Tuesday, January 15, 2013

రాంబాబు చిన్నాన్న

                 నేను అయిదో తరగతిలో ఉండగా దశరా సెలవులకి మా ఊరికి ఆరేడు కిలోమీటర్ల దూరం లో బువ్వనపల్లి లో ఉండే మా మేనత్త, వాళ్ళ పెద్ద గేది ఈనిందని, నాకు జున్నంటే ఇష్టమని మా ఊరొచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది.రోజూ నా వాటా జున్ను, నాకిష్టమయిన పరమాన్నం కూడా తినేసాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కొంచెం దూరం లో పక్క వీధి లో ఉండే మా దూరపు బంధువు వరుసకి నాకు చిన్నాన్న అయ్యే, నా కన్నావయసు లో నాలుగయిదేళ్ళు పెద్ద వాడయిన రాంబాబు చిన్నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాడిని. వాళ్ళ ఇంటెనకాల పెద్ద రావి చెట్టు దాని మీద పిచ్చుక , కాకి గూళ్ళు ఉండి ఇంకా రామ చిలుక, పాల పిట్ట, గోరువంక లాంటి పిట్టలు అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళిపోయేవి.ఇంటి చుట్టూ రకరకాల కాయగూర మొక్కలతో, ఇంటి మీద, ఇల్లంతా అల్లుకు పోయిన ఆనపకాయ పాదు తో వాళ్ళ ఇల్లు నిజంగానే ఆకుపచ్చని బొమ్మరిల్లు లా ఉండేది. నేను వెళ్ళాక ఇద్దరం కలిసి పొలాల్లో పిల్ల కాలవలో చేపల కోసం ముందు రోజు వేసిన మావులు బయటికి తీసేవాళ్ళం. ఆ మావుల్లో ఒక్కో సారి చిన్న చేపలు, మట్టగుడసలు, బొమ్మిడాయలు, గొరకలు తో పాటు పెద్ద పెద్ద పాములు కూడా పడేవి. ఆ పాముల్ని జాగ్రత్తగా మళ్ళీ కాలవలో వదిలేసి చేపలన్నీ తీసుకుని, మధ్య మధ్య లో పొలం గట్ల మీద కనిపించే చిన్నచిన్న ఈత మొక్కల్ని వేళ్ళ తో సహా పెకిలించి కొడవలి తో దాన్ని మధ్య లోకి కోసి, అందులో ఉండే తెల్లని తియ్యగా ఉండే మొవ్వు తినమని నాకు ఇచ్చే వాడు, ఇంకా ఎక్కడయినా కుండ పెంకులు కనిపిస్తే తీసుకుని వాటితో దారిలో చెరువుల్లో, కాలువల్లో కప్ప గంతులు వేసుకుంటూ ఇంటికొచ్చేసేవాళ్ళం.

                          రాంబాబు చిన్నాన్న వాళ్ళ నాన్న మా చిన్న తాత అచ్చం "తాత మనవడు" సినిమా లో యస్వీ రంగారావు లా ఉండే వాడు.వ్యవసాయం పనులు తప్ప స్థోమత, శ్రద్ధ లేక వాళ్ళు గానీ, చుట్టాలు, మిగతా బంధువుల్లో గానీ ఎవరూ చదువుకోలేదు అందుకే అందర్లోకి నేనే చదువుకుంటున్నానని నన్నెంతో గొప్పగా చూసే వాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ. ఓ సారి మా చిన్న తాత నన్ను పక్కన కూర్చోబెట్టుకుని నాచేత మా తెలుగు వాచకం లోని "సత్యమేవ జయతే" అనే పాఠం మొత్తం చదివించుకుని విని మురిసిపోయాడు. మా రాంబాబు చిన్నాన్నయితే నన్ను భుజాలకెత్తుకుని "మా వాడు బాగా చదివేస్తాడు అప్పుడే వీడికి ఉత్తరాలు రాయటం చదవటం కూడా వచ్చేసు" నని ఊరంతా ఊరేగినంత పని చేసే వాడు.నేనెప్పుడయినా రాజమండ్రి మా మావయ గారి ఊరెళ్తే అస్తమాను

యాభయ్యేడు పదమూళ్ళెంత ?

నూట పన్నెండు లోంచి ఇరవై ఎనిమిది తీసేస్తే ఎంత ?

కేజి ఇనుము ఎక్కువ బరువా ? కేజి దూది ఎక్కువ బరువా ?

ఒక చెట్టుమీద పన్నెండు కాకులుంటే అందులో ఒక కాకి ని వేట గాడు తుపాకీ తో కాల్చేస్తే ఇంక చెట్టు మీద ఎన్ని కాకులుంటాయ్ ?

ఒక పిల్లి ఒక ఎలుకని ఇరవై నిమిషాల్లో తింటే తొమ్మిది పిల్లులు తొమ్మిది ఎలుకల్ని తినడానికి ఎంత సమయం కావాలి ?

లాంటి నాకిష్టం లేని కష్టమయిన లెక్కలూ, లాజిక్కులూ అందరి ముందూ అడిగే మా ఇంజినీరు మావయ్య, మా ఊరొచ్చినప్పుడు కూడా ఇలాగే అడిగి మా ఊళ్ళో కూడా నాకేమీ రాదని అందరూ అనుకునే లాగ నాపరువు తీసేసే వాడు.అలా కాకుండా మా రాంబాబు చిన్నాన్న వాళ్ళందరూ నన్ను ఇంత గొప్పగా చూస్తుంటే నాకు ఏనుగెక్కినంత సంతోషమొచ్చేసేది.

                        నా గురించి మా రాంబాబు చిన్నాన్న మరీ ఎక్కువ గొప్పలు చెప్పేస్తే, ఆ వీధిలోనే ఉండే నా వయసు అయిదో తరగతి పిల్లలందరూ నేనేదో పెద్ద చదివేసే వాడి లాగ, వాళ్ళందరూ చదువు రాని మొద్దుల్లగా అనిపించి మా ఇద్దరి మీదా శత్రుత్వం పెంచేసుకున్నారు.ఇంక నేను సెలవులు అయిపోయి మా ఊరు వెళ్ళిపోయే రోజు మాత్రం నన్నూ, మా రాంబాబు చిన్నాన్ననీ పిలిచి నేను నిజంగానే అంత తెలివయిన వాడినే అయితే వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళు చెప్పిన పుస్తకం చదివి చూపించమని సవాలు చేసారు.వాళ్ళ మొహాలు చూస్తే ఎలాగయినా నన్ను ఓడించాలని చూస్తున్నారనిపించినా, మహా అయితే ఏ "వినాయక చవితి వ్రతకల్పమో", "వర లక్ష్మీ వ్రతకల్పమో" ఇచ్చి అందులో తెలుగులో ఉండే సంస్కృతం కథ చదవమంటే చదివెయ్యచ్చులే అని రాంబాబు చిన్నాన్నని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం.అందులో ఒకడు వాళ్ళ అన్నయ్య చదివే ఏ తొమ్మిదో, పదో తరగతి హిందీ వాచకం చేతికిచ్చి చదవమన్నాడు.ఆరో తరగతి నుంచి తప్ప మాకు హిందీ అ, ఆ లు కూడా చెప్పరనీ, ఈ పుస్తకం నేను చదవలేననీ చెప్పినా మా రాంబాబు చిన్నాన్న వినేలా లేడు.మా రాంబాబు చిన్నాన్న దృష్టిలో చదవటం వచ్చినోడికి ఏమిచ్చినా చదివెయ్యాలి చివరకి అది హిందీ అయినా, మళయాళమయినా, తమిళం అయినా సరే.చదివే వరకూ వాళ్ళు కూడా మమ్మల్ని వదిలే లా లేరు.పుస్తకం చూసి నాకు చెమటలు పట్టి చేతులు వణకటం మొదలెట్టాయి.

            ఈ ఊళ్ళో కూడా నా పరువు, నాతో పాటు నన్ను ఎత్తుకుని ఊరంతా తిప్పినందుకు మా రాంబాబు చిన్నాన్న పరువూ కూడా పోయింది రా దేవుడా అని అనుకునే సమయానికి బళ్ళో మా అబ్రహం మాష్టారు చదివించే హిందీ "ప్రతిజ్ఞ" గుర్తొచ్చింది నాకు. "భారత దేశం నా మాతృ భూమి ..." అనే ప్రతిజ్ఞ ని అన్ని బడుల్లోనూ తెలుగులోనే చెప్పిస్తే మా బళ్ళో మాత్రం మా మాష్టారు తెలుగు తో పాటు హిందీ, ఇంగ్లీషుల్లో కూడా తెలుగులోనే రాయించి అందరి చేతా బట్టీ పట్టించి ప్రతి రోజూ పొద్దున్నే ప్రార్ధన లో రోజుకి ఒకళ్ళతో చెప్పించేవారు. వీళ్ళు కూడా నా తరగతే కాబట్టి హిందీ రాదు కదా అని నమ్మకం తో "భారత్ మేరా దేశ్ హై..." అని మొదలెట్టి దాన్నే ముందు నుంచీ, వెనకనుంచీ, మధ్య లోంచి రెండు మూడు సార్లు చదివే సరికి నేను హిందీ కూడా ఇంత బాగా, ధారాళం గా చదివేస్తున్నానని నోళ్ళెళ్ళబెట్టశారు వాళ్ళందరూ.వాళ్ళు తేరుకునే లోపు పుస్తకం వాళ్ళ చేతుల్లో పెట్టేసి మా ఊరు వెళ్ళటానికి బస్సు వచ్చేస్తుందని చెప్పి గబగబా అక్కడినుంచి బయటకొచ్చేశాను.అప్పట్నుంచీ మా రాంబాబు చిన్నాన్న కి నా మీద ఆరాధన ఇంకా ఎక్కువయిపోయి నన్ను దగ్గరుండి బస్సెక్కించి మళ్ళీ శెలవులక్కూడా తప్పకుండా రావాలని నా చేత ఒట్టేయించుకున్నత పని చేశాడు.

            ఆ తర్వాత చాన్నాళ్ళ వరకూ ఆ ఊరెళ్ళే ధైర్యం చెయ్యలేదు గానీ ఆ రోజు నాకు సంతోషాన్నిచ్చిన విషయం మాత్రం మా రాంబాబు  చిన్నాన్న కళ్ళల్లో ఆనందం. 

Saturday, January 5, 2013

ఎటో వెళ్ళిపోయింది మనసు

                     సినిమాలు పలు రకాలు. వినోదాన్నిచ్చేవి, సందేశాన్నిచ్చేవి, ఆహ్లాదాన్నిచ్చేవి.ఉద్వేగాన్నిచ్చేవి, ఉద్రేకాన్నిచ్చేవి. ఒక్కో సారి మన దురదృష్టం కొద్దీ తలనొప్పినిచ్చేవి. "ఎటో వెళ్ళిపోయింది మనసు" వీటిలో దేన్నీ ఇవ్వదు గానీ, తనతో పాటు మనల్ని కూడా అడుగులో అడుగేయించుకుని తీసుకెళ్ళిపోతుంది. సినిమా చూసేటప్పుడు అందులోని కథలు, పాత్రలు మనకి అంతకుముందే అనుభవం లో ఉంటే లేదా ప్రస్తుతం ఆ అనుభవం నడుస్తూ ఉంటే ఆ సినిమా మన మనసుకి సులువు గా హత్తుకుంటుంది. మన మనసుకి దగ్గరగా ఉన్న సినిమా చూసాక మన అనుభవానికి కొత్త అర్ధం స్ఫురించేలా చేస్తే ఆ సినిమా మనకి చాలా అవసరం.ఇలా చాలా మందికి చాలా అవసరమయిన సినిమాల్లో "ఎటో వెళ్ళి పోయింది మనసు" కూడా ఒకటి. ప్రతి మనిషీ జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడతాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అందులోంచి "బయట" పడతాడు.ప్రేమలో మునిగి పోయాక కూడా,  శబ్ద తరంగాల చలనానికి శబ్దానికీ , శబ్దానికీ మధ్య నిశ్శబ్దం ఎంత అవసరమో,  ప్రేమ లో పరిపక్వానికి ప్రేమికుల ప్రేమకీ, ప్రేమకీ మధ్య "గొడవ" కూడా అంతే అవసరం. ద్వేషం ఉన్నచోట ప్రేమ ఉందదేమో గానీ, ప్రేమ ఉన్న చోట ఎదో ఒక సందర్భం లో ద్వేషం ఉంటుంది.ముఖ్యం గా "Conditional" ప్రేమలో కూడా "ప్రేమ" బ్రతికున్నంత వరకూ ప్రేమ ద్వేషాన్ని జయిస్తూనే ఉంటుంది. ఈ సినిమా లో ఒక అబ్బాయి అమ్మాయీ మధ్య,  బాల్యం నుంచి పెళ్ళి వరకూ ఈ జైత్ర యాత్ర మూడు సార్లు సాగింది.

               ప్రేమ కాలేజీ లో జాలీ గానే సాగినా అబ్బాయికి భాధ్యతలని నెత్తుకెత్తుకోవటం అనివార్య మయ్యాక "Continuous expression of Love" భారం గానే అనిపిస్తుంది. ఆ "Discontinuity" ని భరించలేని అమ్మాయి "Love" స్థానం లో "Hate" ని ప్రతిక్షేపించుకుని తెగే వరకూ లాగి, తెంచుకోవటం అసాధ్యమని తెలుసుకుని చివరికి కలిసి బతకాలనుకోవటం స్థూలం గా ఈ సినిమా కథ. ఇంత మంచి ప్రేమ కథ లో నాని స్నేహితుడు, సమంత స్నేహితురాలి మధ్య "ఏ మాయ చేశావే" ని అడ్డం పెట్టుకుని "ప్రేమ లేని" సందర్భాన్ని ఇరికించి పాయసం లో పచ్చిమిరపకాయ లా అడ్డం పడినా కూడా, ఆ పాత్రలకి ప్రాధాన్యాన్ని సృష్టించి ఆ విధంగా ఒక ముగింపునివ్వటం దర్శకుడి భాధ్యత.

        సమంతా మొట్టమొదటిసారి తెర మీద కనిపించే దృశ్యాని దర్శకుడు ఎంత అద్భుతం గా చిత్రీకరించాడంటే నాని మనసులో కి మన మనసు పర కాయ ప్రవేశం చేస్తుంది.

           నాని వాళ్ళ అన్నయ్య పెళ్ళి చెడిపోయిన సన్నివేశాన్ని ఎక్కడా చూపించకపోయినా, తర్వాత ఆ భాధని కుటుంబ సభ్యులు పంచుకునే సన్నివేశం లోనే అక్కడ ఏం జరిగిందో మనకి మనమే ఊహించుకునేలా చేశాడు దర్శకుడు.

             సమంత ని పెళ్ళి చేసుకోవటం సాధ్యం కాదని వేరే అమ్మాయి తో పెళ్ళికి ఒప్పుకుని,  చివరి క్షణం లో మళ్ళీ మనసు మార్చుకుని సమంత ని పెళ్ళి చేసుకోవటానికి నిర్ణయించుకున్న నాని తో "ఇష్టం లేని పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయిని జీవితాంతం భాధ పెట్టటం కన్నా పెళ్ళి ఆగి పోవటమే మంచిద" ని తండ్రి పాత్రతో చెప్పించిన మాటతో హీరో చేసినదానికి ఒక "Justification" ఇవ్వగలిగాడు దర్శకుడు. ప్రేమ కథల్నీ , ముఖ్యంగా ఈ తరం యువతీ యువకుల ప్రేమని సరిగ్గా అర్ధం చేసుకుని, అర్ధవంతం గా తెరకెక్కించటం లో గౌతం మీనన్ ఆరితేరిపోయాడని మరోసారి నిరూపించుకున్నాడు. సహజంగానే ఈ ప్రేమ కథ కి ఇళయరాజా సంగీతం పరిపూర్ణతనిచ్చింది.

              ముందే చెప్పుకున్నట్టు మనల్ని రంజింప లేని సినిమా,  మన అనుభవం లోకి రాని సినిమా మనకి వృధా. అందుకే కొంతమందికి నచ్చిన సినిమాలు మరికొంత మందికి "చెత్త" లా అనిపిస్తాయి. కొంత మందికి "చెత్త" లా అనిపించిన సినిమాలు ఇంకొంత మందికి "ఉత్తమం" గా అనిపిస్తాయి. అన్ని అనుభవాలూ , అందరికీ ఉండాలన్న రూలేమీ లేదు కాబట్టి అలాంటి వారికి ఈ సినిమా ఏదో,  లో బడ్జెట్ లో, కేవలం పది పదిహేను మంది నటీ నటులతో , నాలుగు గోడల మధ్య, డాబా మీదా, బీచ్ పక్కన తీసేసి వదిలేసిన ఒక సాదా సీదా సినిమా లా కూడా అనిపిస్తుంది.

                                    

Tuesday, January 1, 2013

వరదరాజపురం 15 కి.మీ

                              చాన్నాళ్ళ తర్వాత హైదరాబాదు నుంచి ఊరెళ్దామని బయల్దేరి తాడేపల్లిగూడెం లో రైలు దిగి బస్టాండుకొచ్చి మా ఊరి బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. గూడెం నుంచి మా ఊరు పదిహేను కిలో మీటర్లు. అరగంట తర్వాత బస్సొచ్చింది. చెమటలు తుడుచుకుంటూ  గబ గబా బస్సెక్కి కిటికీ పక్క సీట్లొ కూలబడ్డాను. ఎక్కిన పావు గంట తర్వాత బస్సు బయల్దేరింది. ఐదు నిమిషాలకు కండక్టర్  టిక్కెట్ టిక్కెట్  అనుకుంటూ దగ్గరకొచ్చి "ఎక్కడికి" అన్నాడు. "వరదరాజపురం ఒకటివ్వండి"  అన్నాను డబ్బుల కోసం  జేబులో చెయ్యి పెడుతూ. తనదగ్గరున్న చార్టులో వరదరజపురానికి చార్జీ ఎంతో చూస్తూ "తొమ్మిది రూపాయలు" అన్నాడు. మా ఊరు చాలా చిన్నది అందుకే అక్కడికెళ్ళే  పాసింజర్లు కూడా చాలా తక్కువ. వూరికి చార్జీ ఎంతో కండక్టర్ కి కూడా చార్టులో చూస్తే గాని  తెలీదు. జేబులోంచి   పది రూపాయల నోటు  తీసి ఇచ్చాను. రూపాయి చిల్లర లేదు  నీ దగ్గర రూపాయుంటె ఇవ్వు రెండు రూపాయలిస్తా అన్నాడు. వెనుక జేబులోంచి రూపాయి తీసిచ్చి టిక్కెట్టు, చిల్లర తీసుకుని జేబులో వేసుకుని కిటికీ లోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను.
                     
                    బస్సు వంతెన దాటి వేంకట్రామా ధియేటరు, రేలంగి చిత్ర మందిరు దాటి పెద్ద కాలువ పక్కగా వెళ్ళే పెంటపాడు రోడ్డెక్కింది. వేసవి కాలం సెలవులు  కావటంతో  పిల్లలు ఎండి పోయిన కాలువ గట్టు పక్కన వున్న పచ్చికలో గేదెల్ని మేపుతున్నారు. చిన్నప్పుడు నేనూ ఆ పిల్లల్లో ఒకణ్నే కోతి కొమ్మచ్చి, గొళీలాట, గూటి బిళ్ళ, ఊర చెరువులో ఈత అన్నీ గుర్తొచ్చాయి నాకు. "వరదరాజపురం వచ్చింది ఇక్కడ కొత్తపల్లి రోడ్డు దగ్గర దిగుతావా ముందు మాలపల్లి వంతెన దగ్గర దిగుతావా?" అన్నాడు కండక్టరు దగ్గరకొచ్చి. ఇక్కడాపండి అన్నాన్నేను ఈ లోకంలోకొస్తూ.

           ఎదురుగా గొప్పులు గోతుల్తో ఎర్రటి కంకర్రోడ్డు , మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలొ వడ గాల్పుకి గాల్లోకి ఎగురుతున్న కంకర. క్రితం సారి ఊరి ప్రెసిడెంటుగా ఎన్నికయిన తాగుబోతు భాస్కర్రావు, గవర్నమెంటు ఈ రోడ్డుకి శాంక్షను చేసిన డబ్బులన్నీ తినేశాడని   మా ఊరి కుక్కల ప్రెసిడెంటు కొడుకు మొన్న ఫోను చేసినప్పుడు చెప్పాడు. కుడి పక్కన నిద్ర గన్నేరు చెట్టు మీద కొమ్మల్లో ఎటూ కదలకుండా కూర్చున్న రెండు కాకులు. ఈ పక్క కొమ్మ మీద తల్లి నోట్లో తిండి కోసం వెతుక్కుంటున్న ఎర్ర నోరు పిల్ల కాకుల్ని సముదాయిస్తున్న తల్లి కాకి. నాలుగడుగులు ముందుకెళ్ళాక ఎడం పక్కన కాలవవతల చింత చెట్టు కింద అర్ధవరం రాజులు పురమాయించి పెట్టిన చలివేంద్రం పోసే తాత కేకేశాడు "ఏరా అబ్బాయ్ ఇదేనా రావటం పట్టి దాటి రా మజ్జిగ తాగిది గాని " అన్నాడు. చల్లటి చలివేంద్రం తాగి ముందుకు నడిచాను.

            రోడ్డు పక్క చేను గట్టు దిబ్బ మీద విరగ కాసిన కలెక్టరు మామిడి కాయల చెట్టు చూసి నా  చిన్నప్పుడు సంఘటన ఒకటి గుర్తొచ్చింది నాకు. నేను నాలుగో తరగతి లో వున్నప్పుడనుకుంట నేనూ మా ఫ్రెండు కిట్టి గాడు చెట్టు కాయల కోసం దొంగ చాటుగా రాళ్ళతో కొడుతున్నాం ఇంతలో ఎక్కడినుంచి వచ్చోడొ గాని ఆ చెట్టు యజమాని సత్తిరాజు గారి అబ్బాయి పెద్ద శీను గట్టిగా అరుస్తూ మా వైపే గబ గబా వస్తున్నాడు మేమిద్దరం పరుగు లంకించుకున్నాం. కానీ వాడి కుక్కకి మాత్రం దొరికిపోయాం. ఇంకోసారి ఇటువంటి పని చేస్తే  పంచాయతీ లో పెట్టిస్తానని  బెదిరించి వదిలేశాడు. ఆ తర్వాత సత్తిరాజు వూళ్ళో తనకున్న వరి పొలాలన్నీ చేపల చెరువులు  చేసేసి బాగా డబ్బు గడించి రాజమండ్రి లో దేనితోనో తిరుగుతూ మహాతల్లి లాంటి వాళ్ళావిణ్ణి హింసించేవాడని,  ఆ భాధతో ఆవిడకి మతి చలించి ప్రస్తుతం పిచ్చిదానిలా తిరుగుతుందని తెలిసి మనసు ఏదోలా అయిపోయింది. "ఏరా మంచి ఎండలో బయల్దేరినట్టున్నావు ఇప్పుడు హైదరాబాదు లోనె వుంటున్నావా" అని అరిచాడు దూరంగా చేలో పిల్లిమిసర కోస్తున్న పద్దాలెంకమ్మగారి, సూర్రావు గారి అబ్బాయి చంటిగాడు. "అవున్రా" అన్నాన్నేను వాడి దగ్గరకెళ్తూ.  "మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు ఇప్పుడు" అన్నాను. కొంత కాలం క్రితం జబ్బు చేసి చచ్చిపోయిన వాళ్ళమ్మ గురించి అడిగి వాడి మనసు మళ్ళీ భాధ పెట్టడం ఇష్టం లేక. వాళ్ళమ్మ చచ్చి పోయాక వెళ్ళి పోయి సినిమాల్లో జేరి పోయాడనీ , ప్రస్తుతం రాజమౌళి దగ్గర మూడో అసిస్టెంటు డైరెక్టరు గా పని జేస్తున్నాడని,  ఈ మధ్య రిలీజైన సినిమాలో వాడి పేరు కూడా పడిందనీ,  ఫోను చేసి అందరి గురించీ అడుగుతుంటాడనీ బాగా బిజీ అయిపొయాడనీ ఆనందం తో చెప్పేస్తున్నాడు వాడు. చిన్నప్పుడు వాళ్ళన్నయ్యా, నేనూ సైకిలేసుకుని గణపవరం లో వున్న ఇప్పటి ఎమ్మెల్యె బాపిరాజు గారి నాన్న మూర్తిరాజు గారి లైబ్రరీ లో పుస్తకాలన్నీ ఆకలేసినోడికి అప్పడాలు దొరికినట్టు చదివి పాడేసేవాళ్ళం . "తర్వాత ఓ సారి మీ అన్నయ్య ఫోన్ నంబరియ్యి" అన్నాను. "ఇంటికొచ్చి నంబరిస్తా తప్పకుండా కలు" అన్నాడు మళ్ళీ పిల్లిమిసర కోసుకోవటం లో మునిగిపోతూ. రోడ్డెక్కి ముందుకి నడిచాను.

               పక్కనే బంగార్రాజు గారి చెరువు ఎండలో వెండి పళ్ళెం లా మెరిసిపోతుంది అక్కడక్కడా తామరపూలు, తామరాకులతో. చెరువు గట్టు మీద చింత చెట్టు, కొబ్బరి చెట్లూ, సపోటా చెట్లూ, గడ్డి మేటూ అక్కడంతా చల్లగా ఉండేలా ఉంది. ఈ పక్క గుడిసె బయట చెట్ల నీడలో ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైన బక్కోడు పెళ్ళాం తో కబుర్లాడుతున్నాడు. ఏదో లోకం లో ఉన్నారు వాళ్ళిద్దరూ. దూరంగా అరటి తోటల మధ్యలోంచి చిన్నప్పుడు చదువుకున్న బడి కనిపిస్తోంది. మా అబ్రహాం మాస్టారు అవ్వడానికి క్రిస్టియనే అయినా భగవద్గీతా అందులోని శ్లోకాలు విడమర్చి చెప్పేవారు మాకు అప్పుడప్పడూ. ఇంగ్లీషు, లెక్కలూ, సోషలూ, హిందీ ఇలా ఏ సబ్జెక్టు టీచరు లేక పోయినా అన్నీ ఆయనే చెప్పేసే వారు. ఒక్క చదువే కాదు పుస్తకాల బైండింగు, ఆటలు, పాటలు అన్నీ నేర్పేవారు పిల్లలకి. ఆ తర్వాత ఆ ఊరికీ  ఆ ఊరికీ ట్రాన్సఫరు అవుతూ మంచి ఉపాధ్యాయుడుగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు కాని తర్వాత వాళ్ళమ్మాయి ఎవరితోనో లేచిపోతే మనుషుల్ని సృష్టించిన దేవుడి మీద కోపంతొనో, మనుషులు సృష్టించిన కట్టుబాట్ల మీద  కోపంతొనో , ఆ కట్టుబాట్లు లెక్క చేయని కూతురి మీద కోపంతోనో తెలీదు గానీ ఆయన ఉరేసుకుని చచ్చిపోయాడు. మలుపు తిరిగి ఊళ్ళోకొచ్చి అబ్బాయిగారిల్లు దాటి సిమ్మెంటు రోడ్డెక్కాను. ఈ మధ్యనే కొత్తగా డాబా కట్టుకున్న గంగ రాజు తాత వాళ్ళావిడ పలకరిస్తే మాట్లాడి డ్రైనేజి పక్కన కట్టేసిన బార కొమ్ముల గేదిని దాటాక మా ఇల్లొచ్చింది.

మా వరదరాజపురం కథలు

                 పుట్టి బుద్ధెరిగాక నాకిష్టమైన చందమామ కథల తర్వాత చిన్నప్పుడు డి.డి లో వచ్చే "మాల్గుడి డేస్" ఆ తర్వాత "అమరావతి కథలు" చూసి, ఎప్పుడైనా లైబ్రరీ కి వెళ్ళినప్పుడు "స్వాతి" కనిపిస్తే అందులో వచ్చే వంశీ "పసలపూడి కథలు" చదివి, ఇంకా తర్వాత ఇంటర్నెట్ లో నామిని సుబ్రహ్మణ్యం నాయుడి గారి "మిట్టూరోడి కథలు" తో పరిచయం పెరిగిపోయి , అచ్చం ఇలాంటి మనుషులే, ఇలాంటి మనసులే మా ఊళ్ళో కూడా బోలెడు మంది ఉన్నారనిపించేసి, వంట బాగా నచ్చేసినోడికి ఆ వంట నేర్చేసుకుని సొంతం గా చేసెయ్యాలనిపించినట్టు చదవగా, చదవగా నాకూ రాసెయ్యాలనిపించి ఆ స్థాయి లో కాక పోయినా నాకు తెలిసినట్టు నా స్థాయి లో నేను రాసుకున్న కథలే ఈ "మా వరదరాజపురం కథలు". సహజం గానే పిల్లలేంచేసినా తల్లికి "అధ్భుతమ" ని పించినట్టే నేనేం చెప్పినా, రాసినా మా ఫ్రెండ్సందరూ సూపరంటే, నాకూ ధైర్యం తెగ పెరిగి పోయి తెగించి రాసేస్తున్నాను.

                అప్పు తీసుకుని అడిగితే ప్రతి మనిషి అనుభవాలూ, జ్ఞాపకాలూ ఓ పెద్ద పుస్తకమే, మనుషులు వేరయినా "ఆత్మ" ఒకటే అయినట్టు అనుభవించ గలిగితే అందరి భాధా మన భాధ. ఆ భాధ కీ, ఆవేదనకీ, సంతోషానికీ అక్షర రూపమిచ్చి అందరికీ పంచిన ఎందరో మహానుభావులు. అటువంటి అక్షరాల అనుభవాలు నేనూ కొన్ని పోగుచేసుకున్నాక, ఓ సారి మా ఊళ్ళో రెండొందల ఎకరాలున్న సుబ్బరాజు గారి కొడుకు పెళ్ళికి ఊరందరినీ భోజనానికి పిలిస్తే, మా లాంటి పిల్లా పీచూ అందరం కలిసి భోజనాలకెళ్ళేటప్పుడు పిల్లలకి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని మా వెంకటేసులు గాడి వాళ్ళమ్మ మేమందరం ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా "ఒరేయ్ బాబూ పంక్తి లో ఎక్కువగా తినకు రా దిష్టి తగులుతుంది" అని చెప్పిన ఒకే ఒక్క మాట లో  ఆ తల్లి ప్రేమకీ, భాధ కీ, అమాయకత్వానికీ కనిపించిన పరాకాష్ఠనే అందరికీ నేను కూడా పంచాలనిపించింది.  సాధ్యమయినంత వరకూ సూటిగా, అతిశయోక్తులు లేకుండా చెప్పటానికీ, వీలయినన్ని తక్కువ ఇంగ్లీషు పదాలు ఉపయోగించటానికీ ప్రయత్నించాను.

          ఇంకా  నా గురించి చెప్పాలంటే బెంగుళూరు లో ప్రస్తుతం సాఫ్టువేరు ఇంజినీరు గా ఉద్యోగం చేసుకుంటూ కథలు రాయాలనిపించినప్పుడూ, పనంటే  బోరు కొట్టినప్పుడూ కూడా కథలు రాసుకుంటూ గడిపేస్తున్నాను. యుగ ధర్మమో, కలి ప్రభావమో తెలీదు గానీ, బ్రహ్మం గారు కాల జ్ఞానం లో చెప్పకపోయినా, చలం గారు ఎప్పుడో చెప్పేసినట్టు "Bitch Goddess of Success" చుట్టూ విరామం లేకుండా ప్రదక్షిణం చేసే అగత్యం అనివార్యమయిన మనలాంటి మనుషులందరికీ ఎప్పుడైనా ఇలాంటి కథలు కనిపిస్తే ఆగి చూసి వెళ్ళే టప్పుడు, ఈ కథలు కూడా చదివిన తర్వాత అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇంకా చిన్నప్పుడు కలువ పువ్వుల కోసమో, కలువ కాయల కోసమో చెరువులో దిగి కాలు జారి మునిగిపోబోతే బింది పట్టుకుని నీళ్ళ కోసం వచ్చి చూసి గబ గబా మనల్ని జుట్టు పట్టుకుని పైకి లాగి ఒడ్డున పడేసిన సుబ్బమ్మత్తా, మనతో పాటు అయిదో తరగతి దాక చదివి తర్వాతెప్పుడో కొయిటా వెళ్ళిపోయి అక్కడెవరో మోసం చేస్తే పాస్ పోర్టు కూడా పోగొట్టుకుని పోలీసుల చేత చావు దెబ్బలు తిని ఇంటికి తిరిగొచ్చిన రాజు గాడు, ఇంటర్లో "ద్విపద సిద్ధాంతం" అర్ధం గాక పరీక్షల్లో ఎలాగరా అనుకుంటే ఇంటికి పిలిచి మరీ ఒకటికి రెండు సార్లు అర్ధమయ్యేలా చెప్పి పంపిన లెక్కల మాస్టారు, పొలం లో ఈత పళ్ళ కోసం చెట్టెక్కి పట్టు తప్పి కింద పడి చెయ్యిరగ్గొట్టుకున్న ఈత చెట్టూ అన్నీ ఓ సారి పదిలం గా వున్నాయేమో చూసి రావాలన్న  స్పృహ మనసులో ఓ క్షణం పాటయినా అనిపించేలా చేసినా ఈ కథలూ , నేనూ అదృష్టవంతులం.

చదివిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యాలని కోరుకుంటూ.


గోపి.గారపాటి
ఈమెయిల్ : garapatigopi@gmail.com