Thursday, May 19, 2016

కొత్తల్లుళ్ళు


          మామూలుగానే మా ఊళ్ళో ఎవరిదైనా పెళ్ళి జరుతుందంటే ఊరి మొత్తానికీ పండగలాంటిదే. ఎందుకంటే ఎలా లెక్కేసుకున్నా ఊళ్ళో అందరూ అందరికీ బీరకాయ పీచుకన్నా ఇంకొంచెం దగ్గరి బంధువులే అవుతారు. అందుకే ఊళ్ళో ఎవరి ఇంట్లో అన్నా పెళ్ళికి 'గాడి పొయ్యి' వెలిగిందంటే, ఆ మూడు రోజులూ ఊళ్ళో మిగిలిన వాళ్ళు పొయ్యి వెలిగించవలసిన అవసరంలేదు. అలాంటిది రంగయ్యగారి పండు గాడికీ, కిట్టయ్య గారి వెంకటేశులుకీ ఒకే రోజు పెళ్ళి ముహూర్తం కుదిరిందీ అంటే ఆ రోజు పెద్ద పండగా, కప్పాలమ్మ జాతరా కలబడి మా ఊరి మీద పడిపోయినంత బ్రహ్మాండమయిపోయింది. ఇంతకంటే బ్రహ్మాండమయిన ఇంకో సంగతేంటంటే ఇద్దరూ పెళ్ళి చేసుకోబోయే అత్తగారి ఊరు కూడా ఒకటే అవటం. ఆ ఊరి పేరు కొమ్మర. మా ఊరికి ఆ ఊరు పెద్ద దూరం కూడా కాదు. ఇద్దరు మనుషులు ఎదురూ, బొదురూ కూర్చుని పులి మేకా ఆడుకుంటున్నట్టు రెండు ఊళ్ళూ ఎదురెదురుగానే ఉంటాయి. కాకపోతే నిజంగానే ఆ ఊరి జనానికీ, మా ఊరి జనానికీ పులి కీ మేకకీ ఉన్నంత తేడా ఉంది. మా ఊరి జనంలా కాకుండా కొమ్మర వాళ్ళకి పెట్టేదగ్గర పెద్ద చెయ్యి, తిట్టే దగ్గర చెడ్డ నోరు అని చుట్టుపక్కల పేరు.

               అందుకే, ఇంక పెళ్ళికి పందిరి గుంజ పాతిన రోజు నుంచీ యానాళ్ళ భోజనాలు అయిపోయేవరకూ పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు తాలూకు మనుషులు ఎక్కడ ఎదురుపడినా ఒకరినొకరు వేళాకోళమాడుకోవటం, కొంచెంలో కొంచెం దెప్పిపొడుచుకోవటం మామూలయిపోయింది. పెళ్ళి రోజు పంక్తి భోజనానికొచ్చిన కొమ్మర పాత కరణం గారి పెద్ద కొడుకు అంజి బాబు గారయితే ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ పక్కనే కూర్చున్న మా ఊరి పెద్ద మనుషుల్లో ఒకరయిన పెద్దబ్బులు మాష్టారిని దొరకబుచ్చుకుని "అగ్గిపుల్ల ఖర్చుకి వెనకాడి, ఎవరు ముందు పొయ్యి వెలిగిస్తే వాళ్ళ దగ్గర నిప్పు తెచ్చుకుందామని అంగలార్చుకుని చూసే మీ పీనాసి జనానికి మా ఊరి సంబంధమంటే బూరెల బుట్టలో పడ్డట్టే కదా, కాదంటావా?" అని అందరి ముందూ అడిగేశారు. పెద్దబ్బులు గారు, ముందు రెండు గుటకలు మింగినా కానీ తర్వాత తేరుకుని "పులస చేపకోసం పొలాలమ్ముకునే మీకు మేము తప్ప వేరే గతి ఉంటే కదా, అయినా మా ఊరి రామాలయంలో రాముడు ఎంతో, మా పండు గాడు, వెంకటేశులు గాడూ అంత, అలాంటోళ్ళు సంక్రాంతి అల్లుళ్ళ హోదాలో అడుగు పెట్టాలంటే మా వాళ్ళకి పిల్లనిచ్చినోళ్ళు ఏ జన్మలోనో లక్ష వత్తుల నోము నోచుకుని ఉండాలి. కాదంటావా?" అని గట్టిగానే సమాధానమిచ్చి, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నెగ్గుకు రాలేమని చెయ్యి కడుక్కుని అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. నిజంగానే మా పండు గాడూ, వెంకటేశులు గాడి గురించి పోల్చి చెప్పాలటే ఒక్క శ్రీరాముడు తప్ప ఇంకో దేవుడు కనిపించడు. ఆ మాట అలా ఉంచితే ఇదంతా విన్న అక్కడే ఉన్న మా ఊరి కుర్రాళ్ళు కొంత మంది "ఏమయినా కొమ్మర ఊరి అత్తమామలు పెట్టే మణుగుడుపు భోజనం తినాలంటే నిజంగానే పెట్టి పుట్టాలెహె" అని పండు గాడికీ, వెంకటేశులు గాడికీ పట్టిన అదృష్టం గురించి మనసులోనే కుళ్ళుకున్నారు.

               పెళ్ళయిన మూడో రోజు కి ఈ వేళాకోళాలు మరీ ఎక్కువయిపోయి యానాళ్ళ భోజనాలకి వెంకటేశులు గాడి అత్తగారి ఇంటికి వెళ్ళిన మా ఊరి జనం ఓ ముప్పై మందిని ఏడిపించటానికి వెంకటేశులుగాడి పెద్ద బావ మరిది నాలుగు బ్రాందీ సీసాలు వాళ్ళ ముందు పెట్టి వెళ్ళి పోయాడు. ఎప్పుడయినా కల్లు కోటయ్య దగ్గర అప్పుడే చెట్టు మీద నుంచి దించిన కల్లు తాప్ప ఇంకొకటి తాగి ఎరగని మా ఊరి వాళ్ళు నీళ్ళు కలుపుకుని తాగాలని తెలియక కనిపించిన సీసా కనిపించినట్టు గడ గడా అని తాగేసి వాంతులు చేసుకుని వెళ్ళిన ట్రాక్టరు ట్రక్కు మీదే మళ్ళీ వెనక్కొచేశారు. ఇలా సందట్లో సడేమియా లాగా పెళ్ళి అయిపోయాక చెప్పుకోవలసిన మరో ముఖ్యమయిన బ్రహ్మాండమయిన విషయం ఏంటంటే పండు గాడు, వెంకటేశులు గాడి అత్తవారి ఇళ్ళు కూడా ఎదురెదురు గానే ఉండటం. అసలే పెట్టే దగ్గర పట్టింపులు ఎక్కువని పేరున్న అమ్మాజీ గారి అల్లుడు పండు గాడికి మొదటి రోజు అత్తగారి ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు మధ్యలో బంగారు పువ్వు తాపడం ఉన్న వెండి కంచం లో ఫిరంగి గుండంత మినప సున్నుండ, మళ్ళీ దాని మీద కుమ్మరించిన అర గ్లాసు నెయ్యితో మొదలయ్యి తర్వాత ప్రత్యేకంగా ఆత్రేయపురం నుంచి తెప్పించి చుట్టిన పూతరేకులు, అరిసెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, ఆ రోజు శని వారం కాబట్టి నీసు మాంసాలేవీ లేవు గానీ, అన్నం లోకి ఉగ్గిన్నుడు కాచిన నెయ్యితో ముద్ద పప్పు ఆవకాయ, జీడిపప్పు ములక్కాడ కూర, పనస పొట్టు కూర, వంకాయ శనగ పప్పు, చలవ చెయ్యటానికని పాలు పోసి కలబెట్టిన ఆనపకాయ కూర, చివరలో గడ్డ పెరుగు అందులో నంజు కోవటానికి తాటి బెల్లం ముక్క తో ముగిసింది. ఇంక ఇదివరకోసారి జన్మభూమి కార్యక్రమం కింద ఆ ఊరొచ్చిన కాలేజీ పిల్లలకే ఆ పది రోజులూ పంచభక్ష్య పరమాన్నాలూ పెట్టి పంపించి ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టు పక్కల కూడా అన్నం పెట్టే దగ్గర అంత గొప్ప మహా తల్లి లేదు అని అనింపించుకున్న రాజమ్మ గారి అల్లుడు వెంకటేశులు గాడి దంత సిరి గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నీసు మాంసాలు తినే రోజులైతే ఇద్దరికీ చేపల్లో పిత్త పరిగ దగ్గర నుంచి కొరమేను దాకా, మాంసాల్లో నాటు కోడి దగ్గర నుంచి కణుజు పిట్ట దాక, మధ్య మధ్య లో టైగర్ రొయ్యల వేపుడు, రెండు సొనల బాతు గుడ్లు, వంకాయ పీతల పులుసు, అంతా అయ్యాక పెరుగు అయితే వేడి చేస్తుందని అన్నంలోకి కంచం నిండా చిలికిన మజ్జిగ, అందులోకి నంజుకోవటానికి అరచెయ్యి పట్టినంత వెన్న ముద్దా, మళ్ళీ మధ్యాహ్నం ఒక్కోసారి రెండు గంగా బోండం కొబ్బరి కాయల నీళ్ళు, పెరుగు ఆవడలు, లేకపోతే దిబ్బరొట్టె ఉండేవి.

               ఇలా ఒక వారం రోజుల వీర వైభోగం తర్వాత ఒక రోజు పండు గాడు, వెంకటేశులు గాడూ కలిసి చెరువు గట్టు మీద వాలీ బాలు ఆడుతున్నారని తెలిసి సరదాగా చూడటానికి బయలుదేరారు. ఇద్దరూ ఒకళ్ళ పక్కన ఒకళ్ళు అలా చెరువుగట్టు దాకా నడుచుకుని వెళుతుంటే చూసిన వాళ్ళలో ఎవరు అన్నారో గానీ "అత్త గారింట్లో మణుగుడుపు భోజనానికి రాజమ్మ గారి అల్లుడి కన్నా అమ్మాజీ గారి అల్లుడు మంచి రంగు తేలి పుష్టిగా తయారయ్యాడని" నిజమో అబధ్ధమో గానీ, అందరి ముందూ ఒక మాట అనేశారు. ఈ మాటే ఆ నోటా, ఈ నోటా రాజమ్మ గారి చెవిన పడి ఆ రోజంతా తెగ ఇదయిపోయి అప్పటినుంచీ అల్లుడికి భోజనం కోటా రెట్టింపు చేయించి, ఒక సున్నుండకి రెండు సున్నుండలు, ఐదు గారెలకి పది గారెలు కంచం లో కుమ్మరించటం మొదలెట్టింది. ఆ తర్వాత నుంచీ వెంకటేశులు గాడినీ, పండు గాడినీ పక్క పక్క న చూసినోళ్ళు రాజమ్మ గారి అల్లుడు వెంకటేశులు ముందు అమ్మాజీ గారి అల్లుడు పండు గాడు అసలు ఆనటమే లేదని అనటం మొదలెట్టారు. ఈ మాటలకి తల కొట్టేసినట్టు అయిపోయిన అమ్మాజీ గారు ఊళ్ళో ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని పండు గాడి తిండి కోటా కూడా బాగా పెంఛేశారు. ఊళ్ళో అత్తగార్ల పరువు సంగతి ఏమో గానే ఈ పోటా పోటీ వ్యవహారం చివరికి పండు గాడికీ, వెంకటేశులు గాడికీ తినలేక నిజంగానే పెద్ద ప్రాణ సంకటమే అయిపోయింది. చివరకి ఆ ఊళ్ళో జనం వరల్డ్ కప్పు క్రికెట్టుకి పందాలేసినట్టు అమ్మాజి గారి అల్లుడు ఎక్కువ లావా ? రాజమ్మ గారి అల్లుడు ఎక్కువ లావా? అని పందాలు కాసు కోవటం మొదలెట్టారు. ఈ పోటీ ఎంత వరకూ వెళ్ళిందంటే, ఎవరో వచ్చి, గదిలో పెట్టి ఎండు మిరపకాయల పొగ వేస్తే ఉన్నపళంగా ఎర్రగా, లావుగా అయిపోతారని చెపితే ఇద్దరి అత్తమామలు దానికి కూడా సిధ్ధమయిపోయారు గానీ ప్రాణాల మీదకి వస్తుందేమో అని భయపడి వెనక్కి తగ్గారు. ఇంతకన్నా మంచి ఉపాయం బ్రాందీ, విస్కీ లు తాగించటమే అని నిర్ణయించేసుకుని, వాళ్ళ పెళ్ళాలతో చెప్పించి ఎప్పుడయినా కొంచెం పుచ్చుకుంటే ఏమీ కాదులే అని, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు, అల్లుళ్ళు ఇద్దరితోనూ నెమ్మదిగా మద్యపానం కూడా మొదలు పెట్టించారు.

               ఈ అత్తగారి ఇంట్లో మణుగుడుపు ముచ్చట్లు అయిపోయేనాటికి కోతలు మొదలైపోయి జనాలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి పోయి కొమ్మరలో కొత్తల్లుళ్ళు గురించి మట్లాడుకోవటం మానేశారు గానీ వాళ్ళిద్దరూ తిరిగి మా ఊళ్ళో అడుగు పెట్టేసరికి మాత్రం వాన పాము లాగా, గడ కర్రలాగా ఉండే పండు గాడు, వెంకటేశులు గాడూ, ఒకడు ఒంగోలు గిత్తలాగా, ఇంకొకడు మైసూరు ఎద్దు లాగా అయిపోయి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటేగానే ఊళ్ళో ఎవరూ వాళ్ళని గుర్తు పట్టలేనంతగా అయిపోయారు. ఇంకొన్ని రోజులకయితే చుట్టుపక్కల అటు ఏడు, ఇటు ఏడూ పధ్నాలుగు ఊళ్ళకీ, వీళ్ళ లాగా, పంట చేతికొచ్చిన చేను గురించి కూడా పట్టించుకోనంత పెద్ద తాగు బోతులు లేరన్న చెడ్డ పేరు కూడా తెచ్చేసుకున్నారు. ఇక అప్పటినుంచీ వాళ్ళ చేత తాగుడు మానింపించటానికి వాళ్ళ అమ్మా నాన్నలు, ఏదో సరదాకి చేసినదానికి ఇలా అయ్యిందేమిటా అని తెగ బాధ పడి పోయిన భార్యలు, నానా తంటాలు పడి అయ్యప్ప స్వామి మాలలు వేయించి, డాక్టర్లకి చూపించి, గోదారవతల అదేదో ఊళ్ళో ఆకు పసరు తో తాగుడు మానిపిస్తారని తెలిసి అక్కడికి తీసుకెళ్ళి చివరికి ఇద్దరూ చెరో ఇద్దరు పిల్లలకీ తండ్రులు అయ్యేనాటికి వాళ్ళచేత తాగుడు మానిపించగలిగారు. పండు గాడు, వెంకటేశులు గాడూ ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అయితే బ్రాందీ కొట్టు మొహం చూడలేదు గానీ, ఇక ముందు సంగతి ఏమో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎప్పుడూ అదురు గుండెలూ, బెదురు గుండెలతోనే ఉంటున్నారు.

No comments:

Post a Comment