Monday, December 22, 2014

విశ్వదర్శనం పాశ్చాత్య చింతన


















              త్వశాస్త్రానికి సంబంధించి నండూరి రామ్మోహన రావు గారు రాసిన రెండు పుస్తకాలు, ఒకటి ‘విశ్వదర్శనం పాశ్చాత్య చింతన’ ఇంకోటి ‘విశ్వదర్శనం భారతీయ చింతన’ వీటిలో మొదటిదయిన పాశ్చాత్య చింతన చదువుతున్నప్పుడు నేను చాలా చిత్రమయిన ఉద్వేగపూరిత అనుభూతికి లోనయ్యాను. దానికి ఒక కారణం నాకు తత్వశాస్త్రం మీద ఉన్న ఆసక్తి కాగా, రెండోది అంతకు ముందు నేను కొన్న Will Durant రాసిన The Story of Philosophy అన్న ఇంగ్లీషు పుస్తకం లోని కఠిన మయిన ఇంగ్లీషు పదాలు అర్థం చేసుకోవటంలో నేను ఎదుర్కొన్న కష్టం. తెలుగులో తత్వశాస్త్రానికి సంబంధించి ఇంత సులభ శైలిలో పుస్తకం దొరుకుతుందని నేను అసలు ఊహించ లేదు. ఇందులో క్రీస్తు పూర్వం కొన్ని వేల ఏళ్ళ క్రితం గ్రీకు లో ఊపిరి పోసుకున్న తత్వశాస్త్ర భావాల దగ్గర నుంచి నేటి కాలంలో ప్రసిధ్ధి చెందిన జీన్ పాల్ సార్త్ర వరకు ముఖ్యమయిన అందరి పాశ్చాత్య తత్వశాస్త్రజ్ఞుల సిద్ధాంతాల గురించి అరటిపండు వొలిచినట్టు వివరించబడింది. తత్వశాస్త్రమంటే అదేదో అనవసరమయిన వేదాంతమనో, కష్టమయిన విషయమనో అనుకునే వైఖరిని పటాపంచలు చెయ్యగల పుస్తకమిది. నిజానికి తత్వశాస్త్రం అనవసరమైంది కాదు, చాలా అవసరమయింది. మనం చిన్నప్పుడు లెక్కల్లోను, సైన్స్ లోనూ చదువుకున్న పైధాగరస్, లైబ్నిజ్, దె కార్త్ లాంటి వాళ్ళందరూ ముందు తత్వవేత్తలే. అసలు తాత్వికుల సత్యాన్వేషణలో భాగంగా పుట్టిందే నేటి విజ్ఞానం. .
.
.
.
.
.
'నాకు ఈ ఏడాది నచ్చిన పుస్తకం ' శీర్షికలో కినిగె పత్రిక లో వచ్చిన వ్యాసంలో, పూర్తిగా ఇక్కడ : http://patrika.kinige.com/?p=4518

Monday, December 8, 2014

అనంతం













('కినిగె పత్రిక' లో ప్రచురణ :http://patrika.kinige.com/?p=4342)

“ఇప్పటివరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది.
ఇప్పటివరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది.
ఈ భూమ్మీద కొత్తదంటూ ఏమీ లేదు.”

    పొద్దున్నే నిద్ర లేవగానే రాత్రి తల కింద పెట్టుకుని పడుకున్న ఒక తత్త్వశాస్త్ర పుస్తకం అట్ట వెనక ఉన్న ఈ వాక్యాలు నన్ను వెక్కిరిస్తున్నాయి. దానికి కారణం ఈ వాక్యాలు నాకు ఇప్పటివరకూ పూర్తిగా అర్థం కాకపోవటం. చరిత్రలోనూ, మానవ నాగరికతలోనూ ఎన్ని కొత్త సంఘటనలు, ఎన్ని కొత్త ఆవిష్కరణలు. రోజురోజుకీ మారిపోతున్న ఈ ఆధునికయుగంలో అయితే మారకుండా ఉన్నది ఏదీ లేదు. నా ఊహ తెలిసిన దగ్గరనుంచీ ఈ రోజు వరకూ నేను ఎంత వైవిధ్యం చూళ్ళేదు. మార్పు లేకపోతే కాలమే ఆగిపోవాలి. అందుకే ఆ వాక్యాలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అలాగని వాటిని విస్మరించనూ లేను. దాని వెనక ఉన్న భావం అర్థమయ్యేవరకూ నాకూ శాంతి లేదు. అసలు ఆ వాక్యాలే కాదు ఆ పుస్తకమే నాకు ఒక పట్టాన అర్థం కాదు. నా తెలివికి పరీక్ష పెడుతోంది. నన్ను నిద్రపోనివ్వదు. అనుభవం లోకి రానిదేదీ అర్థం కాదని తెలుసు. ఈ పుస్తకం అర్థం కావాలంటే ఎలాంటి అనుభవం నాకెదురవ్వాలి? ఏమో తెలీదు. దానికోసమే నేనూ ప్రతి రోజూ ఎదురు చూస్తున్నాను.

    నాకు అర్థం కాని దాని గురించి ఇంతగా ఆరాటపడటం అనవసరం. అయినా కూడా ఆ పుస్తకం గురించి నేను మర్చిపోలేకపోతున్నాను. దాని వెక్కిరింతల నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను. దాని వెనక ఉన్న మరో అసలు కారణం అది నాకు అర్థం కాకపోవటం ఒక్కటే కాదు. అది నేను ఒక పుస్తకాల షాపులోంచి దొంగతనంగా తెచ్చిన పుస్తకం. నాకు తెలుసు, కొంత మంది శపించబడ్డ మనుషులుంటారు. నేనూ అలాంటివాడినే, ఎప్పుడూ చదువుతూ బతకమని శపించబడ్డవాడిని. అప్పుడప్పుడూ నా గురించి నాకే, ఆడుకునే పిల్లల చేతుల్లోంచి దూరంగా విసిరివేయబడి కనిపించకుండా మరిచిపోయిన బంతిలాగ అనిపిస్తుంది. అలా అనిపించటానికి నాకు తెలిసి ప్రత్యేకమయిన కారణం కూడా ఏమీ లేదు. అలా నా చుట్టూ నేనే సృష్టించుకున్న నా మానసికమయిన ఒంటరితనపు ఆకలికి ఈ పుస్తకాలే ఆహారం. నాకు చదవటం ఒక వ్యసనం. ఒక మందు లేని రోగం. దీనివల్ల నేను చాలా కోల్పోయాను అని చాలా మంది నా గురించి తెలిసినవాళ్ళు అంటారు. వాళ్ళ దృష్టిలో నేను పుస్తకాల వల్ల చెడగొట్టబడ్డవాడిని. ఎప్పుడూ ఆ పనికిమాలిన పుస్తకాలు చేతిలో పెట్టుకుని కూర్చుంటే అవేమన్నా తిండి పెడతాయా అని నిందించబడ్డవాడిని. అలా చదవటం ఎంత వరకూ దారి తీసిందంటే టీ-షర్టుల మీద ఉండే గమ్మత్తయిన వాక్యాలు కూడా వదలకుండా చదివేసేవాడిని. అలా చదివినప్పుడు ఒక్కోసారి కొంతమంది అమ్మాయిలు నన్ను అపార్థం చేసుకుని తిట్టుకున్న సందర్భాలు ఉంటే ఉండచ్చు.

    నేను చూసిన కొందరు రెండు కాళ్ళ మీదా నించోవటానికి కూడా తీరిక లేకుండా ఎప్పుడూ డబ్బు సంపాదించటమనే పనిలోనే మునిగి తేలుతూ ఉంటారు. నా దురదృష్టం నాకు అంత మంచి శాపం ఇవ్వలేదెందుకో. ఈ నా దుర్మార్గపు శాపం నన్ను ఎంతవరకూ దిగ జార్చిందంటే చివరికి దొంగతనానికి కూడా. ఆ రోజు నాకు బాగా గుర్తు. మొండి పిల్లాడి చేతిలో దెబ్బలు తినీ తినీ ఒళ్ళంతా గాయాలు చేసుకుని నీరసంగా విశ్రాంతి తీసుకుంటున్న బొమ్మలాంటి, రెండు మూడు చేతులు మారిన నా పాత రేంజరు సైకిలు మీద ఊరంతా బలాదూరు తిరుగుతున్నాను. అలా బొంగరంలా తిరుగుతూ తిరుగుతూ చివరికి మరీ పెద్దదీ, మరీ చిన్నదీ కాని ఒక పుస్తకాల షాపులోపలికి వెళ్ళాను. లోపల అరలనిండా అడ్డదిడ్డంగా పడి ఉన్న రకరకాల పుస్తకాలు చూస్తూ సరిగ్గా ఈ పుస్తకం దగ్గర ఈ వాక్యాలు చదివిన నా కళ్ళు ఆగిపోయాయి. ఆ వాక్యాలు నన్ను విశేషం గా ఆకట్టుకున్నాయి. అందులో నేను చదవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏదో ఉన్నట్టు అనిపించింది. పుస్తకం చేతుల్లోకి తీసుకుని నాలుగు పేజీలు అటూ ఇటూ తిప్పి చూసి చివరికి కొనాలని నిర్ణయించుకుని దాని మీద ముద్రించిన ధర చూస్తే నా దగ్గర అంత డబ్బు లేదని అర్ధమయ్యింది. ఇప్పుడంటే చిన్నదో, పెద్దదో ఒక ఉద్యోగమంటూ దొరికింది కానీ అప్పుడు నేనో పెద్ద నిరుద్యోగిని. కాని పుస్తకం మీద నా వ్యామోహం మాత్రం చావ లేదు. నేను లోపలికి అడుగు పెట్టినప్పుడు ఆ మూల కౌంటర్ దగ్గర ఏదో పేపరు చదువుకుంటూ కనిపించిన నడివయసు షాపు యజమాని ఇప్పుడు అలాగే టేబులు మీద పడి నిద్రపోతున్నాడు. నా వైపు తిరిగి ఉన్నా, అతని మూసిన కళ్ళు నేను చేసే పనిని ఆపలేవని నిర్ధారించుకున్నాక షాపులోంచి బయటపడి సైకిల్ మీద పుస్తకంతో సహా మాయమైపోయాను.

    వానలో తడిసిన పక్షి నీటిని విదుల్చుకున్నట్టు పుస్తకాన్ని గురించిన జ్ఞాపకాలని పక్క మీదే వదిలి, మనిషిగా పుట్టినందుకు తీర్చుకోవలసిన కాల కృత్యాలు తీర్చుకుని అదే నా పాత సైకిలు మీద బయటి ప్రపంచంలో పడ్డాను. ఈ ఆదివారం నా స్నేహితుడు ‘అప్సర’ థియేటర్ లో ఏదో ఇంగ్లీష్ సినిమాకెళ్ళాలన్నాడు. నా దృష్టి లో వీడు సినిమాలు చూస్తూ బతకమని శపించబడ్డవాడు. వీడికి సినిమాల పిచ్చి లేకపోయి ఉంటే గొప్ప తత్త్వవేత్త అయ్యి ఉండేవాడని నా నమ్మకం. చూపులతో పరిసరాలను వెనక్కి తోసుకుంటూ ముందుకెళ్తున్నాను. కొంచెం దూరంగా రోడ్డు దాటటానికి ప్రయత్నిస్తున్న ఒక పంది – పక్క నుంచి సర్రుమని వెళ్తున్న కారు వేగాన్నీ దూరాన్నీ లెక్కలేసుకుంటూ దాటగలనా లేదా అని ఆలోచించుకుని ఇంక దాటలేనని నిర్ధారించుకుని కారుని పోనిచ్చి పరిగెట్టుకుంటూ, అచ్చం మనిషిలాగే రోడ్డు దాటేసింది. ఆ బడ్డీ కొట్టు దగ్గర ఒక కందగడ్డ మొహం వాడు పెదాల మధ్యన వెలిగించిన సిగరెట్టుని గట్టిగా పీల్చి ఎవరిమీదో కోపాన్ని బయటకి రాకుండా మింగేస్తున్నాడు. అప్పటివరకూ నిదానంగా వెళ్తున్న లైసెన్స్ లేని బైకువాడొకడు టీ కొట్టు ముందు టీ తాగుతున్న ట్రాఫిక్ పోలీసుని చూసి భయపడుతూ భయపడుతూ వేగం పెంచి తుర్రుమని జారుకున్నాడు. జబ్బుతో మంచం పట్టిన మనిషిలా ఉన్న ఒక ఇంటి కాంపౌండు గోడ మీద ‘అప్సర’ అని రాసి ఉన్న వాల్ పోస్టర్ మీద ‘ది మ్యాట్రిక్స్’ అన్న అక్షరాలు కనిపించాయి. ఆ పోస్టర్ చూడగానే థియేటర్ ముందు టిక్కెట్లతో సహా ఇప్పటికే నా కోసం ఎదురు చూస్తున్న నా స్నేహితుడు గుర్తొచ్చాడు. నేను వేగం పెంచి గబగబా థియేటర్ కి చేరుకునేసరికి అనుకున్నట్టే టిక్కెట్లతో సిద్ధంగా ఉన్న స్నేహితుడు నన్ను చూడగానే, వీడి వల్ల సినిమా ప్రారంభం చూడలేమో అన్న బాధ పోయిన మొహంతో గబగబా నన్ను థియేటర్ లోపలికి లాక్కెళ్ళిపోయాడు.

    సాధారణంగా వాడు సినిమా చూస్తున్నంతసేపూ మాట్లాడడు. ఏదో పుస్తకం చదువుతున్నట్టో పూజలో ఉన్నట్టో సినిమాని ఏకాగ్రంగా చూస్తాడు. సినిమా అయిపోయాక మాత్రం రెండు మూడు గంటలు దాని గురించే ఆపకుండా మాట్లాడతాడు. అది వాడి అలవాటు. వాడికున్న ఇంకో అలవాటు, నచ్చకపోతే టిక్కెట్టు రెండుగా చింపి పాడేస్తాడు. నచ్చితే మాత్రం చింపకుండా పాడేస్తాడు. ఈ అలవాటు వాళ్ళ ఇంట్లో వీడు సినిమా చూసిన విషయం జేబులో టిక్కెట్టు చూసి తెలుసుకుని తిట్టే తిట్లనుంచి కాపాడుకోవటానికే అని మాత్రం మాలో కొద్ది మందికే తెలుసు. “సినిమా చూశాక నాకు ‘అహం బ్రహ్మస్మి’ అన్న మాటకి అర్థం తెలిసింది” అన్నాడు. స్టాండులోంచి సైకిలు తీసి బయటికి వస్తుండగా. అలాగే నడుచుకుంటూ సినిమా గురించి వాడు మాట్లాడుతుంటే నేను వింటూ ఇద్దరం చాలా దూరం ముందుకెళ్ళి ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి చెరో ప్లేటు మైసూరుబోండాలు తిని బయటికి వస్తూండగా ఎదురుగా ఉన్న పుస్తకాల షాపులోంచి వాడికి బాగా పరిచయమున్న ఒక పెద్దాయన పిలిచాడు. “ఒరేయ్ బాబూ, మీ వాడిని ఒక గంట షాపు చూసుకోమను. నేను అర్జెంటుగా ముఖ్యనయిన పని మీద బయటికెళ్ళాలి. నువ్వు కూడా నాతో పాటు రావాలి” అన్నాడు. నేను “సరే” అనగానే, నన్ను షాపులో కూర్చోబెట్టి ఇద్దరూ బయటికెళ్ళిపోయారు. కొనే వాళ్ళు ఎవరూ లేని మరీ పెద్దదీ, మరీ చిన్నదీ కాని ఆ షాపులో ఉన్న పుస్తకాల్లోంచి ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ అనే పుస్తకాన్ని తీసి ఒక మూలగా ఉన్న కౌంటర్ లో కూర్చుని పేజీలు తిరగేస్తున్నాను. అలసట వల్ల పైన ఫ్యాను గాలికి నా కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే టేబులు మీద పడి నిద్రకి ఉపక్రమించాను.

    సరిగ్గా అదే సమయానికి పాత రేంజరు సైకిలు మీద వచ్చిన మాసిన బట్టల్లో ఉన్న యువకుడు సైకిలుస్టాండు వేసి లోపలికి వచ్చి అరల నిండా అడ్డదిడ్డంగా పడి ఉన్న రకరకాల పుస్తకాలు చూస్తూ సరిగ్గా ఒక పుస్తకం దగ్గరికి వచ్చి అట్ట వెనక ఉన్న వాక్యాలు చదివి నాలుగు పేజీలు అటూ ఇటూ తిరగేసి ఒక సారి నా వైపు చూసి నేను నిద్ర పోతున్నాననుకుని షాపులోంచి బయటిపడి అతని అరిగిపోయిన చెప్పులు నా కంటబడుతుండగా, సైకిలు మీద పుస్తకంతో సహా మాయమైపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన నా మెదడు మొద్దు బారిపోయింది. ఆ వెంటనే వచ్చిన ఒక వింత ఆలోచన నా మనసుని ఉక్కిరిబిక్కిరి చేసింది. “అంటే ఆ రోజు నేను పుస్తకాన్ని దొంగిలిస్తుండగా ఆ యజమాని నన్ను చూసి కూడా వదిలేశాడన్నమాట.” అప్రయత్నంగానే నా నోటి నుంచి ఈ మాటలు బయటికొచ్చాయి. ఖచ్చితంగా అదే జరిగి ఉంటుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఈ విషయాన్ని రూఢి చేసుకోగలిగితే బాగుండుననుకున్నాను. అప్పుడే లోపలికొచ్చిన నా స్నేహితుడికి షాపు అప్పగించి, సైకిలు మీద అదే పుస్తకాల షాపు ఉన్న వీధిలోకి చేరుకోగలిగాను. ఇప్పుడు అక్కడ ఒక చెప్పుల షాపు ఉంది. లోపల మాత్రం అదే పాత యజమాని ఉన్నాడు. “ఇక్కడ పుస్తకాల షాపు ఉండాలి కదా?” అన్నాను దగ్గరికెళ్ళి. “అవును ఇప్పుడు మా అబ్బాయి దీన్ని చెప్పుల షాపు చేసేశాడు.” అన్నాడు. ఇంకేం మాట్లాడలేక తిరిగి వెళ్ళిపోతుంటే “నువ్వు నాకు బాగా తెలుసు. ఒక సారి నువ్వు ఇదే షాపులోంచి ఒక పుస్తకాన్ని దొంగిలించావు.” అన్నాడు. నిశ్చేష్టుడినై అతన్నే చూస్తున్నాను. “మాసిన బట్టల్లో, అరిగిపోయిన చెప్పులతో ఉన్న నీ పరిస్థితి చూసి ఆ రోజు నేను నిన్ను ఏమీ అనలేకపోయాను. అయినా పుస్తకాల కోసం ఆరాటపడేవాడు ఎప్పుడూ రంగు కాగితాల్లాంటి డబ్బుల కోసం ఆరాటపడడు. అందుకే నువ్వు చేసిన పని నాకు తప్పుగా అనిపించలేదు. ఈ షాపు ఇంకా పుస్తకాల షాపు గానే మిగిలి ఉండి ఉంటే నీకు తప్పకుండా మరో పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చి ఉండే వాడిని” అన్నాడు విచారంగా. పొద్దున్న చదివిన వాక్యాలే నా మనసులో మళ్ళీ సుడులు తిరుగుతున్నాయి.

“ఇప్పటివరకూ ఉన్నదే ఇక ముందూ ఉంటుంది.
ఇప్పటివరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది.
ఈ భూమ్మీద కొత్తదంటూ ఏమీ లేదు.”

    అవును ఈ భూమ్మీద కొత్తదంటూ ఏదీ లేదు. అదే ప్రేమ, అదే క్షమ, అదే దయ, అదే కోరిక, అదే ఆశ, అదే ద్వేషం, అదే పోరాటం. తరాల నుంచి తరాలకి ఇవే అఖండంగా, అనంతంగా కొనసాగుతున్నాయి. కొనసాగుతూనే ఉంటాయి. బయటికొచ్చాక, ఇప్పుడు నేను కొత్తగా అర్థం చేసుకున్న అదే పాత ప్రపంచం నాకు కనిపిస్తోంది. మళ్ళీ ఒకసారి ఆ పుస్తకాన్ని చదవటానికి ఉరకలేస్తున్న నా మనసుని అర్థం చేసుకున్న నా పాత సైకిలు నన్ను వాయువేగంతో తీసుకెళుతోంది.

Sunday, October 5, 2014

ప్రజల స్వార్ధానికి బలయిపోతున్న రాజకీయ నాయకులు

              నా చిన్నప్పుడు ఒక సారి మా ఊరి మట్టి రోడ్ల మీదికి తెల్ల ఏనుగు లాంటి చిన్న కారు ఒకటి దూసుకొచ్చి ఊరు మధ్యన చెరువు గట్టు మీద ఆగింది. అందులోంచి ఎత్తుగా, లావుగా, ఎర్రగా ఉన్న నలుగురయిదుగురు బయటికొచ్చారు. ఆడా మగా తేడా లేకుండా అందరికీ ఒంటి నిండా బంగారం. ఖరీదయిన దుస్తుల్లో అందరూ దర్జాగా ధగ ధగ లాడి పోతున్నారు. వాళ్ళని చూసిన ఊళ్ళో జనానికి ఒళ్ళు మరిచిపోయేంత ఆనందమయిపోయింది. ఎవరికోసం వచ్చారో, ఏం సాయం కావాలో అని పోటీలు పడి మరీ అతి వినయం ప్రదర్శించి మెలికలు తిరిగిపోతూ వాళ్ళకి సకల ఉపచారాలూ చేసి వెంకట సుబ్బమ్మ కొట్లోంచి నాలుగు గోల్డ్ స్పాట్ సీసాలు తెచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టారు. వచ్చిన పని అయిపోయి కారు బయలుదేరిపోతుందనగా కారు డిక్కీలో రెండు ఆనపకాయలు, ఒక అరటి గెల , పది కొబ్బరి కాయలు, ఆవకాయ జాడీ, కాళ్ళు కట్టేసిన నాటు కోడి చేరి పోయాయి. అంత గొప్ప వాళ్ళు వచ్చింది మా అప్పారావు మావయ్య కోసమని తెలిసి ఆ రోజు నుంచీ అప్పారావు మావయ్య ఇమేజి చిన్న జ్వరమొచ్చినా రాజమండ్రి తీసుకెళ్ళి పెద్దాసుపత్రిలో చేర్పించేసే స్థాయికి పెరిగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మా ఊరి స్కూలు హెడ్మాస్టరు గా పని చేసి ఉత్తమ ఉపాధ్యాయుడుగా పేరు తెచ్చుకుని రిటయిరయిపోయిన మా అబ్రహాం మాస్టారు డొక్కు సైకిలు మీద ఎటో వెళ్తూ దారిలో ఓ సారి ఊళ్ళో అందరినీ పలకరిద్దామని వస్తే పట్టించుకున్న నాధుడే లేడు. ఆ రోజు నాకు, ప్రజలు వ్యక్తిత్వం తో పని లేకుండా డబ్బున్న వాళ్ళకీ, ఆడంబరంగా ఉండేవాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తారని అర్ధమయింది. ఈ రోజుల్లో అయితే చేతిలో ఆండ్రాయిడు ఫోను ఉన్నవాడికి పెదరాయుడు సినిమాలో రజనీకాంత్ కున్నంత ఫాలోయింగు.

               మా ఊళ్ళో ఉండే కోట మంగమ్మ ఇంట్లో వంట చేసి పెట్టదు గానీ, అదీ ఇదీ అని తేడా లేకుండా అన్ని మతాల దేవుళ్ళకి మాత్రం పూజలు విపరీతంగా చేసేది. ఆ రకంగా వారంలో ఎక్కువ రోజులు బయటి తిండి తినక తప్పక వాళ్ళాయనకి ఒక సారి ఫుడ్ పోయిజన్ అయ్యి ఆస్పత్రి పాలయితే ఆ రోజు కూడా ఆవిడ మొగుడికన్నా పూజలకే ఎక్కు ప్రాముఖ్యత ఇస్తే ఊరి జనం ఆవిడ భక్తి ప్రపత్తులకి తెగ మురిసిపోయారు. దేవుడి గురించి పెద్ద పట్టించుకోకుండా మొగుడు తాగొచ్చినా భరిస్తూ కష్టపడి దొడ్లో కూరగాయలు పండించుకుని, ఇడ్లీలేసి అమ్ముకుంటూ కుమ్మరి పురుగు లాగా ఎప్పుడూ ఏదో ఒక పని చెసుకుంటూ సంసారాన్ని నెట్టుకొస్తున్న కాంతమ్మత్తని మాత్రం నిజంగానే పురుగుని చూసి నట్టు చూసేవాళ్ళు. జనం, కష్టానికి కాకుండా పై పై మెరుగులకే ఎక్కువ విలువ ఇస్తారనటానికి ఇది ఇంకో ఉదాహరణ. కానీ ఈ పై పై మెరుగులన్నీ ఎక్కువకాలం పనికి రావని తెలుసుకోవటానికి నాకూ ఎక్కువ రోజులు పట్టలేదు. తెల్ల కారులో మా ఊరొచ్చినాయన కూతురి పెళ్ళి సినిమా సెట్టింగులని తలపించే కళ్యాణమంటపం అలంకరణలు, పెళ్ళి భోజనంలో డెభ్భై రెండు రకాల వంటకాలు, మామూలు జనం కేవలం పేపర్లో పేర్లు ఫోటోలు మాత్రమే చూడగలిగిన వాళ్ళని అతిధులుగాను పిలిచి అంగరంగ వైభోగంగా చేశారు. నాటు కోడి, అరటి గెల తీసుకున్నందుకు కృతజ్ఞతగానూ పనిలో పని గా తన ఆర్ధిక హోదా ని మా ఊరి జనానికి ఇంకోసారి చాటి చెప్పటానికీ ఊరి జనం అందరినీ కూడా పెళ్ళికి పిలిస్తే, వెళ్ళిన వాళ్ళందరూ ఆ హంగు చూసి ఆ పెళ్ళి గురించే వారం రోజులు మాట్లాడుకున్నారు. కానీ తర్వాత కొన్నాళ్ళకి ఆయన చేసే చీటీల వ్యాపారం దివాలా తీసి చివరికి జైలుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన రోజు మాత్రం, ఆ రోజు పెళ్ళి భోజనంలో కడుపు నిండా తిని బ్రేవ్ మని తేంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఒక్కడూ వెళ్ళి పట్టించుకున్న పాపాన పోలేదు.

               ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తేగానీ ఓటు వెయ్యం అంటే పాపం మా ఊరి ప్రెసిడెంటుగారు అప్పులు చేసి ఓటుకి డబ్బులిచ్చి గెలిశాక ఊరి పంచాయితీ స్థలంలో గోడౌన్లు కట్టుకుని స్వంత అవసరాలకి వాడుకుంటుంటే, జనానికి ఆయన తప్పుని ఎత్తి చూపే ధైర్యం లేక, అలాగని చూసీ చూడనట్టు వదిలెయ్యనూ లేక "మళ్ళీ ఎలక్షన్లకి ఓటుకి రెండు వేలు ఇస్తేగాని ఓటు వెయ్యం" అని తెగేసి చెప్పేద్దామని ఇప్పటినుంచీ పధకం వేస్తున్నారు. ఊరికి వర్తించేదే రాష్ట్రానికీ వర్తిస్తుంది. రాష్ట్రానికి వర్తించేది దేశానికీ వర్తిస్తుంది. ప్రజలు నిజాయితీకి, కష్టానికీ, మంచితనానికీ కాకుండా డబ్బుకీ, ఆడంబరాలకే ప్రాధాన్యత ఇస్తే, బెల్లం చుట్టూ ఈగల్లాగ అలాంటివాళ్ళ చుట్టూనే మూగితే సహజంగానే ఎవరికయినా ఎదో గడ్డి కరిచి నాలుగు డబ్బులు సంపాదిచి అందరిలోనూ గొప్ప అని అనిపించుకోవాలని ఉండటం లో తప్పు లేదు. అలాగే రాజకీయ నాయకులు కూడా. ఏ మనిషి అయినా తన ప్రాధమిక అవసరాలకి మించి అక్రమంగా, ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా తన దర్పాన్ని ప్రదర్శించి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవటానికే. ఆ రకంగా తన అహాన్ని సంతృప్తి పరిచేవాళ్ళు తన చుట్టూ పుష్కలంగా ఉంటే దాంట్లో అతనికి విపరీతమయిన ఆనందం ఉంటుంది. చివరికి అదొక వ్యసనంలా మారి. ఆ క్రమంలో వాళ్ళు తమ నిజాయితీని కూడా కోల్పోతారు.

               ఎంతో కష్టపడి ముఖ్య మంత్రులు, మంత్రులు, అయిన కొంత మంది, ఈ డబ్బు, అధికారం కోసం అక్రమాలకి పాల్పడి మళ్ళీ ఆ డబ్బునే ఎలెక్షన్ల సమయానికి ప్రజలకి ఖర్చు పెట్టి మళ్ళీ అధికారం సంపాదించి ప్రజలని గుడ్డిగా నమ్మి/నమ్మించి దీన్ని ఒక చక్రంలా తయారు చేసి చివరికి ఏదో ఒక రోజు జైలుకి కూడా వెళ్ళే పరిస్థితులు కల్పించుకుంటున్నారు. ఇందులో రాజకీయ నాయకుల పాత్ర కన్నా ప్రజల పాత్రే ఎక్కువ. ప్రజలు ముందు అక్రమంగా డబ్బు సంపాదించిన నాయకులను ఆరాధించటం మాని వ్యతిరేకించాలి. రాజకీయ నాయకులు తాము చేసిన పని అది తప్పని తెలిసినా దానిని సమర్ధించేవాళ్ళు ఉన్నంత కాలం అది కొనసాగిస్తూనే ఉంటారు, కాని చట్టానికి దొరికితే మాత్రం జైలుకెళ్ళేది ప్రజలు కాదు. నాయకులే.

               స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరి నుంచీ ఈ రోజు వరకూ మన దేశం లో ఎన్నో కుంభకోణాలు చూశాం ఇప్పటికే ఈ అక్రమంగా సంపాదించటం, తర్వాత జైలుకెళ్ళటం అనేది చాలా పాత ట్రెండ్ అయిపోయింది. ఇక నుంచీ నిజంగా తెలివయిన నాయకులు చేయాల్సిన పని అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉండి తమని తాము నిరూపించుకోవటమే, అదే మన ముందు రోజుల్లో రాబోతున్న కొత్త ట్రెండ్. అందుకే, న్యాయ వ్యవస్థ అంటూ ఒకటుందని చూడకుండా ప్రజలని గుడ్డిగా నమ్మి, ఇప్పటివరకూ జైలు పాలయిన అమాయక రాజకీయ నాయకులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ వారి ఈ పరిస్థితికి బహుధా శతధా చింతిస్తున్నాను.

Wednesday, August 13, 2014

సాఫ్టువేరు...ఇంజనీరు...












                         "బుర్ర ఉపయోగించటం తెలియని వాడే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు." అని కనిపెట్టిన ఇంగ్లీష్ వాళ్ళు ఆ బుర్ర తోనే "విభజించు, పాలించు" తో, మూడు వందల ఏళ్ళు మనల్ని పరిపాలించేశాక, "తాడిని తన్నే వాడుంటే వాడి తల తన్నే వాడు ఉంటాడన్నట్టు" అంత కన్నా పెద్ద బుర్ర తో మన గాంధీ గారు "అహింస, సత్యాగ్రహం" అనే గాంధీగిరీ ఆయుధం తో వాళ్ళని వెళ్ళగొట్టి మనకి మహోపకారం చేశారు. భాష నుంచి ఫ్యాషన్ ల వరకూ మనది కానిది ఏదయినా తీసుకొచ్చి నెత్తిన పెట్టుకునే పొరపాటు అలవాటు ఉన్న మనం, సహజంగానే వాళ్ళు వదిలేసి వెళ్ళిన "ఇంగ్లీషు" ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టేసుకున్నాం. పొరపాట్లు కూడా ఒక్కో సారి "అంతా మన మంచికే" అన్నట్టు మనకి మంచే చేస్తాయి. ఆ నాలుగు ఇంగ్లీషు ముక్కలు మనకి తెలియబట్టే కదా ఈ రోజు "సాఫ్టు వేరు" అనగానే ఇంగ్లీషు ని మనం బొద్దింకని చూసినట్టు చూసే, మనకన్నా రెండు మూడు రెట్లు పని రాక్షసుల్లాంటి చైనా, జపాన్ వాళ్ళని పక్కన పెట్టేసి ప్రపంచం మన వైపు చూస్తుంది. ఈ "సాఫ్టువేరు" వల్ల అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పలేం గానీ, ఒకప్పుడు ఎనభైల్లో ఆకలేసి కేకలేసిన "ఆకలి రాజ్యం" కమల్ హాసన్ లు చాలామంది ఇప్పుడు చదువు అయిపోగానే చాలా ఈజీ గా అమీర్ పేట లో అడుగుపెట్టి హైటెక్ సిటీ లో సెటిలై పోతున్నారు. దానికి తోడు చిలుకూరి బాలాజీ దయ కూడా ఉంటే వీసా తెచ్చుకుని విదేశాలూ వెళ్ళి పోవచ్చు. హైదరాబాదు లో మనకి తెలిసిన ఏ సెంటర్ లో నిలబడి నాలుగు రాళ్ళు విసిరినా అందులో మూడు సాఫ్టువేరు ఇంజినీర్లుకే తగులుతాయని కూడా ఘంటా పధం గా చెప్పవచ్చు.

               అయినా ఏ కొద్ది మందికో తప్ప "సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి" లాగా చాలా మంది సాఫ్టువేరు ఇంజినీర్లుకి మళ్ళీ బోలెడు కష్టాలు. పేరుకి శని, ఆది వారాలు వారానికి రెండు రోజులు శెలవులన్న మాటే గానీ, పద్మ వ్యూహంలో అభిమన్యుడి లాగా పొద్దున్నే ఆఫీసు లోపలికి వెళ్ళటం వరకే మన చేతుల్లో ఉంది గానీ ఎప్పుడు బయటకి వస్తామో ఆ దేవుడికే తెలియాలి. ఒక్కోసారి మనశ్శాంతి గా నిద్ర పోదామన్నా కూడా లేకుండా Object లు, For Loop లు, Outer Join లు కలలోకొచ్చి కూడా వేధిస్తాయి. ఎప్పుడయినా శుక్రవారం పూట ఆఫీసుకి వచ్చాక వారాంతం (తెలుగు లో "వీకెండ్") కదా అని హాయి గా పని పక్కన పెట్టి "Idlebrain" లో కొత్తగా రిలీజయిన సినిమా రివ్యూ చదువుకుంటూనో, ఆన్ లైన్ లో ఆధార్ కార్డు స్టేటస్ చూసుకుంటూనో, కరెంటు బిల్లు కట్టుకుంటూనో కూర్చుంటే, ఆ రోజు మన బాసు కి పాలు పోసే పాల వాడి గేదె తన్నిందని, వాళ్ళావిడ టీ లేటుగా ఇచ్చిందని కోపంగా ఆఫీసుకొచ్చి,  మన నిర్వాకం చూసి ఇంకా చిర్రెత్తుకొచ్చి,  చెప్పిన పని సాధ్యమయినంత తొందరగా (ASAP) పూర్తి చెయ్యమని ఆర్డరేసి వెళ్ళిపోతే, ఆ తర్వాత రోజు శనివారం, ఆది వారం కూడా చచ్చినట్టు కాళ్ళు ఈడ్చుకుంటూ ఆఫీసుకి రావాలి. (దీన్నే "కార్య కారణ సిధ్ధాంతం" అంటారు.ఒక్కోసారి మనం వీకెండ్ లో కూడా ఆఫీసుకు రావలసి ఉండటానికి కారణం మన బాసు గారికి పాలు పోసే పాలవాడి గేదె కూడా అయి ఉండవచ్చు.) ఇంకోసారి అయితే ఎంత కష్టపడ్డా ఏ Bug ఎందుకొచ్చిందో తెలీక "ఈగ" సినిమా లో సుదీప్ లాగా కొట్టుకుని చావాలి. మధ్య మధ్యలో "Obligations" వస్తే మన టీం లో వాళ్ళ తోనో, మన వ్యతిరేక వర్గం Testing Team వాళ్ళతోనో ప్రచ్చన్న యుధ్ధాలు (Cold Wars), ప్రత్యక్ష యుధ్ధాలు మామూలే. ఇలా మన గాబరా లో మనం ఉండగా,  అదే సమయానికి మన బంధువో, స్నేహితుడో ఫోన్ చేసి ఆన్ లైన్ లో అర్జెంటు గా వాళ్ళ అబ్బాయి పరీక్షల ఫలితాలు చూడమనో, సినిమా టికెట్ లు బుక్ చెయ్యమనో, రైలు టికెట్ లు బుక్ చెయ్యమనో ఆర్డరు వేస్తే కాదనలేం.

              అసలు ఈ "సాఫ్టువేరు" అంటేనే ఒక బ్రహ్మ పదార్ధం లాంటిది. ఎప్పుడయినా ఏ పండగో, పబ్బమో శుక్రవారమో, సోమవారమో వస్తే,  వారాంతం (మళ్ళీ తెలుగు లో "వీకెండ్") కలిసొస్తుంది కదా అని సీజన్ కాబట్టి చచ్చినట్టు రెట్టింపు డబ్బులు పెట్టి కష్ట పడి టికెట్ సంపాదించి ఊరెళితే, అక్కడ వార్తా పత్రిక పరిజ్ఞానం అపరిమితం గా ఉన్న ఏ సోడా కొట్టు సుబ్బయ్యో కనిపించి, "ఏరా అబ్బాయ్ నువ్వు చేసే ఈ సాఫ్టువేరు ఇంజినీరు ఉద్యోగం అంటే ఏమిటి?"  అని అడుగుతాడు. ఇదే ముక్క ఏ సివిల్ ఇంజినీరునో, ఎలిక్ట్రికల్ ఇంజినీరునో అడిగితే ఇళ్ళు కడతాననో, టీ.వి. లు బాగు చేస్తాననో చేప్పేసి వెళ్ళిపోవచ్చు గానీ, ఈ సాఫ్టువేరు కంపెనీలు ఇచ్చే Appraisal లాగానే ఉండీ ఉండనట్టుండే ఈ "సాఫ్టువేరు" గురించి అలాంటి వాళ్ళకి అర్ధమయ్యేలా చెప్పాలంటే మాత్రం,  మన తల ప్రాణం తోకకొస్తుంది. ఇంతా కష్ట పడి అంతా చెప్పిన తర్వాత "టీ.వి లాంటి కంప్యూటరు ముందు కూర్చుని, టైపు రైటర్ లాంటి కీబోర్డు మీద టిక్, టిక్ మని కొట్టటం కూడా పెద్ద పనేనా?" అనేసి వెళ్ళిపోతాడు. ఈ అవమానం తో మనం మళ్ళీ ఆఫీసుకొచ్చాక, ఖర్మ కాలి మన ప్రోజెక్ట్ మేనేజరు "క,చ,ట,త,ప" లని "గ,జ,డ,ద,బ" లు చేసి మాట్లాడే పక్కా మళయాళీ నో, తమిళియనో అయితే, మనకి తెలిసిన అంతంతమాత్రం ఇంగ్లీషు కి తోడు,  వాళ్ళు మాట్లాడింది పూర్తిగా అర్ధం కాక, మళ్ళీ అడిగితే ఏమంటాడో ఏమో ఎందుకొచ్చిందిలే,  అని చెప్పింది వినేసి,  తర్వాత మనకి అర్ధమయిన దాంట్లోంచి అర్ధం కాని దాన్ని కూడా Extract చేసుకుఇని Code రాసుకోవాలి.  ఇది నా విషయం లో ఇంకా ముందుకెళ్ళి, ఇదివరకు మా మళయాళీ TL నన్ను గోపి బదులు "గోబి", "గోబి" అని పిలిచీ, పిలిచీ తర్వాత ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరయినా నించున్నప్పుడు, ఎవరయినా గోబి మంచూరియా గురించి మాట్లాడుకుంటున్నా కూడా నన్నే పిలిచినట్టు ఫీలయిపోయి అటు తిరిగి చూసేసేవాడిని.

           మానవ మాత్రులం మనం ఎంత గింజుకున్నా వయసు దాని పని అది చేసుకెళ్ళిపోక మానదు. కానీ, సాఫ్టు వేరు ఇంజినీర్లకి మాత్రం ఇది కొంచెం ముందే మొదలయినట్టు బట్టతలలు, కళ్ళజోళ్ళు, మెడనొప్పులు, అల్సర్లు, బీ.పీ లు ఉద్యోగం తో పాటే మొదలయ్యి  జీతం తో పాటు పెరుగుతూ ఉంటాయి. ఎంత క్లిష్టమయిన Logic అయినా ఒక్క దమ్ము లాగి  (చట్టబధ్ధమయిన హెచ్చరిక : ధూమ పానం అరోగ్యానికి హానికరం.) రాసి పారేసే  కొంత మంది మహా మహా Code వీరులయితే వాళ్ళ జీవితాన్ని ఫణం గా పెట్టి మరీ Code రాస్తారు. అసలు ఈ సాఫ్టువేరు మొదలయ్యాక సాఫ్టువేరు ఇంజినీర్ల కన్నా ఎక్కువ లాభ పడింది, ట్యాక్స్ ఎగ్గొట్టటానికి ఇంటి రుణం (తెలుగు లో "హౌసింగ్ లోన్") తీసుకుని మనం కొనే ఇళ్ళ కోసం పొలాలన్నీ ప్లాట్లు చేసి అమ్మేసే రియల్ ఎస్టేట్ వాళ్ళతో పాటు,ఆర్ధోపెడిక్ లు, ఫిజియోథెరపిస్ట్ లు, బట్టతల త్గ్గటానికి మందులిస్తామని చెప్పే హోమియో కేర్ వాళ్ళే ఎక్కువని ఏ వార్తా పత్రికల వాళ్ళో, టీ.వీ వాళ్ళో సర్వే చేస్తే తెలిసిపోతుంది.ఆర్ధిక మాంద్యం పుణ్యమా అని, పెళ్ళి కుదిరిందని ఆఫీసులొ అందరికీ స్వీట్లు పంచిపెట్ట్టిన మన కొలీగు, ఆ తర్వాత వాళ్ళ కాబోయే మామ గారు ఈనాడు బిజినెస్ పేజీ లో "సాఫ్టువేరు మందగమనం", "ఇన్ఫోసిస్ షేర్ల పతనం" అన్న వార్తలు చూసి పెళ్ళి క్యాన్సిల్ అంటే,  ఏం చెప్పాలో తెలీక ఏడుపు మొహం తో ఆఫీసుకొస్తే మనమే వెళ్ళి ఓదార్చాలి.  

         అష్ట కష్టాలు పడి ఏ Pay కోసం అయితే మనం పనిచేస్తామో చివరికి  ఆ Pay Slip లో ఏమేమి "కటింగులు" ఉన్నాయో చూసుకోవటానికి కూడా సమయం ఉండదు. అన్ని కటింగులూ పోనూ చేతికొచ్చిన జీతం మన చేతి ఖర్చులకి కూడా సరిపోతుందో లేదో అని మనం కుస్తీలు పడుతూ ఉంటే,  సాఫ్టువేరు ఇంజినీరు అనగానే ఇల్లు అద్దెకి ఇచ్చేవాడి దగ్గర నుంచీ, Image Hospitals వాడి వరకూ అందరూ రెట్టింపు రేట్లు చెప్పి సాధ్యమయినంత ఎక్కువ డబ్బులు దండుకోవాలని చూస్తారు. ఈ సాఫ్టువేరు ఇండస్ట్రీ లో కూడా ఒక్కోసారి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలి. ఇంకోసారి తెలియక పోయినా తెలిసినట్టు ఫోజు కొట్టాలి. చిన్నప్పుడు అయిదో తరగతి లో "సత్యమేవ జయతే" పాఠం లోని ఆవు, పులి కథ బట్టీ పట్టి పాసై ఇంతవరకూ వచ్చిన నేరానికి అదే నోటితో, ఒక్కోసారి శెలవులు అడుక్కోవటానికి తప్పనిసరి అబధ్ధాలూ ఆడాలి. ఇవన్నీ గుర్తొచ్చి ఉద్యోగం మానేసి ఊళ్ళో ఉప్పు అమ్ముకుని అయినా ఉందామనుకున్నంత బీ.పి వచ్చేస్తుంది కానీ, బరువు, భాధ్యతలూ, తొందరపడి తీసుకున్న ఇంటి రుణం వాయిదాలు (తెలుగులో "ఈ అమ్మాయి" లేదా "EMI") గుర్తొచ్చి, మళ్ళీ పిల్లి లాగా వెళ్ళి మన డెస్క్ దగ్గర కూర్చుండిపోతాం. బయటినుంచి చూసే వాళ్ళకి ఇది గొప్పగా ఉంటుంది కానీ, పులి స్వారీ అని ఎక్కే వరకూ మనకీ తెలీదు.

          ఏదేమయినా  ఈ కంప్యూటర్ టెక్నాలజీ,  పంచుకోవటానికి Facebook ని, తిట్టుకోవటానికి Twitter ని (ముఖ్యంగా Tech Savvy రాజకీయనాయకులు కోసం), ఏం కావాలన్నా Google లో దొరుకుతుందిలే అన్న నమ్మకాన్నీ ఇచ్చింది. మానవ జీవితాన్నీ, నాగరికతనీ పలు దశల్లో పలు అంశాలు బాగా ప్రభావితం చేశాయి, మొట్ట మొదట నదులు, తర్వాత బలం, ఆ తర్వాత మతం, కానీ ఇక ముందు మన ముందు తరాలని ప్రభావితం చేయబోయేది మాత్రం మహోధ్రుతం గా వృధ్ధి చెందబోతున్న టెక్నాలజీ అనీ ఇప్పటికే చాలా మంది చెప్పేశారు. అలాంటి టెక్నాలజీలో మనమూ భాగస్వాములం అవగలుగుతున్నందుకు గర్వపడుతూ ఇంతా చేసి, ఏమీ తెలియనట్టు మన ముందు బుధ్ధిగా కూర్చున్న ఈ కంప్యూటర్ దేవతకి ఓ దండం పెట్టి ముందుకెళ్ళిపోదాం. లేకపోతే వెనకబడిపోతాం.

image courtesy : Google

Friday, July 25, 2014

మానుషం


('కినిగె పత్రిక' లో ప్రచురణ :http://patrika.kinige.com/?p=2653)

రోజూ నేను నడిచి వచ్చే ఈ దారిలో ఆ మూల ఇంట్లోంచి
రాత్రి అయితే చాలు ఒక ఏడుపు వినిపిస్తుంది.
ఎవరినో అడిగితే చెప్పారు.
పైకెళ్ళిపోయిన కొడుకు ఇంక అన్నానికి రాడని ఏడుస్తుందని.
ఆ చెట్టు కింద ఉన్న కాళ్ళూ చేతుల్లేని మనిషి
కంట్లో నలక పడితే ఎలా ఉంటుంది?
చంకలో చిన్న పిల్లాడితో అడుక్కోవటానికి
వచ్చిందో ఆడ మనిషి. ఇదో పెద్ద మాఫియా అని కూడా తెలిసింది.
తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకునేవాడు
ఎందుకో తెలీదు, తనలో తానే మాట్లాడుకుంటూ
ఎవరినో తిట్టుకుంటూ ఇంటికెళ్తున్నాడు.
ఈ సెంటర్లో, చదువు రాని ఒక ముసలాయన కదిలిపోతున్న
బస్సుల మధ్య తను ఎక్కాల్సిన ఆఖరి బస్సు ఉందో లేదో తెలీక
బిక్క మొహమేసుకుని అటూ ఇటూ పరిగెడుతున్నాడు.
ఏం పనిమీద వచ్చాడో, పొద్దుట్నుంచీ ఏమీ తిన్నట్టు కూడా లేదు.
కానీ ఇంత అర్ధ రాత్రి, చలిలో, ఆకలితో నేను ఎవరి కోసమూ ఏమీ చెయ్యలేను.
రేపొద్దున్నే ఆఫీసులో పని అర నిమిషం ఆలస్యమయినా
మా బాసు అగ్గి మీద గుగ్గిలమవుతాడు.
కష్టాలు లేని మనుషులు లేరు. నాతో సహా.
అన్నీ దాటుకుని దారిలో, నేను ఎప్పుడూ తినే హోటల్లోనే సున్నం నీళ్ళు కలిపిన అన్నంతో
అయిదు నిమిషాల్లోనే నా ఆకలిని చంపేసి, గబ గబా నా గదికి చేరుకుని
గట్టిగా తలుపేసేసుకుని హాయిగా పడుకున్నాను.
కానీ అంత చలి లోనూ ఆ ముసలయ్య తాత పడుతున్న ఆయాసపు
వేడి ఊపిరి నా మనసుని బలంగా తాకుతుంది.
ఇంక ఆ ఉక్కపోత భరించలేక బయటికెళ్ళి అతనికి సాయం
చెయ్యాలనిపించి తలుపు తియ్యటానికి ప్రయత్నించాను.
కానీ చలికి బిగుసుకుపోయిన ఈ తలుపు ఎంత ప్రయత్నించినా రాదు.
నా శక్తినంతా ఉపయోగించి లాగినా
తలుపు చెక్కలు రాసుకుంటున్న చప్పుళ్ళు తప్ప తలుపు మాత్రం తెరుచుకోలేదు.
ఇంకేం చెయ్యలేక కొంచెంసేపు విశ్రాంతిగా కూర్చున్నాను.
చిత్రంగా నా చుట్టూ ఉన్న గదుల నుంచి కూడా,
ఎవరికో ఏదో సాయం చెయ్యటం కోసం మధన పడుతూ
ప్రయాసపడుతున్న మనుషుల నిట్టూర్పులతో కూడిన
తెరుచుకోని తలుపుల చప్పుళ్ళే వినిపిస్తున్నాయి.
కొంచెంసేపటికి ఒక తెరుచుకున్న గదిలోంచి
ఒక మనిషి బయటపడి, ఎవరికో చెయ్యాలనుకున్న సాయం చెయ్యటానికి
వడివడిగా పరిగెత్తటం కిటికీలోంచి కనిపించింది.
నేను మళ్ళీ నా ప్రయత్నం మొదలుపెట్టాను.
నాకు తెలుసు. ప్రతీ ఒక్క తలుపూ ఏదో ఒక సమయానికి తెరుచుకోక తప్పదని.

Saturday, June 14, 2014

మనం

                  బిర్యానీ అయినా గానీ, రోజూ తింటే మొహం మొత్తుతుంది. అలాంటి వాడికి పెరుగన్నం తెచ్చి చేతిలో పెడితే దాని రుచి చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే రోజూ పెరుగన్నం తినేవాడికి బిర్యానీ పెట్టినా కూడా. ఈ రెండూ కాకుండా అప్పుడప్పుడూ గుడిలో ప్రసాదంలా ఉండే సినిమాలూ ఉంటాయి అలాంటి సినిమానే ఈ "మనం". అయితే పంచ్ డైలాగులూ , ఫైట్లూ లేకపొతే ఒక మాదిరి కామెడీ సినిమాలు చూడటానికి అలవాటుపడిపోయిన తెలుగు ప్రేక్షకుడికి మధ్యలో ఎప్పుడయినా వాటికి భిన్నమయిన కధతో సినిమా చూపిస్తే ఆ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఒక విశ్లేషణ ప్రకారం ప్రతి ఏడు సంవత్సరాలకి ఒక సారి ట్రెండ్ మారుతుంది. పూర్వ జన్మల ఇతివృత్తంగా వచ్చిన సినిమాలు మనకి కొత్త కాదు. "మనం" సినిమా లో దర్శకుడు విక్రం.కె.కుమార్ ఈ పూర్వ జన్మల ఇతివృత్తాన్ని ఉపయోగించుకుని అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల నటులను తీసుకుని నాగ చైతన్య, సమంతలకు నాగార్జునను కొడుకుగా, నాగార్జున, శ్రియలకు ఏయన్నార్ ను కొడుకుగా వారి నిజ జీవిత రక్త సంబంధాలకి వ్యతిరేకమయిన పాత్రలని సృష్టించి కధ తయారు చేసుకుని సినిమాగా చూపించటమే కొత్తగా అనిపించింది.

రెండున్నర గంటలు సమయం తెలియకుండా గడిపేయగలిగిన ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు.

నాగ చైతన్య, సమంతల మధ్య రోజురోజుకీ మనస్పర్ధలు పెద్దవి అవుతున్న తీరుని వాళ్ళ మధ్య గొడవ జరిగిన ప్రతిసారీ ఒక డిబ్బీలో నాణాలు వేయటం ద్వారా తెలియచేసే సన్నివేశం.

సంగీతం

ఛాయాగ్రహణం

హర్షవర్ధన్ మాటలు

అక్కినేని కుటుంబానికి చెందిన మూడుతరాల హీరోలని ఒకే సినిమాలో చూపించటానికి మామూలుగా అయితే చాలా కష్టపడాలి. ప్రేక్షకుల అంచనాలు కూడా విపరీతంగా ఉంటాయి. దర్శకుడు స్క్రిప్టు దగ్గరే ఆ కష్టమంతా పడి ప్రేక్షకుడికి ఒక క్లీన్ సినిమా ఇవ్వగలిగాడు.

ఇష్క్, ఇంకా ఒక ఇంట్లో టీవీలో సీరియల్లో వచ్చే సంఘటనలు ఆ ఇంట్లో వాళ్ళకి కూడా జరగటం అనే చిత్రమయిన కధతో 13బి లాంటి హర్రర్ మిస్టరీ సినిమా తీసిన దర్శకుని నుంచి వచ్చిన ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అనిచెప్పలేం గానీ ఈ సినిమాలో అంతకన్నా అద్భుతమయిన విషయం, ఊహ తెలిసిన దగ్గరి నుంచీ నాటకాలు, సినిమాల్లో నటించటమే ఊపిరిగా బతికిన చార్లీ చాప్లిన్, శివాజీ గణేషన్ లాంటి అతి కొద్ది మంది నటుల్లో ఏయన్నార్ ఒకరు. అలాంటి ఏయన్నార్ చివరి రోజులలో వెళ్తూ వెళ్తూ కూడా నిజంగానే మనకి ఒక మంచి సినిమా ఇచ్చివెళ్ళటం. ఈ విషయంలో మాత్రం తనకి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన తెలుగు సినిమా కి ఏయన్నార్ ఋణపడి ఉండొచ్చు గానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఏయన్నార్ కి ఎప్పుడూ ఋణపడి ఉంటారు.

Tuesday, May 27, 2014

అమ్మ చేతి ముద్ద

















('కినిగె పత్రిక' లో ప్రచురణ. :http://patrika.kinige.com/?p=2653)

కడుపు నిండా అన్నం తినేసి ఆడుకోవటానికి
వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసరికి
పొయ్యిలో పిడకల మీద కాల్చిన
చిక్కుడు గింజలు సిద్ధంగా ఉండేయి.


పిట్టలయినా లేవక ముందే లేచి
అబ్బాయిగారి దొడ్లో రాలిపోయిన
తాటిపళ్ళు దొంగతనంగా తెచ్చి
రొట్టె కాల్చి ఇస్తే మళ్ళీ కడుపుకి పండగే.


పరగ ఏరుకొచ్చిన గింజలు
వార్చిన గంజితో లచ్చించారు పెట్టి
అన్నం ముద్ద కలిపి నోట్లో పెడితే
ఒక్క పట్టుకే కుండ ఖాళీ.


చేపలమ్ముకునే వడ్డోళ్ళ చిట్టెమ్మ దగ్గర
గీచి గీచి బేరమాడి కొన్న నాలుగు బొమ్మిడాయిలకి
చింత కాయలడ్డమేసి పులుసెడితే
కూర వాసన నా చేతిని పట్టుకుని వారముండేది.


ఇరవై రూపాయలు పెట్టి కొన్న యాటమాసంలో
ములక్కాడా, మామిడి కాయా వేసి వండితే
తిన్న వెనకాలే నిద్ర ముంచుకొచ్చేసేది.


సుబ్బారాయుడిషష్టి తీర్థం లో
మిషను కుట్టి తెచ్చిన ఐదు రూపాయల్తో
ఖర్జూరం పండు కొని చేతిలో పెడితే
దిష్టి తగలకుండా మీద కప్పిన చీరకొంగు చాటున
గబగబా తినేసినట్టు గుర్తు.


పొరుగింటి సూరమ్మత్త ఇచ్చిన పులిసిపోయిన మజ్జిగ, మజ్జిగ పులుసయిపోయేది.
కొబ్బరి ముక్క కనిపిస్తే కొబ్బరి కోరు తాలింపు.
ఒక్క నిమ్మకాయ దొరికితే నిమ్మకాయ పులిహోర.
మా నల్ల కోడి గుడ్డెడితే నా కడుపులోకే.


పేపర్లోనో, టీవీలోనో ఆకలి గురించీ, పేదరికం గురించీ
ఎక్కడయినా కనపడితే “మేం కాదులే” అని నా నమ్మకం.


ఒక రోజు అమ్మకి ఒంట్లో బాగోపొతే ఆసుపత్రికి తీసుకెళ్ళాం.
అర్ధాకలితో అన్నేళ్ళూ ఉంటం వల్ల పేగులు అంటుకుపోయాయంట.
మిషను కుట్టీ కుట్టీ మెడ ఎముకలు ఒంగిపోయాయంట.
కనీసం గుడ్డు తిని ఎన్నాళ్ళయిందో ఎముకలు పెళుసయిపోయాయంట.
డాక్టరొచ్చి చెపితే గానీ నాకు తెలీలేదు.
మేమూ పేదోళ్ళమేనని.


Tuesday, May 20, 2014

సుబ్బారాయుడి తలకాయనొప్పి

          సుబ్బారాయుడి షష్టి కి మా పక్క టౌను గణపవరం లో సువర్ణేశ్వర స్వామి గుడి దగ్గర పెద్ద తీర్థం జరిగే రోజున పుట్టాడని ఆ పేరు పెట్టిన సుబ్రహ్మణ్యాన్ని వూళ్ళో మాత్రం అందరూ సుబ్బారాయుడని పిలిచేవారు. వాడు పుట్టిన కొన్నాళ్ళకి ఇంటికొచ్చిన కోయ దొర కి జాతకం చూపిస్తే వాడు కలెక్టరో, పెద్ద ఇంజనీరో అయిపోతాడని, ఊరికే పేరు తెస్తాడనీ చెప్తే,  వాళ్ళ ఇంట్లో ఎవరూ చదువుకోకపోయినా సుబ్బారాయుణ్ణి మాత్రం ఐదో యేట నాతో పాటే  మా ఊరి బళ్ళో ఒకటో తరగతి లో చేర్పించేసారు వాళ్ళ అమ్మ నాన్న. వాడు ఆరో తరగతిలో ఉండగా ఓసారి అరవై తెలుగు సంవత్సరాల పేర్లూ అరగంటలో చదివి అప్పచేప్పేస్తే మా తెలుగు మాస్టారి దిమ్మ తిరిగిపోయి వీడు మామూలోడు కాదని చెప్పేవారు అందరితో. ఎప్పుడైనా సుబ్బారాయుణ్ణి పొలం పనికి పంపిస్తే, కాబోయే కలెక్టరు తో పొలం పని చేయిస్తావా అని వాళ్ళ అమ్మా నాన్న ల మీదికి దెబ్బలాటకి వెళ్ళినంత పని చేసేవారు ఊరి జనం. ఒక్క క్లాసు పుస్తకాలే కాకుండా, సోమవారం సంతలో ఉప్పులూ పప్పులూ పొట్లాలు కట్టించుకొచ్చే తెలుగు,ఇంగ్లీషు పేపర్లతో పాటు కంటికి కనిపించినవన్నీ చదివేసి చివరికి ఎప్పుడు ఖాళీ వున్నా సైకిలేసుకుని గణపవరం మూర్తిరాజు గారి లైబ్రరీకెళ్ళి పుస్తకాలన్నీ నమిలి పారేసేవాడు. ఏడో తరగతి పరీక్షల్లో మండలానికే ఫస్టు వస్తే ఊళ్ళో అంబేద్కర్ విగ్రహావిష్కరణకొచ్చిన ఎమ్మార్వో గారు పెద్ద సభ పెట్టి వంద రూపాయల బహుమతి కూడా ఇచ్చారు సుబ్బారాయుడికి. అలా బాగా చదివేసి టెంతు , ఇంటర్లో   కూడా ఫస్టు మార్కులు తెచ్చుకుని డిగ్రీ లో గణపవరం గవర్నమెంటు కాలేజీలో చేరిపోయాడు.

          డిగ్రీ  రెండో సంవత్సరం లో ఉన్నప్పుడు  వేసవి కాలం సెలవుల్లో కాకినాడ వాళ్ళ మావయ్య గారింటికి వెళ్ళొచ్చిన తర్వాత నుంచీ మాత్రం సుబ్బారాయుడు క్లాసులో కూర్చునేవాడే కానీ మనిషి మాత్రం ఎక్కడో ఉండేవాడు. అదీకాక అస్తమాను తలకాయ నొప్పొస్తుందని కాలేజీకి బాగా ఎగనామం పెట్టేసి,  చిన్నప్పుడు ఆగస్టు పదిహేనుకి జెండా వందనం తర్వాత పిల్లలందరూ వెళ్తున్నారని  ఐదు రూపాయలిచ్చి వాళ్ళమ్మ సినిమా కెళ్ళ మంటే తప్ప ఎప్పుడూ సినిమా చూడని సుబ్బారాయుడు గూడెం, భీమవరం కూడా వెళ్ళి సినిమాలు చూడటం మొదలెట్టాడు.

        సుబ్బారాయుడి తలకాయ నొప్పి రోజు రోజుకీ ఎక్కువయి పోతే వాళ్ళమ్మా, నాన్నా బెంగెట్టుకుని ఏ గాలో సోకిందేమోనని  తణుకు దగ్గర పెరవలి మంత్ర గాడి దగ్గరకి తీసుకెళ్తే రెండు తాయత్తులిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ నేల మీద పెట్టకుండా ఇంటికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి రాత్రికి చేతికి కట్టుకోమంటే కట్టుకున్నాడు కానీ తలనొప్పి మాత్రం తగ్గలేదు.  రాజమండ్రి లో పెద్ద పేరున్న న్యూరాలజిస్టు శివారెడ్డి గారికి తీసుకెళ్ళి చూపిస్తే ఆరు వేలు ఖర్చు పెట్టించి ఎక్సరే లు ఎం.ఆర్.ఐ స్కానింగులూ తీయించి పరీక్షలు చేసి ఏమీ లేదని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి పంపించేసారు కానీ మనిషి మాత్రం మామూలవలేదు. చివరికి రాజమండ్రిలోనే దానవాయిపేట లో ఉన్న కర్రి రామారెడ్డి గారి మానసా హాస్పిటల్లో నాలుగు రోజులుంచి వైద్యం చేయించినా గుణం కనిపించకపోతే హస్తవాసి చాలా మంచిదనీ , చాలా మందికి పెద్ద పెద్ద జబ్బులు నయం చేసిన సరిపల్లి హోమియోపతి డాక్టరు శర్మ గారి దగ్గరికి తీసుకెళ్ళమని అందరూ చెపితే తీసుకెళ్ళి చూపిస్తే ఆయన పరీక్ష చేసి ఇది మనో వ్యాధే కానీ మామూలు మందులకి తగ్గే జబ్బు కాదని చెప్పి పంపించేసారు.

          ఎప్పుడైనా గూడెం లో సెకండ్ షో సినిమా చూసి సైకిలు తొక్కుకుంటా ఇంటికొచ్చేటప్పుడు మాత్రం ఆల్ఫ్రెడ్ హిట్చ్ కాక్, అకీరా కురసోవా, క్వింటిన్ టరంటినో లాంటి నోరు తిరగని ఇంగ్లీషు సినిమా డైరెక్టర్ల గురించో, కాకినాడ వాళ్ళ మావయ్య గారింటికెళ్ళినప్పుడు చూసొచ్చిన ఇంగ్లీషు సినిమాల గురించో, క్రిష్ణవంశీ "సింధూరం", రాంగోపాల్ వర్మ "సత్య" సినిమా గురించీ ఆ గంటన్నరా ఆపకుండా మాట్లాడేవాడు సుబ్బారాయుడు.       

              చివరికి బాగా చదువుకుని పెద్ద కలెక్టరవుతాడనుకున్న సుబ్బారాయుడు తలకాయ నొప్పి వల్ల మామూలు మార్కులతో డిగ్రీ పాసయ్యాక తెలిసినోళ్ళ ద్వారా పెంటపాడు తవుడు ఫ్యాక్టరీ లో ఉద్యోగం ఇప్పించి పెళ్ళి చేసేద్దామనుకునే సమయానికి జబ్బు చేసి వాళ్ళమ్మ చచ్చి పోతే చూడటానికొచ్చిన సినిమాల్లో సెట్టింగులేసే దూరపు బంధువొకాయన వీడి సినిమా పిచ్చి గురించి విని తీసుకెళ్ళి సినిమాల్లో చేర్పించేస్తే,  తలకాయ నొప్పి తగ్గి పోయి బాగా కష్టపడి తర్వాత పెద్ద డైరెక్టరైపోయాడు.

Tuesday, April 8, 2014

చిన్న శీను బళ్ళోకొచ్చిన రోజు


              పొద్దున్నే లేచి ముఖం కడుక్కుని , నీళ్ళు తాగించటానికి మా బార కొమ్ముల గేదిని, దాని పెయ్యి దూడని కాలవ కి తీసుకెళ్ళి అందులోనె స్నానం చేసి ఇంటికొచ్చి పెరుగన్నం తినేసి బళ్ళోకెళ్ళిపొయాను. అప్పటికే మా కన్నా ఒక సంవత్సరం పై క్లాసు, ఏడో తరగతి చదవు కోవటానికి వెలగపల్లి నుంచొచ్చే గంటల మంత్రి ఆది నారాయణ మూడో బెల్లు కొట్టేశాడు. వెంటనే లెక్కల మాస్టారు శేషగిరిరావు గారు "ఆల్జీబ్రా, గుండె గాభరా" అనుకుంటూ తల పట్టుక్కూర్చున్న మాకందరికీ క.సా.గు, గ.సా.భా లు మొదలెట్టి, సగం క్లాసు చెప్పాక, అప్పుడప్పుడూ తప్ప ఎప్పుడోగాని బళ్ళోకి రాని నరశిం హం గారి చిన్న శీను "మే ఐ కమిన్ సర్ " అనుకుంటూ వచ్చి కూర్చుండిపోయాడు. పోలాల అమావాస్య కీ , మాలాల అమావాస్య కీ తప్ప రాని చిన్న శీను గాణ్ణి , ఆ వచ్చేది కూడా ఆలస్యం గా వచ్చినందుకు నాలుగు తిట్టి, ఇలాగైతే రేపొద్దున్న మా తల మీద రూపాయి పెడితే పావలాకి కూడా మమ్మల్ని ఎవరూ కొనక ఎందుకూ పనికి రాకుండా పోతారని వాడితో పాటు మమల్నందర్నీ కూడా కలిపి తిట్టి , క్లాసు అవగొట్టేశారు మాస్టారు.

              అంతకు ముందు రోజు రాత్రి, కాలికి ఎప్పుడో పెద్ద దెబ్బ తగిలి కదలటానికి లేక కాలక్షేపం కోసం మా వీధి లో అందరికన్నా ముందు టీ.వీ. కొనుక్కున్న శ్రీ రాములు తాత వాళ్ళ ఇంటికెళ్ళి చూసిన , దూరదర్శన్ లో ఏడున్నరకొచ్చే "విచిత్ర కాశీ మజిలీ కథలు" సీరియల్ గురించి సీరియస్ గా మే మందరం మాట్లాడుకుంటుంటే, మధ్యలో వచ్చిన మా తెలుగు మస్టారు మధ్యాహ్నం బెల్లు కొట్టాక అన్నం తిని చుట్ట కాల్చుకునే భీమేశ్వర్రావు గారు "మూడు చేపల కథ " పాఠం మొదలెట్టేరు. ఎవరైనా వెళ్ళి "పిల్లలకి పాఠాలు చెఫ్ఫే మీరే చుట్ట కాలిస్తే ఎలాగండీ" అని అడిగితే తనకేదో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకునే రోగముందనీ , రోజూ చుట్ట కాలిస్తే తగ్గుతుందని గణపవరం విశ్వనాధరాజు డాక్టరు గారు చెప్పేరనీ చెప్పేవారు. "మూడు చేపల కథ " పాఠంలో మందమతి జాలర్లకు దొరికిపోయి పాఠం అయిపోయిందనుకునే సమయానికి బయట నుంచి ఏవో పెద్ద పెద్ద కేకలు వినిపించటంతో అందరం పాఠం వినడం ఆపేసి గుమ్మం వైపు చూడటం మొదలెట్టాం.

              అసలే ఆరడుగుల మనిషి , "కోపమొస్తే మాత్రం మనిషి కాద"ని అందరూ చెప్పుకునే, చిన్న శీను వాళ్ళ నాన్న నరశిం హం పంచె పైకి కట్టి అరుచుకుంటూ, పెద్ద పెద్ద అడుగులేసుకుంటూ సరాసరి మా క్లాసులోకొచ్చి "ఏరా గేదెల దగ్గర పని చూసుకుని, పొలమెళ్ళి చేలో గుళికల మందు చల్లమంటె మానేసి బళ్ళోకొచ్చి కూర్చుంటావా" అని చిన్న శీను గాణ్ణి చెయ్యి పట్టుకుని బరబరా క్లాసు రూము లోంచి బయటికి లాక్కొచ్చేడు. అడ్డుకోబోయిన మా చుట్టల మాస్టార్ని "ఇంకోసారి మా వాడికి బళ్ళో పాఠం చెపితే మర్యాద దక్కద"ని బెదిరించి, మా ఊళ్ళో అందరూ గౌరవించే స్కూలు హెడ్ మాస్టారు అబ్రహాం మాస్టారు దగ్గరకొచ్చి మాట్లాడబోతే గెంటినంత పని చేసి , చిన్న శీను గాణ్ణి లాక్కెళ్ళి, రంపం పళ్ళు లాంటి గరిగమ్మలున్న తాటి కమ్మ తీసి కొట్టుకుంటా ఇంటికి తీసుకెళ్తుంటే, ఆపే ధైర్యం లేక అందరూ ఇళ్ళల్లోంచి బయటికొచ్చి చూస్తూండి పోయారు.

              ఇంటికెళ్ళాక చిన్న శీను గాణ్ని పొలాలకి కొట్టే పురుగుమందు గుళికలుండే పెద్ద డబ్బాలో పెట్టి మూతెట్టేసిన నరసిం హం గారు "నేనొచ్చేవరకూ ఎవరైనా మూత తీస్తె ఊరుకోన"ని చెప్పి వెళ్ళి భోజనానికి కూర్చిండిపోయారు. ఇంతలో పక్క వీధి లో ఇడ్లీ సత్యనారాయణ వాళ్ళింట్లో రొయ్యావకాయ పడుతుంటే సాయం చెయ్యటానికి వెళ్ళిన నరసిం హం గారి అమ్మ గారు గోగులమ్మ విషయం తెలిసి, గబగబా వచ్చి మూత తీసి చూసేసరికి చిన్న శీనుగాడు స్పృహ లో లేడు. ఊళ్ళో ఆర్.ఎం.పి డాక్టరుగా చేసే రవికుమార్ వచ్చి చూసి, వెంటనే రాజమండ్రి తీసుకెళ్తే గాని ఏ విషయం చెప్పలేమని చెప్పేశాడు. నరశిం హం గారి అన్నయ్యగారబ్బాయి పెద్ద శీను చిన్నకారు కట్టించి రాజమండ్రి విమలమ్మ హాస్పిటల్లో చేర్పించి, పాతిక వేలు దాకా ఖర్చు పెట్టి చిన్న శీను ని మామూలు మనిషిని చేస్తె, వారం తర్వాత ఇంటికి తీసుకొచ్చేరు.

               బతికి బయటపడ్డ చిన్న శీను ఆ తర్వాతెప్పుడూ బడి మొహం చూడలేదు గానీ, ఆ మధ్యలో ఓ సారి నరశిం హం గారి చేపల చెరువులు లెక్కలు చూడటానికి తణుకు నుంచొచ్చే బ్రహ్మాజీ తప్పుడు లెక్కలు చూపించి, మోసం చేసి , డబ్బు తినేసి పారిపోతే , ఇప్పుడు మాత్రం స్వయానా ఆయనే తన మనవల్ని పిప్పర లో కొత్తగా పెట్టిన "గురజాడ టెక్నో స్కూల్లో" చేర్పించి , రోజూ పొద్దున్నే స్కూల్లో దించి సాయంత్రం అయ్యేసరికి తీసుకొస్తున్నారు.

Tuesday, March 18, 2014

ఎవడు రావాలి ?

ఎవడో ఒకడు రావాలి.

మోసం చెయ్యటమో మోసపోవటమో అనే చట్రం లో
బిగుసుకుపోయి బతికేస్తున్న మనుషులని బయటకి లాగి
పాడెయ్యగలిగిన వాడు మంత్రాలు తెలిసిన బాబా కాదు గానీ,
మామూలు నరమానవుడెవడయినా రావాలి.

రామచిలక లాగా ముక్కున పెట్టుకున్న మాటలని
తియ్యగా మాట్లాడేవాడు కాదు గానీ,
"ఎంత మందిని చూశాం ? ఎవడొచ్చినా ఇంతే" అన్నంతగా అడుగంటిపోయిన
ఆశలని నాలుగు రాళ్ళు మోసుకొచ్చి పడేసి
పైకి తేగలిగిన కాకిలాంటోడు రావాలి.

మంచిని పెంచటం ఎంత అవసరమో
చెడుని తొక్కటం కూడా అంతే అవసరమని
తెలిసిన చాణక్యుడంతటి వాడు కాకపోయినా,
కలుపు మొక్కల్ని వేళ్ళతో సహా పీకి
నిర్దాక్షిణ్యంగా బురదలో వేసి తొక్కటం తెలిసిన
రైతులాంటోడు ఎవడయినా రావాలి.

అబధ్ధాలకి రంగులేసి నిజాలు మాట్లాడే
మాయగాళ్ళని ఆటవెలదిలో ఏకిపారేసిన
వేమన లాంటి మహానుభావుడంత కాకపోయినా,
అమాయకంగా ప్రశ్నించగలిగిన చిన్నపిల్లాడిలాంటివాడయినా రావాలి.

జనం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి అంత
కాకపోయినా, చాటుగా వంద మందిని కొట్టి
బయట పది మందికి అన్నదానం చేసి గొప్పలు చెప్పుకునే
వాళ్ళకి జైలు కూడు పెట్టించగలిగినంత ధైర్యం వున్నవాడయినా రావాలి.

హార్వర్డు లో చదివిన అపర మేధావి కాకపోయినా,
నాయకుడంటే జనం కోసం కష్టపడే వాడే గానీ,
జనం డబ్బుతో సుఖపడే వాడు కాదు
అన్న చిన్న విషయం తెలిసినోడు, టెంత్ ఫెయిలయినా
ఫరవాలేదు, అలాంటోడు రావాలి.

ఆకలేసినోడికి చేపల కూరతో అన్నం పెట్టి పడుకోబెట్టి
ఓట్లు ఎత్తుకెళ్ళిపోయేవాడు కాదు గానీ, ఆ చేపలు పట్టటం
ఎలాగో నేర్పించాలన్న మర్మం తెలిసిన మత్స్యకారుడిలాంటివాడెవడయినా రావాలి.

శిలువెక్కిన క్రీస్తు అంత కాకపోయినా,
మొహం మీద ఉమ్మేసినా జనం కోసం తుడుచుకెళ్ళిపోగలిగిన
ఓర్పు ఉన్న వాడెవడయినా రావాలి.

దేవుడికి భయపడి పుణ్యం కోసం మాత్రమే కాదు,
మనుషుల్ని ఇష్టపడి వాళ్ళ మంచి కోసం
మనస్ఫూర్తిగా ఆలోచించేవాడు. అలాంటి వాడెవడయినా రావాలి.

ప్రశ్నించటం ఒక్కటే కాదు,
పాఠాలన్నీ అనుభవం ద్వారా నేర్చుకుని
అన్ని ప్రశ్నలకీ సమాధానాలు తెలిసిన
పరమ గురువు ఎవరయినా రావాలి.

ఆ వచ్చేవాడు మాసిన గడ్డంతో నలిగిన బట్టల్తో
వచ్చినా ఫరవాలేదు, వాడు మాత్రం
పొద్దున్న పొద్దున్నే ఎరుపెక్కిన సూర్యుడిలా,
తలెత్తుకుని, తెగించి మాట్లాడేవాడు రావాలి.

అలాంటివాడొచ్చే ముందు భూమి దద్దరిల్లాలని రూలేమీ లేదు.
రాగానే స్వర్గాన్ని భూమ్మీదకి దించెయ్యాలన్న అత్యాశా లేదు.
ప్రతి మనిషికీ పుట్టుకతో వచ్చిన స్వచ్చమయిన చిరునవ్వుని అలాగే ఉండనిచ్చే వాడు చాలు.
ఇంకేం అక్కర్లేదు, మనుషులుగా మిగిల్చి బతకనిచ్చేవాడు చాలు.
ఆ 'ఎవడో' నువ్వే అయితే, ఇంక గొడవే లేదు.

Thursday, February 27, 2014

కుక్కల ప్రెసిడెంటు

              మా ఊళ్ళో రెండొందల ఎకరాలున్న సుబ్బరాజు గారింటికి కూడా పేపరొచ్చేది కాదు గానీ, మాల పల్లి వంతెన దగ్గర బస్సు దిగి అంబేద్కర్ బొమ్మ, చర్చి దాటి ముందుకెళ్తే రోడ్డుకి ఎడం పక్క ఉన్న రెండు పోర్షన్ల డాబా లో ఉండే రెండెకరాల చిన్న రైతు చిన్నారావు ఇంటికి మాత్రం ప్రతి రోజూ పేపరు ఠంచనుగా వచ్చేసేది. చిన్నారావు కడుపులో ఉండగా వాళ్ళక్క బడి కెళ్ళేటపుడు పాము కరిస్తే బ్రాహ్మల అబ్బాయి గారింటికి తీసుకెళ్ళి మంత్రం వేయించి బతికించుకున్నారు కానీ అప్పటి నుంచీ బళ్ళోకెళ్తే ఏదో కీడు జరుగుద్దని భయపడి చిన్నారావు ని కూడా బడికి పంప లేదు వాళ్ళ అమ్మా నాన్న. ఆ తర్వాత ఆయనే పెద్దబాలశిక్ష కొనుక్కుని చదవటం, రాయటం, లెక్కలు అన్నీ నేర్చేసుకున్నాడు. ప్రతి రోజూ ఇంటికి పేపరేయించుకుని చదివి రాష్ట్రం లో రాజకీయాల గురించీ , దేశంలో రాజకీయాల గురించీ ఇంటికెవరొచ్చినా మాట్లాడకుండా వదిలేవాడు కాదు . వాళ్ళావిడ పార్వతమ్మ మహాతల్లి, ఇంటికెవరొచ్చినా కనీసం మజ్జిగైనా తాగకుండా వెళ్ళనిచ్చేది కాదు.

              ఆయనకున్న ఒకే ఒక కోరిక ఎప్పటికైనా మా ఊరికి ప్రెసిడెంటవ్వాలని. ఊరి పంచాయితీ ఆఫీసులో కుర్చీ వేసుక్కూర్చుని అందరిచేతా ప్రెసిడెంటు చిన్నారావు గారనిపించుకోవాలనీ. నెహ్రూ గారు , పి.వి.నరసిం హారావు, వాజపేయిలు దేశాన్ని ఉద్ధరించినట్టే తాను కూడా ఊరిని బాగు చేసి అందరి చేతా దండాలు పెట్టించుకోవాలనీ ఉన్నా ఎలక్షన్లలో ఎప్పుడు పోటీ చేసినా ఓడి పొయేవాడు. ఎలాగూ ఊరికి ప్రెసిడెంటు కాలేని చిన్నారావు ని కనీసం ఊరి కుక్కలకయినా ప్రెసిడెంటుని చేద్దామని జనం వేళాకోళమాడుకోవడంతో ఆయన పేరు వాడుకలో కుక్కల ప్రెసిడెంటుగా స్థిరపడిపోయింది.

              ఓ సారి మాత్రం లేడీస్ రిజర్వేషన్ కోటాలో ప్రెసిడెంటు గా నిలబడ్డ సుబ్బరాజు గారి పెళ్ళానికి పోటీగా వాళ్ళావిడ పార్వతమ్మ గారిని నిలబెడితే అప్పటివరకూ ప్రెసిడెంటుగా చేసిన సుబ్బరాజు ఊరికి ఉపకారం చేయకపోగా, మంచినీళ్ళ చెరువు పక్కన వున్న ఊర చెరువులో చేపలు పెంచి డబ్బులు తినేసి, మంచినీళ్ళ చెరువుని ఎందుకూ పనికిరాకుండా చేసి కనీసం తాగటానికి నీళ్ళయినా లేకుండా చేసాడని కోపంతోనో, ఎప్పుడూ గడప దాటి బయటకి కూడా రాని చిన్నారావు గారి పెళ్ళాం ఇంటింటికీ వచ్చి ఓటేయమని అడగడంతో జాలిపడో తెలీదు గానీ పోలింగు రోజు హోరున వర్షం వస్తున్నా ఊరి జనమంతా కదిలొచ్చి ఓటుకి ఐదొందలిచ్చిన సుబ్బరాజుని కాదని, చిన్నారావు గారి పెళ్ళాన్ని ప్రెసిడెంటుగా గెలిపెంచేశారు.

              అప్పటినుంచీ ఆయనే ప్రెసిడెంటు అయిపోయినట్టు తెగ ఆనందపడి పోయి. ముందు ముందే పై అధికారుల్ని పట్టుకుని పిటిషన్ పెట్టి చేపలు పెంచటం ఆపించేసి మంచినీళ్ళ చెరువు బాగు చేసి వాటరు ట్యాంకు కట్టించేశాడు. పక్కూరు వల్లూరులో వుండే పెద్దిరాజు తన ఒక్కగానొక్క కూతురిని మా ఊళ్ళో ఐ.టీ.ఐ చేసి ఖాళీగా ఉన్న పండుగాడికిచ్చి చేసేడు. అప్పుడప్పుడూ బొమ్మిడాయిలూ, మట్టగుడసలూ, గొరకలూ, కొరమేనులూ పట్టినప్పుడు చింతకాయలూ, చింతచిగురూ వేసి చేసిన చేపల పులుసో, వానా కాలం పండి పోయి రాలి పోయిన తాటికాయలు కాల్చి గుజ్జు తీసి బియ్యం నూక, పంచదార వేసి , నేపాళ ఆకులు , క్రోటన్సు ఆకులు పైన వేసి కాల్చిన తాటి రొట్టో పట్టుకుని డొక్కు సైకిలేసుకుని మా ఊరి గోతుల రోడ్డుని తిట్టుకుంటూ వచ్చి వాళ్ళమ్మాయికీ, మనవలకీ ఇచ్చి మళ్ళీ తిట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలాంటి పెద్దిరాజు ఓ సారొచ్చేసరికి ఊళ్ళో సిమ్మెంటు రోడ్డు అద్దంలా మెరిసిపోవటంతో చూసి మురిసిపోయి, వెళ్తూ వెళ్తూ వాళ్ళమ్మాయికని తెచ్చిన జున్ను డబ్బా చిన్నారావు గారింట్లో ఇచ్చి వెళ్ళిపోయేడు.

              మద్రాసు ఐ.ఐ.టి లో కెమికల్ ఇంజనీరింగు చదివి ఇప్పుడు సింగపూర్లో ఉంటున్న అబ్బాయిగారి చందు కి ఫోను చేసి ఊళ్ళో లైబ్రరీ కడుతున్నామని చెపితే ఇచ్చిన లక్ష రూపాయలతో పంచాయతీ పక్కన లైబ్రరీ కట్టించి పుస్తకాలు కొని పెట్టించేసి , వ్యాయామశాల ఒకటి కట్టించేశాడు. అరవై ఏళ్ళు పైబడ్డ కోమటి తాత గారికి వణుకు రోగమొచ్చి తగ్గకపోతే వ్యాయామశాల పక్కన పాతించిన బారు కడ్డీలు పట్టుకుని మూణ్ణెల్ల పాటు రోజూ బస్కీలు తీస్తే వణుకు పోయి మనిషి మామూలైపోయాడు.

              ఓ సారి ఎమ్మెల్యె బాపిరాజు గారిని కలిసినప్పుడు ఊళ్ళో ఐసు ఫ్యాక్టరీ పెడతానంటే రోడ్డు పక్కన తనకున్న రెండెకరాల్లో ఎకరం ఇచ్చేసి ఫ్యాక్టరీ పెట్టించేసి, ఎవరో కొయిటా తీసుకెళ్తానని మోసం చేసి బొంబాయి లో వదిలేస్తే నా నా కష్టాలు పడి తిరిగొచ్చిన కిట్టిగాడికీ, ఐ.టి.ఐ చేసి ఖాళీగా ఉన్న పండు గాడి లాంటి చాలా మందికి అందులో ఉద్యోగాలిప్పించాడు. ఇలా అన్ని రకాలుగా ఊరిని బాగు చేసి తర్వాత ప్రెసిడెంటు గా ఎవరొచ్చినా పెద్దగా పని లేకుండా చేసేసిన చిన్నారావు తర్వాత చాన్నాళ్ళకి మా ఊరి రామాలయం దగ్గర శ్రీరామ నవమి రోజు అందరికీ పానకాలు, వడ పప్పు ప్రసాదాలు పంచిపెట్టి ఇంటికొచ్చి పడుకుని నిద్దర్లోనే కన్ను మూసేరు. ఆయన్ని చివరి సారి చూడ్డానికి ఒక్క మా ఊరి జనమే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళనుండి చాలా మంది జనమొచ్చేసారు. వాళ్ళందరికీ మా ఊరి రోడ్డు, వీధులు సరిపోక, మాల పల్లి దగ్గర పెద్ద రోడ్డు దాక వున్న జనంతో అక్కడ ట్రాఫిక్ జామయినంత పనయ్యింది.

              ఆ తర్వాత రోజు ఆయనింటికి ఎప్పుడూ వచ్చే పేపర్లోనే జిల్లా ఎడిషన్లో ఆయన ఊరి ప్రెసెడెంటుగా చెయ్యలేదని తెలీక "రాజకీయ నాయకులందరికీ మాజీ ప్రెసిడెంటు చిన్నారావు గారు ఆదర్శమవ్వాల"ని వచ్చింది.

Sunday, January 19, 2014

1-నేనొక్కడినే

                  "కధలో ఎక్కడయినా ఒకచోట తుపాకీ గురించిన ప్రస్తావన వస్తే కధ ముగిసేలోపు ఆ తుపాకీ కనీసం ఒక్కసారయినా పేలి తీరాలి." ఇది కధ గురించి చెకోవ్ చెప్పిన ప్రాధమిక సూత్రం. దీని ప్రకారం కధకు సంబంధం లేని ఏ చిన్న విషయం కధలో ఉండటానికి వీల్లేదు. ఇదే సూత్రం సినిమా కధలకి కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా Unity of Time and Place ని పాటించిన కధలు కలిగిన సినిమాలు కూడా ఖచ్చితంగా మంచి సినిమాలవుతాయి. కధ చెప్పే విధానం సూటిగా ఉందా ? క్లిష్టంగా ఉందా ? అనేది మాత్రం దానిని అర్ధం చేసుకోగలిగిన ప్రేక్షకుల స్థాయిని బట్టి మారుతుంది. ఒక సినిమా బాగుంటే బాగుందని, లేకపోతే బాలేదని చెప్పటానికి ప్రేక్షకులకి ఏ విధమయిన మొహమాటం ఉందదు. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రం సగం మంది చాలా బాగుందని, సగం మంది అసలు బాగో లేదని చెప్పటానికి ఏదో బలమయిన కారణమే ఉండాలి. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకతే నన్ను ధియేటర్ వరకూ వెళ్ళి ఈ సినిమా చూసేలా చేసింది. దర్శకుడు సుకుమార్ ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నింటిలోనూ తన భిన్నమయిన ఆలోచనా విధానాన్ని ఉపయోగించి తెలివిగా Handle చేసి అన్ని రకాల ప్రేక్షకులనీ మెప్పించగలిగాడు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక మెట్టు పైకెళ్ళి మామూలు ప్రేక్షకులు అందుకోలేని స్థాయిలో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. క్లిష్టమయిన విషయాలను క్లిష్టంగానే చెప్పటం ఒక పధ్ధతి. Stephen Hawking పుస్తకం "A Brief History of Time" లాగా క్లిష్టమయిన విషయాలను సరళంగా చెప్పగలగటం కూడా ఒక పధ్ధతి. సరళమయిన విషయాలను సరళంగానే చెప్పటం మరో పధ్ధతి. కానీ సరళమయిన విషయాన్ని ఒక "పజిల్" లాగా మార్చి ఆ పజిల్ ని అర్ధం చేసుకోగలిగిన ప్రేక్షకులకి ఒక 'కిక్' వచ్చే పధ్ధతిలో మలచిన సినిమానే ఈ '1-నేనొక్కడినే'. అప్పుడెప్పుడో Reverse Screenplay పధ్ధతిలో అద్భుతం గా తీసిన ఉపేంద్ర A సినిమా, ఆ తర్వాత అకీరా కురసోవా 'రోషోమన్ ' శైలిలో కమల్ హాసన్ తీసిన 'పోతురాజు చెప్పినట్టు ' సినిమా మళ్ళీ నాకు తెలిసి ఈ మధ్యన  వచ్చిన 'పిజ్జా' సినిమాల తర్వాత మళ్ళీ ఆ విధమయిన పధ్ధతిలో సుకుమార్ తీసిన సినిమా ఇది.

ఇంక సినిమా విషయానికి వస్తే Integrated Disorder అనే మానసిక వ్యాధితో బాధపడే ఒక చిన్నపిల్లాడు తన తల్లిదండ్రులని చంపిన వాళ్ళ మీద పెద్దయ్యాక ఎలా పగ తీర్చుకున్నాడు అనేది. మానసిక వ్యాధి - పగ అనగానే మనందరికీ బాగా అలవాటయిఫోయిన గజిని సినిమా లాంటిది అనుకుంటాం గానీ ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు

హీరో గోవా వెళ్ళాలని నిర్ణయం తీసుకునే సన్నివేశం.

చిన్నపిల్లలకి అబధ్ధాలు చెప్పొద్దని మహేష్ బాబు చెప్పే సన్నివేశం.

ఇంటర్వెల్ ముందు.

విలన్ (నాజర్) హీరోకి గతం గురించి చెప్పేటప్పుడు ట్యాక్సీ డ్రైవర్ స్థానం లో తనని, తన స్థానంలో ట్యాక్సీ డ్రైవర్ ని ఊహించి తప్పుగా చెప్పి హీరోని మోసం చెయ్యటాన్ని ఒక ట్విస్ట్ గా ఉపయోగించటం.

చివరిలో హీరో తన దగ్గర ఉన్న, తండ్రి కనిపెట్టిన కొత్తరకం వరి వంగడం గురించి విలన్ కి చెపితే గానీ విలన్ హీరో కి అతని తల్లిదండ్రుల గురించిన విషయాలు చెప్పకపోవటం. హీరో ముందు తన తల్లిదండ్రుల విషయాలు తెలుసుకుంటే గానీ విలన్ కి తన దగ్గర ఉన్న వరి వంగడం గురించి విలన్ కి చెప్పకపోవటం. రెంటిలో ఏది ముందు జరిగినా ముందు చెప్పిన వాడిని రెండో వాడు చంపటం ఖాయం అనే విషయం ఇద్దరికీ ముందే తెలిసిపోవటం అనే Dead Lock అనే Unending Process ని చివరికి హీరో అతనికి తన తల్లిదండ్రుల గురించి తనకి తెలియటం కన్నా తన తండ్రి ఆశయం నెరవేర్చటమే ముఖ్యమని భావించి ఆ విషయంలో రాజీ పడి విలన్ ని చంపటానికే నిర్ణయించుకోవటం. ఈ విధమయిన Dead Lock అనే దృగ్విషయంలో ఉన్న ప్రత్యేకత ఏ సాఫ్టువేరు ఇంజినీర్లకో, ఎలక్ట్రానిక్ ఇంజినీర్లకో అయితే సులువుగా అర్ధమవుతుంది గానీ లేకపోతే మామూలు ప్రేక్షకుడికి అందులో ఏ విధమయిన ప్రత్యేకతా కనిపించదు.

చివరిగా హీరో కి చిన్నప్పుడు తల్లి నేర్పించిన రైం గుర్తుకొచ్చి తన ఇల్లు ఎక్కడుందో కనుక్కోగలగటం.

ఈ సినిమాలో కామెడీ ఎలాగూ అతకదు/లేదు కాబట్టి ఆ విషయం పక్కన పెడదాం. కాని కొన్ని అసంబధ్ధమయిన ఫైట్లు,  సాధారణంగా ఇలాంటి సినిమాలకి చాలా అవసరమయిన మంచి నేపధ్య సంగీతం/సంగీతం లేకపోవటం ఈ సినిమాకి పెద్ద లోటు.

కొన్ని చిన్న చిన్న లాజిక్ లు తప్పినా గానీ మొదట్లోనే మనం చెప్పుకున్న ప్రాధమిక సూత్రాలకి ఈ సినిమా దగ్గరగానే ఉంది కాబట్టి ఇది ఒక మంచి సినిమాగానే చెప్పుకోవచ్చు. కానీ తుపాకీలూ వాటి పేలుళ్ళు పరిమితి దాటటం వల్లా, దాంతో పాటు Repeated Scrennplay విధానం వల్లా మొదటి సగం అసక్తి గా అనిపించదు. డిస్కవరీ ఛానల్లో జింక ని వేటాడే పులిని చూడమంటే ఎవరయినా ఆసక్తిగా చూస్తారు గానీ  Time Travel గురించి చూడమంటే ఎంతమంది చూస్తారు? అలాగే వినోదం కోసం సినిమాకెళ్ళే మామూలు ప్రేక్షకుడికి పజిల్ ఇచ్చి అర్ధం చేసుకోమంటే అది ఎంతమందిని చేరుకోగలదు అన్నదే ముఖ్యమయిన ప్రశ్న. ప్రేక్షకుల తెలివితేటలని తక్కువ అంచనా వెయ్యటం ఎంత తెలివితక్కుతనమో, ఇలా తీసిన సినిమా అందరినీ మెప్పించాలనుకోవటం కూడా అంతే తెలివితక్కువతనం. అంతకన్నా ముఖ్యం,  అన్నిరకాల ప్రేక్షకులనీ రీళ్ళతో పాటు  పరిగెట్టించగల సినిమా నే నిజమయిన సినిమా. ఆ విధంగా చూస్తే ఆ విషయంలో ఈ సినిమా సఫలీకృతమవ్వలేదనే చెప్పటానికి నాకూ ఏ మొహమాటం లేదు.

Sunday, January 5, 2014

చిన్నిగాడి జ్వరం

                    జ్వరమంటే ఏంటో తెలీదు చిన్నిగాడికి. కానీ ఈ మధ్యన ఒక్కసారి జ్వరమొస్తే బాగుండుననుకుంటున్నాడు. ఎండకి తప్ప గాలి వానకి ఆగలేని పాతకాలం నాటి మా బళ్ళో లెక్కలు చెయ్యకపోతే ఈత బరికె తీసుకుని ఒళ్ళు చీరేసే భీమేశ్వర్రావు మాస్టారికి భయపడి బడి ఎగ్గొట్టటానికి కాదు. చిన్నిగాడికి ఒక్క లెక్క చెపితే చాలు ఎటునుంచి ఎటు ఇచ్చినా దాన్ని బట్టి పది లెక్కలు సొంతంగా చేసెయ్యగలడు. పోనీ అందరిలాగా ఇంగ్లీషు పాఠాలంటే అసలు భయమే లేదు. చెప్పిన మాట వినకుండా లెక్కలేనితనంగా తిరిగే వాడూ కాదు. బడి ఎగ్గొట్టి బలాదూరుగా తిరుగుదామనేవాడూ కాదు. అయినా ఒక్కసారి జ్వరమొస్తే బాగుండుననుకుంటున్నాడు. ఆ వచ్చిన జ్వరం పది రోజులయినా తగ్గకూడదు. నూట రెండు పైనే రావాలి. పోనీ చీకటితోనే నిద్ర లేపేసి వాడినీ, వాడి అన్నయ్యనీ పొలం తీసుకెళ్ళి బుల్లియ్యగారి ట్రాక్టరు దున్నేసి వెళ్ళిపోయిన వాళ్ళ అరెకరం పొలం గట్టులంకలు వేశాక,  గట్టు మీద మడ దొక్కిన తాటాకులు మోపు కట్టి నెత్తి మీదకెత్తి "ఈ వయసునుంచే కష్ట పడి పని చెయ్యటం నేర్చుకోపోతే రేపొద్దున్న ఎలా బతుకుతార్రా ? ఈ మోపులు తీసుకెళ్ళి మన ఎర్ర గేదిని కట్టేసిన గుంజ పక్కన పడేసి బళ్ళోకెళ్ళిపోండి. నేను తాటి కమ్మలు నార తీసుకుని వస్తాను." అని పనికి బధ్ధకిస్తే కళ్ళెర్ర చేసే వాళ్ళ నాన్నకి భయపడి పని ఎగ్గొట్టటానికి కాదు జ్వరం రావాలనుకోవటం. చిన్నిగాడు పనికి బధ్ధకించే రకం కాదు. అయినా ఒక్క సారి జ్వరమొస్తే చాలు వాడికి ఏనుగెక్కినంత సంతోషం.

            మొన్న చిన్నిగాడి స్నేహితుడు మీసాల నారాయణ రావు గారి బాలాజీ గాడికి జ్వరమొస్తే ఇంక వాడికి రాజభోగమే. జ్వరం తగ్గే వరకూ వాడు ఆడింది ఆట పాడింది పాట. ఆ పది రోజులూ వాడు ఏం చేసినా పల్లెత్తు మాట అనలేదు వాడి ఇంట్లో వాళ్ళెవరూ. మందు బిళ్ళ వేసుకునేటప్పుడు చేతిలోనుంచి మంచి నీళ్ళ గాజు గ్లాసు కింద పడి పగిలిపోయినా ఎవరూ తిట్టలేదు. పైగా గాజు ముక్కలు ఎగిరి పడి ఎక్కడయినా దెబ్బ తగిలిందా అని దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా తడిమి తడిమి చూసింది వాళ్ళమ్మ. అదే జ్వరం లేకపోయి నప్పుడు పొరపాటున గ్లాసు పగలగొడితే బడిత పూజ మొదలెట్టి వాడిని బొంగరం తిప్పినట్టు తిప్పేవాళ్ళు. ఆ జ్వరం ఉన్నన్ని రోజులూ రోజూ తినే మామూలు అన్నం ముట్టుకోలేదు వాడు. వాడి నోటికి ఏది హితంగా ఉంటే అదే తెచ్చి పెట్టేవాళ్ళు. ఎండు ద్రాక్షలు, నారింజలూ, పళ్ళ రసాలు ఇంకా బోలెడు ఫలహారాలు. తాగటానికి గ్లూకోజులు, కొబ్బరి బొండాం నీళ్ళు,  ఇంకా వేడివేడి పాలల్లో కోమటి తాతగారి కొట్లోంచి కొనుక్కొచ్చిన బన్ను రొట్టె ముక్కలు వేసి చెంచా తో నోట్లో పెడుతుంటే మహారాజు లాగ తినేవాడు. అదే జ్వరం గిరం లేకపోతే "నోరు మూసుకుని పెట్టింది తిను, లేకపోతే తీసుకెళ్ళి పోలీసోళ్ళ దగ్గర వదిలేస్తాను" అనేది బాలాజి గాడి వాళ్ళమ్మ. పోలీసుని ఎప్పుడూ చూడకపోయినా ఆ పేరు చెపితే మాత్రం చాలా భయం వాడికి. పోలీసోడు వస్తున్నాడని సరదాగా ఎవరయినా అన్నా వెళ్ళి మంచం కింద దాక్కుండిపోతాడు. జ్వరం తగ్గాక కూడా నెల దాకా రాజ భోగమే వాడికి. నీరసం తగ్గి మళ్ళీ బలం పుంజుకునే వరకూ గణపవరం బస్టాండు దగ్గర మాంసం కొట్టు నుంచి వేట మాంసం స్పెషలుగా ఖైమా కొట్టించి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇంకా రోజూ గుడ్డు. అప్పుడప్పుడూ శ్రీరాములు తాత వాళ్ళ ఇంట్లో టీవీ చూడటానికి వెళ్ళినప్పుడు అందులో  చూపించే హార్లిక్సు కొని పాలూను. అంత మంచి జ్వరం నాకూ ఒక్కసారి వస్తే బాగుండుననుకుంటున్నాడు చిన్నిగాడు.

                  మొన్నటికి మొన్న చిన్నిగాడి వాళ్ళన్నయ్యకీ వచ్చింది అలాంటి జ్వరమే. అప్పుడూ అంతే వాళ్ళన్నయ్యకూ మళ్ళీ రాజ భోగమే. తనకి రావాల్సిన జ్వరం వాళ్ళన్నయ్య బలవంతంగా లాగేసుకున్నట్టనిపించింది చిన్నిగాడికి. అంత అదృష్టం తనకి పట్టనందుకు చాలా బాధ పడ్డాడు. ఎప్పుడూ ఏదో పని చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉండే వాళ్ళమ్మ ఆ పది రోజులూ మాత్రం అన్నయ్యనే అంటిపెట్టుకునే ఉండేది. ఒళ్ళో పడుకోబెట్టుకుని తల మీద చెయ్యేసి వేడి తగిలినప్పుడల్లా చల్లని తడి గుడ్డ మళ్ళీ మళ్ళీ వేసి తీస్తూ ఉండేది. అన్నయ్యకి నోరు చేదుగా ఉందంటే అందరితోనూ ఊరుకునే దెబ్బలాటలు పెట్టుకుని ఊళ్ళో అందరూ భయపడే చీలి లక్ష్మి  వాళ్ళ దొడ్లో ఎవరూ చూడకుండా రెండు నారింజ కాయలు కోసుకొచ్చి అప్పుడప్పుడూ ఒక్కో తొనా తీసిచ్చి చప్పరించమనేది. ఇవన్నీ చూశాక చిన్ని గాడికి జ్వరం మీద ఇష్టం ఇంకా ఎక్కువయ్యిపోయింది. ఆరెంపీ డాక్టరు రవి కుమార్ గారొచ్చి ఇంజెక్షను చేసేటప్పుడు అన్నయ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడు ఏడుస్తుంటే "ఏం లేదు. భయం లేదు" అని ఊరుకోబెట్టేది. చిన్ని గాడి అన్నయ్యకి సూది మందంటే చాలా భయం. చిన్ని గాడికి మాత్రం ఆ భయం లేదు. ఒక్కసారి జ్వరమొస్తే చాలు. ఎన్ని సూది మందులిచ్చినా లెక్క చేసే పనే లేదు. చిన్ని గాడు అంత పిరికోడు కాదు. వాడికి చాలా ధైర్యం ఎక్కువ. ఇదివరకోసారి స్నేహితులతో మాటా మాటా వచ్చి పందెం వేసుకుని రాత్రిళ్ళు దెయ్యాలతో పాటు పాములూ, తేళ్ళు కూడా ఉంటాయని అందరూ చెప్పుకునే ముళ్ళపొదలున్న ఊర చెరువు గట్టు చుట్టూ చీకట్లో ధైర్యం గా ఒక చుట్టు తిరిగి  వచ్చాడు. వాడికి ఈ సూది మందు మంచి నీళ్ళు తాగినట్టు. పైగా ఆ సూదిని శుభ్రం చెయ్యటానికి డాక్టరు గారు మరిగే మరిగే నీళ్ళు తెప్పించుకుని అందులో ముంచి సిరంజి నిండా నీళ్ళు పైకి లాగి గాల్లోకి సుయ్యిమని వదుల్తుంటే భలే ఉండేది. ఆడుకోవటానికి అలాంటిదే పాత సిరంజి ఒకటి ఇచ్చారు డాక్టరు గారు. అది చూసినప్పుడల్లా "నాకు జ్వరం ఎప్పుడొస్తుందా" అని అనుకునేవాడు చిన్నిగాడు. పైగా అడిగితే "జ్వరం తగ్గడానికి మందులున్నాయి గానీ రావటానికి మందులు ఉండవ"న్నారు.

                   ఒక్కోసారి ఇంట్లో ఎవరికయినా జ్వరమొస్తే ఆ ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా వస్తుందని చిన్ని గాడికి కూడా జ్వరమొస్తుందేమో అని భయపడి పోయింది వాళ్ళమ్మ. వాళ్ళన్నయ్యకి తగ్గిపోయింది గానీ వాడికి మాత్రం జ్వరం రాలేదు. ఉల్లిపాయలు చంకలో పెట్టుకుంటే జ్వరమొస్తుందని తెలుసు గానీ అలాంటి ఆషామాషీ జ్వరం పనికిరాదు. డాక్టరు నిజంగా సూది మందు ఇవ్వాలి. సూది మందుకు భయపడుతున్నట్టు చిన్నిగాడు ఏడవాలి. అప్పుడు వాళ్ళమ్మా, నాన్నా ఊరుకోబెట్టి  గారం చెయ్యాలి. ఆ పది రోజులూ అందరూ వాడి గురించే పట్టించుకోవాలి. అందరూ చిన్నిగాడి జ్వరం గురించే మాట్లాడుకోవాలి. వాళ్ళ మేనత్తకి తెలిస్తే ఊరు నుంచి బస్సెక్కి ఆఘమేఘాల మీద వచ్చేస్తుంది వాళ్ళన్నయ్యని చూడటానికి వచ్చినట్టే. వస్తొ వస్తూ తనకి ఇష్టమయిన ఖర్జూరాలు కూడా తెస్తుంది. పెద్దమ్మకి తెలిస్తే  జీళ్ళూ, తాటి తాండ్రా, రేగు పళ్ళ వడియాలూ కూడా తెస్తుంది జ్వరం తగ్గాక తినమని. కానీ ఈ వెధవ జ్వరం ఇప్పట్లో వచ్చే సూచనలు మాత్రం కనిపించట్లేదు చిన్నిగాడికి.

               అక్కడికీ ఊర చెరువులో పొద్దున్నుంచీ సాయంత్రం దాకా ములుగీత కొట్టాడు. రాలేదు. పని ఉన్నా లేక పోయినా కొమ్మర పొలం పది సార్లు తిరిగాడు. కాళ్ళు నొప్పులొచ్చి జ్వరం వస్తుందేమో అని. రాలేదు. కావాలని వర్షం లో తడుచుకుంటూ పంట కాలువ లో మట్టగుడసలు పట్టాడు. రాలేదు. కానీ వాడితో పాటే చేపలు పట్టిన జొన్నల సత్తి మావయ్యకి వచ్చింది. వాడేమో "ఛీ, వెధవ జ్వరం. మంచి పని రోజుల్లో వచ్చింది." అని తిట్టుకునేవాడు. వాళ్ళ ముసలయ్య తాతేమో "మనిషయ్యాక రొంప, జ్వరం రాకుండా ఎలా ఉంటాయి రా, అయినా ఇవి వస్తేనే కదా మనం రాయో, రప్పో కాకుండా మనుషులమని తెలిసేది" అని చమత్కారంగా మాట్లాడేడు. ఏంటో ఈ పిసినారి జ్వరం కావాలనుకున్న వాళ్ళకి మాత్రం రావట్లేదు అనుకున్నాడు. కానీ ముసలయ్య తాత మాటలు బట్టి తనకి కూడ ఎప్పుడో ఒకప్పుడు జ్వరం వచ్చి తీరుతుందని నమ్మకం కలిగింది చిన్నిగాడికి. అలా జ్వరం వచ్చిన రోజు వాడికి ఆనందమే, రాజభోగమే కానీ తొందరగా వస్తే బాగుండును. పెద్దయ్యాక వస్తే ఇంత ఆనందం ఉండదని అర్ధమయ్యింది సత్తి మావయ్య మాటలు బట్టి చిన్ని గాడికి. అందుకే ఆ వచ్చేదేదో తొందరగా వస్తే బాగుండును అనుకుంటున్నాడు.

                  అలా జ్వరం గురించి ఆలోచిస్తూనే బళ్ళోకి వెళ్తున్నాడు. వస్తున్నాడు. పాఠాలు వింటున్నాడు. చాలా రోజులు గడిచిపోయాయి గానీ చిన్నిగాడికి జ్వరం రాలేదు. అలా బళ్ళో పాఠం వింటుండగానే ఒక రోజు తరగతిలో పాత గోడ కూలి మీద పడి వాడి తలకి పెద్ద డెబ్బ తగిలింది. వెంటనే పెద్దాసుపత్రికి తీసుకెళ్తే ఇంకో ఇరవై నాలుగ్గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమన్నారు. అప్పుడూ ఆసుపత్రి మంచం మీద కూడా అడిగాడు వాళ్ళమ్మని "ఇప్పుడు నాకు జ్వరమొస్తుందా?" అని. జ్వరం రావటానికి అసలు మనిషంటూ ఉండాలి కదా. పట్టుమని పన్నెండేళ్ళు కూడా లేని చిన్ని గాడికి అదే ఆఖరి మాట.

చిన్నిగాడు బతికుండగా జ్వరం రాలేదు గానీ, వాడు చనిపోయాక కానీ రాలేదు, మా ఊళ్ళో బడికి బాగుపడే రోజులు.

(బడిలో గోడ కూలి చనిపోయిన నా చిన్ననాటి స్నేహితుడు చిన్నిగాడికి ఇది అంకితం.)