Thursday, May 12, 2016

చెడ్డ చిట్టోడు


          "చిట్టోడు చాలా మంచోడు" ఈ మాట నేను చెప్పటం కాదు గానీ, ఒక పదిహేనేళ్ళ క్రితం చిట్టోడి గురించి మా ఊళ్ళో వాడూ వీడూ అని లేకుండా ఎవరిని అడిగినా "అంత మంచోడు, అకరం మకరం తెలియనోడు మండలం మొత్తానికి లేడు. వాడు ఒక తప్పుడు పని చెయ్యటం గానీ, ఇంకో మనిషి గురించి తప్పుగా మాట్లాడటం గానీ చూడలేదు. అసలు ఈ రోజుల్లో అంత జాలి, దయ ఉన్నవాడిని చూద్దామన్నా దొరకడు." అని బాండు పేపరు మీద రాసిచ్చేసినట్టే చెప్పే వాళ్ళు. నిజానికి ఒక మనిషి గురించి కుండ బద్దలు కొట్టినట్టు మంచోడనో, చెడ్డోడనో కళ్ళు మూసుకుని చెప్పెయ్యలేం. ఒకరికి మంచోడు అనిపించినోడు ఇంకొకరికి చెడ్డోడు అనిపించవచ్చు, ఒకరికి చెడ్డోడు అనిపించినోడు ఇంకొకరికి మంచోడు అనీ అనిపించవచ్చు. అలాగే ఒక్కోసారి కాలం తో పాటూ మనిషి మారిపోనూవచ్చు. ఇంక ఇప్పటి సంగతి చెప్పాలంటే అసలు చిట్టోడు మా ఊళ్ళోనే లేడు. ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలీదు. అసలు ఉన్నాడో, లేడో కూడా తెలీదు. కానీ, ఇప్పటికిప్పుడు ఎవరయినా వెళ్ళి చిట్టోడి గురించి మా ఊళ్ళో అయిదో తరగతి చదివే చిన్న పిల్లవాడిని అడిగినా, ఒకటో ఎక్కం అప్పచెప్పమన్నంత తేలిగ్గా "అమ్మో వాడంత ఎదవ లేడంట కదా" అని కొంచెం భయం, కొంచెం గగుర్పాటు, కొంచెం చిరాకూ కలిపి మరీ చెపుతారు. ఇదివరకు పిల్లలు అల్లరి చెయ్యకుండా మాట వినటానికి కొమ్మర పొలం వెంకట సుబ్బమ్మ గారి చెరువు గట్టు మీద చింత చెట్టు మీద ఉండే ఒంటి కొమ్ము రాకాసి కి ఇచ్చేస్తానని భయపెట్టినట్టు, ఇప్పుడు మా ఊళ్ళో అమ్మలందరూ తీసుకెళ్ళి చిట్టోడికి ఇచ్చేస్తానని భయపెట్టటం కూడా మొదలెట్టారు. చిట్టోడు కూడా వాళ్ళమ్మకి పెళ్ళయిన ఏడేళ్ళకి లేక లేక పుడితే అసలు పేరు రామాంజనేయులో, వీరాంజనేయులో గుర్తు లేదు గానీ, ముద్దుగా చిట్టీ చిట్టీ అని పిలుచుకునేది. వాడికి పదేళ్ళ వయసప్పుడు అదేదో నోరు తిరగని పేరున్న రోగం వచ్చి వాళ్ళ నాన్న చచ్చిపోతే, పెంచి పెద్ద చేసి తెలిసినంతలో మంచి సంబంధం చూసి పెళ్ళి కూడా చేసింది.

               చిట్టోడి పెళ్ళి సంగతి ప్రస్తావనకి వచ్చింది కాబట్టి ఆ పెళ్ళికి సంబంధించి మా ఊళ్ళో అందరికన్నా పెద్ద వయసు ఉండే నారాయుడు తాత చెప్పే ఒక విషయం గురించి తప్పకుండా చెప్పుకోవాలి. అదేంటంటే పెళ్ళి ఒక నెల రోజులు ఉందనగా, లేనోళ్ళ పెళ్ళికి చెయ్యగలిగినంత సాయం చేస్తే పుణ్యం వస్తుందని, పాటిమీద గంగరాజు గారు చిట్టోడిని పిలిచి వాళ్ళ దక్షిణ పొలం లో ఉన్న పెద్ద సరుగుడు చెట్టుని పెళ్ళి భోజనాలు వండటానికి పుల్లలకి పనికొస్తుందని డబ్బులక్కరలేకుండా ఊరుకునే కొట్టుకెళ్ళమంటే, చిట్టోడు చెట్లు కొట్టే పెద్దిరాజు ని వెంట పెట్టుకుని చెట్టు దగ్గరికెళ్ళాక చెట్టు కింద ఎర్ర చీమల పుట్టా, చెట్టు మీద బోలెడన్ని పిచ్చుక గూళ్ళూ కనిపించాయి. అలవాటు ప్రకారం పెద్దిరాజు జేబులోనుంచి గమేక్సన్ పొట్లం తీసి పుట్ట మీద జల్లబోతుంటే, చిట్టోడు పెద్దిరాజు చేతిలోంచి పొట్లం లాగేసుకుని "ఏదో వాటి మానాన అవి బతుకుతుంటే, ఇప్పుడు నా పెళ్ళి కోసమని చేతులారా ఈ చీమల్ని చంపి, ఆ పిచ్చుకలకి గూడు లేకుండా చెయ్యాలా?, ఏమీ అక్కరలేద"ని చెప్పి వెళ్ళిన దారినే మళ్ళీ వెనక్కి వచ్చేస్తే, ఈ విషయం తెలిసి ఊళ్ళో కొంతమంది చిట్టోడి గురించి "ఇంత మంచోడిని చేసుకునే ఆ అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాల"ని తెగ చెప్పుకున్నారంట.

               పెళ్ళయ్యాక చిట్టోడికి వాళ్ళావిడ పొడుగు జడ తెగ నచ్చేసింది. అప్పటికి మట్టి తట్టలు మోసి, పేను కొరికేసి, జుట్టు మొత్తం ఊడి పోయింది గానీ చిన్నప్పుడు వాళ్ళమ్మ జడ కూడా ఇలాగే ఉండేది. పెళ్ళయిన మూడో రోజు ఎవరూ లేనప్పుడు చిట్టోడు వాళ్ళావిడ, చిట్టోడి దగ్గరకొచ్చి, అసలే పెద్ద కళ్ళు ఇంకాస్త పెద్దవి చేసి "ఏదో మా నాన్నకి చీటీల వ్యాపారం లో నష్టమొచ్చి ఐపి పెట్టేసి నీలాంటి తాడు బొంగరం లేనోడికి ఇచ్చి పెళ్ళి చెయ్యవలసి వచ్చింది గానీ లేకపోతే అసలు నాకు 'పంజా వేమవరం' లో ఉండే సినిమా హీరో చిరంజీవి బావమరిది చిన్నాన్న కొడుకు తోడల్లుడి అన్న గారి మూడో అబ్బాయినే అనుకున్నారు. అదే జరిగి ఉంటే, నా పెళ్ళి కి చిరంజీవే వచ్చే వాడు." అని గర్వం గా చెపితే, చిట్టోడు మామూలుగానే ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఒక రోజు చిట్టోడు వాళ్ళావిడ రాత్రి భోజనాలప్పుడు "పుట్టిన దగ్గర నుంచీ నాకు సన్న బియ్యం తినే అలవాటు. మీ ఇంట్లో దుడ్డు బియ్యం తిని అరిగించుకోలేక నన్ను చచ్చిపొమ్మంటావా?" అని చుట్టుపక్కల అందరూ వినేలాగ పెద్ద గొడవ పెడితే "మనలాంటోళ్ళు రోజూ సన్న బియ్యం తినాలంటే మాటలా?" అని చిట్టోడు నచ్చజెప్పబోయాడు. ఆ మాటకి ఇంకా చిర్రెత్తుకొచ్చిన వాళ్ళావిడ "ఎప్పుడూ ఇలా బీద అరుపులు అరవటం తప్ప నీకు ఇంకేం తెలుసు? అయినా మనిషన్నాక ఏం చేసయినా బతికినంత కాలం హంసలాగ బతకాలి. అంతేగానీ నీలాగా ముష్టి పాతిక సెంట్లు పొలం, రెండు గేదెలు పెట్టుకుని పేడలోను మట్టిలోను దొర్లు కుంటూ పంది లాగా బతికితే, బతికి లాభమేంటి?" అని నాలుగు దులిపేసి వెళ్ళి పడుకుండి పోయింది. చిట్టోడు వెళ్ళి బతిమాలి ఆ పూటకి అన్నం పెట్టాడు గానీ, ఈ ప్రపంచం లో తనని అసహ్యించుకునే మనుషులు కూడా ఉన్నారనే కొత్త విషయం మాత్రం అప్పుడే తెలుసుకున్నాడు.

               రోజు రోజుకీ చిట్టోడికీ వాళ్ళావిడకీ మధ్య దూరం పెరగడమే గానీ, తరగడం లేకుండా పోయింది. ఒక్కోసారయితే "మగాడన్నాక నలుగురిని కొట్టయినా నాలుగు డబ్బులు సంపాదించాలి. అయినా ఖర్చు పెట్టటం తెలిసినోడికే సంపాదించటం తెలుస్తుంది. సరదాగా సినిమాలు, ఎప్పుడయినా సిగరెట్టు, తాగుడు అయినా అలవాటు లేకుండా గీసి గీసి ఖర్చు పెట్టుకుని ఉన్నదాంట్లోనే మగ్గి పోయే నీలాంటోడికి ఇంక సంపాదించవలసిన అవసరం ఏముంది? పక్క వీధిలో ఉండే రాంపండు గారిలాగ 'ఎన్ ఫీల్డు ' మీద తిరగాలంటే నువ్వు ఇంకో పది జన్మలైనా ఎత్తాలి" అని రెచ్చగొట్టినట్టు కూడా మాట్లాడేది. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళావిడ నీళ్ళోసుకుందని తెలిసి చిట్టోడు చాలా సంబరపడిపోయాడు గానీ, వాళ్ళావిడ మాత్రం ఎవరికీ చెప్పకుండా ఏలూరు వెళ్ళి కడుపు తీయించుకుని వచ్చేసి "తలపాగాకి తక్కువ గోచీకి ఎక్కువ లాంటి బతుకు బతికే నీతో కాపురం చెయ్యటమే ఎక్కువ. ఇంకా పిల్లలని కూడా కని పెట్టాలా? అందుకే తీయించేసుకున్నాన"ని మొహం మీదే చెప్పేసింది. చిట్టోడి మనసు మీద మొదటిసారిగా అప్పటి వరకూ తనకి తెలియని, ద్వేష భావమేదో కమ్ముకోవటం మొదలయ్యింది. తను నిజంగానే అసమర్ధుడయినట్టూ, ఊళ్ళో ఎవరు ఏం మాట్లాడుకున్నా, తన గురించే మాట్లాడుకుంటున్నట్టు, అందరూ తనని చూసి నవ్వుకుంటున్నట్టూ అనిపించేది. నెమ్మది నెమ్మదిగా ఊళ్ళో ఎవరితోనూ కలవటం మానేశాడు. ఇంటికెళ్ళటం కూడా బాగా తగ్గించేసి, వాళ్ళమ్మ గురించి కూడా ఆలోచించటం మానేసి, ఎక్కువగా కల్లు కోటయ్య సారా దుకాణం దగ్గర మకాం పెట్టటం మొదలెట్టాడు. తొందరలోనే చిట్టోడి వాళ్ళావిడ ఎవరికీ చెప్పకుండా మా ఊరు వదిలేసి ఐపి పెట్టేసినందుకు ఊళ్ళో మొహం చూపించలేక హైదరాబాదు వెళ్ళిపోయిన వాళ్ళ అమ్మ, నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. "చిట్టోడు కల్లు కోటయ్య దుకాణం లో సారా పోసే 'ఆరేడు నిర్మల'తో తిరగడం మొదలెట్టాడని, అందుకే చిట్టోడిని వాళ్ళావిడ వదిలేసి వెళ్ళిపోయిందనీ, ఉన్న పాతిక సెంట్లూ అమ్మెయ్యగా వచ్చిన డబ్బులు ఆరేడు నిర్మలకే ఇచ్చేశాడ"నీ మా ఊళ్ళో జనాలు చెవులు కొరుక్కోవటం కూడా మొదలెట్టారు. చిట్టోడి గురించి బెంగ పెట్టుకునో ఎందుకో తెలీదు గానీ వాళ్ళమ్మ కూడా కొంత కాలానికి మంచం పట్టి తీసుకుని, తీసుకుని చచ్చిపోయింది.

               ఒక రోజు పుంత గట్టు మీద నడుచుకుంటూ, సారా దుకాణం వైపు వెళుతున్న చిట్టోడికి పక్కనే ఉన్న జమ్మి చెట్టు పొద కనిపించింది. మా ఊళ్ళో అందరూ ఆ జమ్మి పొదని పుంతలో ముసలమ్మ దేవతగా కొలుస్తారు. చిట్టోడు కూడా చిన్నప్పటినుంచీ అలాగే అనుకునేవాడు. వానా కాలం లో అబ్బాయిగారి చెరువు గట్టు మీద నేరేడు చెట్టు పళ్ళు ఎప్పుడు కోసుకుని తెచ్చుకున్నా దారిలో ఉండే ఈ జమ్మి పొద ముళ్ళ పైన నాలుగు పళ్ళు నైవేద్యంగా ఉంచి దణ్ణం పెట్టుకునేవాడు. ఆ జమ్మి పొదని చూడగానే చిట్టోడికి తన చిన్నతనం గుర్తుకొచ్చింది. అమ్మ, నాన్నలు గుర్తుకొచ్చారు. తన జీవితం లోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి వల్ల వచ్చిన పెను మార్పు గుర్తుకొచ్చింది. ఊహ తెలిసిన దగ్గర నుంచీ అపురూపంగా ఉంచుకున్న తన స్వచ్చమయిన, పవిత్రమయిన ఆత్మ పరిస్థితుల ప్రభావం వల్ల ధ్వంసమయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు తన జీవితం పక్వానికి రాకుండా పురుగు పట్టి కుళ్ళి పాడయిపోయిన చెట్టు కాయ లాగా తోచింది. ఈ విషయం లో తప్పు ఎవరిదో కూడా తను నిర్ధారించు కోలేకపోయాడు. తనకి ఎదురయిన పరిస్థితులని ఎదుర్కోలేకపోయాడా? తన శక్తికి మించిన పరిస్థితులు ఎదురయ్యాయా? అన్న విషయం కూడా చిట్టోడికి అర్ధం కాలేదు. తన జీవితంతో ఎవరో ప్రయోగం చేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది. తనకి అర్హత లేదన్నట్టు, కనీసం జమ్మిపొదకి చేతులెత్తి నమస్కరించటానికి కూడా నాశనమయిన తన మనసు సహకరించ లేదు. దూరంగా సత్తిరాజు గారి ఎడ్ల బండి మువ్వల చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిన చిట్టోడు మళ్ళీ మామూలుగానే కోటయ్య దుకాణానికి బయలుదేరాడు. అదే రోజు డబ్బుల విషయం లో చిట్టోడికీ కోటయ్య కీ జరిగిన గొడవలో చిట్టోడి మీద, చీకులు వేయించటానికి పొయ్యి మీద పెట్టిన వేడి నూనె పడిపోతే తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించారు గానీ కొన్నాళ్ళకి ఆసుపత్రి నుంచి బయటికొచ్చిన చిట్టోడి మొహమూ ఒళ్ళూ కాలిన మచ్చలతో వికృతంగా తయారయ్యి అధాటున చూస్తే ఊళ్ళో పిల్లలు, జనమూ భయపడేవాళ్ళు. ఇప్పుడు చిట్టోడి ఒకప్పటి మంచితనం గురించి మా ఊళ్ళో ఎవ్వరికీ గుర్తు లేదు. అసలు చిట్టోడి గురించి ఆలోచించే తీరికా ఎవరికీ లేదు, చిట్టోడి మంచితనం గురించి గుర్తుపెట్టుకున్న మిగిలిన ఒక్క నారాయుడు తాత కూడా చనిపోయాడు. ఇప్పుడందరికీ చిట్టోడు ఒక తాగుబోతని, తిరుగుబోతని, అందరితోనూ గొడవలు పెట్టుకుంటాడనీ, అంత చెడ్డోడు మండలం మొత్తానికి ఉండడనీ మాత్రమే తెలుసు. అందుకే చిట్టోడి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మామూలుగా 'చిట్టోడు' అని కాకుండా 'చెడ్డ చిట్టోడు' అని వెక్కిరింపుగా పిలవటం మొదలెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి చిట్టోడు కూడా ఊరొదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు.

               అన్నట్టు, ఈ మధ్యన మాత్రం ఒకసారి చిట్టోడి వాళ్ళావిడ దూరపు చుట్టం ఒకాయన ఏదో పని మీద మా ఊరొచ్చి "హైదరాబాదు లో వాళ్ళ నాన్న మళ్ళీ చీటీల వ్యాపారం, కొబ్బరికాయల వ్యాపారం మొదలెట్టి బాగా సంపాదించి చిట్టోడి వాళ్ళావిడకి మంచి కట్నం ఇచ్చి రెండో పెళ్ళి ఇంజినీరుతో మళ్ళీ పెళ్ళి చేశాడని, ఇప్పుడు ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, బంగారం లాంటి భర్త తో ఎంతో సంతోషం గా ఉందని, ఆ మధ్యన హైదరాబాదు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే అసలు అంత అణకువ, వినయం, మర్యాద ఉన్న పిల్లని ఎక్కడా చూళ్ళేద" ని చెపితే అంత గొప్ప ఇంటి పిల్లకి ఇప్పటికయినా మంచి రోజులు వచ్చినందుకు మా ఊరి జనం తెగ ఆనంద పడిపోయారు.

2 comments:

  1. అంతే ఇది కలికాలం ఇక్కడ మంచికి రోజులు లేవు డబ్బుకే అది ఎలా సంపాదించినా సరే... ఎక్యురేట్ గా రాశారు కధ ఈ కాలానికి కరెక్ట్ గా సరిపోతుంది. చాలా బాగుంది. ఐ పిటీ చిట్టోల్లాంటోళ్ళు గుడ్

    ReplyDelete