ఆయనకున్న ఒకే ఒక కోరిక ఎప్పటికైనా మా ఊరికి ప్రెసిడెంటవ్వాలని. ఊరి పంచాయితీ ఆఫీసులో కుర్చీ వేసుక్కూర్చుని అందరిచేతా ప్రెసిడెంటు చిన్నారావు గారనిపించుకోవాలనీ. నెహ్రూ గారు , పి.వి.నరసిం హారావు, వాజపేయిలు దేశాన్ని ఉద్ధరించినట్టే తాను కూడా ఊరిని బాగు చేసి అందరి చేతా దండాలు పెట్టించుకోవాలనీ ఉన్నా ఎలక్షన్లలో ఎప్పుడు పోటీ చేసినా ఓడి పొయేవాడు. ఎలాగూ ఊరికి ప్రెసిడెంటు కాలేని చిన్నారావు ని కనీసం ఊరి కుక్కలకయినా ప్రెసిడెంటుని చేద్దామని జనం వేళాకోళమాడుకోవడంతో ఆయన పేరు వాడుకలో కుక్కల ప్రెసిడెంటుగా స్థిరపడిపోయింది.
ఓ సారి మాత్రం లేడీస్ రిజర్వేషన్ కోటాలో ప్రెసిడెంటు గా నిలబడ్డ సుబ్బరాజు గారి పెళ్ళానికి పోటీగా వాళ్ళావిడ పార్వతమ్మ గారిని నిలబెడితే అప్పటివరకూ ప్రెసిడెంటుగా చేసిన సుబ్బరాజు ఊరికి ఉపకారం చేయకపోగా, మంచినీళ్ళ చెరువు పక్కన వున్న ఊర చెరువులో చేపలు పెంచి డబ్బులు తినేసి, మంచినీళ్ళ చెరువుని ఎందుకూ పనికిరాకుండా చేసి కనీసం తాగటానికి నీళ్ళయినా లేకుండా చేసాడని కోపంతోనో, ఎప్పుడూ గడప దాటి బయటకి కూడా రాని చిన్నారావు గారి పెళ్ళాం ఇంటింటికీ వచ్చి ఓటేయమని అడగడంతో జాలిపడో తెలీదు గానీ పోలింగు రోజు హోరున వర్షం వస్తున్నా ఊరి జనమంతా కదిలొచ్చి ఓటుకి ఐదొందలిచ్చిన సుబ్బరాజుని కాదని, చిన్నారావు గారి పెళ్ళాన్ని ప్రెసిడెంటుగా గెలిపెంచేశారు.
అప్పటినుంచీ ఆయనే ప్రెసిడెంటు అయిపోయినట్టు తెగ ఆనందపడి పోయి. ముందు ముందే పై అధికారుల్ని పట్టుకుని పిటిషన్ పెట్టి చేపలు పెంచటం ఆపించేసి మంచినీళ్ళ చెరువు బాగు చేసి వాటరు ట్యాంకు కట్టించేశాడు. పక్కూరు వల్లూరులో వుండే పెద్దిరాజు తన ఒక్కగానొక్క కూతురిని మా ఊళ్ళో ఐ.టీ.ఐ చేసి ఖాళీగా ఉన్న పండుగాడికిచ్చి చేసేడు. అప్పుడప్పుడూ బొమ్మిడాయిలూ, మట్టగుడసలూ, గొరకలూ, కొరమేనులూ పట్టినప్పుడు చింతకాయలూ, చింతచిగురూ వేసి చేసిన చేపల పులుసో, వానా కాలం పండి పోయి రాలి పోయిన తాటికాయలు కాల్చి గుజ్జు తీసి బియ్యం నూక, పంచదార వేసి , నేపాళ ఆకులు , క్రోటన్సు ఆకులు పైన వేసి కాల్చిన తాటి రొట్టో పట్టుకుని డొక్కు సైకిలేసుకుని మా ఊరి గోతుల రోడ్డుని తిట్టుకుంటూ వచ్చి వాళ్ళమ్మాయికీ, మనవలకీ ఇచ్చి మళ్ళీ తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలాంటి పెద్దిరాజు ఓ సారొచ్చేసరికి ఊళ్ళో సిమ్మెంటు రోడ్డు అద్దంలా మెరిసిపోవటంతో చూసి మురిసిపోయి, వెళ్తూ వెళ్తూ వాళ్ళమ్మాయికని తెచ్చిన జున్ను డబ్బా చిన్నారావు గారింట్లో ఇచ్చి వెళ్ళిపోయేడు.
మద్రాసు ఐ.ఐ.టి లో కెమికల్ ఇంజనీరింగు చదివి ఇప్పుడు సింగపూర్లో ఉంటున్న అబ్బాయిగారి చందు కి ఫోను చేసి ఊళ్ళో లైబ్రరీ కడుతున్నామని చెపితే ఇచ్చిన లక్ష రూపాయలతో పంచాయతీ పక్కన లైబ్రరీ కట్టించి పుస్తకాలు కొని పెట్టించేసి , వ్యాయామశాల ఒకటి కట్టించేశాడు. అరవై ఏళ్ళు పైబడ్డ కోమటి తాత గారికి వణుకు రోగమొచ్చి తగ్గకపోతే వ్యాయామశాల పక్కన పాతించిన బారు కడ్డీలు పట్టుకుని మూణ్ణెల్ల పాటు రోజూ బస్కీలు తీస్తే వణుకు పోయి మనిషి మామూలైపోయాడు.
ఓ సారి ఎమ్మెల్యె బాపిరాజు గారిని కలిసినప్పుడు ఊళ్ళో ఐసు ఫ్యాక్టరీ పెడతానంటే రోడ్డు పక్కన తనకున్న రెండెకరాల్లో ఎకరం ఇచ్చేసి ఫ్యాక్టరీ పెట్టించేసి, ఎవరో కొయిటా తీసుకెళ్తానని మోసం చేసి బొంబాయి లో వదిలేస్తే నా నా కష్టాలు పడి తిరిగొచ్చిన కిట్టిగాడికీ, ఐ.టి.ఐ చేసి ఖాళీగా ఉన్న పండు గాడి లాంటి చాలా మందికి అందులో ఉద్యోగాలిప్పించాడు. ఇలా అన్ని రకాలుగా ఊరిని బాగు చేసి తర్వాత ప్రెసిడెంటు గా ఎవరొచ్చినా పెద్దగా పని లేకుండా చేసేసిన చిన్నారావు తర్వాత చాన్నాళ్ళకి మా ఊరి రామాలయం దగ్గర శ్రీరామ నవమి రోజు అందరికీ పానకాలు, వడ పప్పు ప్రసాదాలు పంచిపెట్టి ఇంటికొచ్చి పడుకుని నిద్దర్లోనే కన్ను మూసేరు. ఆయన్ని చివరి సారి చూడ్డానికి ఒక్క మా ఊరి జనమే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళనుండి చాలా మంది జనమొచ్చేసారు. వాళ్ళందరికీ మా ఊరి రోడ్డు, వీధులు సరిపోక, మాల పల్లి దగ్గర పెద్ద రోడ్డు దాక వున్న జనంతో అక్కడ ట్రాఫిక్ జామయినంత పనయ్యింది.
ఆ తర్వాత రోజు ఆయనింటికి ఎప్పుడూ వచ్చే పేపర్లోనే జిల్లా ఎడిషన్లో ఆయన ఊరి ప్రెసెడెంటుగా చెయ్యలేదని తెలీక "రాజకీయ నాయకులందరికీ మాజీ ప్రెసిడెంటు చిన్నారావు గారు ఆదర్శమవ్వాల"ని వచ్చింది.
చాలా మంచి విషయాన్ని మా అందరితో పంచుకున్నారు. చిన్నారావు లాంటి ప్రెసిడెంట్లు ఊరూరా ఉండాలి. పల్లెలు పచ్చగా ఉండాలి.
ReplyDeleteఅవునండి, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు రవిచంద్ర గారు.
Delete