Tuesday, January 1, 2013

మా వరదరాజపురం కథలు

                 పుట్టి బుద్ధెరిగాక నాకిష్టమైన చందమామ కథల తర్వాత చిన్నప్పుడు డి.డి లో వచ్చే "మాల్గుడి డేస్" ఆ తర్వాత "అమరావతి కథలు" చూసి, ఎప్పుడైనా లైబ్రరీ కి వెళ్ళినప్పుడు "స్వాతి" కనిపిస్తే అందులో వచ్చే వంశీ "పసలపూడి కథలు" చదివి, ఇంకా తర్వాత ఇంటర్నెట్ లో నామిని సుబ్రహ్మణ్యం నాయుడి గారి "మిట్టూరోడి కథలు" తో పరిచయం పెరిగిపోయి , అచ్చం ఇలాంటి మనుషులే, ఇలాంటి మనసులే మా ఊళ్ళో కూడా బోలెడు మంది ఉన్నారనిపించేసి, వంట బాగా నచ్చేసినోడికి ఆ వంట నేర్చేసుకుని సొంతం గా చేసెయ్యాలనిపించినట్టు చదవగా, చదవగా నాకూ రాసెయ్యాలనిపించి ఆ స్థాయి లో కాక పోయినా నాకు తెలిసినట్టు నా స్థాయి లో నేను రాసుకున్న కథలే ఈ "మా వరదరాజపురం కథలు". సహజం గానే పిల్లలేంచేసినా తల్లికి "అధ్భుతమ" ని పించినట్టే నేనేం చెప్పినా, రాసినా మా ఫ్రెండ్సందరూ సూపరంటే, నాకూ ధైర్యం తెగ పెరిగి పోయి తెగించి రాసేస్తున్నాను.

                అప్పు తీసుకుని అడిగితే ప్రతి మనిషి అనుభవాలూ, జ్ఞాపకాలూ ఓ పెద్ద పుస్తకమే, మనుషులు వేరయినా "ఆత్మ" ఒకటే అయినట్టు అనుభవించ గలిగితే అందరి భాధా మన భాధ. ఆ భాధ కీ, ఆవేదనకీ, సంతోషానికీ అక్షర రూపమిచ్చి అందరికీ పంచిన ఎందరో మహానుభావులు. అటువంటి అక్షరాల అనుభవాలు నేనూ కొన్ని పోగుచేసుకున్నాక, ఓ సారి మా ఊళ్ళో రెండొందల ఎకరాలున్న సుబ్బరాజు గారి కొడుకు పెళ్ళికి ఊరందరినీ భోజనానికి పిలిస్తే, మా లాంటి పిల్లా పీచూ అందరం కలిసి భోజనాలకెళ్ళేటప్పుడు పిల్లలకి మూడు పూటలా కడుపు నిండా అన్నం పెట్టలేని మా వెంకటేసులు గాడి వాళ్ళమ్మ మేమందరం ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా "ఒరేయ్ బాబూ పంక్తి లో ఎక్కువగా తినకు రా దిష్టి తగులుతుంది" అని చెప్పిన ఒకే ఒక్క మాట లో  ఆ తల్లి ప్రేమకీ, భాధ కీ, అమాయకత్వానికీ కనిపించిన పరాకాష్ఠనే అందరికీ నేను కూడా పంచాలనిపించింది.  సాధ్యమయినంత వరకూ సూటిగా, అతిశయోక్తులు లేకుండా చెప్పటానికీ, వీలయినన్ని తక్కువ ఇంగ్లీషు పదాలు ఉపయోగించటానికీ ప్రయత్నించాను.

          ఇంకా  నా గురించి చెప్పాలంటే బెంగుళూరు లో ప్రస్తుతం సాఫ్టువేరు ఇంజినీరు గా ఉద్యోగం చేసుకుంటూ కథలు రాయాలనిపించినప్పుడూ, పనంటే  బోరు కొట్టినప్పుడూ కూడా కథలు రాసుకుంటూ గడిపేస్తున్నాను. యుగ ధర్మమో, కలి ప్రభావమో తెలీదు గానీ, బ్రహ్మం గారు కాల జ్ఞానం లో చెప్పకపోయినా, చలం గారు ఎప్పుడో చెప్పేసినట్టు "Bitch Goddess of Success" చుట్టూ విరామం లేకుండా ప్రదక్షిణం చేసే అగత్యం అనివార్యమయిన మనలాంటి మనుషులందరికీ ఎప్పుడైనా ఇలాంటి కథలు కనిపిస్తే ఆగి చూసి వెళ్ళే టప్పుడు, ఈ కథలు కూడా చదివిన తర్వాత అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ ఇంకా చిన్నప్పుడు కలువ పువ్వుల కోసమో, కలువ కాయల కోసమో చెరువులో దిగి కాలు జారి మునిగిపోబోతే బింది పట్టుకుని నీళ్ళ కోసం వచ్చి చూసి గబ గబా మనల్ని జుట్టు పట్టుకుని పైకి లాగి ఒడ్డున పడేసిన సుబ్బమ్మత్తా, మనతో పాటు అయిదో తరగతి దాక చదివి తర్వాతెప్పుడో కొయిటా వెళ్ళిపోయి అక్కడెవరో మోసం చేస్తే పాస్ పోర్టు కూడా పోగొట్టుకుని పోలీసుల చేత చావు దెబ్బలు తిని ఇంటికి తిరిగొచ్చిన రాజు గాడు, ఇంటర్లో "ద్విపద సిద్ధాంతం" అర్ధం గాక పరీక్షల్లో ఎలాగరా అనుకుంటే ఇంటికి పిలిచి మరీ ఒకటికి రెండు సార్లు అర్ధమయ్యేలా చెప్పి పంపిన లెక్కల మాస్టారు, పొలం లో ఈత పళ్ళ కోసం చెట్టెక్కి పట్టు తప్పి కింద పడి చెయ్యిరగ్గొట్టుకున్న ఈత చెట్టూ అన్నీ ఓ సారి పదిలం గా వున్నాయేమో చూసి రావాలన్న  స్పృహ మనసులో ఓ క్షణం పాటయినా అనిపించేలా చేసినా ఈ కథలూ , నేనూ అదృష్టవంతులం.

చదివిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యాలని కోరుకుంటూ.


గోపి.గారపాటి
ఈమెయిల్ : garapatigopi@gmail.com


No comments:

Post a Comment