Thursday, January 26, 2017

టాగోర్ గీతాంజలి - చలం


















               నేను ఏడో తరగతి లో వున్నప్పుడు , మా నాయనమ్మ,  కార్తీక మాసం లో , రోజూ శివుడికి పూజ చేసి, చెరువులో అరటి దొప్ప లో దీపాలొదిలి , సాయంత్రం నేను బడి నుంచి రాగానే 'కార్తీక పురాణం' పుస్తకంలోంచి నాతో రోజుకో కథ చదివించుకుని వినేది. ఆ పుస్తకం చదివాక నాకు దేవుడి మీద బోలెడన్ని సందేహాలొచ్చేసి, ఓ సారి మా తరగతిలో నాతోపాటు అందరికీ బాగా చనువు ఉన్న మా తెలుగు మాస్టారు ఉమా మహేశ్వర్రావు గారిని "దేవుడున్నాడాండీ?" అని అడిగేశాను. మామూలుగా అయితే మా లాంటి పిల్లలం అప్పుడప్పుడూ కుతూహలం కొద్దీ అడిగే "లారీలకి వెనకాల NP అని ఎందుకు రాసి ఉంటుందండీ?" "ఈ నేలని తవ్వుకుంటా కిందకంటా వెళ్ళిపోతే ఏమొస్తాదండీ?" "దూరదర్శన్ లో వార్తలు చదివే వాళ్ళు మనకి కనిపిస్తారు కదండీ, అలాగే మనం కూడా వాళ్ళకి కనిపిస్తామాండీ?" అని అడిగే వెర్రి మొర్రి కలగూరగంప ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా, నిక్కర్చిగా సమాధానాలు వివరించి చెప్పే ఆయన, ఈ ప్రశ్నకి కూడా, మా ఊరు కోమటి కొట్లో మాకు పప్పులు, బెల్లం ముక్కలు పెట్టే కోమటి తాత గారు కొట్లో వున్నారా? అని అడిగితే ఉంటే ఉన్నాడనీ, లేకపోతే లేడనీ,  ఖచ్చితం గా చెప్పేసినట్టు దేవుడు కూడా ఫలానా గుళ్ళో వున్నాడనో లేడనో తెగేసి చెప్పేస్తారుకున్నాను. కానీ నా ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం మాత్రం "దేవుడు ఉన్నాడనుకుంటే వున్నాడు. లేడనుకుంటే లేడు" అని. అసలు దేవుడు ఉన్నాడా ? అని మనకి అనుమానమొచ్చిందంటే దానికి కారణం దేవుడు నిజంగా ఉండయినా ఉండాలి లేదా లేని దేవుడిని ఉన్నాడని మనం నమ్ముతూ అయినా ఉండాలి. దేవుడు ఉన్నాడనటానికి ఏ విధమయిన శాస్త్రీయమయిన ఆధారం లేదు కాబట్టి దేవుడు లేడని వాదిస్తారు హేతువాదులు. దేవుడు ఉన్నా లేకపోయినా దేవుడి అవసరం మాత్రం మనిషికి చాలా ఉంది. లేకపోతే మనిషికి నైతిక విలువలు ఇంత సులువుగా, ఇంత బాగా ఎలా అబ్బాలి ?  ముఖ్యంగా మనిషికి మనశ్శాంతి, కావాలని తప్పు చేసి దండం పెట్టి తప్పించుకోవటానికి కావలసిన ఆధారం ఎక్కడ దొరకాలి ? ప్రపంచం లో ఉన్న చట్టాలు, ప్రభుత్వాలు పనికి రాకుండా పోయిన రోజు మనిషిని,మనిషిని కలిపి ఉంచగలిగిన శక్తి ఎంతో కొంత దైవ భావానికే ఉంది. నిజానికి మతం అనేది కేవలం ఒక అభిప్రాయం. దేవుడికి, మతానికి ఏ విధమయిన సంబంధమూ లేదు. ఇప్పడు మనిషికి కావలసింది కూడా మతాన్ని, దేవుడిని విడి విడి గా చూడగలిగినంత పరిణతి సాధించటమే. మనం అనుకునే ఈ పాప పుణ్యాలకీ, స్వర్గ నరకాలకీ, పూజా పునస్కారలకీ, భయ భక్తులకీ అతీతమయిన అలాంటి దేవుడు ఉన్నాడని తెలియజెప్పి అందరికీ కావలసిన ఆ అసలయిన దేవుడిని ఒక కొత్త దేవాలయంలో ప్రతిష్టించింది గీతాంజలి.

                 తల్లి మారాం చేసే బిడ్డని లాలించి, ఆడించి, పాడించి కుదురుగా ఒక చోట కూర్చోబెట్టినట్టు టాగోర్ కూడా గీతాంజలి లో దేవుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుడు లేడని వాదించే నాస్తికులనీ, ఉన్నా ఎలా చేరుకోవాలా అని ఆరాటపడే ఆస్థికులనీ సమానంగా పరవశింపజేశారు. గీతాంజలి కి నోబెల్ బహుమతి వచ్చిందని పుస్తకాల్లో చదివి, ఆ తర్వాత తొమ్మిదో తరగతి ఇంగ్లీషు వాచకం లో "Where the Mind is ..." అన్న పద్యం బట్టీ పట్టి గీతాంజలి లో దేశ భక్తి గురించి చెప్పారేమో అనుకున్నాను. ఆ తర్వాతెప్పుడో డిగ్రీ లో ఉండగా రాజమండ్రి గౌతమి లైబ్రరీ లో చలం గారి 'మైదానం' చదివి ఇంటికొచ్చేటప్పుడు ప్రకాష్ నగర్ పార్కు దగ్గర పుస్తక ప్రదర్శన లో చలం గారిదే టాగోర్ గీతాంజలి తెలుగు అనువాదం  కనిపిస్తే కోట గుమ్మం సెంటర్లో బజ్జీల బండి దగ్గర మిరపకాయ బజ్జీలు తిందామని దాచుకున్న పదిహేను రూపాయలతో ఆ పుస్తకం కొనేశాను. పుస్తకం చదివి పూర్తి చేశాక అప్పటివరకూ దేవుడి గురించి నాకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయిపోయి భగవంతుడి అసలయిన విశ్వరూపం నాకు సాక్షాత్కరించింది.

దేవుడిని కనిపెట్టటం కోసం కొట్టుమిట్టాడుతున్న వేదాంతులకీ, సైంటిస్టులకీ, బాబాలకీ, స్వాములకీ, వజ్ర కిరీటాలు చేయించే మహా భక్తులకీ, ఒంటికి బూడిద పూసుకుని ముక్కు మూసుకుని తలక్రిందులుగా తపస్సు చేసుకునే సన్యాసులకీ కూడా అర్థం కాని దేవుడి తత్వాన్ని...

 "ఊరి బాట వెంబడి ఇంటింటికీ బిచ్చమెత్తుతూ బయలు దేరాను. మిరుమిట్లు గొలిపే స్వప్నం వలే దూరంగా నీ బంగారు రధం కనిపించింది. ఈ రాజాధిరాజెవరో అని ఆశ్చర్యపడ్డాను. నా ఆశలతిశయించాయి. నా దరిద్రం తీరిపోయిందనుకున్నాను. అడక్కుండానే భిక్షం పెడతారనీ దుమ్ములో అన్నివేపులా ధనం వెదజల్లుతారనీ ఎదురుచూస్తూ నించున్నాను.నేనున్న చోటనే నీ రధం ఆగింది. నీ చూపు నా పైన నిలిచింది. చిరునవ్వుతో రధం దిగి వచ్చి నన్ను సమీపించావు. ఇంకేం ఈ నాటికి నా భాగ్యం పండిందనుకున్నాను. నువ్వు తటాలున నీ కుడి చెయ్యి చాచి "నా కేమిస్తావు?" అని అడిగావు."

"ఆభరణాలు మన ఐక్యతను చెరుపుతాయి, నీకూ నాకూ మధ్య అవి అడ్డం. నీ రహస్య వాక్కుని వినపడకుండా చేస్తుంది వాటి గలగల."

"నా జ్ఞానేంద్రియాలని ఎన్నడూ మూయను నా దృష్టి, శ్రవణం, స్పర్శ, నీ అనుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తాయి."

"ఈశ్వరుడు ఎండలో, వానలో, దుమ్ము కొట్టిన బట్టలతో వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు. నీ మడి బట్టలు అవతల పెట్టి అతని వలెనే నువ్వు కూడా దుమ్ము నేల మీదికి రా!"

"ఈ అన్వేషణ అంతా అర్ధం లేనిది. అవిచ్చిన్నమయిన సంపూర్ణత అంతటా విలసిల్లుతుంది."

అని ఈశ్వరుడిని ఉద్దేశించి చేసిన కవితా గానం తో పున్నమి రోజు రాత్రి వెన్నెల పరుచుకున్నట్టు మన కళ్ళకి చూపించి, మనసుకు అనుభవింపచేసింది గీతాంజలి.

       మనిషి దేవుడి కోసం అన్వేషించటం కాదు. దేవుడే మనిషి కోసం అన్వేషిస్తున్నాడు. మనిషి దేవుడికోసం ఆరాటపడటం కాదు. దేవుడే మనిషి కోసం ఆరాటపడుతున్నాడు. ఎప్పుడూ దేవుడిని వరాలు కోరుకోవటమే కాదు. అప్పుడప్పుడూ దేవుడిని కూడా "నువ్వు బాగున్నావా?" అని అడగాలని దేవుడే మనందరినీ అర్ధిస్తున్నాడు. మనిషికి దేవుడి అవసరం ఎంత ఉందో, దేవుడికి మనిషి అవసరం కూడా అంతే ఉంది. బహుశా అందుకే దేవుడు మనిషిని సృష్టించాడేమో? "భగవంతుడు మన కోసం పరితపిస్తున్నాడ"న్న టాగోర్ మనసు ఘోష గీతాంజలి మొత్తం అంతః ప్రవాహంగా సాగుతుంది.  గీతాంజలి మీద ఉన్న ఇష్టం వల్లనో, గీతాంజలిలోనే చెప్పినట్టు రాత్రీ పగలూ కష్టపడి మన చుట్టూ మనమే అంతు లేని ఎత్తయిన గోడలు కట్టుకోవటం లో మునిగిపోయి, చీకట్లో మొద్దు బారిపోయిన మన బుర్రలకి సూటిగా చెపితే అర్థం కాదనో తెలీదు గానీ, ఆదిశంకరాచార్యుల 'భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే' బాటలో 'మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది' అన్న శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' లోకి తన ముందుమాట తో మనలని లాక్కెళ్ళి పడేసిన అదే చలం, ముందు 30 పేజీల వ్యాఖ్యానంతో టాగోర్ గీతాంజలి లోకి కూడా అడుగులో అడుగు వేయించుకుని మనలని నడిపిస్తాడు.

   అయినా గీతాంజలి గురించి చెప్పటానికి నేనెంతటి వాడిని ? చలమే చెప్పినట్టు గీతాంజలి అంతరార్ధం చలానికేం తెలుసు ? టాగోర్ కి ఎంత మాత్రం తెలుసు ? చదివి, అనుభవించి, పలవరించి ఎవరికి వాళ్ళు తెలుసుకోవలిసిందే.

2 comments: