దాకా ములుగీత కొట్టాడు. రాలేదు. పని ఉన్నా లేక పోయినా కొమ్మర పొలం పది సార్లు తిరిగాడు. కాళ్ళు నొప్పులొచ్చి జ్వరం వస్తుందేమో అని. రాలేదు. కావాలని వర్షం లో తడుచుకుంటూ పంట కాలువ లో మట్టగుడసలు పట్టాడు. రాలేదు. కానీ వాడితో పాటే చేపలు పట్టిన జొన్నల సత్తి మావయ్యకి వచ్చింది. వాడేమో "ఛీ, వెధవ జ్వరం. మంచి పని రోజుల్లో వచ్చింది." అని తిట్టుకునేవాడు. వాళ్ళ ముసలయ్య తాతేమో "మనిషయ్యాక రొంప, జ్వరం రాకుండా ఎలా ఉంటాయి రా, అయినా ఇవి వస్తేనే కదా మనం రాయో, రప్పో కాకుండా మనుషులమని తెలిసేది" అని చమత్కారంగా మాట్లాడేడు. ఏంటో ఈ పిసినారి జ్వరం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం రావట్లేదు అనుకున్నాడు. కానీ ముసలయ్య తాత మాటలు బట్టి తనకి కూడ ఎప్పుడో ఒకప్పుడు జ్వరం వచ్చి తీరుతుందని నమ్మకం కలిగింది చిన్నిగాడికి. అలా జ్వరం వచ్చిన రోజు వాడికి ఆనందమే, రాజభోగమే కానీ తొందరగా వస్తే బాగుండును. పెద్దయ్యాక వస్తే ఇంత ఆనందం ఉండదని అర్ధమయ్యింది సత్తి మావయ్య మాటలు బట్టి చిన్ని గాడికి. అందుకే ఆ వచ్చేదేదో తొందరగా వస్తే బాగుండును అనుకుంటున్నాడు.

                  అలా జ్వరం గురించి ఆలోచిస్తూనే బళ్ళోకి వెళ్తున్నాడు. వస్తున్నాడు. పాఠాలు వింటున్నాడు. చాలా రోజులు గడిచిపోయాయి గానీ చిన్నిగాడికి జ్వరం రాలేదు. అలా బళ్ళో పాఠం వింటుండగానే ఒక రోజు తరగతిలో పాత గోడ కూలి మీద పడి వాడి తలకి పెద్ద డెబ్బ తగిలింది. వెంటనే పెద్దాసుపత్రికి తీసుకెళ్తే ఇంకో ఇరవై నాలుగ్గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమన్నారు. అప్పుడూ ఆసుపత్రి మంచం మీద కూడా అడిగాడు వాళ్ళమ్మని "ఇప్పుడు నాకు జ్వరమొస్తుందా?" అని. జ్వరం రావటానికి అసలు మనిషంటూ ఉండాలి కదా. పట్టుమని పన్నెండేళ్ళు కూడా లేని చిన్ని గాడికి అదే ఆఖరి మాట.

చిన్నిగాడు బతికుండగా జ్వరం రాలేదు గానీ, వాడు చనిపోయాక కానీ రాలేదు, మా ఊళ్ళో బడికి బాగుపడే రోజులు.

(బడిలో గోడ కూలి చనిపోయిన నా చిన్ననాటి స్నేహితుడు చిన్నిగాడికి ఇది అంకితం.)